March 29, 2024

విజ్ఞత

రచన: శుభశ్రీ అశ్విన్

పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇంకా పిల్లా-జల్లా లేరు!?
దేనికైనా రాత ఉండాలి.
వద్దు…వద్దు.. అంటుంటే నచ్చిందని చేసుకుని తీసుకొచ్చాడు. ఒక్క పని సరిగ్గా రాదు. అసలైనా ఏం పెంపకం?!
మంచి మర్యాద తెలీదు!! వాళ్ళ అమ్మ-నాన్నలని అనాలి
గంట నుంచి అదే పనిగా తననీ, తన పుట్టింటివారినీ ఆడిపోసుకుంటోంది అత్తగారు. అంతా వింటూ ఏం మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటోంది సిరి.
ఎందుకంటే ఇదేం తనకు కొత్త కాదు.
పెళ్ళయి వచ్చినరోజు నుంచీ ఈ తిట్ల పురాణం తనకి అలవాటయిపోయింది.
ఇప్పుడు కొత్తగా చేరిన పదం ఏంటంటే??
“గొడ్రాలు” అని…
ఎన్ని అన్నా ఓర్చుకోగలిగిన తను ఆ మాట మాత్రం తట్టుకోలేకపోతోంది.
తనను ఎన్ని మాటలన్నా ఖాతరు చేయని సిరి….తన పుట్టింటి వారిని అలా ఆడిపోసుకుంటుంటే మాత్రం భరించలేకపోతోంది. మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తోంది పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తుందేమోనని???
కానీ ఎలాంటి మార్పు లేదు.
ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా, చలాకీగా ఉండే సిరి రాను-రానూ డీలా పడిపోతోంది. ఏదో తెలియని నిర్లిప్తత జీవితంలో అలముకుంది. ఇంకెన్నాళ్ళు ఈ నరకం? అని మనసు పదే పదే ప్రశ్నిస్తోంది. తను తలుచుకుంటే అత్తగారి మీద తిరుగుబాటుకు ఎంతో సమయం పట్టదు.
అలాగే ఆవిడ ప్రతి మాటకు తను కూడా ప్రతిఘటించగలదు కూడా..
కానీ మాటకు మాట సమాధానం వల్ల గొడవలు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. తనకు కావలసింది తన భర్త సంతోషం. అయినా పరాయివాళ్ళు అయితే మన హక్కులకోసం పోరాడొచ్చు. వద్దని తెగదెంపులు చేసుకోవచ్చు. కానీ, మన అనుకున్నవాళ్ళని, మన వాళ్ళను వద్దనుకోలేము. అంత త్వరగా బంధాలను తెంచుకోలేము.
ఎదుటి వ్యక్తి మారే అవకాశం లేదనుకున్నపుడు మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. లేదా కొంచెం తెలివిగా వ్యవహరించి వారిని మన దారిలోకి తెచ్చుకోవాలి.
ఆలోచిస్తోంది….
కానీ ఇదంతా తన వల్ల కాని పని. ఎలా? ఏం చేసి పరిస్థితిలో మార్పు తీసుకురావాలి? తన మానసికస్థితిని ఎలా తను మెరుగుపరుచుకోవాలి?
చాలా సేపటి నుంచి తనని గమనిస్తున్న భర్త ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావు? అంటూ పలకరించాడు. అదేం లేదండి, అంటూ సమాధానం ఇచ్చింది.
తను చెప్పకపోయినా తన ఆలోచనలను గమనిస్తున్న భర్త, భార్యను దగ్గరకు తీసుకుని ఈ విధంగా చెప్పాడు.
“ఏ ఇంట్లో అయినా అత్త-కోడలు రెండు వ్యతిరేక ధృవాలు. మనం చేయవలసినదేంటంటే మన ప్రవర్తనతో ఎలాంటి వ్యతిరేకతనైనా మనవైపుకు తిప్పుకోవటమే. మనకు అనుకూలంగా మార్చుకోవటమే. నాకు నీపైన పూర్తి నమ్మకం ఉంది. అలాగే నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.
భర్త మాటల్లో ఆంతర్యం అర్ధం చేసుకున్న సిరి ఒక కొత్త ఉత్సాహాన్ని కూడగట్టుకుని ఒక పథకాన్ని ఆలోచించింది. అత్తగారికోసం తనే తన పద్ధతి మార్చాలనుకుంది.

********

దీపావళి పండుగ వస్తోంది.మన అత్తగారు పూజకు సంబంధించిన ఏర్పాట్లతో హడావిడిగా ఉన్నారు. దీపావళి అంటే ఇంట లక్ష్మీ దేవి అడుగుపెడుతుందని, ఎంత నిష్ఠగా ఉండి ఇంటిని ఎంత చక్కగా అలంకరిస్తే అమ్మవారికి అంత ప్రీతికరమని ఆవిడ నమ్ముతుంది. ఇంటి కోడలు ఏం చేసినా చిర్రుమని లేచే ఆవిడ అమ్మ పూజ అంటే మాత్రం అలా చల్లారిపోతుంది.
ఇక ఎదురు చూసి లాభం లేదు…ఈ దీపావళికి ఈవిడ ఝఠాలం వదిలించాలి అని నిర్ణయించుకుంది.
సిరి భర్తతో తన ఆలోచన గురించి చెప్పింది. భర్తకు కూడా నచ్చడంతో ముందుకు కదిలింది.
పండుగ వస్తోంది అంటే అమ్మవారు ఖచ్చితంగా ఇంటికి వస్తుంది ఇది *అత్తగారి బలమైన నమ్మకం*.
ఈ సారి అమ్మవారు అయితే వచ్చింది..
అయితే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్..తో!!??
సరిగ్గా రాత్రి 12 గంటలు కావస్తోంది. అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు. ఈలోగా ఒక పిలుపు వినిపించసాగింది…
అంకమ్మ!!అంకమ్మ!!…
ఆ….ఎవరు? ఎవరు? అది?? ఒకరకమైన భయం…వణుకుతో నిద్రలోంచి లేచి కూర్చుంది మన అంకాలమ్మ..
భయపడకమ్మా!! నేను నీ అమ్మను అని వినిపించింది.
అమ్మా??!! అమ్మ ఎవరు?? అని సందేహంతో కూడిన కంఠంతో అడుగుతోంది.
నువ్వు అనునిత్యం కొలిచే నీ అమ్మను..
ఆఆఆఆ!?? ఏంటీ?? నిజంగానే??
అమ్మా….అంకాలమ్మా…..కాపాడమ్మా….అని గట్టిగా అరుస్తోంది…అత్తగారు..
(చుట్టుపక్కలవాళ్ళు వస్తే ఇబ్బంది అని ఆలోచించిన సిరి..).
గట్టిగా అరవకమ్మ. నేను కేవలం నీకు మాత్రమే కనిపిస్తాను. వినిపిస్తాను. ఎవరైనా వస్తే నేను నీకు వరం ఇవ్వకుండానే వెళ్ళిపోతాను.ఆ తర్వాత నీ ఇష్టం మరి!!??
వద్దమ్మా!! అలాగే నేను అరవను.
అమ్మా నీకిన్నాళ్ళకు నా మీద దయ కలిగిందా??
(ఈలోపల ఏదో సందేహం వచ్చినదానిలా???)
అవును అమ్మా!!?? మీది సంస్కృతం కదా!!తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు!!?? అని అడిగింది
(అత్త గారి తెలివి గురించి తెలిసిన సిరి తెలివిగా)
ఓహ్!!అదా?? ప్రతిసారీ నవరాత్రులకి మా మండపాల దగ్గర మీరు పెట్టే ఆర్కెస్ట్రాలు వినీ వినీ మేం కూడా మీ లోకల్ లాంగ్వేజెస్ లో బాగానే అప్-డేట్ అయ్యాం.
అలాగా అమ్మా!!??
**ఏదైనా వరం కోరుకో అంకమ్మా??**
నీ భక్తికి నేను మెచ్చాను.
అమ్మా!! నాకంటూ ఏమీ కోరిక లేదు.కానీ ఒక సందేహం?! నువ్వు మా కులదేవత అంకమ్మవా? లేక మా గ్రామదేవత గంగమ్మవా? లేక??? అని అడుగబోతుండగా….
కాదు. నేను వీళ్ళెవ్వరినీ కాను. నేను సిరిని!!!!
ఆఆఆ!!???
అదేనమ్మ సిరులనొసగే లక్ష్మిని. ఈ దీపావళికి నీ కోసం నిన్ను కటాక్షించదలచాను. అయినా పేరు ఏదైతే ఏంటమ్మా? అన్నీ నేనే కదా??
అవునా ధన్యోస్మి అమ్మా!!!
నీ ఆకారం అంతా నాకు కనిపిస్తోంది…కానీ నీ ముఖము స్పష్టంగా కనిపించటం లేదు. ఒక్కసారి నీ నగుమోము చూడాలని ఉంది. అనుగ్రహించు అమ్మా అని అడిగింది అంకమ్మ.

అలాగేనమ్మా..
(చెవిలో ఉన్న బ్లూటూత్ లో కొంచెం ఫేస్ మీద ఫోకస్ చెయ్యండి అని భర్తకు వినపడేట్టు గొనిగింది.)
ఒక్కసారిగా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఆ ముఖాన్ని చూసి ఆశ్చర్యం ఇంకా సంతోషానికి గురయింది అంకమ్మ.
అమ్మా అద్భుతం!!! నిన్ను చూస్తుంటే నా రెండు కళ్ళూ సరిపోవటం లేదు. నువ్వు అచ్చం మా కోడలిలాగానే ఉన్నావు అంది అత్తగారు.
అప్పుడు అమ్మ నోటి నుంచి వచ్చిన మాటలు విని ఆలోచించటం మొదలుపెట్టింది అత్తగారు.
చూడు అంకమ్మ!! నేను నీ కోడలి రూపంలో ఉన్నాను అని అంటున్నావు. కానీ నేనే ప్రతిరోజు నీ కోడలిలా నీ ఇంట తిరుగుతున్నాను అయినా నన్ను నువ్వు గుర్తించటం లేదు. పైగా సూటిపోటి మాటలతో నీ కోడలి మనసుని భాధపెడుతున్నావు. తద్వారా నా కటాక్షానికి దూరం అవుతున్నావు.
నీ కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ మొక్కుతున్నావు. మరి నీ కోడలిని మాత్రం కష్టపెడుతున్నావు. కూతురులా, కోడలిలా, నీ మనవరాలిలా అయినా నీ ఇంట నడయాడేది నేనే!
దేవతలంటే ప్రతీసారీ ఒక కిరీటం, ఒంటినిండా నగలు అలంకరించుకుని ఉన్నపళంగా ప్రత్యక్షమవము అమ్మా!
మీ కూతుళ్ళలా, మీ కోడళ్ళలా మీ ఇంట మీ కళ్ళ ముందే తిరుగుతుంటాం.
అది అర్ధం చేసుకోని మీరు వాళ్ళని కించపరుస్తూ మమ్మల్ని భాధపెడుతూ ఉంటారు.
***కొడుకు పెట్టే పిండం కంటే కోడలు పెట్టే దీపం గొప్పది.*****
నువ్వు పూజలు, వ్రతాలు చేయకున్నా నీ ఇంటి ఆడబిడ్డలని సంతోషంగా ఉండేలా చూసుకుంటే మా అనుగ్రహం మీకెప్పుడూ ఉంటుంది. కాబట్టి అంకమ్మా ఇకనైనా నీ వైఖరి మార్చుకో.
లేకుంటే మాత్రం ఎవరి కర్మను వారు అనుభవించక తప్పదు. ఈ దీపావళి సంధర్భంగా త్వరలో నీ ఇంట ఒక పసిపాపను అనుగ్రహించబోతున్నాను.
ఇదే నేను నీకిస్తున్న వరం.
ఇదంతా వింటున్న మన అత్తగారికి నోట మాట రావటంలేదు.
ఆలోచిస్తే నిజమేనేమో!! అనిపిస్తోంది.
అమ్మా!! నన్ను క్షమించు నా వైఖరిని మార్చుకుంటాను. అని బ్రతిమిలాడింది.
సరే అంకమ్మా ఇక నేను వెళ్ళొస్తాను. తెల్లవారిన తర్వాతనే నువ్వు బయటికిరా.
ఈ విషయం ఎవరితో చెప్పకు. చెబితే నువ్వు నీ గతాన్ని మర్చిపోతావు. ఇప్పుడైతే కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు.
అలాగే అమ్మా!!
అని కళ్ళు మూసుకుంది అంకమ్మ..
సిరి గబ-గబా బయటకు పరుగు పెట్టి తన అవతారాన్ని పరిసమాప్తి చేసింది.
భర్తతో ఘట్టం ముగిసింది. ఇక మారటం మారకపోవటం ఆవిడ విజ్ఞత అంటూ భర్తకు తన కృతజ్ఞతలు తెలిపింది.
నువ్వు నా అర్ధాంగివి. అన్నివేళలా నా సహకారం నీకు ఉంటుంది అన్నాడు భర్త.
నిజానికి ఒక ఆడపిల్లకు తన భర్త సహకారం లభిస్తే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు.
గొడవలు పడుతూ ఇంకా సమస్యలను సృష్టించుకోవటం కంటే తెలివిగా వాటికి ఒక పరిష్కారం వెతకటం అవసరం. సిరి తన ప్రయత్నం తను చేసింది. సిరిలాగే ప్రతి ఆడపిల్లకు తనవాళ్ళను చక్కదిద్దుకోగలిగే విజ్ఞత ఉంది. అయితే సందర్భానుసారంగా వ్యవహరించటం అనేది ముఖ్యం..
అత్త-కోడలు ఈ రెండు పాత్రలు కుటుంబ శాంతి-సౌఖ్యాలకు మూల స్థంభాలు. నాటి నుండి నేటివరకు వీరివురి మధ్యన ఏదో ఒక సందర్భంలో భేధాలను గమనిస్తూనే ఉన్నాము. కొందరు సర్దుకుపోతుంటే మరికొందరు కలహాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.
పడతులు అంటే కేవలం సద్గుణాలే కాదు. ఇతరుల మనసులను భాదపెట్టే గుణాలు కలిగినవారు కూడా ఉన్నారు.
అమ్మగా ప్రేమను పంచే ఆవిడే, అత్తగారిగా భాధను కూడా రుచి చూపిస్తుంది. ఈ విషయంలో కోడలు కూడా ఏమీ తీసిపోదు సుమా!! ఎవరికి వారే యమునా తీరే!!
ఎన్నిరకాల పాత్రలను ఆమె పోషించినా!? ఎన్ని పార్శావాలలో తను ప్రవర్తించినా అంతిమంగా ఆవిడ అమ్మతనానికి, త్యాగమూర్తిత్వానికి మనసా-శిరసా వందనం చేయవలసిందే.
ఆమె సత్యం.. ఆమె నిత్యం.. ఆమె శాశ్వతం.
అటువంటి ఓ పడతీ నీకిదే నా పాదాభివందనం.
అందరు శ్రీమహాలక్ష్ములకు మంచి జరగాలని కోరుకుంటూ కథని సుఖాంతం చేస్తున్నాను…

1 thought on “విజ్ఞత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *