March 29, 2023

భావసుధలు పుస్తక సమీక్ష

సమీక్ష: రాజ్యలక్ష్మి. ఎ


భావసుధలు అన్న శీర్షికతో పదాలు భావలనే అమృతాలను 27 కథలలో పూరించి కూరించి రూపొందించిన సంకలనం. దైనందిన జీవితంలో రచయిత్రికి ఎదురైన స్పందింపజేసిన సంఘటనలు ప్రవృత్తుల గురించి , తనదైన శైలి లో కథలను మలిచే గట్టి ప్రయత్నం చేశారు.విజయులూ అయ్యారు.
అన్ని కథలలోను ఒక ఉద్యోగస్తురాలైన మహిళ సమాజంలో తనకు తారసపడిన విభిన్న పరిస్తితులలో ఉన్న మనుషులకూ ముఖ్యంగా మహిళలకు చేయందించే వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ కథలన్నింటిలో .. ప్రతి కథలోనూ సన్నివేశాల గురించి సజావుగా ఆలోచించి ఇబ్బందిలో ఉన్న సాటి మహిళకు తగిన పరిష్కారం దిశగా ప్రయోజనకరమైన పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేశారు.
తన దైనందిన జీవితంలో ఏ కాస్త అవకాశం ఆస్కారం దొరికినప్పుడు సంకోచించకుండా వీలైనంత సరళమూ తక్షణ ఊరట లభించే విధంగా నాయికలు ఇతర పాత్రలూ కథలన్నింటిలో నడచుకుంటాయి. చాలా కథలలో ప్రతి రోజు పయనించే లోకల్ రైళ్ళ అనుభవాలూ చోటు చేసుకున్నాయి. రైలందుకొనే ప్రయత్నాలు ఆయా రైలు స్టేషను పరిసరాలు అక్కడ తారసపడే మనుషుల పట్ల నాయికల అక్కర సాయపడాలన్న తాపత్రయం ఆవిష్కరించడంలో కథను చక్కగా నడిపిస్తూనే. సన్నివేశ వర్ణనలలో అక్కడక్కడి చిన్న విషయాలు అనుభవాలను ఆ పాత్రలకు సాయం చేయడం లో చక్కగా ఇతివృత్తంతో అతికినట్టు కలబోసి రాయబడింది..
సగటు మధ్య త‌రగతి మహిళలందరలో ఉండే సామాజిక అవగాహన సాటి స్త్రీలకు అవసరమైన పరిష్కారాల పట్ల స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండడాన్ని చక్కగా కథల లో అద్దం పట్టారు. నేటి ఉద్యోగస్తులయిన మహిళలు దెబ్బతిన్న ఇబ్బందుల్లో చిక్కి సతమతమైన స్త్రీలకు తమకు వీలైనంత లో చక్కని మార్పుల ద్వారా ఊరట నివ్వడం అన్ని కథల లో విస్తారంగా వివరిస్తారు.వారందరికీ అప్పుడు ఇలాగే జరిగినప్పుడు నేనూ ఈ విధంగానే స్పందించానని అనిపించేంత సహజత చూపించారు.. మన దైనందిన అనుభవాలను కాచి వడబోసిన కథలే ఈ భావ సుధలన్నీ.
చదువుకున్న వారి సమాజంలో ఆడవారి సామాన్య కష్టాలతో బాటు సంక్లిష్టమైన మానసిక దిగుళ్ళు ఒత్తిడిలను అర్ధం చేసుకునే మనస్తత్వం కథాకధనంలో కనిపిస్తుంది..
‘చర్విత చరణం’ ‘ స్నేహధర్మం ‘ ‘అమ్మా నన్ను మన్నించు’ ‘ వెలుగుబాట ‘ ‘ సంకల్పం ‘ ‘ శ్రమైక జీవన సౌందర్యం ‘అని శీర్షికల లోనే కథల ఆత్మలను ఇదో ఇలా ఉంటాయని ఒక్క మాటలో చెప్పేస్తున్న విధం బాగా ఉంది.
‘ పిచ్చి తల్లి ‘తో ఆరంభించి ‘ ఆత్మ విశ్వాసం అందించి ‘ తోడు నీడ ‘ దిశ గా పయనించి ‘ ఆమె మనసు ‘ ను ‘సంకల్పం ‘ చేయించి మహిళ ‘ విజేత ‘ గా నిలిచే ‘ సుఖాల డోల’ లో ‘చిరు నవ్వుల వాన’ తో పయనించి ‘పరిష్కారం’ తో ముగుస్తున్నది ఈ కథల సంకలనం.
ఈ కథలన్నింటిలో హుందాగా నడిచే హాయిగా చదివించే లక్షణం కథను నడిపించిన విధానం అందమైన భాష. చదువుకున్న పాత్రలు అధికం గా ఉండడం తో భాష లో చదువిచ్చే సంస్కారం చక్కగా ప్రతిఫలిస్తుంది. కొన్ని కథలే నిడివి తక్కువ. ఎక్కువ భాగం కథలలో పేజీల సంఖ్య ఎక్కువన్నది ఓ నిజమైతే కథాకధనం నడిపించి పాత్రల మనసుల లోని భావాలను ఆలోచనా ధోరణులను విప్పి చెప్పడం లో నిడివి సహజం గానే పెద్దదయి పోయిందేమో అన్న సమర్ధింపూ ఇచ్చుకోవచ్చు.
సందర్భం వచ్చినప్పుడు పాత తరం నేటి తరాన్ని ‘ జీవన వేగం మారుతున్న పరిస్థితులు తరాల అంతరం ఇలాగ ఎన్నో కారణాలు ‘ అంటునే ‘ ఎవరినీ తప్పు పట్టలేము’ అన్న వాస్తవికతను మనం ఒప్పుకునే లాగ , అవును సుమా అని అనుకునేలాగా వివరాణాత్మకం గా రాసుకొచ్చారు.. ‘ రాజాబాబు పెళ్ళి’ కథ యుద్దనపూడి నవలలను గుర్తు తెప్పించేంతగా కధనం నడిచింది. యువత లోని ప్రేమ కోణం ఇందులో కనిపిస్తే యవ్వనపు ఆకర్షణ నుంచి వయసు మళ్ళిన ప్రేమికురాలు దూరం జరిగి అరవైలో ఇరవై రాదన్నట్టు తనను తాను కట్టుదిట్టం చేసుకోవడం ‘ ప్రేమకానుక ‘ లో రచయిత్రి కచ్ఛితంగా చెబుతుంది.
పరిణితి చెందిన మహిళల దృక్పథం వ్యక్తిత్వం ఈ భావ సుధలలో చక్కగా సరళ భాషలో చెప్పడంలో రచయిత్రి సఫలమైయ్యారనే చెప్పవచ్చు. చక్కగా చదివించగలిగిన కథల సంపుటం. చదవడం సంబరమే. మనం రోజూ చూస్తున్న సంఘటనలే ఎంత సందేశాత్మంగా సమాజానికి ప్రయోజనకారిగా మలచవచ్చు ఈ కథలు కథలు కథలుగా చెబుతున్నాయి.
మహిళలలో సహజంగా ఉన్న కరుణ సాయపడే నైజం పరిస్తితులను చక్కదిద్దే దిద్దుబాటు ధోరణి అడుగడుగునా దర్శనమిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

May 2021
M T W T F S S
« Apr   Jun »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31