June 24, 2024

తామసి – 7

రచన: మాలతి దేచిరాజు

 

 

నసీమా ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది…

పోలీస్ లు గబగబా దిగి ఇంట్లోకి చొరబడ్డారు.

అత్తగారు యథావిధి… మామగారు కంగారు పడ్డాడు..

“రసూల్ మీ అబ్బాయేనా?” అడిగాడు ఎస్.ఐ.

“మా అబ్బాయే… ఏమైంది సార్?” తత్తరపడుతూ అడిగాడు. ఇంతలో నసీమా వచ్చింది, వంటింట్లోనుంచి.

“మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్స్ లో డబ్బులు పోగొట్టుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ ఒకతన్ని కత్తితో పొడిచాడు… ఇప్పుడతను హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్నాడు… మీ అబ్బాయి ఇంటికి వస్తే వెంటనే మాకు ఇన్ఫాం చెయ్యండి…” అని చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.

కలవరపడ్డాడు ఆయన. “వీడు బెట్టింగ్స్ ఆడటమేంటి? అంత డబ్బు వీడికెక్కడిది?”ఉర్దూలో అన్నాడు పైకి వినబడేటట్టు. నసీమా కళ్ళు పెద్దవైయ్యాయి. షాక్ అయినట్టు పెట్టింది మొహం.

షాక్ నుంచి తేరుకోడానికి కుక్కర్ విజిల్ సాయపడింది ఆమెకి. తేరుకుని వెళ్లి ముందు స్టవ్ ఆఫ్ చేసింది. గుండె నూట నాలుగు కొట్టుకుంటోంది తనకి. అసలు ఏం జరుగుతుంది తన జీవితం చుట్టూ? అంటే… ఆ రోజు నగలు తీసుకెళ్ళింది ఇందుకా? నమ్మశక్యంగా లేదు ఆమెకి. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్లకి, తన భర్త కి తెలిస్తే… అంతే.

అటు భర్త… ఇటు మరిది… ఒకరిది ఆత్మ ద్రోహం… ఒకరిది నమ్మక ద్రోహం… తనకే ఎందుకు ఇలా జరుగుతోంది అనిపించింది ఒక్కసారిగా… ఏ విషయం గురించి ఆలోచించాలి ఇప్పుడు? భర్త దా… మరిది దా… బాధ కలిగింది తనకి… కన్నీళ్లు కళ్ళలోకి చేరాయి గాని బయట పడలేదు… జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? మనుషుల వల్ల ఇంత బాధ కలుగుతుందా? ఛీఛీ!! మొదట బాధ, తర్వాత కోపం, తర్వాత అసహ్యం క్రమేపీ వైరాగ్యం… అటుపై వేదాంతం… ఇదే ఎక్కడైనా.. ఎవరికైనా!

రాత్రైంది… రసూల్ విషయం తండ్రి ఎవరికీ చెప్పలేదు. భోజనం చేసేటప్పుడు పెద్ద కొడుకు,

చిన్న కొడుకు కూడా అడగలేదు. ఏ సినిమాకో వెళ్ళుంటాడు అనుకున్నారేమో… నసీమా కూడా ఎవరికీ చెప్పలేదు, చెప్ప…లేదు.

మరిది సంగతి అటుంచితే భర్త గురించే తన యోచన… ఏవేవో ఆలోచనలు.

కాసేపు… ఆయన మంచివాడే గాని మహా రసికుడు..(సెక్స్ వీక్ నెస్ ) కానీ తానేం లోటు చేయలేదే ఎలా కావాలంటే అలా సహకరించింది… ఒక్కసారి కూడా కుదరదు అనలేదే… అయినా ఏంటి ఇలా? అని… ఇంకాసేపు… తానేం కన్ను వంకర, కాలు వంకర ఉన్నది కాదు కదా! అంతంత మాత్రముండే అందమూ కాదు… జూనియర్ ఇలియానా అన్న బిరుదు కూడా ఉంది తనకు… (అతిశయోక్తి అయినా, కొంత వరకు నిజమే.) దట్టంగా దిబ్బ రొట్టెలా ఉండాలా అయ్యగారికి… ఆనదేమో లేకపోతే… (థియేటర్ కి వచ్చిన అమ్మాయి కాస్త లావు గానే ఉంది తన కన్నా ) ఇలా… ఒక మెట్టు దిగి యోచిస్తూ ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలీదు! భర్తను మాత్రం ఏమీ అడగలేదు… కారణం అది అతని లోపం అనుకుందే గాని తనపై విముఖత అనుకోలేదు…

తెల్లవారింది. రోజూలాగే నసీమా తన పనుల్లో తను నిమగ్నమై ఉంది… ఇంట్లో ఎవరూ లేరు నసీమా మామగారు, తనూ తప్ప. అత్తగారు ఉన్నా లేనట్టే. వంట పని అయ్యాక స్నానం చేసి తన గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది.

చీర కట్టుకుంటున్న ఆమె వీపు పై ఏదో నీడ పడ్డట్టు అనిపించి చప్పున వెనక్కి తిరిగింది… తన కళ్ళు అమాంతం పెద్దగా మారాయి. గొంతులో గుటక పడింది. కళ్ళ ముందున్న నిజం…అబద్ధమైతే బావుణ్ణు అనిపించింది. అర్ధ నగ్నంగా ఉన్న ఆమెని కళ్ళతో తేరిపారా చూస్తున్నాడు మామగారు.

ఉర్దూలో..

“ఏంటి మావయ్య ఇది…మీరు నా గదిలోకి…ముందు మర్యాదగా బయటకి వెళ్ళండి…”అంది చీర ఒంటికి కప్పుకుని.

“బయటకి వెళ్ళడానికా ఇంతసేపు ఇక్కడ కాపు కాచుకుని ఉంది?” అంటూ రెండడుగులు ముందుకేసాడు. ఆమెకి ఆ అడుగుల ధ్వనులు గుండెల్లో రెండు పిడుగు పాటు శబ్దాలుగా వినిపించాయి.

“ఏంటిది… నేను మీ కోడల్ని … మీరిలా చేయడం భావ్యం కాదు!”వెనకడుగు వేస్తూ అంది. అతను ఆమె మాటల్ని ఖాతరు చేయలేదు. రంకెలేసినట్టుగా ఆమె మీదకి దూకాడు. తప్పించుకుని తలుపు వైపుకి పరుగు పెట్టింది. ఉడుం పట్టులా ఆమె నడుముని చేతులతో చుట్టేసాడు. ఆమె విడిపించుకోడానికి నానా అవస్థ పడింది.

ఏడుపు, అరుపులు… “కాపాడండీ…”అంటూ…

బయట ఉన్న అత్తగారికి లోపల జరుగుతున్నది అర్థమయ్యి కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయత ఆమెది.

చీర లాగేసాడతను…

“వద్దు మావయ్యా! ప్లీజ్…” అంటూ ప్రాధేయ పడుతోంది తను… అతను ఏ మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోట్లేదు. ఆమె రెండు చేతులు (భుజం కింద) పట్టుకుని ఆమెపై ఒరిగాడు… ఆమె పూర్తిగా నేలపై వాలింది.

అతని బరువుకి ఆమె ఊపిరి రెట్టిస్తోంది… అతన్ని తప్పించుకోడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తల అటూ,ఇటూ తిప్పుతోంది, ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్న అతన్నుంచి. అతను కూడా అంతే ఇదిగా ప్రయత్నిస్తున్నాడు.

ఆమె అరుస్తోంది… జాకెట్ చిరిగింది కుడి భుజం దగ్గర… గోటి గాటుకి చిన్నగా నెత్తురు చిమ్మింది… దేవుడ్ని వేడుకుంది తను… ఇక అతను ఆఖరి ఘట్టానికి బలవంతంగా తెర తీస్తుండగా… తలుపు మోగిన చప్పుడు. ఈ సారి అతని గుండెలో రాయి పడింది. ఒక్క ఉదుటున ఆమెపై నుంచి లేచాడు… తేలికగా అనిపించింది ఆమెకి. వెంటనే చీర కప్పుకుంది..

తలుపు తెరిచాడు మామగారు… ఎదురుగా చివరి కొడుకు మునీర్… నిర్ఘాంతపోయాడతను.

అతన్ని చూసాక కాస్త ధైర్యం వచ్చింది ఆమెకి… కానీ ఆ ధైర్యం ఎంతోసేపు నిలవలేదు.

“ఏంట్రా…” అడిగాడు తండ్రి..

“నువ్వు త్వరగా కానిస్తే…నేను వెళ్తా లోపలికి…” బదులిచ్చాడు.

ఆ మాట వినగానే ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మండాయి..ఆక్రోశం పెరిగింది..ఇంత నీచమైన మనుషుల మధ్యా ఇన్నాళ్ళు నేను బ్రతికింది అని సిగ్గు పడింది.

“ఇంకా మొదలే కాలేదు, మరీ బెట్టు చేస్తోంది… టైం పట్టేలాగే ఉంది…” అన్నాడు.

“సరే… త్వరగా కానీ…” అని వెనుతిరిగాడతను.

మళ్ళీ తలుపులేసాడు మామగారు. ఆమె రాయిలా నిలుచుంది. అతను ఆమెను సమీపించాడు.

భుజంపై చెయ్యి వేసాడు. ఆమెలో ఎలాంటి చలనం లేదు. అలాగే ఆమెని నెట్టాడు వెనక్కి… తను ఒరిగింది…

పైన పడబోతుండగా… దబ దబ దబ దబ అని తలుపు తడుతున్న శబ్దం… లేచి వెళ్లి తలుపు తీసాడు.

మునీర్ ముఖంలో టెన్షన్… ఏమిటా అని బయటకి వచ్చి చూసాడు, హాల్లో కానిస్టేబుల్ ఉన్నాడు.

“మీ అబ్బాయి రసూల్ దొరికాడు… ఎస్.ఐ. గారు మిమ్మల్ని స్టేషన్ కి రమ్మన్నారు…”చెప్పాడతను.

నేల మీద అలాగే పడి ఉన్న ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు మామగారు, మిస్ అయిందే అన్న నిరుత్సాహంతో…

చేసేదిలేక కదిలాడు. అతను పూర్తిగా గుమ్మం దాటాడు. ఆ గది తలుపు దగ్గర నిలబడి ఉన్న మునీర్ ఆమెవైపు తల తిప్పి చూసాడు. అతని చూపు ఆమె వక్షస్థలం పై కేంద్రీకృతమై ఉంది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు… తలుపేసాడు.

అత్తగారి కంట మరింత శోక సంద్రం పొంగింది…

*

ఉడుకుతున్న ఉప్మా లాగే ఆమె హృదయం కూడా ఉడికిపోతుంది…మనుషుల్లో ఎంత కౄరత్వం ఉంది? మరెంత లేకితనముంది? జంతువుల కన్నా హీనమైన ప్రవర్తన, కామంతో కళ్ళు మూసుకుపోయి ఎలాంటి నీచానికైనా ఒడిగట్టే ఇలాంటి మనుషుల మధ్య బ్రతకడం కన్నా చావడం మేలు! కన్నవాళ్ళ నిస్సహాయత, కట్టుకున్న వాడి స్వార్థం,
అయినవాళ్ళ అకృత్యాలు… ఇన్ని తట్టుకుని కూడా ఓ స్త్రీ ఎందుకు ఇంకా బ్రతికుంటుందో ఆ క్షణమే అర్థమైంది తనకి!

కడుపులో తిప్పుతున్నట్టు అనిపించి వంట గది నుంచి పెరటి వైపు వెళ్ళింది. వాంతులైయ్యాయి. తను గర్భవతి అన్న సంగతి గుర్తించింది. ఇలాంటి నీచుల మధ్య పెరగడానికి మరో ప్రాణం రానుందా! ఆ ప్రాణం మగజన్మ అయితే ఇలాంటి నీచులలాగా పెరగనివ్వకూడదు. అదే ఆడజన్మ అయితే ఇలాంటి వాళ్ళ బారిన పడకుండా తనని తాను రక్షించుకునేలా పెంచాలి అనుకుంది. ఇప్పుడు తనెందుకు బ్రతికుండాలో ఒక క్ల్యారిటీ వచ్చింది తనకి.

టిఫిన్ రెడీ చేసి వచ్చేసరికి, సోఫా లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు రసూల్. అతన్ని చూడగానే ఆశ్చర్యం, ఆవేశం రెండూ కలిగాయి. పలకకుండా వెళ్ళిపోయింది. రాత్రికి రాత్రి లంచం ఇచ్చి మామగారు కొడుకుని కాపాడుకున్నాడు. అదృష్టవశాత్తు హాస్పిటల్ లో ఉన్న అతను ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ సంగతి నసీమాకి తెలీదు, అసలు తనకి అక్కరలేదు కూడా.

ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు… ఎవరూ గమనించని సమయం చూసి రసూల్ ని పిలిచి నగల గురించి అడగాలనుకుంది. ఆ నగలు తన బతుకు తను బతికేందుకు దోహదపడతాయి అన్నది ఆమె ఆలోచన… ఎలాగో ఈ నికృష్ట మనుషుల మధ్య నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.

టిఫిన్ చేస్తున్న మునీర్ ని చూసి, ఉర్దూలో…

“తలకి ఆ కట్టేవిట్రా?” అడిగాడు నాజర్…

“గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే, బాల్ క్యాచ్ పట్టబోయి వెనక్కి పడ్డాను…”అబద్ధం చెప్పాడు, తనని చెరచబోతుంటే వదిన తలపై ఇత్తడి చెంబుతో తల పగలగొట్టిందన్న నిజాన్ని చెప్పలేక…

పెరటి నుంచి వస్తున్న రసూల్ ని గమనించి పక్కకు పిలిచింది నసీమా.

“జేవర్ కబ్ ఛుడాతే..(నగలు ఎప్పుడు విడిపిస్తావ్)” అడిగింది సూటిగా..

ఆమె ఊహించని సమాధానం రాబోతుంది ఇప్పుడు అతని నోటి వెంట..

“క్యా..జేవర్? (ఏం ..నగలు?)” ఏమీ ఎరగనట్టు అన్నాడు..

గుండెలు జారిపోయాయ్ తనకి… కంగారు, కోపం కలిగలసిన స్వరంతో, “ఓ క్యావ్ రసూల్ … మేరే జేవరా లేకో గయ్ నో..క్యావ్ జేవరా కతే క్యావ్..”

(అదేంటి రసూల్….నా నగలు తీసుకెళ్ళావ్ కదా …ఏం నగలు అంటావేంటి?)

“క్యా బాత్ కర్తెహే భాబి… భేజా ఖరాబ్ హూ ఆ క్యావ్.. కిసే దియే.. కిసే పూచ్తేహే?”

(ఏం మాట్లాడుతున్నావ్ వదినా..మతి గాని పోయిందా ఏంటి..ఎవరికిచ్చావ్ ..ఎవర్ని అడుగుతున్నావ్?) అనగానే ఇక తనకి అర్ధం అయిపోయింది. బెట్టింగ్ లో గెలిచి ఉంటే మూడో కంటికి తెలియకుండా ఎలా తీసుకు వెళ్ళాడో అలాగే తెచ్చి ఇచ్చుండే వాడు,

ఇప్పుడు డబ్బు పోయింది కాబట్టి నాటకాలు ఆడుతున్నాడు అని.

“సువ్వర్ కా బచ్చా..దరిందర్ భాడకావ్!” అని తిట్టుకుంది లోలోపల. బయటకి అంటే లేనిపోని గొడవ మళ్ళీ.

“రసూల్ తుమారే పామా పకళ్ళేతిం … జేవరా లాకో దియో..(రసూల్ నీ కాళ్ళు పట్టుకుంటా ..నగలు తెచ్చి ఇవ్వు.)” దీనంగా అడిగింది.

ఆమె అనుకోని విధంగా “భాయ్…భాయ్..భాయ్ ….” అంటూ అన్నని పిలవసాగాడతను.

“అయ్యో.. నక్కో .. నక్కో..రసూల్ .. తుమాకు సబాబ్ హోతా కిసే బోలో నక్కో..”

(అయ్యో ..వద్దు..వద్దు ..రసూల్ ..నీకు పుణ్యం ఉంటుంది ఎవరికీ చెప్పకు..)

కన్నీళ్లు పెట్టుకుని బతిమాలుతూ అంది… కానీ టెన్షన్లో అనకూడని మాట అంది. నిజానికి ‘పిలిస్తే పిలువు’ అనాలి లేదా, ‘ఏం చెప్తావ్ మీ అన్నని పిలిచి?’ అనాలి. కానీ తన దురదృష్టం ఆ మాట పలికించింది. దాని ప్రభావం తీవ్రంగా మారబోతుంది ఇప్పుడు. ఎందుకంటే అప్పటికే తన భర్త ప్రవేశించాడు ఆమె ప్రాధేయపడడం చూసాడు. ఆమె అన్న మాటలు స్పష్టంగా విన్నాడు.

భర్తని చూడగానే నోట మాట ఆగిపోయింది ఆమెకి భర్త కళ్ళు చింత నిప్పుల్లా రగులుతున్నాయి… ప్రళయం సంభవించే సూచనలా..

(ఇప్పుడు జరిగే సంభాషణ అంతా తురకం లోనే జరుగుతోంది.)

“ఏం జరుగుతుంది… ఏం చెప్పద్దు, ఎవరికీ చెప్పద్దు అంటున్నావే?” అడిగాడు భర్త.

మౌనంగా చూస్తోంది ఆమె తటపటాయిస్తూ…

అన్న అడిగిన దాంట్లో అసలు అర్థం కనిపెట్టాడు రసూల్.

“నన్ను క్షమించు అన్నయ్యా, నీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకున్నాను… కానీ ఇంత దాకా వచ్చాక తప్పట్లేదు…” అతని మాటలు అర్థం కానట్టు చూస్తుంది నసీమా.

“కొద్ది రోజుల నుంచి వదిన నా పై మనసు పడ్డానని నన్ను ఇబ్బంది పెడుతోంది…” అనగానే ఆమె గుండెలో సంద్రం ఉప్పొంగింది. మెదడు ఆలోచన చేయటం ఆపేసింది. శరీరం స్తంభించింది. చూపు శూన్యంలో నిలిచిపోయింది.

“నీ పెళ్ళానికి ఒక్కడు సరిపోడు లేరా… మొన్న కూడా వాడెవడో టెన్త్ క్లాస్ మేట్ అంటూ వచ్చాడు. ఇంకా ఈవిడ గారి ఖాతాలో ఎంత మంది ఉన్నారో…” అంటూ వచ్చాడు మామగారు మధ్యలోకి.

“అయితే ఆ నగలు వాడికే ఇచ్చి ఉంటుంది ఇది!” అన్నాడు భర్త.

“నీకేం తక్కువ చేసాం వదినా ఈ ఇంట్లో! ఎందుకు ఇలా చేసి మమ్మల్ని క్షోభ పెడుతున్నావ్?” – రసూల్.

అందరూ తలో మాట అంటున్నారు.

ఆమె చెవికి ఏదీ వినిపించటం లేదు రాయిలా మారాయి, ఆమె మనసూ,తనువూ.

“ఇంతలా వాగుతుంటే రాయిలా నిలబడ్డావేమే లం…” అని ఫాట్ మని కొట్టాడు భర్త.

దెబ్బ తగిలింది,నొప్పి తెలీలేదు… దబా దబా కొడుతున్నాడు అతను. కాలితో తన్నాడు,

అమ్మనా బూతులు తిట్టాడు… కొట్టి, కొట్టి అలుపొచ్చి వెళ్ళిపోయాడు… తక్కిన ఇద్దరు దుష్టులు కూడా వెళ్ళిపోయారు… ఆమె ఇంకా తన స్వాధీనంలోకి రాలేదు… పెదవి చిట్లి నెత్తురోడింది. జుట్టు చెదిరింది. పవిట జారి ఉంది… తను మాత్రం చలనం లేకుండా పడి ఉంది.

ముక్కలైన మనసుని లెక్కపెట్టుకుంటూ అలా ఎంత సేపు ఉందో కాలానికే తెలియాలి.

సాయంత్రం అయిదున్నర కావొస్తుంది.మధ్యాహ్నం వంట కూడా చేయలేదు. ఎవరూ ఆమెని అడగలేదు, పట్టించుకోలేదు. హోటల్ నుంచి బిర్యాని తెచ్చుకుని తిన్నారు అంతా… అత్తగారికి చిన్న కొడుకు స్పూన్ తో తినిపించాడు. తను మగతలోంచి తేరుకుని నెమ్మదిగా లేచింది… పవిట కప్పుకుంది, జుట్టు సర్దుకుంది. సరాసరి పెరటి వైపుకి వెళ్లి మొహం కడుక్కుంది. పెదవి దగ్గర చేరిన నెత్తురు గడ్డకట్టింది. దాన్ని శుభ్రం చేసుకుని చెంగుతో మొహం తుడుచుకుంది. తిన్నగా బెడ్ రూమ్ వైపు కదిలింది. అలా వెళ్తున్న ఆమెను చూసి ఎవరూ ఏమీ పలకలేదు. కాసేపటికి బయటకి వచ్చింది తను… హాల్లోకి. అప్పుడు ఆమెని చూసి అందరి కళ్ళు విస్మయం చెందాయి… చేతిలో సూట్ కేస్ తో నిలుచుంది తను.

(తురకంలో సంభాషణ…)

“ఎక్కడికే?” అడిగాడు భర్త ఆవేశంగా ఆమె దగ్గరికి వస్తూ.

“మా పుట్టింటికి…” చెప్పింది భర్త కళ్ళలో కళ్ళు పెట్టి.

“అడుగు గడప దాటితే…కాళ్ళు విరుగుతాయి..లం..” అంటుండగానే అతని నోట మాట ఆగిపోయింది.

చెంప ఛెళ్ళుమన్న శబ్దం… చెంప మీద చెయ్యి పెట్టుకుని బిత్తరపోయి చూసాడతను.

“నన్నే కొడతావా?” దబాయిస్తున్నట్టు అడిగాడు.

“ఈ దెబ్బ శోభనం గదిలో నా ప్రమేయం లేకుండా ఒంటి మీద చెయ్యి వేసినప్పుడే కొట్టాల్సింది… నీ ఇష్టమొచ్చినట్టు, నీకు నచ్చినట్టు నన్ను పెళ్ళాంలా కాకుండా ఒక వేశ్యలా చూసి నాతో పడుకున్న ప్రతీ రోజూ కొట్టాల్సింది… థియేటర్ లో పరాయి దాంతో కులుకుతున్నప్పుడే కొట్టాల్సింది…” విస్మయంగా చుస్తున్నాడతను.

“ఎలా కొట్టాల్సిందంటే… మూతి మీద మీసం పూర్తిగా రాకపోయినా మగతనాన్ని పరీక్షించుకోడానికి వదిన వరస అయిన నా మీద పడబోయిన నీ చిన్న తమ్ముడి తల పగలగొట్టాను చూడు…అలా కొట్టాల్సింది…” ఆ మాట వినగానే తమ్ముడి వైపు చూసాడు… అతను తల దించుకున్నాడు అన్నయ్య చూపుకి.

“నిన్నే కాదు… కూతురుగా చూడాల్సిన కోడలిపై కన్నేసిన మీ నాన్నని, కష్టంలో ఉన్నానని చెప్పి నమ్మించి నగలు తీసుకెళ్ళి… అడిగితే నా మీదే తిరిగి నిందలేసిన నీ పెద్ద తమ్ముణ్ణి, కూడా అప్పుడే… ఆ క్షణమే కొట్టాల్సింది… ఇప్పుడు నిన్ను కొడితే వాళ్ళకి కూడా తగులుతుంది అనిపించింది. అందుకే ఇప్పుడు కొట్టాను…” సిగ్గు పడకుండా ఏమీ పట్టనట్టు తలలు తిప్పుకున్నారు. భర్త మాత్రం ‘ఇది నా పెళ్లామేనా!’ అన్నట్టు చూస్తున్నాడు.

ఆమెకి దుఃఖం తన్నుకొచ్చింది…

వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ… “ఇన్నాళ్ళ కాపురంలో ఎప్పుడూ నోరు తెరిచి ఏదీ అడగలేదు, నువ్వు పెట్టింది తిన్నాను, తెచ్చింది కట్టుకున్నాను, అందరూ నా వాళ్లు… ఇది నా కుటుంబం అనుకుని అందరికీ సేవలు చేసాను… అదే పెళ్ళైన రెండో రోజే వేరే కాపురం పెట్టి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు…” కాసేపు నిశ్శబ్దం…

“అసలు ఇంత చదువు చదువుకుని నీ లాంటి రోజు కూలి గాడ్ని చేసుకోవడమే నా తప్పు… నీ లేకి బుద్ధులు ముందే తెలిసుంటే అసలు ఈ పెళ్ళే జరిగేది కాదు… మా అమ్మా, నాన్న మాట మీద గౌరవంతో నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను… వాళ్ళ పరువు గురించి అలోచించి ఇంతకాలం నిన్ను భరించాను. ఇంకా ఇక్కడే ఉంటే నన్ను నేను మోసం చేసుకున్న దాన్ని అవుతాను… అందుకే వెళ్ళిపోతున్నాను… ఇక నీకూ, నాకూ ఏం సంబంధం లేదు. తొందర్లోనే విడాకుల నోటీస్ పంపిస్తాను…”అని అతని కళ్ళల్లోకి చూస్తూ..

“సంతకం నేర్చుకో!” అంది… చెంప దెబ్బ కన్నా గట్టి చెప్పు దెబ్బలా అనిపించింది, ఆ మాట…

ఆమె వెళ్ళిపోతూ…ఆగింది. అత్తగారి వైపు చూసింది… అందరి మొహంలో అవమానపు ఛాయలు, అత్తగారి గారి మొహంలో మాత్రం ‘ఇన్నాళ్ళు నాకు నువ్వు చేసిన సేవకి కృతఙ్ఞతలు చెప్పడం తప్ప ఏమీ చేయలేనమ్మా’ అనే భావన. కళ్ళతోనే ఆవిడకి వీడ్కోలు చెప్పి కదిలింది తను… ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆ మగాళ్ళు.

*

తలుపు తెరచుకున్న శబ్దానికి టక్కున చూసాడు ఇజాక్… ఎదురుగా అమ్మ.

“క్యావ్ హూవా బేటా ..అందర్ ఫస్ గాయా క్యా..(ఏమైంది కొడుకా…లోపల ఇరుక్కున్నావా ఏంటి..?)” అడిగింది ఇజాక్ తల్లి ప్రేమగా..కంగారుగా..

“ఓ..దర్వాజా థోడా ప్రాబ్లం థా మా ..ఔర్ కుచ్ నై… ( అదీ..తలుపు కుంచెం ప్రాబ్లం అమ్మ ..వేరేం లేదు..)” చెప్పి తల్లిని తీసుకుని లోపలికి వెళ్ళాడు ఇజాక్..

తన రూమ్ లో కూర్చుని… పుస్తకాన్ని ముందుకి వెనక్కి తిప్పి చూసాడు. ఏమీ కనబడలేదు.అతను వెతుకుతోంది రాసిన వాళ్ళ పేరు ఏమైనా దొరుకుతుందా అని. కానీ అలాంటి ఆచూకీ ఏమీ లేదు,కనబడలేదు… ఇజాక్ మనసులో నసీమా పాత్ర బలంగా పాతుకుపోయింది… ఆ విషయం అతనికి అర్థం కావటానికే అన్నట్టు… అప్పుడే వచ్చింది నజీరా అతని ఇంటికి. నజీరా అతని మరదలు. ఇజాక్ అంటే పిచ్చి ఆ పిల్లకి. బీ.టెక్ పూర్తీ చేసింది. ఇజాక్ ఊ అంటే చాలు తక్షణమే నిఖా పక్కా చేస్కొడానికి రెడీ గా ఉంది.

“పుప్ఫు..పుప్ఫు ..(అత్తా, అత్తా)” పిలుపు విని వచ్చింది ఇజాక్ తల్లి.

“క్యావ్ గే..(ఏంటే )”

“అబ్బా …ఏ దేకో ఆవో కయే.(నాన్న ఇది..ఇచ్చి రమ్మన్నారు )” అంటూ ఏదో సంచి ఇచ్చింది..

“ఇజాక్ నేహే ..(ఇజాక్ లేడా ?)” అడిగింది క్షణం ఆలస్యం లేకుండా.

“ఉప్పర్ హే జా..(పైన ఉన్నాడు వెళ్ళు )” చెప్పిందావిడ..మెట్లెక్కి ఇజాక్ రూమ్ వైపు కదిలింది తను. తన రాక గమనించి పుస్తకాన్ని దాచాడు దిండు కింద.

“క్యా కర్తే హే..(ఏం చేస్తున్నావ్? )”

“నథింగ్..”

వచ్చి కూర్చుంది తను..

ఉర్దూలో….

“బావా, ఒకటి అడుగుతా చెప్పు…” అంది.

“ఏంటీ?”

“నీకు ఇప్పుడు పెళ్ళి చేసుకోడం ఇష్టం లేదా? లేక నన్ను చేసుకోవడం ఇష్టం లేదా?”

“నిన్ను ఇప్పుడు చేసుకోడం ఇష్టం లేదు…” కన్ను కొట్టాడు.

అతని భుజం పై గుద్దుతూ “బావా ప్లీజ్ ..నేను సీరియస్ గా అడుగుతున్నా…”బుంగ మూతి పెట్టి అన్నది.

“నేనూ.. సీరియస్… గానే… చెబుతున్నా..” అతను కూడా బుంగ మూతి పెట్టి అన్నాడు.

“నీ కోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తా, బట్ ఒక క్లారిటీ ఇవ్వు బావా… రెండా, మూడా నాలుగా.. ఎన్ని ఇయర్స్ వెయిట్ చెయ్యాలో కనీసం అదైనా చెప్పు …”

తను అడిగిన దాంట్లో లాజిక్ ఉందనిపించింది అతనిక్కూడా ..

పాపం ఎన్నాళ్ళని ఇలా … ఏదోటి చెప్పేస్తే జరగాల్సింది జరుగుతుంది కదా…అనుకున్నాడు..

నిజానికి అతనికి ఎలాంటి అభిప్రాయం లేదు మరదలి మీద… అందుకే విషయం సాగదీసాడు ఇన్నాళ్ళూ. సరే ఎలాగో పెళ్ళైతే తప్పదు. బయట వాళ్ళ కన్నా సొంత మరదలైతే బెటర్ కదా. పైగా చదువుకుంది, అందం ఉంది, తెలివైంది, అన్నిటినీ మించి తనంటే చచ్చేంత ప్రేమ ఉంది… ఇంకేం కావాలి ఇంత కన్నా… ఓకే చెప్పేద్దాం లే… అనుకున్నాడు… అతను ఈ ఆలోచన చేస్తుండగానే దిండు కింద ఉన్న పుస్తకం ఆమె కంట పడింది. తను తీసి క్యాజువల్ గా చూస్తోంది.

ఇజాక్ తన ఆలోచన నుంచి బయట పడి ఆమె వైపు చూసి, “చూడు నసీమా…నాక్కూడా……..” అతని మాట ఉన్నట్టుండి ఆగింది… ఎందుకో అతనికి అర్థం అయ్యింది..

కానీ అతని మరదలికి ఆ మాటలు అంతగా వినపడలేదు, అని అతనికి తెలీదు.అయినా ఆమె ఎక్స్ ప్రెషన్ చూస్తే అర్థం అయినట్టే ఉంది… కానీ ఆమెకి అర్థం అయ్యింది అతని మాటలు కాదు.

చేతిలో ఉన్న పుస్తకాన్ని ఇజాక్ కి చూపించింది తను… ఏంటిది? అన్నట్టు..₹ ఒక్క క్షణం తన కళ్ళని తను నమ్మలేక పోయాడు.

పుస్తకం లో ‘నసీమా’ అన్న పేరు ఉన్న ప్రతీ చోటా… రౌండ్ చుట్టి ఉంది… అది లవ్ సింబల్!

*

(సశేషము)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *