April 25, 2024

భయం

రచన: రాజ్యలక్ష్మి. బి

అరుణకు యేమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. నిజం . ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. మరి తనేం చెయ్యాలి యిప్పుడు ? ఆ ప్రశ్నకు సమాధానం దొరకక తికమక పడుతున్నది. ఏ వుపాయము తట్టడం లేదు.. యిప్పుడు యేమి చేసినా చిక్కే ! చెయ్యకపోయినా చిక్కే !
అసలే పల్లెటూరు !చిన్న విషయం నిమిషాల్లో గుప్పుమంటుంది. పోనీ తన స్నేహితురాళ్లను అడుగుదామనుకుంటే వాళ్ళు తనని వేళాకోళం పట్టిస్తారేమోనని భయం !పోనీ జరిగినది కొంత మార్చి తన తప్పులేదని చెప్తే నమ్ముతారా ! నమ్మరు. పైగా నవ్వుతారు. ఏది దారి ?
మొదట్లోనే తను కొంచెం ధైర్యం గా ప్రవర్తించి వుంటే అసలీ సమస్యే వుండేది కాదు. అని అనుకోవడానికి కూడా వీలులేదు.
అరుణ మనసు పరిపరివిధాల వూగుతున్నది. అప్పుడే కాలేజీలో అడుగుపెట్టింది అందగత్తె. చలాకీతనం చురుకుతనం అమాయకపు పసితనం యింకా ప్రవర్తనలో కనిపిస్తున్నది.. అమ్మా నాన్నాఅన్నయ్యా వదినా అందరి మధ్య హాయిగా సాగిపోతున్నది. సరదా సరదా జీవితం. అరుణకు మరోధ్యాస లేదు. అలాంటి అమ్మాయికి జరిగిన అనుభవం తొలియవ్వనాన్ని గుర్తు చేసింది.
అసలు సంగతి యేమిటంటే నెలరోజులకిందట ఇంటియజమానిగారి అబ్బాయి రవిశంకర్ వేసవి సెలవుల్లో వచ్చాడు. అతను డిగ్రీ ఫైనల్ లో వున్నాడు. అతని చెల్లెలు చంద్రిక అరుణ ఒకటే కాలేజీలో చదువుతున్నారు. మంచి స్నేహం కూడా వుంది. వేసవి సెలవుల్లో అన్నయ్య వస్తున్నట్టు చంద్రిక అరుణకు ఎప్ప్పుడో చెప్పింది.
రవిశంకర్ వచ్చిన ఆ రోజు సాయంకాలం అనుకోకుండా అరుణ తమగుమ్మం దగ్గర వున్నది. రవిశంకర్ అందగాడు. నడకలో ఠీవి దర్జా కనపడుతున్నది. సూదంటు చూపులు కోటేరులాంటి ముక్కు నొక్కులజుట్టు పచ్చటి పసిమి. ఎందుకో తనకు యేదో తెలియని భావం. అప్పుడే తను పూలుకోస్తున్నది. అతను తనకేసి చూసాడు తనుకూడా అతనికేసి చూసింది. అతని చూపులలో యేదో ఆకర్షణ !తనకు మతిపోయినట్టయ్యింది. అతని చూపులు నిర్మలంగా సహజంగా వున్నాయి. నిర్భయం గా చూసిన అతని చూపులు తన మనస్సులో నిలిచిపోయాయి.
ఆ తరువాత తను చంద్రిక దగ్గరకు వెళ్లినప్పుడల్లా అతను అటూ యిటూ తిరుగుతూ తనవంక చూస్తూవుండేవాడు. తనుకూడా చంద్రిక చూడకుండా అతని చూపుల్లో చూపులు కలిపేది. ఒకవైపు భయం వుండేది కానీ యేదో తృప్తిగా వుండేది. రవి కూడా అవకాశం కుదిరినప్పుడల్లా తనతో చూపులు కలిపేవాడు. ఏమవుతేనేం మొత్తానికి యిద్దరూ చూపుల పలకరింపులతో అందమైన వూహలు పంచుకుంటున్నారు.

క్రమం గా రవిచూపుల్లో ఒకమార్పు కనిపించింది. కనీసం అప్పుడైనా తను అతనికి కనిపించకుండా తప్పుకుని వుంటే బాగుండేది. యిప్పుడు యీ చిక్కు సమస్య వుండేది కాదు భయమూ వుండేది కాదు. అతని కళ్లల్లో ఒకవిధమైన స్వతంత్రభావం పెదవుల మీద చిలిపినవ్వు మొదలయ్యాయి. అప్పటినించీ యిద్దరి
మధ్యా యేదో అనురాగబంధం బలపడుతున్నట్టు అనిపించింది. ఏదో మధుర భావన !
ఆ రాత్రి భోజనం చేసి యింటివెనుక చల్లగాలిలో నించుంది. హాయిగా వుంది. మల్లెలపరిమళం ఆస్వాదిస్తున్నది. ఇంతలో అకస్మాత్తుగా రవి దగ్గర గా వచ్చి తన చెయ్యి ముద్దు పెట్టుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు.. ఏం జరిగిందో వూహించే లోగా అతను వెళ్లిపోయాడు. తత్తరపడింది. వొళ్లుఝల్లుమంది. తను బాధ్యురాలా !!!!యేమో !తనకూ తల్చుకుంటే యేదో తన్మయం !తప్పు తంటా !!
ఆమ్మో అప్పుడు అమ్మకానీ నాన్న కానీ అన్నయ్యా వదినా కానీ చూసుంటే యేమయ్యెది ??తన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా అయ్యేది. అతనికేం మగవాడు. తప్పు తనల్నే యెత్తిచూపేది. అయినా యే అమ్మాయి సిగ్గువిడిచి బయటకు యేమని చెప్తుంది ?అరుస్తుందా !!!కేకలు పెడుతుందా ??? ఒకవేళ అరిస్తే అందరూ వచ్చి అడిగితె ఏం చెప్తుంది ? పైగా తన్నే తిడతారు. అయినా రవిని అల్లరి పెట్టడం తనకు యిష్టం లేదు. తనకూ యెక్కడో ఒకమూల హాయిగా వుంది. ఆ రోజునించీ తనల్ని చూసినప్ప్పుడల్లా నవ్వుతున్నాడు.తనకు యిష్టం గాఁ వుంది భయం గా కూడా వుంది. కానీ వెగటుగా అనిపించడం లేదు. యెవరికైనా చెప్పి యిద్దరూ అల్లరిపడడం తనకు యిష్టం లేదు. చంద్రికతో చెడుతుంది. అన్నీ సమస్యలే.
ఒకరోజు చంద్రిక కంగారుగా యేడుస్తూ అరుణ దగ్గరకు వచ్చింది.
“అరుణా అన్నయ్యకు వోళ్ళుకాలిపోతున్నది యింకోవారం లో కాలేజీలు తెరుస్తారు. పైగా ఒకటే కలవరింతలు ‘పద్మా పద్మా ‘ అని అమ్మకు కూడా అర్ధం కావడం లేదు “దిగులుగా చెప్పింది చంద్రిక.
అరుణ కూడా కంగారు పడింది. చంద్రికకు ధైర్యం చెప్పింది. రవిని చూద్దామని వున్నా వెళ్లలేదు.
“పద్మ యెవరు “చంద్రికను అరుణ అడిగింది.
“ఏమో మాకెవ్వరికీ తెలియదు “అన్నది చంద్రిక. చంద్రిక వెళ్ళిపోయింది.
అరుణకు ఎక్కడో అసూయ కలిగింది. ‘ పద్మ పద్మ ‘అని కలవరించాడుట !!కోపం వచ్చింది. ఎవరో ఆ పద్మ !!
అరుణకు ఒల్లుమండుతున్నది.
వదిన మంగళ అరుణ దగ్గరకు వచ్చింది.
“వదినా కలవరింతలో పద్మా పద్మా అన్నాడుట చంద్రిక అన్నయ్య!”అన్నది అరుణ
” బాగా జ్వరం వస్తే ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు అరుణా “అన్నది మంగళ.
నిజమే !!పద్మ పేరు బదులు తన పేరు కలవరిస్తే తన గతి ఏమయ్యేది !!యెంత అల్లరయ్యేది !!తన అదృష్టం బాగుంది. పద్మ యెవరో కానీ తనల్ని రక్షించింది. హాయిగా వూపిరి పీల్చుకుంది.
“అరుణా నువ్వుకూడా రెండు రోజుల కిందట రవీ రవీ అని ఒకటే కలవరింత “అంటూ మంగళ అరుణను చూసి నవ్వింది.
గుడ్లప్పగించి అలాగే వదినను చూస్తూ వుండిపోయింది అరుణ.

1 thought on “భయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *