March 29, 2024

చిన్న లెఖ్ఖల మాష్టారు

రచన: జి.వి.ఎల్. నరసింహం

ఆ నగరంలో నాలుగు హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో మహాత్మా గాంధీ హైస్కూలు, జిల్లాలోకెల్లా పాతది. చాలా పేరున్నది. ప్రస్తుతం ఉన్నత పదవులలో నున్న కొందరు, గతంలో ఆ స్కూలు విద్యార్థులే.

ఇహ మన కథానాయకుడు, చిన్న లెఖ్ఖల మాష్టారు గురించి తెలుసుకొందామా. ఆయన లక్ష్మణ మూర్తి నామధేయుడు. పొట్టిగా, బొద్దుగా ఉంటారు. ఎప్పుడూ, తెల్లని, లేదా, లేత నీలపు రంగు చొక్కాను, పంచలో దోపి, లేత గోధుమ రంగు కోటును ధరించి, నుదుట కుంకుమ బొట్టుతో, బడికి బయలుదేరుతారు. చిన్న క్లాసుల పిల్లలకు గణిత శాస్త్రాన్ని బోధిస్తారు. చిన్న క్లాసులలోనే, పిల్లలకు గణిత శాస్త్రంలో దిట్టమయిన పునాది వేస్తారని, ఆయనను అందరూ ప్రశంసిస్తారు. ఆ మాటలు ఆయన చెవిలో పడితే, ఉప్పొంగిపోతారు. కాని, ఆయనకు నచ్చనిదొకటుంది. అది ఏమిటంటారా; అదేనండి; ఆయనను, ‘చిన్న లెఖ్ఖల మాష్టారు’ అని అందరూ అనడం. ఆయన అభ్యంతరం ఏమిటంటారా. లెఖ్ఖలు చెప్పే మాష్టార్లందరూ లెఖ్ఖలమాష్టార్లే. అందులో, చిన్నా, పెద్దా, ఏమిటి, అని ఆయన తర్కం. తాను వేసిన పునాదుల వలనే కదా, పిల్లలు పెద్ద క్లాసులలో, లెఖ్ఖలు సుళువుగా నేర్చుకొంటున్నారంటారాయన. ఏదయినా ఇల్లు కట్టినప్పుడు పునాదులు చాలా ముఖ్యం కదా .పునాదులు వేసిన మేస్త్రీని, చిన్న మేస్త్రీ అంటామా; మేస్త్రీలనందరిని, మేస్త్రీలనేఅంటాం, అని ఆయన వాదన. ఆయన వాదనలో కొంత పస ఉన్నా, జనం వాళ్ళ అలవాట్లను మార్చుకోరు గదా.
ఎవరేమని పిలచినా, మాస్టారు, కిర్రుమని, కర్ణకఠోరంగా చప్పుడుచేస్తూ, కాలింగు బెల్లులా పనిచేస్తున్న, తన ఇంటి కర్రగేటుకు, బి. లక్ష్మణరావు, లెఖ్ఖల టీచరు, మహాత్మా గాంధీ హైస్కూలు అని ఇంగ్లీషులోను, తెలుగులోనూ, తాటికాయలంత అక్షరాలతో లిఖింపబడ్డ, కర్రబల్ల అమర్చుకొన్నారు. ఓ చిన్న…కాదండీ , పెద్దపొరపాటే జరిగిందండి. అదేమిటంటారా. ‘ఇంటి కర్రగేటు’ అని వాడేను కదండీ. దానిని ‘బంగళా కర్రగేటు’ గా సరిదిద్దుకోవాలి. ఏమంటారా, ఆయన తన నివాసాన్ని, బంగళా గానే భావిస్తారు. మాటల సందర్భంలో, ‘మా బంగళా’ అనే వాడుతూంటారు. ఎవరయినా, దానిని ‘ఇల్లు’ అని అంటే, ఆయన మనసులో చాలా బాధపడతారు.

లక్ష్మణ మూర్తిగారి నివాసం, పిత్రార్జితమయిన ఒక పెంకుటిల్లు. ఆ ఇంటి వెనుక, కొద్దిగా పెద్దదయిన పెరడులో, ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక జామిచెట్టు ఉన్నాయి. అవి కాక, రెండు కర్ర పందిళ్లు, ఒకటి దొండపాదుకు, మరొకటి తీగబచ్చలికి కేటాయింపబడ్డాయి. ఇంటికి ముందునున్న, కొద్దిపాటి జాగాలో, గురువమ్మగారు పూలమొక్కలు పెంచుకొంటారు. మొదట్లో, ఆ ఇంట్లో మూడు గదులు, ఒకదాని వెనుక ఒకటి, రైలుబోగీలులాగ ఉండేవి. ఉద్యోగంలో చేరిన అయిదు సంవత్సరాల తరువాత, లక్ష్మణరావుగారు, వాటికి మరో బోగీ తగిలించేరు. ఆ తరువాత, నాలుగు సంవత్సరాలయ్యేక, నాలుగో బోగీకి లంబకోణంలో, అనగా తొంభై డిగ్రీలలో, మరో గది నిర్మించేరు. అప్పటివరకు నాలుగో బోగీలో ఉన్న, వంట మరియు భోజనాల ఏర్పాటును, కొత్తగా నిర్మించిన గదిలోనికి మార్చేరు. తమ బంగళాలో ముందు గదిని, మాష్టారు ‘డ్రాయింగు రూము’ అంటారు. ఆ గదిలో, నాలుగు స్టీలు మడత కుర్చీలు, ఒక చిన్న టేబులు అమర్చబడి ఉంటాయి. ఆ గదిలోనే, మాష్టారు ట్యూషన్లు చెపుతూంటారు.
రోజూ, బడినుండి ఇంటికి, సారీ, బంగళాకు వెళ్లే దారిలో, కూరలు కొనుక్కొని వెళ్లడం, మాష్టారికి అలవాటు. బజారులో కొన్న కూరలు బంగళాకు చేర్చడానికి, బడినుండి తిరుగుప్రయాణంలో, తన వెంటా ఓ విద్యార్థిని తీసుకెళతారు. పిల్లలలో ఆ డ్యూటీ మారుతూంటుంది. వాళ్లలో అదృష్టమున్న వాడికి, అప్పుడప్పుడు, మాష్టారు ఓ జామపండు బహూకరిస్తూంటారు.
మాష్టారుకు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయికన్నా, అమ్మాయి రెండేళ్లు చిన్నది. అబ్బాయి, ఆ ఊళ్ళోనే లెఖ్ఖల్లో పి.జి. చేస్తున్నాడు. నిజానికి, అబ్బాయికి ఫిజిక్సులో పి.జి. చెయ్యాలని ఉండేది. కాని, లెఖ్ఖల్లో చేస్తే, కాలేజీలో లెఖ్ఖలు లెక్చరరు కాగలడని, అప్పుడు, పెద్దలెఖ్ఖల మాస్టర్లకన్నా ఎక్కువ హోదాలో ఉంటాడని, మాస్టారి అభిప్రాయం. అందుచేత పుత్రరత్నాన్ని, లెఖ్ఖల్లోనే పి.జి. చెయ్యమన్నారు. రామచంద్రరావు, అని తన పేరుకు తగ్గట్టు, పితృవాక్యపరిపాలనగా, ఆ కుర్రాడు లెఖ్ఖల్లోకే ప్రవేశించేడు. మాష్టారి అమ్మాయి గిరిజ, కూడా తెలివైనదే. కాని, మాస్టారు, అమ్మాయి చదువుకు హైస్కూలు పూర్తి కాగానే, ఫులుస్టాపు పెట్టీసేరు. కారణం. అమ్మాయి, డిగ్రీలు, పి.జి.లు చేస్తే, అంతకన్నా ఎక్కువ చదువుకొన్న వరుడిని చూడాలని, అంత చదువున్న వాళ్ళు, దండిగా కట్నాలడుగుతారని, మాష్టారి అభిప్రాయం.
మాష్టారుకు, సీతమ్మ అని ఒక చెల్లెలు, బొబ్బిలిలో ఉంది. ఆవిడ భర్త మార్కండేయరావు, L. I. C. ఏజెంటు. పెద్దగా ఆదాయం లేకపోయినా, అయిదు వేళ్ళూ లోపలికి వెళ్ళడానికి ఢోకా లేదు. ఆ దంపతులకు, కాశీపతి ఏకైక సంతానం. రంగు కొద్దిగా తక్కువయినా, కన్ను, ముక్కు, తీరుగా ఉంటాయి. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తుకు ఎదిగేడు. ఆ కుర్రాడు, చదువయ్యేక, ఏదో కొంత దక్షిణ సమర్పించుకొని, స్టేటు గవర్నమెంటు ఆఫీసులో గుమస్తాగా ఈమధ్యనే చేరేడు.
చెల్లెలు సీతమ్మ, రాసిన ఉత్తరం ద్వారా, మేనల్లుడు గవర్నమెంటు ఉద్యోగంలో చేరేడని, చిన్న లెఖ్ఖల మాష్టారుకు తెలిసింది. పెళ్లికొడుకుల అన్వేషణలోనున్న మాష్టారి దృష్టి, మేనల్లుడి మీద కేంద్రీకరించింది. వెంటనే వడి వడిగా నాలుగడుగులు వేసి, వంటిల్లు చేరుకొని, “ఏంవోయ్, మన కాశీపతి గవర్నమెంటు ఉద్యోగంలోచేరేడట.” అని సంబరపడుతూ, భార్యామణికి తెలియజేసేరు.
“మీకెలా తెలిసింది.” కుతూహలంతో గురువమ్మగారు వేసిన ప్రశ్న.
చేతిలోని ఉత్తరం చూపిస్తూ, “సీతమ్మ రాసింది. నిన్ననే, వాళ్ళ ఊళ్ళోనే, ఇంజినీరు ఆఫీసులో క్లర్కుగా జాయినయ్యేడని. వాడు చిన్నప్పటినుండి తెలివయినవాడు. లెఖ్ఖల్లో మంచి మార్కులొస్తూండేవి.”
“మేనమామని పోలి ఉంటాడు.” మాష్టారుకు ఓ కితాబు ఇచ్చేరు, గురువమ్మగారు.
మేష్టారి భుజాలు, ఒక్కమారుగా అయ్యరు హోటలులో పూరీల లాగ పొంగిపోయేయి.
“కాశీపతిని…మన గిరిజకు…మాట్లాడితే ఎలా ఉంటుందంటావు.” మాష్టారి మనసులోని మాట, సతీమణి అభిప్రాయాన్ని కోరుతూ, అడిగేరు.
“బాగానే ఉంటుంది. ముఖ్యంగా, వాడికి సిగరెట్టూ, అటువంటి చెడు అలవాట్లేవీ లేవు. ఇద్దరికీ, ఈడూ జోడూ కూడా సరిపోతుంది. పందిట్లో, చూడ్డానికి సీతారాములలాగా ముచ్చటగా కనిపిస్తారు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ…” గురువమ్మగారి మదిలో పెద్ద సందేహం.
“కానీకి, అంత దీర్ఘం తీసేవు. ఏమిటి నీ సందేహం.”
“మీ బావగారికి, దాహం ఎంత ఉంటుందా…అని.”
“అవన్నీ, తరువాత చూసుకో వచ్చోయ్.” అని నిబ్బరంగా శ్రీమతితో చెబుతూ, “చూడు సుబ్బూ ( సుభలక్ష్మికి ముద్దు పేరు ) ముఖ్యమయినది ఆలోచించు. వాళ్లకి వాడొక్కడే సంతానం. వాడికి, ఓ తమ్ముడో…చెల్లో… ఉండుంటే, ఒద్దనుకొన్నా, వాళ్ల బాధ్యత, వాడి భుజాలమీద తప్పక పడి ఉండేది కదా.”
“అవునండీ, బాగా ఆలోచించేరు. అది చాలా పెద్ద పాయింటే.” మాష్టారుకు మరో కితాబు.
మాష్టారి భుజాలు, మరో మారు పూరీల్లాగా పొంగిపోయేయి.
“అంతేకాదు సుబ్బూ, గవర్నమెంటు ఉద్యోగంలో, జీతం కాకుండా, ఇంతో అంతో, పైరాబడి కూడా ఉంటుంది. ప్రొమోషను వస్తే, జీతంతో బాటు, ఆ రాబడి కూడా పెరుగుతుంది. రిటైరు అయ్యేక, ప్రతీ నెలా పెన్షనొస్తుంది. ధర్జాగా, కాలుమీద కాలు వేసుకొని బ్రతకొచ్చు.” అని మాష్టారు దండకం వినిపించేరు.
“నిజమేనండీ, మా వేలు విడిచిన మేనత్త మొగుడు, ఏదో గవర్నమెంటు ఉద్యోగమే చేసి, రిటైరయ్యేడు. మా వాళ్ళందరూ, ఆయన, రెండు చేతులా ఆర్జించేడంటారు. రిటైరయ్యేక డొంకినివలసలో ఇల్లు కట్టుకొన్నాడట” గురువమ్మగారు మాష్టారుకు వంత పాడేరు.
“నేను ఇవాళ చెప్తున్నాను. జ్ఞాపకముంచుకో. మన కాశీపతి కూడా, మన బంగళాలాంటిదే, ఓ పెద్ద బంగళా, తప్పక కట్టుకొంటాడు.” అని మాష్టారు, శ్రీమతికి నొక్కి నొక్కి వినిపించేరు, మేనల్లుడి భవిష్యవాణి.
“అన్ని విధాలా బాగున్నట్టే ఉందండి. ప్రస్తుతం, శూన్యమాసం నడుస్తోంది. అది ఐపోగానే, వాళ్ళని కదిపి చూద్దాం.”
“ఎలాగూ ఉత్తరం అందుకోగానే, ఆ విషయం కదిపితే బాగుండదు. నువ్వు చెప్పినట్టు, ఈ నెల గడవనీ. ఈ లోగా మరెవరూ కూడా ప్రయత్నం చెయ్యరు.” సంభాషణ ముగించి, మాస్టారు డ్రాయింగు రూము దిక్కు, దారి తీసేరు.
సీను బొబ్బిలికి మారిందండి. అక్కడ కూడా, ఈ పెళ్లి విషయమే చర్చిస్తున్నారు. ఎవరంటారా. మరెవరవుతారండి. మన చిన్న లెఖ్ఖల మాష్టారి చెల్లెలు సీతమ్మ, ఆవిడ భర్త మార్కండేయరావు. పుత్రరత్నం పెళ్లి విషయం, సీరియస్గా, ఆలోచిస్తున్నారు.
“ఏమండీ, దేముడి దయవల్ల, మన వాడు గవర్నమెంటు ఉద్యోగంలో చేరేడు గదా. అదో సమస్య తీరింది. ఇహ వాడినో ఇంటివాడిని చేసీస్తే, మనకా బాధ్యత తీరుతుంది.” భర్తతో మనసులోని మాట చెప్పుకొంది, సీతమ్మ.
“సీతా, వాడు ఉద్యోగంలో చేరి, ఓ నెల జీతమేనా అందుకోలేదు. వాడి పెళ్ళికి ఇంత తొందరెందుకు. వాడినో ఏడాది బాటు, జీతం అందుకోనీ. నువ్వు చూస్తున్నావుగా, ఏదో విధిలేక, సత్రవులో ఉన్నట్టు కాలక్షేపం చేస్తున్నాం. తాపీగా, ఓ సోఫా సెట్టు, ఓ పెద్ద సైజు టి.వీ. గుమ్మాలికి కర్టెన్లు, ఒకొక్కటి అమర్చుకొంటే, ఇంటికో ఆకారం వస్తుంది. అప్పుడు పెళ్లిమాటలకు ఎవరైనా మనింటికి వచ్చినా, మనం కాలు మీద కాలు వేసుకొని మాట్లాడగలం. ఏమంటావ్.”
“ఆ మాట నిజమే. కానీ ఈ లోపున మంచి సంబంధాలు తప్పిపోతాయేమో అని నా భయం.” సీతమ్మగారి సందేహం.
“అంత బెంగ పడుతున్నావు. నీకు తెలిసిన మంచి సంబంధాలేమయినా ఉన్నాయేమిటి.”
“ఉన్నాయా…అంటే…ఉన్నాది. మా అన్నయ్య కూతురే, అమ్మలు. మీకు తెలుసుగా. చూడ్డానికి చక్కగా ఉంటుంది. మా వదిన పోలికే, మంచి రంగు కూడాను.” మదిలోని మాట మగనికి చెప్పె, సీతమ్మ.
“నిజమే, బాగానే ఉంటుంది. అంతే కాదు. మనవాడు పొడగరి. అమ్మలు కూడా పొడవైన పిల్లే. ఈడూ జోడూ కూడా సరిపోతుంది.” రావు, తన ఓటు అమ్మలుకు వెయ్యడానికి సుముఖంగా ఉన్నాడు.
“మరో ముఖ్యమయిన విషయమండి. అది మన కుటుంబంలోని పిల్ల. చిన్నప్పటినుండి మనకు తెలిసినది. మన చెప్పుచేతల్లో ఉంటుంది. తెలియని కుటుంబంలోని పిల్లయితే, మన ఇంటికి వచ్చేక, ఎలా ప్రవర్తిస్తుందో, మనకు ఏమీ తెలీదు గదా. ఈ రోజుల్లో ఆడపిల్లల సంగతి మీకు తెలియంది ఏముంది. పెళ్లయిన మన్నాడునుండి, వేరే కుంపటి పెట్టుకోవాలని తహతహలాడుతూంటారు. మీరడిగేరే, ఏమిటి నీ భయమని. అదండీ నా భయం. మన అమ్మలయితే, అటువంటి భయాలుండవు.”
“నువ్వు చెప్పింది కూడా బాగా ఆలోచించ వలసిన విషయమే. మనకున్న ఒక్కగానొక్కడూ, మనకి కాకుండా పొతే, మన గతేమిటవుతుంది. కానీ, సీతా, ఎంత మీ అన్నయ్య కూతురైనా…మనమే అడిగితే లోకువైపోతాం. మనమాట వదిలేయ్, పిల్లడికి, ఏ ముద్దూ ముచ్చటా తీరకపోవచ్చు.” తన బలమైన సందేహాన్ని వ్యక్త పరిచేరు, రావుగారు.
“అది నిజమేనండి. మనం డైరెక్టుగా అడక్కుండా, మన పేరయ్యశాస్త్రిగారిద్వారా, కథ నడిపించొచ్చు. మనం అడిగినట్లు కాకుండా, ఆయనే వెళ్లి, మన సంబంధం విషయం, వాళ్లకి సలహా ఇవ్వమని, మనం ఆయనకు చెప్పొచ్చు.”
సీతమ్మగారి స్ట్రేటజీ విని, రావుగారు, “సీతా, ఇది… చాలా రోజులుబట్టి… ప్లేను చేస్తున్నట్టున్నావు. బాగానే ఆలోచించేవు. కథ, ముందుకు నువ్వే నడిపించు,” అని భార్య ఆలోచనలకు, పచ్చ జెండా ఊపేరు రావుగారు.
శూన్యమాసం వెనక్కి వెళ్ళింది. సీను మళ్ళీ లెఖ్ఖల మాష్టారి బంగళాకు మారిందండి.

మేష్టారి బంగళా కర్రగేటు, కిర్రుమని, గంట వాయించింది. రెండో నంబరు బోగీలో, సేద తీర్చుకొంటున్న మాస్టారు దంపతులు, ఎవరా, అని గేటు దిక్కుగా దృష్టి మళ్లించేరు. సెల్ ఫోనులో, “మరో గంటలో మీ ఇంటికి వస్తున్నాను. అప్పుడు వివరాలన్నీ మాట్లాడు కోవచ్చు.” అని జరుగుతున్న సంభాషణకు, ఫుల్స్టాపు పెడుతూ, పేరిశాస్త్రిగారు బంగళా ప్రవేశం చేసేరు.
“రండి రండి, శాస్త్రిగారూ, ఇలా కూర్చోండి.” అని, డ్రాయింగు రూములో వాల్చి ఉన్న, ఓ మడత కుర్చీచూపిస్తూ, స్వాగతం పలికేరు, మాష్టారు.
“శాస్త్రిగారూ, ఇదేనా రావడం. బొబ్బిలినుండేనా.” గురువమ్మగారి కుశలప్రశ్న.
“అవునమ్మా, బొబ్బిలినుండే. మీ ఊళ్లోని ఆంజనేయశర్మగారు, రమ్మని ఖబురు చేస్తే, రావడమయింది . ఆయన దగ్గరకు వెళ్తూ, దారిలోనే మీరున్నారని, మీ దర్శనం ఓ మారు చేసుకొందామని ఇలా వచ్చేను.” నిజానికి, ఆయన వచ్చింది, వీరిని కలియడానికే. ఆ టెలిఫోను సంభాషణ కృత్రిమం.
“మంచిపని చేసేరు. మేమూ, మిమ్మల్ని కలుసుకొని చాలా రోజులయింది.” అని మాష్టారు తమ సంతోషం తెలియబరిచేరు.
“మా ఆడబడుచు వాళ్ళూ క్షేమమనుకొంటాం.” గురువమ్మగారి విచారణ.
“వారంతా క్షేమమేనమ్మా. మొన్న మంగళవారంనాడు, ఆ దంపతుల్ని ఆంజనేయాలయంలో కలిసేను.” శాస్త్రిగారి జవాబు.
ముగ్గురూ, లోకాభిరామాయణం మాట్లాడుకొంటూంటే, మాష్టారి అమ్మాయి మూడు మగ్గులతో టీ, ఓ ప్లేటులో ఆరు బిస్కట్లు తెచ్చి, టేబులు మీద పెట్టింది. శాస్త్రిగారికి పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలందుకొని, లోపలికి నిష్క్రమించింది.
“మీ అమ్మాయి కదూ. ఏమిటి చేస్తున్నాది.” శాస్త్రిగారి ప్రశ్న.
“చదువయిందండి. తగిన వరుడు కుదిరితే, వివాహం చేద్దామనుకొంటున్నాం.” మాష్టారి స్పందన.
“మీకు తెలిసిన సాంప్రదాయ కుటుంబంలో, ఎవరైనా పెళ్లికొడుకు, మీకు తెలిస్తే, మా అమ్మాయి మాట జ్ఞాపకముంచుకోండి.” గురువమ్మగారి నివేదన.
“అదేమిటమ్మా! నట్టింట్లో, రాజాలాంటి పెళ్లికొడుకును పెట్టుకొని, నన్ను పెళ్లికొడుకులను చూడమంటున్నారు.” శాస్త్రిగారు చిరునవ్వుతో నర్మగర్భంగా అన్నారు.
“శాస్త్రిగారూ, మీరేమిటంటున్నారో బోధపడడం లేదు.” మాష్టారు తెలిసీ, తెలియనట్లు అడిగేరు.
“ఎవరి గురించి చెప్తున్నారండీ, మా నట్టింట్లో ఉన్నాడని.” గురువమ్మగారు, మాష్టారుకు తోడు పలికేరు.
“అదేమిటమ్మా, స్వయాన్న మాష్టారి మేనల్లుడు, మీ ఆడబడుచు కొడుకు, కాశీపతి, ఈ మధ్యనే గవర్నమెంటు ఉద్యోగంలో చేరేడు. మీకు తెలిసే ఉంటుంది.” శాస్త్రిగారు వివరంగా చెప్పేరు.
“ఆ, తెలుసు. వాడు గవర్నమెంటు ఉద్యోగంలో చేరేడని, ఆ మధ్య సీతమ్మ ఉత్తరం రాసింది. సంతోషం, అని వాడిని ఆశీర్వదిస్తూ జవాబు రాసేను. అంతేగాని, మా ఆలోచన, మీరన్నవైపు వెళ్ళలేదు.” అమాయకం ఒలకబోస్తూ మాష్టారి జవాబు.
“ఫరవాలేదు సార్. ఆలస్యమేమీ కాలేదు. ఇప్పుడయినా అటు ఆలోచించండి.” చిరునవ్వుతో, శాస్త్రిగారి సలహా.
“శాస్త్రిగారూ, మీరు చెప్పిన మాట నిజమే. కానీ, వాళ్ళ ఉద్దేశాలేమిటో, మనకు తెలీదుగదా. తీరా అడిగేక, వాళ్లేమిటంటారో. కావలసినవాళ్లు. అదే ఆలోచించాలి.” మాష్టారి సందిగ్ధం.
“శాస్త్రిగారూ, మా ఆయన చెప్పినట్లు మేమే, వాళ్ళనడిగితే, వాళ్ళు సరే అంటే, అంతకంటే కావలిసిందేమిటి. కాని కాదని చెప్పడానికి, వాళ్ళూ ఇబ్బందిలో పడతారు. అంచేత, ఈ విషయంలో, పెద్దవారు మీరు, ఓ సాయం చేయగలరా.” గురువమ్మగారి నివేదన.
“అదేమిటో చెప్పండమ్మా. నా వల్ల, ఓ మంచిపని అవుతుందంటే, సంతోషంగా తప్పక చేస్తాను.” శాస్త్రిగారి హామీ.
“ఈ విషయంలో మీరు శ్రమ తీసుకొని, మేము అడిగినట్లు కాకుండా, మీరే వాళ్ళని కదిపి చూడండి. వాళ్ళు అనుకూలంగా ఉన్నారంటే, మంచిరోజు చూసుకొని, మేముభయులం వాళ్ళని కలుస్తాం.” శాస్త్రిగారికి, గురువమ్మగారి నివేదన.
“ఇందులో శ్రమ ఏముందమ్మా. ఎల్లుండి సప్తమి, మంచిరోజు. మీరు కోరినట్లే, వారిని కలసి, మీరడిగినట్లు గాక, నేనే వారికి సలహా ఇచ్చినట్లు, ఈ విషయం కదుపుతాను. వారికి మాత్రం ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందమ్మా. కుటుంబంలోని పిల్ల. అభిమానంగా, వారితో కలసి మెలసి ఉంటుంది. వారూ అర్థం చేసుకొంటారులెండి. తప్పక మీ సంబంధానికి ఒప్పుకొంటారనుకొంటాను.” పేరిశాస్త్రిగారి భవిష్యవాణి.
“పెద్దలు. మీ నోటిమాట నిజమవ్వాలని ఆశిద్దాం.” మాష్టారి మనసులోని మాట.
సీతమ్మగారు అప్పగించిన కార్యాన్ని, విజయవంతంగా సాధించి, పేరిశాస్త్రిగారు మాష్టారి దంపతుల శలవు తీసుకొన్నారు.
అటు సీతమ్మగారి వ్యూహం, ఇటు మాష్టారి దంపతుల వ్యూహం, పేరిశాస్త్రిగారి నటనా చాతుర్యంతో ఫలించి, ఓ శుభముహూర్తాన్న, కాశీపతి, గిరిజ మెడలో మూడు ముళ్ళూ వేసేడు.

*****

1 thought on “చిన్న లెఖ్ఖల మాష్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *