April 16, 2024

3. అత్త వెర్సెస్ కోడలు

రచన: జి. యస్ సుబ్బలక్ష్మి

అప్పటికింకా కరోనా మన దేశంలోకి ప్రవేశించలేదు. అసలు లాక్ డౌన్ అన్నమాటే సామాన్య జనాలకు తెలీని రోజుల్లో ఒక డబ్బున్నవాళ్ళబ్బాయికి పెళ్ళి కుదిరింది.
ఇంకేముందీ. . మామూలువాళ్ళే ఉన్న ఒక్క అబ్బాయి పెళ్ళీ, అమ్మాయిపెళ్ళీ ధూమ్ ధామ్ గా చేసేస్తున్న ఆ రోజుల్లో బాగా డబ్బున్న మన రాజా పెళ్ళి ఇంకెంత ఘనంగా చెయ్యాలీ అనుకుంటూ ఎంగేజ్ మెంట్ అవగానే అప్పటికే మరుగున పడిపోయిన సాంప్రదాయాలని తిరగతోడి అయిదురోజులపెళ్ళికి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు ఇరువైపుల పెద్దలూ.
మన సాంప్రదాయమైన పందిరిరాట వెయ్యడం, పెళ్ళికూతుర్ని చెయ్యడంతో పాటు ఉత్తరాది సాంప్రదాయమైన సంగీత్, మెహందీలు కూడా ప్రోగ్రామ్ లో చేర్చేసేరు.
అంతటితో ఊరుకోలేకపోయేరు కాబోయే అత్తగార్లు నలుగురూ. అత్తగార్లు నలుగురూ అంటే పెళ్ళికొడుకు తల్లి అయిన వాణికి మిగిలిన ముగ్గురూ అంటే రుక్మిణి, సంధ్య, పద్మ కజిన్స్. అక్కచెల్లెళ్ళ పిల్లలు. వయసు కూడా వారి ఒక్కొక్కరి మధ్య ఏడాదీ, రెండేళ్ళూ మాత్రమే తేడా వుండడంతో వాళ్ళ నలుగురిమధ్య చాలా స్నేహం. నలుగురూకూడా చాలా చురుకైనవాళ్ళు. చదువులూ, సంగీతాలూ, ఆటలూ, తెలివితేటలూ అన్నీ కలిస్తే వాళ్ళే. వాళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, చుట్టూ వున్నవాళ్లందర్నీకూడా అంత ఉత్సాహంగానూ ఉంచేవాళ్ళు. అలాంటి జట్టులో పెద్దదైన వాణక్కకొడుకు పెళ్ళంటే మిగిలిన కజిన్స్ కి ఎంత ఉత్సాహం ఉంటుందీ! అందుకే పెళ్ళిసమయంలో జరిగే ప్రతి కార్యక్రమంకూడా ఎంతో అందంగా, సరదాగా, హాయిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు వాణీతో కలిసి.
అందరికన్న చిన్నదైన పద్మ దీనికోసం ఒక కొత్త ప్రపోజల్ పెట్టింది అక్కల ముందు. .
“ఈ సంగీత్ లో సినిమాపాటలకి డాన్సులు చెయ్యడం వగైరాలన్నీ సరే. . కానీ కాబోయే కోడలు ఎంత తెలివైనదో తెల్సుకోడానికి మనం అత్తలం నలుగురం కల్సి సరదాగా ఒక పజిల్ ఇస్తే ఎలా ఉంటుందీ. . కాబోయే కోడలు బుర్ర ఎంత చురుకైందో ఇట్టే తెల్సిపోతుంది” అంది.
ఇలాంటివన్నీ అంటే ఆ నలుగురికీ మహా ఇష్టం. చిన్నప్పట్నించీ అందరూ ఆడుకునే ఆటలు కాకుండా రాజకుమార్తెని మాంత్రికుడు ఎత్తుకుపోతే రాజకుమారుడు వెళ్ళి విడిపించడం, పేద్ద పడవలో ప్రయాణాలు చేస్తూ మధ్యలో తుఫానుకి ఏదో దీవి చేరుకోడం లాంటి కొత్త కొత్త ఆటలు కనిపెట్టి ఆడుకునేవారు. అందుకని పద్మ ప్రపోజల్ కి వెంటనే ఆమోదించేసేరు మిగిలినవాళ్ళు. కానీ కొత్త పజిల్ అంటే ఏమిటీ అన్నది తేల్చుకుందుకు వాళ్ళు నలుగురూ మల్లగుల్లాలు పడి ఆఖరికి ఒకదానికి సెటిలయ్యేరు.
ఇంతకీ ఆ పజిల్ ఏమిటంటే ఈ కజిన్స్ నలుగురికీ రెండుమూడేళ్ళ తేడాతో మగపిల్లలున్నారు. అందరూ అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అందులోనూ ఈ పెళ్ళికోసం నలుగురూ ఒక్కలాంటి సూట్లే కుట్టించుకున్నారు. ఆ సూట్లు వేసి నలుగురి ఫొటోలూ తీసి పెట్టుకున్నారు అక్కచెల్లెళ్ళు. ఆ నాలుగు ఫొటోలూ ఒకవైపూ, వారి చిన్నప్పుడు నెలల పిల్లలుగా అంటే బేబీలుగా ఉన్న ఫొటోలు ఇంకోవైపూ గజిబిజిగా పెట్టేసి, పెళ్ళికూతురు రమ్యని ఎవరు బేబీ ఫొటో ఏదో మేచ్ చెయ్యమని పజిల్ పెడదామని వీళ్ళ ఉద్దేశ్యం. ఈ పజిల్ కనక పెళ్ళికూతురు సవ్యంగా పరిష్కరిస్తే తమకి తగ్గ కోడలు వచ్చిందని మురిసిపోవాలని వాళ్ళ అభిప్రాయం. తమకొచ్చిన ఇంత మంచి ఆలోచనకి మురిసిపోయి ఒకరినొకరు అభినందించేసుకున్నారు అక్కచెల్లెళ్ళు.
ఆరోజు ఉదయాన్నే ఆడపెళ్ళివారూ, మగపెళ్ళివారూ ఫంక్షన్ హాల్లో దిగేరు. వెంటనే స్నాతకం చేసేసుకున్నారు మగపెళ్ళివారు. ఇటువారూ, అటువారూ ఒకరినొకరు పరిచయం చేసేసుకున్నారు. మరింక సాయంత్రం ఎదురుసన్నాహం వరకూ ఖాళీయే. అదే సరైన టైమనుకున్న వాణీ, కజిన్సూ ఆడపెళ్ళివారికీ, మగపెళ్ళివారికీ కూడా చుట్టరికం వున్న ఓ మధ్యవర్తిలాంటి ఆవిణ్ణి పిలిచేరు. తామిలా కాబోయే కోడలికి చిన్న పజిల్ లాంటిది ఇస్తామనీ, దాన్ని పెళ్ళికూతురు సాల్వ్ చెయ్యగలదో లేదో చూస్తామనీ చెప్పేరు. ఆ మధ్యనున్న చుట్టపావిడ పేరు భ్రమరాంబ.
భ్రమరాంబ వీళ్లని హెచ్చరించింది. తరాలు మారుతున్నకొద్దీ తెలివితేటలు పెరుగుతున్నాయనీ, ఈ తరం అమ్మాయి, అందులోనూ అన్నింటిలోనూ ఫస్ట్ న వచ్చే అమ్మాయి ఎలాంటి పజిల్ అయినా ఇట్టే సాల్వ్ చేసేస్తుందనీ, వీళ్ళ పెద్దరికానికి భంగం కలుగుతుందేమోననీ చెప్పింది.
వాణీ ఈ మాటకి మహదానందపడిపోయింది. “అంతకన్నానా. . నా కోడలు అంటే నా వారసురాలు నన్ను మించిందయితే ఎంత సంతోషం. ” అంటూ ఈ పజిల్ విషయం పెళ్ళికూతురు రమ్యకి చెప్పి రమ్మని పంపించింది.
పెళ్ళికూతురు రమ్య భ్రమరాంబ తెచ్చిన సందేశం వింది. ఒక్కసారి ఆలోచించింది. నెలల పిల్లలప్పుడు బేబీలందరూ ఇంచుమించు ఒకలాగే ఉంటారు. కాస్త పెద్దయితే కానీ పోలికలు పైకి తేలవు. కాస్త ఆలోచించింది రమ్య. కాబోయే అత్తగార్లముందు ఓడిపోదల్చుకోలేదు. అందుకే వెంటనే భ్రమరాంబతో అంది. .
“అలాగేనండీ. . దానిదేవుందీ. . ఇట్టే పట్టేస్తాను. కానీ నాదీ ఒక పజిల్ ఉంది. మరి దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారా!” అనడిగింది. ఇది వింటున్న చుట్టుపక్కలవాళ్ళు కాస్త ఖంగారుపడ్దారు. అసలే మగపెళ్ళివారు. ఏం తప్పు పట్టుకుంటారో అనుకున్నారు. కానీ భ్రమరాంబ వాళ్ళని సమాధానపరిచింది. అత్తగార్లు నలుగురూ అలా కోపగించుకునే మనుషులుకాదనీ, సరదా మనుషులనీ, రమ్య అడిగిన విషయం స్పోర్టివ్ గా తీసుకుంటారనీ వాళ్లని సమాధానపరిచి, రమ్య ఇచ్చే పజిల్ ఏమిటో చెప్పమంది.
“అదేనండీ. . వాళ్ల దారిలోనే నేనూ నడుస్తాను. వాళ్ళు బేబీ ఫొటోలతో ఇప్పుడు వచ్చిన పెళ్ళికొడుకునీ, తమ్ముళ్ళనీ మేచ్ చెయ్యమన్నారు కదా… అలాగే నేను ఇప్పుడు పెద్దవాళ్ళయిపోయిన మా అమ్మమ్మ తాతగారు, నాన్నమ్మ తాతగారు ఇంకా వాళ్ల ఇద్దరి వియ్యంకులూ కలిసి మొత్తం ఈ నాలుగుజంటల ఇప్పటి ఫొటోలూ, వాళ్ల పెళ్ళినాటి ఫొటోలూ పెడతాను. వాళ్లందరినీ పొద్దున్న స్నాతకం అవుతున్నప్పుడు మా అమ్మగారు వాళ్లకి పరిచయం చేసేరు. ఇంకా కావాలంటే ఈ హాల్లోనే కూర్చునున్నారు జంటలుగా. వాళ్ళ పెళ్ళినాటి ఫొటోలూ, ఇప్పటివీ వాళ్ళు పెట్టినట్టే నేనూ గజిబిజిగా పెడతాను. వాటిని మేచ్ చెయ్యగలరేమో అడిగిచూడండి. ”
చుట్టూ వుండి వింటున్న చుట్టాలు రమ్య తెలివితేటలకి తెల్లబోయేరు. భ్రమరాంబ కయితే ఈ పోటీలో తను మధ్యవర్తి అయినందుకు బలే సంతోషంగా అనిపించింది. అస్సలు ఆలస్యం చెయ్యకుండా రమ్య చెప్పిన విషయాన్ని వాణీకీ, ఆమె కజిన్స్ కీ చేరవేసింది.
విన్న వెంటనే తెల్లబోయేరు అత్తగార్లు నలుగురూ. వెంటనే తేరుకుని రమ్య తెలివితేటలకి మురిసిపోయేరు. కాబోయే కోడలిచ్చిన పజిల్ ని పరిష్కరిస్తామని ఆమోదం తెలిపేసేరు.
అంతే. . వెంటనే వాళ్ళ పిల్లలు బేబీలుగా వున్నప్పటి ఫొటోలూ, ఇప్పుడు సూట్ వేసుకుని తీయించుకున్న ఫొటోలూ వాణీ స్మార్ట్ ఫోన్ నుంచి రమ్యకి పంపించేసేరు. రెండో నిమిషంలో వాణి ఫోన్ కి రమ్య దగ్గర్నుంచి హాల్లో కూర్చున్న నాలుగుజంటల ఫొటోలూ, నాలుగు పాత పెళ్ళిఫొటోలూ వచ్చేసేయి. ఇంక ఆ ఫొటోలని పెద్దవి చేసుకుని పోలికలని గుర్తుపట్టడం మొదలెట్టేరు అక్కచెల్లెళ్ళు నలుగురూ.
అదనుకున్నంత సులభంగా తేలే వ్యవహారంలా కనిపించలేదు వాళ్లకి. ఎందుకంటే పొద్దున్న స్నాతకం జరుగుతున్నప్పుడు అక్కడికి రమ్య అమ్మమ్మ తాతగారూ, నాన్నమ్మ తాతగారూ, వాళ్లతో పాటు వారి వియ్యంకులంటూ మరో ఇద్దరు దంపతులనీ పరిచయం చేసింది రమ్య తల్లి. అప్పుడేదో పెద్దవారు కదా అని నమస్కారాలు పెట్టేసి, ఇంకొంచెం గౌరవం ప్రదర్శిస్తూ వాళ్లకి బొట్టూ, తాంబూలాలూ ఇచ్చేరు. ఇప్పుడు వాళ్లని వాళ్ల పెళ్ళినాటి ఫొటోలతో మేచ్ చెయ్యడమంటే కొంచెం కష్టమే అనిపించింది.
“ఎందుకే అక్కా భయం. . ఆ నాలుగు జంటలూ హాల్లోనే ఉన్నారాయె. ఇంకోసారి వెళ్ళి జాగ్రత్తగా చూసొస్తే సరీ. . ” అంది పద్మ.
“చూసి రావడం సమస్య కాదిక్కడ. ఇప్పుడెలా ఉన్నారో చూస్తావు… కానీ ఇంచుమించు యాభైయేళ్ళక్రితం అంటే వాళ్ళ పెళ్ళిళ్ళనాటికి వాళ్ళెలా ఉన్నారో కనిపెట్టాలి. . అదీ ఇక్కడ సమస్య. . ” అంది రుక్మిణి.
“అంతేకాదు . . యాభైయేళ్ళక్రితం ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి. ఆ రోజుల్లో లైటింగులూ అవీ సరిగ్గా కూడా ఉండేవి కాదు. అలాంటి ఫొటోల్లో పోలికలు పట్టుకోవడం మాటలేంటీ. . ” అంది సంధ్య.
“ఆ మాటకొస్తే మనం ఇచ్చినది మటుకు మామూలు పజిలా! చిన్నప్పుడు నలుగురి బేబీ ఫొటోలూ ఇంచుమించు ఒక్కలాగే ఉన్నాయి కదా! అంత తేలికేం కాదు కనుక్కోవడం. . ” అంది పద్మ.
రుక్మిణి కాస్త ఆలోచిస్తూ, “అతి తెలివికి పోయి మనం తీసిన గోతిలో మనవే పడం కదా!” అంది నెమ్మదిగా.
పద్మ ఛర్రుమని లేచింది. “ఏంటక్కా అంత నీరసపడిపోతావ్. ఆమాత్రం కనుక్కోలేమా. . నీకెందుకు నేను కనిపెట్టేస్తాగా. . ” అని ధైర్యం చెప్పింది.
మొత్తానికి ఎలాగైనా సరే రమ్య పెట్టిన పజిల్ సాల్వ్ చేసి కోడలికన్న తెలివిగలవార మనిపించుకోవాలని నలుగురు అక్కచెల్లెళ్ళూ నిర్ణయించేసుకున్నారు. మరోసారి ఆ నాలుగుజంటలనీ పరీక్షగా చూద్దామని మళ్ళీ హాల్లోకి వెళ్ళేరు. అక్కడ ఆ నాలుగుజంటలూ గుండ్రంగా కుర్చీలు వేసుకుని తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటూ కూల్ డ్రింకులు తాగుతున్నారు. .
బలే మంచి సమయమూ అనుకుంటూ అక్కడికి చేరి వాళ్లతో కబుర్లు మొదలెట్టేరు అక్కాచెల్లెళ్ళు.
వాళ్ళు ముందే ఎవరేం గమనించాలో పంచేసుకున్నారు. వాణి ఎత్తూ, రంగూ చూసేట్టూ, రుక్మిణి కట్టు, బొట్టూ గమనించేట్టూ, సంధ్య మాటా, తీరూ పట్టుకునేట్టూ, పద్మ భార్యాభర్తలమధ్యగల పోలికలని పోల్చుకునేటట్టూ అనేసుకున్నారు.
పైకి కబుర్లు చెపుతున్నట్లున్నా మొత్తం ఎనిమిది కళ్ళతోనూ ఆ నాలుగుజంటల పోలికలనూ మనసులో నిక్షిప్తం చేసేసుకుంటున్నారు. వాళ్ల రంగేమిటో, ఎంత ఎత్తున్నారో, ముక్కు సూటిగా వుందో లేకపోతే చలివిడిముద్దలా తప్పడగా వుందో, పెదాలు సన్నగా వున్నాయో లేక బండ పెదవులో, కళ్ళు సోగగా వున్నాయో లేక చింతాకుల్లాగ చిన్నగా వున్నాయో లాంటివాటితో పాటు వాళ్ళు బట్టలు వేసుకున్న తీరూ, ఆడవాళ్లైతే జుట్టు ఎలా కట్టుకున్నారో దగ్గర్నించి ప్రతి చిన్నదీ చాలా సూక్ష్మంగా గ్రహించేసేరు.
అంతేకాకుండా వాళ్లని జంటలుగా కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఒక జంటయితే అమితాబ్ జయబాధురీలా వుంటే ఇంకో జంట చంద్రమోహన్, ప్రభల్లా వున్నారు. ఒక మగాయన నల్లగా బొగ్గులా వుంటే ఆయన భార్య చందమామంత తెల్లగా వుంది. అన్ని వివరాలూ, విశేషాలూ కనుక్కుని, రూమ్ కి వెళ్ళి పెళ్ళికూతురు రమ పంపించిన వాళ్ల పెళ్ళప్పటి ఫొటోలు ముందు పెట్టుకుని చర్చలు మొదలుపెట్టేరు.
ఒకరినొకరు అవుననుకుంటూ కాదనుకుంటూ, కారణాలు చూపించుకుంటూ, కాదు కాదని వప్పేసుకుంటూ నానా మల్లగుల్లాలు పడి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చేరు.
ఇంతలో మధ్యవర్తి భ్రమరాంబ అక్కడికి “ఎక్కడిదాకా వచ్చేరూ!” అంటూ నవ్వుకుంటూ వచ్చింది.
పద్మ ఆవిడతో గర్వంగా అంది. . “ఇదిగో. . మా పజిల్ పూర్తి చేసేసాం. రమ్యకి ఇంకా ఎంత టైమ్ పడుతుందో కనుక్కురండి. . ” అంది గర్వంగా వాణీ స్మార్ట్ ఫోన్ లో తాము సాల్వ్ చేసిన జంటల ఫొటోలు చూపిస్తూ. .
భ్రమరాంబ నవ్వుతూ “మీ కోడలు మీరు ఫొటోలు పంపిన రెండో నిమిషంలోనే నాకు జవాబు పంపించేసింది. . ”
తెల్లబోయేరు ఆ అత్తగార్లు నలుగురూ. . “అంత తొందరగా ఎలా కనిపెట్టేసిందీ!” అంది పద్మ కుతూహలంగా.
“నేనెప్పుడో చెప్పేను కదా. . ఈ తరం వాళ్ళు మనకంటె ఓ అడుగు ముందుంటారనీ. . మీరు పిల్లల ఫొటోలు పంపకముందే రమ్య తన మొబైల్ లో ఒక యాప్ డౌన్ లోడ్ చేసేసుకుందిట. అదేంటంటే బేబీల ఫొటోలు కనక అందులో పెడితే వాళ్ళు పాతికేళ్ళొచ్చేక ఎలా కనపడతారో చూపిస్తుందిట ఆ యాప్. ఇలా మీరు బేబీల ఫొటోలు పెట్టడమేవిటీ. . అలా రమ్య ఆ యాప్ లోకి వెళ్ళిపోయి నలుగురి బేబీలవీ పెద్దవాళ్లయేక ఎలా వుంటారో చూసేసి, వాళ్లని మేచ్ చేసేసింది. . ” అంది భ్రమరాంబ.
“తూచ్. . ఇది చీటింగ్ అవుతుంది. మేమొప్పుకోం. ” గట్టిగా అంది సంధ్య.
“మేచ్ చెయ్యమన్నారు కానీ యాప్ వాడకూడదని మీరేం నియమాలు పెట్టలేదుగా. . అందుకని రమ్య చేసింది తప్పులోకి రాదు. ఈ పజిల్ సాల్వ్ చెయ్యడంలో మీకన్న రమ్యే ముందుందన్న సంగతి మీరు ఒప్పుకోక తప్పదు. ” అంది నవ్వుతూ భ్రమరాంబ.
ఇంతలో అక్కడికి అమ్మ, అమ్మమ్మలతో కలిసి రమ్య వచ్చింది.
“సారీ అండీ. . యాప్ వాడి పజిల్ సాల్వ్ చెయ్యడం తప్పే. అది చెపుదామనే వచ్చేను. ” అంది నెమ్మదిగా ఎదురుగా కూర్చున్న నలుగురు అత్తగార్లతోనూ. రమ్య వినయానికి ముగ్ధులైపోయేరు ఆ కాబోయే అత్తగార్లు.
నవ్వుతూ లేచి అక్కడే వున్న స్వీట్ రమ్య నోటికి అందిస్తూ,
“తెలివైన కోడలు వినయంగ వుంటే చెల్లెమ్మా. . ఓ చెల్లెమ్మా
మన ఇంటికింక లోటేమి లేదమ్మా. ఆహూ. . ఊహూ. . ఆహూ…ఊహూ. . ”
అని చెల్లెళ్ళని ఉద్దేశించి ఘంటసాలవారి అత్తాకోడళ్ల పాట అందుకుంది అత్తగారు కాబోతున్న వాణి.

******

1 thought on “3. అత్త వెర్సెస్ కోడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *