March 29, 2024

ఒకసారి చెప్తే అర్ధం కాదా!

రచన- మణికుమారి గోవిందరాజుల

“ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను ఒక్కసారి చెప్పానంటే ఇక అంతే! సంతకాలు పెట్టెయ్యి” కోపంగా అరిచి బైటికి వెళ్ళిపోయాడు అక్షయ్.
“ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా?” ఆ మాటలు చెవులో గింగురుమంటున్నాయి దీక్షకి..
“ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఆడపిల్లవు. ఇక నువు కూడా తయారయితే మేం బతకాలా వద్దా?”
తన కంటే రెండే నిమిషాలు ముందు పుట్టిన సుదీప్ తో పాటు తనకు కూడా మెడిసిన్ కోచింగ్ తీసుకోవాలని అన్నందుకు తండ్రి రియాక్షన్ అది.
తల్లి దగ్గర మొర పెట్టుకుంటుండగా వచ్చిన సుదీప్ అంతా విని “ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాన్న చదివించలేనంటున్నారు కదా? మళ్లీ మళ్లీ గొడవ పెడతావేంటి?” చిరాగ్గా అన్నాడు.
“ఒరేయ్! నా కంటే రెండు నిమిషాలు ముందు బయటికి వచ్చి నా కంటే పెద్దాడినయ్యాననుకుంటున్నావా? టెక్నికల్ గా నేనే నీ కంటే పెద్ద. ముయ్యరా నోరు” తాను కూడా విసుక్కుంది దీక్ష.
“ఏంటే? మగపిల్లాడినలా విసుక్కుంటావు? అయినా నీకొకసారి చెప్తే అర్థం కాదానే? నాన్న ఒక్కరికే చెప్పించగలరు. పెళ్లయితే అత్తగారింటికి వెళ్ళి మగడితో ఉంటావు. నువు సంపాదించకపోయినా పర్లేదు. కానీ మగపిల్లాడు. వాడు సంపాదించాలి. అసలు ఒక్కరే చాలనుకుంటే మీరిద్దరు పుట్టారు” అరిచింది తల్లి తానెంత పెద్ద మాట అని కూతురి గుండె పగలగొడుతున్నదో తెలియకుండా.
బాత్రూం లోకి వెళ్ళి గుండెలు పగిలేట్లు ఏడిచింది. ఇక ఆ తర్వాత తండ్రిని చదువుకుంటాను అని అడగలేదు. అలా అని తన కోరిక చంపుకోలేదు. దీక్షగా రేయింబవళ్ళు కష్టపడింది. ట్యూషన్ కూడా పెట్టించుకుని చదివిన సుదీప్ కి సీట్ రాలేదు కాని దీక్షకు ఫ్రీ సీట్ వచ్చింది. కానీ “వేరే చోట. పంపించను, అంత భరించలేను ఇప్పుడు సుదీప్ కి పేమెంట్ సీట్ కి కట్టడానికే పొలం అమ్మాలి. అందుకని ఇక్కడే డిగ్రీలో జాయిన్ అవ్వాల్సిందే” అన్నాడు తండ్రి.
“ఫ్రీ సీట్…ఎంతో కష్టపడి సాధించుకున్నాను. ఏమైనా సరే నేను చేరతాను” దృఢంగా అన్నది దీక్ష.
“ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అంత నేను పెట్టలేనంటున్నాను కదా? మగపిల్లాడు వాడినో కొలిక్కి తెచ్చేసరికే నా ప్రాణం పోతుంది. ఆడపిల్లవు నీకెందుకు అంత చదువు?” కుర్చీనో తన్ను తన్ని విసురుగా లేచాడు తండ్రి.
“దీనికెన్ని సార్లు చెప్పినా అంతే…ఒక్కసారి చెప్తే అర్థం కాదు. ఒక్కళ్ళు చాలనుకుంటే రెండో దానిగా పుట్టి మాకు చుక్కలు చూపిస్తున్నావు” పక్కనుండి సన్నయి నొక్కులు నొక్కింది తల్లి.
“నాన్నా! నేను కష్టపడ్డాను. సీటొచ్చింది. అమ్మా! మీరు ఒకళ్ళు చాలు అనుకుంటే ఇద్దరం పుట్టడం నా తప్పు కాదు. ఇప్పుడా తప్పొప్పుల గురించి నేను మీతో వాదించుకోదల్చుకోలేదు. చెప్పేదేమిటంటే మీరు నా గురించి ఏమీ ఖర్చు పెట్టే అవసరం లేదు. నేను అన్నీ ఏర్పాటు చేసుకున్నాను . నేనక్కడ చేరుతున్నాను అంతే” తానూ ఖచ్చితంగా చెప్పింది.
ఏమి పాట్లు పడిందో… ఎలా పూర్తి చేసిందో… మొత్తమ్మీద మెడిసిన్ గోల్డ్ మెడల్ అందుకుని పూర్తి చేసుకుంది. అదే ఫ్లో లో అమెరికా ఎమ్మెస్ చేయటానికి వెళ్ళింది. వెంటనే మంచి హాస్పిటల్ లో పోస్టింగ్ ఆఫర్ వచ్చింది. అన్ని రకాలుగా సెటిల్ అయింది తాను. పొలాలమ్మి, చాలక ఇల్లు తాకట్టు పెట్టి చదివించిన సుదీప్ పట్టా చేతిలో పడగానే డబ్బున్న వారి ఇంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఇల్లమ్మి అప్పులు పూర్తిగా తీర్చి తల్లీ తండ్రీ అద్దె ఇంటిలోకి మారడం కూడా జరిగిపోయింది. జరిగింది మనసులో పెట్టుకోకుండా తల్లీ తండ్రిని ఆదుకుని మళ్ళీ ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళకు నెల నెల కొంత పైకం పంపే ఏర్పాటు కూడా చేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకుందే కాని ఇక వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా స్వీకరించలేకపోయింది.
ఇక్కడ అమెరికాలో కూడా ఇల్లూ బ్యాంకు బాలన్స్ లు అన్నీ ఉన్నా ఏదో వెలితి. ఎవరూ లేని వొంటరి జీవితం. ఎవరిని నమ్ముదామన్నా భయం. ఆడపిల్లల్ని తక్కువగా చూసిన తండ్రి గుర్తు వస్తే మగాళ్ళందరూ అలాంటివారే అనుకుంటే పెళ్ళి చేసుకోవాలంటే భయం. స్త్రీ అయి ఉండి కూడా తల్లి తనను ట్రీట్ చేసిన తీరు చూస్తుంటే పెళ్ళంటే భయం. తనతో పాటే పుట్టినా, మగ వాడైన సోదరుని దాష్టీకం తల్చుకుంటే మగవాళ్ళంటే భయం. ఈ పదేళ్లల్లో చాల మందే ప్రపోజ్ చేసినా ఏదో భయం అంగీకరించటానికి, ఆలోచించటానికి అడ్డుపడింది.
ఆ సమయం లో తనతో పాటే డ్యూటీలో జాయిన్ అయిన అక్షయ్ ఆకర్షణలో పడింది. ఒంటరితనంతో బాధపడుతూ ఆప్యాయతకోసం అర్రులు చాస్తున్న తాను క్షణ క్షణం తనగురించే ఆలోచిస్తూ ఉన్న అక్షయ్ వలలో పడటానికి ఎక్కువరోజులు పట్టలేదు. ఏమి జరిగింది అని ఆలోచించే లోపల అతని ప్రేమలో పడి పెళ్ళి కూడా చేసుకుంది. అప్పటివరకూ తాను పోరాడి నిర్మించుకున్న తన జీవితం చేతులారా తెలీని వ్యక్తి చేతిలో పెట్టేసింది. తన తెలివితేటలు కంటే కూడా అల్రెడీ తనకు ఉన్న సిటిజెన్ షిప్ అక్షయ్ ని ఎక్కువగా ఆకర్షించింది అన్న సంగతి పెళ్ళయ్యాక తెలిసింది. అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోయింది
ఎలా అలా వెర్రిగా నమ్మింది అతనిని? తల్లీ తండ్రీ దగ్గర దొరకని ప్రేమ అతను చూపించగానే పడిపోయిందా? చిన్నతనం నుండీ ఆశగా ఎదురు చూసిన ఆప్యాయతను అతను నటించాడని ఎలా గుర్తించలేకపోయింది? అతను అందరి లాంటి మగవాడు కాదని మనసును మభ్య పెట్టుకుని అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించడం తాను చేసిన పొరపాటా? మనుషులు ఇలా ఎలా ఉంటారు? ఎంత టార్చర్ పెడుతున్నాడు? నా చదువూ, తెలివితేటలు వాడి దుర్మార్గం ముందు పని చేయటం లేదా?” ఆలోచిస్తూ కూర్చున్న దీక్ష లోపలికి వచ్చిన అక్షయ్ ని గమనించలేదు.
“మనుషులొచ్చింది కూడా గమనించకుండా కూర్చున్నావు. ఎంత పొగరు?” ఎదురుగా ఉన్న కుర్చీని ఒక్క తన్ను తన్నాడు అక్షయ్.
ఏమీ జవాబివ్వకుండా నిర్లిప్తంగా చూసిందతని వైపు. ఎంతో దగ్గర అనుకున్న అతను ఇప్పుడు వేలమైళ్ళ దూరం లో…
“పేపర్లక్కడ పెట్టాను. సంతకం పెట్టు” ఆజ్ఞాపించినట్లుగా చెప్పి వాష్ రూం కెళ్లాడు. అటు చూసింది. టేబుల్ మీద పెట్టిన పేపర్లు. మ్యూచువల్ కంసెంట్ కింద తామిద్దరూ ఎటువంటి గొడవలూ లేకుండా ఇష్టపూర్వకంగా విడిపోతున్నాము కాబట్టి అతనికి రావలసిన పర్మనెంట్ గ్రీన్ కార్డ్‌కి ఎటువంటి అభ్యంతరమూ తనకు లేదని అంగీకరిస్తూ సంతకం చేయడానికి ఉంచిన పేపర్లు తన మనస్సులానే అటూ ఇటూ కదులుతున్నాయి.
చదువుకునే రోజుల్లోనే ప్రేమించిన పక్కింటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్న అక్షయ్ భార్యా పిల్లల్ని ఇండియాలోనే ఉంచి అమెరికా వచ్చాడు. మారుతున్న వీసా రూల్స్ అతన్ని కంగారు పెట్టాయి. ఈ లోపు దీక్ష అతని కంటపడింది. అప్పటికే అమెరికన్ సిటిజెన్ అయిన దీక్షను పెళ్ళి చేసుకుని పర్మనెంట్ రెసిడెంట్ అవచ్చని దీక్షను బుట్టలో వేసుకున్నాడు. రెండేళ్ళ పాటు చాలా జాగ్రత్తగా ఉండి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత ఇక తన ప్లాన్ చిన్నగా అమలు పరచడం మొదలు పెట్టాడు. దీక్ష కొద్దిగా షార్ట్ టెంపర్. అది సాకుగా తీసుకుని తనకసలు దీక్షతో సుఖం లేదని అక్కడా ఇక్కడా అనడం మొదలు పెట్టాడు. దీక్ష అంటే ప్రేమ ఉన్నా తామిద్దరికీ ఇక కుదరదు కాబట్టి విడాకులు తీసుకుందామని అడిగాడు.
ఈ లోపు అక్షయ్ భార్య తరపు బంధువు అయిన ఒక ఇండియన్ డాక్టర్ వినయ్ వర్మ హాస్పిటల్ లో వీళ్లిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు.
“మిసెస్ దీక్షా! మీ హస్బెండ్ నాకు తెలుసు. నేను అతనికి తెలియదు. మీ ఇద్దరికీ పెళ్ళయిందని తెలిసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. పిల్లలు కూడా. ఆ అమ్మాయి మాకు బంధువు. ఆ పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. ఆ అమ్మాయి చాలా మంచిది. బహుశ వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. ఆ పెళ్ళైన సంగతి మరి మీకు చెప్పాడో లేదో నాకు తెలియదు. ఇంత మోసం చేస్తాడా? మీకు తప్పక నా వంతు సహాయం చేస్తాను. అన్ని వివరాలు కనుక్కుని మీకు చెప్పగలను.” చేష్టలు దక్కి కూర్చుండిపోయింది దీక్ష. ఎంత మోసం? ఆమెని జాలిగా చూసాడు ఆ డాక్టరు.
“మిసెస్ దీక్షా! ఇప్పుడే అతనితో ఎటువంటి గొడవలూ పెట్టుకోకండి. తెలివిగా బయటపడండి” చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రోజు ఇంటికి వచ్చాక అడిగింది “అక్షయ్! నీకు పెళ్ళయిందా?”
“వాడు చెప్పేసాడా? అనుకున్నాను. అవును అయింది. అందుకే మనిద్దరమూ విడాకులు తీసుకుందాము అన్నది. నేను నీ డబ్బులకోసం కాదు నిన్ను చేసుకుంది. నీకేమీ ఆర్ధిక నష్టం జరగలేదు. విడాకులు ఇస్తే నేనే నీకు ఎదురిస్తాను. కాని మ్యూచువల్ కింద” సిగ్గు లేకుండా అసలేమీ తప్పే చేయనట్లు మాట్లాడుతున్న అతన్ని అసహ్యంగా చూసింది.
“ఏంటి? ఇంకా పెట్టలేదా?” కోపంగా అన్న అక్షయ్ మాటలకు ఈ లోకం లోకి వచ్చింది.
“అక్షయ్! ఈ ఒక్కరోజు టైం ఇవ్వు. రేపు పొద్దునకల్లా పెట్టేస్తాను” శాంతంగా అన్నది. విజయం సాధించినట్లుగా నవ్వుకుని “రేపొస్తాను” చెప్పి వెళ్ళిపోయాడు.
మర్నాడు పొద్దున్నే వచ్చేసాడు అక్షయ్. అప్పటికే రడీ అయి కూర్చుంది దీక్ష. లోపలికి వస్తూనే “ఏవీ పేపర్లు?” అడిగాడు.
“కూర్చో అక్షయ్…ఇన్నాళ్ళూ నాకు అనుభవంలోకి రాని ప్రేమను అది నటనే అయినా ఇచ్చావు. అప్పుడు ఆనందించినా ఇప్పుడు తల్చుకోవటానికి కూడా అసహ్యం వేస్తున్నది. ఓకే…ఇప్పుడు సంతకాలయ్యాక నీ భార్యా పిల్లల్ని కూడా నన్నొదిలేసినట్లే వదిలేస్తావా?”
“వాళ్లనెందుకు వదుల్తాను? వాళ్ళకోసమే కదా ఇంత కష్టపడింది?”
“ఓహో! వాళ్ల మీది నీ ప్రేమలో నిజాయితీ ఉందన్నమాట. అయితే నువే చెప్పు వాళ్ళకా సంగతి. దీప్తీ వస్తావా మీ వారి కాదు మనవారి లీలలు చూట్టానికి?”
లోపలిని నుండి బయటకు వచ్చిన భార్య దీప్తినీ, పిల్లలనూ చూసి నిర్ఘాంతపోయాడు అక్షయ్. ఇంతలో ఇంకో రూంలో నుండి కాప్స్ కూడా వచ్చారు. వాళ్ళను చూసి మరీ ఆశ్చర్యపోయాడు. దాంతో పాటే ఏదో భయం వెన్నులోనుండి తన్నుకొచ్చింది. వెనక్కి తిరిగి పారిపోబోయాడు. అప్పటికే గుమ్మం దగ్గర పత్రికల వాళ్ళు రడీగా ఉన్నారు.
“మిస్టర్ మోసం చేసి డాక్టర్ దీక్షను పెళ్ళి చేసుకున్నందుకు గాను నిన్ను అరెస్ట్ చేస్తున్నాము” కాప్స్ ముందుకొచ్చి అక్షయ్ తో చెప్పారు.
భార్య దీప్తి వేపు చూసాడు. ఆమె ఒక కంట అసహ్యం, మరొక కంట అగ్నికణాలూ రాల్తున్నాయి. పిల్లలు కూడా అసహ్యంగా చూసారు.
ఆ రోజు వినయ్ వర్మ దీక్షను హెచ్చరించి ఊర్కోలేదు. ఇండియాలో ఉన్న కజిన్ తలితండ్రులకు విషయం అందచేసి రహస్యంగా దీప్తిని పిల్లలను అమెరికా పంపమన్నాడు. ఆల్రెడీ వీసా తీసుకుని ఉన్న దీప్తీ, పిల్లలూ పదిహేను రోజులకల్లా వచ్చారు. వాళ్ళని తన దగ్గర ఉంచుకుని పరిస్తితి అంతా వివరించి “ఇంకా అతనితో కాపురం చేస్తావా?” అని అడిగాడు వినయ్ వర్మ. ఆమె ఖచ్చితంగా చేయననే చెప్పింది.
ఈ లోపు దీక్ష కూడా అక్షయ్ తో రక రకాలుగా వాగించి అవన్నీ వీడియో రికార్డ్ చేసి పెట్టింది. ఇక నిన్నటి రోజు అన్ని పర్ఫెక్ట్ సాక్ష్యాధారాలతో ఇద్దరు భార్యల సంతకాలతో అక్షయ్ మీద కేస్ పెట్టింది దీక్ష.
“చాలా థాంక్స్ వినయ్ గారూ…మీ మేలు మరవలేనిది” వినయ్ కి నమస్కారం చేస్తూ చెప్పింది దీక్ష. అన్నను పట్టుకుని ఏడ్చింది దీప్తి.
ఓదార్పుగా దగ్గరికి తీసుకున్నాడు. “నువు పెద్ద గొడవ చేయకపోవడం వల్ల అతనికి మన ఇద్దరం కలిసి చేస్తున్నామన్న అనుమానం రాలేదు. మంచో చెడో జరిగిన దానికి చాలా బాధగా ఉన్నది”
“మోసం చేసి సిటిజెన్ షిప్ కోసమే పెళ్ళి చేసుకున్నాడు అన్నది ప్రూవ్ అవడం వల్ల జైలు శిక్ష విధించడమే కాకుండా అతని యావదాస్తీ మిసెస్ దీక్షకు అప్పగించి జైలు శిక్షానంతరము ఆ రొజే దేశం విడిచి వెళ్ళవలసిందిగా శిక్ష విధించడమైనది” కోర్ట్ తీర్పు చదువుతూ…
“ఒక్కసారి చెప్తే అర్థం కాదా అన్న మాట ఒకసారి తనలో పట్టుదలపెంచి డాక్టర్ని చేస్తే అదే మాట మరోసారి జీవితాన్ని మార్చింది” నవ్వుకున్నది దీక్ష.
*************************

13 thoughts on “ఒకసారి చెప్తే అర్ధం కాదా!

  1. మహిళలు తల్చుకుంటే ఎటువంటి అన్యాయాన్నైనా ధైర్యంగా ఎదిరించగలరని చక్కగా చెప్పారు మణీ.. అభినందనలు..

  2. Superrr story aadavaallu edainaa saadinchagalaru ani niruupinchindi ee storylo manchi ilaanty story lanu inkaa inkaa readers ku andinchaalani rachayitanu vedukontunnaanu

  3. Congratulations once again.Simply superb …nice narration…purushaadhikya samajaanni inko sari addam lo chusinattu vundi …nice story plot.kee p rocking

Leave a Reply to మాలిక పత్రిక ఏప్రిక 2021 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *