April 16, 2024

9. జూకా మందారం

రచన: వట్టెం రత్నశ్రీ

“బామ్మగారూ! అమ్మ నాలుగు పువ్వులు కోసుకురమ్మంది, కోసుకోనా?” అంటూ వచ్చింది పైన అద్దెకుండే వాళ్ల అమ్మాయి నిత్య.
“ఉండు! నేను ఇస్తా” అంటూ వాళ్లకోసం ముందే కోసి ఉంచిన గన్నేరు పువ్వులూ, ఎర్ర మందారాలూ తెచ్చిచ్చింది పూర్ణమ్మ.
“ఈ జూకా మందార పూలు అసలెప్పుడూ కోయరేం బామ్మగారూ!” అడిగిందా అమ్మాయి.
“అవి అలా చెట్టుకుంటేనే అందం” అని చెప్తుంటే… పైనుంచి వాళ్ళ అమ్మ పిలవటంతో నిత్య పైకి పరిగెత్తింది.
మాఘమాసం కావటంతో సూర్యుడి లేత కిరణాల వెలుగులో జూకా మందార చెట్టుపైన రాత్రి కురిసిన మంచుబిందువులు మెరిసిపోతున్నాయి. స్నానం, నిత్యపూజా కానిచ్చి, ఇంకా కొన్ని చదువుకోవలసిన పుస్తకాలు పుచ్చుకుని వాకిట్లోని చెట్టు కింద పట్టెమంచం వాల్చుకు కూర్చుంది.
నిత్య అడిగిన ప్రశ్నతో పూర్ణమ్మ మనసు ఒక్కసారి గతం లోకి పరుగు తీసింది.
“పూర్ణా! పెరట్లో నిత్యమల్లెలూ, గరుడవర్ధనాలూ ఉంటాయి, మెల్లిగా కొమ్మలు లాగేయకుండా కోసుకురా!”
అత్తగారి గొంతు వినగానే పుస్తకంలో లెక్కలు చేస్తున్న పూర్ణిమ, గబగబా వెళ్ళి పువ్వులు కోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టి. . .
“అత్తయ్యగారూ! నేను చదువుకోనా? ఇప్పుడు వేరే పనేమైనా ఉందా?”
“ఇంకేం లేదులే! వెళ్లి చదువుకో, మీ ఆయన లేచాడేమో చూసి, లేవకపోతే ఒకసారి నిద్ర లేపు… మళ్లీ ఆలస్యమవుతోందని తినకుండానే పరిగెడతాడు వెర్రినాగన్న. ” మురిపెంగా చెప్పిందావిడ.
“ఏవండీ! కాలేజీకి టైమవుతోంది, అత్తయ్యగారు లేవమంటున్నారు. ” ఇంకా దుప్పటి ముసుగు తీయని శశికాంత్ దగ్గరకు వెళ్లి మృదువుగా చెప్పింది.
ఆమె గొంతు వినపడినా, వినపడనట్లే నటిస్తూ కదల్లేదు అతను.
ఈసారి చిన్నగా భుజం మీద తట్టి లేపింది, వెంటనే ముసుగు తీసి ఆమె చేయి పట్టుకుని, తన పక్కన కూర్చోబెట్టుకోబోయాడు.
పూర్ణిమ చటుక్కున అతని చేతిని విడిపించుకుని, “నేను చదువుకోవాలి, వదలండి!” అంటూ పరుగెత్తింది.
“ఛ! మొద్దుమొహం, బొత్తిగా అచ్చటాముచ్చటా తెలీదు” అనుకుంటూ లేచాడు.
అతని స్నానం, సంధ్యావందనం పూర్తయ్యేసరికి తల్లి వేడిగా భోజనం వడ్డించింది. భోజనం చేసి కాలేజికి బయల్దేరబోతూ, అటూఇటూ చూసాడు.
“పూర్ణ కోసమేనా! అది ఇందాకే ప్రైవేటు కి వెళ్లింది” చెప్పిందావిడ.
అతని మొహం కోపంతో ఎర్రబడింది, ‘ఎంత పొగరో! నేనంటే లెక్క లేదు’ అనుకున్నాడు.
కొడుకు మొహంలో భావాలు అర్థమయిన సుమతికి నవ్వొచ్చింది కానీ ‘పూర్ణిమకు కూడా కాస్త అర్థమయ్యేలా చెప్పాలి’ అనుకుంది.
పూర్ణిమ తండ్రి రాఘవయ్య, సుమతికి అన్నయ్య వరుస. రాఘవయ్య, సుమతిల చుట్టరికం దూరమైనా, చిన్నప్పుడు పక్కపక్క ఇళ్లల్లో ఉండటం వలన కలిసి ఆడుకునే వారు. ఆ అభిమానంతోనే సుమతికి పెళ్లి అయ్యాక కూడా వారిద్దరి మధ్యా రాకపోకలు కొనసాగాయి.
సుమతికి ఇద్దరాడపిల్లల మధ్య ఒక్కడే కొడుకు శశికాంత్. బి కామ్ పూర్తిచేసి ఎల్ ఎల్ బి లో చేరాడు. పెద్దకూతురు మాధవికి పెళ్లయింది. చిన్నది బిందూ వీళ్లిద్దరి తరువాత కాస్త ఆలస్యంగా పుట్టడంతో ప్రస్తుతం తొమ్మిదో తరగతిలో ఉంది.
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న పూర్ణిమను, రాఘవయ్య తల్లి లేని లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచాడు… కానీ ఎనిమిదినెలల క్రితం హఠాత్తుగా ఆయన గుండెపోటుతో చనిపోయేసరికి పూర్ణిమ అనాథ అయింది. ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్న పూర్ణిమకు తండ్రి దాచిన కొంత డబ్బు, తల్లివి ఇరవై తులాల నగలు, స్వంత ఇల్లు మిగిలాయి కానీ ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరు. ఆ సమయంలో బంధువులు కొందరు సుమతితో, పూర్ణిమను కోడలిగా చేసుకుంటే బాగుంటుందని సూచించారు. ఆవిడకూ, మిగిలిన కుటుంబసభ్యులకూ కూడా పూర్ణిమ అంటే ఇష్టమే, ముఖ్యంగా శశికాంత్ కి ఆమె బాగా నచ్చింది. చక్కగా రెండు జడలూ, పరికిణీ, ఓణీ, దోసగింజలా బొట్టు, చెవులకు జూకాలు, ఇంతే తన అలంకారం. పచ్చని పసిమి ఛాయలో, చక్కని కనుముక్కు తీరుతో సహజంగానే మెరిసిపోయే అందం.
రాఘవయ్యకు ఆయన కన్నా పదేళ్లు పెద్దదైన అక్క ఉంది కానీ ఆవిడ పెళ్లయినప్పటి నుంచీ కలకత్తాలో ఉండిపోయి, ఇక్కడికి రావటం తక్కువే. అందుకే పూర్ణిమకు మేనత్తకన్నా సుమతే బాగా పరిచయం. పైగా సుమతి వచ్చినప్పుడల్లా వీరింటికి రావటం, పూర్ణిమ కోసం ఏవో బహుమతులు తెస్తూ, ముద్దుగా చూసుకునేది… “మా అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా?” అని సుమతి అడిగినప్పుడు, పెళ్లి గురించి ఏ అభిప్రాయం లేకున్నా, సుమతి దగ్గర ఉంటే బావుంటుందనిపించి “సరేనంది”.
ఏడాది లోపు పెళ్లి చేస్తే రాఘవయ్యకి కన్యాదాన ఫలితం దక్కుతుందనే ఆలోచనతో రెండునెలల క్రితమే ఎక్కువ ఆర్భాటాలు లేకుండా పూర్ణిమ మేనమామ చేత కన్యాదానం చేయించి, పెళ్ళి జరిపించేసారు. ఇంకా పూర్ణిమ మైనర్ కనుక భార్యాభర్తలను దూరంగానే ఉంచారు. ఆమె చదువు ఆపటం ఇష్టం లేక, ఇక్కడ ట్యూషన్ కి పంపిస్తున్నారు.
శశికాంత్ యవ్వనంలోకి అడుగుపెట్టాడు, పైగా పట్నంలో పెరగటం వలన సినిమాలూ, స్నేహితులూ, వీటన్నిటి ప్రభావంతో భార్యతో సరదాగా ఉంటుందనుకుంటే… పూర్ణిమేమో అతను దగ్గరకొస్తే పారిపోతుంది. ఏ సరసాలూ, సరదాలూ తెలియవని, అతనికి పూర్ణిమ మీద అలకగా ఉండేది. ఆమెకి ఇంకా మనసులో ఇలాంటి ఆలోచనలు లేవు.
ముందు నుంచీ చదువూ, తండ్రికి సహాయంగా ఇంటిపనులు చేయటం, మొక్కలు పెంచటం, ఇవే పూర్ణిమకు లోకంలా ఉండేది. ముఖ్యంగా పెరట్లో తులసి కోట దగ్గర తల్లి నాటిన జూకా మందారం చెట్టంటే పూర్ణిమకి ప్రాణం. ఆ చెట్టు కొమ్మలు తులసి మొక్కపై వాలి ఉండేవి. నిండు ఎరుపు రంగులో, వెనుకకు వంగిన రేకలతో, రెమ్మలకు ఒయ్యారంగా వేలాడుతూ ఉండే ఆ పువ్వులు ప్రత్యేకంగా కోసి పెట్టకపోయినా, పచ్చని తులసి చెట్టుకు అక్కడక్కడా ఎర్ర జూకాల్లా అందంగా కనిపించేవి.
…………. .
పరీక్షలు రానే వచ్చాయి, సుమతి పూర్ణిమకు తోడుగా వెళ్లింది. పరీక్షలు అయిపోయేసరికి రాఘవయ్య సంవత్సరీకాలు వచ్చాయి. ఆ కార్యక్రమాలన్నీ సుమతి దంపతులే జరిపించి, ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు పూర్ణిమ పేరు మీదే బేంక్ లో వేసి, కొన్ని ముఖ్యమైన సామాన్లు మాత్రం తీసుకుని, వచ్చేసారు.
సుమతి, పూర్ణిమకు కొత్త లేకుండా ప్రేమగా కబుర్లు చెప్తూ ఇంటి పనులన్నీ నేర్పించింది. ఆమె ప్రేమతో పూర్ణిమ తండ్రి పోయిన బెంగనుంచీ త్వరగానే తేరుకుంది. బిందూకి తండ్రి గారాబం, పనికి ఒళ్ళొంగేది కాదు. అయినా పూర్ణిమ ఆమెతో వంతు పడకుండా, తనను చిన్నపిల్లలా చూసేది. మాటల మధ్యలో సుమతి కాస్త నచ్చచెప్పటంతో, భర్తతో కబుర్లు చెప్పటం, ఎప్పుడైనా ఏ గుడికో అతనితో కలిసి వెళ్లడం మొదలైంది.
మొక్కలంటే ఉన్న ప్రేమతో పూర్ణిమ, అత్తవారింట్లో కూడా ఇంటి చుట్టూరా బోలెడన్ని మొక్కలు వేసింది… ప్రత్యేకించి ఇల్లు అమ్మేసినప్పుడు, జూకా మందారం కొమ్మ తీసుకువచ్చి, ఇక్కడ వాకిట్లో ఉన్న తులసి కోటకు దగ్గరలో నాటింది. అది కాస్త పెరిగి మొగ్గ వేసాక కానీ స్థిమితపడలేదు. ఆ పువ్వులు మాత్రం ఎవరినీ కోయనిచ్చేది కాదు. . . చెట్టుకే వదిలేసేది. ఆమె పుట్టింట్లో లాగే ఇక్కడ కూడా విరగబూసిన పూలతో తులసి కోటను అలంకరించేది ఆ జూకా మందారం.
కాలేజీలు తెరవగానే పూర్ణిమను బి ఎస్సీలో చేర్చారు. ఇక శశికాంత్ చిలిపి అల్లరి భరిస్తూ, చదువుకోవాలంటే పూర్ణిమకు బుర్రకెక్కేది కాదు. ఇది గమనించిన సుమతి, ఎదిగిన పిల్లలను ఎక్కువ రోజులు విడిగా ఉంచినా ఇబ్బందేనని, ఒక మంచిరోజు చూసి ఆ వేడుకా జరిపించేసింది.
“చదువులు పాడవుతాయి, కొన్నాళ్లు జాగ్రత్తగా ఉందామంటే” అతను వినేవాడు కాదు. మొత్తానికి పూర్ణిమ డిగ్రీ మూడవ సంవత్సరానికొచ్చేసరికి ఒక పిల్లాడికి తల్లయింది. అత్తగారి ప్రోద్బలంతో, ఎలాగో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత ఏడాదికి మరో సంతానం, ఈసారి ఆడపిల్ల పుట్టింది. శశికాంత్ చదువు పూర్తయి ఒక సీనియర్ అడ్వొకేట్ దగ్గర ఉద్యోగానికి చేరాడు… మామగారి రిటైర్మెంట్, బిందూ పెళ్లీడుకి రావటం, ఇంట్లో ఖర్చులు పెరగటంతో డబ్బులకు కొంచెం కటకటగా ఉండేది. బి ఎడ్ చేసి ఉద్యోగం చేయాలని ఉన్నా, ఆమెకి చదువుకునే తీరిక దొరికేది కాదు.
శశికాంత్ అసిస్టెంట్ గా చేస్తూనే కోర్టులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండటంతో ఇల్లూ, పిల్లలు, అత్తమామలు అన్నీ పూర్ణిమ బాధ్యతలుగా మారాయి. సుమతికి కూడా ఓపిక తగ్గింది. బిందూకి బేంక్ లో ఉద్యోగం రావటం, పెళ్లి కుదరటం ఒకేసారి జరిగాయి. కాస్త గొప్పింటి సంబంధం కావటంతో పెళ్లి ఘనంగా జరిపించేసరికి మామగారి రిటైర్మెంట్ డబ్బులు చాలావరకూ ఖర్చయిపోయాయి.
పెద్దమ్మాయి మాధవికి అత్తవారింటి బాధ్యతలు ఎక్కువ, ఇక్కడకు వచ్చినా నాలుగు రోజులకు మించి ఉండేది కాదు. బిందూకి మాత్రం సంపాదన ఉన్నా పుట్టింటి సొమ్ముపై ఆశ. . . తన పురుళ్లూ, బాలసారెలూ అన్నిటికీ భారీగానే ఖర్చు పెట్టించింది. శశికాంత్ కి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉద్యోగం రావటంతో ఆర్ధిక ఇబ్బందులు కాస్త తీరినా, బాధ్యతలు పెరగటంతో ఆదాయం, ఖర్చూ సమానంగానే ఉండేవి.
పిల్లలు రజని, శ్రీకాంత్ ఇద్దరూ హైస్కూలు చదువులకొచ్చారు. సుమతి బాగా బలహీనమయిపోయి, తరచుగా జ్వరం వస్తోందని, టెస్ట్లు చేయిస్తే కిడ్నీలు రెండూ పాడయ్యాయి, డయాలసిస్ చేయాలని చెప్పారు. శశికాంత్ కి ప్రమోషన్ మీద, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది కానీ అక్కడ ఇంత వైద్యసదుపాయం లేదు, పైగా పిల్లలను సంవత్సరం మధ్యలో స్కూలు మార్చటం ఇబ్బందని, అతనొక్కడే వెళ్లిపోయాడు. నాలుగు సంవత్సరాల పాటు అలానే అతనక్కడ వంటమనిషి చేత వండించుకుంటూ, వారాంతంలో వస్తూ, వెళ్తూ ఉండేవాడు.
సుమతికి మనసులో ‘కూతుళ్లు వచ్చి నాలుగు రోజులు తనను చూసుకుంటే, ఆ నాలుగు రోజులైనా కొడుకు, కోడలు సరదాగా ఉంటారని’ అనిపించేది కానీ పెద్దకూతురికి కుదరదు, చిన్నకూతురికి అంత మంచి మనసూ లేదని తెలిసి బాధపడి ఊరుకునేది.
………….

ఏ బంధాలైనా ఋణానుబంధం ఉన్నంత సేపే… అత్తగారు, మామగారు ఒకరి వెనుక ఒకరు రెండేళ్ల తేడాలో వెళ్లిపోయారు. అత్తగారు పోయినప్పుడు పూర్ణిమ చాలా క్రుంగిపోయింది. భర్త ఆ సమయంలో ట్రాన్స్ఫరై ఇక్కడే ఉన్నాడు, కానీ అతనికి, ఆమెలోని నిరాసక్తత, బాధ గుర్తించే తీరిక ఉండేది కాదు.
పిల్లలిద్దరూ పెద్దచదువులు చదివి, మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు… వారి హోదాకు తగినట్లుగా మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసారు.
జీవిత ప్రయాణంలో ఇన్ని అనుభవాలు చవి చూసినా, ఇద్దరూ కలిసి అన్ని బాధ్యతలూ నిర్వర్తించినా, ఎందుకో శశికాంత్ తో చెలిమి మాత్రం ఏర్పడలేదు. ఆమెకి కాస్త మానసిక పరిపక్వత కలిగి, భర్త సాన్నిహిత్యం కావాలనిపించేసరికి అతను వృత్తిపరంగా ఎదిగే క్రమంలో ఆమెకు సమయం ఇవ్వలేక పోయాడు, వారిద్దరి మధ్యా దూరం అలానే ఉండిపోయింది. భార్యగా ఆమె అతని అవసరాలు చూడటం తప్ప, మామూలు భార్యాభర్తల మధ్య ఉండే అలకలూ, తగవులూ, సరదాలూ ఏవీ వారి మధ్య ఉండేవి కావు.
రిటైర్ అవడానికి నాలుగేళ్ల ముందే అతని మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లింది. భార్య పేరు మీద ఆ ఇల్లూ, కొంత ఆస్తీ రాసి, తను వేదాంతశాస్త్రంలో పి హెచ్ డీ చేసి, రిషీకేష్ కి వెళ్లిపోయాడు. ఆమెను వెంట తీసుకెళ్లాలని అతను అనుకోనూ లేదు, ఆమె వస్తాననీ అనలేదు. తండ్రితో గట్టిగా మాట్లాడే చనువు పిల్లలకు లేదు. . . తల్లిని “తమ దగ్గరికి వచ్చేయమని” అడిగారు కానీ పూర్ణిమ ఒప్పుకోకపోవటంతో, పైన మూడు గదులు వేసి, ఒక చిన్న కుటుంబానికి అద్దెకు ఇచ్చారు… వాళ్ళు పూర్ణిమతో స్నేహంగా, సహాయంగా ఉన్నారు.
పైనుంచీ పువ్వు రాలి ఒళ్లో పడేసరికి పూర్ణిమ ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది. ‘ఇంట్లో ఇన్ని పువ్వులు పూసినా ఈ జూకామందారమే ఎందుకు నచ్చేదో కానీ తన జీవితమూ దానిలాగే… ఒకనాటి భర్త స్టేటస్ కానీ ఇప్పుడాయన వియోగం కానీ ఏవీ తన మనసుకంటనే లేదు… తనూ ఆ పువ్వు లాగే పెళ్లి అనే సన్నని బంధపు కాడతో ఈ కుటుంబాన్ని పట్టుకు వేలాడుతూ ఉండిపోయింది. ‘ఆమె పెదాలపై చిన్ననవ్వు మెరిసింది. . .
వర్షమొస్తుందేమో అన్నట్లుగా చీకట్లు కమ్మి, గాలి వేగంగా వీస్తోంది. ఆరేసిన బట్టలు తీయడానికి బయటకు వచ్చిన నిత్య ‘ఇంత గాలేస్తుంటే, బామ్మగారు చెట్టు కింద అలానే పడుకుని ఉన్నారేంటో!’ అనుకుని తల్లిని పిలిచింది.
వాళ్లు కిందకు వచ్చి చూసేసరికి, గాలికి కుప్పలుగా రాలిపడిన జూకామందారాల మధ్య, నిశ్చలంగా పూర్ణిమ, ప్రశాంతమైన వదనంతో.
*********************

1 thought on “9. జూకా మందారం

  1. కొన్ని బంధాలు అంతే ఏమో అక్క. బాగా రాసారు. చక్కటి భాష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *