April 16, 2024

1. నివురుకప్పిన నిప్పు – ఉగాది కథలపోటి

రచన: పోలంరాజు శారద

“ఈ రోజు గెస్ట్స్ వస్తున్నారు. మీరిద్దరూ మీ గదిలోకెళ్ళి కూర్చోండి?”
అప్పటి దాకా చెట్లకు నీళ్ళుపట్టి వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న ఆయన కోడలి మాటలకు భార్యకు కళ్ళతోటే సైగ చేసి.
“అట్లాగేనమ్మా! వసూ పద చల్లగాలి మొదలయింది. లోపల కూర్చుందాము. ” కిట్టయ్య అని అందరికీ తెలిసిన ఆ పెద్దమనిషి మెల్లిగా లేచి లోపలికి నడవగానే వసుంధర కూడా లేచి వెళ్తూ, నీలిమ ముఖం చిట్లించుకొని ఏదో గొణుక్కోవడం కనిపించింది.
వచ్చిన బంధువుల మాటలు గలగలమంటూ వినిపిస్తున్నాయి.
“మిస్టర్ రాజేష్ మీ పేరెంట్స్ ఎక్కడుంటారు?” హఠాత్తుగా మేనమామ అడిగిన ప్రశ్నకు రాజేష్ కన్నా ముందరే సమాధానం చెప్పింది నీలిమ.
“ప్రస్తుతానికి మా దగ్గరే ఉన్నారు మామయ్యా. వాళిద్దరికీ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. గదిలోనే పడుకొని ఉంటారు. ”
“అయ్యో అవునా. గదిలోకే వెళ్ళి కలుద్దాము. ” లేవబోతుంటే,
“ఫరవాలేదు అంకుల్. ఇక్కడికే పిలుస్తాను. ”
సాధారణమైన పంచకట్టు పైన చేతుల బనియన్ నుదుట విభూతి పట్టెలు,
వసుంధర ఆయనకు తగ్గట్టే పెద్దబొట్టు ముక్కుపుడక జరీ అంచు చీరతో మామూలు గృహిణిలాగా ఉంది.
వారిద్దరినీ చూడటం తోటే చక్రధర్ అనే ఆ మేనమామ గభాలున లేచి వారి ఎదురుగా వచ్చి ఒక్క క్షణం నిలబడి తేరిపార చూసి,
“జికెసార్. అమ్మా?” అంటూ చటుక్కున వంగి తల ఆయన పాదాలకు తగిలేలా మోకాళ్ళ మీదకు వంగి నమస్కరించాడు.
“మామయ్యా! ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఆయన రాజేష్ నాన్న కిట్టయ్య. . గా. . రు. ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూంటారు. ”
“చిరంజీవ” అని అతని భుజాలు పట్టుకొని లేపి ఆయనను పరిశీలనగా చూసి
“చక్రీ. . ఎన్నేళ్ళకు కనిపించావయ్యా. ఎట్లా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు?” అంటూ ఆప్యాయంగా ప్రశ్నలు కురిపించారు.
“చక్కిమామా నిల్చునే కబుర్లన్నీ చెప్పేసుకుంటారా? నాన్నా కూర్చొని మాట్లాడుకోండి. ” నవ్వుతూ అన్న రాజేష్ మాటలకు అవాక్కయింది నీలిమ.
“వ్వావ్వా. రాజాబాబూ నన్ను గుర్తు పట్టావన్నమాట. ”
“చక్కిమామా, మీకొక్కరికే అనుకున్నారా. నాక్కూడా నాటకాలాడడం బాగానే వచ్చు. మిమ్మల్ని చూడగానే అనుమానం వచ్చింది. ఇంక నా వివరాలు అడుగుతూంటే నిర్థారణ అయిపోయింది. ”
నవ్వుతూ, “రాజును చూడగానే నేను మీ దగ్గర రిసెర్చ్ స్కాలర్గా చేరినప్పుడు మీరు దాదాపు అదే వయసు. మీ పోలికలు చూసి అనుమానం వచ్చి మీ వివరాలు అడగగానే. . . . ఎంత సంతోషమేసిందో తెలుసా. ” పెద్దాయన చేతులు వదలకుండా చెప్తున్న చక్రధర్ కళ్ళల్లో తడి కనిపించింది.
“చక్రీ, మా వియ్యంకులను సార్ అంటున్నావు, నీ రెసెర్చ్ సమయం అంటున్నావు? ఆయనను ఎక్కడ కలిసావు?” అప్పటికి నోరు విప్పాడు నీలిమ తండ్రి.
“కలవడం ఏమిటి బావా? చదువుకునే రోజుల్లో నేను చెప్తూ ఉండేవాణ్ణి జికెసర్ అమ్మ గురించి. మర్చిపోయావా? మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఆయన వద్దేగా నేను రిసెర్చ్ చేయడం. నేనే కాదు అక్కడ చదివిన వారందరికీ దాదాపు ఆయనే గైడ్. ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో ఎన్ని సంస్కరణలో తెచ్చాయి. . . . . . అసలు ఆయన చేసిన పరిశోధన ఒక విప్లవం వంటిది కదా. ”
“అయినా మీకు తెలియక పోవడం ఏమిటి? నీలిమ పెళ్ళయి రెండేళ్ళు అవుతుంటే మీ మామగారి గురించి రాజు ఎప్పుడూ చెప్పలేదా?”
“మా అత్తమామలు గాని నీలిమ గాని నాకు ఆయన గురించి చెప్పే అవకాశం ఇవ్వలేదు చక్కిమామా. ” ఇన్నాళ్ళూ దాచుకున్న ఆవేదన బయటికి వచ్చింది.
“లేదురా, మేము బొంబాయిలోనే ఉండటము, నీలు రాజు పెళ్ళి చేసుకుంటామన్నప్పుడు, తండ్రి వూళ్ళో వ్యవసాయం చేయిస్తున్నారని చెప్పాడు. . . . . పెళ్ళిలో కలవడమే మళ్ళీ కలిసే అవకాశం దొరకలేదు. ”
“అవును చక్రీ ఆయన పేరు కిట్టయ్యగారు కదా, నువ్వేమిటి జికె అంటున్నావు?” పేద్ద ధర్మసందేహం వచ్చింది అక్కగారికి.
“అదా అక్కయ్యా! ఆయన పేరు జి. కృష్ణారావుగారు. నార్త్ ఇండియాలో అందరూ అట్లా చివరిపేరుతో పాప్యులర్. కాకపోతే మా యూనివర్సిటీలో నలుగురు రావుగార్లు ఉండేవారు. అందుకే సార్ను జికె అనేవాళ్ళము. ”
“అవును మామయ్యగారు, మా ఊళ్ళో అందరూ నాన్నను కిట్టయ్యగారు అనే పిలుస్తారు. ”
“మామయ్యా! పెళ్ళయ్యాక ఒక్కసారి ఊరికి తీసుకెళ్ళాడు రాజు. వారు వ్యవసాయదారులని తెలిసింది. అంతకన్నా వివరం నేను అడగలేదు. వాళ్ళు నాలుగునెలల క్రితమే ఇక్కడకు వచ్చారు. అందుకనే అంత వివరాలూ. . . . . . ”
నిజమే కళ్ళకు కనిపించిన దృశ్యంతోటే మైకం కమ్మింది. అమ్మ పెద్ద కవ్వంతో మజ్జిగ చిలకడం, నాన్న పంచె మోకాళ్ళ పైకి ఎగ్గట్టి తోట పనులు చేసుకోవడం, సినిమాలో లాగా ఆడుతు పాడుతు పని చేస్తూంటే అని పాడుకుంటున్నట్టు ముద్ర పడిపోయాక ఇంక అడిగేదేముంది? చెప్పేదేముంది? ఎప్పుడైనా నా చిన్ననాటి కబుర్లు చెప్పబోతే. . . . . ఏముంటాయి రాజూ పల్లెటూరి కబుర్లేగా చెరువులో ఈతలు అమ్మ చేతి గోరుముద్దలు అంటూ కొట్టిపడేసిన భార్య ఆమెకు వంతపాడే అత్తమామల ప్రవర్తన తెలిసి ఇంక వీళ్ళ ముందర తండ్రి గొప్పదనం చులకన చేయనివ్వటానికి అవకాశం ఇవ్వలేదు రాజు.
చక్రధర్కు అర్ధమయింది. అక్కబావల అహంకారం వలువలకు ఆడంబరాలకు హోదాలకు ఇచ్చే విలువ . . . . . . . అంత గొప్ప మనిషిని గుర్తించటానికి ఆయన ఆహార్యము అడ్డువచ్చింది.
క్వార్టర్ వద్ద కూడా అట్లాగే పంచె ఎగ్గట్టి తోటమాలితో సమానంగా చెట్లలో పనిచేస్తూంటే మొదట్లో అమ్మకూడా అభ్యంతరం చెప్పేది. “మీరెందుకండీ, అట్లా శ్రమపడటం. వాళ్ళ చేత చెప్పి చేయించవచ్చు కదా!”
“కాదు వసూ, మనం కూడా పనిలో దిగి చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. అయినా నాకు ఈ పనులు సరదా అని తెలుసు కదా!”
మొదట్లో కాంపస్లో స్టాఫ్ స్టూడెంట్స్ వింతగా చూసేవారు. కాని ఒక ప్రొఫెసర్గా ఆయన ప్రతిభ చూసాక ఎవ్వరికీ ఆయన పనులు నామోషీ అనిపించలేదు.
“బావా! జికెసర్ నిజమైన వ్యవసాయదారులు. కాంపస్లో ఆయన క్వార్టర్ చూడాలి ఒక నందనవనంలాగా ఉండేది. కాలేజీకి వచ్చే సమయంలో చక్కగా సూట్ వేసుకొనే ఈ మహానుభావులను ఇంటివద్ద చూస్తే ఎవరూ నమ్మేవారు కాదు. ”
“గురువుగారి లక్షణాలే ఈ శిష్యులకు అబ్బాయి అమ్మా. ఎక్కడికెళ్ళినా పంచె లాల్చీ కండువాతో తయార్. ఇదిగో ఇప్పుడు కూడా అదే డ్రెస్. ” నవ్వుతూ చక్రిభార్య చెప్పింది.
“ఒక్కొక్కసారి మీ మీద అమితమైన ఈర్ష్య వచ్చేసేదమ్మా. పొద్దున లేచిన దగ్గరి నుండి అమ్మనామజపమే. కన్నతల్లినైనా అంతగా తలచుకున్నారో లేదో. ” మురిపెంగా చూస్తూ అన్నది.
అట్లా ఆ నాటి మధుర స్మృతులలో వారు మునిగి పోయారు.
నీలిమ, తల్లితండ్రులు ఏమి మాట్లాడాలో ఎట్లా స్పందించాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
“అక్కడే కాలేజీలో టెంపరరీ లెక్చరర్ ఉద్యోగం చేస్తూనే. . . . పండగ వచ్చిందంటే చాలు. అమ్మ చేసే పిండివంటలూ జికె సార్ ఇంట్లో కాలక్షేపం గుర్తు చేసుకోకుండా ఉండరు. ఆంధ్రరాష్ట్రం నుండి వెళ్ళిన తెలుగు విద్యార్థులనే కాక స్టాఫ్ను కూడా ఎంతగానో ఆదరించేవారు. .
ఆదివారాలైతే చెప్పనే అక్కరలేదు. ఆ దిబ్బరొట్టె ఆహా. . . . తలుచుకుంటేనా. “ కళ్ళు మూసుకొని తన్మయత్వంతో అంటున్న అతన్ని చూసి అందరూ నవ్వుకున్నారు.
“అమ్మ దగ్గర మనమంతా చాలా నేర్చుకోవాలి. నా పెళ్ళయిన కొత్తల్లో ఎన్ని విషయాలు ఆమె దగ్గర నేర్చుకున్నానో తెలుసా నీలూ. చాలా అదృష్టవంతురాలివి. ఇటువంటి వారికి కోడలు అవడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో!”
“అవును అమ్మా! మీ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారా?” హఠాత్తుగా టాపిక్ ఆవిడవైపుకు మరలేటప్పటికి ఇంకా విస్తుపోయారు.
“చక్కిమామా! అమ్మ ఇప్పుడు చాలాపెద్ద బ్లాగర్ తెలుసా? నాన్న అమ్మకు చక్కటి ప్రోత్సాహం ఇస్తూ లాప్టాప్ ఇచ్చారు. అమ్మకు అది మంచి కాలక్షేపం. ఏషియన్ లిటరరీ ఆర్గనైజేషన్లో అమ్మ కవితలకు మంచి పేరు. అంతే కాదు ఆన్లైన్ క్లాసస్ కూడా చాలాబాగా నడుస్తున్నాయి”
ఎప్పుడూ గదిలో కూర్చొని ఉంటే టివి చూస్తూ ఉంటారేమో అనుకుంటున్న నీలిమకు చిక్కుముళ్ళు ఒక్కొక్కటే విడిపోతున్నట్టు కనిపించింది. . . . . .
“ఇద్దరమూ రిటైర్ అయ్యాక మా స్వగ్రామంలో పొలాల మధ్య ఒక ఫాంహౌజ్ కట్టుకొని ఇట్లా కాలక్షేపం చేస్తున్నాము చక్రీ. రారమ్మని బలవంతం చేస్తే ఈ మధ్య నాలుగు నెలల క్రితమే ఇక్కడకు వచ్చాము. వచ్చేవారం మళ్ళీ వెళ్ళాలి. మా గొడ్డుగోదా మొక్కలు బెంగపెట్టేసుకుంటాయి. ”
“రాజు చెప్పేటంత గొప్పదాన్ని ఏమీ కాదులే. చేసే చేయి తిరిగే కాలు అంటారు కదా. నా టాపిక్ మీద మధ్యమధ్యలో పేపర్స్ రాయడం కొనసాగిస్తున్నాను. ”
“చాలా సంతోషం అమ్మా. మీరు నివురు కప్పిన నిప్పేనమ్మా. ఇంక బయలుదేరుదామా బావా?”
“అయ్యో బయలుదేరటమేమిటి చక్కిమామా. భోజనాలు చేసి పోదురు. ”
“అవును మామయ్యా. భోజనం చేసి పోండి. ఇదిగో ఇప్పుడే స్విగ్గీలో ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ” మొబైల్ తీయబోతున్న నీలిమను ఆపి.
“అట్లాగే…. . అయితే నాదొక షరతు. ”
మొహాలు చూసుకున్నారు.
“అహా, కంగారేమీ లేదు. వచ్చిన నాలుగు నెలలకే జికెసార్ తన వ్యవసాయఫలం అనుకుంటాను లోపలికి వచ్చేముందే ఇంటి సందులో నవనవలాడుతూ చెట్లకు వంకాయలు కాసి కనిపించాయి. ఈ రోజు అమ్మ చేత్తో గుత్తివంకాయ కూర కందిపచ్చడి పచ్చిపులుసు చేస్తే తిందామనిపిస్తోంది.
“ఏమిటండీ మీరు మరీను అమ్మను శ్రమపెట్టడం ఏమిటి? కావాలంటే నీలు సహాయం చేస్తే నేనే వండేస్తానులేండి. ” భార్య గుర్రుమంటూంటే,
“అయ్యో ఇందులో శ్రమ ఏముందమ్మా. అలవాటైన పనే. నాన్నా రాజూ, పో పోయి నువ్వు చక్రీ వంకాయలు కోసుకొని రండి. ఈ లోగా అన్నీ సిద్దం చేస్తాను. ” నవ్వుకుంటూ కొంగు నడుము చుట్టూ తిప్పి దోపుకొని వంటింటి వైపు దారితీసింది.
మాట్లాడుతున్న చక్రధర్ చటుక్కున లేచి బుక్షెల్ఫ్ లోంచి ఒక బుక్ తీసాడు. “ఇదిగో బావా జికెసార్ రిసెర్చ్ పుస్తకం. అందరమూ అదొక వేదంలాగా భావించి చదివే వాళ్ళము. వెనక అట్టవైపు ఆయన గురించి వివరాలతో పాటు హుందాగా సూట్ వేసుకొని ఉన్న జికెగారి ఫోటో చూపిస్తూ, “మీ వియ్యంకులకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన పుస్తకం. అమ్మా నీలూ ఇన్నాళ్ళ నుండి నీ కంటబడలేదా?”
“నీ సబ్జెక్టుకు సంబంధించని పుస్తకాలతో అనవసరంగా షెల్ఫ్ నింపేస్తావెందుకు” అంటూ ఎప్పుడూ విసుక్కునే నీలిమకు ఏమనాలో పాలుపోలేదు. అతి నాగరికంగా తయారయి కిట్టీపార్టీలు అంటూ తిరిగే తల్లికి వియ్యపరాలితో మాట్లాడాలంటేనే చిన్నతనంగా భావించేది.
………….
“చూసావా స్వాతి, మా అక్కయ్య బావల బుద్దులు ఇన్నేళ్ళొచ్చినా మారలేదు. పెళ్ళిలో వియ్యాలవారిని ఎవరికీ పరిచయం చేయను కూడా లేదని మనవాళ్ళు చెప్పారు కదా. వారి కట్టూబొట్టూ వీళ్ళకు చులకన అయిపోయింది. అయినా వలువలతో విలువలు ఉండవని వీళ్ళకు ఎప్పటికి తెలుస్తుందో. ” తిరుగు ప్రయాణంలో భార్యతో వేదనగా అన్నాడు చక్రధర్.
“అవునండీ నాకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వృత్తాంతమే గుర్తు వచ్చింది.”
స్వామి వివేకానందుడు తన ప్రసంగంలో, “ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు” అన్నాడు. ఈ తరం వాళ్ళకు ఆయన ఎవరో తెలియనంత మాత్రాన ఆయన గొప్పదనానికి ఏ లోటూ లేదు. అట్లాగే జికెసార్.
************************

6 thoughts on “1. నివురుకప్పిన నిప్పు – ఉగాది కథలపోటి

  1. ఆహార్యానికే విలువనిస్తూ మనుషుల విలువని అంచనాకట్టలేకపోవటంకాదు మనుషులంటేనే విలువకనపడని వ్యక్తుల కధ ఇది. కళ్ళకు కట్టిన పొరలు విడిపోవడం చక్కగాప్రజెంట్ చేశారు మా.అభినందనలు

  2. అక్కా ! ఎదిగి ఉన్నా, ఒదిగి ఉండడం కొందరికే సాధ్యం !

  3. ఎంత మంచి కథా, కథనం! బాహ్య రూపుని చూసి అంతర్యానికి విలువ ఇవ్వని వాళ్ళు తప్పక చదవాల్సిన కథ.

  4. మంచి కథ.. రచయిత్రి పోలంరాజు శారదగారికి అభినందనలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *