April 25, 2024

ట్రీట్మెంట్!

రచన: వారణాసి వెంకట విజయలక్ష్మి

ఏమండీ కూరలబ్బాయి వచ్చినట్లున్నాడు..కొద్దిగా టమాటాలు తీసుకోరా?”
ముందు గదిలో పేపర్ చదువుతున్న రవి సమాధానం చెప్పలేదు…పరీక్షలకి ప్రిపేర్ అయితున్నంత సీరియస్ గా పేపర్ చదువుతున్నాడు… రెండోసారి చదవటం.
‘ఈయనకి వినపడదో, లేక ఇంతోటి దానికి సమాధానం చెప్పేదేమిటి అనుకుంటారో…సరే ఏదయినా ఇప్పుడు నాకు తప్పదు….బాబిగాడి కి పప్పు రడీ అవ్వాలి కదా’ ‘వేద’ విసుగుని పూర్తిగా కప్పెట్టేసి, చీర, జుట్టు సర్దుకుని వాకిట్లోకొచ్చింది. పొయ్యిలన్నీ ఆర్పే ఉన్నాయని చూసుకోవడం మరచిపోలేదు…మాడిపోతే మళ్లీ చేసే టైం లేదని
అప్పటికే పక్కింటాయన కూరలు ఏరుతున్నాడు! కాస్త తటపటాయించి…మళ్లీ ‘ రోజూ చచ్చేవాడికి ఏడ్చేదేమిటిలే’ అని బండి దగ్గరకొచ్చింది. ‘నమస్తే మాడం!’ ‘వాసు’ గారి పలకరింపుకి ‘నమస్తే’ అన్నది.
“మా ఆవిడకి నిన్నట్నుంచీ జ్వరం….ఇంకా పని పూర్తి కాలేదు…ఇక్కడేమో…
ఇంకా ఇద్దరున్నారు నాకంటే ముందొచ్చిన వాళ్ళు. నేను మా పిల్లలకి బాక్సులు పెట్టాలి…మీరేమీ అనుకోకపోతే
కొంచెం ఈ బుట్టలో ఏరి పెట్టిన. కూరలు తూకం వేయించి, ఇదిగో ఈ డబ్బులిచ్చి కూరలు తీసుకొచ్చి మా గుమ్మం ముందు పెట్టెయ్యండి నేను తీసుకుంటాను.”
‘చెట్టంత మనిషి సాయం…అందులోనూ భార్యకి జరం అంటున్నాడాయే..నేనూ ఇంకా వంట పూర్తి చెయ్యాలని ఏం చెప్తాను సరేలే ఉడికిన పప్పులో టమాటాలు పోపుచేసి వెయ్యడమే గా” అనుకుని, సరే నని చెప్పింది వేద!
“ఏమిటి.ఇంత సేపా కూరలు కొనడం? ఇక్కడ వీడు లేచాడు…పిల్ల జడలు వెయ్యాలని దువ్వెన పట్టుకు కూర్చుని ఏ వర అయ్యింది…ఎక్కడకు పోతే అక్కడ కబుర్లు. అయినా ఆయన తో నీకు కబుర్లేమిటి?”
వేద కి చెవులు పని చేయవు ఇలాంటప్పుడు… ఆరేళ్ళనించీ అలవాటైన నసోపాఖ్యానం! ఈ అసహనానికి కారణం అనుమానం!. ఆ పెనుభూతం తమ జీవితాల్ని ఎంత అల్లకల్లోలం చేస్తోందో…బాధ కొన్నాళ్ళకి అలవాటయిపోతుంది!
“ఏమిటి నీ ఉద్దేశం..సమాధానం చెప్పవు?”
ఒక్క.లుక్ ఇచ్చి” సదుద్దేశమే…మీకు.సమాధానం చెప్తే…పిల్లల బస్సు, నాబస్సు వెళ్లిపోతాయి…వాళ్లకి ఒక రోజు పాఠాలు.. ఇప్పటికే సెలవలన్నీ అత్తయ్యగారి ఆపరేషన్ కి వాడేసుకున్న నాకు ఒక రోజు జీతం..నష్టం.. మరి చెప్పమంటారా?” తీరిగ్గా చేతిలో వేడి అట్లకాడ పట్టుకుని శాంతం మూర్తీభవించిన ముఖారవిందం తో చెప్తున్న
భార్యని ఏమనగలడా మానవుడు..’అమ్మో జీత నష్టమే!’
———————–
బస్సులో తన వెనక నుంచున్న వాడు పాపం తూలిపోతున్నాడు…ట్రీట్మెంట్ చెయ్యాలిగా! వేద పిన్నీసు ఓపెన్ చేసింది…”అయ్యో పర్సు పడిపోయింది” వెనకవాడి వైపు ఒక అభ్యర్ధన లుక్…”ఎక్కడ ఎక్కడ”..ఎంత అక్కరో పాపం వెర్రి నాయనకి..కసుక్కున దిగింది వీపు మీద పిన్నీసు…దొంగకు తేలు కుట్టినట్లు సీదా నుంచున్నాడు.
ఈ అవస్థలన్నీ ఎందుకని తనతో పాటు బండి మీద తీసుకెళ్లమంటే…ఏవో కారణాలు వెతుకుతాడు. పెళ్ళాం సుఖఃపడదూ! అంత అనుమానం ఉండే మనిషికి ఈ బస్సు గోల తెలియదో లేక….
…రాక్షసి నెగ్గుకొస్తుందిలే అనుకుంటాడో…చచ్చి గీ పెట్టినా ఆ ప్రతిపాదనకి ఒప్పుకోడు! అసలు సంగతి…తనకంటే పెద్ద ఉద్యోగంలో ఉన్న భార్యతో రావడానికి ఆత్మన్యూనత! మొగుడి మాటకి విలువ ఇచ్చి బస్లో వెడుతున్నట్లు.కనిపించినా, తమరెక్కలే ఆధారం కనుక కాస్త పొదుపుగా ఉంటే తప్పులేదనుకుని వెడుతోంది!
సాయంత్రం బస్ దిగగానే కనిపించిన శాల్తీని చూసి వేద” బావా!” అని పిలిచింది. ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరొచ్చాడుట..ఆఫీస్ నుండి తాను తీసుకున్న అద్దె ఇంటికి వెళ్లే బస్ కోసం నుంచున్నాడుట.!
” మా ఇల్లు ఈ పక్కనే, రా బావా”
“”ఈసారి రమ ని కూడా తీసుకుని వస్తాలే. నాకీ ఊరు ట్రాన్స్ఫర్ కాగానే నీకు ఎన్ని సార్లు ఫోన్ చేశానో.. ఔట్ ఆప్ కవరింగ్ ఏరియా అని వచ్చింది”
“అవును బావా ఆ మధ్య నా ఫోన్ పోయింది!”
..”మళ్లీ రావడానికైనా ఇల్లు చూడాలిగా..రా తొందరగానే వెల్దువులే” అంటూ తన మేనత్త కొడుకు కృష్ణని ఇంటికి తెచ్చింది వేద!
పనిపిల్ల ఆడిస్తుంటే ఆడుకుంటున్న మూడేళ్ళ ‘బాబీ’ చెంగున దూకాడు అమ్మ ఒళ్ళోకి. ఐదేళ్ల
‘ముక్త’ కొత్త వాళ్ళని చూసి అమ్మ కుచ్చిళ్ళల్లో
దూరిపోయింది. స్కూల్ ల్లో టీచర్ గా పనిచేసే రవి
పిల్లని స్కూల్ నుండి, పిల్లాణ్ణి క్రెచ్ నుండి తెస్తాడు! ఇంజనీరింగ్ చేసి మంచి కంపెనీలో భారీ జీతం తెచ్చే పెళ్ళానికి, డబ్బు కోసం ఆమాత్రం చేయాల్సిందేగా!
కృష్ణ, వేద చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ రవి ఉనికిని పట్టించుకోనట్లున్నారు. రవి కొరకోరా చూస్తున్నాడు…. రవి ముఖకవళికలు చూస్తూ. అసలు పరిచయం చేసినప్పుడే ముభావంగా సమాధానం చెప్పాడు…ఇంతే ఈయన..అనుకున్నది వేద. ‘ఎహ పోనీ’ అనుకుంటూ కాఫీ కలపడానికి వెళ్ళింది. రవి హడావుడిగా వంటింట్లోకి వచ్చి,
“ఈ బావెక్కడ నించి ఊడి పడ్డాడు..ఇప్పుడు ఇంత హడావుడి అవసరమా? నీ కసలు ఈ మగ స్నేహితులంటే ఒళ్ళు తెలీదు!” చిన్నగా అంటున్నా రెండు గదుల అవతలున్న కృష్ణకి, ఏదో ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తుంది కదా…అయిపోయింది ఈ మాటతో వేద పెట్టుకున్న లిమిటీ దాటిపోయాడు రవి.
ఎంత ఏమీ జరగనట్లు మామూలు కబుర్లు మాట్లాడుతున్నా, కృష్ణ గ్రహించాడు.వేద కుటుంబ పరిస్థితి..!
” బావా నీ ఫోన్ నెంబర్ చెప్పు” అంటూ మొబైల్ లో సేవ్ చేసుకున్నది…మింగేసేట్లు చూస్తున్న రవిని ఇగ్నోర్ చేస్తూ!
వేద అంత మంచి ఉద్యోగం చేస్తూ,. రవిని అంత కేర్ చెయ్యాల్సిన అవసరమేమీ లేదు. పైగా.పరిస్థితిని ఎదుర్కోగల ధీర కూడాను.
పెళ్ళైన కొత్తలో ఆ యాడాదిపాటు తన అసలు రంగు బైట పడకుండా ప్రేమ లాంటిది, అవసరాలు తీర్చుకోవడానికి చూపేవాడు. తరవాత అసలు రంగులు బైటపడ్డాయి! నిమిషం చాలు వేద కి తెగతెంపులు చేసుకోవడానికి..
కానీ అసలు కారణం ఏమని చూపిస్తుంది..అనుమానిస్తున్నాడన్న అభియోగాన్ని చూపడానికి కూడా..తాను చెడ్డ కాకుండా ఓ పుల్ల విరుపు మాట అనీ అనకుండా అంటాడు…అందులోనూ పిరికితనమే!
..బ్రతకనివ్వడు… చావనివ్వడు లాగా ఉంటాయి అతని చేష్టలు. ఉండుండి వేద మొత్తే మొట్టికాయలు తింటూ ఉంటాడు!
విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చిన్నప్పట్నుంచీ పెద్దవాళ్ళు ఇంట్లో బోలెడు మంది ఉండి, ఆ ఇంటికి ఒక్క వారసుడని ముద్దు మురిపాలకన్నా., భయభక్తులంటూ ‘నీకేం చేత కాదు, నువ్వూరుకోరా ఇదే స్లోగన్ తోపెరిగాడు!,
పెళ్ళామంటే పడుండేది అని బాగా జీర్ణింపచేశారు! ఆ పెళ్ళాన్ని అదుపులో పెట్టాలి, అందుకు ఆధిపత్యం చెయ్యలేనంత ఎత్తులో ఉన్నది ఆమె!
ఏమీ చెయ్యలేని ఉక్రోషం..ఈ రకంగా నోటి తీత తో తీర్చుకుంటాడు.
ఇంతోటి దానికి రచ్చ చేసుకోవడం అవివేకమని వేద,
తన బాధని మౌన పోరాటంగా సాగిస్తోంది! ఎక్కడికక్కడ అతని తోక కత్తిరిస్తూనే ఉన్నది!
ఏమైనా ఇంక ఆటలు సాగనియ్యకూడదనుకున్నది!
“మీ బావ కి ఫోన్ చేసావా.? అసలు నీకెందుకు అతని నెంబర్?” రవి ఆ సాయంత్రం తీరిగ్గా అడుగుతుంటే..అరటికాయ ముక్కలు వేయిస్తూ చేతిలో అట్లకాడతో వెనక్కి తిరిగి,
“అయ్యో నాకు కాక ఇంకెవరికి. మా పెద్దవాళ్లకేవో గొడవలుండి గానీ నాకు మొగుడవ్వాల్సి వాడు కృష్ణ” ఉడికించాలనే అలా చెప్పడం..చాలా పెద్దవాడు! వేద సమాధానానికి తెరిచిన నోరుతెరిచినట్లే…
“మూసుకోండి..” పట్టకారతో గిన్నె దింపి పెట్టి దాంతోటే దగ్గరకొస్తున్న భార్యని చూసి ఒక్క అంగలో అవతలికెళ్లాడు.
“ఇవాళ నాకు మా ఆఫీస్ లో డిన్నరున్నది…సాయంకాలానికి కూడా వంట చేశాను..ఇదిగో వింటున్నారా”
“ఎలా వస్తావు పొద్దుబోతే.?.” పేద్ద అక్కర ఉన్నవాడిలాగే..ఎవరు దింపుతారా అని ఆరా!
“నాకేం భయం..మన వీధిలో ఉండే మూర్తి.మా ఆఫీసేగా, బండి మీద తెస్తానన్నాడు!” ‘కుళ్లి కుళ్లి ఏడవనీ ఏకవచనం తో పిలిచేంత చనువా అని’ వేద కసిగా అనుకున్నది!
“పోనీ నేను వచ్చేదా?”
‘హన్నా’ పెళ్లయిన ఇన్నేళ్ళకి మొదటిసారి ఎంత కన్సర్న్’
“ఎందుకండీ మీకు పెట్రోల్ దండగ!”.వేద ఈ మాట రవికి చాలా నచ్చింది!
…………..
పిల్లి ఎలుకల్లాగా వీళ్లిద్దరి పోరాటం సాగుతోంది! నిజానికి ఏవో పనులమీద వెళ్లినవి, బావతో వెళ్లానని,
ఆడ స్నేహితురాలితో గడిపిన టైం మగ స్నేహితులతో అనీ..కొన్ని సార్లు పిచ్చాడిలా వెనకబడి వచ్చి చూస్తే… “అయ్యో ఇప్పుడే వెళ్ళాడు నా ఫ్రెండ్..కొంచెం ముందర వస్తే పరిచయం చేద్దును కదా!” అనేది వేద!
ఆ బుర్రతక్కువ అహంకారికి ఎప్పటికో కానీ అర్ధం కాలేదు తాను ఫూల్ అయితున్నాడని!
చాలా బాధపడ్డాడు.. అదుగో పులి! అని ఏమీ లేని దాన్ని ఆపాదిస్తే వేద, ఇప్పుడు దాన్నే రివర్స్ గేర్ లో వాడి, తన వేలితోనే తన కన్ను పొడుస్తున్నదని…. స్నేహితులు లేరు, కుటుంబ సభ్యులు వేరే లేరు..ఒంటరితనంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నాడు!
వేద కూడా తన్ని తాను సమీక్షించుకున్నది!
నిజమే బాధపెట్టాడు..కానీ తాను ఎంతమంది కథలో వింటున్నది..అందులో ఈ పిచ్చి మనిషి చేసింది ఎన్నోవంతు! అయినా ఎంత కాదన్నా అతను నా బిడ్డలకి తండ్రి. అసలు ప్రేమే లేకపోతే ఇద్దరు బిడ్డలకి
జన్మ నిచ్చేవాళ్లమా? ఇదొక తరహా వ్యక్తిత్వం!
అమ్మ చెప్పేది కాదూ “అమ్మడూ! అందర్లోనూ రాశి పోసినట్లు సుగుణాలు ఉండవు. కలిసి బ్రతకాలనుకున్నాక రాజీ తప్పనిది..తప్పించుకోలేనిదీను!” అని! ఆణిముత్యాల్లాంటి అమ్మ మాటలు నాకు శిరోధార్యం! అయినా పాపం ఎలా ఆయిపోయాడో….
అన్నం పెట్టుకోవడానికి కంచం తీస్తున్న రవిని
” ఏం మీరొక్కరే తినేద్దామనా..ఉండండి.వస్తున్నా”
అంటూ పిల్లలు నిద్రపోయినట్లుగా రూఢి చేసుకుని
కంచంలో ఐటమ్స్ ఒకొక్కటీ కలిపి” మీకో ముద్దా నాకో ముద్దా” అంటూ తినిపించింది. రవికి కళ్ళనిండా నీళ్లు! ‘అమ్మ’ తనంతో స్త్రీ మగవాణ్ణి తనవాణ్ణి చేసుకోవడం, ఆమెకు వెన్నతో పెట్టిన విద్య!
‘అసలు నాదికూడా తప్పున్నది…తనలా ఎందుకున్నాడో అంచనా వెయ్యగలిగిన నేను, ముందుకొచ్చి నా స్నేహహస్తం అందించి ఉంటే…ప్చ్ చాలా కాలం వృథా అయిపోయింది.. ఇంకానా… ఊహు కాలానికి కళ్లెం వేసి… కలసిన మనసుల ఊసులన్నీ కలబోసుకున్నారు!

2 thoughts on “ట్రీట్మెంట్!

  1. వెరీ నైస్. అమ్మ తనం, క్షమా గుణం ఆడవాళ్ళ సొత్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *