April 23, 2024

5. కోడలి వేదన – ఉగాది కథలపోటి

రచన: మంగు కృష్ణకుమారి

సుప్రజానివాస్ ఠీవీగా తన ఛైర్లో కూచుంది. మెత్తగా కుర్చీ, ఎసి రూమ్ చల్లదనం హాయిగా ఉంది. చిన్నతనంనించీ ఎప్పుడూ క్లాస్ టాపర్, స్కూల్ టాపర్, ఇంటర్ లో గోల్డ్ మెడల్, ఇంజనీరింగ్ మీద ఇంటరెస్ట్ లేదంటే, నవ్వుతూ ఆమె ఇష్టానికి వదిలేసిన తల్లితండ్రులు సుప్రజకి ఆత్మవిశ్వాసం పెరిగేటట్టు చేసేరు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొన్నాళ్ళు ప్రైవేట్ గా హెచ్ ఆర్ మేనేజర్ గా చేసింది. అప్పుడే నివాస్ తో ప్రేమ.
నివాస్ తల్లితండ్రులు చాలా గ్రేస్. సుప్రజని ఇష్టంగా కోడలుగా చేసుకున్నారు.
కోడలు చక్కటి విలువల మధ్య పెరిగిందని, ఇంట్లో, ఆఫీస్ లో చాలా నిజాయితీగా ఉంటుందని, దొంగ దారులు అడ్డుగోలు పనులు భరించదనీ, క్రమశిక్షణ అంటే ప్రాణం పెడుతుందని, అత్తమామలు చాలా గర్వంగా చెప్పుకొనేవారు.
తదేక దీక్షగా యుపిఎస్సి పరీక్షలు రాసి మొదటి ప్రయత్నం లోనే గ్రేడ్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయింది సుప్రజ. నివాస్ మాత్రం ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్ గా ఉండిపోయి, సుప్రజని చాలా ప్రోత్సహించేడు.
సుప్రజ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి తన పై బాసులని కలిసి వచ్చింది.
రెండు రోజులు మొత్తం తనకి అప్పచెప్పిన సీట్ వర్క్ రూల్స్ మొత్తం క్షుణ్ణంగా చదివింది.
డౌట్ వచ్చిన దగ్గరల్లా సెక్షన్ సూపర్నెంట్ ని పిలిచి అడిగింది.
మర్నాడు స్టాఫ్ అందరినీ పిలిచి ఓపెనింగ్ స్పీచ్ ఇచ్చింది. తన పరిచయం చేసుకొని పనిలోపనిగా తనకి వర్క్ తో పాటు స్టాఫ్, నిజాయితీ అత్యంత ముఖ్యం అని, ఏపాటి తేడా వచ్చినా తను భరించనని ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది.
సుప్రజ తన ప్రాణం అంతా పెట్టి పని చేయడం, సెక్షన్ ఉలిక్కి పడ్డట్టయింది. అందరూ పద్ధతి,
క్రమశిక్షణ, టైమ్ కల్లా వర్క్ పూర్తి చేయడం బాగా అలవాటు చేసుకున్నారు.
ఆ రోజు సుప్రజ పేబిల్స్, ఒకొక్క గ్రూప్ బేంక్ కి క్రెడిట్ చేసే ఎమౌంట్స్ చెక్
చేస్తున్నది. హఠాత్తుగా ఆమె కళ్ళముందు ఓ తప్పు కనపడింది. మళ్ళా చెక్ చేసింది. బెల్ కొట్టి
క్లర్కుల పేబిల్ చేసే రామకృష్ణని పిలిపించింది.
“మొత్తం గుమస్తాలు 70 మంది ఉంటే 71 అకౌంటుల్లో జీతాలు క్రెడిట్ అవుతున్నాయేమిటి?” అడిగింది.
“నాగ సుశీల జీతం రెండు ఎకౌంటల్లో క్రెడిట్ చేస్తాం అండీ” తడుముకోకుండా చెప్పేడు రామకృష్ణ.
“ఎవరావిడ? దేనికి వేరు వేరు ఎకౌంటుల్లో క్రెడిట్ చేయడం?” కోపంగా అంది సుప్రజ.
“ఏమో మేడమ్, సూపర్నెంట్ గారు ఇలా చెయ్యమని చెప్పేరు.”
“మీరు వెళ్ళి అతన్ని పిలవండి”
అయిదు నిమిషాల్లో సూపర్నెంట్ కొండలరావు వచ్చేడు. సుప్రజకి సమాధానంగా, పెర్సనల్ ఆఫీసర్ వ్యాసమూర్తి రికమెండేషన్ మీద ఇలా వేస్తున్నాం అన్నాడు.
అతను సుప్రజ మీద బాస్.
వ్యాసమూర్తి మీటింగ్ లో ఉన్నాడు. ఇదేదో వెంటనే తేల్చీయాలన్నంత ఉద్రేకం వచ్చింది సుప్రజకి.
మధ్యాహ్నం లంచ్ తరవాత అతని కేబిన్ కి వెళ్ళింది. సుప్రజ చెప్పిందంతా విని వ్యాసమూర్తి నాగసుశీలని పంపమని ఫోన్ చేసేడు.
పావుగంటలో నాగసుశీల అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది.
వ్యాసమూర్తి ఆమెని కూచో పెట్టి “సుశీలగారు, మీ సేలరీ రెండు బేంక్ ఎకౌంటుల్లొ క్రెడిట్ అవుతొందేమని మేడమ్
అడుగుతున్నారు. ఈవిడే పే ఆఫీసర్! చెప్పండి” అన్నాడు.
నాగసుశీల భయం భయంగా “మీకు చెప్పేను కదండీ! అదే” అంది.
“నాకు తెలీడం కాదండీ, మీ బాధ ఏమిటో మీరే స్వయంగా సుప్రజా మేడమ్ కి చెప్పండి. ఆవిడకీ తెలియాలి. ఆవిడ ఓకె చేయాలి” అన్నాడు.
నాగసుశీల మొదట తలొంచేసుకుంది.
తరవాత సుప్రజ కేసి భయంగా చూస్తూ అంది. “మేడమ్, నేను హైస్కూల్ చదువేనండీ! పెళ్ళి అయిపోయింది. మా ఆయన ఇక్కడే స్టెనోగా చేసేవారు. మా అత్తగారు మావగారికి ఈయనే ఒక్కరే కొడుకు. మిగిలిన ఇద్దరు ఆడపిల్లలే! ఈయన జీతం మీదే ఆధారపడి ఉన్నాం అందరం. అలాటిది హఠాత్తుగా రోడ్ ప్రమాదంలో ఈయన స్పాట్ డెడ్. ఎంత ఏడిచేమొ అందరం.” కళ్ళనీళ్ళు ముంచుకురాగా ఆగింది నాగసుశీల.
“ఎంత ఏడిచినా తప్పదు కదండీ! నాకు ఇక్కడ క్లర్క్ ఉద్యోగం ఇచ్చేరు. కంప్యూటర్ కొద్దిగా అయినా నేర్చుకోమన్నారు.
ఏడాది గడిచింది. మా అత్తగారు, మామగారు చాలా మంచివాళ్ళు. ‘అమ్మా, చిన్నదానివి. పిల్లలా లేరు. మంచివాడు గనుక దొరికితే పెళ్ళి చేసుకో’ అని చాలా నచ్చచెప్పేవారు. నేనే వాళ్ళని వదల్లేక వద్దనేసాను.
మా పక్క పోర్షన్ లోనే శివా అద్దెకి ఉండేవాడు. ప్రైవేటు ఉద్యోగం. మా అత్తగారిని బుట్టలో వేసుకున్నాడు. నన్ను ఇచ్చి పెళ్ళి చేస్తే వాళ్ళే తన తల్లి తండ్రులనుకుంటాను అన్నాడు.”
“మీ తల్లితండ్రులు లేరా” అంది సుప్రజ.
“మా నాన్న నాచిన్నప్పుడే చనిపోయేడండీ. అమ్మ అన్న దగ్గర ఉంది. వదిన అమ్మని చూస్తుంది గానీ నేను అంటే అంత ఇష్టంగా ఉండదు. అయినా మా అత్తగారు మామగారు నన్ను కూతురిలా చూస్తూ ఉంటే ఇంకేం కావాలి?”
సుప్రజ తరవాత వివరాల కోసం చూస్తోంది.
“మా అత్తగారు, మావగారు శివ మాటలని నమ్మేసి నన్ను పెళ్ళికి ఒప్పించేసారు. పెళ్ళికి ముందే నేను చెప్పేను. అత్తయ్యగారికీ, మామయ్యగారికీ ప్రతీ నెలాపోషణకి ఇచ్చి తీరాలని. వాళ్ళని వదులుకోలేనని.
“ఎంత తియ్యగా కబుర్లు చెప్పేడో అప్పుడు. పెళ్ళయిన నెల దాకా బాగానే ఉన్నాడు. అక్కడనించీ మొదలెట్టేడు. ఇల్లు ఖాళీ చేసి దూరంగా తీసుకెళిపోయేడు.
పెళ్ళి కాకముందు ఏమోగానీ, ఇప్పుడు ఇంకా పాత అత్తగారిని, మామగారినీ మర్చిపోవాలని గొడవ పెట్టేడు. అప్పటికే నాకు మూడోనెల. పాపం మా అత్తగారు తల్లిలా నాకు పచ్చళ్ళు చేసి, జాగ్రత్తలు చెప్పి సంబరపడుతుంటే, ఇతని కోపాలు. ఇంకా వాళ్ళ ఖర్చు నువ్వు భరించటం ఏమిటి? అని తిట్లు.
ఒకసారి భరించలేక ఎదురు తిరిగేను ‘ముందే చెప్పేనుకదా, వాళ్ళ పూచీ నాదే అని’ అన్నానని అతను చేసిన రగడకి నాకు మనసు విరిగింది” కళ్ళ నీళ్ళు వస్తుంటే ఆగింది.
శివా వాళ్ళ అమ్మ వస్తే మరీ గొడవలు. “ఆ అత్తగారుండగా దీనికి నేను ఎవరినిరా” అని ఆవిడ మరీ రెచ్చగొడుతుంది.
“మీ పరిస్థితి బాధాకరమే, అయినా ఈ రెండు బేంక్ ల్లో క్రెడిట్ ఏమిటి?” సుప్రజ అడిగింది.
శివాతో పడలేక ఇలా రెండు బేంకులలో వేయమని అడిగేనండీ. నా ఎటిఎమ్ కార్డ్ అతని దగ్గరే ఉంటుంది. నేను సంతకాలు చేసిన చెక్ బుక్ అతని దగ్గరే ఉంటుంది. ఇంక మా అత్తగారికి మావగారికీ నేనేం ఇవ్వగలను? సర్ ని
అడిగేనండీ! సర్ నా ఏడుపు చూసి ఒప్పుకున్నారు. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. పెరుగుతున్న డిఎలు, ఎరియర్స్ ఈ ఎకౌంటు లో వేయమని అడిగేను. అత్తగారు వాళ్ళకి హెల్ప్ చేయగలను. నా చేతిలో కూడా కాస్త డబ్బు ఆడుతుంది”
నాగసుశీల తల వంచుకుంది. వ్యాసమూర్తి సుశీలని పంపించేసాడు.
“ఒకేనా మేడమ్” అన్నాడు నవ్వుతూ.
“కానీ మనం ఇలా చేయొచ్చా సర్?” అనుమానంగా అడిగింది సుప్రజ.
“గవర్నమెంట్ కీ, కార్పొరేట్ ఆఫీసులకీ తేడా ఇదే మేడమ్! ఇక్కడ కొన్ని హ్యూమన్ విలువలు పాటిస్తాం. మనకి ఆఫీస్ వర్క్ ఎంత ముఖ్యమో, అటు ఉద్యోగుల కుటుంబ రక్షణ కూడా అంతే ముఖ్యం. వర్క్ లో హ్యూమన్ టచ్ ఉండాలి. ఈసారి మిమ్మలని ట్రైనింగ్ కి నామినేట్ చేస్తాను. ఇలాటి విషయాలమీద అక్కడ క్లాస్లు ఉంటాయి. మీకు ఇంకా పూర్తిగా బోధపడుతుంది” నవ్వుతూ చెప్పేడు వ్యాసమూర్తి.
ఆలోచిస్తూ లేచింది సుప్రజ.
*********

1 thought on “5. కోడలి వేదన – ఉగాది కథలపోటి

  1. “గవర్నమెంట్ కీ, కార్పొరేట్ ఆఫీసులకీ తేడా ఇదే మేడమ్! ఇక్కడ కొన్ని హ్యూమన్ విలువలు పాటిస్తాం ;
    waw – మంగు కృష్ణకుమారి ; story – కోడలి వేదన ;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *