March 29, 2024

నా_యాత్రానుభవం_2021_లో_సప్తశృంగి

రచన: రమా శాండిల్య

అనుకోకుండా ఒకరోజు, నా దగ్గర యోగా నేర్చుకునే ఒక శిష్యురాలు… విశాఖపట్నం నుండి ఫోన్ చేసింది.

“అమ్మా, నాకు షిరిడీ వెళ్లాలనుంది, మీరు కూడా వస్తానంటే ఇరువురం కలిసి ఒక్కరోజులో షిరిడీ చూసి వద్దాము” అన్నది. అప్పుడు కోవిడ్ గురించి భయము కొంచెం తక్కువగానే ఉంది.

విశాఖపట్నం నుంచి నా స్టూడెంట్ ‘సంధ్య’ హైదరాబాద్ వచ్చేట్లు, నేను అదే సమయానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునేటట్లు, ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రకారమే టిక్కెట్స్ తీసుకున్నాము. మొత్తం రెండు రాత్రులు, మూడు పగళ్ళు శిరిడీలో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాము.

ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నుండి మధ్యాహ్నం పన్నెండుగంటలకు షిరిడీ వెళ్లే విమానం కోసం నేను ఇంటినుంచి 10.30 కి బయలుదేరి శంషాబాదులో ఉన్న విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళాను. అప్పటికే వైజాగ్ నుండి సంధ్య వచ్చి ఉన్నది అక్కడ.

సమయానికే విమానం వచ్చింది. మా సీట్లలో కూర్చున్నాము. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా షిరిడీ విమానాశ్రయానికి చేరుకున్నాము.

అక్కడికి చేరేటప్పటికి, ముందుగానే ఏర్పాటు చేసుకున్న టేక్సీ ఉంది. మా లగేజ్ అందులో పెట్టి, ముందుగా బుక్ చేసుకున్న హోటల్ గదికి చేరుకున్నాము. అక్కడ మేము స్నానాలు చేసి, మాతో తీసుకెళ్లిన బ్రెడ్, జాము, గ్రీన్ టీ తో తీసుకుని… కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని, సాయి బాబా మందిరంలో హారతి చూడడానికి వెళ్ళాము. చాలా తక్కువమందికి మాత్రమే ప్రవేశమునికి అనుమతిస్తున్నారు. 50 టిక్కెట్స్ మాత్రమే ఇస్తున్నారు. చాలా దూరదూరంగా ఉండేలా నిల్చోపెట్టారు. హారతి చూసుకొని, మరొకసారి దర్శనం చేసుకుని మళ్లీ రూమ్ కి వచ్చి, దారిలో కొనుక్కు తెచ్చుకున్న పళ్ళు తిని, ఇంకో గ్రీన్ టీ త్రాగి పడుకున్నాము.

మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకల్లా టేక్సీ డ్రైవర్ వచ్చి ఫోన్ చేసాడు. అప్పటికే తయారయ్యి కూర్చున్నాము ఇద్దరం. షిరిడీ నుంచి రెండువందల కిలోమీటర్లు కంటే తక్కువే దూరమున్న ఉన్న సప్తశృంగి చూడడానికి బయలు దేరాము.

దారంతా పచ్చని పంటచేలతో… అనేక రకాలైన పండ్ల తోటలతో అవి, జామ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ తోటలు… గులాబీ పూల తోటలతో కనువిందు చేస్తోంది. కొండల మధ్య దారి చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. ప్రయాణమంతా చాలా బావుంది.

కరోనా అనే రాక్షసిని పారద్రోలాలని ఆ తల్లికి మొక్కుకుని వచ్చాను.

సప్తశృంగి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాము.

ఆలయ దర్శనం చేసుకోడానికి సమయాలు… ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకూ ఉంటుంది.

సప్తశృంగి ఆలయం ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలం. ఈ ప్రదేశం నాసిక్ సమీపంలోని కల్వాన్ తాలూకాలో ‘నందూరి’ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ గ్రామం మహారాష్ట్రలో ఉంది. నాసిక్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి ఆలయం ఉంది.

ఈ ఆలయం 51 సిద్ధపీఠాల్లోని ఒకటిగా ప్రసిద్ధి చెందింది. హిందూ సంప్రదాయాల ప్రకారం, దేవత సప్తశృంగి నివాసం ఏడు పర్వత శిఖరాలపై ఉంది. సప్త అంటే ఏడు మరియు శృంగము అంటే శిఖరము. ఈ ఆలయానికి 510 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక చిన్న ట్రైన్ వేశారు. క్రింది నుండి అమ్మవారి గుడివరకూ ఈ ట్రైన్ లో వెళ్లిపోవచ్చు. నూట ఏభై రూపాయలు టిక్కెట్ ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయం యొక్క కార్య నిర్వహణ బాధ్యతలన్నీ ఆలయం యొక్క ట్రస్ట్ నిర్వహిస్తోంది. సప్తశృంగి ఆలయం ఏడు కొండల మధ్యన కొలువైయుంది. ఈ కొండలను స్థానికంగా ఘాట్స్ అంటారు. ఈ శిఖరాల సగటు ఎత్తు సుమారు 4500 అడుగులు.

ఈ ఆలయ దేవతను ఏడు కొండల దేవత అని కూడా అంటారు. సప్తశృంగీదేవి దర్శనం కోసం భారతదేశం నలుమూలల నుండి ప్రతీరోజూ ఎంతో మంది భక్తులు వస్తారు. దేవీనవరాత్రి పండుగ సందర్భంగా, దేవి ఆశీర్వాదం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పురాణాల ప్రకారం, సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞకుండము యొక్క మంటల్లోకి దూకి తన ప్రాణాలను అర్పించింది. శివుడు ఆమె మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకొని విశ్వం చుట్టూ తిరుగుతున్నప్పుడు, విష్ణువు, సతిదేవి యొక్క శరీరాన్ని 51 భాగాలుగా తన సుదర్శన చక్రం ఉపయోగించి ఖండించాడు. 51 భాగాలలో సతీదేవి యొక్క కుడి చేయి ఈ ప్రదేశంలో పడిందని అంటారు.

ఇక్కడ ఒక స్థానికుడు తేనె కోసం ఒక తేనెపట్టును విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు అందులో అతను ఈ దేవతావిగ్రహాన్ని చూశాడు. పర్వతంలో ఉన్న ఈ దేవతావిగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది. దీనికి పద్దెనిమిది చేతులు ఉన్నాయి. మహిషాసురునితో పోరాడటానికి దేవతలు అందించిన శివుని త్రిశూలం, విష్ణువు యొక్క చక్రం, వరుణ శంఖం, అగ్నిదేవుని అగ్ని, వాయుదేవుని విల్లు-బాణం, ఇంద్రుని ఉరుము, యమ శిక్ష, దక్ష ప్రజాపతి ఒక్క చిందరవందర తనం, బ్రహ్మ యొక్క కమండలం, సూర్య భగవంతుని కిరణాలు ఇలా ఇంకా అనేక ఆయుధాలను కలిగి ఉంటాయి, ఆ పద్ధెనిమిది చేతులు.

అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడకు వస్తారు.

ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం… అక్టోబర్ నుండి మార్చి వరకూ బావుంటుంది.

చిరునామా.. సప్తశృంగి గర్హ్ ఆర్డి, జిల్లా నాసిక్, సప్తశృంగిగఢ్, మహారాష్ట్ర 422215

ఎలా చేరుకోవాలి…
రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి ముంబైలోని అన్ని రోడ్డుమార్గాల ద్వారా చేరుకోవచ్చు.
సమీప విమానాశ్రయాలు :
సప్తశృంగి నుండి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ విమానాశ్రయం లేక షిర్డీలో విమానాశ్రమం. షిరిడీ నుంచి మహారాష్ర్టస్టేట్ బస్ సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం ద్వారా: సప్తశృంగి నుండి దాదాపు 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు. సప్తశృంగి తప్పక చూడవలసిన క్షేత్రము!

1 thought on “నా_యాత్రానుభవం_2021_లో_సప్తశృంగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *