June 25, 2024

4. హెడ్మాస్టర్ కొడుకు – ఉగాది కథలపోటి

రచన: లక్ష్మీ రాఘవ

“నేను, నా ఫ్రెండ్స్ ఏదైనా కలిసి వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాము నాన్నా” ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకు రాహుల్ మాటలకు జవాబుగా తండ్రి ఆదినారాయణ
“అంతే చేయలేమో. ఈ కరోనా టైమ్‌లో వుద్యోగాలు దొరికేది కష్టం. నీకా కాంపస్ సెలెక్షన్ రాలేదు. ఇంట్లో కూర్చోవడం కంటే మీ ఫ్రెండ్స్అందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి. డబ్బు విషయం ఆలోచిస్తాను” అన్నాడు.
“స్టార్ట్ అప్ కంపెనీల గురించి ఇన్ఫోర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ రోజు సాయంకాలం కానఫరెన్స్ కాల్ చేసి అందరి ఐడియాలు ఎలావున్నాయో మాట్లాడుతాము” అని అన్నాడు.

*******

కోవిడ్ రావటం ఒక భయాన్ని తెచ్చింది. బంధాలు, ఖర్చులు చాలా కోణాలలో చూపుతూ ఎన్నో నేర్పింది.
లాక్ డౌన్ తో తప్పనిసరిగా ఇంట్లోనే అందరూ కలిసి వుండడంతో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం దొరికింది.
ఆ నెలలోనే హెడ్మాస్టర్ గా రిటైర్ అయిన ఆదినారాయణకు ఇంట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకు. పెళ్లి కావాల్సిన కూతురు ఎంతో భారంగా అనిపిస్తున్నారు. కూతురు శిరీష పెళ్లి కోసం భార్య ఆరునెలలుగా పోరుతూనే వుంది. చదువంటే ఇష్టం లేని శిరీష, కష్టం మీద డిగ్రీ పూర్తి చేసినా, ఇష్టంగా సంగీతం నేర్చుకునేది. కరోనాతో ఆన్లైన్ క్లాసెస్ లో సంగీతం నేర్చుకుంటోంది. ఆమె సంగీతం మీద మోజు చూపడం ఆయనకు అస్సలు ఇష్టం కాలేదు. కానీ శిరీషకు చదువు ఎప్పుడూ దూరమే. ఆమె సంగీతంలో ఎక్కడో తండ్రి గోపాలం ఛాయలు కనిపిస్తాయి ఆదినారాయణకు.

*****

ఈ రోజు రాహుల్ సొంతంగా బిజినెస్ ప్రయత్నం అనగానే తాను అనుకున్నరీతిలోనే జీవితం నడుస్తున్నట్టు తృప్తిగా అనిపించింది. వాలు కుర్చీలో కూర్చుని తల వెనక్కి వాల్చి ఒకసారి తన బాల్యం గుర్తుకు తెచ్చుకున్నాడు ఆదినారాయణ. . .
తాత శివయ్య “నారాయణా, పొద్దుగాల లేయాలి, నాతో బాటు అడపం పెట్టె ఎత్తుకోని సామీ వాళ్ళింటికి పోవాలి”
“నేను రాను. నీవు పని చేస్తావుంటే కూసునుండాల” అన్నాడు మొండిగా తాత పక్కనే పడుకొనున్నమనవడు ఆదినారాయణ.
“పని చూస్తూ కూడా నేర్చుకోవచ్చురా. . చివరకు నీవు చేయాల్సినది ఇదే కదా”
“నేను చేయను. నీ మాదిరి ఇండ్లకడాకూ తిరుగుతా వుండేది నాకు ఇష్టం లేదు. అందుకే కదా నాయన నన్ను చదువుకోమన్నాడు” భరోసాగా అంటూన్న వాడి నెత్తిన ఒక్కటిచ్చి. ”పoడుకో పొద్దున ఆలీసం అయిపోతుంది. సామి ఇంట్లో పెద్దమ్మ గారు కాచుకొని వుంటారు. ”
“అవును తాతా, నీవెందుకు ఆయమ్మకు అట్లా రెండునెలలకోకసారి గుండు కొడతావు పాపం. అందరు ఆడోళ్ళలాగా జుట్టు పెంచుకోవచ్చుకద. ” అన్నాడు జాలిగా.
“వుష్. . . ఆమాట ఎవరి ముందైనా అనేవురా. ఆల్లు బ్రామ్మలు. మొగుడు పోయిన తరువాత తలమీద వెంట్రికలు వుంచుకోరురా. ఆయమ్మఅందరితో చేయించుకోదు. ఎక్కువ వయసైన నేను మాత్రమే ఎల్లి చేయ్యాల. ఆయమ్మ పెద్దకొడుకుకు గడ్డం చేయడానికి మీ నాయన పోతాడు కదా“
“గడ్డం ఇప్పుడు అందరూ వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు కదా. పెద్దాయనకు నాయన ఎందుకు చేసేది” నారాయణ సందేహం.
“పెద్దాయన పాతకాలం మనిషిరా. . . అందుకే గడ్డం కూడా మనదగ్గర చేయించుకుంటాడు. తలకు నూనె పెట్టి మర్దనా చేయటం, ఎప్పుడైనా ఒళ్ళంతా నూనె పెట్టి తీడించుకోవడం చేయించుకుంటాడు. అయినా వాళ్ళు వూరికే చేయించుకోరు, పంటలకాలంలో మన పనికి కొన్నిమూటలు వడ్లు ఇస్తారు. మనకు సంవత్సరమంతా తిండి జరిగిపోతుంది. అంతే కాదు అప్పుడప్పుడూ అంతో ఇంతో ఇనాముగా దుడ్లు చేతిలో పెడతారు. ఇట్లా పెద్దోళ్ల ఇల్లు మూడు, నాలుగు వుంటే చాలురా. మన జీవనానికి లోటు లేదు. ” అంటూన్న తాత పక్కకు తిరిగి “ఎందుకో నేను ఇట్లనే పల్లెలోనే వుండలేను తాతా, నేను చదువుకుంటా అని చెప్పుతావున్ననాయనకు”
“కానీలే చూద్దాము. పండుకో, పొద్దుగల లేయాల” అని కళ్ళు మూసుకున్నాడు తాత. నిద్రపట్టలేదు ఆయనకు.
కళ్లముందు కొడుకు గోపాలం కూడా ఒక్క క్షవరం కంటే ఇంకా ఏమైనా చేయ్యాలని తాపత్రయ పడటం గుర్తుకు వచ్చింది. అందుకే గోపాలం ఈ ఒక్క ఆదాయం కాకుండా సంగీతం మీద మోజుతో నాదస్వరం గ్రూపు లో చేరి కొద్దిగా నేర్చుకున్నాడు. పెళ్ళిళ్ళకూ, తిరణాలలో దేవుడి మెరవణికీ ముందుగా మాట్లాడేది ఈ మంగళ వాయిద్యాల గ్రూపునే. ఇదే గోపాలానికి ఇష్ట మైన పని కూడా.
కొన్నాళ్ళకు బ్యాండు వాయిద్యము కూడా నేర్చుకుంటే పబ్లిక్ మీటింగులకి, చిన్నచిన్న ఫంక్షన్స్ కీ పిలుస్తారు. ఇంకా మంచికే కాకుండా చావులకు కూడా బ్యాండును పిలుస్తారు వారి స్థాయిని బట్టి.
ఇవన్నీ తెలిసినాక శివయ్య కూడా కొడుకు ఇష్టాన్ని కాదనలేదు.
వీరిలాటి మరో క్షురక కుటుంబం పల్లెలోనే చిన్నగా బడ్డీ కొట్టు లాటిది పెట్టి వూర్లోనే కొంత మందికి గడ్డాలూ, క్షవరాలూ చేసి సంపాదించడం చూసి గోపాలానికి చెప్పినాడు.
”మనం కూడా ఒక చిన్నషెడ్డు తీసుకుని అట్లా పెట్టుకుందామురా. నేను కూడా పని చెయ్యచ్చు” అని.
గోపాలం “వద్దనే వద్దు. మేళం కోసం నేనెళ్ళిపోతే నీవు ఒక్కడివే చేయలేవు. నాకు బాండుమేళంలో దుడ్డ్లు బాగానే వస్తుంది నాయనా” అన్నాడు. పోనీలే కొడుకు కులవృత్తిని పూర్తిగా వదలకుండా చేస్తున్నాడు అన్న తృప్తి వుండేది. ఇప్పుడు మనవడు ఆదినారాయణ ఆలోచనలన్నీ చదువుమీదే వుంది. “కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా” అని చెప్పేవారు పెద్దలు. చివరికి పూర్తిగా మారిపోయి ఈ వృత్తే అంతరించి పోతుందేమో. అనుకుంటూ నిష్టూరంగా కళ్ళు గట్టిగా మూసుకున్నాడు శివయ్య.

***

తన ఇష్ట ప్రకారమే చదువుకున్నాడు ఆదినారాయణ. బాగా చదువుతున్నాడని తండ్రి గోపాలం కూడా కాదనకుండా చదివించినాడు. డిగ్రీ లో వుండగా కాలం చేసినాడు శివయ్య. అప్పుడు వూరికి వచ్చినాడు ఆదినారాయణ.
అదే పది రోజులలో తల్లి చెరువులో జారిపడి చనిపోవడంతో గోపాలం ఒంటరి అయినా కొడుకుతో బాటు వూరు వదిలి పోవడానికి ఇష్టపడలేదు. ఆదినారాయణ వూరిలో వున్నఆ కొద్ది రోజుల్లో ఒకరో ఇద్దరో చిన్నప్పటి ఫ్రెండ్స్ కనిపించి “ఏందిరా కులవృత్తి వద్దనుకొని చదువు వెలగబెడతా వున్నావు. మీ నాయన కూడా ఒంటరి వాడైనాడు“ అని హేళనగా అంటే కోపం వచ్చింది. వూరితో సంబంధం వున్నన్నాళ్ళూ ఇట్లా అనిపించుకొక తప్పదు అని వూరికి రావడం తగ్గించినాడు.
తరువాత టీచర్ గా పోస్టింగ్ రావటం, మెల్లిగా గవర్నమెంటు స్కూలు లో టీచర్ గా దొరకడం ఆదినారాయణ అదృష్టం అయితే అది ఇంకా కొంచెం విస్తరించి తోటి టీచర్ గిరిజను ప్రేమ వివాహం చేసుకునేంతవరకూ వచ్చింది. దీనికి గోపాలం అస్సలు ఒప్పుకోలేదు. కొడుకు పెళ్ళికి కూడా రాలేదు. అందుకే పెళ్లి తరువాత భార్యతో కలిసి ఒక్కసారి కూడా వూరి ముఖం చూడలేదు ఆదినారాయణ. చివరిగా గోపాలం ఒక పెళ్లి కోసం ట్రాక్టర్ లో వెడుతూ దానికి ఆక్సిడెంట్ అయ్యి చని పోయినాడు అని తెలిసి తాను ఒక్కడే వూరికి వెళ్ళివచ్చినాడు. అంతే. . . . . .
కొడుకు రాహుల్ కి కూడా పల్లె గురించి కానీ తమ వృత్తి, ముందు బతికిన తీరు అస్సలు తెలియకుండా పెంచాడు.
‘బాగా చదువుకో. అదే మనకు మంచి వుద్యోగాన్ని, జీవితాన్నిఇస్తుంది’ అని పదే పదే చెప్పేవాడు.
కానీ రాహుల్ ఇంజనీరింగ్ అయ్యేసరికి కరోనా మొదలవటం, వుద్యోగాలే లేకుండా పోవడంతో ఏమి చేయాలి అన్నప్రశ్న తో సొంతంగా బిజినెస్ అన్న అభిప్రాయానికి వచ్చాడు. ఈ ఐడియా ఆదినారాయణకు కూడా నచ్చింది. ఈమధ్య ఎన్నో స్టార్ట్ అప్ కంపెనీలు వస్తున్నాయి.
అసలే కరోనా సమయం ముందుకి మంచి వుద్యోగం దొరుకుతుందని కాచుకోవడం కన్నానలుగురు కలసి పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ మొదలు పెడితే అన్న ఆలోచనతో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు కొడుకు అని సంతోషం వేసింది కూడా.
సాయంకాలం రాహుల్ ఫ్రెండ్స్ నలుగురు కాస్సేపు కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని మాట్లాడాక, రాత్రికి మళ్ళీ జూమ్ కాల్ చేసుకోవడానికి నిర్ణయం జరిగి రాత్రి 8 గంటలకే తన రూమ్ లోకెళ్ళి తలుపేసుకుని కూర్చున్నాడు.
కొడుకు బయటకు వచ్చి వారి నిర్ణయాన్ని ఎప్పుడు చెబుతాడా అని ఎదురుచూస్తూన్నా. డు ఆదినారాయణ
రాత్రి పదకొండు గంటలకి సంతోషంగా బయటకు వచ్చాడు రాహుల్. అతన్ని చూసి ఏదైనా సొల్యూషన్ దొరికిందా రాహుల్ అని ఆతృతగా అడిగాడు.
“స్టార్ అప్ కంపెనీలు స్టడీ చేసిన మాకు చాలా డిస్కషన్ తరువాత అందరూ ఒప్పుకుంది ఒక్క ప్రపోజల్ మాత్రమే నాన్నా. మొదటి పెట్టుబడి తరువాత ఆదాయం చాలా బాగుంటుంది. అలా ఎదుగుతూనే వుంటాము కొన్నిసార్లు ట్రైనింగ్ కొరకు బయట దేశాలకు కూడా వెళ్ళిరావాలి. ముఖ్యంగా తర, తరాలకూ అడ్డులేని ఆదాయం అనుకోండి” సంతోషంగా అన్నాడు రాహుల్.
“ఏమిటో వివరంగా చెప్పు, వేటి ప్రస్తావన వచ్చింది?”
“నాన్నా, మేము ఆలోచించింది కరోనాలాటి ఆపద వచ్చి మనిషి ఇంట్లోనే వుండిపోయే పరిస్థితిలో వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునే బిజినెస్ కోసం చూసాము. హోమ్ డెలివరీ చేసే సరుకులు గురించి మొదటగా అనుకున్నా కానీ ఆ పని ఇప్పటికే చాలా చోట్ల జరుగుతోంది. పైగా నమ్మకం మీద కొంటారు. ఇందులో పోటీ పడి నిలిచే అవకాశం తక్కువ.
ఆ పైన ఆలోచించింది ఇంట్లోనే వుండిపోయే మగవాళ్ళకి ఏమి అవసరం అని? అన్నిటికంటే ముఖ్యం హెయిర్ కట్, ఇతర మసాజ్ లు, మంచి హైజీనిక్ పద్దతిలో ఇంటికి వచ్చి చేస్తే బాగా క్లిక్ అవ్వచ్చు.
తరువాత మాకందరికీ నచ్చినది హోమ్ విజిట్స్ కాకుండా కాలంలో ముందుకు కొనసాగేలా ఒకే పర్మనెంట్ బిజినేస్!
“మెన్స్ బ్యూటీ సెలూన్” అందులో ఒక్కసారి ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే చాలు ఏదీ వేస్ట్ కాదు. హెయిర్ స్టైల్ మారుతుంది కానీ హెయిర్ కట్టింగ్ తప్పనిసరి కదా అందరికీ. దాని అవసరం ఈ కరోనా సమయంలో ఇంకా బాగా తెలిసింది. ఇక కాలంతో బాటూ ఈ సాలూన్లు ఓన్లీ హెయిర్ కట్, కాకుండా హెయిర్ స్టైలింగ్ లో ట్రెడిషనల్, క్లాసిక్ లుక్ కాకుండా హెయిర్ కు కలరింగ్, ట్రెండీలుక్ తో లేటెస్ట్ spikes, ఇంకా ఎన్నో కొత్త మార్పులు వచ్చాయి. వీటికి స్పెషల్ ట్రైనింగ్ కోసం ఫారిన్ వెళ్ళాలసి రావచ్చు. ఇదే కాకుండా పక్కనే మగవారికి బాడీ మసాజ్, హెడ్ మసాజ్, ఫేషియల్ లాటివి మొదలు పెడితే మనమూ కొంతమందికి పనిఇవ్వచ్చు. అద్బుతంగా ఎదగవచ్చు” ఆనందంగా చెబుతున్న రాహుల్ తో
“ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇంజనీరు అయ్యి, సాఫ్ట్ వేర్ లోకి వెళ్లగలిగిన మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు?” అన్నాడు ఆదినారాయణ ఒకలాటి బాధతో.
“నిజమే నాన్నా, ఇంత టెక్నాలజీ తెలిసి, ఇలాటి పనా? అన్న ఆలోచన కంటే, ఒకరికింద ఉద్యోగం చేస్తూ, ఎప్పుడు కంపెనీ వాళ్ళుఇంటికి వెళ్ళ మంటారో అన్న టెన్షన్ కన్నా, సొంతంగా మనమే పది మందికి పనిని ఇచ్చే బిజినెస్ మేలు కాదా?ఇలా చేయడానికి మాకేమీ చిన్నతనం అనిపించడం లేదు. జీవితంలో ఎదగడానికి ఎన్నో మార్గాలు ఇప్పుడు. ఇది ఎందుకు కాకూడదు?” నాన్ స్టాపుగా ఆవేశంగా చెబుతున్న రాహుల్ ను కన్నార్పకుండా చూస్తున్నాడు ఆదినారాయణ.
కళ్లముందు తాత శివయ్యా, తండ్రి గోపాలం నవ్వుతూ కనబడుతుంటే నిస్సహాయంగా అనిపించినా కొడుకు రక్తంలో వున్న వృత్తి జీన్స్ అద్దంలో కనిపించింది.
కానీ ఇప్పటి కాలం లో ఏదైనా బిజినేస్సే! వాడు ఎంచుకున్నది ఎందుకో తప్పు అనిపించలేదు ఇప్పుడు!

***************

2 thoughts on “4. హెడ్మాస్టర్ కొడుకు – ఉగాది కథలపోటి

  1. రోజులని బట్టి చేసే పనుల పేరులు కూడా మారుతున్నాయి. పేరేదైనా పని అదేకదా.. బాగా వ్రాసారండీ లక్ష్మీరాఘవగారూ.. మంచి కథ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *