May 25, 2024

తామసి – 6

 

రచన: మాలతి దేచిరాజు

 

ఇంట్లో నసీమా,   అత్తగారు మాత్రమే ఉన్నారు. మామగారు తన కూతుర్ని చూడటానికి బందర్ వెళ్ళాడు.అత్తగారు భోంచేసి పడుకుంది ..నసీమా “మైదానం ” చదువుతోంది.

జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో గాని ఇలా ఇంత తీరిక దొరకదు తనకి..ఇరవై రోజుల నుంచి చదువుతుంటే ఇప్పటికి ..క్లైమాక్స్ దగ్గరకొచ్చింది..”నా చేతి వేళ్ళు మీరా జుట్టు లో చొచ్చుకుపోయి ఉన్నాయి..” అని చదివింది

టక్ …టక్..టక్ …అని తలుపు తడుతున్న శబ్దం.

లేచి వెళ్లి తలుపు తీసింది ..తీయగానే లోపలికి వచ్చాడు రసూల్ వదినని పట్టించుకోకుండా…కాలేజ్ నుంచి ఉన్నపళంగా ఎందుకోచ్చాడు ..అనుకుంది .

ఒంట్లో బాలేదేమో..తనకు తనే సమాధానం ఇచ్చుకుంది.

తలుపేసి వచ్చి మళ్ళీ నవల చదువుకుంటోంది తను.

“భాబీ.. జరా నారియల్ కా తేల్ దియో..(వదినా కాస్త కొబ్బరి నూనె ఇవ్వవా)”అడిగాడు.

పుస్తకం పక్కన పెట్టి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది తను.నూనే తీసుకురావడానికి..

ఆమె లోపలికి వెళ్ళగానే నిద్రపోతున్న తల్లి వైపు చూసాడు రసూల్ . వింతగా ఉందా చూపు..

అలమారలో ఉన్న నూనే తీసుకుని తిరిగేసరికి గుమ్మం దగ్గర తలుపేసి నిలబడి ఉన్నాడతను.

గత కొంత కాలంగా తను స్నానం చేస్తున్నప్పుడు ,  చీర మార్చుకుంటున్నప్పుడు ఎవరో తనని గమనిస్తున్నట్టు అనిపించేది. అయితే అది భ్రమ కాదు వాస్తవం అని ఇప్పడే తెలిసింది ఆమెకి.

అడుగులో అడుగు వేస్తూ ముందుకొస్తున్న రసూల్ ని చూసి నూనే సీసా గట్టిగా ఒత్తుకుని పట్టుకుంది కంగారు పడుతూ…

“క్యావ్ రసూల్ ..దర్వాజా కైకు బంద్ కరే ..(ఏంటి రసూల్ ..తలుపు ఎందుకు మూసావ్)”

బదులు చెప్పకుండా ముందు కొస్తున్నాడతను..ఆమెలో భీతి కలిగింది.దాదాపు దగ్గరకొచ్చాడు.ఆమె కళ్ళు పెద్దవి చేసింది..ఒక్కసారిగా కాళ్ళ మీద పడ్డాడు.గుండె మీద బరువు దిగినట్టు అనిపించింది ఆమెకి..ఊపిరి పీల్చుకుని

“ఏమైంది రసూల్ ..”అడిగింది ఉర్దూలో విషయం చెప్పాడతను.. మరిది పైన జాలి కలిగింది ఆమెకి. బీరువా తెరిచి తన నగలు ఇచ్చింది. మనస్పూర్తిగా దండం పెట్టి కదిలాడతను.

“అనవసరంగా అపార్ధం చేసుకున్నానే..ఇంకా నయం అరిచి గోల చేయలేదు నేను,   హవ్వా పరువు పోయేది..”అనుకుని వెంటనే ఏదో స్పృశించింది తనకి..”ఇంతకీ నన్నెవరో గమనిస్తుండడం నిజామా..భ్రమ..?” భ్రమే అని తను ఆ క్షణం నమ్మినా.. కాదని స్పష్టం అయ్యే సమయం ఆసన్నమైంది.

***********************

 

పండిట్ జవహర్ లాల్ నెహ్రు బస్ స్టేషన్ ..బస్సు దిగి బయటకి వచ్చాడు గౌతమ్…ఆటో కోసం చూసాడు.

“ఆటో “పిలిచాడు..రయ్యిమని వచ్చాడు ఆటో వాడు.

“ఎక్కడికెళ్ళాలి సార్..” అడిగాడతను

“గుణదల బుడమీరు కట్టకెళ్ళాలి ”

“150 ..ఇవ్వండి ”

“100 ..ఇస్తాను ”

“120 ..ఇవ్వండి ,  ఎక్కండి ..”అని కిక్ రాడ్ సర్ర్ అని లేపాడు ఆటో స్టార్ట్ అయ్యింది.

గౌతమ్ ఆటో ఎక్కాడు ..ఆటో కదిలింది.

పెరటి గుమ్మంలో ఉన్న బాత్ రూంలో నసీమా స్నానం చేస్తున్న చప్పుడు.. తలుపు బయట మళ్ళీ అవే కాళ్ళు.. టక్కున తలుపు తీసింది తను..ఎదురుగా ఉన్న అతన్ని చూసి నిర్ఘాంతపోయింది..ఈసారి ఎవరో కనిపెడదామని తను స్నానం చేస్తున్నట్టు నీళ్ళు పారబోస్తూ ఉంది. అది తెలియక తొంగి చూడటానికి పూనుకున్నాడు ఆ మనిషి. అతను….ఆమె మామగారు…ముందు ఆమెకి నమ్మబుద్ధి కాలేదు తరువాత సిగ్గేసింది ,  ఆ తరువాత బాధ కలిగింది,   చివరికి మమగారిపై అసహ్యం వేసింది….థు..అని మొహం మీద ఊసి వెళ్ళిపోయింది తను కన్నీళ్లు పెట్టుకుని.తల దించుకుని ఉమ్ము తుడుచుకున్నాడు ఆ పెద్ద మనిషి.

తన గదిలో కూర్చుని ఏడవ సాగింది..అత్తమామలతో ఉండకుండా వేరే కాపురాలు పెట్టే ఆడవాళ్ళను చూసి అందరిలా తనూ బుగ్గ నొక్కుకునేది. కానీ ఇలాంటి మామలు ఉన్న ఇంట్లో ఏ ఆడపిల్ల కాపురం చేయగలదు..తనకీ ఓ కూతురుంది అనే ఇంగిత జ్ఞానం లేదు ఆ పెద్ద మనిషికి. అయిదు పూటల నమాజులెందుకు,   సభ్యతా సంస్కారం లేనప్పుడు. కనీసం వావీ,   వరసలు కూడా లేని మనిషి నమాజుని.. అసలు అల్లాహ్ అంగీకరిస్తాడా.

పెద్దవాళ్ళు ,  నీతులు చెప్పేవాళ్ళు …ఛ…చెప్పేవాటికి,   చేసేవాటికి పొంతన ఉండదు అన్న సంగతి ఆమెకి బాగా అర్ధమైంది ఆ రోజు.

ఆటో నసీమా ఇంటి ముందుకొచ్చి ఆగింది..గౌతమ్ ఆటో దిగాడు.డబ్బులిచ్చి గేటు తీసుకుని వస్తున్నాడు.గుమ్మం దాకా సమీపించగానే

“ఎవరు కావలి “అడిగాడు వరండాలో కూర్చుని ఉన్న మామగారు.

“నసీమా…..”

“నువ్వెవరూ..” ప్రశ్నించాడు.

“తన ఫ్రెండ్ ని ..టెన్త్ వరకు కలిసి చదువుకున్నాం “చెప్పాడు..

ఇంతలో తనే బయటకి వచ్చింది..గౌతమ్ ని చూడగానే ఆమె కళ్ళు వెలిగిపోయాయి..

చుట్టం చూపుగా వచ్చే చిరునవ్వు కూడా ఉన్నట్టుండి ఊడిపడింది పెదాల పైన

“గౌతమ్…రా……రా…” స్వాగతం పలికింది ప్రేమతో..

అతను అప్పటికే ఆనందపు డోలికలో తేలిపోతున్నాడు..ఆమె రూపం,  ఆమె నవ్వు ,  ఆమె కదలిక ఇవి తప్ప తన కళ్ళ ముందు మిగితా ప్రంపంచం లేదు..

“గౌతమ్..” పిలిచింది ..తను తేరుకుని

“ఎలా ఉన్నావ్ ..”

“బావున్నా ”

“రా..లోపలికి ..” అంది.ఇద్దరూ కదిలారు.వరండాలో కూర్చున్న మామగారిని పరిచయం చేయకపోవడం తనకేం ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే నసీమా కళ్ళ ముందు ఉంటే తనకేం పట్టదు మరి.

సోఫాలో కూర్చున్న గౌతమ్ కి టీ తెచ్చి ఇచ్చింది. అతను అందుకుని తాగుతున్నాడు.

“కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు కదా నన్ను..” అన్నాడు.

“వచ్చి పిలిచేంత అవకాశమే ఉంటే ..ఇదే టీ నీకు మరోలా ఇచ్చుండే దాన్ని..”

మనసులో అనుకుంది..పైకి అనలేదు,   అనదు కూడా..

“నువ్వు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నావు నీ నెంబర్ అడ్రెస్ ఏమీ తెలీదు ..పోయినసారి వచ్చినప్పుడు నెంబర్ అడిగే లోపే నువ్వు వెళ్లిపోయావ్..అప్పుడు వెళ్ళిన వాడివి ఇదిగో ఇప్పుడు ఇలా..”నవ్వుతూ అంది.

“బానే ఉన్నావా..” గుండె లోతుల్లో దాగిన సముద్రమంత ప్రేమ గొంతులో మధనం చెంది పెదాలపై నుంచి అమృత ధారలాగా వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఆమెకి ఆ కుశల వాక్కు.

తెచ్చిపెట్టుకున్న నవ్వోటి నవ్వి …లోపలికెళ్ళిపోయింది తను…ఆశ్చర్యం ,  అనుమానం రెండూ ఒకేసారి కలిగాయి అతనికి.

దుఃఖం ..ఎంత దుఃఖం .. కన్నీళ్లు రావాడానికి కూడా భయపడేంత దుఃఖం. దేహాన్ని కత్తులతో కోసినా తక్కువే అనిపించేంత దుఃఖం.మనసుని సమాధి చేసి శవంలా బ్రతుకున్న తనని చూసుకుని తనే ఓర్వలేననంత దుఃఖం.

పదినెలలు మోసి..పురిటి నొప్పుల్ని భరించి కన్న బిడ్డ… తనని కాకుండా ఇంకెవరినో అమ్మా అని పిలిస్తే తట్టుకోలేక తల్లి పడేంత దుఃఖం..ఎందుకంత దుఃఖం…ప్రేమ ఎప్పటికప్పుడు బయటకి వెళ్లిపోవాలి,   లేదంటే మిగిలేది నొప్పి,  బాధ,  దుఃఖం.. అంతే..!కళ్ళు తుడుచుకుని మొహం కడుక్కుని వచ్చింది తను…

“సారి…కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే మొహం కడుక్కోడానికి వెళ్ళా..”

కుదుట పడ్డాడు తను..ఒక్క అబద్ధం ఎంత ఉపసమనం కలిగిస్తుందో మనిషికి.కానీ నిజం అలా కాదు..మనిషిని మానసికంగా కృంగదీస్తుంది..నిలువునా దహిస్తుంది..వెలుగులో నుంచి చీకటిలోకి అట్నుంచి అటు శూన్యంలోకి నెట్టేస్తుంది..కారణం…అబద్ధం నచ్చేలా ఉంటుంది,   నిజం నమ్మేలా ఉంటుంది కాబట్టి.

“నేను బయల్దేరుతాను..”

“అదేంటి …మొదటిసారి ఇంటికొచ్చావ్ భోంచేసి వెళ్ళు” అనలేదు తను..

ఫార్మాలిటీగా ప్రవర్తించేది ప్రేమ అవదు..ప్రేమికుల మధ్య ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండవు.

ఉండకూడదు.

“అలాగే..” అంది తను.

లేచి నవ్వుతూ కదిలాడు అతను.అంతే గాని కనీసం మొదటి సారి ఇంటికొస్తే భోజనం కూడా చేయమనలేదేంటి అని అనుకోలేదు…ఇద్దరి వేవ్ లెంత్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది.

“నెంబర్..” అడిగాడు తను..

“ఇవ్వు ” అంది ..ఇచ్చి కదిలాడు..గేటు దాకా వెళ్లి వెనక్కి తిరిగి చూసాడు..అతను తిరిగి ఉండకపోతే బావుండేది అనిపించింది అతనికి..నవ్వుతున్న ఆమె పెదాలపై పడుతున్న కంటితడి అతని కంటపడేది కాదు..

వెళ్ళిపోయాడు గౌతమ్…ఆమె కన్నీళ్ళని తన కళ్ళలో నింపుకుని..అదే తన ప్రేమనుకుని.

మాటలతో చెప్పే ప్రేమ కన్నా కళ్ళతో,   కన్నీళ్ళతో చెప్పే ప్రేమకి బరువెక్కువ..ఎందుకంటే “మాట కంటే చూపుకి వేగం ఎక్కువ …”

“వాహ్ ..క్యా బాత్ హే..” ఉత్సుక్కతగా అన్నాడు ఇజాక్…

తనలో ఎక్సైట్మెంట్ ,   ఇంట్రెస్ట్ పెరగసాగాయి అని తనకి అర్ధం అవుతోంది.అదే విధంగా నసీమా పై…ముందు గౌరవం తర్వాత అభిమానం క్రమేపి ఇష్టం కలిగి తనని ఎక్కడ దాకా తీసుకెళతాయో పాపం అతనికి తెలీదు..పేజీ తిప్పాడు..

************

మామగారు చేసిన పని నుంచి పూర్తిగా తేరుకోకుండానే నసీమా కి మరో విషమ పరిస్థితి  ఎదురు కాబోతుంది.కాకపోతే ఈసారి అది అతని భర్త రూపంలో రానుంది.

ఖుషీ బార్ అండ్ రెస్టారెంట్…జనాలతో కిక్కిరిసిపోయుంది..కౌంటర్ దగ్గర గందరగోళం..లోపల ఒక లైవ్ న్యూస్ చానల్ యే ఉన్నట్టనిపిస్తుంది..చూస్తుంటే..దేశ రాజకీయాలు,  సినిమాలు,  ఇంటింటి రామాయణాలు..ఇలా ఎటు చూసినా ఏదో ఒక చర్చలో ఉన్నారు మందు బాబులు.కొందరిదైతే దేహం ఈ లోకంలో ఉన్నా మనసు మాత్రం అంతరిక్షంలో తిరుగుతున్న ధోరణి..ఈ వింతలన్నీ దాటుకుని కార్నర్ లో ఖాళీగా ఉన్న చోటుకి చేరుకొని కూర్చున్నారు..నసీమా భర్త నాజర్.. ఇంకా అతని స్నేహితుడు జాఫర్ మరియు జాఫర్ తీసుకు వచ్చిన మరొకతను గోవిందం.టేబుల్ దగ్గర కూర్చుని ఆర్డర్ ఇచ్చారు..

“ఒక సిగ్నేచర్ ఫుల్..మూడు గ్లాసులు,   చికెన్ సిక్స్టి ఫై రెండు ప్లేట్లు..” టకటకా ఆర్డర్ చెప్పాడు జాఫర్ వెయిటర్ కి.

అతను ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు..

“భాయ్! విషయమేంటంటే..”ఏం చెప్తాడా అని ఆత్రంగా అతని వైపు చూస్తున్నాడు నాజర్.

“సార్ పెద్ద రియలెస్టేట్…”చెప్పగానే అతని వైపు ఓ లుక్ ఇచ్చాడు.

“ఇబ్రహీంపట్నంలో ఒక వెంచర్ ఉంది..ఇప్పుడు గాని మనం కొని పెట్టుకుంటే,  నాలుగైదు సంవత్సరాల్లో బూమ్ పెరిగి మనం కొన్న రేట్ కి మూడొంతులు రెట్టింపు రేట్ పలుకుతుంది..నేను కూడా పార్టనర్ గా ఉంటా నీతో..ఒక మూడు సెంట్లు కొందాం..ఏమంటావ్..?” చెప్పి ఆగాడతను..అతని సమాధానం కోసం ఎదురు చుస్తున్నాట్టుగా..

ఆలోచనలో పడ్డాడు నాజర్..కొన్ని ఘడియలు..

“ఇంతకీ..సెంట్ ఏ మాత్రం ఉంటుంది మరి.?” ప్రశ్నించాడు.

“సెంట్ లక్షన్నర భయ్యా..మూడు సెంట్లంటే నాలుగున్నర లక్షలు..మనకి కాబట్టి సార్ నాలుగు లక్షలకే ఇప్పిస్తారు.”

“నాలుగు లక్షలా…?” నోరెళ్ళ బెట్టాడు.

“కంగారు కైకు భాయ్..నేను రెండు ,  నువ్వు రెండు..రేపు అమ్మినా ఫిఫ్టీ ,  ఫిఫ్టీ షేర్..”

కొంత ఆశ కలిగింది అతనికి..

“సుమారు ఎంత పెరగొచ్చు…” ఆత్రంగా అడిగాడు..ఇంతలో వెయిటర్ ఆర్డర్ తెచ్చి అందరికీ సర్వ్ చేస్తున్నాడు..

“ఒక పది నుంచి పదిహేను దాకా పెరగొచ్చు ..గవర్నమెంట్ మారితే ఇంకా పెరగచ్చు..” ఆశ బలపడిందతనికి.

“సరే…కానీ..డబ్బు ఒక వారంలో సర్దుబాటు అవుతుంది మరి..”

“పర్లేదు భాయ్…దాందేముంది..వారం తర్వాతే కలుద్దాం..” చెప్పాడు జాఫర్..గోవిందం ప్రేక్షక పాత్ర వహించాడు.

ముగ్గురూ గ్లాస్లెత్తి చీర్స్ అన్నారు..తాగడం మొదలెట్టారు..

దీని ప్రభావం నసీమా మీద ఎలా పడబోతుందో ఆ దేవుడికే తెలియాలి…

తన గదిలో బెడ్ మీద కూర్చుని పూలు అల్లుకుంటోంది నసీమా..ఇంతలో ఇంటికి వచ్చాడు నాజర్. సరాసరి బెడ్ రూమ్ వైపు వెళ్ళిన అతన్ని చూసి అతని తండ్రి భ్రుకటి ముడిపడింది.

“అగె..తేరే జేవరా దే ..(ఏవే ..నీ నగలివ్వు )” అడిగాడు ఏవో కాగితాలు చూస్తూ.

గుండెలో రాయి పడ్డట్టయింది నసీమాకి ..టక్కున లేచి నిలుచుంది.దారం ముడి జారి పువ్వు నేలకొరిగింది..తడబాటు మొదలైంది.నీళ్ళు నములుతున్న ఆమెని చూసి.

“పత్థర్ సకా ఖడీ క్యావ్ గే …దే జల్దీ..(రాయిలా నిలబడ్డావెంటే ..ఇవ్వు త్వరగా.)”రెట్టించి అడిగాడు..

“ఓ ..(అది..)..ఓ..(అది..)” నాన్చుతోంది.

“ఓ..ఓ..క్యావ్ గే ..(అది..అది..ఏంటే..)” గదమాయించాడు.ఇక నోరు విప్పక తప్పలేదు..

“మేరే ఫ్రెండ్ కో జరూత్ హే కతో దియుమే ..(నా ఫ్రెండ్ కి అవసరం ఉంటే ఇచ్చాను)”ధైర్యం చేసి అబద్ధం చెప్పింది.

ఫాట్…చెంప చెళ్ళు మంది …జుట్టు పట్టుకుని

“ఛినాల్కి….ఘర్మేకే మ్హాలా గాం వాలేకో హవాలా కరి..(లంజ ముండ ..ఇంట్లో వస్తువులు ఊళ్ళో వాళ్ళకి దారదత్తం చేసావా )” అని వీపు మీద చరిచాడు.మళ్ళి చరిచాడు..ఇంకో దెబ్బ….ఇంకో దెబ్బ..ఆవేశంగా బెల్ట్ తీసాడు వాతలు తెలేలాగా కొడుతున్నాడు..

“తేరా బా…కా మాహ్ల్ క్యాతో హై సమస్తి హే రీ దరిందర్ రాండ్..(నీ బాబు గాడి సొమ్ము ఏమైనా ఉందనుకుంటున్నావే దరిద్రపు ముండ)” అతని తిట్లు,  ఆమె ఏడుపు విని హుతాహుటినా వచ్చారు మామగారు మరిదిలు..ఆపడానికి ప్రయత్నించారు..

అతను శివాలెత్తిపోతున్నాడు..ఎట్టకేలకు మరిదిలు అన్నని అదుపు చేసారు. మామగారు టీవీ సీరియల్ లాగా చూస్తున్నాడు.గోడకి ఆనుకుని కూర్చుంది..మోకాళ్ళపై తల పెట్టి ఏడుస్తూ నసీమా.

“ఛోడో రే ..ఆజ్ కతర్దాల్తం రాండ్ కు (వదలండి రా ….ఈ రోజు నరికేస్తా ముండని )”

విడిపించికోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు..

“భాయ్ ఖడో క్యావ్వో.. భేజా ఖరాబ్ హూ ఆ ..(అన్నయ్య  ఆగండి ఏంటిది మతి గాని పోయిందా)” తమ్ముళ్ళ మాట.

మొత్తానికి శాంత పరిచారు అతన్ని..

“క్యాతో హై తో బాత్ కర్లేనా ,  గల్తి హే తో బోల్నా ,  సమ్జానా ..హాత్ చలాన క్యావ్ రే అఖల్ నేహే..బాయికో ఉప్పర్ హాత్ ఉఠానే..

(ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి ,  తప్పు ఉంటే చెప్పాలి ,  చర్చించాలి ..చెయ్యి ఎత్తడం ఏంట్రా బుద్ధి లేదా ..ఆడపిల్ల మీద చెయ్యి ఎత్తడానికి)

హితం పలికాడు మామగారు…నసీమాకి ఆయన తన వైపు మాట్లాడటం కూడా నచ్చలేదు..

నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఆ గదిని ఆ భార్యాభర్తలని వదిలేసి కదిలారు..

రసూల్ వెళుతూ,  వెళుతూ కన్నీళ్లు పెట్టుకుని ఆమెకి చేతులు జోడించి వెళ్ళాడు ఆమెకి మాత్రమే కనబడేలా..

నొప్పిని తట్టుకుని ,  కళ్ళు తుడుచుకుని లేచింది తను కాసేపటికి..సరాసరి వంటింట్లోకి వెళ్ళిపోయింది..గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు అన్నట్టు..ఏం జరిగినా,   ఏమైనా ఆకలి తప్పదు కదా..వంట మొదలెట్టింది.

ఇప్పుడు ఆమె మనసులో భర్త పైన ద్వేషం కలగలేదు ,  మరిది పైన కోపం రాలేదు.. ఇది ఓ సందర్భానుసారం జరిగినది అంతే (సిట్యువేషన్ డిమాండ్ ) అనుకుంది.కొట్టింది పరాయివాడు కాదు కట్టుకున్న భర్త ..సాయం చేసిందీ పరాయివాళ్ళకి కాదు మరిదికి.

ఇది తన కుటుంబం కదా..! మరి ఇంకేంటి.ఏ సంసారం లోనూ ఎప్పుడూ ఆనందాలే ఉండవు కదా..!కోడలంటే సమయానికి వంట పని,   ఇంటి పని చేసి పెట్టేదే కాదు..ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సమర్ధవంతంగా ఎదరుకుని నెగ్గుకు రావాలి,

సంసారాన్ని నెట్టుకు రావాలి..అంతే గాని రెండు దేబ్బలేసి నాలుగు మాటలు తిట్టగానే అత్తింటిని వదిలి పుట్టింటికి వెళిపోతే సంసారం అనే పదానికి అర్ధం నిఘంటువులో ఉన్న అక్షరాల రూపంలోనే ఉండిపోతుంది తప్ప దాని పరమార్ధం ఎప్పటికీ తెలియదు.

అలాగని మరీ బానిసలాగా బ్రతకాల్సిన పని లేదు..కానీ చిన్న చిన్న కారణాలు చూపించి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు..

ఇప్పుడు నేను “నాకేం తెలీదు మీ తమ్ముడు అడిగితే ఇచ్చాను అని చెప్పి తప్పించుకోవచ్చు.. కానీ నా మరిది నన్ను నమ్మి తన కష్టాన్ని.. బయటి నుంచి వచ్చిన నాతో చెప్పుకున్నప్పుడు,   నేనా గౌరవం నిలబెట్టుకోవాలి కదా..అలా కాకుండా మీరూ ,   మీరూ  ఏమైనా సావండి అని అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి.. తలా ఓ మాట అనుకుని విడిపోయే దాకా వస్తే..? ఎంత పరువు తక్కువ..”

ఆ కష్టం ,  ఆ నొప్పి ,  ఆ బాధ కాసేపు నేనే అనుభవించడం వల్ల ఆయన కోపమూ తగ్గింది..

గండమూ గడిచింది.

సుయ్యీ…..మంది కుక్కర్ విజిల్ …పరధ్యానంగా ఉన్న తను తేరుకుని స్టవ్ ఆఫ్ చేసింది.

వంట పూర్తయింది..అందరూ భోజనాలు చేస్తున్నారు..అత్తగారికి నలతగా ఉండి..ఆవిడ భోజనం కూడా ఆలస్యమైంది..నసీమా అత్తగారికి అన్నం తినిపిస్తుంది..చేతిపై వాతలు చూసింది అత్తగారు…కన్నీళ్లు పెట్టుకుంది..నలభై ఏళ్ళు సంసార జీవితం చూసిందావిడ.. ఆ మాత్రం అర్ధం చేసుకోలేదా కోడలి మనసు…!

భోజనాలు ముగిసాయి..ఆ పూట తనకి అన్నం సహించలేదు ..మజ్జిగ తాగి పడుకుంది.

ఇంకా నిద్రపోలేదు…

ఆమె నడుం పై ఏదో స్పర్శ ..అతని చెయ్యి..నెమ్మదిగా నడుం నుంచి ఉదరం వైపుకి సాగిందా చెయ్యి ,  అతని కాలు ఆమె కాలిని మెలి వేసింది..క్షణాల్లో ఆమె అతనికి అభిముఖంగా తిరిగింది..అర క్షణంలో అతను ఆమె పై చేరుకున్నాడు..అప్పుడు వచ్చాయి ఆమెకి అసలైన కన్నీళ్లు.. హృదయ కొలిమి లోంచి వేదన సెగలు ఆవిరై కళ్ళ నుంచి వెచ్చగా కురుస్తున్నాయి. మనసుకి గాయమైతే వచ్చే కన్నీళ్ళు మెదడులో తర్కమనే విత్తనాలని మొలకెత్తిస్తాయి..”ఏదో కోపం లో కొట్టాను,  ఏమనుకోకు లాంటి మాటలు కూడా అవసరం లేదు..కనీసం తన పని జరగడం కోసమైనా ప్రేమగా పలకరించి ఉంటే సంతోషించేదాన్ని”.

కానీ…అతనికి కోపం వచ్చినా ,  తాపం వచ్చినా తన ఒంటిపై తీర్చుకోడానికే తనున్నట్టున్న ఈ స్థితికి తను తల్లడిల్లింది. కొన్ని గంటల క్రితం వంటింట్లో తనేం ఆలోచించింది ..ఇప్పుడు ఏం అనుభవిస్తుంది…”మనా అని ఎంత అనుకున్నా

SOMEBODY WILL DON’T DESRVE IT.!

“ప్చ్.. యా ఇట్స్ ట్రూ …ఐ పిటి యు నసీమా యట్ ద సేం టైం ఐ రెస్పెక్ట్ యు మోర్ ”

“ఇలాంటి గొప్ప గొప్ప క్యారెక్టర్లు నిజ జీవితంలో తారసపడవెందుకో” అనుకున్నాడు ఇంగ్లీష్ లో..తిప్పిన పేజీ చూస్తూ…

***********

 

బుధవారం సంత నుంచి కూరగాయలు తీసుకొని ఇంటికేల్తోంది నసీమా.నడుస్తూ ఉన్న తను ఒక్కసారిగా ఆగింది,   తను చూస్తుంది నిజమేనా! అని తన కళ్ళని తను నమ్మలేకపోయింది. రాంగోపాల్ థియేటర్ లోకి తన భర్త వేరే ఆవిడతో వెళుతున్నాడు..

ఎర్రగా,  అయిదున్నర అడుగులుంది ఆ అమ్మాయి,  వాళ్ళ చుట్టం కానే కాదు..ఎందుకంటే ఆ ముఖాన బొట్టు ఉంది..మరెవరు తను..తెలుసుకోవాలి..తనూ థియేటర్ వైపు కదిలింది. లోపలికెళ్ళి టికెట్ తీసుకుంది.

హాల్ లోపలికి ఎంటర్ అయ్యింది.ఆమెని ఎవరూ గుర్తు పట్టరు తను బుర్ఖా వేసుకునుంది.

సినిమా అప్పటికే మొదలైంది…తన భర్త ,  ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నారో వెతికింది..కనబడలేదు..సరాసరి వెళ్లి వెనక సీట్ మధ్య వరుసలో కూర్చుని వెతుకుతుంది.

ఊహు..కనిపించలేదు..సినిమా నడుస్తోంది..పాట…

ఇంటర్వెల్ బ్యాంగ్ కి లీడ్ స్టార్ట్ అయ్యింది..ఫైట్..ఇంకా వెతుకుతోంది తను..కనిపించలేదు వాళ్లు…తనకి ముందు వరసలో ఉన్న సీట్ కదులుతోంది కిర్…కిర్…కిర్..అని..

లేచి తను కూర్చున్న వరసలోనే ఎడమ వైపు కార్నర్ సీట్ కి వెళ్ళింది..

“స్ ….కొరక్కు…స్ స్ స్ ….ప్చ్…” సన్నగా వినిపిస్తున్నాయి.

“కొ….ర….క్కూ….” మత్తుగా వినిపించాయి…

“ఆ….” కుంచెం గట్టిగా వినిపించింది..కానీ సినిమాలో హీరో పంచ్ డైలాగ్ కి ఆడియన్స్ చెప్పట్ల మోత డామినేట్ చేసింది.. దగ్గరగా ఉన్నందున తనకి బానే వినిపించింది..

“మ్…….”దీర్ఘమైన నిస్శ్వాస.

“ప్చ్….ఎన్ని సార్లు చెప్పాను..” గోముగా అంది ..ఈ మాట ఎందుకు అన్నదో నసీమాకి అర్ధం అయ్యింది.. స్క్రీన్ పైన INTERMISSION అని పడింది..

“లెగు….ఇంటర్వెల్ అయ్యింది..” అనగానే.. అది విని గబగబా లేచి నక్కి నక్కి వచ్చి తన సీట్లో కూర్చుంది నసీమా..వాళ్ళూ లేచారు..అమ్మాయి సీట్లో కూర్చుంది జాకెట్ సర్దుకుంటూ.అతను బయటకి కదిలాడు…నసీమా వైపు చూసి..

“ఇదెవరు..థియేటర్ లో కూడా ముఖం పై బుర్ఖా కప్పుకుంది..”అని అనుకుంటూ వెళ్ళిపోయాడు..కాసేపటికి చేతిలో కూల్ డ్రింక్,  చిన్న సమోసాలతో వచ్చాడు..వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు…ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ సమోసా తింటూ ,  కూల్ డ్రింక్ తాగుతున్నారు..

ముఖంపై ఉన్న బుర్ఖా తడిసింది కన్నీళ్ళతో.. హృదయ విదారంగా ఏడుస్తోంది నసీమా.

ఇంతలా ఏడుస్తానని తనేప్పుడూ అనుకోలేదు…అంతలా ఏడవడం అదే అఖరుసారి అని కూడా ఊహించలేదు..ఏడుపు తగ్గింది ,  కోపం వస్తోంది. ఇద్దర్ని చంపేయాలన్నంత కసి..

సెకండ్ హాఫ్ సార్ట్ అయ్యింది …అక్కడా…ఇక్కడా..లేచి బయటకి వెళ్ళిపోయింది తను. బరువెక్కిన గుండెతో..తనపైన తనకి అంతులేని జాలి కలిగింది..భర్త పైన కోపం ఎంత వరకు కలిగిందో..అతను ఇంటికొస్తే గాని తెలియదు..

 

 

****************************

 

 

 

1 thought on “తామసి – 6

  1. కొన్ని జీవితాలు అంత దుర్బరంగానే ఉంటాయి నేటికి వాస్తవంగా ఇలాంటీ జీవీతాలున్నాయి హే భగవాన్ .కధావాస్తవానికి దగ్గరగానేవుంది. రచయిత్రికి
    అభినందనలు
    మోహనరావు మంత్రిప్రగడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *