May 26, 2024

అమ్మమ్మ – 26

రచన: గిరిజ పీసపాటి

విశ్రాంతి తీసుకుంటూ, శేష జీవితం గడపవలసిన వయసులో కూడా గరిటె పట్టుకుని ఆ ఇంటా, ఈ ఇంటా వంటలు చేస్తూ సంపాదిస్తున్న తల్లిని డబ్బు అడగడానికి మనసొప్పకపోయినా, తనకు చదువు అంటే ఉన్న ఇష్టం, అంతంత మాత్రంగా ఉన్న తమ ఆర్ధిక పరిస్థితి కారణంగా తల్లికి విషయం వివరిస్తూ ఉత్తరం రాయక తప్పలేదు నాగకి.
వారం రోజులలోనే ఆవిడ దగ్గర నుండి ”తప్పకుండా డబ్బు పంపుతాననీ, ఎంత అవసరమౌతుందో తెలియజేయమ’ని జవాబు వచ్చింది.
ముందు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి కనుక దానికి ఎంత డబ్బు అవసరమో చెప్తూ, ముందు ఆ అమౌంట్ పంపమనీ, ఎంట్రన్స్ టెస్ట్ పాసయితే మిగిలిన సంవత్సరాల సంగతి తరువాత తెలియజేస్తా’నంటూ వచ్చిన కూతురి ఉత్తరం చూసి, అడిగిన సొమ్మును వెంటనే MO చేసింది అమ్మమ్మ.
వారం రోజులలో MO అందుకున్న నాగ ఆనందానికి అవధులు లేవు. వెంటనే భర్తకు డబ్బు ఇస్తూ “ఆలస్యం చెయ్యకుండా ఎంట్రన్స్ టెస్ట్ కి అప్లికేషన్ ఫార్మ్ తెప్పించండి” అంటూ చెప్పింది.
రెండు రోజులలో ఆంధ్రా యూనివర్సిటీ నుండి BA ఎంట్రన్స్ ఫార్మ్ తెచ్చి, తనే స్వయంగా ఫిల్ చేసి, నాగ సంతకం తీసుకుని, సబ్మిట్ చేసి, ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవడానికి గైడ్ కూడా కొని తీసుకచ్చారు పెదబాబు.
ఆరోజు నుండి చదువుపై దృష్టి పెట్టి, పట్టుదలగా చదివసాగింది నాగ. తరువాత ఎంట్రన్స్ టెస్ట్ రాయడం, పాసవ్వడం కూడా జరిగింది. తను BA ఎంట్రన్స్ పాసయిన విషయం తెలియజేస్తూ, మొదటి సంవత్సరం చదవడానికి ఎంత పంపాలో వివరిస్తూ తల్లికి ఉత్తరం రాసింది నాగ.
కూతురు పరీక్ష పాసయినందుకు ఎంతో సంతోషించింది అమ్మమ్మ. ‘పై చదువు చదవాలనుకున్న నీ కల సాకారమౌతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఈ ఉత్తరంతో పాటు నువ్వు అడిగిన సొమ్ముకు అదనంగా మరికొంత సొమ్మును MO చేస్తున్నానని, బలమైన ఆహారం తీసుకోమని’ రాసింది అమ్మమ్మ.
BA మొదటి సంవత్సరం కూడా పాసయి రెండవ సంవత్సరం చదవసాగింది నాగ. తెలిసిన వాళ్ళు చెప్పగా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయింది.
పిల్లలను కొట్టడం, తిట్టడం వంటివి చెయ్యకుండా, ప్రేమగా పలకరిస్తూ, చదువు చెప్పసాగింది. దాంతో పిల్లలు ఇంటికెళ్ళినా పేరెంట్స్ తో తమ టీచర్ గురించే మాట్లాడసాగారు. ఇదివరకటి కన్నా పిల్లలకు మార్కులు బాగా రాసాగాయి.
స్కూల్ ప్రిన్సిపాల్ గారైన విజయలక్ష్మి గారే కాక, పిల్లల తల్లిదండ్రులకు కూడా దేవి టీచర్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది.
(లక్ష్మీ నాగ కుమారి అయిన నాగ పేరు పెళ్ళయ్యాక నాగలక్ష్మీ దేవి గా మారడం చేత స్కూల్ లో అందరూ దేవి టీచర్ అనసాగారు.)
దాంతో కొందరు తల్లిదండ్రులు నాగను తమ పిల్లలకు ట్యూషన్ చెప్పమని రిక్వస్ట్ చేయగా, ‘సరేనని’ ఇంటి దగ్గర సాయంత్ర సమయంలో ట్యూషన్ చెప్పసాగింది.
అప్పటికే ఉద్యోగం, చదువుతో తీరిక ఉండట్లేదు. చిన్న వయసులోనే ఇంటి పని, వంట పని మొదలైన బాధ్యతలను వసంత తీసుకోబట్టి గానీ, లేకపోతే ఊపిరి కూడా సలిపేది కాదేమో
ఇంతలో వసంతకు ఆరోగ్యం దెబ్బతింది. చిన్నప్పటి నుండి బొద్దుగా, పుష్టిగా ఉండే పిల్ల హఠాత్తుగా సన్నబడి, బరువు తగ్గిపోసాగింది. పోనీ భోజనం సరిగా చెయ్యట్లేదా అంటే ఇదివరకు తినేదానికి రెండింతలు తినసాగింది. బహుశా వేసవి ఎండల వల్ల అలా అయిపోతోందనుకుంది నాగ.
ఇంతలో ఇంట్లో బియ్యం నిండుకోగా పెదబాబుకి, నాగకి సెలవు లేనందున రాముడువలస వెళ్ళి, పంట బియ్యం తీసుకురమ్మని (ప్రతీ నెలా బియ్యం మాత్రం రాముడువలస నుండి తెచ్చుకునేవారు) వసంతను పంపించారు.
పెద్ద మనవరాలు వచ్చిందని నాన్నమ్మ గారు సంతోషించి, వారం రోజులు ఉండి, వెళ్ళమని కోరడంతో సరేనంది వసంత. ‘అయ్యో! పుష్టిగా ఉండే పిల్ల ఇలా సన్నబడిపోయిందే అని బాధ పడిన ఆవిడ పిల్ల తేరుకోవాలని అరిసెలు, జున్ను, తాటి ముంజలు వంటివెన్నో తినిపించారు.
అయినా పిల్ల తేరుకోకపోగా మరింతగా క్షీణించిపోసాగింది. కాళ్ళు, ముఖం పొంగిపోయాయి. పొట్ట విపరీతంగా పెరిగిపోయి ముందుకు పొడుచుకు వచ్చింది. దాంతో భయపడిన ఆవిడ బొబ్బిలి తీసుకెళ్ళి తన స్నేహితురాలైన నర్స్ వరలక్ష్మి గారికి పిల్లను చూపించారు.
ఆవిడ పిల్లను చూసి, పిల్లకి జలోదరం అనే జబ్బు వచ్చిందనీ, పది రోజుల కన్నా ఎక్కువ బతకదని చెప్పగా భయపడి, మర్నాడే బియ్యం బస్తాతో సహా వసంతను వైజాగ్ పంపించేసారు.
వైజాగ్ బస్సు దిగేసరికి విపరీతమైన నీరసంతో కళ్ళు తిరుగుతుండగా, బస్తాను దించి పెట్టమని డ్రైవర్ ని, కండక్టర్ ని బతిమిలాడుకుని కాంప్లెక్స్ లోనే ఉన్న బెంచ్ పై పడుకుండిపోయింది.
అరగంట గడిచాక కాంప్లెక్స్ లో ఉన్న ప్రయాణికులలో ఇద్దరిని బతిమిలాడుకుని, వారి సహాయంతో ఆటో ఎక్కి, ఇంటికొచ్చి, తల్లిని ఆటో డబ్బు ఇమ్మని చెప్తూ మంచం మీద వాలిపోయింది.
పిల్లను చూసిన నాగ బెంబేలు పడుతూ ఆటోకి డబ్బులిచ్చి, బియ్యం బస్తా ఇంట్లో పెట్టించి, మంచి నీళ్ళు తెచ్చిస్తూ “వసంతా! ఏమిటిలా అయిపోయావు?” అనడిగింది ఆందోళనగా.
తల్లి అందించిన నీళ్ళు తాగి, తల్లిని కౌగలించుకుని భోరున విలపిస్తూ “అమ్మా! నాకు జలోదరం అట. నేను పదిరోజుల కన్నా బతకనట” అనగానే “ఎవరు చెప్పారు?” అని అడిగింది నాగ భయపడుతూ.
“మామ్మ నన్ను బొబ్బిలి తీసుకెళ్తే అక్కడ వరలక్ష్మమ్మ గారు చెప్పారు” అంది వసంత ఏడుస్తూనే. పదిహేనేళ్ళ కూతురికి అప్పుడే నూరేళ్ళూ నిండుతున్నాయనేసరికి బాధపడుతూ “వారంలో చనిపోతావని తెలిసి కూడా తోడుగా మనిషిని కూడా పంపకుండా ఒక్కర్తినీ బస్సు ఎక్కించి ఎలా పంపేసారే” అంటూ గుండెలవిసిపోయేలా ఏడవసాగింది నాగ.
దాంతో చుట్టుపక్కల ఇళ్ళవారు వచ్చి నాగను, వసంతను ఓదార్చసాగారు. రెండిళ్ళ అవతల ఉంటున్న రాణి గారు, వాళ్ళాయన వచ్చి “బొబ్బిలిలో ఒక నర్స్ చెప్పిన మాటలు నమ్మి ఏడవడం మంచిది కాదు దేవి గారూ! వసంతను ఇక్కడ ఉన్న డాక్టర్ కి ఎవరికైనా చూపించండి. వసంతకి ఏమీ కాదు. ఏడిస్తే సమస్య తీరదు” అంటూ సలహా ఇచ్చారు.
వెంటనే ధైర్యం తెచ్చుకున్న నాగ, క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వసంతను తమకు పరిచయం ఉన్న డా. BD నాయుడు గారి దగ్గరకు తీసుకెళ్ళింది.
ఆయన ఎముకల వైద్య నిపుణుడు అయినా, పాత పరిచయాన్ని పురస్కరించుకుని వసంతను పరీక్షించి, అర్జంటుగా చేయించమని కొన్ని బ్లడ్, యూరిన్ టెస్టులు రాసి, వాటి రిపోర్ట్స్ తో వచ్చి కలవమన్నారు.
తన భర్త పని చేస్తున్న AVN C High School ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్ కావడంతో అప్పటికి ఆరు నెలలుగా జీతాలు లేక, కేవలం తనకొచ్చే కొద్దిపాటి జీతం, ట్యూషన్ ఫీజులు కూడా ఖర్చులకు సరిపోక, పిల్లల జడగంటలు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బతో ఇల్లు నడిపింది ఇన్నాళ్ళూ. ఇప్పుడు ఆ డబ్బు కూడా అయిపోయింది.
డాక్టర్ తెలిసినతను కనుక పైసా కూడా ఫీజు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టులు చేయించడానికి కూడా చేతిలో డబ్బు లేక లేబ్ వాళ్ళని “మర్నాడు వచ్చి డబ్బు చెల్లిస్తానని, ప్రస్తుతం పిల్ల పరిస్థితి చూసి సాంపిల్స్ తీసుకోమని” బతిమిలాడుకుంది.
వాళ్ళు వసంత పరిస్థితి చూసి, జాలిపడి బ్లడ్, యూరిన్ సాంపిల్స్ తీసుకుని, రిపోర్ట్స్ మర్నాడు ఇస్తామని చెప్పడంతో ఇంటికి వచ్చారు. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పప్పటికి, పన్నెండేళ్ళ గిరిజ తనకు చేతనయినట్లుగా వంట చేసి పెట్టడంతో తిని పడుకున్నారు.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *