April 23, 2024

6. తన ధైర్యమే తనకు రక్ష

రచన- మీనాక్షి చెరుకువాడ

జాతీయ రహదారి. నడి రేయి దాటుతుండగా, అంతటా నిర్మానుష్యంగా ఉన్న వేళ ఓ పాత వ్యాను సడెన్ బ్రేక్ తో రోడ్డుకు వారగా ఆగింది.
డ్రైవర్, క్లీనర్ కూడా తెచ్చుకున్న సరుకు ఖాళీ చేసీ, దారిలో ఉన్న ధాబాలో తెచ్చుకున్న బిర్యానీ తిన్నారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ లోపల పడ్డ చుక్క నరాలను మత్తెక్కిస్తుండగా మెల్లిగా ఆ వాను వెనక్కి వచ్చి తలుపులు తెరిచారు. అందులో ముందంతా కూరగాయల గోనెలూ, తట్టలూ ఉన్నాయి, వాటి వెనకగా ఇద్దరు ఆడపిల్లలు ఆదమరచి నిద్రపోతున్న వాళ్ళు కాస్తా ఒక్క కుదుపుతో వ్యాన్ ఆగగానే మెలుకువ వచ్చి, క్షణ కాలం ఎక్కడ ఉన్నారో అన్నట్టు అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు.
కొన్ని క్షణాలు అలానే ఊపిరి బిగబట్టి చూస్తున్న వాళ్ళకు మళ్ళీ ఏ అలికిడీ వినబడకపోవడంతో నిద్రకు ఒరగబోయారు.
అంతలోనే వ్యాను తలుపులు తెరుచుకున్న అలికిడి, ఇద్దరూ భయం భయంగా ఒకరినొకరు చూసుకున్నారు.
చెల్లెలు భయంతో వణికింది. అస్తమానం టీ వీలో చూస్తున్న అత్యాచార సంఘటనలు మనసులో మెదిలాయి, గట్టిగా అక్క నర్సి చెయ్యి పట్టుకుంది.
నర్సి మనసులో భయాన్ని అదిమిపట్టి చుట్టూ పరికించింది, చిమ్మ చీకటి, ఒక్క సారి కళ్ళు మూసుకుని తను వ్యానులోకి ఎక్కినప్పుడు అక్కడున్న వస్తువులని జ్ఞాపకం తెచ్చుకుంది, డ్రైవర్ సీట్ కు వెనకాతల ఒక ఇనప కడ్డీ చూసిన జ్ఞాపకం మనసులో మెదిలింది. ఓ చేత్తో చెల్లెలిని దగ్గరకు తీసుకుని, రెండో చేత్తో కింద తడిమింది, చేతికి ఆ కడ్డీ తగిలింది . . తీసి పట్టుకోగానే మనసుకు ధైర్యం కలిగింది. ఏదైనా అనుకోనిది ఎదురైతే చేయాల్సినది నిశ్శ్చయించుకుంది. కళ్ళు చీకటికి అలవాటుపడ్డాయి. భయం లేదన్నట్టు చెల్లెలి చేయి నొక్కింది భరోసాగా.
క్లీనర్ కుర్రాడు ‘ ఇదో! బండి ట్రబులిచ్చింది, గాలాడక సత్తారు, కూసింత కిందికి దిగండి, బండి బాగయిపోనాకా పోదారి ” అంటూ బయటనుంచి అరచి చెప్పాడు.
ఇనప కడ్డీ వెనగ్గా పట్టుకుని, చెల్లెలితో బాటు దిగింది నర్సి.
మంచి వయసులో ఉంది, పైగా కాయకష్టం చేసి రాటుదేలిన ఒళ్ళు, చిక్కటి చీకటిలో కూడా నిగనిగ లాడుతూ దేవదారు శిల్పంలా ఉంది. పక్కనే లంగా, జాకెట్ తో పదహారేళ్ళ పరువంతో నీల.
“ఏందన్నా! ఏటైందీ? ” ధైర్యంగా అడిగింది మనసులో కలవరం బైటపడనీకుండా.
“ఏటి నేదు, ఇంజను ఏడెక్కిపోయింది ” తమకంగా చూస్తూ చెప్పాడు.
“దా! కూసింత సేపు సల్ల గాలికి, సెట్టుకింద తొంగుంటే సల్లారిపోద్ది ” నర్సి చెయ్యి పట్టుకుంటూ అన్నాడు.
“సూడు! అక్కడ మా అయ్య సనిపోనాడని తెలిసి, ఈ టైం ల పొయ్యేదానికి ఏ మార్గంనేక, తెలుసున్నోడివే కందాని నీ బండెక్కేం, ఏసాలెయ్యెక బండెక్కి బయలుదేరు ” హెచ్చరించింది నర్సి.
“ఓసోసి! నేదంటే ఏటి సేత్తావేటి? నకరాలు పోక రాయే! పనైపోతే పోదారి, అసలికే ఒకరికి ఇద్దరున్నారు, ఆలస్సెం అయితే మీ అయ్య కడాకరి సూపులు కూడ దక్కవ్! అయినా నీతో నాకేటి? నేత తాటి ముంజినాగుంది, ముందు దీన్నో పట్టడతాను” అంటూ నీల మీద చెయ్యి వెయ్యబోయాడు డ్రైవర్.
“వద్దు, నీ మంచికే సెపుతున్నా ఇనుకో! అసలికే ఇయి మటన్ కొట్టిన సేతులు, దెబ్బకి సస్తావ్!” గర్జించింది నర్సి.
“ఓసోసి! నాను సచ్చి పడున్న మటన్నేటి నువ్వు కైమా కొట్టనీకి, సెప్పింది సాల్లే, ఒరే సాంబా!దాన్నట్టుకో, ఓ డవిలాగులు సెపుతుందీ సినేమా స్తారులెక్క! రాయే ” నీల రెక్క పట్టి ఒక్క గుంజుగుంజుకున్నాడు దగ్గరకి.
అంతే . . నిశ్శబ్దం ఒణికేలా ఒక్కటే ఒక్క చావు కేక. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు తనను పట్టుకున్న సాంబని ఒక్క తోపు తోసి నీల చెయ్యి పట్టుకుని ఆ చీకట్లో ఎక్కు పెట్టిన బాణంలా పరిగెట్టింది నర్సి.
అంతటి చలిలోనూ నిలువెల్లా చెమటతో తడిసేలా, ఇంక పరిగెత్తలేనంత వరకూ పరిగెడుతూనే ఉన్నారిద్దరూ.
రొప్పుతూ ఆగిపోయిన వాళ్ళకు దూరంగా ఏదో వాహనం వస్తూ కనబడింది. అది పెట్రోలింగ్ వ్యాన్. తెలిసినోడి వ్యాన్ అని ఎక్కితేనే భద్రత లేకుండా పోయే, ఇప్పుడు ఆ వచ్చేటోడు ఎలాటోడో, పులిని తప్పించుకొచ్చి ఊబిలో పడినట్టవుద్దేమో, ఆలోచించి రోడ్డు పక్కగా ఉన్న చెట్టు చాటికి పరిగెట్టింది, నీలను లాక్కెడుతూ.
పురుగూ, పుట్రా, సీకటీ ఇయ్యేటీ సెయ్యవు, ఈటన్నికంటే పమాదకారి మగాడే అనుకుంటూ తెల్లారే దాగా అక్కడే అలసి పడుకుండిపోయారు ఆ ఆడకూతుళ్ళిద్దరూ.
***
“అదిగో ఆళ్ళే, సంపేసింది ఆళ్ళే” అన్న మాటలకి తుళ్ళిపడి అటు చూసారు నర్సి, నీలా.
పడిన టెన్షన్ కి, పరిగెట్టిన అలసటకి ఆ రాత్రి వేళ చెట్టు కిందకు చేరిన వాళ్ళకు, తల్లిలా సేద దీర్చిన చల్లని గాలికి ఆదమరచి నిద్రపోయి భళ్ళున తెల్లారేదాకా మెలకువ రాలేదు.
రొంటిన దోపుకున్న చిక్కం సంచీలో ఉన్న పైకం, ఫోనూ తప్ప బ్యాగులూ, చేతి సంచీ వ్యానులోనే ఉండిపోయాయి. రోడ్ మీదకు వచ్చి ఏదైనా మార్గం దొరకకపోతుందా పట్నం చేరడానికి అని అక్కడ అర్థగంటగా నిరీక్షిస్తున్న వాళ్ళకు ఏదీ దొరకలేదు. ఇంతలోనే పులి మీద పుట్రలా పోలీసులతో సాంబ వచ్చేసాడు.
“చ! బయలెల్లిన యేల యెట్టాటిదోగాని, అన్నీ సిక్కులే” భయంభయంగా అనుకుంది నర్సి. అటు భర్తతో మాటాడాలన్నా, ఇటు అన్నతో మాటాడాలన్నా సెల్ అయితే ఉంది గానీ దానిలో చార్జింగ్ అయిపోయి చచ్చింది. అయినా ఇప్పుడు సేయగలిగిందీ ఏటినేదు, దేవుడు మీద భారం యేసి జరిగింది పోలీసులకు సెప్పడం తప్ప. ఆల్లకు మాత్రం మాబోటి పిల్లా, పాపా, అప్పా, సెల్లీ ఉండరా? ఆపాటి అర్థం సేసుకుని కాసుకోరా? ‘ అనుకుంటూ మనసు దిటవు పరుచుకుంది నర్సి.
“ఏయ్! మీరు వ్యాన్ డ్రైవర్ ని సంపేసి, పారిపోయారని ఇతను, అదే ఆ వ్యాను క్లీనర్ సాంబ చెబుతున్నాడు! నిజమేనా? ఎందుకు సంపేరు?” గద్దించి అడిగాడు ఎస్. ఐ.
“మావు సంపనేదు? కొట్టి పారొచ్చీసినాం అంతే! ” భయంభయంగా చెప్పింది నర్సి.
“అదే! నువ్వు కొట్టిన దెబ్బకి ఆడు సచ్చాడు, ఎందుకు కొట్టావ్? అనే అడుగుతుంట?” విసుగ్గా అన్నాడు ఎస్. ఐ. అప్పటికి చాలా రోజులుగా వేళకి నిద్రాహారాలు లేకుండా డ్యూటీలు. చాలా తిక్కగా ఉన్నాడు, అసలే ఈ కరోనా డ్యూటీలే చెయ్యలేక చస్తుంటే, మధ్యలో ఇలాంటి కేసులొకటి.
“అడుగుతుంటే అట్టా దిట్టి బొమ్మలా కళ్ళప్పగించి సూస్తావేం? సెప్పు ? ” స్వరం పెంచి అడిగాడు.
“కొట్టి సంపేసినాం అని సెప్పినోడు ఎందుకు కొట్టామో సెప్పనేదా?” కోపంగా అడిగింది.
“ఆడు సెప్పినాడు, నువ్వు సెప్పేది కూడా ఇని కదా నిజానిజాలు తేల్చాల్సింది, అయినా పెద్ద లాయర్ లా లాజిక్కులడుగుతున్నావ్! ఈళ్ళని జీపెక్కించండ్రా!” ఎర్రగా చూస్తూ తన కానిస్టేబుల్స్ తో అన్నాడు.
“అయ్యో! కోప్పడకు సారు! ఆడేం సెప్పాడో నాకు తెల్దుగానీ నే సెప్పేది నిజం, సత్తెపామానికంగా ఆడ్ని సంపాలనుకోలేదు, తెల్సున్నోడు కదాని ఎంబడొస్తే, ఆడు తాగి ఇంగితం మరిసి అప్పసెల్లెల్లాంటి మా మీద పడబోనాడు ఆబోతునాగ! ఏటి సెయ్యాలో తెలక ఆడి నుంచి పారిపోనాకే అక్కడున్న కడ్డీతో ఓటిచ్చాను, ఎంబడే నా సెల్లితో కలిసి ఈడ దాక పారొచ్చాను, తల్లి తోడు జరిగిందంతే, ఆడిని సంపితే నాకేటొత్త్తదీ? ” అమాయకంగా ఉన్న ఆ పిల్ల మాటల్లో నిజం అర్థమైంది ఎస్. ఐ. కు. అయినా. .
“మరాడేటి! ఆడిని సంపి డబ్బు, మెడలో గొలుసూ, వాచీ, ఉంగరం కాజేసి పారిపోయారని సెప్పాడే ఈడు?” లాఠీతో సాంబడిని తడుతూ అడిగాడు.
“తాగుబోతెదవ! అట్టా కాక తాగి ఆబోతుల్లా ఆడాళ్ళ మీద పడ్డామని సెబుతారా ఏటి సారు? ఇప్పుడు నాలుగు తలిగిత్తే నిజం తన్నుకుంటా వస్తది” కోపంగా సాంబడి కేసి నాలుగడుగులు వేసింది.
“ఆ పనెటూ స్టేషన్ లో చేస్తాం కానీ, మీరు నడండి, బండెంక్కండి, అయినా ఓ పక్క లాక్ డౌన్ ఇళ్ళు కదలద్దంటుంటే మీరేటి రేత్రిళ్ళు ఒంటరిగా, సామాను వేనుల్లో పయానాలు?”విసుక్కున్నాడు ఎస్. ఐ.
“మాకేటి సరదానా బావూ! తల్లి లేని మమ్మల్ని పానంగా పెంచుకున్న అయ్య సచ్చిపోనాడని ఫోనొచ్చి కడాకరి సూపుల కోసం బయలెల్లినాం. అది కూడా మా వోడి సావాసగోడని ధైర్యంగా బయలెల్లినాం, కానీ తెలిసొచ్చింది ఆడది అర్దరాత్రేల అయినోల్లతో అయినా పోకూడదని, అయినా తాగితే అక్కడున్నది అక్కా, సెల్లా, తల్లా! ఏటి తెలనంత కైపెక్కుతదని తెలిసీ ఎందుకు బావూ తాగుతారు? ఏటుందందులో? రోజూ పేపర్ల, టీ వీ ల సూత్తంటే ఏటో అనుకున్న గానీ ఇన్ని అగాయిత్తాలు జరగనాకి కారనం ఆ మాయదారి తాగుడే! యిప్పుడు నా మూలకంగా ఓ ఆడదాని తాడు తెగింది, పిల్లలకి తండ్రి లేకుండా పోనాడు, ఆడి నుంచి తప్పించుకోనాకే కొట్టే కానీ, సావాలని కాదు” రెండు చేతులా ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నర్సి.
ఎస్. ఐ కి ఆమె మాటలు వింటుంటే ముచ్చటేసింది, చదువు సంధ్య లేని ఓ పల్లెటూరి ఆడది, అయినా ఎంత తెలివిగా, ధైర్యంగా మాటాడుతోంది, ఆలోచిస్తోంది. నిజమే ఈ తాగుడే లేకుంటే హత్యాచారాలు ఇన్ని జరగవు.
“సార్ !” అన్న కానిస్టేబుల్ పిలుపుతో ఆలోచనల్లోంచి బయటకొచ్చాడు.
“సరి సరి! బండెక్కండి” వాళ్ళని జీప్ ఎక్కించాడు.
“సార్! యిప్పుడు నాకు శిచ్చ పడుద్దా! మమ్మల్ని పాడు సెయ్యబోతేనే కదా తప్పించుకుందుకు నేనాడిని కొట్టింది? ఇది మా సెల్లి, దీన్ని కని మాయమ్మ సచ్చిపోతే ఇంతదాన్ని సేసాడు మా అయ్య, నన్నూ, దాన్ని పానంగా సాక్కొచ్చాడు, సరదాకి నా కాడకొచ్చి ఈ లాక్ డౌన్ సేత నా కాడ ఉండిపోనాది. ఆడ అయ్యకు జొరం వచ్చి ఆలనా పాలనా లేక సచ్చిపోనాడు. ఇప్పుడోపాలి కూసింత దయ సూపించడయ్యా! నేకుంటే బతికినన్నాల్లు తల్సుకు తల్సుకు ఏడాల, అయినా ఇందులో మా తప్పేటుందని? ఓ పురుగో, పుట్రో ముట్టబోతే దాన్ని కొట్టవా? అట్టానే కొట్టా, కాలం సెల్లి ఆడు పోయాడు , ఒకేల నేనాడిని కొట్టి తప్పించుకోకుంటే ఈ మాయదారి సచ్చినాల్లిద్దరూ మమ్మల్ని సెరిసి సంపేసేటోళ్ళుకారా?” కళ్ళనీళ్ళతో అంది నర్సి.
సాలోచనగా చూసాడు ఎస్. ఐ. ‘ అవును ఆ పిల్ల చెప్పింది అక్షరసత్యం, తను ఇప్పుడు వీళ్ళని స్టేషన్ కి తీసికెళ్ళి ఎఫ్. ఐ. ఆర్ రాసి, కేస్ పెట్టి సాధించేదేమిటీ?
“ఒరే! న్యాయంగా అయితే నిన్ను అరెస్ట్ చెయ్యాలి, ఆళ్ళ మీద కేస్ పెట్టినా నిలబడదు, ఎందుకంటే ఆత్మ రక్షణార్థం వాళ్ళు చేసినది నేరం కాదు, శిక్ష పడదు. నీకు మాత్రం ఖైదు గారంటీ. ఇప్పుడు నిన్నొదిలేస్తే జరిగిందంతా మరచిపోయి, ఎక్కడా ఏం వాగకుండా ఉంటావా? లేదంటే రేప్ చేయడానికి ప్రయత్నించేవన్న నేరానికి జైల్ కి పోతావా?” సాంబని అడిగాడు ఎస్. ఐ.
“జరిగింది ఓరికి సెప్పనయ్యా! నన్నొగ్గీండి ” భయంభయంగా అన్నాడు సాంబ.
వాడికి నిండా యిరవై ఏళ్ళుండవు. అప్పుడే తాగుడూ, రేపులూ. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకెలా తయారవుతాడో ‘ ఆలోచనలో పడ్డాడు ఎస్. ఐ.
“తల్లి తోడయ్యా! ఓరికీ సెప్పను, ఇంటికి పోతా, బుద్దిగా ఉంటా!” ఏడుస్తూ ఆశగా అన్నాడు.
“సర్లే! నీ సంగతి నేనాలోసిస్తా కానీ, ముందు ఈళ్ళని ఆళ్ళ అయ్యింట దిగిడిసి నీ సంగతి సూత్తా! ” అంటూ వాళ్ళ చిరునామా కనుక్కుని ఇంటి దగ్గర దింపుతూ అన్నాడు.
“నీలా అందరమ్మాయిలూ ధైర్యంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కనీసం కొన్నైనా ఇలాంటి ఘోరాలు తగ్గుతాయి. జాగ్రత్త! కాలం అన్ని వేళలా కలిసి రాదు. రాత్రిళ్ళు, ముఖ్యంగా ఇలాంటి ప్రయాణాలు చేయకండి. అదిగో మీ నాన్నే అనుకుంటా ఆఖరి ప్రయాణం మొదలైనట్టుంది వెళ్ళండి”
“దండాలయ్యా! మీరు సల్లగా ఉండాలి” ఎస్. ఐ కి దండం పెడుతూ సాంబతో అంది “ఒరే ఎదవా! తాగుడు మానేసి మనిసిలా బతకరా! తమ్ముడసుంటోడివి అందుకే సెబుతున్నా! తాగి పశువులా మారకు. ఆ అయ్య మంచోడు కాబట్టి ఈయాల మన బతుకు బజార్న పడ్నేదు, లేకుంటే జైల్ల చిప్పకూడు తినేటోల్లం. నీలా! సారుకు దన్నం పెట్టే! మనకు బతుకిచ్చినాడు. ” అంటూ నీలతో దణ్ణం పెట్టించి జీపు దిగి సాగిపోయింది.

***

1 thought on “6. తన ధైర్యమే తనకు రక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *