March 28, 2024

తామసి – 8

రచన: మాలతి దేచిరాజు

షాక్ నుంచి తేరుకున్నాడు ఇజాక్ కొన్ని సెకన్లకి..అతనికి ఏమీ అర్థం
కావట్లేదు అసలు అలా ఎలా చేసాను అనుకున్నాడు.

“బావా… నీ మనసులో ఏముందో ఈ పుస్తకం చెబుతోంది…” అంది తను బాధ నిండిన గొంతుతో.

“నీ మొహం… ఫస్ట్ ఆ బుక్ ఏమిటో చూడు సరిగ్గా…”అన్నాడు.

తను బుక్ చూసింది… మొహంలో చిన్నగా నవ్వు. అది ఏదో కథ అని, నసీమా అంటే అందులో క్యారెక్టర్ అని అప్పుడు అర్థం అయింది తనకి. పుస్తకం తెరవగానే చూపు లవ్ సింబల్ మీద కేంద్రీకృతం అవడం వల్ల వచ్చిన చిక్కు ఇదంతా అనుకుంది.

మళ్ళీ వెంటనే ఏదో సందేహం కలిగి,
“అది సరే…అసలు నసీమా అన్న పేరు ఎందుకు రౌండ్ చేసావ్? ఇంతకీ ఏం కథ ఇది? ఎవరు రాసారు? టైటిల్ కూడా లేదు…” చకచకా ప్రశ్నల వర్షం కురిపించింది.

“అవన్నీ తీరిగ్గా తర్వాత చెప్తా గాని ముందు నువ్వు ఇంటికెళ్ళు!” అంటూ తరిమేసాడు తనని.

‘ఓ మై గాడ్… ఇలా కూడా జరుగుతుందా?’ అని నవ్వుకున్నాడు. ‘ఒక కథలో క్యారెక్టర్ తో ఇంత కనెక్టివిటీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్!’ ముసిముసి నవ్వు నవ్వాడు.

పుస్తకం అందుకుని ఎక్కడవరకు చదివాడో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాడు.

***

సెంట్ మేరీస్ చర్చ్! ఆదివారం కావడంతో అంతా కోలాహలంగా ఉంది. సెకండ్ మాస్
(ప్రార్థన) మొదలై పది నిమిషాలైంది.

గబగబా అడుగులేస్తూ నడుస్తోంది, షీబా చర్చ్ వైపు. లోపలికెళ్ళి కూర్చుని ప్రార్థనలో నిమగ్నమైంది.

గంటన్నర తర్వాత ప్రార్థన ముగిసింది, ఫాదర్ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. షీబా కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని బయటకి వచ్చి ఆటోని పిలిచి ఎక్కింది.

“శాంతి గృహం అనాథ బాలల శరణాలయం” అని పెద్ద పెద్ద అక్షరాలలో రాసి ఉన్న ఒక ఇంటి ముందు ఆగింది ఆటో. షీబా ఆటో దిగి డబ్బులిచ్చి లోపలికి కదిలింది.

ఆమె చేతిలో పెద్ద కవర్.
“ప్రైస్ ద లార్డ్ సిస్టర్” ఎదురవుతున్న నన్ ని విష్ చేసింది.
“ప్రైస్ ద లార్డ్ … గాడ్ బ్లెస్ యు…” అంది ఆవిడ.

పెద్ద హాల్ లో పిల్లలంతా కూర్చుని ఉన్నారు. ఒక మేజా బల్లని డెకరేట్ చేసి ఉంచారు. బోర్డ్ పైన ‘హ్యాపీ బర్త్ డే గౌతమ్ కృష్ణ’ అని ఇంగ్లీష్ లో రాసి ఉంది.

షీబా లోపలికి రాగానే పిల్లలంతా “హాయ్ అక్కా, హాయ్ అక్కా…” అంటూ చేతులూపారు. బదులుగా తనూ విష్ చేసింది.

పిల్లలు పుట్టిన రోజు పాట ఆలపిస్తున్నారు షీబా కేక్ కట్ చేస్తుంటే. పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేసింది తను. అందరూ ఆనందంగా తింటున్నారు.

“గత అయిదు సంవత్సరాలుగా, ప్రతీ ఏటా… గౌతమ్ పుట్టిన రోజుకి నువ్వు ఇలా వచ్చి ఈ పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేయడం, వాళ్లతో గడపడం ఆనందంగా అనిపించినా… ఒక్కోసారి నీ పిచ్చి ప్రేమ చూస్తుంటే భయం కూడా వేస్తుంది. అతను కాదంటే నువ్వు ఏమైపోతావో అని…” కారిడార్ లో షీబాతో నడుస్తూ చెప్పింది సిస్టర్ జోన్స్. మౌనం వహించింది షీబా.

“ఇప్పటికైనా నీ ప్రేమని అతనికి చెప్పి ఒప్పుకుంటే త్వరగా పెళ్ళి చేసుకో… లేదంటే కాలం గడిచే కొద్ది మరింత నొప్పి… ఆల్ ద బెస్ట్” అంది చిరునవ్వుతో.

ఆవిడ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనిపించింది తనకి. కానీ ఏం చేస్తుంది? ఇప్పటివరకు గౌతమ్ తో మాట్లాడిందే లేదు, రోజూ అతన్ని చూడటం తప్ప. అది కూడా తన హాస్టల్ కిటికీలో నుంచి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అంతే. అప్పుడప్పుడూ అనుకుంటుంది, కేవలం తనని చూడటానికే తన హాస్టల్ రూమ్ అతని పెంట్ హౌస్ కి ఎదురుగా ఉందేమో అని… అయిదేళ్లుగా అతను ఖాళీ చేయకుండా అదే రూమ్ లో ఉండటం కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది తనకి. ఎప్పుడైనా అతను ఏ..టీ తాగటానికో , ఇంకేదైనా కొనడానికో వస్తే, వెంటనే వెళ్లి అతన్ని దగ్గర నుంచి చూస్తుంటుంది. అదో ఆనందం… కానీ ఎప్పుడూ అతను ఆమెని అంత పరిశీలనగా చూడలేదు, ఏదో ఏమరపాటులో చూస్తే చూసివుండొచ్చు. ఆ మాత్రం దానికే తను పడే సంబరం మాములుగా ఉండదు… తన పిచ్చి చూసి ఒక్కోసారి స్నేహితులు వేళాకోళం చేస్తుంటారు, ఒక్కోసారి జాలి పడతారు, ఒక్కోసారి హెచ్చరిస్తారు, ఒక్కోసారి అసలు పట్టించుకోరు. ఎవరెన్ని చెప్పినా, ఏమనుకున్నా తన ప్రేమ మాత్రం మారదు. ఇన్నాళ్ళ తన ఆశ నెరవేరడానికి మరుసటి రోజు జరగబోయే సంఘటన కారణం అవబోతుంది.

***

నసీమాను చూసి వచ్చినప్పటి నుంచి గౌతమ్ ముఖంలో కళ లేదు. పని మీద అతనికి ధ్యాస ఉండట్లేదు. ఇక తిండి, నిద్ర మాట సరేసరి… ఆఫీస్ లో తన డెస్క్ దగ్గర పరధ్యానంగా ఉన్న అతన్ని పలకరించాడు చందు.

“హే గౌతమ్… ఏమైంది? అలా ఉన్నావ్?”
“నథింగ్…”
“బిహైండ్ ద వర్డ్ నథింగ్, ఆల్వేస్ దేర్ ఈజ్ సంథింగ్…” అతని మాటలు నిజమనిపించాయి గౌతమ్ కి.

పొగలు కక్కుతున్న కాఫీని ఒక సిప్ చేసి…
“సో… నసీమాకి పెళ్ళి అవటం నిన్ను ఇంత కలవరపెట్టింది… అంతేనా..?” అని అడిగాడు.

“ఇదీ అని చెప్పలేను… తను నా సొంతం కాలేదనే బాధో, ఇంకొకరి సొంతం అయిందనే ఉక్రోషమో, నా ప్రేమని తనతో చెప్పలేకపోయాననే నిట్టూర్పో, పోనీ తనైనా నన్ను ఇష్టపడుతున్న సంగతి చెప్పలేదే అన్న దిగులో… ఏమిటో… నేనేం చెప్పలేను.” అంటూ బాధ పడ్డాడు.

“కూల్ డౌన్ గౌతమ్… ఇదొక ఫేజ్ అంతే… నూటికి తొంభై శాతం మందిది ఇదే సమస్య. ఈ బాధ కొన్నాళ్ళు పాటు ఉంటుంది… కాలం గడిచే కొద్దీ చేదు గతం కూడా తీపి జ్ఞాపకంగా మారిపోతుంది. మరో కొత్త పరిచయమో, స్నేహమో మనలో ఇంకో కొత్త ఆశల్ని , కోరికల్ని మొలకెత్తిస్తుంది. ప్రేమ పడేసిన చోటే మనం ఆగిపోకూడదు… లేచి నిలబడితే చెయ్యి ఇవ్వటానికి అదెప్పుడూ సిద్ధంగానే ఉంటుంది… నసీమా నీ ఫస్ట్ లవ్.
నీకు ప్రేమ అనే ఫీలింగ్ ని పరిచయం చేసింది తను… ఆ తొలిప్రేమని అలా గతంలాగే ఉండనివ్వు. నీ జీవితంలో రాబోయే మరో ఉదయానికి స్వాగతమివ్వు. బోర్ కొట్టిస్తున్నానా?”

“నో నో, అలా ఏం లేదు చందూ…”

“నేనూ లవ్ ఫెయిల్యూర్ నే. కోలుకోడానికి చాలా టైం పట్టింది… కానీ ఇప్పుడు ఆల్ ఫైన్. అన్నిటికీ మందు… ‘మందే’ అని చెప్పను గానీ, ఒక రకంగా అదొక రిలీఫ్ యే అనుకోవాలి… లేకపోతే తాగలేం బ్రదర్..” నవ్వాడు.

గౌతమ్ కూడా లైట్ గా స్మైల్ ఇచ్చాడు.
“ఈవినింగ్ సరదాగా బార్ కి వెళ్లి రెండు రౌండ్స్ వేస్తే ఆల్ సెట్.” అంటూ లేచి వెళ్ళిపోయాడతను, “సీయూ ఇన్ ద ఈవినింగ్!” అని చెప్పి.

గౌతమ్ కి చందు మాటలు కొంత ఊరట కలిగించాయి. మనిషి మనసు విచిత్రమైనది. నిరాశకి లోనైన ప్రతీ సారీ ఏదో కొత్త ఆశాభావం కావాలి. లేదంటే మన మాట వినదది.

రాత్రి పదయింది. హైదరాబాద్ నగరంలో సగానికి పైకి మగాళ్ళు బార్స్ లోనే ఉండే రోజది. పైగా వీకెండ్…

గౌతమ్, చందు కూడా ఒక బార్ లో సెటిల్ అయ్యారు. అప్పటికే… ఒకటి, రెండు రౌండ్స్ అయ్యాయి అని తెలుస్తోంది.

గౌతమ్ కి మందు అలవాటు లేదు అదే మొదటి సారి. మాటల్లో పడి ఎంత తాగాడో కూడా లెక్క తెలియలేదు. బాగా మత్తెక్కింది.

చందూది కూడా అదే పరిస్థితి. ఇంతలో వాళ్ళ దగ్గరికొచ్చి చేరాడు గోపాల్.

“హలో సార్, మై నేమీజ్ గోపాల్.” అన్నాడు, రోల్ అవుతున్న మాటలతో.

“హలో…” గౌతమ్.

“హలో..” చందు.

“మీరు లవ్ ఫెయిల్యూరా?” గౌతమ్ వైపు చూసి అడిగాడు, తూలుతూ.

“మీరెలా కనిపెట్టారు?”

“వీకెండ్ లో ఫుల్ గా తాగి తూగుతుంటే… అయితే లవ్ ఫెయిల్యూరైనా అయుండాలి, లేదా భార్యాబాధితుడైనా అయుండాలి. ఈ రెండూ కాకపొతే… బలిసిన బాపతైనా అయి ఉండాలి.” చివరి మాటకి గుర్రున చూసాడు గౌతమ్.

“అమ్మమ్మమ్మా… తప్పుగా అనుకోవద్దు. బలిసిన బాపతంటే, సౌండ్ పార్టీ అని.” అర్థం చేసుకున్నాడతను.

“మీ ఫేస్ చూస్తుంటే… లవ్ ఫెయిల్యూర్ లాగే అనిపించారు.” నవ్వుతూ చెప్పాడు.

“నేను లవ్ ఫెయిల్యూర్ కాదు…” గౌతమ్ చెప్పాడు.

“మరీ?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడతను.

“ఇప్పుడూ… ఇద్దరూ లవ్ చేసుకుని అందులో ఎవరో ఒకరు ఇంకొకర్ని మోసం చేసో, సిట్యువేషన్ వల్లో వదిలేసిపోతే…
వాళ్ళు లవ్ ఫెయిల్యూర్!”

“కరెష్టే కదా…” గోపాల్.

“అసలు… ఒకరి లవ్ ని ఒకరు చెప్పుకోకుండా మనసులో దాచుకుంటే… వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ ఎలా అవుతారు?”

“హండ్రెడ్ పర్సెంట్ అవరు… యు ఆర్ కరెష్ట్, కరెష్ట్!” అంటూ పడిపోయాడు గోపాల్.

అప్పటికే చందు అవుట్ అయిపోయాడు.
బార్ నుంచి బయటకి వచ్చాడు, గౌతమ్. జోరుగా వర్షం… బైక్ స్టార్ట్ చేసి కదిలాడు.
రూమ్ కి వచ్చి రాగానే, అపార్ట్మెంట్ కింద బైక్ పార్క్ చేస్తూ కూలబడ్డాడతను. వాచ్మెన్ చూసి, అతన్ని రూమ్ లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు.

***

తెల్లవారి చాలాసేపైంది. టైమ్ తొమ్మిది కావొస్తుంది. సోమవారం కావడంతో హాస్టల్ లో అందరూ చకచకా తయారవుతున్నారు, ఆఫీసులకి వెళ్లేందుకు.

షీబా మాత్రం గడిగడికీ కిటీకీ దగ్గరకొస్తుంది, చూస్తోంది. గౌతమ్ జాడ లేదు. అసలు రూమ్ తలుపు కూడా తీయలేదు. పోనీ… అసలు రాత్రి రూమ్ కి రాలేదా! అందామంటే బయట గొళ్ళెం, తాళం రెండూ వేసి లేవు. ఇలా ఇదివరకు కూడా జరిగింది. తన ఆఫీస్ టైముకి తనెళ్ళిపోయేది. గౌతమ్ కనిపించినా, కనిపించకున్నా… దాదాపు చూసే వెళ్ళేది.
కానీ ఈసారి ఎందుకో తను అతని రూమ్ వైపు చూస్తూనే ఉంది. సమయం పది… పదిన్నర… పదకొండున్నర… ఒంటిగంట… తన మనసేదో కీడు శంకించింది…

వెంటనే లేచి కిందకు దిగి గౌతమ్ రూమ్ వైపు పరుగులు తీసింది.
టెర్రస్ పైకొచ్చి గౌతమ్ రూమ్ తలుపు తట్టగానే ఆమె చేతి ఒత్తిడికి తలుపు తెరుచుకుంది.
లోపల గడియ పెట్టి లేదని అర్థమైంది.

“గౌతమ్… గౌతమ్!!” ఇదే మొదటిసారి అతన్ని ఆమె పిలవడం. అతని కోసం ఆ పేరు పలకడం.

నచ్చింది తనకి ఆ భావన. ఎంతకీ బదులు లేదు… లోపలికి అడుగేసింది.

నిండా ముసుగు కప్పుకుని ఉందో ఆకారం , నేల మీద వేసున్న పరుపుపై పడుకుని.
కాస్త కంగారు పడింది తను.

అడుగులో అడుగు వేస్తూ భయంగా అతన్ని సమీపించి, “గౌతమ్!”అని నెమ్మదిగా ముసుగు తీసింది… వెచ్చగా ఉంది దుప్పటి. అతని మొహం అంత దగ్గరగా చూడటం తనకి ఆనందాన్నిచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితిలో చూడటమే కాస్త బాధ కూడా కలిగించింది.

అతని నుదుటి పై చెయ్యి వేసింది అనుమానంగా. ఒళ్ళు కాలిపోతుంది… తన గుండె కరిగిపోయింది. డాక్టర్ ని తీసుకురావడం… ట్రీట్మెంట్… క్షణాల్లో జరిగిపోయాయి. కానీ సాయంత్రం వరకు అతను పూర్తి స్పృహలోకి రాలేదు… అప్పటివరకు ఆమె అతన్నే చూస్తూ కూర్చుంది తన్మయత్వంగా.

నెమ్మదిగా అతను స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాడు. మసకగా కనిపిస్తోంది ఏదో రూపం. కళ్ళు చిట్లించి చూసాడు కనిపించింది తను పూర్తిగా, చేతిలో పాల గ్లాసుతో.
ఇబ్బందిగా లేవబోతున్న అతనికి సాయపడింది. అతన్ని దగ్గరకి తీసుకుని పాలు తాగిస్తున్నప్పుడు ఆమె మనసు పరవశించిపోయింది.

అతను పాలు రెండు గుటకలు వేసి… “ఇంతకీ మీరు?” అడిగాడు.

“పక్క హాస్టల్ లో ఉంటాను… ఎప్పుడూ ఏడింటికే లేచే మీరు ఇంతసేపైనా బయటకి రాకపోయేసరికి ఏమైందో అని వచ్చాను… తీరా చూస్తే మీరిలా…” అంది సిగ్గు, కంగారు కలిసిన గొంతుతో.

“నేను మీకు తెలుసా?”

“మీ పేరు, మీ ఉద్యోగం తెలుసంతే!” బదులిచ్చింది.

“మరి ఇదంతా…” ఆమెకి అర్ధం అయ్యిందని గుర్తించి ఆగాడు.

“వీధి చివర్లో, బస్ స్టాపుల్లో, ఆఫీస్ దగ్గర, ఇలా మనం రోజూ తిరిగే ప్లేస్ లో కచ్చితంగా కొంతమందినైనా రోజూ చూస్తుంటాం.. అదే వాళ్ళు ఒక్కరోజు కనబడకపోతే ఏమై ఉంటుందో అని ఒక్క క్షణమైనా ఆలోచిస్తాం… అలాంటిది మిమ్మల్ని గత అయిదేళ్లుగా చూస్తున్నా…”

అతని భ్రుకుటి ముడిపడింది…
అది గమనించిన తను, “నా బెడ్ కిటికీ పక్కన ఉండటంతో నేను లేవగానే సూర్యుడి కన్నా ముందు మిమ్మల్ని చూసిందే ఎక్కువ!” చెప్పింది.

అతను కుదుటపడ్డాడు.

“థ్యాంక్స్… ఐ లైక్ యువర్ కైండ్ నెస్… మీ పేరు?” అడిగాడు.

“షీబా రత్న కుమారి” చెప్పిందామె ఆనందంగా. అతను తలూపాడు.

“నేను బయలుదేరుతాను. ఇడ్లీ,పాలు ఉన్నాయి. మజ్జిగ కూడా ఉంది… రాత్రి ఈ రెండు టేబ్లెట్స్ వేసుకోవాలి… సిరప్ ఒక స్పూన్… జాగ్రత్త…” అంటూ వెనక్కి రెండు, మూడు అడుగులేసి వెనుతిరిగింది.

“షీబా!”పిలిచాడతను… కాదు కాదు ఆమె దృష్టిలో తొలిసారి తన పేరు పలికాడు.

రెహమాన్ సంగీతంలో వేణు నాద స్వరం విన్నట్టనిపించింది తనకి.
ఎంతమంది మన పేరు పలికినా, మనం ప్రేమించిన వాళ్లు పలికితే ఆ ఆనందం వేరు.
ఆమె అతని వైపు చూసింది.

“థ్యాంక్ యూ!” అన్నాడతను. నవ్వి కదిలింది తను.

ఆమె ఆనందానికి అవధుల్లేవు. చిందులేసుకుంటూ హాస్టల్ లోకి వచ్చింది. కనిపించిన తన స్నేహితులందరినీ పట్టుకుని బొంగరంలా తిరిగింది. రూమ్ కి వచ్చి మంచం పై వాలింది రొప్పుతూ.

గుండె లోని ప్రేమంతా కళ్ళలోకి చేరి ఆనందపు అలలు సుడులు తిరుగుతున్నాయి. కళ్ళలోకి కన్నీరు చేరిందంటే మనసులోని ప్రేమ స్వచ్ఛమైనదని అర్థం. కళ్ళలో నిండి ఉన్న ప్రేమతో అతని రూమ్ వైపు చూసింది.

“ఇక్కడ నుంచి అక్కడికి దూరం పదడుగులే కావొచ్చు… కానీ వెళ్ళటానికి అయిదేళ్ళు పట్టింది.” అనుకుంది మనసులో.

ఆమె ఆ రోజంతా అలా అతని రూమ్ వైపు చూస్తూనే ఉండిపోయింది.

***

అప్పటి నుంచి గౌతమ్ కి, షీబాకి మధ్య పరిచయం పెరిగింది. కనిపించినప్పుడు పలకరించేవాడతను. (అతనికి కావాలని తను ఎదురు వెళ్ళేది అది వేరే విషయం.)

నెమ్మదిగా ఆ పరిచయం కాస్తా, స్నేహంగా మారింది. ఉదయం కలిసి ఆఫీసులకి వెళ్ళడం సాయంత్రం వచ్చాక ఏ పార్క్ కో వెళ్లి కబుర్లు చెప్పుకోవడం, ఆదివారం వస్తే గౌతమ్ రూమ్ కి తన ఫ్రెండ్స్ తో వెళ్లి చికెన్, మటన్ వండుకుని తిని ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు గౌతమ్ బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటివి చేసేది, గౌతమ్ ఎంత వద్దని వారించినా.. ఇలా ఓ నెల్లాళ్ళు గడిచింది..

***

ఆ రోజు రాత్రి – హాస్టల్ లో డిన్నర్ అయిపోయాక బయటకి వెళ్లి కేక్ తెచ్చింది షీబా. పన్నెండు దాటాక గౌతమ్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. తన ఫ్రెండ్స్ ఎవరికీ ఏమీ చెప్పలేదు. తను మాత్రమే గౌతమ్ తో ఆ మూమెంట్ స్పెండ్ చేయాలనుకుంది.
అదే తన జీవితంలో తను చేసిన అతి పెద్ద తప్పని చాలా ఆలస్యంగా తెలుసుకుంది.

టైం పదకొండు ముప్పావు అయ్యింది. కేక్ తీసుకుని హాస్టల్ బయటకి వచ్చి గౌతమ్ రూమ్ వైపు వెళుతోంది తను. కాస్త చీకటి గానే ఉంది. నాలుగు కుక్కలు, ఒక స్కోడా కార్ ఉన్నాయి అంతే ఆ వీధిలో..

అయినా ఏముంది? నాలుగడుగుల దూరం. అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యి టెర్రస్ పైకి వెళ్లి, గౌతమ్ రూమ్ ముందు నిలుచుంది. పన్నెండు అవ్వటానికి ఇంకా రెండు నిమిషాలుంది అనగా… వాచ్ చూసుకుని తలుపు కొట్టబోయింది.

ఉన్నట్టుండి ఆమె నోరుని నొక్కేసిందో చెయ్యి మరో చెయ్యి నడుమును చుట్టుకుని పైకెత్తింది. మూలుగుతుంది తను. ఒళ్ళు గాల్లో తేలిపోయింది. గింజుకుంటున్న కాళ్ళని ఇంకెవరో పట్టుకున్నారు. చేతిలో కేక్ ప్యాకెట్ గుమ్మం దగ్గరే పడిపోయింది!

రెండు గంటల తర్వాత…

వీధిలో కుక్కలు మొరుగుతుంటే, ఆగి ఉన్న ఇన్నోవాలో నుంచి బయటకి విసిరేయబడింది షీబా… ఆమెనలా నిర్దయగా విసిరేసి రయ్యిమని వెళ్ళిపోయిందా కారు.

గుండెలు పగిలేలా ఏడుస్తూ, ఏమీ తోచని పిచ్చిదానిలా చూసింది అటూ,ఇటూ…
కొంత చీకటి, కొంత వెలుగు తప్ప ఏమీ కనబడలేదు తనకి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలదు ఏ ఆడపిల్ల అయినా!

దురదృష్టమైన విషయం ఏంటంటే, కనీసం ఇలా తన బ్రతుకుని నాశనం చేసిందెవరో కూడా తను చూడలేదు… ఇక ఎవరికి చెప్పుకుంటుంది? ఏమని చెప్పుకుంటుంది?

అడుగు తీసి అడుగు వేస్తుంటే కలిగే నొప్పిని పంటి కింద అదిమి పట్టుకుని నడుస్తోంది. ఎంత కన్నీరు వచ్చి ఏం లాభం, ఈ మచ్చని ఇసుమంత కడగలేనప్పుడు!

అసలు ఈ సమాజంలో స్త్రీ కి రక్షణ ఎప్పుడు ఉంటుంది? రాత్రి పూట గస్తీ కాసే పోలీసులేమయ్యారు? మీ చుట్టుపక్కల ఏదైనా వాహనం చాలా సేపు ఉంటే వెంటనే పోలిస్ లకు ఫిర్యాదు చేయాలనే సామాజిక బాధ్యత జనాల్లో నశించిందా? ఎవర్నని ఏం లాభం?

అసలీ సమయంలో బయటకి ఒంటరిగా రావడం కూడా తప్పే… ఇలా అనుకుంటూ హాస్టల్ చేరుకుంది.

స్నానం చేసి, నైటీ వేసుకుని బెడ్ పైన నడుము వాల్చింది… దుఃఖం ఆమె మనసుని దహిస్తోంది. కిటికీ చువ్వని పట్టుకుంది కోపంగా, కసిగా, బాధగా… ఏడుపు తన్నుకొస్తోంది, జరిగింది తలుచుకుంటే. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. అయినా బాధ, ఏడుపు ఆపితే ఆగవు. వాటంతట అవి ఆగాల్సిందే… మనిషి ఎంత బాధలో ఉన్నా ఆకలీ, నిద్రా తప్పవు. ఆ రాత్రి తనక్కూడా కలత నిద్ర తప్పలేదు…

***

తెల్లవారింది. గౌతమ్ నిద్ర లేచి బయటకి వచ్చేసరికి, గుమ్మం దగ్గర పడి ఉన్న ప్యాకెట్ కాలికి తలిగింది. ఏమిటాని తెరిచి చూస్తే కేక్, దాని పైన “HAPPY BIRTHDAY GOUTHAM” అని వ్రాసి ఉండటం చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు.

ఆఫీసుకి వెళుతూ, షీబా కోసం చూసాడు. కనిపించలేదు. సాయంత్రం కలవచ్చనుకుని వెళ్ళిపోయాడు.

సాయంత్రం ఆఫీసు నుంచి రూమ్ కి వచ్చాక కూడా షీబా జాడ లేదు. లేడీస్ హాస్టల్ అవడంతో తను వెళ్లి అడగలేడు. చేసేదిలేక ఊరుకున్నాడు.

రెండు, మూడు రోజులవరకు షీబా గౌతమ్ ని కలవలేదు.

నాలుగో రోజు గౌతమ్ తన కొలీగ్ పాప బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తున్నాడు.

పార్టీ సిటీ అవుట్ స్కర్ట్స్ లోని ఒక రిసార్ట్ లో అవుతోంది. అప్పటికే టైము పదకొండున్నర కావొస్తుంది. తను వెళుతున్న దారిలో ఒక రైల్వే ట్రాక్ దాటాల్సి వచ్చింది అతను. ట్రాక్ దాటుతుండగా, తన బైక్ సరిగ్గా ట్రాక్ మధ్యలో ఆగిపోయింది. కిక్ కొట్టాడు, స్టార్ట్ కాలేదు. మళ్ళా కొట్టాడు, స్టార్ట్ కాలేదు.

ఇంతలో “కూ…”అని ట్రైన్ కూత వినిపించింది. తల తిప్పి కుడి వైపు చూస్తే కనుచూపు మేరలో సన్నగా ట్రైన్ లైట్ కనిపిస్తుంది. సరిగ్గా తనకి, ట్రైన్ కీ సగం దూరంలో ఒక ఆకారం నడుచుకుంటూ వెళుతోంది. మెరుపు వేగంతో దిగి, బైక్ పక్కకు తోసేసాడు ట్రాక్ కి అవతల.

పరుగు,పరుగున వెళుతున్నాడు… ట్రైన్ లైటింగ్ తన కంటి చూపుకి పోనుపోనూ పెద్దగా కనబడసాగింది. గౌతమ్ పరుగు వేగం పెరిగింది. ట్రైన్ లైటింగ్ పెద్దదవుతోంది.
ఆ ఆకారం ఒక స్త్రీ అని కొంత దూరం పరిగెత్తాక తెలిసింది. కానీ అతని చూపు ట్రైన్ లైట్ పైనే ఉంది. ఇంకా వేగం పెంచాడు… ట్రైన్ ఇంజెన్ లీలగా కనబడసాగింది తనకి.

ట్రైన్ కి ఎదురెళుతున్న అమ్మాయి ట్రైన్ సమీపిస్తుండగా నిలబడింది. అదే ఆమెను కాపాడింది. ఆమె నిలబడేసరికి గౌతమ్ పరుగు పెంచడంతో ట్రైన్ ఆమెను సమీపించే సమయానికి చప్పున పక్కకు లాగేసాడు. ట్రైన్ రయ్యిమని వెళ్ళిపోయింది… ఇద్దరికీ ప్రమాదం తప్పింది.

తను కాపాడింది షీబాని అని తెలిసి ఒకింత ఆనందం, ఒకింత బాధ రెండూ కలిగాయి.
“ఏంటి షీబా ఇది?” మౌనంగా కూర్చున్న తనని అడిగాడు.
తను ఇంకా మౌనంగానే ఉంది.
“అడుగుతుంది నిన్నే.. చచ్చేంత కష్టం ఏమొచ్చింది?”

“నన్నేం అడగొద్దు గౌతమ్…” చెప్పింది తను నేల చూపులు చూస్తూ.

“పిచ్చి దానిలా మాట్లాడకు… ఎవరికైనా చెప్పుకుంటేనే కదా… సమస్య అయితే పరిష్కారం, కష్టం అయితే సాయం, బాధైతే ఓదార్పు దొరికేది?” అనునయంగా పలికాడు.

“నాది సమస్య కాదు, కష్టం కాదు, బాధ… అయినా అది ఓదారిస్తే పోయేది కాదు.” నిర్లిప్తంగా చెప్పింది, షీబా.

ఆమె పక్కన కూర్చున్నాడు గౌతమ్.

భుజం మీద చెయ్యి వేసి, “ప్రాణంలా ప్రేమించావ్, నాతో కూడా చెప్పవా?” అనగానే అతని వైపు ఆశ్చర్యంగా చూసింది.

తనకేం అర్థం కాలేదు కాసేపు. ఆమె ఆశ్చర్యానికి ఆనకట్ట వేస్తూ,
“నాకెలా తెలుసనుకుంటున్నావా? సిస్టర్ జోన్స్ నాకంతా చెప్పింది…” అనగానే
అమాంతం అతన్ని హత్తుకుని ఘొల్లున ఏడవసాగింది.

అతను నిశబ్దంగా, తన గుండె మీద వాలిన ఆమె తలనిమురుతూ ఉండిపోయాడు.
కొంతసేపటికి ఆమె దుఃఖం తగ్గుముఖం పట్టింది.

నెమ్మదిగా ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని, “ఏమైందో చెప్పు షీబా…” లాలనగా అడిగాడు.

ఆమెకి మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది… జరిగింది చెప్పింది… ఆకాశంలో ఉరుముల శబ్దం…

తను బయటకి ఏడుస్తుంది, అతను లోపల బాధ పడుతున్నాడు… వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను మరింత దగ్గరకి తీసుకున్నాడు.

ఆ క్షణం అతని సాన్నిత్యం ఆమెకి కొంత సాంత్వన కలిగించింది.

షీబాకి అలా జరగడం గౌతమ్ ని బాగా కలచి వేసింది. ఇప్పుడు తనకి న్యాయం జరగాలి!
న్యాయం అంటే ఆ నలుగురితో ఆమెకి పెళ్ళి చెయ్యాలా? జరిగే పనేనా అది? వాళ్లకి శిక్ష పడేలా చెయ్యలి… దాని వల్ల ఆమెకి ఎలాంటి ఉపయోగం లేదు, కానీ ప్రతీకార వాంఛ తీరుతుంది, మరో ఆడదానికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది. వాళ్ళని ఎలా అయినా పట్టుకుని తగిన శాస్తి చెయ్యాలి… ప్రతిజ్ఞ గా అనుకున్నాడు గౌతమ్ మనసులో.

కానీ ఎలా??? షీబా చెప్పిన ఆధారాల ప్రకారం వాళ్ళని పట్టుకోవడం కష్టమే… ముక్కూ, మొహం తెలియని వాళ్ళని పట్టుకోవడం కష్టం, ఒకవేళ పట్టుకున్నా తప్పు చేసింది వాళ్లే అని నిరూపించడం ఇంకా కష్టం… వాళ్ళకి తన చేతే బుద్ధి చెప్పించాలి… అంతే!

***

1 thought on “తామసి – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *