March 28, 2024

పొరపాటు

రచన: బి. రాజ్యలక్ష్మి

 

డియర్ రేఖా,

ఈ  వుత్తరం చివరివరకూ చదువు ప్లీజ్.  ఆ రోజు నన్ను పిలిచి మరీ ‘ గుడ్ బై ‘ చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయావు.  ఒక్క మాట తో మన స్నేహాన్ని విడిచి పెట్టావు, .  రేఖా నాకు తెలిసినంత వరకు నీతో యెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు.  ఇతరులకు కష్టం కలిగించే మనస్తత్వం కాదు నాది.  నన్ను యెవరైనా బాధిస్తే నాలో నేనే బాధ పడతాను కానీ యెవరిని నిందించను.  మనిద్దరం పక్క పక్క వీధుల్లోనే వుంటున్నామని మనిద్దరం గుళ్లో కలుసుకునేదాకా తెలియదు.  నాకిప్పటికీ బాగా గుర్తు!  ఆ రోజు గుడి మెట్లెక్కుతూ కాలు మెలిక పడి బోర్లాపడ్డావు.  ని వెనుకే యెక్కుతున్న నేను నిన్ను పట్టుకున్నాను.  అందమైన ని కాటుక కళ్లల్లో నీళ్లు!  యిద్దరం మెట్ల పక్కన కూచున్నాం.  నన్ను చూసి నవ్వావు,  నేనూ నవ్వాను.  మెం ఆ వీధిలోకి వచ్చి యేడాది అయ్యింది.  పైగా వూరు కొత్త.  నువ్వు బ్యాంకులో పనిచేస్తున్నావని చెప్పావు.  నేను బళ్లో పంతులమ్మను.

తెలుగు సాహిత్యం మీద మనిద్దరికీ వున్న అభిమానం మన చెలిమిని కలిపింది.  విశ్వనాథగారి ‘వేయి పడగలు ‘ నీకు మక్కువైతే, బాపి రాజు గారి ‘శశిరేఖ ‘ నాకు మక్కువ! వాదించుకునే వాళ్లం, మళ్లీ హాయిగా నవ్వుకుంటూ శీతాకాలపు సాయంకాలం చలిలో వేడి వేడి మిరపకాయల బజ్జిలకోసం బండి దగ్గరకు పరుగెత్తేవాళ్లం!   మనిద్దరి స్నేహం కొద్దిరోజులదైనా యిద్దరి భావాలూ, అభిప్రాయాలూ కలిసాయి.  ఆదివారం వచ్చిందంటే యెంత సంబరమో!  ముత్యం లాంటి మన చెలిమిలో పగులెందుకు వచ్చింది ?నాకు అర్ధం కావడం లేదు.  మన స్నేహం సన్నజాజి పరిమళం అన్న నువ్వేనా రేఖా, యిప్పుడు నిర్లక్ష్యం గా నన్ను చూస్తూ వెళ్లిపోయావు.  కనీసం కారణం చెప్పకుండా స్నేహబంధాన్ని తెంచేసావు.  ఎంతో యెంతో అలోచిస్తే నాకు ఒకటే కారణం కనిపిస్తున్నది

బహుశా నేను అదే కారణం అనుకుంటున్నాను.  నీకు అసలు విషయం తెలియదు కాబట్టి పొరబడి వుంటావు చదివిన తర్వాత అయినా మన స్నేహాన్ని మళ్ళీ చిగురింప చేస్తావని ఆశిస్తున్నాను.

రెండువారాల కిందట ఒక ఆదివారం మనం కలవలేదుగా రేఖా! నేనూ, మా దూరపు బంధువులు భార్యా భర్తా సినిమాకు పార్కుకు వెళ్లాలనుకున్నాం.  అనుకోకుండా అతని భార్య వాంతులు అవడం తో ఆగిపోయింది.  మూడేళ్ల పాపాయి మారాం చేస్తుంటే తప్పనిసరిగా నేనూ. అతనూ. వాళ్ల పాపాయి వెళ్లాము.  అక్కడ నీ స్నేహితురాలు నీలిమ కూడా కనిపించింది.  పాపాయికి నన్ను ‘అమ్మా ‘ అనిపిలవడం అలవాటు.  పాపాయి నాన్న దూరంగా నించున్నాడు.  పాపాయి నన్ను ‘అమ్మా ‘ అని పిలవడం నీలిమ విని వుంటుంది.  నీకు చెప్పి వుంటుంది.  నన్ను పెళ్లి కాని తాళి లేని తల్లి అనుకున్నావు.  నేనంటే అసహ్యం వేసింది.  అవునా!  రేఖా, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.  విచక్షణతో ఆలోచించాలి. .  నన్నే సూటిగా అడిగి వుండొచ్చు కదా! జీవితం చిన్నది.  ప్రతిదీ మనకనుకూలం గా వుండదు.  మన ఆలోచనలను యెదుటివారి వైపు నించి ఆలోచిస్తే చెలిమి నిలుస్తుంది.  నీ చెలిమిని కాంక్షిస్తూ నీ జానకి యెదురు చూస్తుంది

జానకి

రేఖకి తన పొరపాటు అర్ధం అయ్యింది.  తన సంస్కారానికి సిగ్గు పడింది.  మనసు కడిగిన ముత్యం అయ్యింది.  తప్పు దిద్దుకోవడానికి జానకిని కలవడానికి బయలు దేరింది.

 

 

1 thought on “పొరపాటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *