March 29, 2024

ఊరు చేరిన పాదాలు

రచన: శింగరాజు శ్రీనివాసరావు

ఆరు నెలల నుంచి జీవితం అంధకారంలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. పదవీ విరమణ చేసిన అయిదు సంవత్సరాలలో ఇంతగా ఎప్పుడూ తల్లడిల్లిన దాఖలాలు లేవు. ఉదయం పూట వ్యాయామం, దేవాలయ దర్శనం, సాయంవేళలో తోటి స్నేహితులతో ఒక గంట కాలక్షేపం. ఎంతో హాయిగా, ఉద్యోగం లేకపోయెనే అనే బాధలేకుండా జరిగిపోయింది. కానీ మొన్న ఏప్రియల్ నెల నుంచి జీవితచక్రమే మారిపోయింది. కరోనా మహమ్మారి ఏమని మనదేశంలో ప్రవేశించిందో గానీ అందరి బ్రతుకులు అతలాకుతలమయిపోయాయి. అడుగు బయట పెట్టాలంటే భయం. ఎవరిని ముట్టుకోవాలన్నా భయం. ఎప్పుడు వచ్చి ఆ వైరస్ చుట్టుకుని బ్రతుకును బుగ్గి చేస్తుందోనని భయపడి పోతున్నారు జనం. ఎక్కడి రవాణావ్యవస్థ అక్కడే ఆగిపోయింది. కడుపు చేతపట్టుకుని వెళ్ళిన వలసజీవులు పనులులేక పస్తులు ఉండవలసిన స్థితిలో అక్కడ ఉండలేక సొంత ఊరికి పయనమయి కాలిబాట పట్టారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఏ మహానుభావుడైనా అంత ముద్దపెడితే ఆకలి తీర్చకుంటూ, బొబ్బలెక్కిన పాదాలు చితికి కారుతున్న రక్తం నేలను తడిపేస్తున్నా, తన గూటికి తను చేరాలనే చిన్ని ఆశతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఇక రహదారి మీద బండ్లు పెట్టుకుని బ్రతికే చిల్లర వ్యాపారస్తుల పరిస్థితి వర్ణనాతీతం. ఒకరేమిటి రెక్కాడితేగాని డొక్కాడని బడుగుజీవుల బ్రతుకులలో చీకటినే నింపింది శార్వరి నామ సంవత్సరం, తన పేరును సార్ధకం చేసుకుంటూ. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడ రోజుకు పన్నెండు గంటలు కష్టపడుతూ కోవిడ్ రోగుల మధ్యనే కాలం గడుపుతున్నాడు నా కొడుకు రఘు. మొదటినుంచి మెరికలాటి వాడు కావడంతో వాడి ఇష్టం మేరకే కొంచెం నాకు భారమయినా వాడిని మెడిసన్ చదివించి డాక్టరును చేశాను. వందలోపు ర్యాంకు సాధించి వాడు గుంటూరు మెడికల్ కాలేజిలో సీటు సంపాదించి నాకు హాస్టలు ఖర్చు లేకుండా చేశాడు. కార్పొరేటు ఆసుపత్రులు ఎన్ని ఆహ్వానించినా కాదని, పరీక్షలలో మెరిట్ సాధించి, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరుగా చేరాడు. ఇప్పుడు వాడు గుంటూరు ఆసుపత్రిలో ఊపిరితిత్తుల విభాగానికి ఇన్ ఛార్జిగా ఉంటున్నాడు. ఈ కోవిడ్ విజృంభించినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక ఉండటం లేదు. ఇంటికి వచ్చినా తను లోపలికి రాకుండా వరండాలో ఉన్న చిన్న గదిలో ఉండి వెళ్ళిపోతున్నాడు.

అసలే డాక్టరు, పైగా కోవిడ్ రోగులకు సేవచేసే వాడు కావడం వలన అక్కడి రోగుల బాధ చూసి అలాటి బాధ నాకు రాకూడదని నన్ను కూడా ఇంట్లోనే నిర్బంధించాడు. ఇప్పుడు నాకున్న కాలక్షేపమల్లా ఫోను, టెలివిజను, పురాణపఠనం. అలా సాగిపోతున్నది నా జీవితం. ఈ అంటువ్యాధి విజృంభణకు జడిసి మా ఊరి నుండి వలస వెళ్ళిన వారు కూడా, పది కుటుంబాల వరకు వెనుకకు వచ్చారని నా బాల్య స్నేహితుడు నారాయణ నాలుగు నెలల క్రితం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉన్నదని, కోవిడ్ భయంతో పొలం పనికి కూడ ఎవరూ పిలవడం లేదని చెప్పుకొచ్చాడు మొన్న ఫోను చేసి. వాడంత వాపోవడానికి కారణం వాడు ఆఊరికి సర్పంచి. నాకున్న ఆత్మీయులలో మొదటిస్థానం వాడిదే… సరిగ్గా నెలరోజుల క్రితం వాడి దగ్గర నుంచి మరలా ఫోను వచ్చింది.

********

” ఒరేయ్ శీనూ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. నీకు ఎప్పుడు తీరుబాటు దొరుకుతుంది. నీతో నేరుగా వచ్చి మాట్లాడుదామంటే, ఈ కోవిడ్ లో ఇంటికి రావడం బాగోదని చూస్తున్నాను” ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చాడు నారాయణ.

” ఎప్పుడూ తీరుబడే కదురా. ఉద్యోగమా, సద్యోగమా. ముఖ్యమైన విషయం అంటున్నావు గదా చెప్పు” అన్నాను నేను.

” ఈ కోవిడ్ వచ్చిన తరువాత ఎక్కడా పనులు దొరకక కొందరు, ఉంటామో పోతామో చివరిసారిగా అయిన వాళ్ళను, పుట్టిన ఊరిని, కడసారి చూచిపోదామని వలస పోయిన వారంతా కాలినడకన సొంత ఊళ్ళకు బయలుదేరారు కదా. ఆ వరుసలోనే మన ఊరినుంచి వెళ్ళిన పదిహేను కుటుంబాలలో పది కుటుంబాల వారు తిరిగి మన ఊరికి వచ్చేశారు. ఆ విషయం పోయినసారి చెప్పాను గుర్తుందా. వారిలో మనతో పాటు చదువుకున్న వెంకయ్య కొడుకు కూడ ఉన్నాడు. మొన్న వెంకయ్య మా ఇంటికి వచ్చి వాళ్ళ స్థితిగతుల గురించి చెప్పాడురా. నాకు చాలా జాలివేసింది, వాడి మాటలు విన్నాక”

” ఏం చెప్పాడేమిటి?”

” గత రెండు సంవత్సరాల నుంచి వలస పోయిన వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయట. రియల్ ఎస్టేటు పనులు పూర్తిగా స్ధంభించిపోయాయట. రాజధానుల గొడవలొక వైపు, పెరిగిన ధరలు ఒకవైపు, ఆర్ధికమాంద్యం మరొకవైపు, మొత్తానికి ఎటువంటి నిర్మాణాలు లేక కూలీలకు దినభత్యం దొరకడం కష్టమయిందట. దానికి తోడు అదుపుతప్పిన నిత్యావసర ధరలు, తిండి గడవటానికి ఇబ్బంది పడుతున్నారట. ఇంతలోకి పులి మీద పుట్రలా ఈ కరోనా వైరస్ వచ్చి వాళ్ళ జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. దానితో వారికి వేరే దారి కానరాక ఊరికి తిరిగి వచ్చేశారు. ఇక్కడ కూడ రైతువారీ కూలీ పనులకు కూడ కష్టమయిపోతున్నది. ఇలా తమ గోడు వెళ్ళబుచ్చుకుని, ఊరి సర్పంచిగా మాకు ఏదైనా దారి చూపరా అని అడిగాడు”

” నిజమేరా. దేశంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏవేవో కొత్త సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా. అవన్నీ వాళ్ళకు వర్తించేలా ప్రయత్నించు. కొంత ఉపశమనంగా ఉంటుంది కదా. పోనీ నీకే ఆలోచన వచ్చిందో చెప్పు. అలాగే చేద్దాం” అవకాశం వాడికే ఇచ్చాను.

” అవన్నీ ఇప్పించానురా. కానీ అవేవీ శాశ్వతం కావుగా. ఎప్పుడు ఎవడికి ఏ పురుగో తొలిచి ఆపేస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటి. అందుకే వాటి మీద ఆధారపడకుండా వేరే సంపాదించే మార్గం చూడాలని నా అభిప్రాయం. దానికి నాకొక మార్గం తోస్తున్నది. దాని మీద నీ అభిప్రాయం చెప్పు”

” చెప్పరా అదేమిటో”

” మన ఊరిలో రామాలయానికి ప్రధాన ధర్మకర్తవు నీవే కదా. మన ఆలయం కింద వంద ఎకరాల వరకు దేవాలయభూమి వుంది. దాన్ని ఇప్పటిదాక నేనే సాగు చేయిస్తూ వస్తున్నాను. బయటనుంచి కూలీలను తెచ్చి పనులు చేయించడం వలన ఖర్చులు తడిసి మోపెడయి, ఆదాయం పెద్దగా రావడం లేదు. దానికి తోడు నాకు శ్రమ కూడ ఎక్కువయింది. నాకా వయసయిపోయింది. కొడుకేమో అమెరికాలో ఉన్నాడాయె. నా పాతిక ఎకరాలు, నీ యాభై ఎకరాలు, ఆ వంద ఎకరాలు సాగు చేయించడం తలకు మించిన భారమై కొంత భూమి కౌలుకు ఇచ్చాను కూడ. ఇక నా తదనంతరం ఎవరూ ఈ పొలాలను చూసేవారు లేరు. అందుకే ఒక పని చేద్దామనుకుంటున్నానురా.”

” ఆ పొలాలను ఆ పది కుటుంబాలకు కౌలుకు ఇద్దామనా. దాని వలన ఉపయోగమేముందిరా. సొంత పొలమున్న వారికే ఆదాయాలు రాక వ్యవసాయం మానేద్దామనుకుంటుంటే, వాళ్ళు దాని మీద పెట్టుబడి పెట్టి, మనకు కౌలు ఇచ్చి, కుటుంబాన్ని పోషించుకోగలరా అని. దీని వలన వాళ్ళు మరల అప్పుల ఊబిలో కూరుకుపోతే కష్టం కదా. మంచి చేయబోయి చెడు చేసిన వాళ్ళమవుతామేమో కదురా. ఆలోచించు” నా పరిధిలో తట్టిన ఆలోచన చెప్పాను.

” ఆలోచించానురా. అందుకే ఒక పది సంవత్సరాల పాటు ఆలయ భూములను కౌలు తీసుకోకుండా వాళ్ళను సాగు చేసుకోమంటే ఎలా వుంటుంది అన్న దానికోసమే నీ అభిప్రాయం అడుగుదామని. అలా అయితే వాళ్ళకూ కొంత వెసులుబాటుగా ఉంటుంది కదా అని నా అభిప్రాయం”

” మరి దీనికి ఊరిలో ఉన్నవారు ఒప్పుకుంటారా అని నా అనుమానం. అది చిన్న ఊరు అందరూ ఒకమాట మీద ఉంటే బాగుంటుంది కదా. ఊరంతా సరే అంటే నాకు మాత్రం అభ్యంతరమేముంటుందిరా. సొంత ఊరును కన్నతల్లి అంటారు. ఆ తల్లి ఒడిలో ఉంటూ నేలతల్లిని నమ్ముకుంటానంటే నేను మాత్రం కాదంటానా. కావాలంటే నా భూమిని కూడ సాగు చేసుకుని కూరగాయల పంటలు వేసుకోమను. నాకు నయాపైసా కౌలు అక్కరలేదు. మన ఊరి మనుషులంటే మన సొంత మనుషులే కదా నారాయణ. అయినా నీమాట కాదంటానా ఎప్పుడైనా”

” నీ అనుమానమే నాకూ వచ్చింది. నిన్ననే ఊరిలో పెద్దలందరినీ సమావేశపరచి ఈ విషయం మీద అభిప్రాయం అడిగాను. అందరూ చాలా సంతోషించారు. ఇప్పటిదాకా ఆ పొలాలను సాగుచేసిన అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. అలాగే పంచాయతీ సొసైటీ నుంచి వడ్డీ లేకుండా కొంత ఆర్థికసాయాన్ని కూడ అందించాలని సలహా కూడ ఇచ్చారు. మనవారిని మనమే ఆదుకోవాలని అందరూ అభిప్రాయపడ్డారు”

” మరి మన పంచాయతీకి అంత ఆదాయమెక్కడిదిరా” అనుమానంగా అడిగాను.

” ఇక్కడ మన రైతాంగం లోని కొంతమంది పిల్లలు విదేశాలలో ఉన్నారురా. నీకు తెలుసుగా మన సంతోష్ గాడు కూడ అమెరికాలోనే ఉన్నాడు. వాడే వారందరినీ పోగుచేసి మన పల్లెను తీర్చిదిద్దాలని చెప్పి అందరి చేత సంవత్సరానికి కొంత సొమ్మును మన పంచాయితీకి అందించేలా ఒప్పించాడు. దానివలన మన ఊరిలో ఇప్పుడు ఎవరూ మార్వాడీల దగ్గరికి అప్పులకు వెళ్ళటం లేదు. మన ఊరి బ్యాంకులో గాని, సొసైటీలో గాని ఋణం తీసుకుంటున్నారు” పల్లెలో జరిగిన మార్పులను చెప్పాడు నారాయణ.

నా మనసుకు ఎంతో సంతోషమేసింది. యువతలో ఎంత మార్పు. వాళ్ళ స్వార్థంకోసం కాకుండా సొంత ఊరికోసం అందునా పల్లె బాగుకోసం నడుము కడుతున్నారు. మంచి పరిణామం అనిపించింది. మరల తనే చెప్పసాగాడు.

” అంతేకాదురా. నగరాలలో వ్యాపారాలు చేద్దామని వెళ్ళినవారు కూడ ఒక్కొక్కరే తిరిగి మరల సొంత ఊరు వెతుక్కుంటూ వస్తున్నారురా. మరల అందరూ నాగలి పడతామని ఉత్సాహపడుతున్నారురా. ఒకసారి వచ్చిపోకూడదూ సరదాగా” అడిగాడు నారాయణ.

” నీ మాటలు వింటుంటే నాకు కూడ రావాలని, అందరినీ చూడాలని అనిపిస్తుందిరా. అదీగాక దేవుని పొలాన్ని కౌలు తీసుకోకుండా ఇస్తే, ఆలయ నిర్వహణకు ఇబ్బంది అవుతుంది కదా. దాన్ని గురించి కూడ ఆలోచించాలి. మా వాడితో మాట్లాడి నేనొక నిర్ణయానికి వచ్చి నీకు ఫోను చేస్తానురా. ప్రస్తుతానికి మనం అనుకున్నట్లే పొలాన్ని వాళ్ళకు సాగుచేసుకోను అనుమతి ఇవ్వు. ఊరంతా ఏదంటే అదేరా. కాస్త ఈ కోవిడ్ ఉదృతం తగ్గిన తరువాత నేనే నీకు ఫోను చేసి మిగిలిన విషయాలు మాట్లాడుతాను” అని చెప్పాను నారాయణకు.

” చాలా థాంక్స్ రా. అనుకూలంగా స్పందించినందుకు. నువ్వు వచ్చిన తరువాత అన్నీ విషయాలు ఊరివారితో చర్చించి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుందాము” అని ఫోను పెట్టేశాడు నారాయణ.

********

” తాతయ్యా. నాన్నను కోవిడ్ సెక్షను నుంచి బదిలీ చేసి, మరల ఊపిరితిత్తుల సెక్షనుకు వేశారట. రేపు ఇల్లంతా శానిటైజ్ చేసి నాన్న మామూలుగా మనతో ఉంటారట” ఆనందంగా చెప్పాడు నా పదేళ్ళ మనవడు పార్థు.

” అవునా. మంచివార్త చెప్పావురా. ఇన్నాళ్ళూ వాడి గురించే భయపడుతూ గడిపాను. కోవిడ్ రోగుల మధ్యే ఉంటున్న నా కొడుకుకు ఏమవుతుందోనని రోజూ భయపడే వాడిని. ఆ దేవుడి దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా బయటపడ్డాడు మీనాన్న” అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నాను.

” కోవిడ్ తీవ్రత తగ్గిపోయిందట తాతయ్యా. అందుకే నాన్నను రిలీవ్ చేశారట. అమ్మతో నాన్న ఫోనులో చెబుతుంటే విన్నాను” తను విన్న విషయం చెప్పాడు పార్థు.

” పోనీలే నాన్న, ఇక అందరం హాయిగా కలిసి ఉండవచ్చు” అని వాడికో ముద్దుపెట్టి పంపేశాను.

అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. కాస్త వీలు చూసుకుని రఘుతో నారాయణ చెప్పిన విషయాల గురించి మాట్లాడాలి. ఒక నిర్ణయానికి రావాలి. నా ఊరికి, నా ఊరి మనుషులకు ఏదైనా చేయాలి, నావంతుగా.
******

రాత్రి భోజనాలు పూర్తయిన తరువాత తీరుబడిగా నారాయణ చెప్పిన అన్ని విషయాలు రఘుకు చెప్పాను. సావధానంగా విన్నాడు.

” నాన్నా. ఇలాంటి విషయాలలో నాకన్నా మీరే అనుభవజ్ఞులు. నారాయణ బాబాయి చెప్పినట్లు ఆలయభూములను కౌలు తీసుకోకుండా సాగుచేసుకోమని చెప్పండి. కౌలు తీసుకున్నా దానిని ఎలాగూ దేవుడికే కదా వినియోగించాలి. మానవసేవే మాధవసేవని ఆ భగవంతుడే చెప్పాడు. కాబట్టి మీ అందరి నిర్ణయం ఆ భగవంతుడికి ఆమోదయోగ్యమే. ఇక ఆలయ నిర్వహణ ఖర్చులంటారా నేను నెలకు ఒక పాతికవేలు యిస్తాను. దానిలో పూజారికి జీతం, తదితర ఖర్చులకు వినియోగించండి. చాలకపోతే బాబాయి కొడుకు సంతోష్ కు నేను చెప్తాను. వాడు కూడ ఇస్తాడు, కాదనడు. కౌలుకు తీసుకున్న వాళ్ళు కూడా ఊరక ఏమీ ఊరుకోరు. వారికొచ్చిన లాభంలో తృణమో పణమో ఇస్తారు. భగవంతుడి మాన్యాన్ని ఉట్రవడియంగా అనుభవించాలని ఎవరూ అనుకోరు. వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకున్నా మనం వాళ్ళకు ఒక దారి చూపాలి. అది మన ఊరి కర్తవ్యం. కాబట్టి మీ ఆలోచనల ప్రకారమే సాగిపోండి నాన్నా” అని తన అభిప్రాయం చెప్పాడు రఘు.

” చాలా సంతోషంరా. అనవసరమైన తలనొప్పులు ఎందుకని విసుక్కోకుండా చక్కని సలహా ఇచ్చావు. ఇంకొక చిన్న విషయం. నువ్వు కోపగించుకోకూడదు మరి” ఆగి వాడి కళ్ళలోకి చూశాను.

” మీరు ఏంచేసినా బాగా ఆలోచించి చేస్తారు. చెప్పండి ఏమిటది”

” మాతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితులు కొందరు తిరిగి మన ఊరికి వచ్చి సెటిలయ్యారట. నాకు కూడ ఇక్కడ బోరుగా ఉంది. కొంతకాలం పాటు అక్కడికి వెళ్ళి గడపాలని అనిపిస్తున్నది. ఆ చల్లని గాలి, పచ్చని చెట్ల మధ్య బాల్యాన్ని నెమరువేసుకోవాలనిపిస్తున్నది. ఎలాగూ మన ఇల్లు ఉంది కదా. దాన్ని కొంచెం బాగుచేయించుకుని కొంతకాలం అక్కడ ఉంటే బాగుంటుందని ఆలోచన. నాకు వంటవచ్చు కదా. ఇబ్బంది లేదు. మరి నీ అభిప్రాయం” ఆగి వాడి వైపు చూశాను.

” నాన్నా మీ ఆనందమే నా ఆనందం. మీ ఇష్టప్రకారమే కానివ్వండి. కొంచెం ఈ కోవిడ్ ఉదృతం తగ్గిన తరువాత బయలుదేరండి. పోతే మీరు ఇల్లు బాగు చేయించేటప్పుడు మన వరండాలో ఒక గదిని కూడ కట్టించండి. నేను ప్రతి ఆదివారం వచ్చి అక్కడి వాళ్ళకు అవసరమైన ఉచితవైద్యం చేస్తాను. నా ఊరి వాళ్ళకు నావంతు సహాయం చెయ్యాలని ఉంది” అన్నాడు రఘు. ఆ క్షణం వాడి కళ్ళల్లో వెలుగు చూశాను నేను.

నిజమే సొంతవూరి మీద మమకారం ఎంత ఎదిగినా పోదు. కాకపోతే నలుగురిలో భేషజం కోసం, హిపోక్రసీతో అబద్దాలు చెప్పి నటిస్తాము అంతే. కన్నతల్లిని, నేలతల్లిని, సొంతగడ్డను మరువడమన్నది ఒక భ్రమ మాత్రమే. అంతరాంతరాలలో అవి సజీవంగానే ఉంటాయి. అందుకే నా మనసులో భావాన్ని నిర్భయంగా చెప్పాను రఘుకు. వాడు కూడ నా కొడుకేగా. వాడికి కూడ నాలాగే మక్కువేమో తన ఊరంటే. పల్లెయినా, పట్టణమైనా, నగరమైనా సొంతవూరు సొంతవూరే ఎంత అనాకారి అయినా, కటికపేదదయినా తల్లి తల్లే.

నా మనసు నిండా ఆనందం. నా ఊహలు నా ఊరి చుట్టూ, స్నేహితుల చుట్టూ తిరుగుతున్నాయి. వలసల నుంచి వచ్చిన వారికి ఏదో ఒక ఆధారం చూపి వాళ్ళను నిలబెట్టడం, నా ఊరికి నాకు చేతనయినంత మేలు చెయ్యడం. ఇదే నా తక్షణ కర్తవ్యం. రేపు నారాయణకు ఫోను చేసి ఈ విషయం చెప్పాలి అనుకుంటూ పడకగది వైపు దారితీశాను.

1 thought on “ఊరు చేరిన పాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *