April 23, 2024

7. అమ్మ – ఉగాది కథలపోటి

రచన: నన్ద త్రినాధరావు

పూవమ్మ ఆందోళనగా చూస్తోంది ఆయన కేసి. ఒక పక్కగా నిల్చుంది. ఆ గదిలో ఏసీ ఉన్నా ఆమెకు చమట్లు పడుతున్నాయి.
తన చేతిలో రిపోర్టులు వంక చూసాడు డాక్టర్. మళ్లీ మళ్లీ చూసాడు.
అతను అలా చూస్తున్న కొద్దీ పూవమ్మలో ఆత్రుత ఉధృతం కాసాగింది. ఆయన ఏం చెబుతాడా అని ఆమెలో ఒకటే ఉత్కంఠ!
డాక్టర్ పెదవి విప్పాడు.
“చూడమ్మా. . పెద్దగా భయపడాల్సిoది ఏమీ లేదు. హార్ట్ లో చిన్న లోపం ఉంది. ఇంకా వయసు తక్కువే కనుక ఎదిగే కొద్దీ అది సర్దుకోవచ్చు. అయితే చిన్న సర్జరీ చేయాలి. కొంచెం ఖర్చవుతుంది. నువ్వు త్వరగా డబ్బు ఏర్పాటు చేసుకోమ్మా. . నేను ఆపరేషన్ చేస్తాను” అన్నాడు శాంతంగా.
డాక్టర్ మాటలతో పూవమ్మకి నవనాడులూ కృంగిపోయాయి. నిస్తేజంగా ఆయనకేసి చూస్తూండి పోయింది. అలాగే చతికిలబడి పోయింది. కాసేపటికి తేరుకుంది. గుండె చిక్కబట్టుకుంది. ఆయనకి నమస్కరించి తను త్వరలోనే మళ్లీ వస్తానని చెప్పి బయట పడింది.
పూవమ్మలో ఇప్పుడు మరో ఆందోళన మొదలయ్యింది. తన దగ్గర డబ్బుల్లేవు. ఆపరేషన్ ఎలా చేయించాలి? తనకి డబ్బు ఎవరిస్తారు? అనుకుంది. ఆమెకు తన కూతురు గుర్తు కొచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళింది.
తన కూతురు తనకు ఎలాగూ సాయం చేయలేదు. ఆమెదీ తనలాంటి పరిస్థితే. కనీసం విషయమైనా చెప్పాలి. తమ్ముడికి బాగోలేదని తెలిసి బాధ పడుతుందేమో? అలాగని తను చెప్పకుండా ఎలా ఉండ గలదు? తన బాధల్ని తన పిల్లలతో కాక తను ఇంకెవరితో పంచుకోగలదు? వడి వడిగా నడవసాగింది పూవమ్మ.
తనకు నడక బాగా అలవాటు. చిన్నప్పటి నుంచీ తను నడుస్తూనే పెరిగింది. జీవితంతో సమాంతరంగా తన నడక కూడా సాగుతూనే ఉంది. పుట్టి బుద్ధెరిగాక తను ఎప్పుడూ ఏ వాహనం ఎక్కలేదు. ఆటోల్లో, బస్సుల్లో కూడా ప్రయాణం చేయలేదు. చేయలేని పేద పరిస్థితి తనది. అందుకే తను నడక బాగా అలవాటు చేసుకుంది. ఎక్కడకు వెళ్ళాలన్నా నడకే. లేదా పరుగు. అది ఎంత దూరమైనా సరే. ఎన్ని మైళ్లన్నా సరే. తన కాళ్ళల్లో సత్తువ, తన ఒంట్లో బలం ఉంది. తను ఎప్పుడూ అలిసిపోదు. ఆయాస పడదు. నడుస్తూన్న పూవమ్మలో ఎడ తెగని ఆలోచనలు.
తన జీవితమంతా ముళ్లబాటే! కష్టాలు, కన్నీళ్లు తన నేస్తాలు. తనకి ముగ్గురు పిల్లలు పుట్టాక తన భర్త కాలం చేశాడు. అప్పటి వరకు నల్లేరు నడకలా ఉన్న తన జీవితం మరింత కష్టతరమైoది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తనే కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. రాత్రింబవళ్ళు కూలి పనులు చేసింది. తను కష్టాలు
పడుతూ పిల్లల్ని సంతోష పెట్టింది. రూపాయి రూపాయి పోగు చేసి ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేసింది. ఉన్నంతలోనే వాళ్ళకి అన్నీ సమకూర్చింది.
తన మూడో సంతానం కొడుకు. చిన్న వయసులోనే వాడికి హృద్రోగం! రోగం బారిన పడిన తన భర్తని తను ఎలాగూ కాపాడుకోలేక పోయింది. కనీసం తన కొడుకు నయినా రక్షించుకోవాలి. ఎలాగయినా కొంచెం డబ్బు కూడ బెట్టాలి. తన కొడుక్కి బాగు చేయించాలి. కానీ ఎక్కువ ఆలస్యం చేయకూడదని డాక్టర్ చెప్పారు. ఇప్పటికిప్పుడు తనకి డబ్బు ఎలా సమకూరుతుంది?
ఆలోచనల్లోనే పూవమ్మ ఐదు మైళ్ళ దూరంలో ఉన్న తన కూతురిoటికి చేరింది. ఆమెతో తమ్ముడి పరిస్థితి చెప్పింది. అంతా విన్న పెద్ద కూతురు –
“అమ్మా. . తమ్ముడి పరిస్థితికి నేను చాలా బాధ పడుతున్నాను. నా పరిస్థితీ అంతే. రెక్కాడితే కానీ డొక్కాడదు. నేను, మీ అల్లుడు కలిసి కూలి పనులు చేస్తేనే కానీ రోజు గడవదు. నాలుగు వేళ్ళూ నోట్లో కెళ్ళవు. అదీ ఒక రోజు తింటే మరో రోజు పస్తులు. . ” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
పూవమ్మ కూతురి దుస్థితికి తల్లడిల్లి పోయింది. ఆమెకు డబ్బు ఎలా సర్దుబాటు చేసుకోవాలో అర్థం కాలేదు. చూస్తూ చూస్తూ ఉన్న ఒక్క నలుసుని దూరం చేసుకోలేదు. తర్వాత తన చిన్న కూతురికి కూడా విషయం చెప్పిoది. ఆమె కూడా బాధ పడ్డం తప్పా ఏమీ చేయలేక పోయింది.
వెను తిరిగిoది పూవమ్మ. దేవుని పై భారం వేసింది. ఒక్కసారిగా జీవితమంతా అంధకార బంధురమైనట్టు విల విల లాడింది. ఆమె కేం చేయాలో తోచలేదు. ముందుకు నడుస్తున్న పూవమ్మ ఒక చోట ఆగింది. అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఇసుక వేస్తే రాల నంత జనం. ఏం జరుగుతుందో తెలుసుకుందామని ముందుకు వెళ్ళింది పూవమ్మ. అదో పెద్ద మైదానం లాంటి ప్రదేశం. చుట్టూ జన సందోహం.
అక్కడ ఏవో పోటీలు జరుగుతున్నాయి. గెలిచిన వాళ్ళకి పెద్ద మొత్తంలో బహుమతులు ఉంటాయని ప్రకటిస్తున్నారు. ఆ పోటీ ఆడవాళ్లకు మాత్రమే! మైకులో ఆ మాటలు అమృత తుల్యంలా వినిపించాయి పూవమ్మకు. అంధకారంలో దారి తెలియని తనకు ఆశాకిరణంలా అనిపించింది ఆ పోటీ! కానీ అంతలోనే తన ఆశలపై నీళ్లు చల్లారు. తనకి కూడా ఆ పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఇమ్మని వేడుకుంది పూవమ్మ. పోటీ నిర్వాహకులు ఆమెని తిరస్కరించారు.
“చూడమ్మా. . నిన్నుఈ పోటీకి అనుమతించలేం. ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు ముందుగా తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు నమోదు చేసుకోవడం కుదరదు. పక్కకు వెళ్ళమ్మా. . ” అంటూ సున్నితంగా తిరస్కరించారు.
అయినా పూవమ్మ నిరాశ పడలేదు. కాళ్ళా వేళ్ళా పడి వాళ్ళని బ్రతిమ లాడిoది. తనకొచ్చిన కష్టం చెప్పుకుంది. తనకి డబ్బు ఎంత అవసరమో చెప్పింది. తనకి ఒక్క అవకాశం ఇచ్చి తన కొడుకుని బ్రతికించమని ప్రాధేయ పడింది. కన్నీళ్ళు పెట్టుకుంది. చివరికి నిర్వాహకులు ఆమె కన్నీటి వ్యథకు చలించి పోటీకి అనుమతిoచారు. ఆమె కూడా అందరితో పాటూ ఆ పోటీలో పాల్గొంది. ఒక్కసారి లైన్ లో నిల్చున్నఅందరి కేసి చూసింది.
వాళ్లంతా వయసులో తనకన్నా చిన్నవాళ్ళు. తను వీళ్ళతో పోటీపడి గెలవ గలదా అనుకుంది. వాళ్ళు రన్నింగ్ షూస్ లు ధరించి, అందమైన ట్రేక్ సూట్ ల్లో ఉన్నారు. అవి వాళ్ళకి అవలీలగా పరిగెత్తడానికి ఉపకరిస్తాయి. తను మాత్రం మాసిన చీరలో, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేని పరిస్థితిలో నిల్చుంది. తన వైపు వాళ్ళంతా వింతగా, విడ్డూరంగా చూడసాగారు. వారి చూపుల్లో ‘ఈ వయసులో నీకు ఈ పోటీ అవసరమా’ అన్న భావన కనిపిస్తోంది. కొంతమంది ముసి ముసిగా నవ్వుకుంటున్నారు.
పూవమ్మ అవన్నీ పట్టించుకోలేదు. ఆమె మనసులో ఒకే ఒక దృఢమైన కోరిక! తను ఎలాగయినా ఆ పోటీలో గెలవాలి. విజయం సాధించాలి. బహుమతి చేజిక్కించు కోవాలి. తన కొడుకుని కాపాడు కోవాలి.
పోటీదారుల దృష్టంతా లక్ష్యం పైనే ఉంది. కానీ పూవమ్మ లక్ష్యం మాత్రం తన కొడుకు పైనే ఉంది. ఆరోజు తనకి బాగా జ్వరం కూడా. అయినా తను బాధ పడలేదు. భయపడ లేదు. దేవుని పై భారం వేసింది.
పోటీ మొదలయ్యింది.
విజిల్ వేసి పోటీ మొదలు పెట్టారు నిర్వాహకులు. అందరూ ఒక్కసారిగా పరుగు లంఘించుకున్నారు. వారితో పాటూ పూవమ్మ కూడా పరుగు మొదలు పెట్టింది. వాళ్ళంతా ముందుకు దూసుకు పోతూంటే పూవమ్మ వెనక పడి పోయింది. ఆమెలో ఒక్కసారిగా కంగారు, ఆందోళన మొదలయ్యింది. తను ఓడిపోతానేమో అన్న భయం పట్టుకుంది. తను ఓడిపోకూడదు. నెగ్గాలి. ఒక్కసారిగా ఆమెలో తనకే తెలియని పంతం, పట్టుదల. . తెగింపు, ధైర్యం వచ్చాయి.
ఆమెకు చిన్నప్పుడు తోటల్లో, చేలల్లో, పొలం గట్లమ్మట పరుగులు పెట్టిన అనుభవముంది. ఎన్ని మైళ్ళ దూరమైనా అలుపు లేకుండా పరిగెత్త గలిగే సత్తా వుంది. సరైన పోషకాహారం లేని ఆమె చాలా అల్పంగా, బలహీనంగా ఉంది. అదే ఆమెకు ఒక విధంగా మంచిదయ్యిoది. క్రమ క్రమంగా ఆమె పరుగులో వేగం పెంచింది. ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, ఈలలు ఆమెకు మరింత శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. దాంతో ఆమె వారందరి కంటే ముందుగా పరుగు పెట్టడం మొదలు పెట్టింది. ఊబ కాయాలతో, కొంచెం పుష్టిగా ఉన్న వాళ్ళంతా పూవమ్మతో పోటీ పడలేక పోయారు. పూవమ్మ విల్లు విడిచిన బాణంలా ముందుకు దూసుకు పోతూ లక్ష్యాన్ని ఛేదించిoది. విజేత అయి బహుమతి గెలుచుకుంది.
అప్పటి వరకు ఆమెను చూసి హేళన చేసిన వాళ్ళు ఆమె పట్టుదల, ధృఢ నిశ్చయానికి ఆశ్చర్యపోయారు. ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు ఆమె విజయాన్ని తమ విజయంగా భావించి ఆనందంతో కొట్టిన చప్పట్లు, ఈలలు ఆ మైదానంలో మిన్నంటాయి. పూలదండలు, శాలువాతో ఆమెని సత్కరించి గౌరవించారు. ఒక సాధారణ పల్లెటూరి స్త్రీ అంతటి ఘన విజయాన్ని సాధించటం మామూలు విషయం కాదని ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
నిర్వాహకుల చేతుల మీదుగా, హర్ష ధ్వానాల మధ్య ఆమె ఆ బహుమతి మొత్తం అందుకుంది. అంత గొప్ప వేడుకని ఆమె ఆస్వాదించే పరిస్థితిలో లేదు. ఆమె మనసంతా తన కొడుకు పైనే ఉంది. ఆ బహుమతిలో ఆమెకు తన కొడుకు రూపమే కనిపిస్తోంది. టీవీలు, వార్తా పత్రికలు ఆమె విజయాన్ని కవర్ చేశాయి. విలేఖర్లు ఆమెను చుట్టుముట్టారు. వారందర్నీ తప్పించుకొని ఆమె ఆ డబ్బులతో హాస్పిటల్ వైపు వేగంగా పరుగులు తీసింది. ఆమె హాస్పిటల్లో డబ్బు జమ చేయడం, ఆమె కొడుక్కి ఆపరేషన్ జరగడం అన్నీ ఒకేసారి జరిగాయి. పూవమ్మ కష్టం వృధా కాలేదు. ఆమె కొడుక్కి ఆపరేషన్ విజయవంతం అయ్యింది.
అమ్మ. . వెలుగులు పంచే దీపం లాంటిది. తనని తాను కాల్చుకుంటూ, కరిగించుకుంటూ తన వారి కోసం వెలుగుల్ని ప్రసరింప జేస్తుంది. తను మాత్రం ఎప్పుడూ చీకట్లోనే ఉంటుంది. . ఇప్పుడు పూవమ్మ జీవితం కూడా అంతే. ఆమె కొడుకు స్పృహలో కొచ్చేసరికి పూవమ్మ స్పృహ కోల్పోయింది. ఆమె పరుగు పందెంలో విజయం సాధించింది. కానీ బ్రతుకు పందెంలో ఓడిపోయింది. ఆమె పరుగు పెట్టే సమయంలో మెల్లగా మొదలయిన ఆమె గుండెల్లో నొప్పి పెరిగి పెద్దదయ్యింది. ఆమె కొడుకు కళ్ళు విప్పే సరికి ఆమె కళ్ళు మూసుకున్నాయి శాశ్వతంగా.

*****

1 thought on “7. అమ్మ – ఉగాది కథలపోటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *