May 25, 2024

రాజీపడిన బంధం – 14

రచన: ఉమాభారతి కోసూరి

ఆరేళ్ళ తరువాత

పొద్దునే పిల్లలకి టిఫిన్లు వడ్డిస్తుండగా, టీ.వి న్యూస్ ఛానల్ చూడమని ఫోన్ చేసింది చిత్ర. టీవి ఆన్ చేసాను. క్రీడారంగం వార్తలు చెబుతున్నారు…
‘…ఢిల్లీ స్విమ్మింగ్ కమిషన్ వారు, సందీప్ మధురై అనే యువ స్విమ్మర్ ని
నేషనల్ జూనియర్ స్విమ్ టీమ్ కి కెప్టెన్ గా సెలెక్ట్ చేసారు. పదహారేళ్ళ వయసులో అంతటి గుర్తింపు అనూహ్యమైనదే’. ‘అంతే కాదు, ఈ యువ ఈతగాడు ఒకప్పటి ప్రఖ్యాత క్రీడాకారుడు శ్యాంప్రసాద్ మధురై తనయుడు…’ అని చెబుతూ సందీప్ స్కూల్ ఫోటో, వాడు పాల్గొన్న స్విమ్ టోర్నమెంట్ నుండి ఓ క్లిప్ చూపించారు.
అక్కడే ఉన్న సందీప్ ఆశ్చర్యపోయాడు. వాడి ఆనందానికి అవధులు లేవు. “తాతగారు న్యూస్ చూసారో లేదో” అంటూ ఫోన్ అందుకున్నాడు.
వాళ్ళ కబుర్లకి అంతే ఉండదని వంటింట్లోకి నడిచాను. కూరలు తరుగుతూ..ఆలోచనలో మునిగాను..
పోయినేడే జూనియర్ కాలేజి స్విమ్ టీమ్ లీడర్ అయ్యాడు సందీప్. ఢిల్లీలో జరిగే స్విమ్మింగ్ టోర్నమెంట్స్ లో పాల్గొని, ఇప్పటికే ఎన్నోవిజయాలు సాధించాడు. చదువుల్లో కూడా ముందంజలోనే ఉన్నాడు. పిల్లలిద్దరికీ తాతగారి ప్రేమ, ఆప్యాయతలతో పాటు చిత్ర ఆనంద్ ల ప్రోత్సాహం కూడా మెండుగా తోడ్పడుతున్నాయి.
మామయ్య మాకోసం కొనుగోలు చేసిన ఆధునిక విల్లాలోకి మారి ఆరేళ్ళవుతుంది. చిత్ర వాళ్ళ ఫ్లాట్ కి దగ్గరే. అన్నిటికీ చాలా వీలుగా ఉంది….
నేను పిల్లలతో విడిగా ఉంటున్న ఈ ఆరేళ్ళల్లో, పిల్లలిద్దరూ వాళ్ళ తాతయ్యకి బాగా దగ్గిరయ్యారు. అత్తయ్య మూడేళ్ళ క్రితం హృద్రోగంతో మరణించాక, మామయ్య నెలకి సగం రోజులు పిల్లలతో మా వద్దే గడిపేస్తారు. వేద అంటే ఆయనకి ప్రాణం. ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చిన వేద కార్యకలాపాలన్నీ ఆయనే చూసుకుంటారు. వారానికి మూడు రోజులు దాన్ని వెంట బెట్టుకుని మ్యూజిక్ క్లాస్ కి వెళతారాయన.
ఈ ‘వేర్పాటు’ ఏర్పాటుకి శ్యాం నుండి ఎటువంటి ఆటంకం లేకపోవడంతో అలాగే కొనసాగుతున్నాము. ఈ మధ్యకాలంలో, తాను ఫామిలీ కౌన్సెలింగ్ కి వెళతానని మామయ్యతో అన్నారట శ్యాం.
లాయర్ గారి సలహా మేరకే, శ్యాం, మా ఇంటికొచ్చి పిల్లల్ని కలవడానికి ఒప్పుకున్నాను. గత రెండేళ్లగా మాత్రం, పిల్లల బర్తడేలకి, పండగలకి వాళ్ళకి కానుకలు తీసుకుని మామయ్యతో కలిసి వస్తుంటారు. ఆ కాసేపు, వాళ్ళ డాడీ తో స్నేహంగా మెలుగుతారు సందీప్, వేద.
నా ప్రమేయమే లేకుండా… ఓ క్రీడాకారుడిగా సందీప్ వెలుగులోకి వస్తున్న వైనం ఆశ్చర్యంగానే ఉంది… మరుగున పడుతున్న విషయాలని నెమరువేసుకుంటూ వంటింట్లో పని ముగించాను…
**
హాల్లోకి వస్తుంటే, “మమ్మీ హైదరాబాద్ తాతతో మాట్లాడు” అంటూ ఫోన్ అందించాడు సందీప్.
సందీప్ గురించి గర్వంగా ఉందన్నారు నాన్న. నేను కూడా ఈ మధ్యనే ‘చైల్డ్ సైకాలజీ‘ లో మాస్టర్స్ డిగ్రీ కోర్స్ పూర్తి చేయడం నాన్నకి సంతోషం కలిగించిన మరో విషయం…
అమ్మతో మాట్లాడుతూ, “మీరు ఓ సారి ఢిల్లీ రావాలి” అన్నాను
“అలాగే వస్తాం. నీవు సుఖంగా, సంతోషంగా జీవించడం ముఖ్యం తల్లీ” అంది అమ్మ. ఈ మధ్య అమ్మావాళ్ళు ప్రయాణాలు తగ్గించారు.
వినోద్ ఢిల్లీ ఐ.ఐ.టి లో చదువుతున్నాడు. వీలున్నప్పుడల్లా వచ్చి పిల్లలతో సరదాగా గడుపుతాడు. వినోద్ మామయ్య రాక కోసం ఎదురు చూస్తుంటారు పిల్లలిద్దరూ.
**
సందీప్ కి అభినందలు తెలపడానికి, చిత్ర, ఆనంద్ లతో పాటు వినోద్ కూడా ఇంటికి వచ్చారు. చీకటి పడుతుండగా వచ్చిన వారిని భోజనం చేసి వెళ్ళమని, సందీప్ పట్టుబట్టాడు….
“మీ డాడీని నిన్ననే కలిసాను. మేము కలిసినప్పుడల్లా … నీ గురించి, వేద గురించి తప్పక మాట్లాడుతాము” అన్నారు ఆనంద్ సందీప్ తో. శ్యాం ఆనంద్ ని తరుచుగా కలుస్తూనే ఉంటారట…
వస్తూ పిల్లలకి ఇష్టమైన స్వీట్స్ తెచ్చారు మామయ్య. అందరినీ ఆప్యాయంగా పలకరించి చిత్ర పక్కన కూర్చున్నారు.
“ఏమ్మా చిత్రా, రెండేళ్లగా మీ ‘ఆనందా కుటీర్’ సామాజిక కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయని చెప్పావు. తప్పక ఓ సారి వెళదామని కూడా చెపుతుంటావు. నాకు ఓపిక ఉండగానే మీ కుటీరమంతా తిరిగి చూడాలనుంది. పిల్లలకిప్పుడు వేసవి సెలవలు కూడా.. ప్లాన్ చేయవచ్చు కదా!” అన్నారు మామయ్య చిత్రతో.
**
జూనియర్ కాలేజీ ప్రాంగణంలో సందీప్ వాళ్ళ స్విమ్ టీమ్ కి రిసెప్షన్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు. మామయ్య, శ్యాం సహా వచ్చారు. గర్వంగా సందీప్ ని కౌగలించుకుని అభినందించారు శ్యాం…
**
మరునాడు పొద్దున్నే, లాయర్ శర్మ గారు నుండి ఫోన్. “నీలా, ఫామిలీ కౌన్సెలింగ్ కి సుముఖంగా ఉన్నట్టు, నీ భర్త శ్యాంప్రసాద్ కోర్ట్ ద్వారా తెలియజేసారు.. నువ్వు సరేనంటే వాళ్ళ లాయర్ కి జవాబు ఇస్తాను” అన్నారాయన.
‘శ్యాం లో మార్పంటూ వస్తే, దానికి కారణం పిల్లల మీద ప్రేమే’ అనుకోవాలి.
**
చీకటి పడుతుండగా, “నీకో హ్యాపీ న్యూస్” అంటూ చిత్ర, ఆనంద్ వచ్చారు.. “శ్యాం వచ్చి హాస్పిటల్లో నన్ను కలిశారమ్మా” అన్నారు ఆనంద్ సోఫాలో కూర్చుంటూ.
“నీకు లాయర్ ద్వారా ఫామిలీ కౌన్సెలింగ్ కి అంగీకారం పంపారంట. నా వద్ద పేషంట్ గా నమోదయ్యారు కూడా. వచ్చేవారం మొదటి అపాయింట్మెంట్. మాకూ ఇది సంతోషకరమే” అన్నారు ఆనంద్ ఉత్సాహంగా….
చూద్దాం ఈ మార్పులు ఎటు దారి తీస్తాయో! మంచికే అయితే మంచిదే మరి! అనుకొన్నాను మనస్సులో…..
**
రాత్రి పడుకోబోయే ముందు రమణి ఫోన్ చేసింది. ఫోన్ తీసి ‘హలో’ అని లోగానే,
’ఇదిగో వస్తా, అదిగో వస్తా’ అంటూ ఐదేళ్ళగా గడిపేసిన నేను పిల్లాపాపలతో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వచ్చేస్తున్నా” అని ప్రకటన చేసింది.
“సంతోషం” అన్నాను…
“మరో సర్ప్రైజ్ నీకు…మాతో పాటే మీ అమ్మావాళ్ళు కూడా వస్తున్నారు. విమానాశ్రయంకి కార్ పంపించు” అని పురమాయించింది కూడా…
“అలాగే మేడమ్. మరింత సంతోషంగా…ఉంది.. అమ్మావాళ్ళని చూసి కూడా మూడేళ్ళవుతుంది” అన్నాను… ఉత్సాహంగా. ఫోన్ పెట్టేసి, మామయ్యని, చిత్రవాళ్ళని, వినోద్ ని పిలిచి మరునాడు సాయంత్రం భోజనానికి రమ్మని ఆహ్వానించాను.
**
అమ్మావాళ్ళతో పాటు రమణి కుటుంబం రాకతో ఇల్లంతా సందడిగా ఉంది…
రమణి – విజయ్ ల పిల్లలు కవలలు – ఐదేళ్ళ ఆరతి, శంకర్. వేదతో కలిసిపోయి కబుర్లాడుతూ ఆటల్లో మునిగిపోయారు..
ఇరువురు తాతగార్లతో సందీప్ తన స్విమ్-టీమ్ కార్యక్రమాల చర్చలో ఉత్సాహంగా ఉన్నాడు. వినోద్ కాస్త ఆలస్యంగా వచ్చి కలిసాడు…
అమ్మ, చిత్ర, రమణి వడ్డనలు చేస్తుంటే, అందరూ కబుర్లాడుతూ భోంచేస్తున్నారు.. చాలా రోజుల తరువాత, నాకు ఆప్తులైన వాళ్ళందరి నడుమ ఆనందంగా అనిపించింది.
“ఇన్నాళ్ళకి, అందరం ఇలా కలిసామంటే, అంతా చిత్ర కృషి ఫలితమే” అన్నారు మామయ్య.
“రీ-యూనియన్’ అంటూ, మమ్మల్ని రమణి కుటుంబంతో జత కట్టి మరీ పిలిపించిందిగా మరి” అన్నారు నాన్న నవ్వుతూ…
“ఈ వారమంతా చిత్ర ప్లానింగ్ ప్రకారమే మనందరి కార్యక్రమాలు ఉంటాయి.. చాలా ఆలోచించి మరీ ఏర్పాట్లు చేసింది. పిల్లలు, పెద్దలు కూడా తప్పక ఎంజాయ్ చేస్తారని నేను హామీ ఇస్తున్నా” అన్నారు ఆనంద్ నవ్వుతూ..
**
మరునాడే రెండు ట్రావెల్ వాన్స్ తీసుకొని ‘ఆనందా కుటీర్’ కి బయలుదేరాము.
నిజానికి అది ఓ ఆశ్రమం అన్నారు ఆనంద్. అనాధ, వృద్ధ, స్త్రీ సంక్షేమానికి పాటుపడుతున్న సంస్థ అని వివరించారు…
మధ్యాహ్నం పన్నెండుకి ముందే ఆశ్రమం చేరాము.
ఇరువైపులా పచ్చని చెట్లతో అందంగా నీడగా ఉంది ఆశ్రమ మార్గం అక్కడ నాలుగు కాటేజీల్లో మాకు బస ఏర్పాటు చేసింది చిత్ర.
ఒంటిగంటకి భోజనశాలకి వెళ్ళాము. అక్కడ వృద్ధులు, పిల్లలు, వికలాంగులు కలిసి వందమంది పైనే ఉంటారు. పనివాళ్ళు, వడ్డించేవాళ్ళు, ఆయమ్మలు ఇరవై మందన్నా ఉన్నారు.
మేమంతా హాలు మధ్యలో ఉన్న బల్లల వద్ద కూర్చున్నాము.
‘ఆనందా కుటీర్’ లో స్థానికంగా నివసించే పిల్లల ప్రార్ధనా గీతంతో మొదలయ్యి, మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాక భోజనం వడ్డించారు.
మా కోసమే ప్రత్యేకంగా ఈ నాటి భోజనం అరిటాకులు వేసి వడ్డించారుట. ఎంతో రుచిగా ఉన్నాయి కూరగాయల వంటకాలు. తాగడానికి కొబ్బరి నీళ్ళు…..
**
భోంచేసాక, సుమారు పాతిక ఎకరాల్లో నిర్మించిన ఆశ్రమ ఆవరణంతా మా వాహనాల్లోనే తిరిగాము…. పశుశాల, బడి, ఆసుపత్రి, వృద్దాశ్రమం, స్త్రీ సంక్షేమం, అనాధాశ్రమం, దేవుని గుడి అన్నీ చూశాము. .
ఆనంద్ మమ్మల్ని ప్రతి సేవాశ్రమం దగ్గర ఆపి, సమాజానికి దాని అవసరం గురించి పిల్లలకి వివరిస్తూ ఆసక్తిగా సాగనిస్తున్నారు మా టూర్….
అంతా చూసాక, ఆఖరున కుటీరం మధ్యన ఉన్న తోటలోకి వచ్చాము. కొన్ని వందల చెట్లు వలయాకారంలో నీడనిస్తూ, ఓ ఉద్యానవనంలా ఉంది అక్కడ.
అప్పటికే అలిసిపోయిన పిల్లలు, వేద, విశాల, అమ్మతో సహా కాటేజీకి వెళ్ళిపోయారు.
మగవాళ్ళంతా సేవాశ్రమాల వైపుగా వెళ్ళారు. సందీప్ తో వినోద్ యానిమల్ షెల్టర్ వైపుగా వెళ్లాడు.
చిత్ర, నేను, రమణి తోట మధ్యలో ఉన్న గాంధి విగ్రహం ముందుకివెళ్ళి కూర్చున్నాము. చేతికర్ర పట్టుకున్న గాంధీజీ నిలువెత్తు విగ్రహం అది.
‘ఇక్కడ ఈ విగ్రహం, ఆశ్రమ ఆశయాల్ని చెప్పకనే చెబుతుంది’ అనుకున్నాను. రమణి కూడా అదే అన్నది.
బుట్టెడు మల్లెలు, సంపెంగలతో పాటు మాకు కొబ్బరినీళ్ళు తెచ్చిచ్చాడు తోటమాలి. మరోసారి కొబ్బరినీళ్ళు తాగుతూ కొద్దిసేపు ముగ్గురం మౌనంగా ఉండిపోయాము.

( సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *