March 28, 2024

సత్యమేవ జయతే

రచన:జి.వి.ఎల్. నరసింహం

ఆ పట్టణంలో నున్న బ్యాంకులలో, ప్రైవేటు రంగంలో గల కనకలక్ష్మీ బ్యాంకు, చాలా పెద్దది. ఆ ఊళ్ళో పండ్రెండు శాఖలతో బాటు, రీజియనల్ మేనేజరు వారి కార్యాలయం కూడా ఉంది. ఆ బ్యాంకులోని ఒక శాఖలో, వెంకటాద్రి గత ముఫై సంవత్సరాల నుండి ప్యూనుగా పని చేస్తున్నాడు. నమ్మకస్తుడని, కష్టబడి పని చేస్తాడని, పేరు తెచ్చుకొన్నాడు. మరో నెలలో రిటైర్ కాబోతున్నాడు.
ఒక రోజు, మేనేజరు వెంకటాద్రిని పిలిచి, “వెంకటాద్రి, వచ్చే నెలలోనేనా నువ్వు రిటైరవుతున్నావు?” అని అడిగేడు.
“అవును, సార్.” వినయంగా సమాధానమిచ్చేడు, వెంకటాద్రి.
“నువ్వు రిటైరయిన తరువాత, నీ జాగాలో మరో ప్యూనుని భర్తీ చెయ్యాలి. నీ లాంటి నమ్మకస్తుడు, కష్టబడి పని చేసేవాడు, కావాలి. నీకు బాగా తెలిసిన వాడెవడయినా ఉంటే, చెప్పు. ఆర్.ఎమ్. గారికి రికమెండు చేస్తా.” మేనేజరు, వెంకటాద్రితో చెప్పేడు.
“నేనే తమరిని రిక్వెస్టు సేద్దామనుకొంటున్నాను సార్. దేముడిలాగా మీరే అడిగినారు సార్.” వినయంగా అన్నాడు వెంకటాద్రి.
“ఎవరేనా ఉన్నారా?” మేనేజరు తెలియగోరేడు.
“ఉన్నాడు సార్. మా చెల్లమ్మ కొడుకండి. సింహాద్రి. తొమ్మిది దాక సదువుకున్నాడు సార్. ఇంగ్లీసు కూడా కొద్దిగా సదవగలడు సార్. మంచి కుర్రోడండి. బీడీ, సుట్ట, అలవాట్లేవీ లేవు సార్.” వినయంగా విన్నవించుకున్నాడు, వెంకటాద్రి.
“ప్రస్తుతం ఏమిటి చేస్తున్నాడు?”
“మన రెడ్డి సార్ ఉంటున్నారే, వినాయక ఎపార్టుమెంట్సు, అక్కడ వాచ్మనుగ ఉంటున్నాడు సార్. రెడ్డి సారే, ఏయించారు సార్.”
“బ్యాంకులో పని. నీకు తెలుసుగా. బాగా నమ్మకస్తుడయి ఉండాలి.”
“ఆ ఇసయంలో తమకు కంప్లయింట్ ఎప్పుడు రాదు సార్. గేరెంటి సార్.”
“సరే, వాడిని, రేపు సాయంత్రం 5 గంటలికి నన్ను కలియమని చెప్పు. సర్టిఫికేట్స్ తీసుకురమ్మని చెప్పు.”
“అట్టాగే సార్. ఆడికి ఈయాలే చెపుతా సార్. చాలా తేంక్స్ సార్.” వినయంగా నమస్కరిస్తూ, నిష్క్రమించేడు, వెంకటాద్రి.
వెంకటాద్రి రిటైరయ్యేడు. ఆ జాగాలో, సింహాద్రి టెంపరరీ ప్యూనుగా జాయినయ్యేడు. చాలా, నీతి, నియమం గలవాడు. ఆంజనేయ భక్తుడు. సమయానికి ముందుగానే వచ్చి, పనిలో నిమగ్నమవుతాడు. ఒకరోజు, కష్టమరు ఒకాయన, స్ట్రాంగు రూములో లాకరు ఆపరేటు చేసి, సెల్ ఫోను మరచిపోయేడు. తరువాత, అది గమనించిన సింహాద్రి, దానిని భద్రంగా మేనేజరుకు అప్పగించేడు. మేనేజరు, కష్టమరు, సింహాద్రిని ప్రశంసించేరు. ఇలాంటి ఉదంతాలు కొన్ని జరగడంతో, సింహాద్రి నమ్మకస్తుడని, అందరికి నమ్మకం కుదిరింది. కష్టమర్లు, కొందరు చిన్న వ్యాపారస్తులు, ఏదయినా కొంత డబ్బు వాళ్ళఖాతాలో జమ చెయ్యాలంటే, బ్యాంకు పని వేళలలో, దుకాణం వదలి వెళ్లడం కుదరదు. అటువంటి వారు కొందరు, సింహాద్రి బ్యాంకుకు వెళుతున్న సమయంలో, అతనిని చూసి, వాళ్ళ ఖాతాలో జమ చెయ్యమని డబ్బు ఇస్తూంటారు. నమ్మకంగా అవి జమ అవుతూంటాయి. తన వినయ విధేయతలు, సత్ప్రవర్తనలతో, అధికారుల మెప్పును సంపాదించి, పనిలో చేరిన అయిదు సంవత్సరాలకు, సింహాద్రి పెర్మనెంటు అయ్యేడు.
సింహాద్రి జాయనయిన మూడు నెలలకు, అదే బ్యాంకులో, అదే ఊరిలోని మరో శాఖలో, ఓ పెద్దాయన రికమెండేషనుతో, అప్పలకొండ టెంపరరీ ప్యూనుగా చేరేడు. సింహాద్రి, అప్పలకొండ, పరిచితులే. ప్రవర్తన, పనితీరులలో, సింహాద్రి, అప్పలకొండలది, పూర్తిగా భిన్నమయిన వైఖరి. పనిలో ప్రవేశించిన క్రొద్ది రోజులకే, అప్పలకొండ బ్యాంకుకు ఆలస్యంగా రావడం మొదలుబెట్టేడు. ఆలస్యానికి కారణం, అధికారులు అడిగితే, ఏవో కొంటె సాకులు చెప్పడం అలవాటయిపోయింది. అధికారుల హెచ్చరికలు మార్పును తేలేకపోయేయి. దానికి తోడు, తరచూ, కష్టమర్సులతో అభ్యంతరకరమయిన ప్రవర్తనలు మొదలుబెట్టేడు. అన్నింటినీ మించి, ఒక రోజు, చుక్క వేసుకొని డ్యూటీకి వచ్చి, ఆ మత్తులో ఒక కష్టమరును, కొట్టినంత పని చేసేడు. అప్పటికే, తరచూ వాడి మీద వస్తున్న కంప్లైంట్సుతో విసిగిపోయిన మేనేజమెంటు, ఈ సంఘటనతో, తుది నిర్ణయం తీసుకొని, నియమావళిని అనుసరించి, అప్పలకొండను డిస్మిస్ చెయ్యడం జరిగింది. అది జరిగిన అయిదారు సంవత్సరాల తరువాత, అప్పలకొండ అత్తవారి ఆర్థిక సహాయంతో, సింహాద్రి బ్యాంకుకు వెళుతున్న దారిలోనే, ఒక కిరాణా దుకాణం తెరిచేడు. సింహాద్రి పనిచేస్తున్న శాఖలోనే, అప్పలకొండ తన ఖాతా పెట్టుకొన్నాడు. తన ఖాతాలో జమ చెయ్యమని, బ్యాంకుకు రాకపోకలలో నున్న సింహాద్రికి, అప్పలకొండ డబ్బు ఇవ్వడం, అనేక మార్లు జరిగింది. సింహాద్రి క్రమం తప్పక వాటిని జమ చేసి, రసీదులందిస్తుండేవాడు.
ఆ రోజు 13 వ తారీఖు. సమయం సాయంత్రం. బ్యాంకు నుండి ఇంటికి వెళుతున్న సింహాద్రిని చూసి, “సింహాద్రీ” అని కేక వేసేడు అప్పలకొండ.
సింహాద్రి, దుకాణం దగ్గరగా వచ్చి, “ఎందుకేటి పిలిసినావు?” అని అప్పలకొండని ప్రశ్నించేడు.
“ఈ పదారొందలు, రేపు నా ఖాతాలో జమ చేసేయి.” అని 1600 రూపాయిలు సింహాద్రికి ఇచ్చేడు.
సింహాద్రి ఆ డబ్బు అందుకొని భద్రంగా తన పర్సులో పెట్టుకొన్నాడు.
సింహాద్రి, బజారులో కూరలు కొనుక్కొని ఇంటికి వెళ్ళేడు. బట్టలు మార్చుకొంటున్న సమయంలో సింహాద్రి, తన పర్సు పోయిందని గమనించేడు. గతుక్కుమన్నాడు. అందులో అప్పలకొండ ఇచ్చిన 1600 ఉన్నాయి. పరుగు పరుగున కూరల బజారుకి వెళ్ళేడు. ఆందోళనతో, అక్కడ నలుగురినీ అడిగేడు. ఫలితం శూన్యం. సింహాద్రికి ఏం చెయ్యాలో తోచ లేదు. తన బ్యాంకు ఖాతాలో 1267 రూపాయలున్నాయి. భార్య, సీతాలుతో జరిగిన విషయం చెప్పేడు. బ్యాంకులో, ఉద్యోగస్తుల జీతాలు, ప్రతి నెల మొదటి తారీఖున జమ కావలిసినవి, ముందు నెల 25 నే జమ అవుతాయి. దంపతులిద్దరూ ఆలోచించుకొన్నారు. జరిగిన సంగతి అప్పలకొండకి చెప్పి, జీతం అందగానే 1600 రూపాయిలు, అప్పలకొండ ఖాతాలో జమ చెయ్యాలని నిశ్చయించేరు.
వెంటనే, సింహాద్రి, అప్పలకొండ దుకాణానికి వెళ్లి, వాడితో జరిగినదంతా చెప్పేడు. జీతం అందుకొన్నాక, 25 వ తారీఖున, వాడి ఖాతాలో తప్పక జమ చేస్తానని హామీ ఇస్తూ, క్షమాపణ చెప్పుకొన్నాడు. దానికి స్పందిస్తూ, అప్పలకొండ, “చమాపన లేటి, నానే బాద బడుతున్నా. నా యల్ల గదా, నీకు నట్టమొచ్చింది. ఏటి సేత్తాము మరి. నువు సెప్పినట్టే, నీ జీతం జమ అయినాక, నా ఖాతాలో ఏసిద్దుగానివి. మరేం దిగును బడబోక.” అని నచ్చ చెప్పేడు.
“సానా తేంక్స్, అప్పికొండ. ఒత్తా.” అని సింహాద్రి, శలవు తీసుకొని, ఇంటికి వెళ్లి, జరిగినిదంతా సీతాలుతో చెప్పేడు.
అది విని సీతాలు, “అప్పికొండ మంచోడు. నేకపోతే, అంత సొమ్ము, ఈ ఏలకీఏల ఎట్టా తెచ్చోల్లమి. అంతా ఆ సామి దయ.” అంటూ, గోడకి వ్రేలాడుతున్న మారుతి పటానికి వంగి నమస్కరించింది.
అనుకొన్న ప్రకారం, సింహాద్రి 25 వ తారీఖున, అప్పలకొండ ఖాతాలో 1600 రూపాయిలు జమచేసి, దాని రసీదు వాడికి అందజేసేడు. సింహాద్రి, పర్సు పోయిన విషయం, తన జీతం అందగానే, ఆ సొమ్ము వాడి ఖాతాలో తప్పక జమ చేస్తానని చెప్పినప్పుడూ, అప్పలకొండకు దురాలోచన ఏదీ రాలేదు. కాని, ఆ రాత్రి, వాడికో దురాలోచన వచ్చింది. బ్యాంకు ఉద్యోగం పోయిన నాటినుండి, వాడి బుర్రలో ఏదో మూలన దాగి యున్న, సింహాద్రిపై గల అసూయ, బయటబడ్డాది. సింహాద్రి నిజాయితీపై దెబ్బ తీయడానికి తగిన అవకాశం దొరికిందనుకొన్నాడు. తన ఖాతాలో 1600 రూపాయిలు జమ అయిన దాకా ఆగేడు. ఆ మరునాడే బ్యాంకు రీజియనల్ మేనేజరు గారికి కంప్లైంటు పంపించేడు. దాని సారాంశం –
తను ఆ నెల 13 న, సింహాద్రికి 1600 రూపాయిలు తన ఖాతాలో జమ చేయమని ఇచ్చేడని, సింహాద్రి. తను నడుపుతున్న వడ్డీ వ్యాపారంలో, ఆ సొమ్ము వాడుకొని, 25 వ తారీఖున ఆ సొమ్ము తన ఖాతాలో జమ చేసేడని, ఆ కారణం వలన తనకు 1600 రూపాయిలపైన వడ్డీ నష్టము వచ్చిందని, అందుచేత దయదలచి తనకు ఆ వడ్డీ సొమ్ము ఇప్పించమని కోరేడు.
ఆ కంప్లైంటు, సింహాద్రి బ్రాంచికి వెళ్ళింది. బ్రాంచ్ మేనేజర్, సింహాద్రికి కంప్లైంటు తెలియబరుస్తూ, అతని సంజాయిషీ కోరేడు. ఆ విషయం యూనియన్ లీడరు, అప్పలస్వామికి తెలిసింది. సింహాద్రి వ్యక్తిత్వం బాగా తెలియడం మూలాన్న, అతను వెంటనే సింహాద్రిని కలసి, “సింహాద్రి, మేనేజిమెంటు వాళ్ళు నిన్ను సంజాయిషీ అడిగేరట. దేని కోసం?” అని ఆతృతగా అడిగేడు. సింహాద్రి జరిగినదంతా పూస గ్రుచ్చినట్లు చెప్పేడు.
“సింహాద్రి, అప్పలకొండ 13 వ తారీఖునాడే నీకు డబ్బు జమ చెయ్యమని ఇచ్చినట్లు రుజువేమీ లేదు గదా. అంచేత, వాడు నీకు 25 నాడే డబ్బు ఇచ్చేడని, అది ఆ రోజే జమ చేసేనని, సమాధానం ఇయ్యి. నీకేమీ కాదు. నేను చూసుకొంటా.” అని సలహాతో బాటు హామీ ఇచ్చేడు, అప్పలస్వామి.
అది విని సింహాద్రి, “అబద్ధాలెందుకు సార్. ఏటి జరిగినాదో, అట్టాగే సెబితే సరిపోద్ది గదా.”
“సింహాద్రి, నీకు తెలియడం లేదు. జరిగింది, జరిగినట్టే చెపితే కష్టాల్లో ఇరుక్కొంటావు. నీకు తెలీదు. ఆర్.ఎం. ఆఫీసులో, ఆ పెర్సొనల్ మేనేజరు గోపాల్, దేవాంతకుడు. ఎప్పుడూ, ఉద్యోగస్తులకి ఎలా కీడు చెయ్యడమా, అని ఆలోచిస్తుంటాడు. అతగాడు, నందిని పంది, పందిని నంది చేసి, నీ ఉద్యోగానికే ఎసరు పెట్టగలడు. నేను చెప్పినట్టు చెయ్యి.” అని మరోమారు నొక్కి చెప్పేడు.
సింహాద్రి జరిగినది జరిగినట్లు వివరిస్తూ జవాబిచ్చేడు. తాను వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాడన్న అభియోగాన్ని మాత్రం ఖండించేడు. జవాబు చూసిన మేనేజరు, ఆ జవాబు పరిణామమేమిటో సింహాద్రికి బోధపరచి, యూనియన్ లీడరుని సంప్రతించి, జవాబు మార్చుకోమని సలహా ఇచ్చేడు. సింహాద్రి జవాబులో మార్పు రాలేదు. ఆ జవాబు ఆర్.ఎమ్. ఆఫీసుకి చేరింది. ఆర్.ఎమ్. ఆఫీసులో, సింహాద్రి ఫైలు పెర్సొనెల్ మేనేజర్, గోపాల్ పరిశీలనార్థం వెళ్ళింది. ఆయనకు ప్రొమోషను వచ్చింది. ఆ రోజే రిలీవయి, కోల్కతాలోని బ్యాంకు హెడ్ ఆఫిసులో చేరవలసి ఉంది.
గోపాల్, ఆ కంప్లైంటుని తనదైన దృక్పథంతో, చూసేడు. ఫైల్ పట్టుకొని ఆర్.ఎమ్. గారి దగ్గరకు వెళ్ళేడు.
అతనిని చూసి, “Gopal, what is the matter.” అని ప్రశ్నించేరు, ఆర్.ఎమ్.
వినయంగా, ఆర్.ఎమ్. గారి టేబులుమీద, సింహాద్రి ఫైలు ఓపెన్ చేసిపెడుతూ, గోపాల్, “ఒక డిసిప్లినరీ ఏక్షన్ కేసు, సర్.” అని, ఆర్.ఎమ్. గారి ఎదుట నిలబడ్డాడు.
ఆర్.ఎమ్. గారు, సింహాద్రి మీద వచ్చిన కంప్లైంటు, సింహాద్రి సమాధానం చూసేరు.
“A serious case of dishonesty Sir. మీతో డిస్కస్ చేద్దామని వచ్చేను.” అని సింహాద్రిపై డిసిప్లినరీ ఏక్షన్ తీసుకోవాలని, తన అభిప్రాయం ధృడంగా విన్నవించేడు, గోపాల్.
“పర్సు బజారులో పోయిందని కారణం చెబుతున్నాడుగా. జీతం అందగానే జమ చేసేడుగదా.” ఆర్.ఎం. గారి అభిప్రాయం.
“అవన్నీ కల్పిత కథలు సర్. ఈ విషయంలో బ్యాంకు లీనియెంటుగా ఉంటె, బ్యాంకు ఇమేజ్ దెబ్బ తింటుంది సర్. అంతే కాదు, ఇటువంటి నమ్మక ద్రోహం ఇగ్నోర్ చేస్తే, రేపు వాడు పెద్ద ఫ్రాడ్ చెయ్యొచ్చు సర్.”
“ఎందుకైనా మంచిది, ఎంక్వయిరీ పెట్టించండి.” ఆర్.ఎమ్. గారి సలహా.
“Not necessary sir. వాడి రిప్లైలో అన్నీ ఒప్పుకున్నాడు. in fact, it is a confessional statement. So, as per our bank rules no enquiry is needed.”
“Then what is your opinion?” ఆర్.ఎమ్. గారి ప్రశ్న.
“As per our disciplinary Rule 18 (2)(c), Bank can terminate his services, sir. You have the powers. Sir.”
“బాగా ఆలోచించేరా?” ఆర్.ఎం. గారు మరోమారు అడిగేరు.
“మన బ్యాంకు లాయరు, కృష్ణమూర్తి గారితో డిస్కస్ చేసేను సర్. అయన, నా ఒపీనియనుతో ఎగ్రి అయ్యేరు. వాడు సుప్రీం కోర్టుకెళ్లినా గెలవలేడన్నారు, సర్.”
” సరే, కృష్ణమూర్తిగారి లీగలు ఒపీనియను, రిటనుగా తీసుకోండి. తరువాత చూద్దాం ” ఆర్.ఎమ్. గారి సలహా.
” ఈ సాయంత్రం, నేను రిలీవవుతున్నాను సర్. తమరు కూడా రేపటినుండి శలవు మీద వెళ్తున్నారు.” నసుగుతూ నిలబడ్డాడు.
” డజ్ నాట్ మేటర్. కొత్త పర్సనల్ మేనేజరు త్వరలోనే జాయిను అవుతున్నారు. మీరు, మీ డిటైల్డ్ నోటు ఫైలులో రాసి ఉంచండి. కొత్త పర్సనల్ మేనేజరు, లాయరుగారి ఒపీనియనుతో, ఫైలు పుటప్ చేస్తారు.”
సింహాద్రికి, పార్టింగ్ గిఫ్టు ఇద్దామనుకొన్న గోపాల్, నిరాశతో తన సీటు చేరుకొన్నాడు.
ఆ మరునాడు నుండి ఆర్. ఎం. గారు రెండు వారాల శలవు తీసుకొన్నారు. గోపాల్ ప్రొమోషను మీద బ్యాంకు హెడ్ ఆఫీసు చేరుకొన్నాడు..
సుమారు ఎనిమిది సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వంలో ఆఫీసరుగా పనిచేసిన నరేష్, బ్యాంకు రీజియనల్ ఆఫిసులో, పెర్సొనెల్ మేనేజరుగా చేరేడు. శలవునుండి తిరిగి వచ్చిన ఆర్.ఎమ్. గారిని, నరేష్ మర్యాద పూర్వకంగా కలిసి, ఆశీర్వచనాలు అందుకొన్నాడు. బ్యాంకులో, అది తన మొదటి రోజు. తోటి ఉద్యోగులందరిని పరిచయం చేసుకొని, పనికి శ్రీకారం చుట్టేడు. టేబులు మీద ఉన్న పెండింగు ఫైల్సులో, సింహాద్రి ఫైలు, అన్నిటికంటే మీదనుంది. సింహాద్రి ఫైలు తెరిచేడు, నరేష్. సింహాద్రిని ఉద్యోగం నుండి తొలగించాలని ఇదివరకటి పెర్సొనెల్ మేనేజరు, గోపాల్ రాసిన నోట్ చూసేడు. అది ఆర్.ఎమ్. గారికి పుట్ అప్ చేయ వలసి ఉంది. నరేషుకు ఎందుకో అనిపించింది, బ్యాంకులో తాను ప్రవేశించిన మొదటి రోజే, మరొక ఉద్యోగి ఉద్వాసనకి, ఫైలు కదపాలా…అని. సింహాద్రిపై కంప్లైంటు, సింహాద్రి జవాబు, జాగ్రత్తగా మూడు నాలుగు మార్లు చదివేడు. సింహాద్రి ఫైలు మొదటి నుండి తిరగేసేడు. నిజాయితీపరుడని, కష్టమర్సుకు ఉత్తమ సేవలందించడలో వెనుకాడడని, పై అధికారులు, కష్టమర్సు, ఇచ్చిన ప్రశంసా పత్రాలు పది దాక కంట బడ్డాయి. బ్రాంచ్ మేనేజరు అభిప్రాయాలు కూడా తీసుకొన్నాడు. నిశితంగా పరిశీలించి, సింహాద్రిని ఉద్యోగం నుండి తొలగించడం ఎంత వరకు న్యాయమని దీర్ఘంగా ఆలోచించ సాగేడు నరేష్.
తన అభిప్రాయాలని ఆర్.ఎమ్. గారితో చర్చిద్దామని ఫైలు పట్టుకొని, ఆర్.ఎమ్. గారి ఛాంబరుకు వెళ్ళేడు.
“సార్, సింహాద్రి కేసు తమతో డిస్కస్ చేద్దామని వచ్చేను.” నరేష్ వినయంగా చెబుతూ, ఆర్.ఎమ్. గారి ఎదురుగా నిలబడ్డాడు.
“ఆ కేసు డిసైడు అయిపోయిన్ది. గోపాల్ నోట్ రాయలేదా?” ఆర్.ఎమ్. గారి ప్రశ్న.
“అయన రాసేరు సార్” వినయంగా, నరేష్ సమాధానం.
“అయితే మరి డిస్కషను ఏమిటి?” ఆర్.ఎమ్. గారి ప్రశ్న.
“తమరు అనుమతిస్తే, ఆ విషయంలో, నా అభిప్రాయాలని చెబుదామనుకొంటున్నాను.”
క్రొద్దిగా సంశయిస్తూ, “Okay.Tell me” అన్నారు, ఆర్.ఎమ్.
బ్రాంచి మేనేజరు, యూనియన్ లీడరు ద్వారా తనకు తెలిసిన విషయాలు, ఆర్.ఎం. గారికి విపులంగా చెప్పి,
“సార్, అప్పలకొండ మెయిన్ కంప్లైంటు, తనకు వడ్డీ నష్టం వచ్చిందని. కానీ, ఆ సొమ్ము 14 న జమ అయి ఉన్నా, మన బ్యాంకు మినిమమ్ బాలన్స్ రూల్ ప్రకారం, అతనికి అధికంగా ఏమీ వడ్డీ రాదు. అంతే కాదు సర్, సింహాద్రి తన జవాబులో, అప్పలకొండ తనకు 1600 రూపాయిలు, 13 వ తారీఖున ఇవ్వలేదని, 25వ తారీఖున ఇచ్చేడని, ఆ రోజే, అతని ఖాతాలో ఆ సొమ్ము జమ చేసేనని, జవాబు ఇచ్చి ఉంటే, బ్యాంకు అతనిని ఉద్యోగం నుండి తొలగించ గలిగి ఉండేదా? తను ఇచ్చిన జవాబు వలన, తన ఉద్యోగమే పోవచ్చని యూనియన్ లీడరు ద్వారా తెలిసినా, నిజాన్ని దాచ లేదు. అది అతని నిజాయితీని నిరూపిస్తుందని, నా అభిప్రాయం సర్. తమరు అంగీకరిస్తారనుకొంటాను.” అని నరేష్, ఆర్.ఎమ్. గారికి కన్విన్సింగుగా చెప్పేడు.
అవునన్నట్టు, ఆర్.ఎమ్. గారు తల ఊపడంతో, నరేష్ మరో అడుగు ముందుకు వేసేడు.
“సార్, ఈ కేసులో నాకు నమ్మక ద్రోహం కనిపించడం లేదు. సింహాద్రి నమ్మక ద్రోహే అయి ఉంటే, అప్పలకొండ ఇచ్చిన 1600 హరించేసే వాడు. 25 న ఆ డబ్బు జమ చెయ్యకపోయి ఉండేవాడు.”
ఆర్.ఎమ్. గారి తల మరోమారు ఊగింది, అవునన్నట్లు.
నరేష్ మరో అడుగు ముందుకు వేసేడు.
“సార్, సింహాద్రికి ఉద్యోగం తీసేయడమే జరిగితే, ఆ విషయం తెలిసినవాళ్ళందరూ, నిజం చెప్పి, సింహాద్రి బ్యాంకు ఉద్యోగం పోగొట్టుకున్నాడని, అందుచేత నిజం ఎప్పుడూ చెప్పకూడదనే అభిప్రాయం ఏర్పడడానికి అవకాశము ఉందని, నా అభిప్రాయం.”
“సరే, ఇప్పుడు ఏమిటి చేద్దాం.?” ఆర్.ఎమ్. గారు తెలియగోరేరు.
“సింహాద్రితో మీరొకమారు మాట్లాడండి సార్. జవాబు మార్చుకొంటాడేమో అడిగిచూడండి సర్,”, వినయంగా తన అభిప్రాయం చెప్పేడు, నరేష్.
“దేనికి?” ప్రయోజనం ఏమిటి, అన్నట్లు ముఖం పెట్టి అడిగేరు, ఆర్.ఎమ్.
“అతని నిజాయితీకి ఏసిడ్ టెస్ట్ సర్.”
ఆర్.ఎమ్. గారు ఏమనుకున్నారో, “Call him.” అన్నారు.
“మీకెప్పుడు వీలవుతుంది సార్.”
“రేపు మధ్యాహ్నం 3 గంటలు.” అని చెప్పి, తల దించుకొని, తన పనిలో నిమగ్నమయ్యేరు ఆర్.ఎమ్. గారు.
నరేష్ నిష్క్రమించేడు.
మరునాడు, మధాహ్నం మూడు గంటలకు ఆర్. ఎమ్. గారిని కలియాలని, బ్రాంచ్ మేనేజరు సింహాద్రికి తెలియబరచేరు.
ఆ రాత్రి సింహాద్రి, సీతాలుతో ఆ సంగతి చెప్పి, ఆ మర్నాడే తనకి బ్యాంకులో ఆఖరి రోజేమో, అన్నాడు. గోడ మీద వ్రేలాడుతున్న, ఆంజనేయుని ఫోటోకి నమస్కరిస్తూ, “ఆ సామి అన్నాయం సేయడు.” అని ధైర్యం చెప్పింది సీతాలు.
మర్నాడు మద్యాహ్నం 3 గంటలు. వినయంగా నమస్కరిస్తూ, సింహాద్రి ఆర్.ఎమ్. గారి ఎదురుగా నిలబడ్డాడు. నరేష్ ఫైలు పట్టుకొని ఆర్.ఎమ్. గారికి దగ్గరగా నిలబడి ఉన్నాడు.
“సార్” అని ఆర్.ఎమ్. గారి వేపు చూసేడు, నరేష్.
“యు స్టార్ట్.” అన్నారు, ఆర్.ఎమ్.
“సింహాద్రి, సార్ నీ జవాబు చూసేరు. దాని మూలాన్న నీ ఉద్యోగం పోయే అవకాశముంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవలని దృష్టిలో ఉంచుకొని, నీ జవాబులో మార్పులు చేసుకొనే అవకాశం, సార్ నీకు ఇస్తారు.నీ జవాబు మార్చుకో.” అని, సింహాద్రి ఇచ్చిన జవాబును, వాడికి అందివ్వబోయేడు, నరేష్.
“సార్, నా ఉద్దోగం పోతాదని, నిజానికి తారు పుయ్యలేను సార్. నా పిల్లలికి ఎప్పుడూ సెప్తూంటా. అబద్దాలు ఎప్పుడూ సెప్పకండి, అని. ఈ సంగతి తెలిత్తే, ఆల్లకి మొహం ఎట్టా సూపిత్తా సార్. నిజాన్ని నిజం లాగే ఉన్నీయండి సార్.” వినయంగా నమస్కరిస్తూ, తన జవాబు, నరేష్ నుండి అందుకొనే ప్రయత్నం చెయ్యలేదు.
ఆర్.ఎమ్. గారు ఆశ్చర్య పోయేరు. స్వయంగా రంగంలోకి దిగేరు.
“సింహాద్రీ, నీ నిజాయితీని మెచ్చుకొంటున్నాను. ఈ విషయంలో బ్యాంకు రూల్స్ ప్రకారం మూడు శిక్షలున్నాయి. ఒకటి, నిన్ను ఉద్యోగం నుండి తొలగించగలదు. రెండు, నీకు రెండు ఇంక్రిమెంట్లు ఆపగలదు, మూడవది, ఒక హెచ్చరిక ఇవ్వగలదు. నువ్వు ఏది కోరితే అదే నీకు ఖరారు చేస్తా.” సింహాద్రి నిజాయితీని మెచ్చుకొంటూ, ఆర్. ఎమ్. గారు, చేసిన ఏసిడ్ టెస్టు.
ఈ మారు ఆశ్చర్య పోవడం నరేష్ వంతయింది.
సింహాద్రి వినయంగా విన్నవించుకున్నాడు. “సార్, తమరు నా మీద సూపిన దయకు కోటి దండాలు, సార్.” కొన్ని క్షణాలాగి,
“సార్, పిల్లలోడిని, సేసేతులా ఉద్యోగం తీసేసుకోలేను. సార్.”
మళ్ళీక్రొద్ది క్షణాలాగి, “ఒక ఆర్ణింగు ఇచ్చి ఒదిలేడం సాలదేమో సార్. అప్పో సప్పో సేసి, ఆ మరుసటి రోజే అప్పలకొండ ఖాతాలో 1600 జమ సేసి ఉండలిసింది సార్. అతగాడికి వడ్డీ నట్టం నేక పోయేది. తప్పే అయింది సార్. తమరు దయజేసి, నావి రెండు ఇంక్రిమెంట్లు ఆపీయండి, సార్.”
ఆర్.ఎమ్. గారి ఆశ్చర్యానికి అంతు లేదు.
‘అప్పలకొండకి, బ్యాంకు రూల్స్ ప్రకారం వడ్డీ నష్టం రాదని తెలియబరచండి. Complaint disposed.’ అని, సింహాద్రి ఫైలులో రాసి, ఆర్.ఎం. గారు, సింహాద్రినుద్దేశించి, “ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండు.” అని హితబోధ చేసేరు.
గంగిరెద్దులాగా బుర్ర ఊపి, ఆర్.ఎమ్. గారికి, వంగి వంగి నమస్కరిస్తూ, సింహాద్రి నిష్క్రమించేడు.
ఒక ఉద్యోగికి, న్యాయం చేయగలిగేనని సంతోషిస్తూ, నరేష్ ఫైలు పట్టుకొని, తన సీటుకు నిష్క్రమించేడు.

******************

1 thought on “సత్యమేవ జయతే

Leave a Reply to మాలిక పత్రిక ఏప్రిల్ 2021 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *