April 24, 2024

నాన్న…

రచన: చంద్రశేఖర్

 

అమ్మ కడుపులో ఉన్నపుడే,

నాకోసం ఎదురుచూశావు..

నాకోసం ఎన్నో బొమ్మలు తెచ్చావు…

నా భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నావు…

నేను పుట్టగానే పండగ చేశావు…

 

నన్ను గాలిలోకి ఎగురవేసి పట్టుకుని

ముద్దాడి మురిసిపోయినావు….

నీ గుండెను పూలపాన్పుగా చేసి

నన్ను జోకొట్టి నిద్రపుచ్చావు…..

 

నా చిట్టి పాదాలు కందిపోకుండా

నీ అర చేతులు పై నడక నేర్పించావు…

ఎత్తుకుని లోకాన్ని చూపించావు…

అమ్మ వద్దన్నా గారం చేశావు…..

అడగకుండానే అన్నీ ఇచ్చావు..

అమ్మలా లాలించావు, పాలించావు,

అమ్మ ప్రేమనే మరిపించి మురిపించావు…

 

గురువులా చదువు, సంస్కారం నేర్పించావు

నా సరదాల కోసం నీ అవసరాలు వదులుకున్నావు

గుండెల్లో  ప్రేమను దాచి

కళ్ళల్లో  కోపం చూపి

నన్ను సన్మార్గంలో నడిపించావు,

వెన్నంటి కాపాడావు

నీ కంటే నేను ఎంతో ఎత్తులో ఉండాలని కోరుకున్నావు

నువ్వే నా  ధైర్యం, నా బలం, నా జీవితం అయ్యావు

 

నా జీవితానికి వెలుగునిచ్చిన సూర్యుడు నువ్వే

నా జీవితంలో వెన్నెల కురిపిoచిన చంద్రుడు నువ్వే

 

ఇంత చేసిన నీకు నేనేం చేశాను

చంద్రుడికో నూలు పోగు లాగా..

 

నువ్వు దేవుడు ఇచ్చిన గొప్ప “వరం”  అనుకున్నా

కానీ నువ్వే కనిపించే “దేవుడు” అని తెలుసుకోలేక పోయాను…

తెలుసుకునే సరికి కనిపించని దేవుళ్ళలో కలిసి పోయావు, నన్ను ఒంటరిని చేశావు…

 

నీవు లేని లోటు తీరనిది….

నీ ఋణం తీర్చుకోలేనిది…

 

****

1 thought on “నాన్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *