August 17, 2022

సురవరం మొగ్గలు చిరస్మరణీయ గుర్తులు

సమీక్ష: – బోల యాదయ్య

తెలుగు సాహిత్యంలో కొందరు చిరస్థాయిగా నిలిచిపోయే వారున్నారు. వారు తెలుగు భాషాభివృద్దిని , తెలుగు వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టి సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయారు. అందులో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక్కరు. అజ్ఞానమును పారద్రోలి ఐక్యమత్యమును పెంపొందించి తెలంగాణ ప్రజలను మేల్కోల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి. కవిగా , రచయితగా, పరిశోధకుడిగా , పత్రికసంపాదకుడిగా, భిన్న కోణాలలో తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేశారు. అట్లాంటి మహనీయుని సంస్మరిస్తూ అతని 124వ జయంతిని పురస్కరించుకుని 124 మంది కవులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సృష్టించిన మొగ్గలు ఆధునిక నూతన వచన కవితా ప్రక్రియలో అతని హృదయాన్ని ఆవిష్కరించారు. సురవరం ప్రతాపరెడ్డి మే 28 1896లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా , ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించాడు.

ఒక్కొక్కరు ఒక్కో శైలిలో తమదైన ముద్రతో సురవరం ప్రతాపరెడ్డి కీర్తిని , యశస్సును ,తెగువను ,మొగ్గలతో అభిషేకించారు. ఇందులో కొన్ని మొగ్గలను పట్టుకుంటే ఆనాటి స్మృతులను నెమరేసుకున్నట్లుంటది. రాజశేఖర్ సిద్ధాంతి రాసిన మొగ్గలో కఠినమైన అంక్షల నడుమ కావ్యమై సురవరం పూసిండంటడు.

“ఎన్ని అంక్షలున్నా అక్షరాలను అక్షింతలుగా తలచి
ఎదురు నిల్చినది కావ్యత్కార్య తపః ప్రతాపం
జీవకళల తెలంగాణ మాగాణపు రైతుబిడ్డ సురవరం”

ఓర్సురాజ్ మానస సురవరం ప్రతాపరెడ్డి ధిక్కార తత్వాన్ని తన కలం మొనలకు అద్దుకొని, అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ రాసిన మొగ్గ

“రాచరిక రక్కసిమూకలను దునుమాడుతూనే
తెలంగాణ పొత్తిళ్ళను విముక్తిఫలాలతో అద్దిండు
తెలంగాణ కాంతిరేఖల వెలుగుదివ్వె సురవరం”

రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజలలో చైతన్యం నింపిన సాహితీయోధుడు సురవరం. అట్లా ప్రజలందరిని కార్యోన్ముఖులను చేసి గోలుకొండ పత్రికను స్థాపించి కవులే లేరని నిందించిన చోట 354 మంది కవుల రచనలను సేకరించి గోల్కొండ కవుల సంచికనేసి, తెలంగాణ కవులకు కళాకారులకు నిలయమని చాటాడు. బైరోజు చంద్రశేఖర్ విప్పిచెప్పిన ఈ మొగ్గ చూడండి

“తెలంగాణలో ఊరురా తిరిగి అక్షరోద్యమంచేసి
కవులకండగా గోల్కొండ కవులసంచికనందించాడు
తెలుగుభాషా ప్రభంజనం మన సురవరం”

తెలుగుజాతికి వరం సురవరం.తెలుగుభాషా సాంస్కృతిక వికాసానికి ఎనలేని కృషిచేసిన భాషాభిమాని. ఆయన చేసిన తెలుగు సాహిత్య కృషికి గుర్తింపుగాను ఆయన రాసిన *ఆంధ్రుల సాంఘిక చరిత్ర* గ్రంథానికి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం ఆయన దీక్షా దక్షతకు నిదర్శనం.

సురవరం మొగ్గలు సంపుటిలో చాలామంది కవులు అతని జీవితంలోని భిన్నపార్శ్వాలను స్మృశించారు. ఆనాటి కవులనుండి ఈనాటి యువకవుల దాకా ఈ చారిత్రక మొగ్గల సంపుటిలో స్థానం ఉంది. కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ , కపిలవాయి అశోక్ బాబు, కర్నాటి రఘురాములు గౌడ్, శాంతారెడ్డి , ఉప్పరి తిరుమలేష్ , బాదేపల్లి వెంకటయ్య, సర్ఫరాజ్ అన్వర్ , సైదులు ఖేతావత్ , డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, కొప్పోలు యాదయ్య , బర్క శశాంక్, సహని, అతినారపు హరిశంకర్, కమ్మరి శిరీష ,సనాఅర్షిన్, అనుపటి హేమలత తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని శతాధిక కవులు ఆయనను స్మరిస్తూ అక్షరార్చన చేశారు.

సురవరం ధిక్కారతత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతి ఒక్క మొగ్గపాదంలో పదిలం చేశారు. స్థితప్రజ్ఞత, కార్యదీక్షత , రాజీపడని మనస్తత్వం, ముక్కుసూటితత్వం కలవాడు సురవరం ప్రతాపరెడ్డి అని అతని జీవనశైలిని, సామాజిక దృక్పథాన్ని వ్యక్తంచేస్తూ మొగ్గలన్నీ పువ్వులై పరిమాళాన్ని పంచాయి. రేపటి తరానికీ ఆదర్శప్రాయమై నిలిచాయి. ఈ సురవరం మొగ్గలు సాహితీ చరిత్రలో సురవరంలాగే మైలురాయిగా నిలిచిపోతాయని భావిస్తూ…ఆగష్టు 25 1953 లో సురవరం ప్రతాపరెడ్డి మరణించినా కవుల హృదయాలలో, వారి సిరాచుక్కలలో నిత్యం అక్షరాలై సజీవంగానే ఉన్నడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *