March 29, 2024

ధృతి – 1

రచన: మణి గోవిందరాజుల

వణుకుతున్న చేతులతో చీటీ ని గట్టిగా పట్టుకుంది ధృతి.
“హే! ధృతీ ! తొందరగా తెరువు. ఏమి రాసి వుందో మేము చూడాలి…ధృతి…ఓపెన్ ద స్లిప్…ధృతి…ఓపెన్ ద స్లిప్… రిధమిక్ గా అరవసాగారు చుట్టు వున్న స్టూడెంట్స్.
మిగతా విద్యార్థులంతా అరుపులతో ఎంకరేజ్ చేయసాగారు.
“రాజారాం మోహన్ రాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్” లో ఆ రోజు రాగింగ్ జరుగుతున్నది. రాగింగ్ ని ప్రభుత్వం బాన్ చేసినా, సరదాగా చేసుకుంటాము, వయొలెన్స్ లేకుండా అని ప్రిన్సిపల్ నుండి పర్మిషన్ తీసుకుని, పొద్దుటినుండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు .ఫస్ట్ యియర్ స్టూడెంట్స్ ని ఒక్కళ్ళని కూడా కదలనీయలేదు. అంతా సరదాగా ఉండబట్టి కొత్తగా కాలేజీలో చేరిన వాళ్ళు కూడా వాళ్ళతో బాటు అల్లరి చేస్తున్నారు. అంతటా చక్కని ఆరోగ్యకరమైన వాతావరణం వుంది. అందరూ అయిపోయారు. ఇక ధృతి ఒక్కతే మిగిలింది. అప్పటివరకు తన ఛాన్స్ వచ్చినా పక్కవాళ్ళకిస్తూ వెనక్కి వుండిపోయింది. ఇక లాస్ట్ అయ్యేసరికి గోల చాలా ఎక్కువయ్యింది. చీటీ తెరిస్తే అందులో ఏమి ఉంటుందో అనే భయంతో తెరవకుండా అలానే పట్టుకుంది ధృతి. అందుకే పిల్లల గోల మరీ ఎక్కువయ్యింది.
“ఏయ్! ఇప్పటివరకు మేమందరమూ చేయలేదా? పాపం మంచివాళ్ళే మన సీనియర్స్… నో భయం, నో టెన్షన్. హాప్పీగా అందులో రాసి వుంది చేసెయ్యి” ఎంకరేజ్ చేసారు ఫ్రెండ్స్..
“ఏముటుందీ? మహా అయితే కాలేజి చుట్టూ తిరుగు అనో, గంతులు వేయమనో అంటున్నారు. ఇప్పటిదాకా మేము చేయలేదా ఏంటి? ఓపెన్ చేయి తల్లీ” అంటున్నారు మిగతా గాల్స్.
“ఇదిగో అమ్మాయ్! నేనసలే మంచివాణ్ణి కాదు.ఈ కాలేజీ లో ఎవర్నడిగినా చెప్తారు నా రౌడీయిజం గురించి. ఏదో మంచిగా చెప్తున్నాము. విన్నావా సరే… లేదంటే ఏమి జరుగుతుందో తెలుసా?” అందరిలోనుండి ముందుకొచ్చిన ఒక అబ్బాయి బెదిరింపుగా అడిగాడు.
ఆ అబ్బాయి బెదిరిస్తున్నట్లుగా అడుగుతున్నా కూడా కళ్ళు. పెదవులు అల్లరిగా నవ్వుతున్నాయి..
“ఏమి జరుగుతుందేమిటి?” అన్నట్లుగా కళ్ళెత్తి చూసింది.
“బాబోయ్ ! కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు” గుండె పట్టుకుంటూ అనుకున్నాడు.
“నలుగురం కలిసి నిన్ను పట్టుకుంటాము.ఇద్దరు నీ చేతులు పట్టుకుంటారు….”
అప్పటిదాకా భయంతో ముడుచుకుని కూర్చున్నదల్లా, లేచి నడుముమీద చేతులేసుకుని, నిటారుగా నిలబడి “ఓస్! ఇంతేనా ..ఇంకా ఏమి చెప్తారా అని చూస్తున్నాను” అన్నది కళ్ళెగరేస్తూ. అప్పటివరకూ ధృతి వెంట పడుతున్న అందరూ కూడా దయ్యాన్ని చూసినట్లుగా భయపడి ఒక్కవుదుటున నాలుగడుగులు వెనక్కి వేసారు.ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మూర్ఛ వచ్చినట్లుగా కిందపడిపోయారు.వాళ్ళని చూసి పగలబడి నవ్వారు ఫ్రెషర్స్ అందరూ “వ్వె..వ్వే…”. థమ్స్ అప్ చేతులు పెట్టి కొందరు, చప్పట్లుకొడుతూ కొందరు, వెక్కిరిస్తున్నట్లుగా నవ్వారు.
“ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినప్పటినుండి ఎదురు చూస్తున్నాను రాగింగ్ డే గురించి. ఎంతో ఊహించుకున్నాను. ఇంతేనా?” అల్లరిగ నవ్వింది ధృతి.
“అమ్మో! అమ్మో! మీరు పిల్లలు కాదు పిడుగులు. మేము చేరిన దగ్గరినుండి చూస్తున్నాము ఇంత షాక్ యెప్పుడూ కొట్టలేదు” గుండెలు బాదుకుంటూ అన్నాడు అందులో ఒక అబ్బాయి.
చలనం లేకుండా నిలుచున్నాడు ధృతిని బెదిరించబోయిన అబ్బాయి.
“ఎనీ వే…థాంక్యూ! నిజంగానె భయపడ్డాము.లాస్ట్ యియర్ కూడా, కొన్ని కాలేజీల లో పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని విని మా పెద్ద వాళ్ళు భయపడ్డారు. మమ్మల్ని కొన్ని రోజులు కాలేజీకే వెళ్ళొద్దన్నారు.కాని మీ అందర్నీ చూసాక చాలా హాయిగా అనిపించింది. రాగింగ్ ని ఈ విధంగా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని మీరు ప్రూవ్ చేశారు. కంగ్రాట్స్. చిన్న డౌట్… మీరందరూ ఇంత సంస్కారవంతంగా వున్నారు .. మీ ఇంట్లో ట్రిప్లెక్స్ సోప్ వాడతారా?” హాయిగా నవ్వేసింది.
“ఫ్రెండ్స్?” చేతులు సాచింది.సీనియర్స్ అందరూ హాయిగా నవ్వుతూ షేక్ హాండిచ్చారు. అందరితో నవ్వుతూ గల గలా మాట్లాడుతున్న ధృతికి యేవో చూపులు గుచ్చుకున్నట్లయ్యి పక్కకి చూసింది. అప్పటివరకూ ఎంతో భయపడ్డట్లుగా నటించి ఇప్పుడు ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్న ధృతిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ధృతిని బెదిరించిన అబ్బాయి. కన్నుకొట్టి అల్లరిగా నవ్వింది “ఏయ్! రౌడీ… కమ్ హియర్” చూపుడు వేలితో పిలిచింది. నిద్రలో ఉన్నవాడిలా నడుస్తూ ధృతి దగ్గరికొచ్చాడు.
“ఇలా పట్టుకుంటారా?” మిగతా ఫ్రెషర్స్ కి సైగ చేసింది.వారిలో నుండి నలుగురబ్బాయిలొచ్చి ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకున్నారు. వెంటనే ఇంకో ఇద్దరొచ్చి చేతులు పట్టుకున్నారు “ఇలానే చేతులు పట్టుకుంటారా?”
“అబ్బ ! మళ్ళీ కళ్ళెగరేసింది” మళ్ళీ గుండెలు పట్టుకున్నాయి ఆ అబ్బాయికి. ఏమీ మాట్లాడకుండా అన్నీ చేయించుకుంటున్న ఆ అబ్బాయిని చూడగానే జాలేసింది ధృతికి.
“ఇంక చాలు. వదిలేయండి పాపం” దయతల్చినట్లుగా చెప్పింది.
“ఇంతకీ ఎవరు ఎవర్ని రాగింగ్ చేస్తున్నట్లో?” ఎవరో గొణిగారు చిన్నగా.
“ఏయ్! విశ్వా! నిన్ను రాగింగ్ చేస్తుంటే అలా చేయించుకున్నావేంటి?” అడిగాడో మిత్రుడు.
“అందమైన ఆడపిల్ల కన్ను గీటితే?” పాటందుకున్నాడు అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన విశ్వ.
అందరూ నవ్వుతూ చప్పట్లతో ప్రోత్సహించసాగారు.చప్పట్లు, నవ్వులు, ముచ్చట్లతొ హుషారుగా గడిచిపోయింది సమయం.ఇంతలో ఎవరికో ఆకలేసింది .
“పదండర్రా… క్యాంటీన్ మీద దండయాత్ర చేద్దాము” ఒక్కళ్ళు కదిలేసరికి అందరూ పోలో మంటూ క్యాంటీన్ మీద కి దండ యాత్ర ప్రారంభించారు. ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకున్నారు అందరూ. కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ తో,ముందే వున్న సుందరాంగులతో కాలేజీ కాంపస్ కళ కళ లాడి పోతున్నది. *********************************************************************************************************
ఆ రాత్రి పడుకున్నాడే కాని విశ్వ కి నిద్ర పట్టలేదు. మహానటి సావిత్రి లాగా నడుం మీద చేతులేసుకుని అల్లరిగా ప్రశ్నిస్తున్న ధృతి క్షణం కూడా కన్ను మూయనీయలేదు.బోర్లా పడుకున్నాడు,మళ్ళీ వెల్లకిలా తిరిగాడు.
మళ్ళీ పక్కకు పడుకుందామని చూసాడు.మీ ఇంట్లో “ట్రిపుల్ ఎక్స్ వాడతారా?” అడుగుతున్నట్లనిపించి ఒక్కఉదుటున లేచి వెళ్ళి తల్లిని లేపాడు… అమ్మా! మనింట్లో ఏమి సబ్బు వాడతాము బట్టలకు?” అర్థరాత్రి లేపి బట్టల సబ్బు గురించి అడుగుతున్న కొడుకుని పిచ్చి వాడిని చూసినట్లుగా చూసింది వసంత. “పోరా! వెళ్ళి వాషింగ్ మెషీన్ దగ్గర వెతుక్కో పో.పని లేకపోతే సరి… అర్థరాత్రి నిద్ర లేపి మరీ అడుగుతున్నాడు, గొప్ప డౌట్” విసుక్కుంది. తల్లి చెప్పేట్లుగా లేదని వాషింగ్ మెషీన్ దగ్గరికి వెళ్ళబోతూ తన స్ఠితి తల్చుకుని నవ్వుకుంటూ మంచం మీదకి చేరాడు విశ్వ.
వసంత రాజారావులకు వినీల విశ్వ ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరూ ఎప్పుడూ చదువుల్లో ఫస్టే..ఎప్పుడూ కూడా వాళ్ళ చదువుల గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు
రాజారావు తండ్రి వెంకట్రావుకి కొడుకును డిగ్రీ వరకు చదివించడమే కష్టమయింది.
మధ్యతరగతి కుటుంబీకుడు అయిన వెంకట్రావుకి పెళ్ళినాటికి పెళ్ళికావాల్సిన ఇద్దరు చెల్లెళ్లూ, చదువుకుంటున్న ఇద్దరు తమ్ముళ్లూ ఉన్నారు.తండ్రిది మామూలు ఉద్యోగం.అందుకని పెద్దకొడుకైన వెంకట్రావు తండ్రికి అండగా నిలబడి తన కర్తవ్యాన్ని, తన బాధ్యతలను చక్కగా నెరవేర్చాడు. రాజారావు చిన్నతనమంతా మేనత్తల పెళ్ళిల్లు, వాళ్ళ పురుళ్ళు పుణ్యాలు వాటికి కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చుకోవడం లో తండ్రి పడుతున్న కష్టం చూసుకుంటూ పెరిగాడు. కాని తండ్రి మొహం లో చిరాకును ఎన్నడూ చూడలేదు. కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా సక్రమంగా నిర్వర్తించడం లో ఉన్న ఆనందాన్నే తండ్రి లో చూసేవాడు. అందుకే రాజారావుకి వాళ్ళింట్లో చిన్న చిన్న అపోహలూ అపార్థాలూ అందరిళ్ళల్లోలానే వాళ్ళింట్లోను ఉన్నా అవి పెద్దవి కాకముందే పెద్దన్నగా వెంకట్రావు వాటిని సర్దేవాడు. అందుకే చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ అందరికీ వెంకట్రావు అంటే ప్రేమతో కూడిన గౌరవం.. మేనల్లుళ్ళు మేనకోడళ్ళకైతే అమ్మమ్మ ఇంటికి రావాలంటే పండగే. ప్రతి సంవత్సరం సంక్రాంతికి అందరూ కలుసుకునే సందర్భం కోసం ఏడాదంతా ఎదురు చూసేవారు. ఇక ఊళ్ళో ఉన్న బాబాయిల కుటుంబాలు ప్రతిపండక్కీ కలుసుకునే వారు.వెంకట్రావు తన బాధ్యతలు నెరవేర్చుకునే
క్రమం లో కొడుక్కి చక్కటి విలువలు నేర్పగలిగాడు కాని విలువైన విద్యను అందించ లేకపోయాడు.కాని ఇంజనీరింగ్ చదవడమే లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం అని అనుకోని రాజారావు తండ్రి కోరిక ప్రకారం డిగ్రీ చదివాడు. అప్పుడే కొత్తగా ఐటీ ఉద్యోగాల ప్రభంజనం మొదలయిన కాలం. అందుకే తాను కూడా కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అయ్యాడు. అప్పో సప్పో చేసి అందరూ అమెరికా బాట పడుతున్నారు. కాని అప్పటికే అప్పుల్లో ఉన్న తండ్రిని అడగాలనిపించలేదు.
ఇంతలోపల హైదరాబాద్ లోనే ఐటీ ఉద్యొగాల హవా మొదలయింది. లక్కీగా కంప్యూటర్ జాబ్ వచ్జేసింది. ఉద్యోగ రీత్యా రెండు మూడు సార్లు విదేశాలకు కూడా వెళ్ళొచ్చాడు. రాజారావు తర్వాత పుట్టిన రాశికి సర్వీస్ లో ఉండగానే పెళ్ళి చేసారు. రాజారావుకి జాబ్ వచ్చిన వెంటనే వసంత తో పెళ్ళయింది. వసంత కూడా చాలా అణకువ కలిగిన అమ్మాయి. అప్పటికే బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని విశ్రాంతిగా ఉన్న వెంకట్రావు దంపతులకు మనవడు మనవరాళ్ళతో ఆడుకునేసమయం వచ్చింది.. నలుగురు మనవలు మనవరాళ్ళతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు. రాశి కొడుక్కి రాజారావు కూతుర్నిస్తే బాగుండునని ఉన్నా పిల్లల మనసుల్లో ఏముందో తెలియకుండా తాము తొందరపడటం ఎందుకని మిన్నకున్నారు.
***************************************************
“అమ్మా! తెలుసా ఈ రోజు ఎంత బాగా ఎంజాయ్ చేసామో… మీరంతా రాగింగ్ అని భయపెట్టారు కాని అసలు భయపడ్డట్లుగా లేనేలెదు . చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు”
“మా తల్లే… మా తల్లే… మేము రాగింగ్ అని భయపడింది నీ గురించి కాదు ..వాళ్ళ గురించే. ఇంతకీ వాళ్ళను దయతల్చావా? ఏడిపించావా?” పప్పులో పోపేస్తూ అడిగింది ధృతి వాళ్ళమ్మ పూర్ణ.
ఒక్క క్షణం కళ్ళముందు అందమైన రూపం కనబడి చిరునవ్వు వెలిసింది పెదాల మీద.
“ఏడిపిద్దామని చూసాను కాని పోనీలె అని వదిలేసాను” జీలకర్ర తీసి నోట్లో వేసుకుంటూ చెప్పింది.
“నిజమా! ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళను నువు ఏడిపిద్దామని చూసావా?” అప్పుడే వంటింట్లోకి వచ్చిన తమ్ముడు కార్తి, చెల్లెలు ఆర్తి ఎక్జైటింగ్ గా అడిగారు.వాళ్ళిద్దరూ కవలలు.
ప్రేక్షకులు దొరికారు కదా అని విజృంభించింది ధృతి. యాక్షన్ తో సహా మొత్తం సీనంతా వివరించసాగింది. పిల్లలిద్దరూ పక పకా నవ్వసాగారు. వాళ్ళతో పాటు పడి పడీ నవ్వుతున్న కూతుర్ని మురిపెంగా చూసుకుంది పూర్ణ.
అప్పుడే వచ్చిన దినేష్ కూడా నవ్వులతో హోరెత్తిస్తున్న పిల్లల్తో తాను కూడా కలిసి పోయాడు.
“ఇక చాలు… అన్నాలకి రాండి. పిల్లలూ కంచాలు పెట్టేయండి. ధృతీ గిన్నెలన్నీ టేబుల్ మీద సర్దు. ఏమండీ! మీకు చిన్న పనే ఫ్రిజ్జు లో నుండి నీళ్ళు పెట్టండి…” అందరికీ తలో పని చెప్పి తాను డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యింది.
“మాకేమో అన్ని పనులూ చెప్పి, నువ్వేమో హాయిగా కూర్చుంటావా మేమొప్పుకో ము…” హఠం చేస్తున్నట్లుగా అంది ధృతి.
“అమ్మ మొత్తం వంటంతా చేసిందిగా. మనం ఈ మాత్రం చేస్తే తప్పు లేదమ్మలూ” చెప్తూనే నీట్ గా టేబుల్ మీద అన్నీ పెట్టేసాడు దినేష్.
ఆ మాటలు వింటూనే ఇష్టంగా వెళ్ళి తండ్రి భుజం మీద తలపెట్టుకుంది ధృతి.
“నేను పుట్టినప్పటినుండీ వింటున్నా మీ ఇద్దరి ఈ సంభాషణ. ఇక వస్తారా అన్నాలకు?” ముద్దుగా విసుక్కుంది. “అసలైనా కొద్దిగా డైలాగ్స్ అన్నా మార్చరేమి?”
“అమ్మా నీకు బోర్ కొడితే చెవులు మూసుకో. మా మంచి నాన్న. మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో చూస్తుంటాను కదా ఎంత మేల్ డామినేషనో…వి ఆర్ లక్కీ …కదరా అర్తీ, కార్తీ… కార్తీ గుర్తుంచుకో పెద్దయ్యాక నువు కూడా నాన్న లాగా ఆడవాళ్ళని గౌరవించాలి”
“సరే అక్కా” బుద్దిగా తలూపాడు వాడు.
“వాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడు కాని నువు కాస్త మగవాళ్ళని గౌరవించడం నేర్చుకో. రోజూ కంప్లైంట్సే నీ గురించి”
“ఓ… ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పారా? వుండు రేపు వాడి సంగతి చెప్తాను. అయినా అందంగా వున్నానే అనుకో అడ్డమైన వాళ్ళు అడ్డమైన కాంప్లిమెంట్స్ ఇస్తే వూరుకుంటారేంటి?”
తనని పైనుండి కిందకి స్టైల్ గా చూపిస్తూ అన్నదల్లా “అమ్మా పులుసు చాలా బాగుంది” తల్లి కోపాన్ని గమనించి మాట మార్చింది.
“ఎందుకు బాగుండదూ? కిలో పంచదార పోస్తే?” కోపంగా అంది
నవ్వేసింది ధృతి. “అమ్మా! నువ్వేమీ కంగారు పడకు. నా జోలికి వస్తేనే ఏమైనా అంటాను”
“అమ్మాయిలకి ఆ మాత్రం ధైర్యం వుండాలి పూర్ణా. పిరికి తనం నేర్పకు. ధృతీ… తప్పు చేయకు. తప్పు చేయకపోతే తలవంచకు. నీ పట్ల తప్పుగా ప్రవర్తించిన వాళ్లను వూరు కోవద్దు. అలా అని మరీ రాష్ గా వెళ్ళకు అన్ని రోజులు మనవి కావు” ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబోతున్న కూతురికి సింపుల్ గా కాలేజీలో ఉండాల్సిన పద్దతి చెప్పాడు దినేష్..
“ధృతీ ఇప్పటివరకు నువు మెలిగిన ప్రపంచం వేరు.ఇక ముందు తిరిగే వాతావరణం వేరు. అక్కడ రకరకాల మనుషులుంటారు. అందరూ మంచిగా వుండరు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కారు. వాళ్ళని అబ్జర్వ్ చేయి.దేనికీ మటుకు తొందరపాటుతనం పనికి రాదు” అలా తనకు తోచినవి చెప్పసాగాడు దినేష్..అప్పటికే ఆర్తి కార్తి నిద్రతో తూగుతున్నారు.
“ఇక చాల్లేండి. మిగతా పాఠాలు రేపు చెప్పొచ్చు” వాళ్ళిద్దరినీ లేపుతూ చెప్పింది పూర్ణ.
“ఓ.కే… గుడ్ నైట్ నాన్నా..” చెప్పి పిల్లల బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది ధృతి.
ధృతికి మంచం మీద వాలడమేమిటి అలా నిద్ర పట్టేసింది. ఎప్పుడొ అర్థరాత్రి ఏవో చూపులు గుచ్చుకుంటున్నట్లుగా అయ్యి మెలకువ వచ్చి లేచి కూర్చుంది. “అబ్బ! ఎలా చూసాడొ? అలా చూస్తున్నా తనెలా వూర్కుంది? అమ్మో! ఇది మొదట్లోనే ఆపెయ్యాలి” గుండెల మీద చేతులేసుకుని అనుకుంది. మంచినీళ్ళు తాగుదామని లేస్తూ కిటికీ లోనుండి బయటికి చూసింది.. మేఘాల మధ్యలోనుండి రెండు కళ్ళు ఆరాధనగా చూస్తున్నాయి. “నిజానికి ఆ చూపులు అయోమయం చూపులు” నవ్వుకుని నీళ్ళు తాగొచ్చి పడుకుంది.
పూర్ణ దినేష్ లకు ధృతి పెద్ద కూతురు. ఆ తర్వాత తొమ్మిదేళ్ళకు కవలలు కార్తి ఆర్తి పుట్టారు. పూర్ణ దినేష్ లకు పిల్లల తోడిదే ప్రపంచం.దినేష్ తల్లి సొంతూళ్ళో వుంటుంది. దినేష్ ఒక్కడే కొడుకు.ఆవిడకు బుద్దిపుట్టినప్పుడు వచ్చి నెల రోజులు ఉండి వెళ్తూ ఉంటుంది . ఇక్కడే ఉండమ్మా అంటే ఇంకొద్ది కాలం పోయాక వస్తానంటుంది.ఆవిడ రాకపోతే సెలవులు ఇచ్చినప్పుడు భార్యా పిల్లల్ని తీసుకుని ఊరికెళ్తాడు దినేష్.
పూర్ణ తలితండ్రులు హైదరాబాద్ లోనే వుంటారు. పూర్ణకొక తమ్ముడున్నాడు అన్వేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి జాబ్ కూడా చేస్తున్నాడు.మనవరాలిని కోడలిగా చేసుకోవాలని పూర్ణ పేరెంట్స్ కి వున్నా పదేళ్ళ తేడా వుందని దినేష్ కాని ధృతి కాని ఒప్పుకోలేదు .పూర్ణకి తమ్ముడికిచ్చి చేయాలని వున్నా కూతురు కూడా నో అనడంతో ఏమీ మాట్లాడలేకపోయింది.

***********************************************************
మర్నాడు కాలేజీ కి వస్తూనే ధృతి కోసం వెతుక్కున్నాయి విశ్వ కళ్ళు. ఎక్కడా కనపడలేదు. కొద్దిగా నిరాశపడ్డాడు విశ్వ. తన క్లాస్ టైం అవుతుంటే అలాగే మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ క్లాస్ కెళ్ళాడు.. వెళ్ళాడే కాని మొత్తం క్లాస్ వినలేక వెంటనే బయటికి వచ్చాడు. అరగంట అటూ ఇటూ చూస్తూ కాలక్షేపం చేసి .కాంపస్ గార్డెన్ లోని ఒక చెట్టుకిందకి చేరాడు.. అక్కడ కూర్చున్న విశ్వ ని అతని ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. సాధారణంగా విశ్వ క్లాసులు మిస్ చేయడు. ఎవరైనా చేస్తున్నా, వాళ్ళకొక గంట క్లాస్ పీకుతాడు… అందుకే విశ్వ, లెక్చరర్స్ కి పెట్ స్టూడెంట్ .మా పేరెంట్స్ కంటే నీ నస భరించడం కష్టంగా వుందిరా బాబూ… అంటారు అతని స్నేహితులు. అలాంటిది ఒక్కడే అలా కనబడేసరికి అందరూ దగ్గరకొచ్చి అడిగిన వాళ్ళు, అతనికి తోడుగా పక్కన సెటిల్ అయిపోయారు.. కొద్దిసేపయ్యేసరికి అక్కడ పెద్ద గుంపు తయారయ్యింది.ఇక లాభం లేదని “బాగా తలనొప్పిగా వుందిరా మామా .పదండి క్యాంటీన్ కి వెళ్దాము.” అన్నాడు. “నిజమేరా ! మన క్యాంటీన్ మామ చేతి కాఫీనే నీకు తలనొప్పి మందు” అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుని క్యాంటీన్ వేపు దారితీసారు.
లోపలికి వెళ్ళేసరికి పెద్దగా నవ్వులు వినపడ్డాయి. అటు చూసిన విశ్వ కళ్ళు మెరిసాయి. అప్పటివరకు వున్న నీరసం అంతా ఎగిరిపోయింది.ఒక్కసారిగా టన్నుల కొద్దీ వుత్సాహం ఒంట్లో ప్రవహించసాగింది. అది దాచుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు విశ్వ. సరాసరి వెళ్ళి ధృతి కూర్చున్న టేబుల్ దగ్గర కెళ్ళి “హాయ్ ధృతీ !” అన్నాడు.
ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్..విశ్వ అందరితోనీ సరదాగా వుంటాడు. కానీ ఏ ఆడపిల్లని పనిగట్టుకుని వెళ్ళి పలకరించడు. అందుకే వాళ్ళకు ఆ ఆశ్చర్యం.
“హలో!” నవ్వుతూనే రిప్లై ఇచ్చింది.
“ఏంటో? మాకు చెప్తే మేము కూడా నవ్వుతాము కదా?”
ఆడపిల్లలందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు
“అదే మరి..గాల్స్ దగ్గరకొచ్చి ఏమి జోకారని ఎవ్వరన్నా అడుగుతారా?” మళ్ళీ నవ్వింది. జలతరంగిణిలా.
“ఓహ్! అయితే చెప్పొద్దులే కాని ఏమి తీసుకుంటారు? కాఫీ? టీ?”
“ఓకే బాబా! చాలు మర్యాదలు… మా అందరివీ అయిపోయాయి.మేము వెళ్ళిపోతున్నాము. మీక్కావల్సినవి మీరు తీసుకోవచ్చు” పర్మిషన్ ఇస్తున్నట్లుగా చెప్పింది.
“అప్పుడేనా? కాసేపు కూర్చోవచ్చు కదా?” రిక్వెస్టింగ్ గా అడిగాడు.
“ఒరేయ్ మామా! మాకలా షాకుల మీద షాకులివ్వకు. మావసలే వీక్ హార్ట్స్. దయచేసి మీరెళ్ళండమ్మా పిల్లలూ “ విశ్వ స్నేహితుడు ప్రణీత్ ఆడపిల్లల వేపు తిరిగి నమస్కారం చేసాడు
గోల గోలగా నవ్వుకుంటూ అందరూ వెళ్ళిపోయారు.
“ఏంట్రా సంగతి? మాకు తెలియాలి. అంతే. తెలియాలంటే తెలియాలి అంతే… ఇవ్వాళ నువు అంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఎన్నడూ లేనిది క్లాసులు ఎగ్గొట్టావు… ఒక అమ్మాయిని నీ అంతట నీవు పలకరించావు. ఏంటీ సంగతి?” కళ్ళెగరేసాడు ప్రణీత్.
“ఏంటా సంగతి? పాపాయి ఏడ్చింది… ఏమీ లేదు కాని పదండ్రా వెళ్దాం క్లాసులకి” మాట మార్చి అందర్నీ క్లాసులకి లాక్కెళ్ళాడు విశ్వ. అనుమానపడుతూనే అనుసరించారు మిత్రబృందం.
“నిజమే! నేను చాలా విచిత్రంగా బిహేవ్ చేసాను.ఒక ఆడపిల్లకి నా ప్రవర్తన వల్ల మాట రాకూడదు.ఇక నుండీ నన్ను నేను అదుపు చేసుకోవాలి..ఇప్పటికి వదిలారు కాని మళ్ళీ ఇలా జరిగితే వదలరీ కోతులు.”నవ్వుకుంటూ నిర్ణయించుకున్నాడు
**********************సశేషం***********************

23 thoughts on “ధృతి – 1

  1. Very nice starting with background information presented beautifully. Such lovely families … what will come next?

  2. కాలేజ్ లవ్ స్టొరీ రాగింగ్ తో సరదాగా మొదలు పెట్టావు. ఇలాగే కంటిన్యూ ఐపో. ఆల్ ద బెస్ట్.

  3. ధృతి….టైటిల్ బాగుంది….. కథ బాగుంది..
    కథనం ఇంకా ఫాస్ట్ గావుంది….ఇది టీనేజ్ కాలేజ్ స్టోరీ….. సంభాషణ లకు ఫస్ట్ మార్క్…అప్పుడే అయ్యిందా…మిగతాది ఎప్పుడు అనే ఫీలింగ్ కలిగింది అంటే…
    Subject properly injected అనే అర్థం…Mani must be congratulated for her initiative…. Good Luck…

  4. Naa kanti chupu lo nilichipo andamina lokalu chupistanu lines are very attractive… Chalagabavundi druthi dharavahika…
    Waiting for druthi part 2.

  5. Chala బాగుంది. స్టార్టింగ్ అదిరింది కాబట్టి సీరియల్ కూడా సూపర్ గా ఉంటుంది.

  6. Good start mani…college backdrop to intrest create chesavu…nice writing style…waiting for next episode. Keep rocking…all the best

  7. Alanty understanding families vunte life chalaa happygaa gadichipotundi story baagaa chadivistondi.nice story teesukonba theam baagundi

Leave a Reply to Meena Pingili Cancel reply

Your email address will not be published. Required fields are marked *