March 29, 2024

అత్తగారూ… ఆడపడుచు…

రచన: — మణి గోవిందరాజుల

“రండి రండి వదినగారూ! నిన్న ఉండమంటే ఉండకుండా వెళ్ళారు. ఈ రోజు ఇంత ఆలస్యంగానా రావడం?” లోపలికి వస్తున్న వియ్యాలవారిని ఎదురెళ్ళి సంతోషంగా ఆహ్వానించారు దమయంతీ వాసుదేవ్ లు.
“కాస్త ఊళ్ళో సెంటర్లో ఇల్లు తీసుకోవచ్చుకదండీ. వందసార్లు తిరిగే వాళ్ళం. అబ్బ! వదినగారూ! చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఈ చీరలో సూపరున్నారండీ” సరదాగా మాట్లాడుతూనే పొగడుతూ లోపలికి వచ్చింది పెద్ద వియ్యపురాలు.
మురిసిపోయింది దమయంతి. “మీరు మరీను..రండి లోపలికి”
చిన్నకోడలు సీమంతం పేరంటం. బంధువులందరూ ఒక్కొక్కళు వస్తున్నారు. దమయంతికి పెద్ద వియ్యపురాలంటే, రెండో వియ్యపురాలంటే ప్రేమ ఎక్కువ. బాగా ఉన్నవాళ్ళు. చూట్టానికి రిచ్ గా కనపడతారు అని పెద్దావిడంటే, నోరు తెరిస్తే పొగుడుతుందని చిన్నావిడంటే ప్రేమ. . అదేమి పిచ్చో మరి దమయంతికి ఉన్నవాళ్ళంటే అభిమానం. బాగా ఉన్నవాళ్ళు తన ఫ్రెండ్స్ అని చెప్పుకోవటం మరీ ఎక్కువ ఇష్టం. తర్వాతి కోడళ్ళిద్దరూ తక్కువవాళ్లేమీ కాకపోయినా కంపారిటివ్ గా పెద్ద వియ్యపురాలికంటే కొద్దిగా తక్కువ. రెండో వియ్యపురాలు లౌక్యం తెలిసిన మనిషి. అందుకని వాళ్ళంటే కూడా ఇష్టమే. ఇక మూడో వాళ్ళొచ్చేసరికి అంత తెలివితేటలు,ఆస్తి, లౌక్యం లేని వాళ్ళు. దమయంతి నాకందరూ సమానమే అన్నా పైవాళ్ళు ఇద్దరూ కొద్దిగా ఎక్కువ సమానం.
ఇంతలో నిండు చూలాలు, సీమంతం పెళ్ళికూతురును తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది హాలు. వచ్చిన వాళ్ళు అందరూ కళ్ళు తిప్పుకోలేకపోయారు.
వెలిగిపోతున్నది సీమంతం పెళ్ళికూతురు కిరణ్మయి. దమయంతి, అందమైన కోడళ్ళు కావాలని ఏరి కోరి మరీ చేసుకున్నది. నిజం చెప్పాలంటే కిరణ్ అందం ముందు దినేష్ తక్కువే ఉంటాడు. కాని మగవాళ్ళ అందం, ఆడవాళ్ళ జీతం పెద్ద పట్టించుకోవలసిన పని లేదనుకుని మిగతా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నదని, తమకంటే ఉన్నత స్థానంలో ఉన్నారని, కిరణ్మయి తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే మొదలే తక్కువగా మాట్లాడేవాళ్ళు, పెళ్ళిలో దమయంతి చేసిన గొడవకు మూగవాళ్ళయ్యారు.
ఎన్నో షాపులు తిరిగి అందమైన కోడలి కోసం దమయంతి కొన్న ఎర్రని పట్టుచీర, దానికి మ్యాచింగ్ గా టైలర్ల బుర్ర తిని కుట్టించిన డిజైనర్ జాకీటు, ఎర్రని, ఆకుపచ్చని మట్టి గాజులు, మధ్యలో కొత్త బంగారపు గాజులు సహజమైన కిరణ్మయి అందం ముందు “మేము నీ అందంతో పోటీ పడలేము బాబూ” అంటున్నాయి. ప్రత్యేకంగా సీమంతం కోసం ఆర్దర్ ఇచ్చి చేయించిన స్వాతీ హారం, పైన కెంపుల నెక్లేస్ కూడా గర్వంతో చూడబోయి ఆమె అందం ముందు తల వంచుకున్నాయి. చెవులకు పెట్టిన కెంపుల జుంకాలు అవునన్నట్లుగా తల ఊపుతున్నాయి. తొమ్మిదవనెల కడుపుతో సహజమైన అందంతో వెలిగిపోతున్నదే కాని కిరణ్మయి మోములో ఏ మాత్రం వెలుగులేదు. ఇంకా చెప్పాలంటే చిన్నబుచ్చుకుని ఉన్నది. కళ్లల్లోని నిస్పృహ పెదవులమీది చిరునవ్వును పేలవంగా మారుస్తున్నది. అన్యమనస్కంగానే ముత్తైదువులకు గాజులు, తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకు, కూర్చున్న కుర్చీలోనుండి కొద్దిగా భారంగా వంగి దండం పెడుతున్నది. చూపరులు దృష్టి తిప్పుకోలేకపోతున్నారు.
“నా కోడలుని అంతలా చూడకండి దిష్టి తగులుతుంది” హాస్యంగా అంటూ వేరే ఎవరో వస్తే అటు వెళ్ళింది. దమయంతి. అది నిజమే అయినా ఆమె అన్న పద్ధతికి అందరూ చాటుగా మూతి తిప్పుకున్నారు “ఈమెకు మాత్రమే ఉంది అందమైన కోడలు” అంటూ.
దమయంతికి వచ్చిన కొత్తవాళ్ళకు తనకు కోడళ్ళంటే ఎంత ప్రేమో, వాళ్ళకోసం తానెంత కష్టపడుతున్నదో, ఈ రోజు కిరణ్మయి కట్టుకున్న చీర తానెంత అపురూపంగా తెచ్చిందో చెప్పుకోవడంతోనే సరిపోతున్నది. వాళ్ళు కూడా “అబ్బ నువ్వు ఎంత మంచి అత్తగారివి” అని మెచ్చుకుంటుంటే ఆనందంతో పొంగిపోతున్నది. కాని ఇంతమందిలో దమయంతి ఏకైక కూతురు సౌమ్య ఒక్కతే కిరణ్మయిలోని ఉదాసీనతను గమనిస్తున్నది. మరదలి మోములో లేని వెలుగుకు కారణం తెలిసి బాధతో పరిష్కారం ఆలోచిస్తున్నది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే, వచ్చిన వాళ్ళను ఆదరంగా రిసీవ్ చేసుకుంటూనే మరదలు దగ్గరకొచ్చి ఏమి కావాలో ఆప్యాయంగా కనుక్కుంటున్నది.
చిన్నగా వచ్చిన వారందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. “కిరణ్! వెళ్ళి పడుకో… నడుము లాగేస్తుందేమో” చెప్పింది సౌమ్య. వెంటనే పక్కనే ఉన్న వారందరూ కూడా అదే చెప్పారు. అందరికీ నవ్వుతూ ఉంటానని చెప్పి గదిలో కెళ్ళి మంచం మీద బ్యాక్ రెస్ట్ కు ఆనుకుని కళ్ళు మూసుకుంది. మూసుకున్న కళ్ళల్లో నుండి ధారగా కన్నీళ్ళు కారుతున్నాయి. ఇంతలో ఒక చల్లని చేయి ఆ నీళ్లని తుడుస్తుంటే తల్లేమో అనుకుని కంగారుగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ప్రేమగా చూస్తున్న ఆడపడుచు కనపడింది. ఇంకా కంగారు పడింది “కంట్లో ఏదో నలక పడింది వదినా. అందుకే నీళ్ళు కారుతున్నాయి” కళ్ళు తుడుచుకొంటూ గబ గబా చెప్పింది.
మరదలిని గట్టిగా హగ్ చేసుకుంది సౌమ్య. ఆ మాటల్ని పట్టించుకోనట్లుగా “ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మా తమ్ముడు చూసాడంటే కవిత్వం వచ్చేస్తుంది వాడికి” నవ్వుతూ చెప్పింది. ఏమీ మాట్లాడకుండా నించుంది కిరణ్మయి. మామూలుగా అయితే ఆ సందర్భం గుర్తు చేసుకుని నవ్వుకునేవారు. కాని ఇప్పుడు ఏదీ పట్టించుకునే మూడ్ లో మరదలు లేదని గ్రహించింది. “కిరణ్! ఈ నగలూ, ఈ బట్తలూ విసుగ్గా ఉన్నాయేమో కదా? నువు బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవ్వు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇక మనమే ఉన్నాము. తొందరగా వస్తే డిన్నర్ చేయొచ్చు” అనునయంగా చెప్పి వెళ్ళబోయింది.
“వదినా” చేయిపట్టుకుని ఆపింది వదినను. “నాకస్సలు ఓపిగ్గా లేదు. మీరు చెప్తారా అత్తయ్యగారితో? నేను పడుకుంటాను”
ఒక్క క్షణం నిశితంగా మరదలిని గమనించింది. వెంటనే “అమ్మతో నేను చెప్తాలే కాని. నువు ఫ్రెష్ అయ్యి రా. నీకు ఇక్కడికే తెస్తాను. నువు తినకుండా పడుకుంటానంటే కుదరదు” చెప్పి బయటకెళ్ళిపోయింది.
చిన్నగా లేచి బట్టలు తీసుకుని వాష్ రూంలోకి వెళ్ళి టవల్ కొక్కేనికి తగిలించి వాష్‌బేసిన్ దగ్గరకొచ్చి టాప్ తిప్పి మొహానికి చల్లటి నీళ్ళు కొట్టి అద్దంలోకి చూస్తే తన మొహం కాక ఇంకెవరిదో చూసినట్లనిపించింది. నిన్న అందరిముందూ తల్లీ తండ్రికి జరిగిన అవమానం, ఆ తర్వాత భర్తతో జరిగిన గొడవా గుర్తొచ్చాయి.”ఛీ! ఏమిటీ జీవితం? తన జీవితంలో ఏ ఫంక్షనూ హాయిగా జరుపుకునే గీత లేదా? పెళ్ళంతా ఏడుపులూ పెడబొబ్బలతోనే అయింది. ఆ క్షణాన మొదలైన ఏడుపు ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నది. ఆ తర్వాత పిల్లలే వద్దనుకుంటే నెల తిరిగేసరికి నెలతప్పింది. అత్తగారికేమో ఆరాటం ఎక్కువా ఓపిక తక్కువా. మొగుడికేమో ఆలోచన తక్కువా ఆరాటం ఎక్కువా. ఈ రెండిటికీ ఒకరి మీద ఒకరికి ప్రేమెక్కువ. ఏ పని చేసినా వెక్కిరించటంలో అప”హాస్యం” ఎక్కువ (అనుకుంటారు హాస్యంగా అన్నామని). ఇవన్నీ కాక వాడు చెప్పిన మాట వినొచ్చుకదా అంటుంది అత్తగారు. అమ్మ చెప్పిన మాట వినొచ్చు కదా అంటాడు వాడు, అంటే మొగుడుగారు. తన అభిప్రాయాలకు, ఇష్టాలకూ విలువలేదా? ఒకరిని ఇబ్బంది పెట్టకుండా తన మనసు చెప్పినట్లు తానుండకూడదా? అత్తయ్య చెడ్డదేమీ కాదు . తనకూ తెలుసా సంగతి. ఇంకా చెప్పాలంటే అమాయకత్వంతో కూడి అహంకారం. చుట్టూ ఉన్నవాళ్ళ వల్ల అహంకారమే ఎక్స్పోజ్ అవుతున్నది. ఆ అహంకారం భరించలేకుండా ఉన్నా ఎలానో భరిస్తున్నది. కాని తన వారి దగ్గరనుండి పొగడ్తలు లేవనీ, వారికంటే తక్కువ వారమన్న సిల్లీ కారణాలతో తమను చిన్న చూపు చూడటం కష్టంగా ఉన్నది. అసలు మామగారు ఆవిణ్ణి బాగా గారాబం చేసారు. పిల్లలకు రాలేదేంటో ఆ పోలిక. దినేష్ ఎంతసేపూ అమ్మ మాట విను, అమ్మను ఆమెకిష్టమైనట్లుగా పొగుడు అంటాడు. కాని పొగడ్త అనేది మనసునుండి వస్తే పూవుకు తావి అబ్బినట్లుగా ఉంటుంది. బలవంతాన ఎలా పొగడగలం?.
“కిరణ్ ఇంకా కాలేదా ఫ్రెష్ అవడం?” తలుపు తడుతూ అడిగింది సౌమ్య.
అలోచనలనుండి ఒక్కసారిగా బయటకొచ్చిన కిరణ్మయి “వస్తున్నా వదినా!” అని మొహం తుడుచుకుంటున్నట్లుగా టవల్ అడ్డు పెట్టుకుని బయటకొచ్చింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని సౌమ్యను చూసి నవ్వింది. పేలవంగా ఉన్న ఆ నవ్వును పసిగట్టినా గమనించనట్లే “రా! కిరణ్! కొద్దిగా ఎంగిలి పడు. ఈ ప్రేమంతా నీ మీద కాదు. నా తరువాతి తరం ఆడపడుచుమీద” పొట్ట మీద మృదువుగా రాస్తూ సరదాగా అన్నది.
అప్పుడే లోపలనుండి ఒక్కసారిగా తన్నిన బిడ్డకు ఆకలి తీర్చాలని గుర్తొచ్చి అన్నం ముందు పెట్టుకుంది. చిన్నగా ఏవో కబుర్లు చెబుతూ సౌమ్య అన్నమంతా తినిపించి దిష్టి తీసినట్లుగా ఖాళీ కంచం కిరణ్ తలచుట్టూ తిప్పి “కిరణ్! ఏమీ ఆలోచించకుండా రాబోయే బిడ్డను తలుచుకుంటూ పడుకో” ఆడపడుచు ఆపేక్షకు కళ్ళు చెమ్మగిల్లాయి కిరణ్ కి. సౌమ్య చేతిని గట్టిగా నొక్కి వదిలేసింది.
“హావ్ ఎ గుడ్ స్లీప్” తలుపు దగ్గరగా వేస్తూ చెప్పి వెళ్ళిపోయింది సౌమ్య. సౌమ్య వెళ్ళినా ఆలోచనలు కిరణ్మయిని వదల్లేదు. అమ్మావాళ్ళు నిన్ననే వచ్చి ఇంటిపనుల్లో సాయం చేయసాగారు. ఇంటినిండా చిన్నత్తగార్ల, చినమామగార్ల కుటుంబాలు ఉన్నాయి. అందరూ అలా కూర్చుని సహాయానికి రాకపోయిన పట్టించుకోకుండా అమ్మ ఎంత పని చేసింది?. పనిలో సహాయం చేసినంత మాత్రాన పని వాళ్ళవుతారా? పైనుండి చేసింది ఎవరికి? వాళ్ళకే కదా? ఆడపిల్ల పేరెంట్స్ కి ఆస్తి తక్కువున్నంత మాత్రాన వాళ్ళకు అభిమానం ఆత్మగౌరవం ఉండకూడదా? ఏమాటంటే అది ఎదురాడకుండా పడాలా?
మధ్యాహ్నం భోజనాలయ్యాక పెదతోటికోడలు తల్లి తాను తెచ్చిన బట్టలు చూపించింది. నిజానికి ఆవిడ తెచ్చే పని లేదు. కాని అత్తగారిని ప్లీజ్ చేయడానికి సీమంతం జరిగే తనకు తెచ్చే బదులు ఆవిడకు ఖరీదైన చీర తెచ్చి “వదినగారూ. అసలీ చీర షాప్ లో చూడగానే మీరే గుర్తొచ్చారు. ఇది కట్టుకుంటే మీరెంత అందంగా ఉంటారో నాకు తెలుసు. అందుకే నాకు తీసుకోకపోయినా పర్లేదని మీకే తెచ్చాను” అంటూ ఇచ్చింది. చీర నిజంగానే చాలా బాగుంది. చాలా సంతోషంగా ఆ చీర తీసుకుంది అత్తయ్య. సాయంకాలానికి ఆవిడ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత పెట్టుబళ్ళ ముచ్చట వచ్చింది. ఎవరెవరు ఎలా పెట్టారు అన్న మాట వచ్చింది. పెళ్ళిలో బట్టల గురించే గొడవ జరిగింది అన్నది గుర్తుంచుకుని అమ్మా వాళ్ళు తర్వాత ఏదో సందర్భం లో శక్తికి మించినదే అయినా ఖరీదైన బట్టలే తెచ్చారు. అయినా అత్తయ్య తృప్తి పడలేదు. అలుగ్గుడ్డలు తెచ్చారని మొహం మీదే అన్నది. ఇంతలో ఎవరో అది మళ్లీ ఇప్పుడు గుర్తు చేసారు.
“అలుగ్గుడ్డలా ఉందనుకున్నాను కానీ. దానికంటే దరిద్రం. ఆ చీర అలకటానికి కూడా పనికిరాలే” అనే సరికి అది కరెక్టా కాదా అని ఆలోచించకుండా ఆవిణ్ణి ఇంప్రెస్ చేయడానికి అందరూ పెద్దగా నవ్వారు. ఆవిడకు ఇంటి కోడలు బాధ పడుతుందే అన్న ఫీల్ లేదు… మాటలతో ఒకళ్ళని బాధపెడుతున్నానే అన్న ఇంగితం లేదు… ఇంకా ఎందుకు పెద్దరికం. అమ్మా నాన్నా ఆడపిల్లను కన్న పాపానికి మాట్లాడకుండా కూర్చున్నారు. తనకు బాధేసి ఏదొ అనబోయినా అమ్మ సైగ చేసింది. వద్దని. అసలు తానెంత ఆత్మాభిమానం కలది? మాటంటే పడేది కాదు. అలాంటిది ఏడాదిగా నోరుమూసుకుని ఉంటున్నది. అత్తగారి దృష్టిలో అది కూడా తప్పయింది. తన ఆక్టివిటీస్, తాను చేసే అల్లరిపనులు అన్నీ మూగబోయాయి. ఏ పని చేస్తే కోపం వస్తుందో తెలీదు. ఏది చేస్తే ఆవిడ సంతోషపడతారో అదేమో తాను చేయలేదు. అందుకే ఏదీ చేయలేక ఊరుకుంటున్నది. కానీ ఏదో నిస్పృహ, నిరాసక్తతా తన్ను ఆవరించి తనను అన్నిటికీ అశక్తురాలిని చేస్తున్నాయి.
ఆ రోజు రాత్రి తన బాధ దినేశ్ తో చెప్పుకోబోతే రివర్స్ తననే అన్నాడు, “అమ్మ నీ గురించి ఎంత ఆలోచించి ఎంత చేస్తున్నది? ఏ అత్తగారన్నా కోడలి కోసం అంతలా తిరిగి తీసుకుంటుందా? మా అమ్మ కాబట్టే చేస్తున్నది. అయినా నిన్నేమడుగుతున్నాను? ఆవిడ కిష్టమైనట్లుఉండమంటున్నాను అంతేకదా?” విసుక్కున్నాడు దినేశ్. చిన్నబోయింది తన మనసు. తానేమన్నా నాకు ఖరీదైనవే కొనమన్నదా? అసలు ఏదీ తేకుంటే ఇంకా సంతోషపడేది. అమ్మను గౌరవించొద్దని ఏ బుద్దున్న ఆడపిల్లా అనదు. కాని అభిమానం అస్తమానూ గాయపడుతుంటే ఏ ఆడపిల్ల అయినా ఎలా హాయిగా నవ్వగలదు? చిన్నగా మాటా మాటా పెరిగింది. అయినా ఇలా ఇప్పుడు కాదు పెళ్ళైన మొదటిరాత్రినుండీ ఇదే తంతు. ఆలోచిస్తూ నిద్రలోకి ఎప్పుడు జారుకున్నదో తెలియలేదు.
బయటికి వచ్చిన సౌమ్య కంచం పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. అరుగు తుడుస్తున్న దమయంతి “అయ్యాయా రాణిగారి సేవలు?” వెటకారంగా అడిగింది. అక్కడే ఉన్న కిరణ్మయి తల్లి, కూతురి కడుపు నింపిన సౌమ్య వేపు కృతజ్ఞతగా చూసింది. ఒక అరగంటలో అందరి భోజనాలు అయ్యి కిచెన్ సర్దుకుని అంతా హాల్లో చేరారు. సమయం పది దాటింది. దమయంతి చాలా సంతోషంగా ఉన్నది.
“వదినగారూ! మరి మేమెళ్ళొస్తాము. కిరణ్ నిద్రపోతున్నది. అలసి ఉంటుంది లేపడమెందుకు. మీరు చెప్పండి. అల్లుడుగారూ! వెళ్ళొస్తామండీ. అన్నయ్యగారూ! వెళ్ళొస్తామండీ. అమ్మా! సౌమ్యా వెళ్ళొస్తాము” అందరికీ పేరు పేరు నా చెప్పి వెళ్ళిపోయారు కిరణ్మయి తలితండ్రులు.
“ఎంత బాగా జరిగింది కదా ఫంక్షను? వచ్చిన అందరూ నన్ను మెచ్చుకునేవాళ్లే. అబ్బబ్బబ్బా… వినలేక చచ్ఛిపోయాననుకో. సౌమ్యా! మీ వాళ్ళందరూ కూడా వస్తే బాగుండేది. ఒక్కదానివే వచ్చావు. ఎలాగూ మీ పెద్దన్నయ్యా, చిన్నన్నయ్యా వాళ్ళు విదేశాల్లోనే ఉన్నారాయె. ఎంతైనా మీ పెద్దన్న అత్తగారికి తెలిసినంత మర్యాదలు ఇంకెవరికీ తెలియవు. అసలు పద్ధతి కాకపోయినా ఎంత మంచి చీర తెచ్చిందో. ఇక మీ తమ్ముడి అత్తగారు తెచ్చిన చీర చూడా…” ఇంకా ఏదో చెప్పబోతున్న దమయంతి కూతురు సౌమ్య “అమ్మా!ఆఆ…” అని అరిచిన అరుపుకు దడ్చుకుని ఆగింది.
తనను తాను కంట్రోల్ చేసుకుంది సౌమ్య. దినేష్, వాసుదేవ్ లు ఆశ్చర్యంగా చూస్తున్నారు సౌమ్యవేపు. అప్పటికి తేరుకున్న దమయంతి “ఏమైందే నీకు సడన్ గా?” వీపు మీద కొట్టుకుంటూ అడిగింది.
“అమ్మా! నువ్వేమి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతున్నదా?” అడిగింది సౌమ్య.
“నేనేమి మాట్లాడాను? వాళ్ళందరూ నన్ను పొగిడారు అని…” పూర్తి చేయనీయలేదు సౌమ్య
“అమ్మా! నిన్ను చూస్తే జాలేస్తున్నది. పొగడ్తలే జీవితమా? కొడుకులంటే ప్రేమంటావు. కాని వాళ్ళ జీవితభాగస్వాములైన కోడళ్ళంటే ప్రేమ లేదు. కాని ప్రేమ ఉందని చూపించుకోవడానికి వాళ్ళకోసం ఎన్నో చేస్తావు. ఒక్కసారన్నా వాళ్ళమనసు అర్థం చేసుకున్నావా? అంటే నువు నీ కోడళ్ళకు చేసేదంతా బయటి వాళ్ళకోసమా? పై ఇద్దరు కోడళ్లూ ఎక్కడో దూరాన ఉన్నారు. ఎపుడో వెళ్ళినప్పుడు ఆహా అనుకుని వచ్చేస్తావు,కాని ఇక్కడ నీ దగ్గరే ఉన్న నీ చిన్న కోడలి మనసెప్పుడన్నా అర్థం చేసుకున్నావా?”
“ఏంటీ? అర్థం చేసుకోలేదా? నీకలా చెప్పిందా? ఇప్పుడే అడుగుతానుండు?” లేవబోయింది దమయంతి.
“అమ్మా! ఆగు. కొద్దిగా నేను చెప్పేది విను. నాన్నా, తమ్ముడూ మీరు కూడా వినాలి” లేచెళ్ళి తలుపు తోసి చూసింది. అటు తిరిగి పడుకున్న కిరణ్మయి గాఢ నిద్రలో ఉన్నట్లు శ్వాస భారంగా వదుల్తున్నది. తలుపు పూర్తిగా వేసి వచ్చి తల్లి కాళ్ళదగ్గర కూర్చుంది. “అమ్మా! నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను మా అత్తగారింట్లో”
“ఉండవూ మరి…కాస్త పెడుతున్నామా?” అతిశయంగా అన్నది”
నవ్వింది సౌమ్య “అమ్మా! నేను అక్కడ సంతోషంగా ఉన్నది నువు పెట్టిన చీరలవల్లో నగలవల్లో కాదమ్మా… మా అత్తగారి వల్ల అని గర్వంగా చెప్తున్నాను. అందరూ నగలకు ఖరీదైన చీరలకు పడిపోరు. వాళ్ళ విశిష్టమైన వ్యక్తిత్వమే వాళ్ళకు పెట్టని ఆభరణం. అమ్మా! మా అత్తగారు నన్ను అర్థం చేసుకుని నా హఠాన్ని సహించి నన్ను వ్యక్తిగా మలిచారు. నీకు తెలుసు నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో? ఇప్పుడు ఎలా ఉన్నానో…నేను నా అత్తగారింట్లో ఎలా సంతోషంగా ఉన్నానో నా పుట్టింట్లో కూడా ఈ ఇంటి కోడళ్ళు అలా సంతోషంగా ఉండాలనేది నా కోరిక అమ్మా”
“సంతోషంగా లేక ఎలా ఉన్నారు? కావలసినంత ఆస్తి, కట్టుకున్నన్ని చీరలు, పెట్టుకున్నన్ని నగలు”
“అయ్యో! అమ్మా! అదే చెప్పేది. సరే ఒకటి చెప్పు ఎలా చూసుకున్నా మా అత్తగారింటి కంటే మనం తక్కువే. కాని ఎప్పుడన్నా ఆవిడ ఆ సంగతి అని నిన్ను ఎత్తిపొడిచారా?”
“ఎలా అంటారు? నేనేమన్నా తక్కువ పెడుతున్నానా?”
విసుగొచ్చింది సౌమ్యకు. “అమ్మా! అన్నీ పెట్టుబళ్లతోనే అవ్వవు. నిన్ను ఒకరు గౌరవిస్తున్నారంటే అది నీ గొప్పతనం కాదు. అది అవతలి వాళ్ళ సంస్కారం కూడాను. అలాగే నువు పెట్టే చీరలూ నగలూ ఆవిడకు ఒక లెక్కలోవి కావు. కాని నువేదిచ్చినా సంతోషంగా తీసుకున్నారు. వాడుకున్నారు. నా ముందు నిన్ను చిన్న మాటనలేదు. మిమ్మల్ని ఏ మాత్రం తక్కువ చేయలేదు. ఇక్కడ నేను చూస్తున్నాను వచ్చినప్పటినుండి. ఒక్క చీర కోసం నువెన్ని సార్లు కిరణ్ ని, వాళ్ళ అమ్మా నాన్న్న ని చిన్నబుచ్చావో. ఆడపిల్ల తానెన్ని కష్టాలు పడుతున్నా పుట్టింట్లో తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కాని నువు వాళ్ళనే డైరెక్ట్ గా అంటే అవమానంతో కుంగిపోతుంది. అదీగాక నేను గమనించినంతవరకు మీ అత్తా కోడళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు, పొడి పొడిగా తప్ప. కోట్ల ధనం ఇచ్చినా కలగని సంతోషం, ఆమె అభిమానాన్ని గౌరవించినప్పుడు కలుగుతుందని నువెప్పుడు తెలుసుకుంటావు అమ్మా” కొద్ది విసుగుతో అన్నది. చిన్నబుచ్చుకుంది దమయంతి.
భార్య చిన్నబోయిన వదనం చూసి తట్టుకోలేకపోయాడు వాసుదేవ్. “అదికాదురా…” అంటూ ఏదో చెప్పబోయాడు. “నువ్వూరుకో నాన్నా. ఇంటి పెద్దగా నువ్వేమి చేస్తున్నావు? అమ్మ అలా అంటున్నప్పుడు అది తప్పు అని చాటుగా కూడా చెప్పలేకపోయావు? నీ పాత్ర ఇంట్లో డమ్మీయేనా? నీ వల్లే అమ్మ అలా అయింది. నిజం గ్రహించలేకపోతున్నది. నీ వంశాన్ని ఉద్ధరించడానికొచ్చిన లక్ష్మీదేవి ఎలా ఉంది అని గమనించాల్సిన బాధ్యత నీది కాదా? చాగంటి వారి ప్రవచనాలు వింటారు కదా? మామా కోడళ్ళ అనుబంధం గురించి ఎంత బాగా చెప్పారు? పాటించని ప్రవచనాలు వినడం ఎందుకు నాన్నా?. చిన్నతనంలో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తూ మంచి క్రమశిక్షణతో మమ్మల్ని పెంచారు. మమ్మల్నెవరన్నా మెచ్చుకుంటే పొంగిపోయారు. తప్పులెన్నితే నిగ్గదీసారు. మాదే తప్పైతే ఎలా ఒప్పుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలోనేర్పించారు. వయసు పెరిగి ఇప్పుడు మీరు పిల్లలయ్యారు. ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పు అని నేను మీకు చెప్పే వయసు నాకు వచ్చింది. అందుకే చెప్తున్నాను… మీరు పొరపాటు చేస్తున్నారు నాన్నా! అమ్మా! చిన్నతల్లి, చదువు అవుతూనే సంసారం అనే రొంపిలో పడింది. పెరిగిన సంస్కారంతో మనసులో బాధ, పెదవులమీద చిరునవ్వుతో తిరుగుతున్నది. ఆ అభిమానవతికి ఈ రోజు నువిచ్చినవి పెట్టుకుంటే పాములు చుట్టుకున్నట్లుగా ఉండి ఉంటుంది”
“అదేంటక్కా అంత మాటలంటున్నావు? పెద్దవాళ్ళను పట్టుకుని? అవి కొనడానికి అమ్మ ఎంత కష్టపడింది?” దినేష్ వారించబోయాడు అమ్మా నాన్నంటే పిచ్చి ప్రేమ దినేష్ కి.
“ఇక నువొక్కడివి మిగిలావురా! ఏరా భార్యంటే నీ తల్లిని పొగిడి బుట్టలో వేసుకునే యంత్రమా? కావాలంటే రికార్డ్ చేసి పెట్టుకుని వందసార్లు అమ్మకు వినిపించు. ఒక్కోసారి పేరెంట్స్ మీద అతి ప్రేమ కూడా మంచిది కాదు. ఎన్నో ఆశలతో నీ ఇంటికొచ్చిన నీ భార్యకు నువేమిస్తున్నావు? అమ్మను ప్రేమించు. భార్యను లాలించు. ఇద్దరికీ ముడిపెట్టకు, అందులో కలగచేసుకోకు. అయినా అమ్మా నాన్నలను చూసి నువు గ్రహించినది ఇంతేనా? వాళ్ళెంత అన్యోన్యంగా ఉంటారు? ఎప్పుడన్నా బామ్మ కలగచేసుకోవటం నువు చూసావా? పోనీ నాన్న మీరు చెప్పండి? నువిలానే ఉండు అని అమ్మను ఎన్నడన్నా ఆదేశించారా? అయినా ఒక్కటి చెప్పరా! నీకు ఇష్టం లేని పని చేయమంటే నువు చేస్తావా? తనైనా అంతే కదా? పెళ్ళై సంవత్సరమే అయింది. ఏ బాధా సంఘటనలు ఆమెని బాధిస్తున్నాయో” సౌమ్య కళ్ళల్లో విషాదం కదలాడింది. “చేసిన నిర్వాకానికి దాని నుండి బయటకు తీయడం కూడా మీ బాధ్యతే. ఇష్టంగా ఆమె అభిమానాన్ని గౌరవించండి… అయిష్టమైనా మీ ఇష్టాల్ని తీర్చడానికి కష్టపడుతుంది. అందుకు ఉదాహరణ నేనే. అందుకే ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ప్రేమ ఇచ్చి ప్రేమ పుచ్చుకోండి అమ్మా! లేకపోతే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో?”
తాను బుద్దులు నేర్పి పెంచిన కూతురు తనకు సుద్దులు చెబుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీటం లేదు దమయంతికి. పెద్దరికం గుర్తొచ్చి ఇగో అడ్డమొస్తున్నది. బుద్ధి వాస్తవాన్ని గ్రహించమటున్నది.
“అమ్మా! ఇందులో ఇగోల సమస్య ఉండకూడదు. పెద్దరికం చిన్నవాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీ కోడలి ఫ్రెండ్స్ నీ కోడల్ని చూసి ఈర్ష్యపడాలే కాని నువు చెప్పుకోకూడదు నువు ఎంత మంచి అత్తగారివొ. “నువు భలే మంచి అత్తగారివి” అని అందరూ చెప్పే మాటలు హృదయం లోనుండి వచ్చేవి కావు. కాని “మీ అత్తగారు చాలా గొప్పావిడ” అని ఈర్ష్యతోనైనా నిజమే చెప్తారు. అమ్మా! ఈ మాటలు నేను మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నా కుటుంబం హాయిగా ఉండడం నాకు ముఖ్యం. పై పై నవ్వులు కాదు. హృదయం లోనుండి రావాలి. అప్పుడే ఇంటి వైబ్రేషన్స్ బాగుంటాయి”
వాసుదేవ్, దినేష్ లు అవాక్కయ్యి వింటున్నారు. తమ్ముడి చెవి పట్టుకుంది…”ఏరా? నీ జీతం కంటే తక్కువా ఆ అమ్మాయిది? ఒకసారి అద్దంలో మొహం చూసుకోరా…ఆ బంగారు తల్లికంటే ఎంత తక్కువో తెలుస్తుంది. అయినా నిన్నెప్పుడన్నా వెక్కిరించిందా?” నవ్వుతున్నట్లు అన్నా తమ్ముడి అజ్ఞానానికి బాధపడుతున్నట్లుగా కళ్ళు చెమ్మగిల్లాయి. “మీ బావగారు నా కంటే అందగాడు. ఉద్యోగం లేదు నాకు. మనకంటే ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకు తెలీదురా ఇలా అనాలని, వెక్కిరించొచ్చని పాపం” నవ్వింది. “ఇప్పుడే మీకు చెప్తున్నాను నేను మళ్లీ ఈ ఇంటికి రావాలంటే నా మరదలు నన్ను ప్రేమగా, సంతోషంగా, ముఖ్యంగా హాయిగా ఆహ్వానించాలి” బెదిరింపుగా అన్నది. “తమ్ముడూ! అమ్మా! ఆ అమ్మాయికి మీతో మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వండి. అప్పుడు మిమ్మల్నెందుకు పొగడదో నేను చూస్తాను” నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయబోయింది.
ఇంతలో గదిలో నుండి “అమ్మా!!!!” అన్న కేక వినపడింది. ముగ్గురూ కంగారుగా లోపలికి పరిగెత్తుకెళ్ళారు. నొప్పులొస్తున్నట్లున్నాయి. అస్థిమితంగా కదులుతున్నది కిరణ్మయి. వెంటనే దినేష్ కార్ కీస్ తీసుకుని “అక్కా కార్ లిఫ్ట్ దగ్గరికి తెస్తాను. మీరు కిందకొచ్చేయండి” పర్స్ జేబులో వేసుకుని బయలుదేరాడు.
***********************
కట్ చేస్తే… “హన్నా! అత్తా కోడళ్ళిద్దరికీ ఇప్పుడు నేను పరాయిదాన్నయ్యానా? ఏం పర్లేదు. నాతో నా మేనకోడలున్నది. వాళ్ళ దోస్తీ కటీఫ్ కదరా బుజ్జితల్లీ” అన్నది సౌమ్య పాపాయిని ఒళ్ళో కూర్చో బెట్టుకుని ఆడిస్తూ, గుస గుసగా ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్న తల్లీ మరదళ్ళని మురిపెంగా చూస్తూ…

25 thoughts on “అత్తగారూ… ఆడపడుచు…

  1. ఒకప్పుడు ఇలాంటి అత్తలు, మొగుళ్ళు ఉండేవారు. ఇప్పుడు తగ్గారు. ఆడపడుచు కూడా అమ్మతో చేరకుండా, స్నేహంగా అర్ధం చేసుకొని, అమ్మకు తమ్ముడుకి బుద్ది చెప్పటం మంచి పరిణామమం. బాగా రాసావు.

  2. కధ కధనం చాలా బాగుంది . కథ చదువుతుంటే సన్నివేశాలు నిజంగా పక్కన జరుగుతున్నంత realistic గా వుంది.

  3. ప్రస్తుత కాలంలో సమాజంలో జరిగే వింత పోకడలను అద్భుతం గా ఆవిష్కరించారు
    శ్రీమతి మణి కుమారి గారు… ధన్యవాదాలు

  4. వర్తమాన కాలంలో అనేక కు టుం బాలు..
    ఇలాంటి సంఘర్షణ నే ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే…
    ఎంతసేపూ…ఆస్తులు, అంతస్తులు,అహంకారాలు…వీటితోటే జీవితాలు సాగితే…అనురాగము, ఆప్యాయత లు….క్రమంగా మృగ్యం అవుతాయి…
    ప్రతి అత్తగారు ఈ కథ చదివి….అర్థం చేసుకొని… కొంచెం మారగలిగితే..
    అత్తా కోడళ్ళు…తల్లీ కూతుళ్లు అవుతారు..
    సున్నితంగా,హృద్యంగా ..విశ్లేషించిన .
    శ్రీమతి మణి అభినందనీయులు…

  5. బంధుత్వాలు -బాంధవ్యాల మధ్య ప్రతి ఇంటా జరిగే ప్రత్యక్ష-పరోక్ష రణరంగాన్ని ర’మణీ’యమైన శైలిలో ప్రస్తుతించారు. రచయిత్రి గా, సమాజంలో మార్పును తేగల మరెన్నో సాహిత్య “మణి”రత్నాలను అందిస్తారని ఆకాంక్ష.

  6. Katha chala bagundi Mani Aunty! Anni characters ki nerchukovalisindhi undi indhulo….time for a selfcheck!!

  7. Nice story! స్నేహం ప్రతీ బంధం కి పునాది. హెచ్చు తగ్గులు వేలెత్తి చూపడం తో వివాహబంధం రాణించదనే నిజం అంత త్వరగా మనసు కి పట్టదు. ఒట్టి మగ పిల్లవాడి తల్లితండ్రులు గానే మిగిలి పోవడం ఆనవాయితీ అయిపోయింది. పెళ్లి కి ఒప్పు కొనేవరకూ ఒక వరస, పెళ్లి మాటలు అయినప్పటి నుండి ఇంకొక వరస. ఎంతసేపూ మేమే గొప్ప అని నిరూపించుకోవాలనే. ఇందులో అవతలి వాళ్ల మనసులు పడే బాధ పట్టదు.

    1. థాంక్యూ సో మచ్… మీరన్నది కరెక్టే… అలానే ఉన్నది ఈ ప్రపంచం…

  8. Nice mani….anni realtions lonu dealing with human relations and emotions chala complicated actibity.ya sowmya character dwara chala mamcji vishayalu cheppavu…nice narration and happy climax. Good going ..keep rocking …

Leave a Reply to Sravya Cancel reply

Your email address will not be published. Required fields are marked *