March 28, 2024

చంద్రోదయం 16

రచన: మన్నెం శారద

“ఈ రోజు నానీ బర్త్‌డే” స్వాతి ఎటో చూస్తున్నట్టుగా చెప్పింది.
వాష్‌వేసిన్ దగ్గర అద్దం ముందు నిలబడి షేవ్ చేసుకొంటున్న సారధి వెనక్కి తిరిగి చూసేడు. “ఈజిట్?” అంటూ.
అప్పటికే స్వాతి లోపలికి వెళ్లిపోయింది.
ఆమె చెప్పింది తనకేనని సారధికి తెలుసు. త్వరగా షేవింగ్ అయిందనిపించి స్వాతి ఉన్న గదిలోకి వచ్చేడు.
స్వాతి నానికి తల స్నానం చేయించి ఇస్త్రీ బట్టలు తొడుగుతోంది. “నిన్న చెప్పలేదేం? ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొత్త బట్టలు తెచ్చేవాడినిగా స్వాతి” అన్నాడూ.
స్వాతి మాట్లాడలేదు.
“నీకు నా మీద ఇంకా నమ్మకం కుదరటం లేదు కదూ. అయాం సారీ స్వాతీ. నానీ నువ్వు నాతో రారా?” అని గబగబా బట్టలు తొడుక్కుని నానీని వెంటబెట్టుకుని వెళ్ళిపోయేడు సారధి.
అతను వెళ్తోంటే అలానే చూస్తూ నిలబడిపోయింది స్వాతి. గంట తర్వాత నాలు పాకెట్స్ పట్టుకొని వచ్చారిద్దరూ.
“మమ్మీ! డాడీ చూడు నాకెంత మంచి డ్రెస్సు కొన్నారో?” నానీ ఉత్సాహంగా పాకెట్స్ విప్పి చూపించేడు.
“ఇవి స్వీట్సు. క్రిందవాళ్లకి పంపించు. పోతే సాయంత్రం వంట పెట్టుకోకు. సరదాగా నానీని అలా బీచ్ ఒడ్డున తిప్పి, హోటల్లో భోంచేద్దాం” అన్నాడు సారధి స్వాతి నుద్ధేశించి.
స్వాతి జవాబేం చెప్పలేదు.
ఆమె లోపలి కెళ్ళబోతుంటే సారధి మళ్లీ పలకరించేడు.
“చూడు. ఇది నీకోసం. చీరల సెలక్షన్ నాకంతగా తెలీదు. నీకు నచ్చుతుందనే..” అన్నాడు చీరని అందించుతూ.
స్వాతి అందుకోలేదు.
“ఇప్పుడెందుకు?” అంది నీరసంగా.
సారధి కనుబొమ్మలు ముడిపడ్డాయి. “పెళ్ళానికొక చీర తేవడానికి కూడా మొగుడికి సందర్భం కావాలా?” అన్నాడు కోపంగా.
అతని మాటలకి స్వాతి దిమ్మెరబోయినట్లు చూసింది.
“నాకిష్టమనిపించింది. మొదటిసారిగా తెచ్చేను. ఇష్టమైతే కట్టుకో. ఇంకెప్పుడూ ఇలాంటి వెధవ ప్రయత్నం చెయ్యను.”
సారధి విసురుగా ప్రక్క గదిలోకి వచ్చేసేడు. అక్కడే నిలబడ్డ నాని సారధి వైపు వింతగా చూడ్డం గమనించి “అరె! నువ్వింకా కొత్త బట్టలు తొడుక్కోలేదా? రా! రా! రా!” అంటూ లేని నవ్వు తెచ్చుకుని నానీకి బట్టలు తొడిగేడు సారధి.
“అమ్మకు బాగోలేనట్టుంది. వంటగదిలోకి వెళ్లి ప్లేటు తీసుకురా. మనమే ఈ స్వీట్స్ అందరికీ పంచేద్దాం.”
సారధి మాటలకి నానీ ఉత్సాహంగా పరిగెత్తుకెళ్ళి ప్లేట్సు తీసుకొచ్చేడు. వాటిలో ఎవరికెలా పంచాలో ఏర్పాటుగా పెట్టి “ముందు అమ్మ నోట్లో స్వీటు పెట్టి ముద్దు పెట్టిరా” అంటూ పంపించేడు. అయిదు నిమిషాల్లో నానీ వెనక్కొచ్చేడు. వాడి మొఖంలో ఎక్కడలేని దిగులు.
“అమ్మ ఏలుత్తోంది డాడీ!”
సారధి మ్రాన్స్పడి చూసేడు.
ఆ వెంటనే తేరుకొని “నువ్వెళ్లి ఈ స్వీట్స్ క్రింద అందరికీ యిచ్చిరా. నేను అమ్మని నవ్విస్తానుగా” అన్నాడు నవ్వుతూ.
నానీ ఉత్సాహంగా ప్లేటు తీసుకుని క్రిందకి వెళ్ళేడు.
నానీ అటు వెళ్లగానే సారధి ముఖాన్ని గంభీరత ఆవరించుకుంది. వెంటనే లోపలికి వెళ్ళేడు. స్వాతి బెడ్‌రూంలో మంచం మీద అటు తిరిగి పడుకుంది.
అతను తలుపు పట్టుకొని “ఇప్పుడు ఏడ్వాల్సిన ఘోరం ఏం జరిగింది?” అన్నాడు.
స్వాతి జవాబివ్వలేదు.
“స్వాతీ! అకారణంగా ఏడ్చేవాళ్లని వూరడించడం ఎవరివల్లా కాదు. నిన్నంత బాధపెట్టిన విషయం ఏమిటో చెప్పు. తప్పుంటే సరిదిద్దుకుంటాను. ఈ రోజు నానీ పుట్టినరోజు. వాడి ఉత్సాహాన్ని చంపేయటం తల్లిదండ్రులుగా మనకి ధర్మం కాదు. వాడు ఎదుగుతున్నాడు. మన మధ్యనున్న దూరం వాడికి ఈరోజు కాకపోయినా రేపయినా అర్ధమై తీరుతుంది. ఒకరిపట్ల మరొకరికి అవగాహన లేని తల్లీ, తండ్రిని చూసి వాడిలో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. వాడు అన్నింటిలో వెనుకబడి ఎందుకూ కొరగాకుండా పోతాడు. జరిగిన సంగతులే తలచుకుని వగచి జరగబోయే వాటికి సమాధి కట్టడమే నీ ఉద్ధేశ్యమైతే నేనేం చెప్పలేను. మనం ఏం చేస్తున్నా అది నానీ భవిష్యత్తుని తీర్చి దిద్దటానికేనని తెలుసుకుంటే నేను సంతోషిస్తాను.” సారధి మాట్లాడ్డం ఆపి స్వాతి వైపు చూసేడు.
స్వాతి దుఃఖం అధికమైనట్లుగా ఆమె భుజాలు ఎగసెగసి పడుతున్నాయి. సారధికి కోపం వచేసింది. దాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ “స్వాతీ! నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతకూ నీకో చీర తీసుకు రావటమేగా నేను చేసిన తప్పు. ఇష్టం లేకపోతే నేను చూస్తుండగానే రోడ్డు మీదికి విసిరేయి. ఇలా చేసి ధైర్యంగా నీ నిర్లక్ష్యాన్ని ప్రకటించుకో. అంతేగాని ఇలా ఏడ్చి నానీగాణ్ని బాధపెట్టడం ఎందుకు? నేను.. అసమర్ధుణ్ణే. శేఖర్ తెచ్చినంత ఖరీదయిన వస్తువులు తెచ్చి.. వాడిలా చూడలేను. కాని.. నాకూ మనసనేది ఒకటుందని నువ్వు గ్రహించగలిగితే చాలు.” అతను గదిలోంచి విసురుగా వెళ్ళిపోతుంటే స్వాతి కంగారుగా లేచి కూర్చుంది.
స్వాతికి మాట్లాడాలని.. ఆతనికి తన మనసులో బాధ చెప్పుకోవాలనే వుంది. కాని.. అది ఎలా చెప్పుకోవాలో.. ఎలా అతనికి దగ్గర కావాలో అర్ధం కావటం లేదు. ఆ బాధలోనే తను నిగ్రహించుకోలేక ఏడుస్తున్న విషయం అతనెలా గ్రహిస్తాడు?
అకస్మాత్తుగా క్రింద గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి.
స్వాతి ఉలిక్కిపడి లేచి నిలబడింది.
అది సారధి గొంతే! సందేహం లేదు.
స్వాతి గబగబా బాల్కనీలోకొచ్చి తొంగి చొసింది.
సారధి జానకమ్మ రెక్క గట్టిగా పుచ్చుకొన్నాడు.
స్వాతి అయోమయంగా చూసింది.
“ఏం చెబుతున్నావు నానీతో. మళ్లీ నా యెదుట చెప్పు” సారధి గద్దిస్తున్నాడు.
అతని ఉగ్రరూపం చూసి స్వాతి వణికిపోయింది. గబగబా మేడ దిగి సారధిని యివతలికి లాగింది.
“ఏమిటిది? పెద్దావిడ అందులో ఆడమనిషి. ఏమిటీ దౌర్జన్యం? స్వాతి సారధి మీద విరుచుకుపడింది.
“అది ఆడదా? బ్రహ్మరాక్షసి. పచ్చటి జీవితాల్లో నిప్పు పెట్టే పిశాచి”
జానకమ్మ వణికిపోతూ నిలబడింది.
నానీ బెదురు బెదురుగా చూస్తున్నాడు.
“ఇంకెప్పుడయినా యిలాంటి పిచ్చివాగుడు వాగితే షూట్ చేసి పారేస్తాను. జాగ్రత్త. పసిపిల్లాడికి ఎక్కించే విషం ఇదా? ఏమ్మా! ఈవిడ పిచ్చెక్కి వాగుతుంటే వినోదం చూసే బదులు తప్పని చెప్పొచ్చుగా. సంసారాలు చేస్తున్నారు. మీకూ పిల్లలున్నారుగా? విధిచేత ఓడింపబడిన వాళ్ళని చూసి వెక్కిరించడమే మీకు సరదానా? ఇలాంటి వికృతమైన ఆనందమేనా మీరు పోగుచేస్కునేది.”సారధి అక్కడ నిలబడ్డ వాళ్లని విసురుగా అడిగేడు.
సారధి కంఠతీవ్రతకి చాలామంది లోపలికి పరుగెత్తేరు.
“చీ! చీ! ఇలాంటి లొకాలిటీలో వుండటం, వుండాల్సి రావటం నా ఖర్మ!” సారధి విసురుగా బయటకి వెళ్లిపోయాడు.
“సవతి తండ్రైనా పిల్లాణ్ణి బాగానే చూస్తున్నాడు. సొంత తండ్రులకన్నా సవతి తండ్రులే నయం. పుట్టినరోజు ఎంత బాగా చేస్తున్నాడో చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నానే తల్లీ! అది తప్పయిపోయింది నీ సవతి మొగుడికి. కలికాలం తల్లీ. కలికాలం “రామ” అంటే “తిడుతున్నావేం” అన్నాడట వెనుకటికి ఎవడో. అయినా నీ మొగుడికి అంత దురుసుతనం పనికిరాదు.”
జానకమ్మ చెంపలేసుకుని అభినయిస్తోంటే స్వాతి వినలేనట్లుగా నానిని తీసుకుని పైకెళ్ళిపోయింది.
సారధి పిచ్చిపట్టినవాడిలా నడుస్తున్నాడు. సిగరెట్ పైన సిగరెట్ కాలుస్తున్నాడు. స్వాతి తనని అర్ధం చేసుకోలేకపోతోంది.
ఆమెని మూర్ఖురాలనుకోవాలా? లేక అమాయకురాలని భావించాలా? దానికి తోడుగా జానకమ్మలాంటి వాళ్ల మాటలు వింటుంటే పిచ్చెక్కేలా వుంది.
తను నానీకి సవతి తండ్రా?
నానీలో తను శేఖర్ని చూసుకుంటున్నాడన్న విషయం ఎవరికి అర్ధం అవుతుంది.
ఆఖరికి వాడి మనసుని కూడా పాడు చేయటానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయంటే మరీ బాధగా వుంది.

ఇంకా వుంది

2 thoughts on “చంద్రోదయం 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *