June 19, 2024

వినిపించని రాగాలే

రచన: శివలక్ష్మి రాజశేఖరుని

ఆమె మనసులో ఏముందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆమె కళ్ళల్లోకి చూసి తన మనసు చదవగలిగే తనను ఎందుకో ఈ మధ్య అర్థం కాని ఆమె ప్రవర్తన గందరగోళంలో పడేస్తోంది. వరండాలో పడక్కుర్చీలో పడుకుని అలోచిస్తున్నాడు పరంధామయ్య. 40 ఏళ్ల తమ సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇసుమంత తరగని స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది. ప్రణయ కలహాలు చిలిపి తగాదాలే కానీ పెద్ద అభిప్రాయ భేదాలు ఏవి లేపు తమ మధ్య. నెమ్మది నెమ్మదిగా గతాన్ని తడుముకుంటూ వెళ్లాయతని జ్ఞాపకాలు.
పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో తన జీవితంలో అడుగుపెట్టింది 18 సంవత్సరాల కస్తూరి. పేరుకు తగ్గట్టుగా ఒక రకమైన పరిమళం తన సమక్షంలో. అది ప్రేమ పరిమళమని తర్వాత అర్థమైంది. పాణిగ్రహణం తో తన చేయి పట్టుకున్నప్పుడు భర్తగా నేను తనకి ఎంత ధైర్యం ఇచ్చానో కానీ తను మాత్రం నా గుండెల్లో అంతులేని ధైర్యాన్ని నింపింది.” నీ జీవిత సహచరి నేనే, నా జీవన దిక్సూచి నీవే”అని ఆమె అన్నట్టు అదృశ్యవాణిగా వినబడింది. బ్రహ్మముడిని తడిమి చూస్తున్నప్పుడు తన కళ్లు చిలిపిగా చెప్పిన కథలు ఎన్నో. నా అడుగు వెనక అడుగు వేస్తూ సాగిన సప్తపది అడుగడుగునా తోడు అవుతాననే వాగ్దానంగా అనిపించింది. వివాహ తంతు లోని ప్రతి ఘట్టం నన్ను తనలో నింపుతున్నట్లు తనను నాలోకి వంపుతున్నట్లు ఎంత అద్భుతంగా సాగిందో, అప్పగింతల వేళ తన కన్ను చెమ్మగిల్లితే నేనున్నానంటూ నా చేతిలోని తన చేతిలో బాస చేశాను.
కొత్తగా ఒకరి జీవితంలోకి ఒకరు వచ్చినట్టుగా అనిపించలేదు. ఎప్పుడో దూరమైన నేస్తం దరి చేరినట్లుగా ఎన్నో జన్మల బంధంగా అనిపించింది. ఇన్నాళ్ళ వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు అలకలు ఉన్నా అపార్థాలకి మాత్రం తావు లేకుండా సాగిపోయింది. నలుగురిలో ఉన్న సందర్భాల్లో కూడా నా మనసు తనకు సందేశాన్ని పంపేది తన కళ్ళు నాకు సమాధానం చెప్పేది. “మూగమనసులు” “నేత్రావధానం “అని మా బంధువులు హాస్యమాడేవారు.
విచ్చలవిడి శృంగారం అందరిలో ఒకరి మీద ఒకరు పడి పోవడం కాదు అన్యోన్య దాంపత్యం, ఆలుమగలు అంటే అర్థం. ఒకరి మనసును ఒక చదవడం, ఎంత దూరంలో ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకోవడం. నమ్మకం పునాదిగా కట్టుకున్న మా బతుకు పందిట్లో 40 వసంతాలు గడిచిపోయాయి. ఉన్నత వ్యక్తిత్వం విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాం.
మరింత దగ్గరైన ఈ మలిసంధ్య విశ్రాంతి ఏకాంతంలో గతంలో తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ బతికేస్తున్నాం. బొమ్మరిల్లుగా మార్చుకున్న మా పొదరింట్లో పొట్లపాదుకి పిందె వేసినా, మందార చెట్టు మొగ్గ వేసినా, శ్రీచక్ర పూజకోసం పెంచుకున్న చుక్కమల్లి విరగబూసినా, చిన్నపిల్లలా గెంతులేస్తూ ఆనందించే కస్తూరి, అడగక ముందే అన్నీ అమర్చి పెట్టి, మీరు మరీ ముసలివాళ్ళు అయ్యారు మాస్టారూ! అంటూ నా మతి మరపుని మందలించే కస్తూరి, ఈమధ్య ఎందుకో మూగబోయింది. తన కళ్ళలో చూసి గుండెలో బాధ తెలుసుకునే నాకు అర్ధం కాని పుస్తకంగా మారిపోయింది.

ఏమడిగినా విసుక్కుంటోంది. ప్రేమగా దగ్గరికి వెళ్దాం అంటే కస్సుమంటోంది. ఎప్పుడూ సరదాకి కూడా ఓ మాట అనని తను నా గుండె గాయం అయ్యేలా మాట్లాడుతుంది. అనారోగ్యం ఏదైనావుందా అని అడగపోతే “నేను రోగిష్టిదాన్నా “అని తిడుతుంది. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా పని నేను చేసుకు పోతున్నాను. భోజనం కూడా నాకు వినపడేలా టేబుల్ మీద పెట్టి వెళ్లి పోతుంది. అన్నపూర్ణలా దగ్గరుండి కొసరి వడ్డించే కస్తూరి కనీసం నేను తిన్నానో లేదో కూడా పట్టించుకోవడం లేదు.
ఆ మౌనాన్ని, ఈ పరీక్షను తట్టు కోలేక మొన్న అడిగేసాను.” నావల్ల ఏమైనా తప్పు జరిగిందా కస్తూరి నాకు తెలుసు నీ మనసు బాధ పడేది ఏ పని నేను చేయను ఒకవేళ నా ప్రవర్తన నిన్ను బాధ పెడితే క్షమించు. నీ మౌనం నన్ను ఎంత బాధ పెడుతుందో తెలుసా! ఇది నువ్వు కాదు కస్తూరి. ఏమైందో చెప్పు. నా తప్పు ఉంటే శిక్షించు. కానీ ఇంత పెద్ద శిక్ష వేయొద్దు. నువ్వు నవ్వుతూ తిరగని ఈ ఇల్లు నాకు నరకంగా ఉంది. నవ్వుతూ తిరిగే నా ప్రేమ దేవత కస్తూరి నాకు కావాలి. ఏం చేయాలో చెప్పు” అంటూ చిన్నపిల్లాడిలా తన ఒడిలో పడుకొని ఏడ్చేశాను.
తన చెయ్యి నా తలపై వేసి నిమిరింది. ఆస్పర్శలో ఎంతో ఓదార్పును ఉందనిపించింది. కాసేపటి మౌనం తర్వాత పిడుగులా తన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి.” మనం విడిపోదాం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను” అంటూ లేచి వెళ్ళిపోయింది. లోకం అంతా శూన్యంగా కనిపిస్తోంది.గతంలోంచి బయటపడి చుట్టూ చూశాడు. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు.
కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళాడు. ఎక్కడా కనిపించలేదు కస్తూరి. ఈమధ్య తనతో చెప్పకుండా బయటకు వెళ్లి వస్తోంది. ఎక్కడికెళ్ళిందో అనుకుంటూ బయటకు వచ్చాడు. గుమ్మం లోకి రాగానే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కుటుంబాలతో సహా వస్తున్నారు ఏదో కొంచెం ఆశ. వాళ్ళ అందరితో కలిసి చేసుకున్న , పండుగలు గుర్తొచ్చాయి. బుజ్జగించో, అనునయించో తనని మళ్ళీ మామూలు మనిషిని చేయొచ్చని అపించింది.
కానీ ఎందుకో ఎప్పట్లా ఇంటికి వచ్చిన పిల్లల్లో కూడా సంతోషం కనిపించలేదు.” వాళ్ళకి నేను తప్పుగా కనిపిస్తున్నానా? ” గుండెల్లో కలుక్కుమంది.తానొక్కటి మూగబోతే ఇల్లంతా అల్లకల్లోలం. కాసేపటికి ఇంటికి వచ్చింది తను కానీ అదే నిశ్శబ్దం ఇంటిలో. ఆ రోజు రాత్రి ఆమె తన గదిలోకి వచ్చింది చాలా రోజుల తర్వాత. తిరిగి వెళ్లిపోయిన సంతోషం అంతా తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. కానీ ఆనందాన్ని ఆవిరి చేస్తూ తన మాటలు నన్ను ఇంకా బాధ పెట్టాయి నన్ను కొడుకు దగ్గరికి వెళ్లి పొమ్మని జాగ్రత్తగా ఉండమని కలిసి ఇకపై బతకలేమని చెప్పింది కారణం మాత్రం ఎంత అడిగినా చెప్పలేదు.
మరుసటి రోజు పిల్లలిద్దరితో గంట పైన మాట్లాడింది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఒంటరివాణ్ణి చేశారు అందరు నన్ను. భారంగా గడిచిన రెండు రోజుల తర్వాత ఉదయం లేస్తూనే ఇంట్లో అంత గంభీరంగా ఉంది పరిస్థితి. తనకోసం వెతికాను. ఎక్కడా లేదు.పెరట్లో ఉందేమో అని వెళ్లాను. తులసి చెట్టు ముందు దీపం వెలుగుతోంది కానీ అక్కడ….. అక్కడ…… నా దీపం ఆరిపోయింది.” నాన్న అమ్మ మనకిక లేదు “అన్నమాట ఒకటే వినపడింది నా చెవులకు క్రమంగా నా శరీరం కూడా తేలిక అయిపోయింది. తనతోపాటే నేను. పిచ్చిది తను లేకపోయినా నేను బతకాలని బతుకుతానని అనుకుంది. అంత అనారోగ్యంలోను నా ధ్యాస తననుండి మార్చాలని అనుకుంది. మృత్యువు విడదీస్తే విడిపోయే బంధమా మాది. గట్టిగా అరిచి చెప్పాలనుకున్నా. కానీ మాట నా నోట్లోంచి రావడం లేదు.
ఎదురుగా ఎప్పట్లా నవ్వుతూ పిలుస్తోంది కస్తూరి. లేచి తన దగ్గరికి వెళ్ళాను. నా మనసులోని సందేహాలు దూరం చేస్తూ తన కళ్ళలో వేల సందేశాలు. ఇప్పటికీ మా మనసులే మాట్లాడుకుంటున్నాయి. వినిపించని ఆ రాగాలని వింటూ కనిపించని అందమైన లోకాలకి తనతో నా పయనం తిరిగి మొదలైంది.

*****

2 thoughts on “వినిపించని రాగాలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *