April 23, 2024

8. (అ)ఋణానుబంధం – ఉగాది కథలపోటి

రచన: రమా శాండిల్య

ఆ పెద్ద హాలులో ఉన్న కిటికీ ప్రక్కన నిలబడి బయటకి చూస్తోంది రమణి. సంధ్యాసమయం. బయట సైనికులల్లే నిలిచిన పచ్చని చెట్లు, గూళ్ళకు తరలి ఎగిరే పక్షులు, పూలమొక్కలతో, అస్తమిస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు పడి, ఆ ప్రాంగణమంతా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది.
ఇటుతిరిగి చూసేసరికి, పిల్లలంతా ఎంత త్వరగా చేసేసారో కానీ, హాలులో డెకరేషన్ అంతా తాజా తాజా పూలతో , చిన్న చిన్న రంగు రంగుల బుడగలతో చేసి ఉంది. మధ్యలో గులాబీరంగు ముఖమల్ బట్టవేసిన చిన్న బల్లమీద కేక్ ప్రత్యేకంగా అలంకరించి ఉంది. కేకుమీద ‘రమణి 65’ అని అందమైన అక్షరాలు కనిపిస్తున్నాయి.
ఇంతలో లోపలినుంచి ఇద్దరు పిల్లలు “రమణి అత్తా, రమణి అత్తా” అంటూ పరిగెత్తుకొచ్చి రమణి చేతిని పట్టుకుని టేబులు దగ్గరకు లాగుతూ, “మనం కేక్ కట్ చేసేద్దామా?” అని అడుగుతున్నారు. ప్రక్కనుంచి అరుణ “అయ్యయ్యో పిల్లలూ, అత్తను లాగకండి, పడిపోతారు” అంటూ రమణి వైపు తిరిగి “రా… వదినా” అంటూ పిలిచింది.
“ఏంటమ్మా అరుణా? నేనేమైనా చిన్న పిల్లనా? అరవై ఐదేళ్లు వచ్చి ఏంటి ఇదంతా? శ్రీధర్ ముందు ఎంత మొహమాటంగా ఉందో తెలుసా!” అనేసరికి అరుణ “వదినా ఏంటా పిచ్చి ఆలోచనలు? మీ పిల్లలతో పాటు పెంచారు నన్ను కూడా మీరు. మీ అమ్మాయిలాగానే కదా, నేను? నా ముచ్చట తీర్చుకోనివ్వండి…” అన్నది.
అరుణ వైపు ముచ్చటగా చూసింది రమణి. మొట్టమొదటి సారి ఆమెను కలిసిన సందర్భం గుర్తు వచ్చింది.
***
ఆరోజు తనకింకా గుర్తే. దీనవదనంతో తన ముందు నిలబడిన ఆ పాతికేళ్ళ అమ్మాయి, తలవంచుకుని తనడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. ఆమెను పరిచయం చేసిన తన కొలీగ్ రాధ మాటలవలన ఈ అరుణకు తనకన్నా ముప్పై ఏళ్ళు పెద్దవాడైన ఒక వ్యక్తితో పెళ్ళి జరిగిందనీ, సంవత్సరమైనా గడవకుండానే ఆయన చనిపోయారనీ, దానితో ఆయన కొడుకులు, కోడళ్ళు ఈ అమ్మాయిని బయటికి వెళ్ళగొట్టారనీ, భుక్తి కోసం వెదుక్కుంటూ ఉంటే తన పరిస్థితి తెలిసి, దగ్గరకు తీసుకువచ్చిందనీ చెప్పింది రాధ.
ఆమెను చూస్తూంటే కడుపు తరుక్కుపోయినట్టు అయింది రమణికి. తనకో చిట్టి చెల్లెలుంటే ఇదే వయసు ఉండేదేమో. పాతికేళ్ళు నిండగానే పెళ్ళీ, పేరంటం ముగిసిపోవటం చాలా దురదృష్టకరం.
“అమ్మా అరుణా… నిన్ను స్వంత మనిషిలా చూసుకుంటాను. ఏమీ భయపడకు…” అంటూ ధైర్యం చెప్పి, ఇంట్లో చేయవలసిన పనులు, బాధ్యతలు అప్పజెప్పింది రమణి.

తన ఇరవై రెండవ ఏట రాజారావుతో వివాహం జరిగింది రమణికి. అయితే ఎందుచేతనో సంతానం వెంటనే కలగలేదు ఆమెకు. అనుకోకుండా ఉద్యోగానికి అప్లై చేయటం, హిందీ టీచర్ గా అప్పాయింట్మెంట్ రావటంతో వదులుకోవటం ఇష్టం లేక, భర్త చెప్పటంతో చేరిపోయింది రమణి. మామగారు లేరు. అత్తగారు తనతో తల్లిలాగా ఉండేవారు. ఉన్నట్టుండి రమణికి నలభై నడుస్తూ ఉండగా నెలతప్పింది. కొద్దిగా సిగ్గు, మొహమాటం కలిగినా, అత్తగారు, భర్త సంరక్షణలో ఉద్యోగానికి సెలవు పెట్టి, ఇద్దరు చందమామల్లాంటి ఆడపిల్లలకు జన్మనిచ్చింది రమణి. చక్కని పిల్లలు పుట్టినా వారిని చూసుకోవటానికి ఓపిక సరిపోయేది కాదు రమణికి. ఈలోగా ఆరునెలల సెలవు కూడా పూర్తి కావచ్చింది.
దురదృష్టం. జానకమ్మకు పక్షవాతం రావటంతో మంచాన పడింది. ఆమెకు సేవచేయటానికి, పిల్లలను చూసుకోవటానికి మనిషి కోసం వెదుకుతూ ఉంటే రాధ సహాయంతో అరుణ దొరికింది.
అరుణ రావటంతోనే ‘పిన్ని గారూ…’ అంటూ జానకమ్మ సేవలో పడిపోయింది. ఆరునెలల చంటిపాపల సంరక్షణను కూడా తానే స్వీకరించింది అరుణ. పాపాయిలకు సంవత్సర కాలం పూర్తి అయే వరకూ సెలవు పొడిగించాలని అనుకుంది రమణి. నవ్య, భవ్య కూడా అరుణకు బాగా అలవాటు అయ్యారు. అత్తాత్తా అంటూ అరుణను పిలిచేవారు. ఆ పిల్లలను ఆడించటంలో, పెద్దావిడకు సేవ చేయటంలో తన బాధను చాలావరకూ మరచిపోయింది అరుణ.

ఈలోగా ఉన్నట్టుండి జానకమ్మ కాలం చేసింది. ఊహించని ఈ పరిణామానికి అతలాకుతలం అయ్యాడు రాజారావు. తల్లి తనను విడచి ఇంత త్వరగా వెళుతుందని ఊహించలేదు అతను. భర్తకు ధైర్యవచనాలు చెప్పి అతనిని కంటికి రెప్పలా కాచుకోసాగింది రమణి.
***
ఒకరోజు రాత్రి దాహం వేసి, మంచి నీళ్లకోసమని లేచి బయటకొస్తే, పిల్లల గదిలోంచి అరుణ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. లైట్ వేసి, బాగా ఏడుస్తున్న ఆ అమ్మాయిని భుజాలు పట్టుకుని లేవదీసి, పిల్లలకు నిద్రాభంగం కలుగకుండా చేయిపట్టి ఇవతలికి తీసుకువచ్చింది రమణి. ఆమెతో మంచినీళ్ళు తాగించింది. ఆ తరువాత ఆమె భుజమ్మీద చేయి వేసి, “అరుణా ఏమైందమ్మా?” అని బుజ్జగిస్తూ అడిగింది.
ఇంకా మౌనంగానే కన్నీరు కారుస్తున్న అరుణతో, “నువ్వేమీ మాట్లాడకుండా అలా ఉండిపోతే, నీ బాధ నాకెలా తెలుస్తుంది చెప్పు? మీ అన్నగారు ఏమైనా అన్నారా? లేక పిల్లల వలన ఏమైనా ఇబ్బంది కలుగుతోందా? లేక నా వల్లనే ఏదైనా తప్పు జరిగిందా? నాతో చెప్పమ్మా…” అన్నది అనునయంగా.
“అదేమీ కాదు వదినగారూ… పెద్దమ్మ గారు చనిపోయాక ఇక నా అవసరం ఇక్కడ ఏముంది? మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ పని వెదుక్కోవాలి? అన్ని చోట్లా ఇక్కడిలా ప్రశాంతంగా, సమస్యలు లేకుండా ఉండవు కదా వదిన గారూ…” అంటూనే మళ్ళీ బావురుమంది అరుణ. ఆలోచనలో పడింది రమణి.
“ఎంత పిచ్చి దానివి అరుణా? పిల్లలతో నీ అనుబంధం ఇంతేనా? నువ్వు పనికోసం వచ్చావే కానీ ఆ పని మీద మాత్రం మా దగ్గర ఉండిపోలేదు తల్లీ… నిజానికి నీవు నా కూతురిలాంటి దానివి. ఈ ఇంటి ఆడుపడుచుతో సమానం. నిన్నెక్కడికీ పంపించము. నిన్ననే మీ అన్నగారూ, నేనూ మాట్లాడుకున్నాము. నీ కంటూ ఒక జీవితం కావాలి కదా… అందుకే చదివించి, నీ కాళ్ళ మీద నీవు నిలబడ్డాక, వివాహం చేయాలని నిర్ణయించాము. ఇదిగో, ఈ ఆదివారమే నిన్ను పిలిచి ఓ సారి మాట్లాడాలని అనుకుంటున్నాము. నీ భవిషత్తు గురించి నీవేమీ భయపడకు, బాధపడకు. ఈ ఇల్లు నీది, మేము నీ వాళ్ళం. లే, లేచి, ముఖం కడుక్కుని, హాయిగా పడుకోమ్మా…” మృదువుగా చెప్పి, అరుణ చెంపలు నిమిరింది రమణి.

***
కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంది.
అరుణ వారి ఇంటనే ఉండి రమణితో తలలో నాలుకలా కలిసి పోయి చదువు పూర్తి చేసింది. అదే స్కూల్లో టీచరుగా చేరింది.
రాజారావు పనిచేస్తున్న గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు శ్రీధర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఒకరోజు రాజారావుతో పనుండి వారింటికొచ్చి అరుణను చూసి ఇష్టపడి పెళ్లిచేసుకుంటానని కబురు చేసాడు. రాజారావు వారితో అరుణ గురించి, ఏ పరిస్థితులలో ఆమె తమ దగ్గరకు వచ్చిందో, తమ కుటుంబ సభ్యురాలిగా ఉండిపోయిందో, అన్ని విషయాలూ వివరంగా చెప్పాడు.
అరుణ గురించి అన్ని విషయాలూ తెలుసుకున్న తరువాత కూడా శ్రీధర్, అతని తల్లిదండ్రుల నిర్ణయంలో ఎలాంటి మార్పూ రాలేదు. తామే కన్యాదానం చేసి శ్రీధర్ కిచ్చి చాలా సింపుల్ గా కళ్యాణం జరిపించారు రమణి, రాజారావు.
పెళ్ళైన వెంటనే శ్రీధర్ ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం అదికూడా అమెరికాలో వచ్చింది. వారు సంతోషంతో ఫార్మ్యాలటీస్ అన్నీ పూర్తి చేసుకుని అరుణతో సహా అమెరికా వెళ్ళాడు శ్రీధర్.
రమణి దంపతులు కూతుర్ని పంపినట్లే భారమైన మనస్సుతో అరుణని అమెరికా పంపించారు.
***
మళ్లీ పిల్లలిద్దరితో రమణి జీవితం మొదలైంది. ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు రాజారావు. తిరగని హాస్పిటల్ లేదు. మొక్కని దేముడు లేడు. ఏమిచేసినా ఆరోగ్యం కుదుటపడటం లేదు. ఆఫీస్ కూడా లాంగ్ లీవ్ పెట్టేసాడు. పిల్లలు వారి చదువుల్లో వారు శ్రద్ధాగనే వున్నారు. అరుణ అప్పుడప్పుడు ఫోన్ చేసి, క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉంది.
వారం రోజులుగా హాస్పిటలచుట్టూ తిరుగుతూనే ఉంది రమణి. డాక్టర్ రమణిని పిలిచి “మీకు దగ్గరవారు, ముఖ్యమైనవారందరికి చెప్పామన్నాడు ఎక్కువ సమయం లేదు…” అని చెప్పేసరికి, అరుణకు ఫోన్ చేసింది. “ఏమైంది వదినా? ఈసమయంలో కాల్ చేసావు?” అని అడిగేసరికి రమణి దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ రాజారావు పరిస్థితి విషమంగా ఉందనీ ఎంతోకాలం బతకడని డాక్టర్ చెప్పేసారనీ చెప్పింది. రమణిని ఎలా ఊరడించాలో తెలియక, “వదినా, కంగారు పడకు! నేను వస్తున్నాను…” అని ఫోన్ పెట్టేసింది.
ఏమి తిప్పలు పడ్డాడో శ్రీధర్, తనకు ఆఫీస్ పనులవల్ల కుదరక అరుణని ఇండియా పంపడానికి ఏర్పాట్లన్నీ చేసి పంపించాడు. అరుణ వచ్చేసరికి రాజారావు చనిపోయాడన్న వార్తతో పిల్లలెదురొచ్చి చెప్పేటప్పటికి దుఃఖామాపుకోలేకపోయింది అరుణ. దగ్గరుండి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించింది. ఏ లోటు లేకుండా అన్నీ తానే అయి చూసుకుంది. రమణితో “వదినా, ఈ ప్రపంచంలో మీకన్నా ముఖ్యమైనవారు ఎవరూ లేరునాకు.. అన్నలేకపోవడం మనకు తీరని లోటు… కానీ నేను మీకు పెద్ద కూతురిని. ఆ విషయం మరచిపోకు…” అంది దుఃఖావేశంతో ఆమెను గట్టిగా కౌగలించుకొని.
“అవును రమణీ… నువ్వు నా పెద్ద కూతురివే… నువ్వున్నావన్న ధైర్యంతోనే, పిల్లలను పెంచుకుంటాను…” అంది రమణి గద్గద స్వరంతో. పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మ మాట వినమనీ, చక్కగా చదువుకోవాలనీ ఎన్నో విషయాలు చెప్పి, విడువలేక విడువలేక వారిని విడిచి ఫ్లైట్ ఎక్కింది అరుణ.
పిల్లలు, రమణి మళ్లీ తన రొటీన్లోకి వెళ్లిపోయారు రాజారావు లేకుండా… ఇప్పుడు
రమణికి చాలా తీరిక దొరికింది, చాలా సంవత్సరాల తరువాత. ఆలోచనలు బుర్రను తినేస్తుంటే, వాటిని తప్పించుకోడానికి అనేకమైన పనులు పెట్టుకుంది. అందులో ముఖ్యమైనది పెద్దవారుండే ఆశ్రమాలలో నెలకొక రోజు భగవద్గీత, రామాయణ భారతాలలోంచి కొంతభాగం చదివి రావడం లాంటి పనులు అనేకం పెట్టుకుంది.
***
పిల్లలు పెద్దవారయ్యారు. అరుణ నిజంగా ఒక పెద్దమ్మాయిలాగే బాధ్యతలు పంచుకుంటోంది. అరుణతో పాటు శ్రీధర్ కూడా తమ కుటుంబీకుడుగా మారాడు. పిల్లలు అత్తామామా అనే అనుకుంటున్నారు వారిని. అరుణ ఎన్నిసార్లు పిలిచినా రమణి అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అరుణకు ఒకపాప, ఒకబాబు పుట్టారు. వాళ్ళను వీడియోల్లో మాత్రమే చూసింది.
ఎప్పుడు పిలిచినా పిల్లల్ని వదిలి వెళ్లలేక వెళ్ళలేదు. ఇప్పుడు పిల్లలిద్దరూ కూడా అమెరికాలోని యూనివర్సిటీల్లో యమ్మెస్ చెయ్యడానికి అరుణే అన్ని ఏర్పాట్లు చేసి జాయిన్ చేసింది. పిల్లలు కూడా వెళ్ళిపోయాక మరీ ఒంటరితనం అనిపిస్తోంది రమణికి.
ఆ సమయంలో అరుణ అన్ని ఏర్పాట్లు చేసి, రమణి చేత వీసా కోసం అప్లై చేయించింది. టిక్కెట్ పంపింది. పెళ్లై అత్తారింటికొచ్చాక, ఒక్కసారి మాత్రమే పుట్టింటికెళ్లటానికి ఊరు కదిలిన రమణి, రెండవసారి పిల్లల్ని చూడాలని అరుణ దగ్గరకు, అమెరికాకి బయలుదేరి వెల్లింది. కాలం చేసే వింతలన్నీ చూస్తుంటే, జీవితమే ఒక తోలుబొమ్మలాటలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన తాను ఇలా ఈ అమెరికా వచ్చి ఇలా అరుణతో కలవడం తలుచుకుంటే, అసలు అరుణ ఎవరూ? తానెవరు? అన్నీ ప్రశ్నలే… అంతా ఋణానుబంధమే… అనుకుంటూ ఆలోచనల్లోంచి బయటకొచ్చింది రమణి.
***
ఇక్కడ తన అరవై ఐదవ పుట్టినరోజును ఇలా తనదైన కుటుంబం మధ్యలో చేసుకోవడం ఏదో కొత్తగా, ఆనందంగా ఉంది. ఎన్నో ఆలోచనలలో మునిగి ఉన్న రమణి చేతిని పట్టుకుని లాగుతూ “అత్తా, అత్తా… కేక్ కట్ చేద్దాం రా!” “అమ్మా… రామ్మా…” అని పిలుస్తున్న అరుణ పిల్లలతో, తన పిల్లలతో కలిసి కేక్ దగ్గరకొచ్చేసరికి చాలా ఆనందంగా అనిపించింది. శ్రీధర్ ఏదో అడుగుతూ ఉంటే, “మామా… మామా…” అంటూ జవాబులిస్తున్నారు, భవ్య, నవ్యలు. అరుణ మురిపెంగా వారివైపు చూస్తూ ఆ కబుర్లు వింటూ ఉంది. అందరూ కలిసి రమణితో కేక్ కట్ చేయించారు. రాజారావును తలచుకొంటూ కేక్ కట్ చేసిన రమణి వరుసగా అందరికీ దానిని తినిపించింది, కళ్ళలోంచి ఆనందబాష్పాలు జాలువారుతూ ఉండగా…
*******

1 thought on “8. (అ)ఋణానుబంధం – ఉగాది కథలపోటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *