March 29, 2023

రాజీపడిన బంధం – 15

రచన: కోసూరి ఉమాభారతి

“నేను అన్నయ్యలా భావించే ఆనంద్ గారంటే, నాకున్న గౌరవం ఈ రోజు రెట్టింపయ్యింది. నీవు నా స్నేహితురాలవైనందుకు కూడా నాకెంతో గర్వంగా ఉంది చిత్రా” అన్నాను.
“అవును, ఈ కుటీరాన్ని ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించినట్టుగా ఉంది. ఆనంద్, నీవు కూడా ఎంతో గొప్ప ఆలోచనలు ఉన్నవారని తెలుస్తుంది చిత్రా” అంది రమణి.
“సరే తల్లీ మీ పొగడ్తలు ఆపండమ్మా! సమాజం లోని నిరాశ్రయులకి, మా వంతు చేయూత నిద్దామన్న ప్రయత్నం తప్ప మా గొప్పతనం ఏమీ లేదు” అంది చిత్ర.
“పూర్వీకుల ఆస్తులు అమ్మేసి, ఇక్కడ భూమి కొన్నారు ఆనంద్. మూడేళ్ళపాటు ఈ కుటీర నిర్మాణంలో మునిగి తేలారు. హాస్పిటల్ ప్రాక్టీసు నుండి కూడా దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్నారు మరి” అంది చిత్ర..
మాట్లాడుతుండగానే, ఓ పదిమంది చిన్నపిల్లలు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, బిలబిల మంటూ చిత్ర చుట్టూ చేరారు.
“అమ్మా, అమ్మా” అంటూ తలా ఓ కబురు చెప్పారు చిత్రకి. అందులో ఇద్దరు నడువలేని వారైతే, ఒకరు మూగ అని కూడా అర్ధమయ్యింది. వారిని ఆయాలు తీసుకు వచ్చారు.
వారందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని, వారి చదువులెలా సాగుతున్నాయని వాకబు చేసింది చిత్ర.
ఇంతలో డ్రైవర్ రెండు సంచులు తీసుకొని వచ్చాడు…పిల్లలకి గిఫ్ట్లు అనుకుంటా…
భావించినట్టే వాళ్ళందరికీ తలా ఓ గిఫ్ట్ ఇచ్చింది చిత్ర. ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటే, అదనపు బహుమానాలుంటాయని కూడా చెప్పింది.
“మీరిప్పుడు పార్క్ లోకెళ్ళి ఆడుకోండి. మరో ఐదు నిముషాల్లో ఆనంద్ డాడీ మీ దగ్గరికే వస్తారు. నేను మళ్ళీ పదిహేను రోజులకి కనబడతా” అని వాళ్ళని బుజ్జగించి అటుగా పంపింది చిత్ర.
ఓ నాలుగేళ్ల బాబు మాత్రం వెళ్ళనని మొరాయించాడు. “మమ్మీ” అంటూ చిత్ర వొళ్ళోనే కూర్చున్నాడు. వాడిని కాసేపు ముద్దులాడి హ్యాండ్-బ్యాగ్ నుండి చాక్లెట్ తీసి ఇచ్చాక, ఆయమ్మతో వెళ్లాడు.
ఇదంతా చూస్తూ నేను రమణి కూడా కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాము.
మేము నోరు విప్పేలోగానే, “మీరు అడగబోయే ప్రశ్నలకి, అనాలనుకుంటున్న మాటలకి బదులుగా, ముందు నేను చెప్పేది వినండి” అంది చిత్ర.
“ఈ ఆశ్రమం ఆనంద్ ఆశయం. లండన్ లో స్థిరపడ్డ వాళ్ళ అన్నయ్య కూడా సహకరించారు….. ఆనంద్ కి, నేను విధిగా సాయం చేసాను. అంతే” చెప్పడం ఆపింది చిత్ర….
నేను, రమణి కూడా చిత్ర చెప్పేది ఆసక్తిగా వింటున్నాము.
కొద్దిక్షణాలకి, తలెత్తి దూరంగా ఆడుతున్న పిల్లల వంక చూస్తూ, ”ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే, నాకు పిల్లలు పుట్టరన్న దిగులుకన్నా ఆనంద్ కి తండ్రి హోదా ఇవ్వలేకపోతున్నాననే బాధే ఎక్కువయ్యింది. పోనీ అనాధ బిడ్డల్ని సొంతానికి దత్తత తీసుకుందామా అని ఆనంద్ ని అడిగాను. దానికి జవాబుగా ఆయన ఏమన్నారో తెలుసా?” అని నీరు నిండిన కళ్ళతో మా వంక చూసింది చిత్ర.
‘ప్రేమగా పెంచి వృద్ధిలోకి తీసుకురాడానికి, సొంత పిల్లలే అయ్యుండాలని తను అనుకోవడం లేదన్నారు. ఆశ్రమంలోని బిడ్డలని పెంచి ప్రేమని పంచుతానన్నారు. వారందరూ తనకి సొంతబిడ్డలే అన్నారు” అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది చిత్ర.
“ఇంకేముంది, అంతే. నేనూ ఆనంద్ తో చేతులు కలిపి అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. ఇప్పుడు నా మనస్థితి పూర్తి సంతృప్తితో నిండుంది. నాకు ఎందరో బిడ్డలు. వాళ్ళని ప్రేమించడానికి, వారి బాగోగులు పట్టించుకోడానికి నా జీవితకాలం చాలదనుకో. అంతటి ప్రేమని, అనుభూతిని ఇస్తున్నారు ఈ ఆశ్రమ బిడ్డలు” అంది..
నవ్వుతూ మా ఇద్దరి చేతుల మీద తట్టింది.. “ఇంకా నా విషయంలో ఏమన్నా ప్రశ్నలున్నాయా మీకు? నీలవేణి గారు, చంద్రమణి గారు” అంటూ నవ్వేసింది.
నేనూ, రమణి కూడా చిత్ర చేయందుకున్నాము. “లేవు చిత్రలేఖ గారు,” అని ఒకేసారి అన్నాము……….
మా చేతుల్ని పట్టుకుని మాతో పాటు పైకి లేచింది చిత్ర.
**
మూడు రోజుల తేడాతో రమణి వాళ్ళు, అమ్మావాళ్ళు తిరిగి వెళ్ళాక ఇల్లంతా బోసిపోయిందనుకున్నాను. త్వరలో ఉద్యిగం నుండి విశ్రమించబోతున్న నాన్న మిగిలున్న పనులు ముగుంచుకుని మళ్ళీ తీరుబడిగా వస్తామని చెప్పి వెళ్ళారు.
ఇల్లంతా సర్ది… అలిసి పెందరాలే నిద్రకి పడ్డాను.
**
పొద్దున్నే నా చేతి నుండి కాఫీ కప్పు అందుకుంటూ…ఈ రోజు నవంబర్ 24 … “మీ అత్తయ్య వర్ధంతి. నేను ముందుగా ఇంటికి శ్యాంతో కలిసి వెళ్లి పూజాకర్యక్రమం చేసుకుని, పనులు చూసుకుని.. అక్కడ నుండి పిల్లలని స్కూల్ నుండి నేనే తీసుకుని వస్తాను’ అని తన దినచర్య వివరించారు.
పూజామందిరం శుభ్రం చేసి అత్తయ్య పటం ముందు ప్రత్యేకంగా దీపం వెలిగించి దణ్ణం పెట్టుకున్నాను. నా మనస్సులోనే కాదు, మా పూజా మందిరంలో కూడా ఆవిడకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి వర్ధంతికి అత్తయ్య పేరిట అనాధాశ్రమంలో వస్త్రదానం చేయిస్తాను. ఇవాళ కూడా అదే పని మీద అనాధాశ్రమానికి బయలుదేరాను. అత్తయ్య గురించిన జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి
పిల్లలతో నేను విడిగా వచ్చేసాక, సుస్తీగా ఉన్న అత్తయ్యని చూడ్డానికి చిత్రని వెంట బెట్టుకుని వెళ్ళేదాన్ని. అలా వెళ్ళిన ఓ సారి మాత్రం.. శ్యాం పుట్టిన రోజని గుర్తు చేస్తూ, నా రెండు చేతులు పట్టుకుని ఆమె నాతో అన్న మాటలు మరువలేను…
“నీవు ఎంతో ఓపిక, జ్ఞానం ఉన్న నిండైన మనిషివి నీలు. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టమే తల్లీ. నీవు కాబట్టి మా మీద గౌరవ మర్యాదలు ఉంచి, కుటుంబం కోసం త్యాగాలు చేసి జీవిస్తున్నావు. శ్యాంలో నీవు కోరుకునే మార్పు రావాలని ఆ దేవుడుని ప్రార్దిస్తానమ్మా” అంటూ తన మనసులోని మాట చెప్పుకున్నారు…
“అంతే కాదు తల్లీ, వాడిలో మార్పంటూ వస్తే, వాడిని తప్పక ఆదరించమని కూడా నిన్ను కోరుతున్నాను నీలా” అన్నారు కన్నీళ్ళతో ఆమె.
ఆ నాటి ఆమె అర్ధింపు నాపై చెరగని ముద్ర వేసింది…
శ్యాం లో ఆ మార్పు రావాలనే నేనూ కోరుకునేది…వేచి చూడాలి…
అనుకుంటూ ఆశ్రమం వద్ద కారు పార్క్ చేసాను…
‘జీవితంతో రాజీ పడిన నేను, వ్యక్తిగతంగా కూడా అత్యాశలు పెట్టుకోలేదు. అందుకే ఇలా మనగలుగుతున్నాను’ అనుకుంటూ లోనికి నడిచాను..

*************

సమాప్తం

2 thoughts on “రాజీపడిన బంధం – 15

  1. ‘రాజీ పడిన బంధం’ ధారావాహికగా 15 నెలల పాటు ప్రచురించినందుకు ‘మాలిక’ పత్రికకు, జ్యోతి వలబోజు గారికి… హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2013 లో మొట్టమొదటిసారి జ్యోతిని కలిసాను.. అప్పటి నా ‘మానసపుత్రి’ వీడియో కధని ప్రచురించి ప్రోత్సహించారామె. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ … కొత్తగా రచనలు చేస్తున్నవారిని, చేయి తిరిగిన రచయిత్రులని చక్కగా కలుపుకుంటూ ముందుకు సాగుతారామె. ఆమెలా నేనుండలేనబ్బా.. నావల్ల కాదు.. అందుకే SHE IS A CUT ABOVE …. ధన్యవాదాలు జ్యోతి గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

May 2021
M T W T F S S
« Apr   Jun »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31