August 17, 2022

మిధ్యాబింబాలు

రచన: ఆచార్య పి.కె. జయలక్ష్మి

రెండు వారాలయింది యు.యస్ నించి వచ్చి.ల్యాప్ టాప్ లో ఫేస్ బుక్ చూస్తుంటే అవినాష్, కాకినాడ కన్పిస్తే యాదాలాపంగా ప్రొఫైల్ చూసా. సందేహం లేదు ..నా మేనల్లుడు అవినాషే! దాంట్లో ఉన్న నంబరికి అదిరే గుండెలతో ఫోన్ చేశా. అట్నించి “హలో” అన్న స్వరం వినగానే గుండె గొంతులో కొట్టుకుంది. వణికే కంఠం తో “ నేను మాధవత్తని అవినాష్ బెంగుళూరు నించి మాట్లాడుతున్నా” అన్నాను. ఒక్క నిమిషం మౌనం రాజ్యమేలింది. బహుశా జ్ఞాపకం చేసుకుంటున్నాడనుకుంటా! పదేళ్లయిపోవస్తోంది కదా! “మధూ అత్తా! ఎన్నాళ్లకె న్నాళ్ళకి? ఎలా వున్నావ్? ఏంటీ సర్ప్రైజ్?” అన్నాడు సంతోషంగా. “ హమ్మయ్య గుర్తుపట్టావు కదా? ఫేస్ బుక్ లో నీ నంబరు చూసి పట్టుకోగల్గాను. అంతా బాగున్నారా అవీ?” ఆప్యాయంగా పలకరించాను. “ అత్తా, నేను ప్రస్తుతం ఢిల్లీ కాన్ఫరెన్స్ లో ఉన్నా. ఎల్లుండి కాకినాడ వెళ్ళగానే ఫోన్ చేసి వివరం గా మాట్లాడతా. నీ నంబర్ ఇదే కదా? ఉంటానత్తా, బై “ అని పెట్టేశాడు. నా మనసు గతం లోకి జారిపోయింది.
కాకినాడ నా పుట్టిల్లు. ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు కాకినాడతో ముడిపడి ఉన్నాయి. నా పుట్టుక, బాల్యం, చదువు, ప్రేమ, పెళ్లి … ఇలా జీవితం లో ముఖ్యమైన ఘట్టాలన్నిటికీ కాకినాడే సాక్షి. అమ్మానాన్నలకి అన్నయ్య, నేను రెండు కళ్లలా పెరిగాం. చిన్నదాన్ని కావడంతో నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు. అన్నయ్య రంగరాయ కాలేజ్ లో మెడిసిన్ చదువుతుంటే నేను విమెన్స్ కాలేజ్ లో ఇంటర్ చదివేదాన్ని. ఆ రోజులు నాకెప్పుడూ గుర్తే! చదువుకోడానికి, సెమినార్ ప్రిపరేషన్ కనీ వాడి ఫ్రెండ్స్ ఇంటికి వస్తూ ఉండేవారు. అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్ దిలీప్, క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. చాలా చురుకైనవాడని నాన్నగారు కూడా ఎంతో మెచ్చుకొనేవారు తనని. మా ఇంటికి ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి అని నన్ను ఉడికిస్తూ ఉండేవాడు. ‘’ఏయ్ డాక్టర్?” అంటే ‘’ఏం పేషెంట్?” అని ఆటపట్టించేవాడు. కొన్నాళ్ళకి వాళ్ళ చదువు, నా డిగ్రీ పూర్తయ్యేసరికి పేషెంట్ ని కాస్తా ప్రేయసి గా మరి పెళ్లి వరకు వచ్చేశాం. వర్ణాంతరం కావడంతో ఇంట్లో ఒప్పుకోకపోవడాలు, అలకలు, గొడవలు… అన్నీ మామూలే! చివరికి అన్నయ్య ప్రమేయం తో , ఇరుపక్షాల సమ్మతితో మేం ఒకటయ్యాం. తర్వాత హైదరాబాద్ లో కాపరం పెట్టడం, శ్రేయ, సతోష్ పుట్టడం , కాలచక్రం లో ఎన్నో సంఘటనలు సంభవించాయి ….. కొన్ని గుర్తుపెట్టుకోగల్గినవి, కొన్ని మర్చిపోదామన్నా మరవలేనివి.
అన్నయ్య అమ్మవాళ్ళ ఇష్టప్రకారం మెడిసిన్ చదివిన అమ్మాయినే సాంప్రదాయ బద్ధం గా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు… అవినాష్, అమల. పచ్చని పసిమి చాయతో ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత తెల్లగా అందంగా ఉండేది అమల . దానికి తోడు మంచి కనుముక్కు తీరు, ఒత్తైన నొక్కుల జుట్టు. అంతా మేనత్త పోలిక అంటుంటే నాక్కొంచెం గర్వం గా అన్పించేది. నేను కాకినాడ వచ్చినప్పుడల్లా దాన్ని బొమ్మ లా తయారుచేసి ముచ్చటపడిపోతూ ఉండేదాన్ని. నేనన్నా అది చాలా ఇష్టం చూపించేది. అమల ఇంటర్ చదువుతున్నప్పుడు అనుకుంటా కాకినాడ వెళ్ళాను సెలవులకని. మాటల్లో అన్నయ్యతో ‘అమలని నా కోడలిగా చేసుకోవాలనుందని’ చెప్పాను. వదినేమీ మాట్లాడలేదు. కానీ అన్నయ్య ‘దానికి ఇప్పుడే పెళ్ళేంటే?’ అన్నాడు ముభావంగా “ముందు ఒక మాట అనుకుందాం లేరా.ఇంకా సంతోష్ ఎమ్మెస్ పూర్తవ్వాలి కదా” అన్నాను. నా ప్రస్తావన వాడికి నచ్చినట్టు లేదని తెలుస్తోంది. ‘మేనరికాలు మంచివి కాదే , నీకు తెలియదా ఏంటి?” అన్నాడు ఇబ్బంది గా. ఆస్తి,అంతస్తు , చదువు-సంస్కారం, అన్నిటికి మించి స్నేహం-బంధుత్వం కంటే కులానికి వాడు ప్రాధాన్యమిస్తున్నాడని నాకు మనసులో ఏ మూలో అర్ధమవుతూనే ఉంది. నేను వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడం వల్ల అన్నయ్యకి తన కూతుర్ని నా కోడలి గా చేయడం ఇష్టం లేదని , ఆరాత్రి వదినతో స్పష్టం చేయడం నా చెవిని దాటిపోలేదు. ప్రేమించినవాడితో నా పెళ్లి చేయడం కోసం, అందరినీ ఒప్పించి నా ప్రేమని గెలిపించిన నా అన్నయ్యేనా వీడు?తన కూతురి విషయం వచ్చేసరికి సంతోష్ ని మేనల్లుడిగా కాకుండా దిలీప్ కొడుకు గా , పరాయి కులస్తుడి గా భావిస్తూ పిల్లనివ్వనంటున్నాడు.. అన్నయ్య మనసులో మాట అర్ధమయ్యాక ఇక పూర్వం లా ఉండలేనన్పించింది. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి.అమ్మానాన్న కాలం చేసినప్పుడు కూడా అందరి బంధువుల్లాగే వెళ్ళి వచ్చాను. అన్నయ్యకీఇదే నచ్చినట్టుంది కాబోలు. పెద్దగా స్పందించ లేదు. తన భార్యాపిల్లలు,భార్య వైపు బంధువులు మాత్రమే ముఖ్యులయి న్నట్లు, నన్ను పరాయి కులస్తుడి భార్యగానే భావించి మొక్కుబడిగా వ్యవహరించాడే తప్ప మనస్ఫూర్తిగా చిన్నప్పటి అన్నయ్య లా ఆదరించలేదు.
కుటుంబం విస్తృతమయ్యేకొద్దీ, వయసు పెరిగే కొద్దీ మనిషి మనసు చిన్నదయ్యి, ప్రేమ-ఆత్మీయతల పరిధి సంకుచితమవుతూ బాంధవ్యాలు బలహీనపడతాయా అన్పించింది. వీళ్ళందరికంటే ముందు నించి వాడితో కలిసి పుట్టి పెరిగింది నేను. ‘మనిద్దరిలో ఉన్నది ఒకే రక్తం. ఎందుకురా నన్ను దూరం పెడుతున్నావు?’ అని అడగాలన్పించింది గట్టిగా. అమలని నా కోడలిగా చేసుకోవాలనుందని అడిగి తప్పు చేశానా? అందుకే నన్ను దూరం పెడుతున్నాడా? అన్పించింది. ఏది ఏమైనా మనుషుల మనస్తత్వాలు తెలిసి వచ్చాయి.. ఇది కూడా ఒక మంచి పాఠమే అనుకున్నా.
**** ***** ***** ***** ***** **** *****
కాలచక్రం గిర్రున తిరుగుతూ ఎన్నో విచిత్రాలు చూపిస్తూ ఉంది. దిలీప్ కి నిమ్ హాన్స్ లో జాబ్ రావడంతో మేము బెంగుళూరు లో స్థిరపడిపోయాము.నా కూతురు శ్రేయ అమెరికా లో ఎమ్మెస్ చేసి తన క్లాస్ మేట్ నే లైఫ్ మేట్ గా చేసుకొని అక్కడే స్థిరపడింది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నించి క్లాస్ మేట్సు కావడమే కాక ప్రశాంత్ నా ఫ్రెండ్ కొడుకు కూడా అవడంతో స్నేహం బంధుత్వం గా మారి నందుకు మేమేంతో సంతోషించాం. శ్రేయ దగ్గర ఏడాదిపాటు యూఎస్ లో వుండిపోయాను దాని డెలివరీ కి వెళ్ళి. ఆ టైమ్ లోనే అన్నయ్య,వదిన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయార న్న వార్త తెలిసి దుఖం లో మునిగిపోయాను. అవినాష్ పెళ్ళికి వెళ్లినప్పుడు చూడ్డమేవాళ్ళ ని చివరిగా. ఇండియా వచ్చాక అవినాష్, అమలల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు తెలిసింది హడావిడిగా అమల పెళ్లయిపోయిందని, మంచి ముహూర్తాలు లేవని తొందరపడాల్సి వచ్చిందని,వాళ్ళు హనీమూన్ వెళ్ళారని!ఏ మూలో ఉన్న చిన్నపాటి ఆశ కూడా ఆవిరైపోయింది. వచ్చాక మా ఇంటికి తప్పకుండా పంపమని ఆహ్వానించి వచ్చాను. తర్వాత వాళ్ళ దగ్గర్నించి ఏ కబురూ నేనే మనసాగక, పుట్టింటి మీద ఆశ చావక ఫోన్లు చేస్తూ ఉండేదాన్ని. అన్నయ్య ఉన్నప్పుడే అంతంత మాత్రం …. ఇంక ఇప్పుడేం ఉంటుంది?
నా కూతురు శ్రేయ అమెరికా లో ఎమ్మెస్ చేసి తన క్లాస్ మేట్ నే లైఫ్ మేట్ గా చేసుకొని అక్కడే స్థిరపడింది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నించి క్లాస్ మేట్సు కావడమే కాక ప్రశాంత్ నా ఫ్రెండ్ కొడుకు కూడా అవడంతో స్నేహం బంధుత్వం గా మారి నందుకు మేమేంతో సంతోషించాం. సంతోష్ నిషయమే నన్ను కలవరపెట్టింది. బిట్స్,దుబాయి లో ఇంజనీరింగ్ చదువుతునేటప్పుడు లూసీ అనే ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయిని సెలవులకొచ్చినప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఫ్రెండేమో అని సరిపెట్టుకున్నా. కానీ చదువయ్యాక బాంబు పేల్చాడు. ఆ పిల్లని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని . దిలీప్ ,నేను ఎంత చెప్పినా వాడు వినలేదు. లూసీ చాలా మంచిదని,నాలుగేళ్లుగా తనకి తెలుసని, ఆ పి‌ల్లకి కూడా తనంటే ఎంతో ప్రాణమని ఒత్తిడి తీసుకు వచ్చాడు. చేసేదిలేక వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడి చర్చ్ లో పెళ్లి జరిపించాం. నాకు చాలా విరక్తిగా అన్పించింది. మా పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో నిరాడంబరం గా అవడంతో సంతోష్ పెళ్లి ఆర్భాటం గా , పద్ధతిగా చేయాలని కన్న కలలన్నీ కల్లలయ్యాయి. ఫ్రెండ్స్ అంతా తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ అయితే కొడుకు ఏకం గా ఇంటర్ నేషనల్ మేరేజ్ చేసుకున్నాడు అని హాస్యమాడారు.
లూసీ కుటుంబం గురించి పెద్దగా చెప్పుకోడానికేమీ లేదు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి స్కూల్ టీచర్, అక్క నర్స్ గా పని చేస్తున్నారు. లూసీ కూడా టీచరుగా చేస్తూ ప్రవేట్ గా ఎమ్మే కట్టిందట. నాకు , దిలీప్ కి ఆస్తిపాస్తుల మీద మోజు లేదు . దేవుడి దయ వల్ల సర్జన్ గా మంచి పేరుతో పాటు ఆస్తి కూడా దిలీప్ బాగానే సంపాదించాడు. ఇళ్ళు, భూములు, తోటలు.. దేనికీ లోటు లేదు. కుటుంబం, సాంప్రదాయం నాకు చాలా ముఖ్యం. కానీ ఆ విషయం లోనే తట్టుకోలేని దెబ్బ తగిలింది. నా కూతురు ఎంతో ఓదార్చింది…”మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా మమ్మీ! సంతోష్ కి నచ్చిన పి‌ల్లతో పెళ్లి చేశారు. వాడు సంతోషమేగా మనం కోరుకునేది. కొన్నాళ్లు నా దగ్గరకొచ్చి ఉండండి డాడీ,నువ్వు. నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి ” అని.
లూసీ మమ్మల్ని బాగానే చూస్తుంది, కానీ పెళ్లైన తర్వాత కూడా తను మా పద్ధతులు అలవాటు చేసుకోకపోవడం నాకు బాధ కలిగించింది. ఆ పి‌ల్లకి తన మతమంటే ఎంతో గౌరవం. చర్చ్ కి రెగ్యులర్ గా వెళ్లడమే కాకుండా ఇంట్లో కూడా జీసెస్ ఫోటోలు పెట్టి ప్రార్ధనలు చేస్తుంది. బొట్టు పెట్టుకోదు. సంతోష్ కూడా చెప్పడేమో? వాళ్ళ ఆహారపుటలవాట్లు కూడా నాకు ఇబ్బంది కలిగించాయి. మరో ఫ్లాట్ కొని వాళ్ళని అక్కడ ఉండమన్నాడు నా మనసు తెలిసిన నా భర్త. సంతోష్ బాధపడ్డాడు “ ఏంటమ్మా ఇది? మేము మీతో కలిసి ఉండడానికి పనికి రామా?” అని.లూసీ కళ్ళల్లో లీలగా తడి… నా దృష్టిని దాటిపోలేదు. అదేం పట్టించుకోకుండా తను“ ఏమైనా అనుకోరా. కొత్తగా పెళ్లైనవాళ్లు మీకూ ప్రైవసీ అవసరం. అయినా ఒక ఊళ్లోనే ఉంటున్నాం కదా. మీకు వీలయినప్పుడు వస్తూ ఉండండి. మీ అంతటి వాళ్లయ్యారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళుండడమే మంచిది.” నిష్కర్ష గా చెప్పేసింది. లూసీ పద్ధతులు తనకు నచ్చకే ఇలాటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పైకి చెప్పకపోయినా వాళ్ళకి అర్ధమయ్యే ఉండాలి. తమ దేవుణ్ణి పూజించకపోయినా భరించగల్గింది గాని ముత్తైదుపిల్ల గాజులు, పుస్తేలు, పసుపుకుంకుమ లేకుండా గౌన్లు వేసుకొని తిరగడం, ఇంట్లో మాంసాహారం వండడం మాత్రం తట్టుకోలేకపోయింది. అడిగితే సంతోష్ కి అలవాటని వండుతున్నట్టు చెప్పింది
దిలీప్ మాంసాహారే అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఏనాడూ తనని వండమని అడిగింది లేదు. వాళ్ళ తోబుట్టువుల ఇళ్ళకి వెళ్లినప్పుడు తినేవాడేమో!అంతేనా? ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడదు. అమల గుర్తు వస్తే మనసు బాధతో మూలిగేది..అన్నయ్య మీద కోపం వచ్చేది కూడా. చక్కని చుక్క లాటి పిల్ల సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని,పొడవైన జడలో పూలు తురుముకొని,బొట్టు కాటుక పెట్టుకొని, మెళ్ళో పుస్తేలు, నగలు , పసుపు పాదాలకి మెట్టెలు,పట్టీలు అలంకరించుకొని అత్తయ్యా అని అచ్చ తెలుగు లో లక్షణంగా ఇంట్లో తిరుగాడాల్సిన మేనకోడలి స్థానం లో లూసీ ని కోడలి గా అంగీకరించలేకపోతున్నా. ఇంతటి సిరిసంపదలకి నా ముద్దుల మేనకోడలు వారసురాలిగా ఉండాల్సింది…నా ఖర్మ కాకపోతే ఎక్కడో దుబాయి లో పుట్టిన ఆంగ్లో ఇండియన్ నా కోడలిగా రావడమేంటి?
కొన్నాళ్ళకి లూసీ నాకు నచ్చినట్టుగా కొంచెం మారింది. అదే సంతోషం. ఈరోజుల్లో ఎవరినీ మార్చలేం కదా! వాళ్ళంతట వాళ్ళు మారాలే తప్ప. మనవడు విక్టర్ పుట్టిన నెలకే దిలీప్ హార్ట్ఎటాక్ తో చనిపోయాడు.అది మరో పెద్ద షాక్ నాకు జీవితం లో. చనిపోయే సంవత్సరం ముందు నా సమ్మతి తోనే ఆస్తులు పిల్లలిద్దరికి సమానంగా పంచేశాడు,మేము ఉంటున్న ఇల్లు కూడా నా తదనంతరం సంతోష్ పిల్లలకి చెందేలా వ్రాయమని చెప్పాను. నాకంటూ ఏమీ ఆస్తి లేదనే చెప్పాలి. ఆధ్యాత్మిక చింతన వైపు దృష్టి సారించాను. నాకు సాయంగా పనిపిల్ల ఎప్పుడూ ఉండేలా సంతోష్ ఏర్పాటు చేయడంతో గుళ్లూ గోపురాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. ఓపికున్నంతవరకు నాకిదే కాలక్షేపం.అప్పుడప్పుడు శ్రేయ దగ్గరకి వెళ్తూ ఉంటాను.అది తన దగ్గరే ఉండిపొమ్మంటుంది. కానీ బెంగుళూరు వదిలి ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేను.
కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఈ భ్రమణం లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. లూసీ తెలుగు మాట్లాడ్డమే కాదు, వంటలన్నీ చక్కగా నేర్చుకుంది. నా మనవళ్ళిద్దరూ రోజూ నా దగ్గరకి వస్తారు గ్రానీ అంటూ ముద్దు ముద్దు గా తెలుగులో పలకరిస్తారు. ఇంకా నా కొడుకు సరేసరి . రాత్రి ఎంత లేటయినా నన్ను కలిసి, యోగక్షేమాలు విచారించి గాని ఇంటికి వెళ్ళడు. పెద్ద కంపెనీ కి డైరెక్టర్ అయినా అమ్మని ఎప్పుడూ విస్మరించడు.నాక్కావాల్సినవన్నీ వెంటనే అమిరిపోవాల్సిందే. ఆ విషయం లో నేను చాలా అదృష్టవంతురాలిని. లూసీ అయితే “ మమ్మీ! అంతా కలిసి వుందాం, ఒక్కరే ఎందుకు?” అంటుంది. కానీ నాకు ఇలాగే బాగుంది. వారానికోసరి వాళ్ళింటికి వెళ్తూ ఉంటాను. ఇల్లు దగ్గరే కావటంతో లూసీ నాకు రోజూ ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది. ఇంటిక్కావాల్సిన సరుకులు, సామాన్లు వాళ్లే తెచ్చేస్తారు. పది రోజులకోసారి అంతాకలిసి బైటకెక్కడికైనా వెళ్తూ ఉంటాం. అయినా మనసులో ఏ మూలో నాకింకా అసంతృప్తి. అమల చోట్లో లూసీని అంగీకరించలేకపోతున్నా ఎందుకో? ఆ పిల్ల వేరే మతస్తురాలన్న సంగతి పక్కన పెడితే లూసీ లో ఎంచడానికేమీ లేదు. ఆ రోజు నాకు బాగా గుర్తు.
కిందటేడు సంతోష్ కంపెనీ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఒక రాత్రివేళ నాకు గుండెల్లో నెప్పిగా అన్పించి వద్దనుకుంటూనే లూసీ కి ఫోన్ చేశాను. ఆగమేఘాల మీద వచ్చి అర్ధరాత్రి వేళ నన్ను కార్లో హాస్పిటల్ కి తీసుకు వెళ్లింది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. సంతోష్ కి తెలిస్తే ఎక్కడ కంగారుపడతాడో అని ధైర్యంగా అన్నీ తానే అయి నిలబడింది. లూసీ యే లేకపోతే ఏమై పోయేదాన్నో? కానీ మళ్ళీ మనసులో …. నా మేనకోడలయితే ఇంకా బాగా చూసుకు నేదేమో? ఎంతయినా నా రక్తం కదా? ఏంటో ఇన్నేళ్లయినా అమల వైపే ఆలోచనలెప్పుడూ! ఇన్నేళ్లకి అవినాష్ మాట్లాడ్డంతో పాత జ్ఞాపకాలన్నిటిని నెమరు వేసుకోగలిగాను. అమల ఇప్పుడెలా ఉందో ఏంటో? అన్నయ్య పోయినప్పుడు పదకొండేళ్లక్రితం చూడ్డమే. వాడున్నప్పుడే అంతంతమాత్రం కలయికలు.. ఆ తర్వాత అసలే లేదు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ.
అవినాష్ పదే పదే రమ్మని పిలవడంతో నాక్కూడా మనసులో పుట్టిన ఊరు చూడాలనే కోరిక ప్రబలంగా ఉండటంతో సంతోష్ కి చెప్పి పనిపిల్లని తీస్కోని కాకినాడ వెళ్ళాను.. అవినాష్ స్టేషన్ కి వచ్చాడు. సంతోషం ,విచారం మిళితమైన అవ్యక్త భావాలు నా మనసులో…అచ్చం అన్నయ్యలా ఉన్న మేనల్లుడిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు. వాడి భార్య రూప ప్రశాంతంగా , ముచ్చటగా ఉంది. పిల్లలు4,5 తరగతుల్లో ఉన్నారు. పొందికైన సంసారం. భోజనాలయ్యాక పాత సంగతులు, వాడి చిన్నప్పటి కబుర్లు ముచ్చటించుకున్నాం. అన్నవదినల్ని గుర్తుచేసుకుని బాధపడ్డాను. అమల గురించి మనసు కొట్టుకుపోతోంది నాకు ఒక పక్క.నెమ్మదిగా ఆ విషయాలు కూడా చెప్పారు. అమల తన క్లాస్ మేట్ ని వర్ణాంతర వివాహం చేస్కుందట. . ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారు. ఆ అబ్బాయి కాలేజీలెక్చరర్ అట. నాది వర్ణాంతరమనే కారణం గా సంతోష్ కి అమలని ఇవ్వనన్న అన్నయ్య కి వేరే కులస్తుడే అల్లుడవడం ఆశ్చర్యం కలిగించింది నాకు. అమలకి ఫోన్ చేస్తే “ ఆ, బాగున్నావా అత్తయ్యా? నేను ప్రెస్ మీట్ లో ఉన్నాను. రేపు వచ్చి కలుస్తా” అని పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. మనసు చివుక్కుమంది. పోన్లే అదేదో బిజీ గా ఉన్నట్టుంది అని సరిపెట్టుకున్నా.
సాయంత్రం అలా వేణుగోపాలస్వామి గుడి వరకు వెళ్దామని బయలుదేరా. రూప కార్లో వెళ్లమంటే “వద్దమ్మా , నాలుగడుగులే కదా!కాస్త ఊరు కూడా చూసినట్టుంటుంది. పిల్ల తోడుంది గా, అలా తిరిగేసి వస్తా.” అని రోడ్డు మీదకి వచ్చాను. చిన్నప్పుడు ప్రతి శనివారం ఈ గుడికి వచ్చేవాళ్లం. ఏమీ మారలేదు,అప్పటిలాగే ఆవరణలో వేప, రావి, పారిజాతం చెట్లు, బావి… ఎంతో ప్రశాంతం గా అన్పించింది. దర్శనం చేసుకొని ,కాసేపు ఆ చెట్ల కింద కూచుని. స్మృతులు నెమరువేసుకొని ఇంటికి వెళ్దామని లేస్తోంటే ఎవరో నా ఈడున్నావిడ దగ్గరకొచ్చి “ నువ్వు… మీరు మాధవి కదా?”అని అనుమానంగా అడుగుతోంటే తాను తేరిపార చూసి “ ఏయ్ రజనీ ఎన్నాళ్లకెన్నాళ్ళకి? ఎలా ఉన్నావే?”అంటూ అమాంతం కౌగిలించుకుంది చిన్ననాటి స్నేహితురాలిని. “ఏమై పోయావే ఇన్నేళ్లు?ఇంకేం మాట్లాడకు పద, ఇంటికి” అంటూ పనిపిల్లని, నన్ను ఆటో ఎక్కించింది రజనీ.
దార్లో నా కుటుంబం గురించి ప్రశ్నలడిగి తన గురించి చెప్పుకొచ్చింది. కూతురు తాము చెప్పినట్లు బ్యాంక్ మేనేజర్ ని చేసుకుందట. కొడుకు మాత్రం తమ ఇష్టానికి విరుద్ధం గా ప్రేమపెళ్లి చేసుకున్నాడట. . కోడలు సివిల్ ఇంజినీరింగ్ చదివిందట. బిల్డర్ గా ,సైట్ ఇంజినీర్ గా కొన్నాళ్లు చేసి తర్వాత రియల్ ఎస్టేట్ అని, ఫైనాన్స్ బిజినెస్ అని చేతులు కాల్చుకుందని ఇంటిపట్టున సరిగ్గా ఉండదని, ఎవర్నీ ఖాతరు చేయదని చెప్పి బాధపడింది. నిత్యం నరకం చూపిస్తోందట.ఇల్లు తమపేర రాసేసి కూతురింటికి పోయి ఉండమంటుందట. ఇల్లు పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతామని ఒకటే నస ట అని చెప్పుకొని వాపోయింది.“కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందే మధూ. దాన్నని ఏం లాభం? మన బంగారం మంచిదయితే? నా కొడుకు ఒక దద్దమ్మ. మాలో ఎంత కట్నాలో నీకు తెలియందేముంది? దాని తళుకు,బెళుకు చూసి మోజుపడి కట్టుకున్నాడు. అయిందేదో అయ్యింది తల్లిదండ్రులు లేని పిల్ల కదాని కడుపులో పెట్టుకొని చూద్దామనుకున్నా. కానీ వచ్చిన మొదలు మా పొడ గిట్టందే? పోనీ వేరింటి కాపరం పెట్టుకోమంటే వెళ్ళమంటారు.అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి కదా! మనవల్ని మా దగ్గరకి రానివ్వదు. పురుడప్పుడూ, పసివాళ్ళ కింద చేయడానికి పనికి వచ్చాం గాని! తీసికెళ్లి హాస్టల్లో పడేసింది….. వాళ్ళకి మా బుద్ధులు వచ్చేస్తాయిట? అవును మరి మావి తప్పుడు బుద్ధులు కదా? అటు పుట్టింటి వాళ్లతోనూ సరిగ్గా ఉండదు. వాళ్ళిచ్చిన సొమ్మంతా సరదాలకి, షోకులకి, బిజినెస్ లకి తగలేసి ఇప్పుడింకా ఇమ్మని పీక్కుతింటే ఎలా చెప్పు? వాళ్ళు మాత్రం ఎక్కణ్ణించి ఇస్తారు?అందుకే వాళ్ళు రావడం మానుకున్నారు. ఎవరితోనూ సయోధ్య లేదు” వెళ్లబోసుకుంది రజని.
నేను ఆశ్చర్యపోయాను. పెద్దవాళ్ళ ఇష్టానికి విరుద్ధం గా ప్రేమపెళ్లి చేసుకొని అత్తగారింట్లోనే ఉంటూ ఇలా వాళ్లని ఉసురు పెట్టే కోడల్నిఏమనాలో అర్ధం కాలేదు. వాళ్ళు పెద్ద మనసు తో చేరదీస్తే ఆ పిల్ల రివర్సు లో వాళ్ళని వేపుకు తినడమేంటి? వాళ్ళని ఇంట్లోంచి పొమ్మనమనడం ఏంటీ చోద్యం కాకపోతే?
“సర్లే, అంతా మేం చేసుకున్న ఖర్మ … నువ్వు ముందు ముఖం కడుక్కుని రా ,టిఫిన్ తిందువుగాని” అని పెరట్లో బాత్రూం చూపించింది.
“ఎక్కువ చేయకు. లక్ష పన్లుంటాయి. అన్నీ నీకు చెప్పి ,నీ పర్మిషన్ తీసుకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. తీరిగ్గా తిని కూచుని… ఆరాలు కావాలి… ఆరాలు .. ఎక్కడికెళ్లావ్, ఎందుకెళ్లావ్ అనుకుంటూ!” బైటకి వస్తూ ఈ మాటల ప్రభంజనానికి హడలిపోయి అక్కడే ఆగిపోయాను. సందేహం లేదు రజని కోడలే !
“నోర్మూసుకుని పడి ఉండండి లేకపోతే నువ్వు,నీ మొగుడు మీ కూతురింటికి పొండి . అది రానివ్వకపోతే ఓల్దేజ్ హోం కి పొండి. మా నెత్తి మీద శని లా దాపురించారు అసలు ….” ఇంకా ఏదో అరుస్తోంటే ఉండబట్టలేక ధడాల్న తలుపు తోసుకొని బైటకి వచ్చాను. కనిపించిన దృశ్యం చూసి నా కళ్లని నేనే నమ్మలేకపోయాను. నేను చూస్తోంది రజని కోడల్ని…. కాదు.. కాదు నా ముద్దుల అందాల మేనకోడల్ని. ఇన్నేళ్లు ఎవరైతే నా కోడలు కావాలని ….. కాలేకపోయిందని తెగ మధనపడ్డానో ఆ అందాలరాశి వికృత మైన అసలు రూపాన్ని !ఏది అందమైన జడ? పొట్టిగా కత్తిరించుకుంది,నుదుటిమీద బొట్టులేదు. మెళ్ళో పుస్తేలు, చేతికి గాజులు, కాళ్ళకి మెట్టెలు, పట్టీలు, వొంటి నిండా చీర ఏమి లేవు. వొళ్ళు కన్పించే బట్టలతో, వెగటు పుట్టించే మేకప్ తో,అంతకంటే అసహ్యమైన మాటతీరుతో అమల నిజస్వరూపాన్ని చూసి షాక్ కి లోనయ్యాను.
నన్ను అక్కడ ఊహించని అమల ఒక్క నిమిషం తొట్రుపడి వెంటనే సర్దుకుంటూ “ఓహో నువ్వా? ఏంటత్తయ్యా?నేను వచ్చి కలుస్తానన్నానుగా. అంతలోనే వెతుక్కుంటూ వచ్చేశావా నా ఇంటికి?” అంది విష పూరిత చిరునవ్వుతో వ్యంగ్యంగా. “ నేను నీ ఇంటికి రాలేదు అమలా! నా స్నేహితురాలింటికి వచ్చాను” అన్నాను అంతకంటే కరకు గా. “ఓహో! అయితే నాకోసం రాలేదన్నమాట. ఇంకేం? బాగా మాట్లాడుకోండి.వస్తా” అంటూ విసురుగా బైటకి వెళ్లిపోయింది. అవాక్కయిన రజని “ ఏంటి మాధవీ? అమల నీ మేనకోడలా? సారీ, నాకు నిజం గా తెలియదు.”అంటూ సంజాయిషీ ఇవ్వడం నాకు బాధ కల్గించింది. ఏం మాట్లాడాలో తెలియని అయోమయావస్థ లో “వస్తాను రజనీ, చాలా ఆలశ్యమైపోయింది, ఇంటి దగ్గర రూప చూస్తూ ఉంటుంది. నేను ఫోన్ చేస్తా వెళ్ళాక” అని ఇల్లు చేరాను.
*** **** ****
ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో కూచున్న నేను ఎప్పుడెప్పుడు నా కోడల్ని చూస్తానా అని ఉద్విగ్నం గా ఉన్నాను. ఎంత భ్రమ లో బతికాను ఇన్నాళ్ళు? పరాయి దేశస్తురాలయినా, భాష, మతం, సంప్రదాయం వేరైనా కంటికి రెప్పలా చూసుకునే ఉత్తమురాలయిన కోడల్ని ఈ దౌర్భాగ్యు రాలితో పోల్చుకొని ఎంత తిరస్కారం గా చూశానో? అందమైన శరీరమే గాని సంస్కారం లేని అమల తన కోడలై ఉంటే దాని ప్రవర్తనతో భర్త, ఆస్తి లేని తాను ఈ పాటికి ఆత్మహత్య చేసుకొని ఉండేది కాదూ? పశ్చాత్తాపం తో కుమిలిపోసాగాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నా తల్లికి ప్రాధాన్యమిచ్చే కొడుకు, మంచి మనసున్నకోడలు… ఇంతకంటే నాకేం కావాలి? ఇన్నేళ్లు ఈ పాపిష్టిదాన్ని కోడలిగా చేసుకోలేకపోయానే అని బాధ పడ్డాను. ఇప్పుడు చనిపోయిన అన్నయ్యకి, కనిపించని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను అది నా కోడలు కానందుకు. నిజం గా కోరుకోదగ్గ కోడలంటే లూసీ యే. ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. కొడుకు, కోడలు, మనవలతో నేను కలిసి గడిప బోయే మనోహర దృశ్యం కళ్ల కి కట్టినట్టుగా కన్పిస్తుంటే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ నా అశాంతిని పటాపంచలు చేస్తూ పట్టాలమీద ఉరకలు వేస్తూ నన్ను గమ్యానికి చేర్చడానికి ఉత్సాహపడుతోంది
*** *** **** ****

1 thought on “మిధ్యాబింబాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *