August 17, 2022

తులాభారం

రచన: టి.జ్ఞానప్రసూన

“ఏమండీ! ఒక్క క్షణం ఆగండి…”
“నేనాగడం ఎందుకే? నువ్వు ఆగి, నేను ఆగి…ఈ వాకింగ్ అయినట్లే. మాటిమాటికి ఆగిపోతావామిటే! ఏముందక్కడ?”
“ఏముందేమిటి? అటు చూడండి, అందరూ ఇళ్ళు ఎంచక్కగా కట్టుకున్నారో! వాకిట్లో మెట్ల దగ్గర పెట్టిన ఆ శిల్పం చూడండి ఎంత బాగుందో.”
“బాగుంటుంది, బాగుంటుంది. ఇంటి బయట అంత సోకెందుకు? ఊళ్ళో వాళ్లు చూసి ఆనందించడానికా?”
“ఇదీ వరస. బయట ఇల్లు డాబుగా కనిపించకపోతే లోపల ఎంత బాగుంటే ఏం లాభం? ఇల్లు చూడగానే ఎంత బాగా కట్టారు? వీరిలో కళాపోసన తొంగి చూస్తుంది అనిపించాలి.”
“సరే! సరే! నడు. అవన్నీ తర్వాత తిలకిద్దువుగాని. వాకింగ్ అంటే బ్రిస్క్ గా నడవాలని ఎన్ని సార్లు చెప్పాను. వాగుడు కట్టిపెట్టి నడు”
“ఇదిగిదిగో ఆ మూడో అంతస్థులో వరండా చూడండి”
“మళ్లీ ఏమైంది? వరండా ముఖం ఎరుగవా? వరండా ఉండడం ఆశ్చర్యమా.”
“వరండా ఒక్కటేనా! ఆ వరండాకి పెట్టిన గ్రిల్ చూడండి. గ్రిల్ బాక్స్ టైపు పెట్టించారండీ, అంచేత వరండా విశాలంగా ఉంటుంది. కుండీలు దాని మీద పెట్టారు. ఒక గులాబీ కొమ్మ ఇవతలికి వచ్చి గులాబీ పువ్వు పూసింది వయ్యారంగా” అని వెనక్కి చూసింది సుభద్ర. కిరీటి లేదు.
“ఏరీ ఈయన లేరా? పెళ్లి అయిన దగ్గరనుంచీ ఇదే తంతు. నేను ఏదైనా చెప్పడం మొదలెట్టగానే అవతలికి చక్కాపోతారు. అదుగో పార్కులో బెంచీ మీద కూర్చున్నారు” అంటూ సుభద్ర వెళ్లి భర్త పక్కన చతికిలపడింది.
“మనం కూడా అలాంటి గ్రిల్ పెట్టించుకుందామండీ” అంది.
“నీకేమన్నా మతిపోయిందా. చేటంత స్థలం లేదు, గ్రిల్ పెట్టించుకోవాలిట. దానిమీద కుండీలు పెట్టుకోవాలిట. పూలు బయటకి తొంగి చూడాలట”
“మనసు పడటం కూడా అపరాధమే మీ దగ్గర. మీకు తెలుసుగా నాకు చెట్లంటే పిచ్చి అని. వరండాలో నేలమీద కుండీలు పెడితే నీళ్లు పోసినపుడల్లా చారెడు ఎర్రమట్టి బయటకొచ్చి వరండా అంతా ఎర్రగా కప్పేసుకుపోయింది. గ్రిల్ పెట్టిస్తే కుండీలు పైన పెట్టుకోవచ్చుగా, గొడవ ఉండదు. గ్రిల్ ఉంటే బట్టలు ఆరేసుకుంటే ఎగిరిపోవు. చిన్నాచితకా సామాను పెట్టినా భద్రంగా ఉంటాయి. మనవళ్లు వచ్చినప్పుడు కిందికి చూడాలని పిట్టగోడమీంచి ఒకటే ఎగురుతారు. ఎక్కడ పడిపోతారో అని నా గుండె దడదడమంటుంది.”
“ఆ! నీ ఉపన్యాసం వింటుంటే నా గుండెలు దడదడమంటున్నాయి. ఇంతకీ గ్రిల్ దేనికి పెట్టించమంటావ్! మీ వాళ్ళిచ్చిన ఇల్లేమైనా దాచావా ఎక్కడైనా చెప్పు?”
సుభద్ర మొహం కందగడ్డ అయ్యింది “మా వాళ్లే ఇల్లిస్తే గ్రిల్లుతో సహా ఇచ్చేవాళ్ళు. అయినా అన్నిటికీ మావాళ్లే గుర్తొస్తారేం మీకు. మీ పౌరుషం ఏమైంది?”
“పౌరుషం పాట్నా వెళ్ళింది. పిల్లల చదువుతో నా బుర్ర బోర్లించిన పప్పు గిన్నెలా అయ్యింది. చూడు ఒక్క వెంట్రుక మిగిలిందా?”
“దానికి నా తప్పేముంది? గ్రిల్ బాగుంటుందంటే ఇంత చదువుతున్నారు”
“గ్రిల్లుకేం భేషుగ్గా ఉంటుంది. వరండా ఏదీ పెట్టించడానికి?”
“హమ్మయ్య ఉంటే పెట్టించేస్తారా!”
“ఆ!”
“ఎడమవైపు వరండా వదిలేసి కుడివేపు దానికి పెట్టించండి”
“ఏ కుడివేపు?”
“అబ్బ, మన హాలులోంచి వెళ్తే వచ్చే వరండా కుడివేపుది కదూ!”
“మనం వుంటున్న అద్దె ఇంటికి గ్రిల్ పెట్టించమంటావా?”
“అద్దె ఇల్లయితే మాత్రమేం? ఉన్నంతసేపు మా ఇల్లు, మా ఇల్లు, అనుకోవడంలా? పైగా ఇంటి వాళ్ళు ఇది అమ్ముతాం అంటున్నారు. మీకేం ట్రాన్స్ ఫర్ లు అయ్యే ఉద్యోగం కాదు. మనం కొనుక్కుంటే అక్కడవన్ని చేయించడం కష్టం అవుతుంది”
“కొనకుండానే గ్రిల్ పెట్టాలంటే ఇంటి వాళ్ళని అడగొద్దూ?”
సుభద్ర మాత్రం మరచిపోలా, గ్రిల్ సంగతి.
రెండు మూడు రోజులకి కిరీటీ ఆఫీసు పని మీద 15 రోజులు టూర్ వెళ్లాల్సి వచ్చింది.
సుభద్రకి రెక్కలు వచ్చినట్లనిపించింది. ఇంటివాళ్ళకి ఫోన్ చేసేసింది. వాట్సాప్ వచ్చాక ఎంత సౌకర్యంగా వుందో. ఎవరికైనా ఇట్టే ఫోన్ చేసేయొచ్చు. ఇంటాయిన పలికాడు, సుభద్ర గొంతు వినగానే భార్య సౌభాగ్యాన్ని ముద్దుగా,“సౌభీ, నీకే ఫోన్” అని పిలిచి ఫోను ఇచ్చాడు. ‘యజమాని ఇంట్లోనే ఉన్నాడు, బాగానే ఉంది’ అనుకొంది సుభద్ర.
చాలా రోజులుగా వాళ్ళింట్లోనే ఉండటం మూలంగా చనువు పెరిగి ఇద్దరు సుభద్ర, సౌభాగ్యం వదిన మరదళ్ల వరస కలుపుకొన్నారు. అటునుంచి ఇల్లుగలావిడ “ఏమిటి ఒదినగారు, ఇంత పొద్దున్నే పిలిచారు?” అంది.
“మీరింకా మా అన్నగారికి కాఫీ ఇచ్చారో లేదో కనుక్కుందామని” అంది సుభద్ర.
“అయ్యో రామా! మీ అన్నగారు కళ్ళు తెరిచేసరికి పళ్లెంలో కప్పూసాసరు కనిపించకపోతే విడాకులిచెయ్యరూ? కాఫీ ఎప్పుడో ఇచ్చా” అంది ఇల్లుగలావిడ.
“మీరు మరీ చెబుతారు మా అన్నగారు ఎంత మంచివారు” అంది సుభద్ర.
“ఏం మంచో! ఏమో! ఒక్క మాట వినరు వినిపించరు. ఏమిటి సంగతి చెప్పండి ఇంతకీ”
“ఈ మధ్య వరండాలో పావురాలు గుడ్లు పెట్టి నానా కంగాళీ చేస్తున్నాయి. మూడు నెలలు పొదిగి పిల్లలు పెంచుతాయి వదినగారు. అందుచేత వరండా ఉన్న సుఖమే పోయింది. వరండాకి గ్రిల్ పెట్టిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీ మీద భారం వెయ్యములెండి. మీరు ‘ఉ’ అంటే చాలు ఖర్చు మేమే పెట్టి గ్రిల్ పెట్టించేస్తాం” అంది సుభద్ర, కిరీటీ తను సంప్రదించుకొని నిర్ణయించుకున్నట్టు.
“ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీ అన్నగారికి చెప్పి వస్తా” అని వెళ్లి రెండు నిమిషాలలో వచ్చి “మనం చేయాల్సిన పని వాళ్లు చేస్తారా? ఖర్చు, శ్రమ వాళ్ళకేనా? అన్నారు. మనలో మనకేముంది సరే చెప్పమంటారా అన్నా” తలతిప్పి కంప్యూటర్ లో దూరి పోయారు” అంది.
సుభద్ర గలగలా నవ్వి “అయితే పని వాళ్లకి కబురు పెడతా!” అని ఫోన్ పెట్టేసింది.
మొన్ననే కొత్తగా గ్రిల్స్ పెట్టించిన పక్కవాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని వెల్డింగ్ పని చేసే వాళ్ళని పిలిపించింది. వాళ్ళు వచ్చి‘ఇంత రేంజ్, అంత రేంజ్’ అని ఏమో చెప్పారు. సుభద్రకర్థంకాలా. అయిన ఏదో గ్రిల్ గురించి వివరిస్తున్నాడు అనుకొని “నాకదంతా తెలియదు, గట్టిగా ఉండాలి, పావురాలు దూరం కాకూడదు, మళ్లీ మళ్లీ రిపేర్లు రాకూడదు” అంది.
“అదేటండీ, మేం పని చేస్తే మూడు తరాల దాకా చెక్కుచెదరవు” అని మొత్తం ఎంత అవుతుందో మెష్ తయారయ్యాక ఇద్దరు లేమ్మా అని కొలతలు తీసుకుని వెళ్ళిపోయాడు.
అప్పుడు సుభద్రకి డబ్బు సంగతి గుర్తుకొచ్చింది. కిరీటి ఎప్పుడో దాయమని ఇచ్చిన డబ్బు ఉంది. తన నెక్లేస్ డబ్బుతోనే సరిపోవచ్చులే. మహా అయితే మూడువేలో నాలుగువేలో అనుకుంది.
మూడోరోజు మధ్యాహ్నానికల్లా నలుగురైదుగురు మనుషులు గ్రిల్ మోసుకొచ్చారు. ఒకబ్బాయి భుజం మీద తాడు ఉంది. గ్రిల్ చిన్న చిన్న గళ్ళతో చక్కగా దిట్టంగా ఉంది. గ్రిల్ మధ్య ఒక కిటికీ లాంటిది పెట్టమంది. కిందికి కూరలు అమ్మువస్తే ప్లాస్టిక్ సంచీకి తాడు కట్టి కిందికి దింపి కూరలు అవి పైకి లాక్కోవచ్చని. కిటికీ, గడియ అన్నీ పెట్టాడు. వరండా మొత్తానికి ఏకాంగీ ముక్కలా చేశాడు గ్రిల్. ఆ గ్రిల్ కి కంచారుతాడు కట్టి పైన ఇద్దరు కింద నలుగురు నిల్చున్నారు. పైవాళ్ళు కంచారుతాడుతో గ్రిల్ పైకిలాగుతున్నారు. పదినిమిషాలయ్యేసరికి కంచారుతాడు మధ్యలో విడిపోవడం మొదలయింది. మూడువంతులు పైకి లేచిన గ్రిల్ దభాలున కింద పడింది. కింద నలుగురు గ్రిల్ వదిలి పరుగెత్తారు. పెద్ద శబ్దం అయిందేమో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు.
సుభద్ర గుండెలు జారిపోయాయి. ‘దాని కింద పిల్లలో పెద్దలో ఎవరో చచ్చిపోయి ఉంటారు! ఏమిటి గతి ’అనుకుంది. బయటికి వెళ్లి చూద్దామంటే కాళ్ళు గుడ్డపీలికల్లా వేలాడాయి.
ఇంతలో పక్కన వాళ్ళిద్దరు ఇంట్లోకొచ్చి “ఎంత పని చేశారండీ?” అన్నారు.
సుభద్రకి నిలువుగుడ్లు పడ్డాయి. “ఏమయింది?” అంది ఎలాగో.
“మీ అదృష్టం బాగుంది కనక, ఇవాళ కింద ఎవరూ అక్కడ లేరు. లేకపోతే నిలువునా ప్రాణాలు పోయేవి. మీరు…” అని ఆపేసాడు. “అసలా కంచారుతాడేమిటండీ?” చిన్నచేదకి కట్టి నూతిలో నీళ్ళు తోడడం అనుకున్నారా! అవ్వ!” అన్నాడు.
“గట్టిగా చేయవయ్యా అన్నాను. డబ్బులు ఎక్కువ వస్తాయని దుక్కలా చేశాడు ఆ గ్రిల్, వాడి మొహాన కొట్టి తీసుకుపొమ్మంటా” అంది. వాళ్ళు వెళ్లారు.
గ్రిల్ చేసేవాడిని పిలిచి “నాయనా, నీకో నమస్కారం. నువ్వింత లోభివని అనుకోలా! లేకపోతే నేనే గట్టి తాడు తెప్పించేదాన్ని. నాకా గ్రిల్ ఆఖ్ఖర్లా. పట్టుకు పో!” అంది.
“పట్టుకెళ్ళి నేనేం చేయనండీ? కొలతలు పెట్టి మీ వరండాకి సరిపడా చేశా” నా డబ్బులియ్యండి రేపు మంచి తాడు తెచ్చి ఎక్కిస్తా” అన్నాడు. సుభద్ర వద్దనీ, వాడు పట్టుకెళ్ళననీ వాదనలు జరుగుతుండగా సుభద్ర తమ్ముడు ఊరికే చూడ్డానికి వచ్చాడు. ఇదంతా విని, “అంత బరువు పెట్టడానికి వీల్లేదయ్యా, కొన్ని చువ్వలు కోసేయి, సగం బరువును తగ్గించు” అన్నాడు.
‘ఖర్చు అవుతుంద’ని అన్నాడతను.
“అయితే అయిందిలే ఆ పని చెయ్యి తమ్ముడు” అంది.
‘నువ్వు ఊరుకో’ అన్నట్లు సౌంజ్ఞ చేశాడు తమ్ముడు. వెల్డింగ్ మిషన్ అవి తెచ్చి పెద్ద గళ్ళల్లా కోసాడు. పావురాలు కాదు పిల్లులు కూడా దూరచ్చన్నట్టుంది గ్రిల్. వరండాకెక్కించాడు. సుభద్ర వాడికి వేల సంఖ్యలో ముడుపు చెల్లించింది. ముచ్చట తీరాలేదు, ముఖాన నవ్వూలేదు.
టూర్ నుంచి కిరీటి వచ్చి గ్రిల్ చూసి ఓ క్షణం ‘పక్క ఇంటికి వచ్చానా కొంపదీసి’ అనుకొన్నాడు. సుభద్ర ఎదురు వెళ్లి “రైలు కరెక్ట్ టైముకే వచ్చిందా?” అంది. గ్రిల్ వంక చూసి ‘ఇదేమిటి’ అని కళ్ళెగరేస్తూ వాడు. ఎగరేసాడు. సుభద్ర భర్త వెనక ఎవరో అపరిచితుడు ఉంటే, కిరీటి చేయిలో పెట్టే అందుకొని లోపలికి దారితీసింది. కిరీటి వెనక్కి తిరిగి “సాంబశివగారు” అని ఆయన్ని పిలిచి, లోపల హాలులో కూర్చోబెట్టి, లోపలికి వెళ్ళి “సుభద్రా, అప్పుడొకసారి నీకు బ్రౌన్ కవరు ఇచ్చాను, అది పట్రా. నా పర్సు ఎవరో కొట్టేసారు, ఈయన అడ్డంపడి నా టికెట్టుకొని, దారిపొడుగునా ఖర్చుపెట్టి ఇంటి గుమ్మందాకా టాక్సీలో తెచ్చారు. ఆ డబ్బుల్ని ఆయనకి చెల్లించాలి” అన్నాడు.
సుభద్ర తెల్లమొహం వేసి “ఖర్చయిపోయాయి” అంది.
“ఎలా, ఆ గ్రిల్లు మోహన పెట్టావా? పోనీ పూనాలో నిన్ను నెక్లేసు కొనుక్కోమని డబ్బు ఇస్తే, ‘ఈ వయసులో నాకు నగలు ఏమిటి’ అని ముడుపుకట్టి దాచావుగా అవి పట్రా” అన్నాడు.
“అవి ఖర్చయిపోయాయి” అంది.
కిరీటి చెక్కు రాసి సాంబశివకి ఇచ్చి “డబ్బు రెడీగా లేదు, మిమ్మల్ని ఉత్త చేతులతో పంపడం ఇష్టం లేదు. మీకేమైనా చెక్కు మార్చుకోవడంలో ఇబ్బంది వస్తే చెప్పండి” అని చెప్పి సాగనంపాడు.
లోపలికి వచ్చి, “సుభద్రా! నువ్వు చేయాలనుకున్నది చేసేస్తావు. ఆర్థిక పరిస్థితి ఆలోచించవు. కోరికలు వాయిదా వేయకుండా చెల్లించుకుంటావు. రేపు నన్ను కూడా తులాభారం వేసి అమ్మేస్తావు” అన్నాడు.

***

1 thought on “తులాభారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *