May 19, 2024

తాత్పర్యం

తెలుగు కథ గత దశాబ్ది కాలంలో పెను మార్పులకు లోనౌతూ తనను తాను పునర్నిర్వచించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ వృద్ధిచెందతూ వస్తోంది. వర్ధమాన రచయితల అత్యాధునిక సామాజిక, అంతరిక, సంక్షుభిత సమస్యలతో పాటు లోతైన అవగాహన కలిగి తాత్విక నేపథ్యంతో కూడా భిన్న ఆలోచనలతో, భిన్న విలక్షణ చింతనతో, మనిషి వికాసానికి దోహద పడగల భిన్నమైన కథా వస్తువులను స్వీకరిస్తూ చాలా ధైర్యంగా సరికొత్త మానవీయ పార్శ్వాలను స్పృశిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు కథ బహుముఖీన విస్తరణతో తనదైన సొంత స్వరంతో ఒక ఆస్తిత్వాన్ని ప్రతిష్టిస్తున్న సంధి సందర్భమిది.

మరోవైపు తెలుగు నేల రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఇన్నాళ్ళూ ఎవరికివారు కోల్పోయామనుకుంటున్న తమ తమ సాంస్కృతిక అస్తిత్వాలనూ, వైభవాలనూ పునరేకీకరించుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవన, ప్రాంతీయ మూలాలను ప్రోది చేసుకుంటూ తమదే ఐన తమ స్వంత కొత్తగొంతును అన్ని సాంస్కృతిక కోణాల్లో బలంగా వినిపించాలని ఉత్తేజిస్తున్న సందర్భంకూడా ఇదే.

ఇంకోవైపు ఉహాతీతమైన సాంకేతిక విప్లవంతో మనిషి బహుదిశలో పురోగమిస్తూనే అసలైన మానవీయ మూలాలను విస్మరిస్తూ యువత ఏ తరానికీ అందని విచ్ఛిన్నతలకూ, విచ్చలవిడితనానికీ, అతి స్వేచ్ఛకూ, ఒక రకంగా విశృంఖలత్వానికీ బానిసైపోతూ, ఒకానొక రకమైన విచిత్ర ప్రవర్తనను అలవర్చుకుంటున్న ఆపేక్షాయుత ప్రపంచంలో.. బయటికి కనబడని.. అజ్ఞాత అనిశ్చితికూడా.. ఇదే

ఈ సంక్లిష్ట సమయంలో వస్తున్న నా కథా సంపుటి ఇది. దీంట్లోని ఇరవై కథలూ గత రెండేళ్ళలో రాసినవీ, అన్ని ప్రఖ్యాత పత్రికల్లో వెలువడి చాలా వరకు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నవే. ఇవి అత్యాధునిక సామాజికుని అంతరంగాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదివరకటిలా వీటిని కూడా సహృదయులైన కథా ప్రియులు ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ.

– రామా చంద్రమౌళి

‘ తాత్పర్యం’ కథా సంపుటి మొత్తం 6 కథా‌పురస్కారాలను సాధించింది. అవి
1) డా.ఎన్.రామచంద్ర కథా పురస్కారం, ప్రొద్దుటూరు
2) రంగినేని ఎల్లమ్మ కథా పురస్కారం, సిరిసిల్ల.
3) ప్రతిష్టాత్మక ‘ తెలంగాణ సారస్వత‌ పరిషత్తు, హైదరాబాద్, డా.కె.అంజిరెడ్డి కథా‌పురస్కారం.
ఇంకా ఏవేవో…మరిచిపోయిన.
ఇది ఇంగ్లీష్ లో prof.Indira babbellapati తో అనువాదం చేయబడిHE AND OTHER STORIES పేర అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలైంది.

ఈ అపూర్వమైన కథాసంకలనంలోని కథలను మాలిక పత్రికలో ప్రచురించడానికి రామాచంద్రమౌళిగారు అంగీకరించారు.

*************************************************************************************

‘ చదువు వల్ల జ్ఞానం లభిస్తుంది. కాని జీవితం కేవలం జ్ఞానం వల్లనే సాఫల్యం కాదు. మనిషి విజయాలను హస్తగతం చేసుకోవాలంటే వాడికి ఊహాశక్తి ఉండాలి. జ్ఞానం కంటే ఊహాశక్తి గొప్పది. జ్ఞానికి హద్దులుంటాయి కానీ ఊహాశక్తి ఎల్లలు లేనిది ‘ ఐన్ స్టిన్ అంటున్నాడు చేతిలో ఉన్న పుస్తకంలో.
నలభై ఆరేళ్ల నిర్మల చేతిలోని పుస్తకాన్ని ఎదపై పెట్టుకుని ఆలోచిస్తోంది.
ఎదురుగా గడియారం.. ఐదు గంటలా పది నిముషాలు.
‘ తెల్లవారుతోంది ‘
కిటికీలోనుండి పల్చని వెలుతురు ఛాయలు కనిపిస్తున్నాయి.
ఎవరో కవి అన్నాడు..’ నిజానికి చీకటే శాశ్వతమైంది.. వెలుతురే మధ్య మధ్యలో వచ్చి పోయే అతిథి ‘ అని. నిజమేనేమో.. మనిషి కష్ట సుఖాలు చీకటి వెలుగుల్లాంటివే కదా. ఎవరి జీవితాల్లోనైనా అన్నీ కష్టాలే, అన్నీ సుఖాలే ఉంటాయా.
పిచ్చుకల కిచ కిచ చప్పుడు మొదలై క్రమంగా ఎక్కువౌతోంది. పిలుస్తున్నాయి అవి తనను. జీవుల మధ్య భాషకందని అతీత భాష ఒకటుంటుంది. అది జీవ భాష. లిపి ఉండదు.. వ్యక్తీకరణకు లొంగదు. హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ద్రవింపజేస్తుంది.. నిగ్రహాతీతమైన ఉద్వేగంతో ‘ రీ చార్జ్ ‘ చేస్తూంటుంది ఎప్పటికప్పుడు. కొన్నేళ్ళుగా ఈ పిచ్చుకలకూ తనకూ మధ్య ఉన్న బంధం ఈ ఏ భాషకూ అందని హృదయ భాషేనా.
ఎన్నేళ్ళు..?
దాదాపు ఇరవై రెండేళ్ళయిందేమో . తమ పెళ్ళైన కొత్తలో.. ఆయనకు ఈ ఊరికి ట్రాన్స్ ఫరై వచ్చి.. కొత్తగా కాపురం. అప్పటినుండి..ఇదే ఇల్లు.. ఇదే గది..ఇవే గోడలు.. ఇదే వాకిలి.. ఇవే చెట్లు.. ఇవే పిచ్చుకలు.. అవే కిచకిచలు.
నిర్మల లేచి గుండెలపై ఉన్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ప్రక్కనున్న టీ పాయ్ పై పెడుతూ ప్రేమపూర్వకంగా అట్టపైకి చూచింది. అది కె.ఎన్. వై.పతంజలి రాసిన ‘ గెలుపు సరే … బతకడం ఎలా? ‘ అన్న చిన్న వంద పేజీల పుస్తకం. రాత్రి నుండి దాన్ని రెండు మూడుసార్లు చదివిందామె. ఊపిరందక మరణ శయ్యపై ఉన్న రోగికి ఆక్సిజన్ అందుతున్నప్పటి పునర్జన్మానుభూతి కలుగుతోంది.
‘ జీవితమంటే యుద్ధం కాదు.. నిరంతరం యుద్ధం చేయడం జీవితావసరం .. శత్రువుల్ని మన ప్రయోజనాలకోసం వాడుకోవాలి. లేదా వాడికి తాత్కాలికంగా లొంగిపోయి , చేతిలో కత్తితో వాడ్ని వెన్నంటి తిరగాలి. లేదా వాడ్ని మన గుంపులో కలిపేసుకుని వాడ్ని మన వీపు వైపు రాకుండా చూసుకోవాలి ‘ అంటాడు పతంజలి.
మన శత్రువు ఎంతటివాడో మనకు సరైన అంచనా ఉండాలి. ఒకవేళ వాడు యుద్ధ ట్యాంకరైతే మనం వెంటనే సీతాకోక చిలుకైపోవాలి. సీతాకోక చిలుకల్ని ట్యాంకర్లు ఏమీ చేయలేవు. సీతాకోక చిలుకలు కూడా ట్యాంకర్లను ఏమీ చేయలేవు. అప్పుడేమౌతుంది. యుద్ధం డ్రా ఔతుంది. ఐతే మనమే ఆ ట్యాంకర్ స్థానంలో ఉండి, మన శత్రువు సీతాకోకచిలుక స్థానంలో ఉంటే, అప్పుడు యుద్ధం డ్రా అవ్వదు. ఎందుకంటే మనం ట్యాంకర్ రూపంలోనుండి తొండ రూపంలోకో, గోరింక రూపంలోకో మారిపోతే సీతాకోక చిలుక మన నోటికి ఆహారంగా దొరుకుతుంది. శత్రువుల కళ్ళు కప్పడంకోసం సైన్యంలో ‘ కామెప్లాజ్ ‘ దుస్తులుంటాయి. వాటిని సందర్భాన్ని బట్టి రూపం మార్చుకోడానికి ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి రూపం మార్చుకోవడం అనేది బతుకుదెరువు కోసం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విద్య. యుద్ధంలో నూటికి నూరు పాళ్ళు గెలవాలంటే నువ్వు ముందు నీ శత్రువును గుర్తించాలి. నీకా గ్రహింపు ఉన్న సంగతి ఎదుటివాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు .
ఇదీ మనిషికి జీవితం గురించి రచయిత తెలియజెప్పే ‘ ఎరుక ‘. తెలుసుకోవడమే జ్ఞానం.
శత్రువులు ఎప్పుడూ యుద్ధంలో ఎదుట నిలబడి కళ్లముందు ప్రత్యక్షంగా కనబడరు. చాలా సార్లు మన ప్రక్కనే మిత్రుల రూపంలోనో, బంధువుల రూపంలోనో, కుటుంబ సభ్యుల రూపంలోనో.. కొన్ని సార్లయితే భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, కొడుకులూ, కూతుర్ల రూపంలోనూ కూడా ఉండొచ్చు. జీవితం గడుస్తున్న కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ వాళ్ళ నిజస్వరూపాలతో ప్రత్యక్షమై మనను వెర్రెక్కిస్తారు. ధ్వంసిస్తారు. ఊహించని విధంగా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తారు. అందువల్ల ,మనిషిని ఒక అతి క్రూరమైన , విషపూరితమైన జంతువుగా మనం మొదట గుర్తించాలి.
తనచేత చాలా ఆలస్యంగా పక్కలోనే ఉన్న పామువలె మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డ అతి కౄర జంతువూ, శత్రువూ నరసింహ. తన మాజీ భర్త.
నరసింహం జ్ఞాపకం రాగానే ఆమె పెను తుఫాను గాలికి చిగురుటాకులా వణికిపోయింది.
ఇదే శీతాకాలపు రాత్రి. జనవరి నెల. చాలా జ్ఞాపకం ఆ రాత్రి. ఒకనాటి మూడు గంటల రాత్రి తన ప్రక్కనే పడుకుని నిద్ర పోకుండా కళ్ళు తెరిచి అలా పైకి పైకప్పువైపు చూస్తూ ఉన్న నరసింహంను అప్పుడే చటుక్కున మెలకువ వచ్చిన తను అడిగింది ..” నిద్ర పోలేదా ” అని.
” ఉహూ.. నిద్ర రావట్లేదు .. నీతో కాస్త మాట్లాడాలి నిర్మలా ” అన్నాడు నరసింహం.
” మాట్లాడండీ.. ఉదయం మాట్లాడొచ్చు గదా.. దానికి ఇలా నిద్రపోకుండా మేల్కొని ఇంత రాత్రి ఎందుకు ”
దాడికి ముందూ, తుఫానుకు ముందూ, ఒక భయంకరమైన కుట్రను అమలు చేసేందుకు ముందూ ఒక గడ్డకట్టిన గాఢ నిశ్శబ్దం అనివార్యమై అలుముకుని ఉంటుంది. దాన్ని మనం గమనించం.
” నిర్మలా.. నాకు నీ నుండి విడాకులు కావాలి ” అన్నాడు నరసింహం చాలా నిలకడగా, స్థిరంగా . మనిషి గొంతును బట్టి అతను మానసికంగా ఎటువంటి దశలో ఉన్నాడో చాలా సుళువుగానే పసిగట్టవచ్చు. కాని అప్పుడు ఆ విషయం తనకు అంత స్పష్టంగా అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తోంది. అతను ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చే ఆ మాటను చాలా స్పష్టంగా చెబుతున్నాడని.
తుఫాను గాలి భయంకరంగా హోరుతో దాడి చేస్తున్నపుడు గడ్డి పరక ఊర్కే అలా వంగి, లొంగి తనను తాను కాపాడుకుంటుంది.
పైన పిడుగు పడ్డట్టు తనేమీ బెదిరిపోలేదప్పుడు. చేపకు పుట్టుకతోనే ఈత వచ్చినట్టు తనకు సహనం, సంయమనం పుట్టుకతోనే సంక్రమించినట్టు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడైన తన తండ్రి పెంపకంలో చిన్నప్పుడే అర్థమైంది నిర్మలకు.
” ఎందుకు ” అందామె.
” నేను గీతను ప్రేమిస్తున్నాను ” అన్నాడు.
గీత తెలుసు తనకు. అతనితోపాటే అదే యూనివర్సిటీలో పని చేసే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమె. పెళ్ళయిందామెకు. ఒక పాప కూడా.
తమకు ఇద్దరు కొడుకులు. కిషోర్, చైతన్య. పెద్దోడికి పదమూడేళ్ళు, చిన్నోడికి పదకొండు. ఎనిమిదో తరగతి ఒకడు. ఆరో తరగతి ఇంకొకడు. ప్రక్క గదిలో నిద్రపోతున్నారిద్దరు అప్పుడా క్షణం.
కొద్దిసేపు మౌనమే నిలబడింది తామిద్దరి మధ్య ఒక ఇనుప తెరవలె. అతను చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు తానేమంటానోనని. తెలుస్తోందది అతని పాము బుసలా వినిపిస్తున్న గాఢ శ్వాసతో.
అతనే అన్నాడు. ” నేను అప్లై చేసుకుంటే అబుదాబిలో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది నాకు . గీత కూడా జాయిన్ కావచ్చు అక్కడే. ” అని.
నిర్ణయాలు జరిగి ఇక విమానం టేకాఫ్ ఔతున్న దశలో ఇక తానేమీ చేయలేని ఒక అనివార్య నిస్సహాయ స్థితి ఏదో సముద్రమంత దుఃఖాన్ని కుమ్మరిస్తోంది పైన . కాని.. తను చేయగలిగిందేమైనా ఉందా.
తన దృష్టిలో దాంపత్యం కేవలం ఇద్దరు మనుషుల మధ్య హృదయానికి మాత్రమే సంబంధించిన వ్యవహారం. పక్షి ఈ చెట్టు కొమ్మపైనుండి ఆ చెట్టు కొమ్మ పైకి వెళ్ళిపోయిందిప్పుడు. ఎందుకు.. ఏమో .. సహేతువైన కారణం ఏదీ తెలియదు.
ఒక అర్థరాత్రి.. ప్రక్కలో పడుకుని ఉన్న అనుకూలవతియైన భార్య యశోదనూ, పసి బాలుడు రాహులున్నీ వదిలి గౌతముడు అడవిలోకి దేన్నో వెదుక్కుంటూ పోయినప్పుడు.. ఎవరు మాత్రం ఏమి చేయగలిగారు. మామూలు సమాజంలో ఐతే.. కట్టుకున్న భార్యనూ, పసిగుడ్డు కొడుకునూ వదలి ఇలా అడవులకు పారిపోతే వీళ్ల గతి ఏమిటి అనీ, ఇలాంటి నువ్వు మరి పెళ్ళెందుకు చేసుకున్నావ్.. అనీ పదిమంది నిలబెట్టి పంచాయితి పెట్టి గౌతమున్ని నానా చివాట్లూ పెట్టేవారు. ‘ నేను జ్ఞానాన్వేషణకు వెల్తున్నాను ‘ అనంటే ముఖంమీద ఉమ్మేసి బుద్ది చెప్పేవాళ్ళు. కాని అలా జరిగిందా. ఉహూ.. చరిత్ర బుద్ధుని గురించి చెబుతుంది కాని యశోదనూ రాహులున్నీ మరిచిపోయింది.
” ఇప్పుడు నేను ఒప్పుకోకుంటే జరిగేదేమిటి ? ” అంది తను.
నరసింహం ఏమీ మాట్లాడలేదు. చాలా నిస్సహాయంగా , బేలగా చూశాడు. అప్పుడనిపించింది స్త్రీ పురుషుల మధ్య నిజంగా ప్రెమే ఉంటుందా.. లేక ఉన్నదంతా ప్రేమ పేరుతో విస్తరించిన కామమేనా.. అని . అతని పేరే నరసింహం.. ఎవరు పెట్టారో కాని.. అతను నిజంగానే సగం జంతువు సగం మనిషి. తత్వం కూడా అంతే. ఎన్నో అతి వికారమైన అతని చేష్టలను భరిస్తూ లోలోపలే సహిస్తూ అణకువగా నెట్టుకొస్తోంది తను. ఇప్పుడు జంతు ప్రవర్తన శాతం పెరిగి మనిషి క్రమక్రమంగా చచ్చిపోతున్నాడతనిలో. ఐతే అతనికి అద్భుతమైన తెలివుంది. దూసుకుపోయే లక్షణమూ ఉంది. ఐతే మనిషి తెలివి కేవలం ఆ వ్యక్తి వికసనకు మాత్రమే పనికొస్తుంది కాని సమిష్టిగా ఒక మానవ సమూహ వృద్ధికి దోహదం చేయదు.
కొద్ది క్షణాల్లో వందేండ్ల జీవితం గురించిన నిర్ణయం ప్రకటించవలసిన దుస్థితి అది.
మనిషి , మనసు మరో వేపు మళ్ళి, ఇక్కడ ఒట్టి శూన్యం మిగిలిన తర్వాత.. వ్చ్,
” సరే..” అంది తను అప్రయత్నంగానే. అని స్థిమితంగానే వెళ్ళి ప్రక్క గదిలో పడుకున్న ఇద్దరు పిల్లల ముఖాల్లోకి చూచింది. అప్పుడు వాళ్ళిద్దరూ.. తల్లి వీధి కుక్క ఒడిలో ధీమాగా ముడుచుకుని పడుకున్న పసి కుక్కకూనల్లా కనబడ్డారు. జాలేసి దుఃఖం ముంచుకొచ్చింది.
అప్పుడూ ఇంతే.. ఇదే శీతా కాలం. జనవరి నెల. చలి. బయట కిచకిచ పక్షుల అరుపులు.. పల్చగా విచ్చుకుంటున్న వెలుగు.. కొంత చీకటి.
ఒక్క నెలరోజుల్లోనే అంతా జరిగిపోయింది.. ఇద్దరి అంగీకారం ఉండడంవల్ల. కోర్ట్ చెప్పింది.. నరసింహం ప్రతిపాదన, తన మౌనాన్నీ పరిగణనలోకి తీసుకుని.. నరసింహం పెద్దోడు కిశోర్ బాధ్యతను తీసుకోవాలి తన వెంట ఉంచుకుని.. తను చిన్నోడు చైతన్యను స్వీకరించాలి. భరణంగా తనకో పది లక్షలు..నెల నెలా..,
డబ్బు అన్ని ఖాళీలనూ పూరించలేని ఒక చిత్రమైన విలువున్న దుష్ట ద్రవ్యం.
మనసు భళ్ళున ఒక గాజు పలకలా పగిలి ముక్కలయ్యింది. కాని మార్గముందా అంతకన్నా. ‘ యుద్ధం ఎప్పుడూ ప్రారంభానికి ముందే మొదలై, ముగియడానికి ముందే ముగిసిపోతుంది ‘ అని ఎక్కడో చదివింది తను.
కిశోర్ ను వెంట తీసుకుని నరసింహం శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆ రాత్రి.. ఒక కాళరాత్రి తనకు.. మనిషిని దుఃఖం ఎంత భయంకరంగా కనబడకుండానే తినేసి ఏమీలేని ఒట్టి డొల్లను మిగులుస్తుందో తెలిసిందారోజు. చచ్చి బతకడమంటే కొద్దికొద్దిగా అనుభవంలోకి రావడం మొదలై,
మర్నాడే.. నరసింహం పని చేసిన యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రానికి వెళ్ళి ఎమ్మే చదవడానికి దరఖాస్తును నింపి.. ఇక తలెత్తడం గురించి ఆలోచించడం మొదలెట్టింది తను.
మనిషికి చదువొక్కటే జీవించడానికి ఆలంబన. చదువు ధైర్యాన్నిస్తుంది. తెలివినీ వివేకాన్నీ ఇస్తుంది. చదువు ఈ లోకాన్ని సమగ్రంగా చదివే స్థైర్యాన్నిస్తుంది. అంతిమంగా అసలు ,మనిషి ఎందుకు ఎలా ఏ రకంగా జీవించాలో నేర్పుతుంది.
అనివార్యమైన పునః ప్రయాణం.. ఎమ్మే.. ఎం ఫిల్.. డాక్టరేట్ లోకి ప్రవేశం.
మనిషి మనసు కాంక్రీట్ లాంటిది. కాలం గడుస్తున్నకొద్దీ అది గట్టి పడ్తూ చివరికి ఒక నిర్దుష్ట ఆకారాని పొంది ఇక అభేద్యంగా మిగిలిపోతుంది.
కసి.. కసి .. కసి.. ఎవ్వరిపైననో తెలియని అనంతమైన కసి. ఒక్కోసారి చైతన్యను అలా ఊర్కే తనముందు నిలబెట్టుకుని అలా శూన్యంగా చూచేది వాడి కళ్ళలోకి .. భిన్నత.. విభిన్నత.. ఇక విభిన్నంగా జీవించడం.. చైతన్యను విభిన్నంగా తయారు చేయడం చేయాలి తను.
మనుషులు భిన్న భిన్న లక్షణాలతో జన్మిస్తారా.. తయారు చేయబడ్తారా.. ఒకే భూమిలో ఇనుము, బంగారం, రాగి, ప్లాటినం, యురేనియం వంటి భిన్న ఖనిజాలు దాగిఉన్నట్టే మనుషులు సహజంగానే భిన్న ధర్మాలతో, గుణాలతో పుడుతారా.
నరసింహం వెళ్ళిపోయిన మర్నాడే.. బడినుండి ఇంటికొచ్చిన చైతన్య కాళ్ళు కడుక్కుని పాలు తాగి హోం వర్క్ చేయడానికి సిద్ధపడ్తూండగా అంది తను.. ” నాన్నా.. ఇకనుండి నువ్వు ప్రతి రోజూ సాయంత్రం ఒక గంట ఊర్కే అలా బయట తిరిగి రావాలి.. తెలిసిందా ” అని.
వాడు ఆశ్చర్యపోతూ అన్నాడు ” ఎందుకమ్మా ” అని .
” ఊర్కే నాన్నా.. దాన్ని ఈ లోకాన్ని అధ్యయనం చేసేందుకు జరిపే ‘ పర్యటన ‘ అంటారు. అల్లూరి సీతారామరాజు తన మన్యం విప్లవానికి ముందు భారతదేశ పర్యటన చేశాడు.. గాంధీ గారు కూడా తన అహింసాయుత సత్యాగ్రహ పోరాట ఆరంభానికి ముందు ఈ దేశ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఆసేతు హిమాచల పర్యటన చేసాడు. మీ క్లాస్ మేట్స్ లో ఎవరూ ఇలా చేయరుగదా. ఎవరూ చేయని విలక్షణమైన పనిని నువ్వు చేయాలి ఈ రోజునుండి. ” అంది తను. వాడు సాలోచనగా ముఖం పెట్టి, చేతిలోని పెన్నును జేబులో పెట్టుకుని మౌనంగా బయటికి వెళ్లిపోయాడు పర్యటించేందుకు. అప్పుడా క్షణం ఇక తపస్సుకుపక్రమిస్తున్న శివునిలా కనపించాడు చైతన్య. ఏ పనినైనా ఇతరులెవరూ చేయని విధంగా , ఇక అంతకంటే ఉత్తమంగా చేయలేని విధంగా చేయగల నైపుణ్యాన్ని చైతన్యలో ఉద్దీపింపజేయాలన్న ఆలోచన అంకురంగా మొలకెత్తిన సందర్భమది.
చైతన్య 7 వ తరగతిలో ఉన్నప్పుడు.. పర్యటన కు వెళ్ళొచ్చిన తర్వాత. . ఒక రోజు,
” నాన్నా.. ఏమి గ్రహించావీ రోజు. ”
” అమ్మా..ఈ రోజు.. స్టేడియం దిక్కు వెళ్లాను. అక్కడ ఒక కోచ్ లాంగ్ జంప్ క్రీడాకారులకు శిక్షణ నిస్తున్నాడు. శ్రద్ధగా ఒక మెట్టుపై కూర్చుని అన్నీ గమనించాను. నాకేమర్థమైందంటే.. బాగా దూరం దూకాలనుకుంటే .. ముందు మనం బాగా వెనకి పరిగెత్తి బాగా వేగంగా దూసుకుపోవాలని ”
” గుడ్.. వెళ్లిక. వెళ్లి ముఖం కడుక్కుని రా ”
చైతన్య 9 వ తరగతిలో ఉన్నపుడు .. ఒక రోజు
” చెప్పు నాన్నా.. ఎక్కడికెళ్ళావు ఈ రోజు ” అంది నిర్మల అప్పుడే వచ్చిన కొడుకును బూట్లు విప్పుకుంటూండగా.
” జ్ఞాన కేంద్రం జిల్లా గ్రంథాలయానికి.. లోపలికి వెళ్తూ .. ఆవరణలోని చెట్టుకింద మాట్లాడుకుంటున్న నలుగురు మిత్రులను చూశాను సైకిల్ స్టాండ్ వేస్తూ. అందులో ఒకడు మిగతా ముగ్గురికి క్లాస్ తీసుకుంటున్నాడు అనేకానేక ప్రపంచ విషయాలను చెబుతూ.. అవి రాజకీయాలని అర్థమైంది. లోపలికి వెళ్ళి చదువుకుని ఒక గంట తర్వాత వస్తూ మళ్ళీ ఆ నలుగురినీ గమనిస్తే వాడే ఇంకా ఉపన్యసిస్తున్నాడు. నా కర్థమైందేమిటంటే.. వాడు తన జ్ఞానాన్నీ, పాండిత్యాన్నీ ప్రదర్శిస్తున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళ దృష్టిని ఆకర్షించడానికీ,పొద్దుపోవడానికి ఇలాంటి పనికిమాలిన పనులను చాలా మంది చేస్తూంటారనీ . సమయాన్ని వృథా చేస్తారూ అని. నిజానికి తెలివిగలవాడు ఇతరులతో ఎప్పుడూ వాదించడు.. కాగా అతి తక్కువగా మాట్లాడుతూ ఇతరులను ఎక్కువగా వింటాడు.. కదమ్మా. ”
” కరెక్ట్.. ఒకటి చెప్పనా నాన్నా.. నోరు మూసుకోవాల్సిన సమయం ఏదంటే నువ్వు ఏదైనా చెప్పాలని అనుకుంటావే అప్పుడన్నమాట ” అంది నిర్మల చైతన్య కళ్ళలోకి చూస్తూ.
చైతన్య నవ్వాడు గలగలా.
చైతన్య ఇంటర్ సెకండియర్ లో ఉన్నపుడు,
” ఈ రోజు ఒక నా ఫ్రెండింటికి వెళ్ళానమ్మా. వాడి నాన్న ఒక పెద్ద లాయర్. ఎవరో తన క్లెయింట్ తో మాట్లాడుతున్నాడు. ప్రక్క గదిలో ఉన్న మాకు అంతా వినబడుతోంది. హెన్రీ టేలర్ అనే రాజనీతిజ్ఞుడు ఒక విషయం చెప్పాడు..కోర్ట్ లో నిజం చెప్పనక్కరలేదని వైరి ఇరు వర్గాలూ ఒక అవగాహనకు వస్తే ఇక అబద్ధం అనేది అబద్ఢం కాకుండా పోతుందని. నీతిగా, నిజాయితీగా ఉండక్కర్లేదని నాగరిక సమాజంలోని సకల వర్గాలూ ఒక అవగాహనకు వస్తే దేశంలో ఇక అవినీతికీ, అనైతికతకూ, వంచనకూ, అసత్యానికీ అగౌరవం ఏమీలేదు. కోర్టుల్లో భగవద్గీత, బైబిల్ లను చేతిలో పెట్టి భగవంతుడి సాక్షిగా ప్రమాణాలు చేయిస్తూంటే ఏ ఒక్కడన్నా సత్యం చెబుతున్నాడా ఈ దేశంలో ” చెబుతూనే ఉన్నాడు.
చైతన్యలో పరిణతి కనిపించి.. తను నాటిన మొక్క ఆరోగ్యంగా ఎదుగుతూ వృక్షంగా మారుతూంటే కలిగే ఆనందాన్ని పొందిందా క్షణం నిర్మల.
” ఈ రోజే నాకు పి హెచ్ డి ఎంట్రన్స్ లో రెండవ ర్యాంకొచ్చి సీటొచ్చిందిరా.. ఇక మూడేళ్లలో మీ అమ్మ .. డాక్టర్ నిర్మల..ఊ ” అంది . చైతన్య ” కంగ్రాట్సమ్మా. మా అమ్మ జీనియస్.. ” అంటూ.,
గది నిండా హృదయ పరిమళం.
బి టెక్ – రెండవ సంవత్సరం లో చైతన్య.
” ఈ రోజు పర్యటనకు వెళ్లలేదమ్మా .. అమ్మా ఈ రోజుతో మహాభారతం పద్దెనిమిది పర్వాలూ పూర్తి చేశాను.. అర్థమైందేమిటంటే.. అర్జునున్ని అధిగమిస్తాడని ద్రోణుడు కుట్రతో ఏకలవ్యుని బొటన వ్రేలుని తీసుకుని అశక్తుణ్ణి చేశాడు. మళ్ళీ వాడు తిరిగి సాధనతో నైపుణ్యాణ్ణి సాధిస్తే కురుక్షేత్రంలో వాడెక్కడ కౌరవ పక్షం వహిస్తాడో నని కృష్ణుడు వాణ్ణి చంపించాడు. అదే రకంగా ఇంద్రుడు అర్జునుని కోసం కర్ణుని కవచ కుండలాలను తీసుకుని వాణ్ణి దగా చేశాడు. ఐతే అందులో ద్రోణుడుగానీ, కృష్ణుడు గానీ, ఇంద్రుడుగానీ, భీష్ముడుగానీ బావుకున్నది ఏమీ లేదు. కాగా బైటపడి అపకీర్తి పాలయ్యారు. కాని ఇంతమంది చేత ఇన్ని పాపాలు చేయించి అంతిమంగా లబ్ది పొందిన అర్జునుడు మాత్రం ఎన్నడూ బైటపడలేదు. తన చేతికి మట్టి అంటకుండా అందరినీ మట్టి కరిపించాడు. అదీ బతుకు తెరువంటే. ఆ విద్య చాలా బాగా తెలిసిన కళా ప్రపూర్ణుడు అర్జునుడు. వాడి అన్న ధర్మరాజు ఆ విద్యలో కళాబ్రహ్మ. అందుకే అందరూ చచ్చి సాధించిన మహాసామ్రాజ్యానికి చక్రవర్తయి హాయిగా కూర్చున్నాడు.
ఇంకో విషయం.. శకుని తోడేలు లాంటివాడు.. తోడేలు తోకతో తన అడుగుజాడలు కనిపించకుండా చెరిపేస్తూ పోతుంది . ఇదొక దీర్ఘ కాలిక ముందు చూపు .. ” చెబుతూ పోతున్నాడు చైతన్య . ఆమె వింటోంది తృప్తిగా.
ఆ తర్వాత.. రెండున్నరేండ్లు గడిచాక.,
ఒకే రోజు రెండు శుభ వార్తలు విన్నారు నిర్మల, చైతన్య. ఆ రోజే గేట్ పరీక్షలో దేశం లోనే రెండవ ర్యాంక్ సాధించిన చైతన్య ఐ ఐ టి ఢిల్లీ లో కంప్యూటర్ సైన్స్ లో చేరాడు ఆన్ లైన్ అడ్మిషన్ లో. నరసింహం పని చేసి వెళ్ళిపోయిన యూనివర్సిటీ లోనే నిర్మల తన పి హెచ్ డి గోల్డ్ మెడల్ తో అసిస్టంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరింది.
ఇద్దరూ ఆ రాత్రి ఇంట్లో కూర్చుని ఆమె చేసిన రుచికరమైన చికెన్ బిర్యానీ తింటున్నప్పుడు.. ఎవరో బజర్ నొక్కి ‘ బ్లూ డార్ట్ ‘ తరపున ఒక కవర్ ను అందించి వెళ్ళాడు నిర్మలకు. ఆమె దాన్ని అటూ ఇటూ తిరగేసి నిర్లక్ష్యంగా ప్రక్కనున్న టీపాయ్ పై పెట్టి అంది.. ” ఇక నువ్వు నీ భవిష్యత్తును నిర్మించుకోవాలి నాన్నా. ఆలోచించడం మొదలెట్టు ఇక..” అని.
” అమ్మా .. ఈ మనుషులకు ఒక మైకముంటుంది.. దానం చేసి షెబాష్ అనిపించుకోవడం ఒక నిషా. చిత్తూరు వి నాగయ్య అనే బ్రహ్మాండమైన సినీ ఆర్టిస్ట్.. ఈ దానకర్ణ బలహీనతకు లొంగి అడుగుపట్టి పోయాడు. భారతంలో కర్ణుడూ అంతే. శరీరాన్ని కోసి మరీ దానాలు చేశాడు . బలి చక్రవర్తి అని ఒకడు. వామనుడు వాణ్ణి మూడడుగుల నేలను దానమడిగి ఒక కాలితో భూమండలాన్నంతా ఆక్రమించి, మరో అడుగుతో ఆకాశాన్నంతా కబ్జా చేసి.. ఈ మూడవకాలునెక్కడ పెట్టాలని అడిగితే.. వీడు చూడు.. నిషా తలకెక్కి తలవంచుకుని కూర్చున్నాడు పైన పెట్టమని.. అతను చేసినవన్నీ పిచ్చి వేషాలు . బలి అప్పుడు అడగవలసిందేమిటంటే .. అన్నీ వేశాలు. అప్పుడతను.. అరేయ్ అబ్బాయ్.. నువ్వడిగింది మూడడుగుల నేల.. నేలనే తీసుకో. అంతేకాని ఓవర్ యాక్షన్ చేస్తూ ఆకాశం జోలికెందుకు పోతావ్ , దించు కాలు అని అనాలికదా. ” చెబుతూ పోతున్నాడు చైతన్య. నిజంగానే అద్భుతమైన లాజిక్ అర్థమౌతూ నిర్మల ఫకఫకా నవ్వింది.
తర్వాత.. అతను ఐ ఐ టి ఢిల్లీ.. నిర్మల యూనివర్సిటీ లో ఉద్యోగంలో చేరి,
మరో రెండున్నరేండ్లు గడిచిన తర్వాత.,
ఆ రోజే రాత్రి తమిళనాడు ఎక్స్ ప్రెస్ దిగి చైతన్య ఇంటికొచ్చిన ఆ రోజు రాత్రి,
భోజనమైన తర్వాత.. ” అమ్మా ఇక నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ఒక తుది నిర్ణయం తీసుకుంటున్నానమ్మా. నువ్వు జాగ్రత్తగా విని ఒక స్నేహితురాలిగా సలహా ఇవ్వాలి నాకు ” అన్నాడు చైతన్య. నిర్మల కొద్దిగా సర్దుకుని కూర్చుంటూ చిరు నవ్వు నవ్వింది చెప్పు.. అన్నట్టు.
మొదలెట్టాడు చైతన్య.
” ఇది విను..వెరీ ఇంట్రస్టింగ్.. 1923 లో ఒక సర్వే జరిగింది. ఆ రిపోర్ట్ ఏమి చెబుతోందంటే.. ప్రపంచంలోని ధనవంతులైన ఎనిమిది మంది ఒక చోట కలుసుకున్నారు ఒకసారి . వాళ్ళందరి దగ్గరున్న మొత్తం సంపదను కలిపితే ఆనాటి అమెరికా ప్రభుత్వం దగ్గరున్న మొత్తంకన్నా ఎక్కువ. అటువంటి వాళ్ళు విడిపోయి, ఓ 25 ఏళ్ళు గడిచిన తర్వాత అదే సర్వే సంస్థ వీళ్ళిప్పుడెలా ఉన్నారు – అని ఆరా తీసింది. ఆ ఎనిమిది మందిలో ఒకడు, చార్ల్స్ స్క్వాబ్ ఒక అతి పెద్ద ఉక్కు కంపనీ అధ్యక్షుడు తన జీవిత ఆఖరి సంవత్సరాలు అప్పు చేసి బతికాడు. రెండవ వాడు, హోవర్ట్ హబ్ సన్ ఒక అతి పెద్ద గ్యాస్ కంపనీ ఓనర్.. పిచ్చివాడై పోయాడు. మూడవ వాడు, ఒక పెద్ద సరుకుల కంపనీ అధికారి ఆర్ధర్ కాటన్ , జీవిత చరమంలో అప్పులు చెల్లించలేని స్థితికి చేరి అలమటించాడు. నాల్గవ వాడు,న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ ప్రెసిడెంట్ రిచర్డ్స్ విల్లీ జైలు పాలయ్యాడు. ఐదవవాడు, అమెరికా అధ్యక్షుని మంత్రి వర్గం లోని ఒకడు ఒకప్పుడు.. జైలు శిక్ష అనుభవించి బయటపడ్డాదు. ఆరవ వాడు, వాల్ స్ట్రీట్ లో పెద్ద పేరుగల జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడవ వాడు, ప్రపంచం లోని అతి పెద్ద గుత్తాధికారి ఇవర్ క్రూగెర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఎనిమిదవవాడు, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్ అధ్యక్షుడు, లియాన్ ఫ్రేజర్ కూడా అత్మహత్య చేసుకున్నాడు. ఈ సర్వే ఏమి చెబుతోంది చెప్పమ్మా..” అని ఆగాడు చైతన్య.
నువ్వే చెప్పు అన్నట్టు చూచింది నిర్మల కొడుకు వైపు.
” అమ్మా.. మన జీవిత చక్రానికి ఆరు స్పోక్స్.. అంటే ఆకులున్నాయి. అవి కుటుంబం, ఆర్థికం, భౌతికం, మానసికం, సామాజికం , అధ్యాత్మికం. వీటిలో ఏ ఒక్కటి స్థానభ్రంశం చెందినా జీవిత సమతూకం భగ్నమౌతుంది. ఏ ఒక్క ఆకు లేకున్నా పయనం కుంటుపడ్తుంది. వీళ్ళందరూ కేవలం ‘ ఆర్థికమైన లావాదేవీలపైననే ‘ దృష్టినంతా కేంద్రీకరించి బతికారు. అందువల్ల వాళ్ళ చరమ దశ భయంకరంగా పరిణమించింది.
” అమ్మా.. నేను ఢిల్లీ ఐ ఐ టి లోనే ఎందుకు చేరానంటే.. ఈ భారత పుణ్యభూమి శిఖరమైన ఉత్తరభారత ప్రాచీన శతాబ్దాల చరిత్రను అధ్యయనం చేద్దామనీ, దాన్ని కూడా నువ్వు చెప్పిన పర్యటనలో భాగంగానే ఒక అవగాహనలోకి తెచ్చుకుందామనీ. ఇన్ టర్న్ షిప్ ప్రోగ్రాం కిందకూడా ఘజియాబాద్, మురాదాబాద్, ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత శ్రేణులు.. వాటి మహాద్భుత హృదయాంతరంగం.. మానస సరోవరం, వారణాసి.. గంగా యమునా, మందాకినీ నదుల పరీవాహక ప్రాంతాలు.. కేదార్నాథ్, హరిద్వార్, పాట్నా, లక్నో మొదలుగా అప్పటి మొఘల్ , పురాతన హిందూ నాగరికతల అపూర్వ సమ్మేళన వైభవం .. అప్పటి మనుషుల మానవీయ ప్రాణసమమైన విలువలు.. రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ ఓల్గా టు గంగా ‘ నుండి.. ‘ ఋగ్వేదంనాటి ఆర్యులు ‘ దాకా.. ఒక మహత్తర వారసత్వ సంపదమ్మా మనది. అవన్నీ తెలుసుకుని.. పొంగిపోతున్నాను నేను.. ఈ పుణ్యభూమిపై పుట్టినందుకు.” అని కాస్సేపాగి.. తనను తాను ఏదో ఒక పారవశ్యంలో కోల్పోయి, ” అమ్మా .. నేనిప్పుడు.. ఒక నీటి బొట్టును చూచి నేను వృద్ధి చేసుకున్న నా తర్కజ్ఞానంతో అది చెరువు నీరా, నది నీరా, సముద్రం నీరా, బావి నీరా, కాలువ నీరా గుర్తుపట్టి పోల్చుకోగలను .. ” అని.. ఉద్వేగంతో కళ్ళు మూసుకుని.. కాస్సేపాగి మళ్ళీ అన్నాడు,
” అమ్మా.. మనిషే ఒక మహా రహస్యం ఎప్పుడూ. ఈ భూమ్మీద ఏ ఒక్క మనిషీ తన గురించి పూర్తిగా విడమర్చి ఏ ఇతర వ్యక్తికీ చెప్పడు. నాకు తెలుసు నువ్వు నాన్న అనబడే ఆ రాక్షస నరసింహం తో విడిపోయి.. జీవితంతో ఎంత సుదీర్ఘ యుద్ధం చేసావో. నన్ను నీ రెండు చేతుల మధ్య దీపంలా కాపాడి ఎలా రక్షించావో. సానపట్టి చిత్ర హింసలు పెట్టకపోతే వజ్రం మెరవదు. నన్ను సానపెడ్తూనే పోయావ్ నువ్వు. కాని చాలా త్యాగం చేశావమ్మా. అలసికూడా పోయావ్. నాకు తెలుసు ఆ నరసింహం ఏమయ్యాడో. ఆ గీతేమయ్యిందో. నాకు అన్నయ్య కావలసిన కిశోర్ హార్వర్డ్ లో ఎం బి ఎ చేసి ఎక్కడో సి ఇ ఒ కావచ్చు . కాని అతి ఒంటరిగా మిగిలి జీవిత మాధుర్యాన్నే కోల్పోయాడు అర్థ జంతువైన ఓ బేవార్స్ తండ్రి వల్ల. నేను ఇప్పుడవన్నీ ఆలోచించడం లేదు. ఎందుకంటే నాకు మనుషులను బలహీనపర్చే సెంటిమెంట్స్ అంటే పరమ అసహ్యం. నేను ఒక్కటే ఆలోచిస్తున్నాను. నేను ఈ నా సహ మానవ సమాజానికి ఏ రకంగా పూర్తిగా ఉపయోగ పడగలనా.. అని. మనిషి ఉద్యోగాలు కేవలం ఆ మనిషికే లాభదాయక మౌతాయి. అధ్యాపకుడు, డాక్టర్ , శాస్త్రవేత్త లాంటి వృత్తులను పవిత్రంగా నిర్వహిస్తే కొన్ని మానవ సమూహాలు బాగు పడ్తాయి. కాని మానవ సమాజాన్ని శాసించి ప్రజల భవిష్యత్తును సమూలంగా మార్చగల శక్తి ఈ ప్రజాస్వామ్య సమాజంలో కేవలం రాజకీయ నాయకులకే ఉంది. ఐతే దురదృష్ట వశాత్తు భారతదేశం వంటి దేశాల్లో వ్యక్తిత్వమూ, నైతిక విలువలూ, సరియైన చదువూ, పారదర్శక ప్రవర్తన, అవినీతి రహిత తత్వమూ, ప్రజల ఉద్ధరణ పట్ల చిత్తశుద్ధీ లేనివాళ్ళే ఇన్నేళ్ళూ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుని ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారు. నిజానికి పూర్తి స్వచ్ఛమైన హృదయమున్న ఒక్క రాజకీయ నాయకుడు చాలు తను దేవుడై ఈ సమాజాన్ని స్వర్గతుల్యం చేసేందుకు.. నేను.. ఒక్కణ్ణి .. ఒక్కణ్ణే నా నిజాయితీ అన్న ఆయుధంతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక కొత్త చరిత్రను సృష్టిస్తానమ్మా. దరిద్రంతో అలమటిస్తున్న ఈ దేశాన్ని స్వర్గధామం చేస్తా. అద్భుతాలు చేసి చూపిస్తా. ఐయాం డిటర్ మైండ్.. ఒక్క నీ అశీస్సులు కావాలి. అంతే. ”
నిర్మల పొంగిపోతోంది గంగలా అతను చెబుతున్నది వింటూ.
అందరిలా చైతన్య నేనిక అమెరికా పోతా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ పెళ్ళాన్ని బెంజ్ కార్లో కోర్చోబెట్టుకుని షికార్లు చేస్తా అనకుండా ఒక సమాజహితమైన నిర్మాణాత్మక ఆలోచనను కలిగి ఉన్నందుకు పొంగిపోతూనే ఆమె లేచి.. చైతన్య శిరస్సుపై రెండు చేతులనూ విప్పి కప్పి .. వంగి ముద్దాడింది చలించిపోతూ.
అప్పుడు.. ఆ వెన్నెల నిండిన శీతాకాలపు రాత్రి ఏ ఒంటి గంటో దాటింది. తల్లి ఒడిలో ఒదిగిపోయిన చైతన్య అలాగే నిద్రపోయాడు. చాలా సేపటి తర్వాత ఆమె పదిలంగా కొడుకు తలను ప్రక్కకు పక్క పైకి పదిలంగా, అపురూపంగా జరిపి, పైన దుప్పటిని కప్పి, సవరించి తన గదిలోకి వెళ్ళి మంచంపై ఒరిగింది.
ఇక మిగిలిన రాత్రంతా అర్థం కాని మౌన క్షోభే.. వద్దన్నా జ్ఞాపకం వస్తూ కిషోర్.. కిషోర్ తో ఉన్న అనుబంధం. వికృతమైన నరసింహం ఆలోచన.. అంతా హృదయాన్ని పిండేసే వేదన.
సరిగ్గా ఆ భగ్న హృదయంతోనే ఆ మధ్యే నరసింహం రాసిన., రెండు లేఖలను టేబుల్ సొరుగులోంచి బయటికి తీసి చదివింది మళ్ళీ.
హృదయం నిప్పులపై కాగితంలా దగ్ధమౌతూండగా, ఒక రకమైన జుగుప్స.. అసహ్యం.,

నిర్మలా,
నేను నీకు చేసిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది.
వ్యామోహంలో నేను చేసిన దుశ్చర్య మన్నించదగ్గది కాదని నాకు తెలుసు. గీత నన్ను విడిచి మరో జర్మనీ వాడితో లేచిపోయింది. దానికి వ్యక్తులు ముఖ్యం కాదనీ, డబ్బే ప్రధానమని తెలియడానికి చాలా తక్కువ కాలమే పట్టింది నాకు. ఐతే తెలిసి చేసిన తప్పుకు నేను తగిన శిక్షను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను.
వీలుంటే, నన్ను మస్పూర్తిగా క్షమించగలవని ప్రార్థన.
– నరసింహం
నిట్టూర్చింది..దీర్ఘంగా.
మళ్ళీ నరసింహం జ్ఞాపకం భాషకందని ఒక రోత భావనను కలిగిస్తూండగా.. ఆ వికృతానుభూతి నుండి బయట పడ్డానికి.. అప్పటినుండి పిలుస్తున్న పిచ్చుకలకోసం లేచి నడుస్తూ.. పిడికెడు బియ్యపు గింజలకోసం వంటగది లోకి వెళ్ళిన నిర్మల తన చేతిలోని రెండు కవర్లను అప్రయత్నంగానే చటుక్కున స్టౌ వెలిగించి గుప్పున విచ్చుకున్న అగ్నిజ్వాలల్లో పడేసింది.
ఆ అసహ్యకర భావనలను కలిగి ఉన్న కాగితాలను అంటిపెట్టుకుని ఉన్న పాపానికి పాపం అక్షరాలుకూడా దహించుకుపోతున్నాయి.. అనుకుందామె.
బయటకు నడిచి.. దర్వాజా మెట్లపై కూర్చుని..చేతిలోని బియ్యపు గింజలను నేలపై చల్లగానే చుట్టూ మూగిన పిచ్చుకలు.. ఒకరకమైన జీవధ్వనిని వినిపిస్తూంటే.,
నిర్మల కళ్ళు మూసుకుని..అనుకుంది.. అంతిమంగా.. మనిషి ఎప్పుడూ తన జీవితాన్ని తానే నిర్మించుకుని తానే జీవించాలి..తప్పదు. ఒకరి జీవితాన్ని మరొకరు జీవించడం ఎవరికైనా ఎలా సాధ్యం. ? – అని.
వంటగదిలోనుండి కాగితాలు కాలుతున్న వాసన వస్తూనే ఉంది.. గాలిలో తేలుతూ. *

1 thought on “తాత్పర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *