March 29, 2024

అగస్త్య మహర్షి

రచన: శ్యామసుందర్ రావు

ఈ రోజుకి కూడా తల్లులు వారి పిల్లలకు ఆహారాన్ని పెట్టి ,”జీర్ణము, జీర్ణము వాతాపి జీర్ణము”అని అంటూ ఉంటారు ఎందుకో తెలుసా? అగస్త్యుడు వాతాపి అనే రాక్షకుడిని తిని జీర్ణించుకుంటాడు కాబట్టి తల్లులు వారి పిల్లలకు కూడా ఆవిధమైన జీర్ణ శక్తి కావాలని కోరుకుంటూ అగస్త్య మహర్షిని స్మరించుకుంటారు. అలాగే భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలను చేసిన మహాత్ముడు అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు.ముఖ్యముగా రామాయణ, మహాభారతాలలో అయన ప్రస్తావన వస్తుంది అగస్త్యుడు సప్త ఋషులలో ఒకడు .ఈ మహార్షి పుట్టుక చాలా వింతైనది ఈయన అగ్ని దేవుడు , వాయుదేవుడు ఇద్దరి అంశలతో నిండుగా ఉన్న నీళ్ల పాత్ర నుండి ఉద్భవించాడు ఈయనకు కుంభ సంభవుడు, కలశజుడు, మిత్ర వరణ పుత్రుడు వంటి పేర్లు ఉన్నాయి అగస్త్య మహర్షికి చిన్నతనంలోనే దేవతలు ఉపనయనము చేసి పంచాక్షరీ మంత్రం ఉపదేశాన్ని చేశారు అప్పటి నుండి అగస్త్యుడు బ్రహ్మచర్యము తీసుకుని తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో సంచరించేవాడు.
ఒకసారి అగస్త్యుడు అరణ్యములో తిరుగుతున్నప్పుడు సల్లకి చెట్టుకు తల క్రిందులుగా వ్రేఆలాడుతున్న మునులను గమనించి వారి చెంతకు చేరి,”మహాత్ములారా మీరెవరు ఇలా ఎందుకు వ్రేఆలాడుతున్నారు?”అని ప్రశ్నించాడు దానికి వారు “నాయనా మేము నీ పితృదేవతలము నీవు వివాహము చేసుకొని సంతానాన్ని కనే దాకా మాకు పుణ్యలోకాలు ప్రాప్టించవు అంతవరకూ మాకు ఇదే గతి నీవేమో బ్రహ్మ చర్యము వదలను అంటున్నావు ” అని చెపుతారు.తానూ వివాహమాడటానికి మంచి కన్య కావాలి కాబట్టి తన తపశ్శక్తితో విదర్భ రాజైన పుత్రకాముడికి ఒక చక్కని కుమార్తె జన్మించాలని వరమిస్తాడు ఆ వర ప్రభావము వలన జన్మించినదే లోపాముద్ర ఆవిడ సుగుణరాశి రూపవతి విద్యావంతురాలు. ఆవిడను వివాహము చేసుకొని ఆవిడతో ఆశ్రమానికి వస్తాడు.
సంసారజీవితము గడపటానికి ధనము కావలి కానీ ఆ ధనము కోసము తన తపశ్శక్తి వృధా చేయటము ఇష్టము లేక ఎవరైనా రాజుని ధనము అడుగుదామని బయలు దేరుతాడు మొదట అగస్త్యుడు శ్రుతర్వుడు అనే రాజును ధనము అడుగుతాడు అయన దగ్గర సరిపడినంత ధనము లేకపోవటం వాళ్ళ ఇద్దరు ప్రదశ్వుడు అనే రాజు దగ్గరకు వెళ్లగా అక్కడ అదే పరిస్థితి అవటంతో ముగ్గురు త్రిసదాన్యుడు అనే రాజు దగ్గరకు వెళ్లిన పని జరగదు అందుచేత అందరు మణిమతి పురానికి రాజైన ఇల్వలుడి దగ్గరకు వెళతారు ఇల్వలుడు తమ్ముడు వాతాపి అతనికి కామరూప విద్య అంటే కోరిన రూపములోకి మారే శక్తి ఉంది అలాగే ఇల్వలునికి చనిపోయిన వారిని బ్రతికించే మృత సంజీవని విద్య తెలుసు ఈ ఇద్దరు రాక్షసులు అవటం వలన వచ్చిన బ్రాహ్మణులను చంపి తినటానికి ఈవిద్యలను వాడుకొనేవారు వాతాపి మేకగా మారితే ఇల్వలుడు ఆ మేకను చంపి బ్రాహ్మణులకు భోజనముగాపెట్టి వాళ్ళు తిన్నవెంటనే వాతాపిని పిలిస్తే ఆ బ్రాహ్మణుల పొట్టచీల్చుకొని వాతాపి బయటకు వచ్చేవాడు కానీ అగస్త్యుని దగ్గర ఇల్వలుని పాచీక పారలేదు ఎందుకంటే ఇల్వలుడు వాతాపిని బయటకు రమ్మని పిలిస్తే అగస్త్యుడు “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణము” అంటాడు
ఆ విధముగా వాతాపి కదా ముగుస్తుంది లోకానికి వాతాపి పీడ విరగడవుతుంది ఇంకా ఇల్వలునికి అగస్త్యునికి ధనము ఇవ్వక తప్పదు అగస్త్యునికి దృఢస్యుడు అనే కుమారుడు తేజస్వి అనే మనుమడు కలిగారు కావున పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాపిస్తాయి.
వింధ్య పర్వతము యొక్క గర్వాన్ని అణచటంలో అగస్త్యుని పాత్ర ఉంది.అన్నిటికన్నా ఎత్తైన పర్వతము మేరు పర్వతము పై ఈర్ష్యతో వింధ్య పర్వతము దానికన్నా ఎత్తు ఎదిగి సూర్యని గమనాన్ని అడ్డగించసాగింది దీనితో రాత్రి పగళ్లు సక్రమముగా లేకుండా వేద విధులకు అంతరాయాలు ఏర్పడ్డాయి అప్పుడు దేవతలు అగస్త్యుని ఎదో ఒకటి చేయమని ఆర్ధించారు అప్పుడు అగస్త్యుడు తన భార్యతో వింధ్య పర్వతము దగ్గరకు వచ్చి తాము దక్షిణ దిశగావెళుతున్నామని తమకు దారి ఇవ్వమని అంటాడు మహర్షుల పట్ల భక్తి భావము ఉన్న వింధ్యుడు తన ఎత్తును ఉపసంహరించుకొని వారికి దారి ఇస్తాడు అగస్త్యుడు తాము తిరిగి వచ్చేదాకా అలాగే ఉండమని చెప్పి మళ్ళీ వెనుకకు తిరిగి రాలేదు వింధ్యుడు అలాగే తగ్గించుకున్న ఎత్తుతో అలానే ఉండిపోయాడు. ఆ విధముగా అగస్త్యుడు వింధ్యుని ఎత్తు పెరగకుండా కట్టడి చేసాడు లోకాలకు ఉపద్రవాలు రాకుండా నివారించాడు. వేరొక కథనం ప్రకారం, శివ పార్వతుల కళ్యాణానికి మహర్షులు అందరు హిమాలయా లకు రావటము వలన వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పోవటం చూసి పరమేశ్వరుడు అందరి శక్తికి సమానమైన అగస్త్యుడిని దక్షిణ దిక్కున ఉండమని ఆదేశించాడు అక్కడినుండి శివ పార్వతుల కల్యాణాన్ని ప్రత్యక్షముగా చూసే వరాన్ని ప్రసాదించాడు
ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుని ఆశ్రమానికి వచ్చి,లోపాముద్ర విష్ణుమాయ అంశ అని, ఇప్పుడు విష్ణుమాయ కవేర రాజుకు ముక్తి నొసగటానికి ఘోరతపస్సు చేస్తుంది నీవు ఆవిడను వివాహమాడలి అని చెపుతాడు బ్రహ్మ దేవుని అజ్ఞాను సారము ఆవిడను వివాహమాడతాడు వివాహము అవగానే కవేర కన్య కావేరి నదిగాప్రవహిస్తుంది ఆ కావేరినదిలో స్నానము చేసినా కవేర రాజుకు ముక్తి లభిస్తుంది ఆ విధముగా కావేరి నది పుట్టుకకు అగస్త్యుడు కారణమవుతాడు వృత్రాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుని జయించి రాత్రులందు మహర్షులను చంపి తిని సముద్రము లో దాక్కునేవాడు. ఆ రాక్షసుడి బెడద వదిలించుకోవటానికి మహర్షులు సముద్రజలాలను అగస్త్యునికి దానమివ్వగా అయన సముద్రాన్ని తన కమండలములో పట్టి ఔపోసన పడతాడు వృత్రాసురుడు సముద్రము నుండి బయట పడతాడు అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకొని వృత్రాసురుని సంహరిస్తాడు ఆ విధముగా సముద్రాన్ని ఒక్క గుక్కలో ఔపోసన పట్టిన ఘనుడు అగస్త్యుడు
శ్రీరాముడు అరణ్యవాసముచేస్తున్నప్పుడు దండకారణ్యములో అగస్త్యమహర్షిని దర్శిస్తాడు అప్పుడు అయన శ్రీరామునికి అక్షయమైన అమ్ములపొది విల్లు, ఖడ్గము ఇచ్చి దీవిస్తాడు రామ రావణ యుద్దములో గాయపడిన రామునికి విష్ణు మూర్తిగా గుర్తుచేసి, స్తోత్రము చేసి రాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేసిస్తాడు ఇప్పటికి మనము ఆరోగ్యము కోసము పఠించే ఆదిత్య హృదయము అగస్త్య మహర్షి ప్రసాదించి నదే.అగస్త్యుడు,భార్య లోపాముద్రతో కలిసి గోదావరి తీరములో ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అప్పుడు లోపాముద్ర ఏ ఏ తీర్ధాలు ముక్తినిస్తాయని అడుగుతుంది బాహ్య తీర్ధాల కన్నా మానస తీర్ధాలు ముక్తి నిస్థాయని అగస్త్యుడు చెపుతాడు అగస్త్యుడి ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించి పరుశురాముడు ఇరవై ఒక్కసార్లు దండయాత్రలు చేసి రాజులను సంహరిస్తాడు ఇలా చాలా సందర్భాలలో ఆగస్టుని పాత్ర ఉంటుంది.
వరాహా పురాణము లోని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కంద పురాణములోఅగస్త్య సంహితలను అగస్త్యుడు రచించాడు ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా అగస్త్యుడు రాశారు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది.తమిళ సంస్కృతిలో అగస్త్యుడు తొలి తమిళ వ్యాకరణము రచించాడని ప్రసిద్ధి.
దక్షిణ ఆసియా లోని దేవాలయాలలో దొరికిన పురాతన శిల్పాలలో అగస్త్యుని విగ్రహం కూడా ఉండడం విశేషం. ఆగ్నేయ ఆసియాలో ఉన్న, ఇండోనేషియాలోని జావా దీవిలో ఉన్న శివాలయంలో ఈ విగ్రహం లభ్యమైంది .ఆ విధముగా అగస్త్యుడు హిందూ చరిత్రలో ఒక గొప్ప శక్తి వంతుడైన మహర్షి భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు.అతను మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లోఉన్నారని చెప్పటానికి గుర్తుగా ఉత్తరాఖండ్ రాష్ట్రములో కేదార్ నాధ్ వెళ్లే దారిలో అయన పేరుతొ ఒక ఊరు కూడా ఉన్నది

2 thoughts on “అగస్త్య మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *