May 26, 2024

అమ్మమ్మ – 25

రచన: గిరిజ పీసపాటి

అల్లుడు వైజాగ్ వెళ్ళాక, ఊరిలో ఉన్న బంధువుల ఇళ్ళకీ, నాగ స్నేహితురాళ్ళ ఇళ్ళకీ వెళ్ళడం, వాళ్ళతో కలిసి విందు భోజనాలు, సినిమాలతో రోజులు త్వరగా గడిచిపోసాగాయి.
నెలరోజుల తరువాత అల్లుడు తిరిగి వచ్చి “వారం రోజులు సెలవు పెట్టాననీ, మీరు చెప్పిన బంధువుల ఇళ్ళకు వెళ్ళి, అటునుండి వైజాగ్ వెళిపోతామని” చెప్పడంతో సరేనంది అమ్మమ్మ.
గుంటూరు, విజయవాడ, పొందూరు మొదలైన ఊర్లలో ఉన్న బంధువుల ఇళ్ళకు వెళ్ళి, అక్కడి దేవాలయాల సందర్శనం చేసుకుని, బోలెడన్ని సినిమాలు కూడా చూసి, తిరిగి వైజాగ్ వెళ్ళడానికి రైలు ఎక్కారు నాగ, అల్లుడు, పిల్లలు.
వాళ్ళకు రైల్వే స్టేషన్ లో వీడ్కోలు ఇస్తూ, వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ‘మళ్ళీ ఎప్పుడు చూస్తానో కదా!’ అనుకుంది బాధగా.
తను కూడా తిరిగి తెనాలి చేరుకుని, అన్ని రోజుల పాటు నాగ, పిల్లలతో సందడిగా, కళకళలాడుతూ ఉన్న ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయేసరికి భరించలేని బాధతో బరువుగా నిట్టూర్చింది.
తను కూడా ఇల్లు ఖాళీ చేసి, సామాను గోనె సంచులలో పాక్ చేసుకుని, అందరికీ వీడ్కోలు పలికి, తిరిగి హైదరాబాదు చేరుకుని, తన పనిలో పడిపోయింది . ఆ తరువాత మళ్ళీ తెనాలి వెళ్ళే అవసరం గాని, అవకాశం కాని కలగలేదు ఆవిడకి.
వియ్యంకుడు హైదరాబాదులో నాటకం ఆడడానికో, సన్మానం ఉందనో వస్తే ఆయనను కలిసి పిల్లల యోగక్షేమాలు కనుక్కునేది. ఉత్తర ప్రత్యుత్తరాలు యధావిధిగా సాగుతూనే ఉన్నాయి.
ప్రతీ సంవత్సరం పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వగానే వైజాగ్ వెళ్ళి, పదిహేను రోజులు వాళ్ళతో గడిపి, తిరిగి హైదరాబాదు వచ్చేసేది. ఆ సమయానికి గిరిజను కూడా రాముడువలస నుండి వైజాగ్ తీసుకొచ్చేది నాగ.
అలా వైజాగ్ వెళ్ళిన ప్రతీసారీ తను తయారుచేసిన చెక్కలు, జంతికలు, మైసూరు పాక్, లాడూలు వంటి తినుబండారాలతో పాటు ఒక చక్కరకేళీ అరటిపళ్ళ గెల, ఒక తాటాకు బుట్ట నిండా పూలు పట్టుకెళ్ళేది.
అమ్మమ్మ వస్తోందంటే ఎంత సంతోషంగా ఉండేదో అంతగా భయపడిపోయేవారు ఆడపిల్లలు వసంత, గిరిజ. అందుకు కారణం ఆవిడ వేసే పూలజడలు. రకరకాల పూల జడలు వెయ్యడంలో నిష్ణాతురాలని ముందే చెప్పుకున్నాం కదా!
‘మరి భయం ఎందుకు? సరదాగా వేయించుకోక?’ అంటే మాత్రం సముచితమైన కారణమే ఉంది. ఆవిడ జడ గుడుతున్నంత సేపూ పిల్లలు శిలా విగ్రహాల్లా ఒకే పొజిషన్లో కూర్చోవాలి. పొరపాటున కొద్దిగా కదిలినా జడ కుడుతున్న సూదితో మెడ మీద కస్సున గుచ్చేది అమ్మమ్మ.
ఒకరికి పూల జడ పూర్తవ్వాలంటే కనీసం గంటన్నర సమయమైనా పట్టేది. అంతసేపు మెడ నిలపడం కష్టమై తెలియకుండానే కదిలేవారు. వసంత కొంచెం పరవాలేదు గానీ, గిరిజ అస్సలు మెడ నిలపలేకపోయేది. దాంతో వసంత కన్నా రెండు రెట్ల సూది పోట్లు తినేది గిరిజ.
ఇలా పూల జడలతో పాటు సూది పోట్లు కూడా బహుమతి గా దక్కుతుండడంతో ఆడపిల్లలిద్దరూ భయపడిపోయి “ఈరోజు వద్దు అమ్మమ్మా! రేపు వేయించుకుంటాం” అనేవారు. కానీ, అమ్మమ్మ వింటేగా “రేపటికి పూలు వాడిపోయి, రేకులు రాలిపోతాయి. నా తల్లులు కదూ! నా ముచ్చట తీర్చండే” అని బతిమాలేది.
ఆవిడ మనసు చొప్పించడం ఇష్టం లేక, సూదిపోట్లు తింటూనే పూల జడలు వేయించుకునేవారు ఆడపిల్లలిద్దరూ. నానికి మాత్రం ఈ ఇబ్బంది లేదు కనుక వాడికిష్టమైన అరటిపళ్ళ గెల, జాతికలు తింటూ… అక్కలిద్దరినీ ఏడిపించేవాడు.
అమ్మమ్మ తిరిగి హైదరాబాదు వెళ్ళగానే, అందరూ కలిసి మిగిలిన వేసవి సెలవులు గడపడానికి రాముడువలస వెళ్ళేవారు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. వసంత తొమ్మిదవ తరగతికి, గిరిజ ఏడవ తరగతికి, నాని ఐదవ తరగతికి వచ్చారు. గిరిజను కూడా వైజాగ్ తీసుకొచ్చి వసంత చదువుతున్న స్కూల్ లోనే జాయిన్ చేసారు.
ముగ్గురు పిల్లలూ తన కళ్ళముందు తిరుగుతుండడంతో ఆనందంగా ‘గిరిజను కూడా వైజాగ్ తీసుకొచ్చి, స్కూల్ లో జాయిన్ చేసామ’ని అమ్మమ్మకి ఉత్తరం రాసింది నాగ.
ఆ ఉత్తరం చదవగానే “చాలా సంతోషంగా ఉంది నాగేంద్రుడూ. నువ్వు నీ ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్నావు. నీ సంతోషమే నా సంతోషం’ అంటూ తిరిగి జవాబిచ్చింది.
నాగ వాళ్ళు అద్దెకు దిగిన ఇంటికి సమీపంలో రాముడువలస గ్రామానికి చెందిన వారే ఒక కుటుంబం నివసిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పోర్టు ట్రస్ట్ ఉద్యోగులే. ఆయన ఆఫీసులో పని చేస్తుండగా, ఆవిడ పోర్ట్ ప్రైమరీ స్కూలులో టీచర్ గా పనిచేసేది.
ఆవిడ బిఎ ఎంట్రన్స్ కి కట్టబోతూ పెదబాబుతో “అన్నయ్యా! నాగ చేత కూడా కట్టించొచ్చు కదా! ఇద్దరం కలిసి చదువుకుంటాం. ఏదైనా ప్రైవేటు స్కూల్ లో చేరితే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా నీ సంపాదనకు కాస్త తోడవుతుంది.”
“తరువాత టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. పిల్లలు కూడా పై చదువులకు వస్తున్నారు. ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా! ” అంది.
అది వినగానే నాగ “అమ్మో! నేను BA చదవడమా! ఎప్పుడో ఏడవ తరగతిలో వదిలేసిన చదువు. నా వల్ల కాదు” అంది. దానికావిడ “నువ్వు తెలివైనదానివే కాక, ఏక సంతాగ్రాహివి కూడా. ఒకసారి ఏది విన్నా టక్కున తిరిగి చెప్పేస్తావు. చాలా మంచి మార్కులతో పాసవుతావు. మీరు చెప్పండీ…” అంటూ భర్త వంక చూసింది.
ఆయన కూడా బలవంతం చెయ్యడం, నాగకు కూడా మనసులో చదువంటే ఇష్టం ఉండడంతో “ఆయన సరేనంటే చదువుతాను” అంది భర్తనుద్దేశించి.
వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు అన్న మాటకు కాస్త మెత్తబడినా “ముందు మా నాన్నకి చెప్పాలి. ఆయన సరేనంటే చదివిస్తాను. నాజీతం ఇంటి ఖర్చులకే సరిపోక ఇబ్బందిగా ఉంది. నాగ పరీక్ష ఫీజులకు, పుస్తకాలకు ఆయననే డబ్బు అడగాలి ” అన్నాడు పెదబాబు.
“సరే. ముందు అడిగి చూడు” అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. తండ్రకి విషయం తెలియజేస్తూ ఉత్తరం రాసాడు పెదబాబు. “నీ భార్యను నువ్వు చదివించుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, డబ్బు మాత్రం నేను సర్దలేను” అని నిక్కచ్చిగా ప్రత్తుత్తరం రాసారాయన.
అదే విషయాన్ని బంధువులైన భార్యాభర్తలకు తెలియజేసి, నాగను చదివించలేనని చెప్పాడు పెదబాబు. మామగారి దగ్గర నుండి వచ్చే సమాధానం ముందుగానే ఊహించిన నాగ మాత్రం పెద్దగా ఆశ పెట్టుకోలేదు.
కానీ ఆ భార్యాభర్తలు ఊరుకోలేదు. “తను డబ్బులు ఇవ్వనన్నారు గానీ, నాగ చదువుకోవడానికి అభ్యంతరం పెట్టలేదు కదా! ఒక పని చెయ్యు నాగా. మీ అమ్మగారికి ఉత్తరం రాసి డబ్బు పంపమని చెప్పు. ఒకవేళ ఆవిడ డబ్బు పంపితే నాగను చదివించడానికి నీకేం అభ్యంతరం లేదు కదా?” అని అడిగారు.
తనకేమీ అభ్యంతరం లేదన్నట్లు తలూపాడు పెదబాబు. “ఇంకేం నాగా. ఒకసారి మీ అమ్మగారికి విషయం తెలియపరుస్తూ ఉత్తరం రాయు. పాపం పెద్దావిడని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం బాధే. అయినా నీకోసం ఆవిడ తప్పకుండా పంపుతారు” అని చెప్పారు.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *