March 29, 2024

భారతి

రచన: అనుపమ పిల్లారిశెట్టి

డాబా మీద పిట్ట గొడకి ఆనుకుని క్రిందికి వ్రేలాడుతున్న కొబ్బరాకుతో ఆడుతూ ఆలోచిస్తోంది భారతి….నేను ఎవరు? ప్రొద్దున్న పత్రిక పేజీలు తిప్పుతుంటే కనిపించింది… ‘పడతీ ఎవరు నీవు?’ అని ఒక వ్యాసం. అప్పటి నుంచి అదే మనసులో నాటుకు పోయింది. అమ్మ అనేది..చిన్నప్పుడు ‘అమ్మా నేను ఎవరు?’ అని అడిగే దాన్ని అంట. అప్పుడు అమ్మ నవ్వుతూ నా బుగ్గలు చిదిమి ‘నువ్వు నా బంగారానివమ్మా ‘ అనేదంట. ఆలోచిస్తున్న భారతి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.

స్కూల్లో క్లాస్ టీచర్ తనని లీడర్ చేసినప్పుడు…అల్లరి చేస్తున్న ఓ అమ్మాయిని చిలిపిగా ‘స్టాండ్ ఆన్ ద బెంచ్ ‘ అన్నాను. అందరూ గొల్లున నవ్వారు. అప్పుడే లోపలికి వచ్చిన సోషల్ టీచర్ ‘ ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఎవరు?’ అని అడిగారు.

ఒకసారి కో- ఎడ్ కాలేజిలో కొంతమంది సీనియర్ అబ్బాయిలు ఒక జూనియర్ అమ్మాయిని కాస్తా శ్రుతి మించి రాగింగ్ చేస్తుంటే నేను వెళ్లి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చా…అప్పుడూ …నేను ఎవరు మధ్యలో రావటానికి అని అడిగారు.
**********

పండగ వచ్చింది.. పళ్లూ, పూలూ కొందామని బజారుకెళ్లి వస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు అతి వేగంగా టూ వీలర్ నడుపుకుంటూ ఒకామె పళ్ల బుట్ట మీదికి ఎక్కించేసారు. పాపం ఆమెకి వచ్చిన నష్టంతో వాళ్ళని తిట్టగా తిరిగి ఆమె మీదనే దౌర్జన్యంగా చెయ్యి చేసుకున్న వాళ్ళని “అదేమిటి..తప్పు మీదే కదా” అని అడిగినందుకు “మధ్యలో కలుగచేసుకోవడానికి మీరెవరు” అని అడిగారు.
************
పెళ్లి అయ్యి అత్త గారింటికి వెళ్ళాను…ఇంకా భర్త వైపు బంధువులు అందరూ పరిచయం అవలేదు. ఒక్కదాననే ఉన్నప్పుడు ఎవరో తలుపు తడితే వెళ్లి తీసా… “ఎవరమ్మాయ్ నువ్వు?” నేను అడగాల్సిన ప్రశ్న నన్నే అడిగారు వచ్చినవాళ్ళు.

************
నాన్నగారు ఫోన్ చేశారు..”చెల్లెలికి మంచి సంబంధం వచ్చిందమ్మా… ఒప్పుకోవటం లేదు..నువ్వేమైనా నచ్చ చెప్పగలవేమో చూడు” అని. “అతను జాబ్ అవసరం లేదు అన్నాడు. ఇంత చదివి ఇంట్లో కూర్చోవాలా. ఇంకా ఏమేమో అంటున్నారు..వై షుడ్ ఐ కాంప్రొమైజ్? అయినా నన్ను ఒప్పించడానికి నీకెందుకు అంత ఇంటరెస్ట్?” ఇన్డైరెక్ట్గా నువ్వెవరు అని అడిగినట్టు అనిపించింది.

***********

“ఇంత చదివి వృధాగా ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు? ఏదైనా జాబ్కి అప్లై చెయ్యి” అన్న భర్త మాటకి ఎక్కువ ప్రయత్నం లేకుండానే మంచి ఉద్యోగం వచ్చింది. ఇక మీదైనా నన్ను ‘ఎవరు’
అని అడిగే అవకాశం ఇయ్యకూడడు అని నిశ్చయించుకుంది.

విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ గా తన విధిని బాధ్యతాయుతంగా నిర్వహించింది. చైల్డ్ ట్రాఫికింగ్ ఆపగలిగింది. అటువంటివి, ఫ్లెష్ ట్రేడ్ జరినట్టు వినిపించినా, సీనియర్ సిటిజన్స్కి
అన్యాయం జరిగినా సహించేది కాదు. తన టీంతో కలిసి రైడ్ చేసి నేరస్థులను పట్టుకుని
శిక్ష పడేలా చూసేది; కానీ, వాళ్ళకి తగిన కౌన్సెలింగ్ ఇప్పించి సరైన దారిలోకి వస్తే శిక్ష తగ్గేటట్టు కూడా చూసేది. ఆసరా లేని పెద్దవాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోంలో చేర్చి వాళ్ళకి జరుగుబాటు అయ్యేలా చూసేది.

రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసు వచ్చింది. తనకు తెలియకుండా డిపార్టుమెంట్ వాళ్ళు గ్రాండ్గా ఏరేంజ్ చేశారు ఫంక్షన్. చీఫ్ గెస్ట్గా
మరో రాష్ట్ర విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్నీ
పిలిచారు. ఆయన వస్తూనే చేతులు జోడించి విష్ చేశారు. అందరూ డయాస్ మీద ఆశీనులయ్యారు. డైరెక్టర్ గారు మాట్లాడటానికి లేచారు.

“శ్రీమతి భారతి గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆమె
‘ ఎవరు’ అనేది తెలియని వాళ్ళు ఉండరు.

ఆమె ఈ రాష్ట్రానికి చేసిన సేవ చెప్పాలంటే ఓ పుస్తకం అవుతుంది. ఈమెని ఉదహరించి మా రాష్ట్రంలో ఉద్యోగులకి పని మీద శ్రద్ద చూపమని చెప్పే వాన్ని. శ్రీమతి భారతి ఇస్ ద బెస్ట్ సోషల్ వర్కర్ ఐ హావ్ కం అక్రోస్. ఈ విష్ హెయిర్ గుడ్ హెల్త్ అండ్ లక్ అండ్ హోప్ షి కంటిన్యూ స్ హెర్ హెల్ప్ టు ద నీడ్ ఫుల్ ఇన్ హర్ ఓన్ వే.” సభ కరతాళ ధ్వనులతో మారు మ్రోగింది.

ఈనాడు సాయంత్రం జరిగిన సన్మాన సభలో తనకి కావాల్సిన జవాబు దొరికిందనిపించింది.

తృప్తిగా నిట్టూర్చి మెట్లు దిగింది ‘భారతి.’

2 thoughts on “భారతి

  1. very nice Akka. women existence, struggle for her identity is very well discussed in this story.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *