March 29, 2024

చంద్రోదయం – 14

రచన: మన్నెం శారద

సారధి బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి టేబుల్ మీద లెటర్ వుంది.
అది శేఖర్ దస్తూరి గుర్తుపట్టేడు సారధి. వెంటనే ఆత్రంగా విప్పేడు.
డియర్ సారధి,
నువ్వెళ్లిపోయాక వైజాగ్ కళ పోయింది. సముద్రం చిన్నబుచ్చుకుంది. బీచ్ రోడ్డు బావురుమంటోంది. ఎల్లమ్మ తోట సెంటర్ వెలవెలా బోతోంది.
మరి నీకక్కడ ఎలావుందో? ఈ పరిస్థితిలో స్వాతే లేకపోతే నీ ఎడబాటు నాకు పిచ్చెక్కించేసేదే. నీ బెంగవల్లనేమో నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మరేం కంగారుపడకు. కాస్త తలనొప్పి అంతే.
పోతే మరో సంతోషకరమైన విషయం. చెప్పేయనా? నేను త్వరలో తండ్రిని కాబోతున్నానట. స్వాతి చెప్పింది. వాడు మరో ఆరు నెలలల్కి వచ్చేస్తాడు. అప్పటికయినా ఓసారి వస్తావు కదూ..
నీ శేఖర్.
సారధి గాఢంగా నిట్టూర్చి లెటర్ డ్రాయర్‌లో పడేశాడు.
“ఏమిట్రా విశేషాలు?” సారధి తల్లి సావిత్రమ్మ ఆత్రంగా అడిగింది.
సారధి టూకీగా చెప్పేసేడు.
ఆమె అదోలా వున్న కొడుకుని పరీక్షగా చూసింది. ఎంతో హుషారుగా వుండే అతను ఈ మధ్య ఎప్పుడూ తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా గడపటం , అరుదుగా కూడా నవ్వకపోవడం ఆమెకు బాధగా వుంటోంది.
ఒక వయసులో ఒంటరితనం మనిషిని ఎలా వెంబడించి వేధిస్తుందో ఆమెకి బాగా తెలుసు. అప్పుడు మగవాడికి గానీ, ఆడదానికి గానీ కావలసింది తల్లీ, తోబుట్టువుల సాహచర్యం కాదు. మనసుని మనసుతోనే రంజింపజేసి, అనురాతంతో అలరించగల తోడు కావాలి.
“ఏ వయసుకా ముచ్చటన్నారు. తోటివాడు శేఖర్ బిడ్డ తండ్రి కాబోతున్నాడు”అనుకుని నిట్టూర్చిందామె.
సారధి భోంచేస్తున్నాడు.
“మీ బ్యాంకులో అమ్మాయిలున్నారా?”
తల్లి ప్రశ్నకు తలయెత్తి చూశాడు సారధి.
“ఏవిట్రా నా ప్రశ్న అర్ధం కాలేదా?”
“అదేం ప్రశ్నమ్మా! అమ్మాయిల్లేని ఆఫీసులున్నాయా? వాళ్ళే ఎక్కువ” ఆవిడ మొహం కాంతివంతమైంది.
“పెళ్ళి కాని పిల్లలు కూడా వుంటారుగా?” అంది.
సారధి నవ్వేడు. “ఈ రోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఎవరెవరికి పెళ్ళిళ్లయ్యేయి.. ఎవరికి కాలేదో యివన్నీ నాకెందుకు?”
ఆమె నిట్టూర్చింది.
“నీ తోటివాడు శేఖర్ తండ్రి కాబోతున్నాడు. నువ్విలా పెళ్లీ పెటాకులూ లేకుండా ఎన్నాళ్ళుంటావు? సునంద పెళ్లి చేసేవు. అప్పులన్నీ తీర్చేసేవు. ఇక చిన్నది సుహాసిని ఏదో చదువుకుంటున్నది. నువ్వింక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మనకి అయినవాళ్లంటూ ఎవరూ లేరు. అందుకే నీకు నచ్చిన పిల్ల కనిపిస్తే వెంటనే చేసుకో. నాకు కులం, గోత్రం అని, కట్నాలు, కానుకలు అనే పిచ్చి లేదు. ఉన్నంతలో మీరు సుఖంగా వుండటమే కావాలి. నాల్గు రోజుల్లో పోయేదాన్ని. నాకెందుకీ వ్యామోహాలూ?”
సారధి ఆశ్చర్యంగా తల్లివంక చూసేడు.
పల్లెటూరిలో పుట్టీ చదువు సంధ్యలెరుగక పోయినా ఆమె ఎంత వుదాత్తంగా ఆలోచించగల్గుతోంది? ఈ మాత్రం విశాల స్వభావం శేఖర్ తల్లితండ్రులలో వుండి వుంటే ఆతని పెళ్ళి ఎంత ఘనంగా జరిగి వుండేది. ఉన్నది ఒక్కగానొక్క కొడుకయినా తరతరాలకి తరగని ఆస్తి వున్నా, వాళ్లు అంతస్తుకే ప్రాధాన్యత యిచ్చేరు. దాని కోసం కన్నకొడుకునే దూరం చేసుకున్నారు.
“ఏవిట్రా మాట్లాడవూ?” తల్లి హెచ్చరికకి లోకంలోకి వచ్చేడు సారధి. చెయ్యి కడుక్కొని లేచి వెళ్లిపోతుంటే ఆమె అర్ధం కానట్లు చూసింది.
సారధికి శేఖర్ స్మృతులతో ఎప్పుడో అర్ధరాత్రి నిద్ర పట్టేసింది.
స్వాతికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది.
పక్క గదిలో యింకా దీపం వెలుగుతోంది.
ఆమె లేచి వాళ్ల గదిలోకి వచ్చింది. సారధి నాని పక్కగా ఒరిగి పడుకుని వున్నాడు. అతను చదువుతున్న పేపర్ ముఖం మీద పడి పైన ఫాన్ గాలికి రెపరెపలాడుతోంది.
నాని కదలకుండా నిద్రపోతున్నాడు.
నుదుటి మీద చెయి వేసి చూసింది.
జ్వరం లేదు.
ఆమె గుండె నిశ్చింతగా కొట్టుకుంది. ఆమె సారధి ముఖం మీద పేపర్ తీసి మడిచి పక్కకి పెట్టింది. అతను కదిలి మరో పక్కకి తిరిగి పడుకున్నాడు. అమాయకంగా వున్న అతని మొహాన్ని చూడగానే ఆమెకు చాలా జాలి కలిగింది.
“ఏం సుఖం బావుకుందామని యితనింత త్యాగానికి పూనుకున్నాడు. ఏ ప్రతిఫలం ఆశించి యితనింతగా కష్టపడుతున్నాదు. నానీని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు. కన్నతండ్రయినా యింతకంటే ఎక్కువ ఏం చేయగలడు” స్వాతి హృదయం కృతజ్ఞతతో బరువెక్కింది.
“కాని.. కాని.. అందుకు ప్రతిఫలంగా, తనేం చేయగల్గుతోంది? తాళికట్టినా అతన్ని దూరంగా పెట్టి అవసరాలకు ఉపయోగించుకుంటూ కూడా అతనికి భార్యగా కాలేకపొతూ..” క్షణంక్షణం అతన్ని బాధపెడుతూ తాను బాధపడుతూ, స్వాతి మరింక ఆలొచించలేకపొయింది.
ఆ రోజు… సినిమాహాల్లో తన్ని పలుకరించిన చిలిపి ముఖం క్షణకాలం ఆమె మనసులో మెదిలింది.
ఎంద్కో, మొదటిసారిగా అతన్ని చూసి ఆమె హృదయం నర్తించింది.
అది ప్రేమా? అకర్షణా? ఏమో!
ఆ రోజు స్వాతి స్నేహితురాళ్ళు సినిమాహాల్లో ఆమెని ఏడిపిస్తే స్వాతికి కోపం రాలేదు. సిగ్గుతో ఆమె మొహం జేవురించింది. ఏదో తెలియని పారవశ్యం ఆమెను డోలలూగించింది.
అందుకే.. అందుకే.. ఆగలేక రిక్షా కర్టెన్ తొలగించి సిగ్గు వదలి అతన్ని తిరిగి చూసింది. మళ్లీ దొరకడనే ఆత్రంతో… మళ్లీ చూడలేననే భయంతో.
సమాధానంగా అతను చెయ్యి వూపి నవ్వడం తనకి బాగా గుర్తుంది. కాని.. దురదృష్టవశాత్తూ తనింక అతన్ని మళ్ళీ చూడలేకపోయింది. ఆ వెంటనే తండ్రికి జబ్బు చేసి నెలరోజులు తను కాలేజీకి వెళ్లలేకపోవటం, తిరిగి కాలేజీకి వెళ్లినా ఎన్నడూ అతను ఎక్కడా తనకు తారస పడకపోవటం.. అంతా కాకతాళీయంగా జరిగిపోయింది.
కేవలం ఓ రోజు సినిమాహల్లో కనబడి పలుకరించినంత మాత్రాన ప్రేమించబడ్డం అనేది జరిగే పనేనా?
తాను నిరాశగా నిట్టూర్చింది…

ఇంకా వుంది.