April 18, 2024

బ్రహ్మవేత్త, ప్రశ్నోపనిషత్తు ఆవిష్కర్త ‘పిప్పలాదుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.

పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తు శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు. ప్రశ్నోపనిషత్తు పది ముఖ్య ఉపనిషత్తులలో ఒకటి. ఈయన దయాళువు. త్యాగశీలి. దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు. దధీచి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ఎముకలను దేవతలకు దానము చేస్తే, వాటితో వారు బ్రహ్మ చక్రము, ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకొని అసురులపై యుద్ధము చేశారు. దధీచి ప్రాణత్యాగము చేసేనాటికి అయన భార్య సువర్చల గర్భవతి. తన భర్త మరణాన్ని తెలుసుకొని అప్పుడే పుట్టిన శిశువు(పిప్పలాదుడు ) ను ఒక రావి చెట్టు (పిప్పల వృక్షము) వద్ద ఉంచి, దేవతలు వద్దని వారించినా కూడా సహగమనము చేసి భర్తను చేరింది. అప్పుడు ఆ శిశువును దధీచి సోదరి దధీమతి చేరదీసి పిప్పలాదుడు అని నామకరణము చేసి పెంచింది. చంద్రుడు పిప్పలాదునికి అమృతము ఇస్తాడు. అందుచేత పిప్పలాదునికి ఆకలి దప్పులు లేవు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ, ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణం గానే ఆ పిల్లవాడికి “పిప్పలాదుడు” అనే పేరు వస్తుంది.
ఆ పిల్లవాడి పరిస్థితి బాధ కలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు. పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. అతను శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే ‘పిప్పలాద మహర్షి’ నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలు పడేవాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది
తల్లిదండ్రుల మరణానికి కారణమయిన దేవతలను నాశనము చేయటానికి చంద్రుడిని సలహా అడుగుతాడు. చంద్రుని సలహా మేరకు పిప్పలాదుడు శివుని గురించి తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడు పిప్పలాదునికి దేవతలను చంపటం అంత మంచి పని కాదు, నిన్ను స్వర్గానికి పంపి నీ తల్లిదండ్రులను చూసే భాగ్యాన్ని కల్పిస్తాను అని సముదాయించి పిప్పలాదుని స్వర్గానికి పంపుతాడు. అక్కడ పిప్పలాదుడు తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకొని భూమికి తిరిగి వచ్చి తన తపస్సును కొనసాగిస్తాడు. కొంతకాలానికి పిప్పలాదునికి వివాహము చేసుకోవాలని అనిపించి అనవన్య రాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు పద్మను ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు అనవణ్య రాజు విష్ణు భక్తుడు ఇంద్ర పదవిని కూడా వదిలేసిన వ్యక్తి. మొదట్లో రాజుకు తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టము లేదు. కానీ అయన మంత్రి చెప్పినాక తన అభిప్రాయము మార్చుకొని తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి వివాహము చేస్తాడు. పద్మ అందగత్తె మాత్రమే కాదు మహా పతివ్రత కూడా. ఒకసారి పద్మ పాతివ్రత్యాన్నిపరీక్షించటానికి ధర్మదేవత మారువేషములో వచ్చి మునితో ఏమి సుఖ పడతావు నన్నువివాహమాడితే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని అంటాడు. అది విన్న పద్మ ఆగ్రహించి ధర్మదేవతను చివరికాలములో నాశనము అయిపోతావని శపిస్తుంది. ధర్మదేవత నిజరూపములోకి వచ్చి పరీక్షించటానికి వచ్చాను, శాపవిమోచన చేయమని అడుగుతాడు. కానీ శాపము అనుభవించక తప్పదని కలియుగములో ఒంటిపాదముతో ఉండి కృతయుగము వచ్చేనాటికి నాలుగు పాదాలతో ఉంటావని శాపవిమోచనం చెపుతుంది. ధర్మదేవత సంతోషించి భార్య భర్తలను సుఖసంతోషాలతో ఉండమని దీవించి వెళతాడు.
వీరిద్దరికి ఐదుగురు కుమారులు జన్మిస్తారు. పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ కాలము గడుపుతుంటాడు. ఒకనాడు కబంధుడు, వైదర్భి, కౌశల్యుడు, సూర్యాయనుడు, శైభ్యుడు, సుకేశుడు, వంటి మునులు ఈయన దర్సనార్ధము వచ్చి వారి సందేహాలను అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ప్రాణము ఎలా పుడుతుంది నిద్రించేది ఏది మేల్కొనేది ఏది సుఖము ఎలా కలుగుతుంది వంటి క్లిష్టమైన ప్రశ్నలు, ఆఖరుగా ఓంకారాన్ని ఉపాసించిన వాడు ఏ లోకానికి వెళతాడు అని వేదాంత పరమైన చర్చ చేస్తారు. వారి ప్రశ్నలకు పిప్పలాదుడు ఇచ్చిన వివరణే ప్రశ్నోపనిషద్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వివరణలను బట్టి గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలు వచ్చినాయి. ఈ విధముగా పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతింపబడ్డాడు. అయన ఆలోచనలు బోధనలు అధర్వణ వేదానికి మూలముగా పరిగణింపబడతాయి.

1 thought on “బ్రహ్మవేత్త, ప్రశ్నోపనిషత్తు ఆవిష్కర్త ‘పిప్పలాదుడు’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *