April 19, 2024

10. మాలక్ష్మీజ్యువెల్ – ఉగాది కథలపోటి

రచన: సంధ్య యల్లాప్రగడ

“భోంచేద్దాం రండి!” రవి పిలిచాడు ప్రభాకరరావును.
పలకలేదు ఆయన. ఈ సారి కొద్దిగా గొంతు పెంచి “నాన్నా!” అన్నాడు.
“అరుస్తావేం?” విసుక్కున్నాడు ప్రభాకరరావు.
“అరవలేదు పిలిచాను. రండి భోజనానికి!”
ఇద్దరూ బల్ల దగ్గర చేరారు.
“ఏం ఆలోచించావు?”
‘’మీరేమనుకుంటున్నారు?”
“లాయరు మురళీ అంకుల్ని సలహా అడుగుతాను”.
“సరే!” రెట్టించలేదు రవి. తినటంలో మునిగిపోయాడు.
****
“మురళీ! సమస్య వచ్చిందిరా. . ”
“నీకేం సమస్యలుంటాయిరా. రిటైర్డు మాష్టారువి. కళ్ళలో పెట్టుకు చూసుకునే కోడలు. వదిన త్వరగా కాలం చేసినా లోటులేకుండా పెంచావు రవిని. వాడికి నీ మాటే వేదం. . మనవడు ఇంటికి రానన్నాడా?” నవ్వుతూ అన్నాడు మురళి.
“అవ్వన్నీకాదులే. . . మా ఇంటి అటూ ఇటూ ఉన్నవారు, వారి ఇళ్ళను బిల్డర్కి అమ్మేశారు. నా ఇల్లు కూడా అమ్మమని ఒత్తిడి పెంచుతున్నారు. . ”
“మరి అమ్మేస్తే పోలే. . . నీకు ఎలాగో ఫ్లాట్లు వస్తాయిగా”. . .
“కాని. . . వాళ్ళు ఇంటితో పాటూ మా మాలక్ష్మిని కూడా కొట్టేస్తారురా” బొంగురు పోతున్న కంఠంతో చెప్పాడు ప్రభాకరరావు.
“ఓ, అదా! . . . కుదరదని చెప్పు!”.
“చెప్పానురా! అందుకే వత్తిడి చేశారు. రవి మీద ప్రెషరు తెచ్చారు. వాడు నోట్లో నాలుకలేని వాడుగా. వాడికి ఆఫీసులో నరకము చూపించి ఊస్టింగు ఇచ్చి పంపారురా!” గొంతులో దుఖం జీరతో.
“రవి పని చేసేది వాళ్ళ కంపినీలోనేనా?” అడిగాడు మురళి.
“కాదు. కాని ఆ బిల్డర్లకున్న పరపతి అలాంటిది మరి. ”
“రవేమంటున్నాడు?”
“వాడేమంటాడు? వెర్రినాగ్గన్న! కోడలే కన్నీరు పెట్టుకుందిరా। నీకు తెలుసుగా అమ్మాయి సున్నితమైనది”.
“మరేమి చేస్తానంటావు?”
“అది అడగటానికే నీకు ఫోను చేశాను. .”
“సరే ఒకరోజు టైం ఇవ్వు. ఆలోచించి చెబుతా” అని మురళి ఫోను పెట్టేసాడు.
. . . .
ప్రభాకరరావు రిటైర్డు హెడ్మాష్టరు. ఊరికి దూరంగా ఆయన కట్టిన స్థలము నేడు పెరిగిన సిటీలో సెంటరు. అపార్టుమెంట్ల కల్చరులో అందరూ ఇళ్ళు అమ్మిన్నా ఆయన అమ్మకపోవటానికి కారణము “మాలక్ష్మమ్మ”. ఆయన ఇంటి ప్రాంగణనములో వున్న పురాతనమైన రావి చెట్టు. ఆ చెట్టు వుందనే ఆయనగారి అమ్మ బలవంతాన ఆయన నలభై ఏళ్ళ క్రిందటి ఆ జాగా కొన్నాడు. అప్పటికే ఆ చెట్టు వందేళ్ళ నాటిదని చెప్పాడు స్థలమమ్మిన రైతు. భార్య ఒక కొడుకునిచ్చి స్వర్గస్తురాలయింది. పిల్లలకు చదువు చెబుతూ కొడుకులో భార్యను చూసుకుంటూ గడిపేశాడాయన. మురళి ఆయనకు బాల్య స్నేహితుడు, లాయరు.
తరువాతి రోజు మురళికి ఫోను చేసి చెప్పాడు. . . “ప్రభాకరు! నిన్ను పర్యావరణం వాళ్ళు కాంటాక్టు చేస్తారు. నీ సమస్య వాళ్ళకు చెప్పు”.
“నా సమస్యకు ఇదేనా పరిష్కారము. ?”
“చెప్పింది చెయ్యవయ్యా. మిగిలినవి నే చూసుకుంటాగా”।
“సరే” అన్నాడాయన.
. . . . .
“సార్. మేము పర్యావరణ రక్షణ కోసము పనిచేసే ఎన్. జీ. వో. ఇంత చక్కటి చెట్టు కొట్టేస్తారంటే మేము వూరుకోము. మీకూ ఇష్టము లేదు కాబట్టి మమ్మల్ని లోపలికి రానివ్వండి” అంటూ ఆ రోజు మధ్యాహ్నంకు ఒక నలుగురు వచ్చారు.
మౌనంగా తలవూపాడు ప్రభాకరరావు.
ప్ల కార్డులు, మైకులతో వెనకనే పది మంది వచ్చి హడావిడి సృష్టించారు. ఆ పూటంతా గొడవ చేశారు. మరు రోజు ఉదయము టీవి కెమేరాలు, పేపరు వాళ్ళు వచ్చారు. హడావిడిగా వార్త సేకరించి, ఫోటోలు తీసుకువెళ్ళారు. రెండు రోజులు అన్ని ఛానెల్స్ లో ఇదే వార్త. మ్రోగిపొయ్యింది. వారము తరువాత అంతా నిశ్శబ్దం.
మరో వారము తరువాత ఆయన కోడలు సరస్వతి పని చేసే స్కూల్లో పని తగ్గిందని ఆమెను ఇక పనికి రావద్దన్నారు. ఆరోజంతా ఎవ్వరికీ అన్నం సహించలేదు. ఇద్దరి ఉద్యోగాలు పోయి ఇలా ఇంట్లో కూర్చోవటము చాలా చేతకాని పని అనిపించింది రవికి. సరస్వతికసలు కన్నీరు ఆగటములేదు. సాంప్రదాయక కుటుబములో పెరిగి, ఉన్నారా లేరా అన్నట్లు గడుపుతుండే ఆ కుటుంబానికి అందరి నోట్లో నానటము, జీవనోపాధి పోవటము రెండూ నరకప్రాయంగా వున్నాయి.
ఆయన తల్లి ఆ చెట్టును ఎంతో భక్తితో పూజించేది. ఆమె ఆ చెట్టు మొదట్లో ఒక చిన్న గణపతిని పెట్టింది కూడాను. ఆ చెట్టు మీద వందల పిట్టలు. చెట్టు క్రింద సాయంత్రము ట్యూషన్లు చెబుతూ ప్రభాకరరావు గడుపుతాడు. డెభై ఏళ్ళ ఆయనకు ఆ చెట్టు నేడు తల్లితో సమానము. ‘ఇది నా ఆత్మగౌరవము’ అనుకున్నాడాయన. ఆ రోజు ముగ్గురు కుటుంబ సభ్యులు కూర్చొని ఆలోచించారు.
కొడుకు కూడా తండ్రిని నొప్పించే పని చెయ్యడు. కోడలు ఏమీ అనలేకపోతోంది. నలిగిపోతోంది. వాళ్ళ ఒక్క కొడుకు హైద్రాబాదులో చదువుతున్నాడు. వాడికి డబ్బు పంపాలి.
“నా పెన్షను పంపుదాము. నీవు కంగారు పడకు” అన్నాడు కాని ప్రభకరరావుకు మనస్సు బేజారవుతోంది. తను కంగారు పడితే పిల్లలిద్దరూ మరీ బేలవుతారని గాంభీర్యం పాటిస్తున్నా బెరుకు లోలోపల కృంగతీస్తోంది.
‘నమ్మిన జగదాంబ కాపాడకపోతే మనము మిగులుతామా?’ మనస్సులో మళ్ళీ మళ్ళీ అమ్మవారిని ధ్యానిస్తూ వుండిపోయాడాయన.
“నేను హైద్రాబాదు వెళ్ళి జాబు వెతుక్కుంటే నయమని అనుకుంటున్నా” అన్నాడు చిన్నగా రవి.
“ఈ వయస్సులో నన్ను వదిలా? ఇక్కడే ఏదో ఒకటి చుద్దాము. నీవు తొందర పడకు. . ” అన్నాడు తప్ప ఇంక ఏమీ అనలేకపోయాడు. అంత పురాతనమైవ విశాలమైన చెట్టు కొట్టడము మాత్రము జరగని పని అనుకున్నాడాయన. ‘దానితో పాటూ నేనుకూడా పోవలసినదే’ స్థిరంగా అనుకున్నారు.
రవి తలవంచుకు కూర్చున్నాడు. ‘ఈ గుంటూరులో వీరికి ఎదురు ఏదీ నడవదు నాన్నా’ అనుకున్నాడు మనసులో, బయటకు చెప్పి తండ్రిని నొప్పించలేక. రవి మిత్రుడి కోచింగు సెంటరులో టెంపరరీ ట్యూటరుగా జాబులో కోసము ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. లాయరు మిత్రడు మురళి వచ్చి స్టే కూడా తెద్దామని, వాళ్ళ హరాస్మెంటు కోర్టుకు విన్నవిద్దామని ధైర్యం చెప్పాడు. ముందుగా నోటీసు ఇద్దామని కూడా చెప్పాడు. ప్రభాకరరావు ఇంట్లోకి వెళ్ళటము మానేసాడు. వరండాలోనే ఉంటూ చెట్టును చూస్తూ మౌనముగా ధ్యానిస్తూ వుంటున్నాడు. మిగిలిన ఇద్దరూ ఎంత చెప్పినా వినలేదాయన. దాంతో వారికి కూడా మనశ్శాంతి కరువైయ్యింది.
ఆ రోజు కోడలు ఉదయమే అలవాటుగా ఇంటిపనులు చేసి చెట్టు క్రింద గణపతికి అగరుధూపమేసి, ప్రార్థించింది. ‘మేము చెట్టు, పుట్టా నమ్ముకు బ్రతుకుతుంటే లోకము చెట్లను, వాటితో పాటూ మమ్మల్నీ బ్రతకనిచ్చేలా లేదు. ఉంటే అందరము ఉందాము. పోతే నీతో పాటూ మేము మాలక్ష్మితల్లీ!’ అనుకుందామె కన్నీటితో. . . ఆమె మామగారి వేదన చూడలేకపోతోంది. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ “అమ్మా! నిన్నుకాపాడుకోలేని నిర్భాగ్యులమైనాము. కృపచూడు” అని తిరిగి తిరిగి ప్రార్థించింది. ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటము కూడా మానేసారు. ఒకళ్ళ కళ్ళలోకి ఒకరు చూసుకోవటం కూడా లేదు. ఇంట్లో దీనత్వం వచ్చి స్థిరపడినట్లుగా వుంది. భారంగా రోజులు గడుస్తున్నట్టుంది వారికి.
****
ఎ. ఎస్. బిల్డర్స్ యండీ విక్రమ్ మరు రోజు ఆఫీసు నుంచి కారు దగ్గరకు నడుస్తూ అడిగాడు అసిస్టెంటుని “ఆ మాష్టారు ఏమంటున్నాడు?”
“అది చాలా పురాతనమైన చెట్టు సారు. ప్రభుత్వానికి తెలిస్తే కేసు కూడా. టీవీలలో వచ్చింది. వాళ్ళ లాయరు నోటీసు పంపుతునట్లుగా మన లాయరుగారు చెబుతున్నారు. . అది నేషనల్ ట్రెజరు క్రిందకొస్తుందని. . మనము ఆలోచించాలి సార్. . . ” అన్నాడు.
“ఏంటి మొండితనము. . . డబ్బుకు లొంగని వాళ్ళుంటారా? కావాలంటే పదిలక్షలెక్కువిద్దాము, లాండు కన్నాట్రెజరేమిటయ్యా?” అంటూ కారు వద్దకు నడుస్తుండగా ప్రక్కనే ప్రాంగణములో తుమ్మ చెట్టు కొమ్మ ఒకటి పెద్దది ఊడి కొద్దిపాటి గాలికే వచ్చి విక్రమ్ ముందు పడింది. క్షణములో వెయ్యోవంతులో అతనికి ప్రాణగండం తప్పింది. అసలా కొమ్మ ఎందుకు తెగిపడిందో ఇద్దరికీ అర్థం కాలేదు. షాకు నుంచి తేరుకోవటానికి కొంత టైం పట్టింది విక్రమ్కు.
కొద్దిగా వెనక ఉన్న అసిస్టెంటు, అటుగా ఉన్న డ్రైవరు పరుగున వచ్చారు. . ఇద్దరూ విక్రమ్ ను చుశారు కంగారుగా. . . అతని మొఖం పాలిపోయి వుంది.
‘ఎమిటా వైపరీత్యం?’ అనుకున్నాడు విక్రమ్. . .
“ఆ చెట్టును. . . ” అంటూ ఏదో చెప్పబోయి విక్రం మొఖము చూచి ఊరుకుండిపోయాడు అసిస్టెంటు.
నెమ్మదిగా కారు దగ్గరకు వెళ్ళి తలుపు తీసుకు ఎక్కాడు ఆలోచిస్తూ. . . . దీర్ఘంగా. . . . . ‘ఇది యాధృచ్ఛికమా? లేక ప్రకృతి సందేశమా?’ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు విక్రమ్.
****
ఆ మరునాటి మధ్యహ్నం ఇంటి ముందు ‘ఆడీ’కారు ఆగింది. అది దిగి ఆ కాంపౌండులోకి నడిచాడు ఆ వ్యక్తి.
పెద్ద రావిచెట్టు గంభీరముగా వుంది. చెట్టు మొదట్లో చిన్నగట్టు మధ్య వినాయకుడు. ఒక అగరుబత్తీ తాలుకూ కాలిన బూడిద. ఆ వచ్చినతను ఆ గట్టు మీద కూర్చున్నాడు. మిట్టమధ్యాహ్నపు ఎండలో కూడ చల్లగా ఉంది ఆ చెట్టు నీడన.
“ఎవరూ?” అంటూ వచ్చాడు వరండాలో వున్న ప్రభాకరరావు.
“నమస్కారము మాష్టారు!” అన్నాడతను. .
ఆయన ఎవరో పూర్వ విద్యార్థులనుకున్నాడు.
“మీరు ఈ చెట్టు గురించేనా చాలా మథనపడుతున్నారులా వుంది” అన్నాడా కొత్తగా వచ్చిన వ్యక్తి.
“ఇది నేను పూజించే అమ్మవారు. . . నా ఆత్మగౌరవము బాబు!” అన్నాడాయన దిగులుగా. . . “మనము ఇలా ఏళ్ళ నాటివి కూలగొట్టేసుకుంటే మిగిలేది బూడిదే కదా నాయనా!” అన్నాడాయన గొంతు పూడుకుపోతుంటే.
“మాష్టారూ మీరు చెప్పినది నిజము. డబ్బు వెనక పరిగెత్తినా. . . మనము భూదేవినీ గౌరవించాలి. ఇది ఇంత పూర్వకాలపు చెట్టని నేను అనుకోలేదు. ఇది మీ సంపదే కాదు. . . జాతీయ సంపద కూడా. వందేళ్ళ చెట్టంటే గౌరవించాలి. మీరు చెప్పినది నిజము. . ” ఆగి గట్టిగా ఊపిరిపీల్చి
“బిల్డరు ఈ చెట్టును గౌరవిస్తే, మీరు అపార్మెంటు కట్టడానికి అనుమతి ఇస్తారా?” అడిగాడతను దీక్షగా చూస్తూ.
ఆయన తల ఎత్తి చూసి “ఎవరు బాబూ నీవు? వారికిలాంటి మంచి ఆలోచనలు రావులే నాయనా!” అన్నాడు చిన్నగా.
అతను ఒక కార్డు చేతులో పెట్టి “మీరు ఆలోచించుకొని నాకు ఫోను చెయ్యండి. మీ నిర్ణయము ఏదైనా నేను గౌరవిస్తాను. . మీకు ఇక ఇబ్బంది లేకుండా నేను చూస్తాను” అన్నాడు లేస్తూ.
ఆయన అతనికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి. . . ”ఏమీ తీసుకోకుండా వెళ్ళకూడదు. ఈ నీళ్ళు త్రాగి బయలుదేరు బాబూ!” అన్నాడు.
వచ్చినతను వెళ్ళాక చేతిలో కార్టులోకి చూస్తే – విక్రమ్ ఎమ్. డీ.
ప్రభాకరరావుకి అర్థమయ్యింది. వెంటనే మురళీధర్ను రమ్మన్నాడు. ఇద్దరూ ఆలోచించుకున్నారు. మురళి ముందుండి నడిపిస్తే, చెట్టును ఎట్టి పరిస్థితులలో కొట్టెయ్యకుండా వుండాలని. . . దాన్ని పురాతనమైనదిగా గుర్తించాలని. . దాని మీద హక్కు ప్రభాకరరావుదేనని, చుట్టూ అపార్టుమెంటు కట్టవచ్చని ఒప్పందము కుదిరింది. ఆ ఒప్పందము జరిగిన వారములోనే రవి, కోడలు సరస్వతి కూడా తిరిగి ఉద్యోగాలలో చేరారు.
రెండు ఫ్లాటులతో పాటూ వారికి పది లక్షల డబ్బు ఇవ్వబడింది. ఆ చెట్టును గౌరవిస్తూ ‘మాలక్ష్మీ జ్యువెల్’ వెలసింది. ఆ చెట్టు మూలంగా ఆ వీధిలోనే గాదు ఆ ఊరి చరిత్రలో ప్రభాకరరావు పేరు నిలబడిపొయింది.

******************

1 thought on “10. మాలక్ష్మీజ్యువెల్ – ఉగాది కథలపోటి

  1. వృక్షో రక్షిత రక్షితః| – సున్నిత అంశాన్ని- సంధ్య యల్లాప్రగడ – సున్నిత శైలిలో చెప్పిన చక్కని కథానిక –
    మాలక్ష్మీ జువెల్స్ – ఇచ్చారు, thahank u [[అన్నట్టు నిజంగానే గుంటూర్ లో ఈ సంఘటన జరిగిందా!!?]
    wRkshO rakshita rakshita@h|

Leave a Reply to kusumaamba1955 Cancel reply

Your email address will not be published. Required fields are marked *