March 30, 2023

ఒక నిద్ర .. ఒక మెలకువ

రచన: రామా చంద్రమౌళి

శీతాకాలపు రాత్రి.. గాఢ నిద్ర.
కలలు నక్షత్రాలుగా.. ఆకాశం ఒక సముద్రంగా.. పర్వతాలు ద్రవిస్తున్న హిమనగాలుగా శోభిస్తున్న స్వప్నంలో తేలిపోతున్న వేళ,
తలుపులపై ఎవరో మెల్లగా తడ్తున్న చప్పుడు.
పూలు రాలుతున్న సవ్వడా, వెన్నెల కురుస్తున్న మృధు ధ్వనా.. గాలి ప్రకృతితో సంభాషిస్తున్న నిశ్శబ్ద ప్రస్తారమా.?
అసహనంగా.. చికాగ్గా లేచి.. తలుపులు తెరిచి చూస్తే.,
కళ్ళు మిరిమిట్లు గొలిపే సాంద్ర స్వర్ణకాంతితో చంద్రుడు.. ధగ ధగా మెరిసిపోతూ.. గుండ్రగా.. పరిపూర్ణంగా.. తామ్ర చంద్రుడు.
చేయినందించి సైగ చేసాడు.. వెంట రమ్మని.
ముగ్ధున్నై వెంట నడుస్తూ,
సముద్రానికి ఐదు వేల అడుగుల ఎత్తులో.. నింగినీ నేలనూ ఏకం చేస్తూ..సువిశాల నిశ్చల వెన్నెల సముద్రం..ఎక్కడా చీకటి జాడే లేదు.
పర్వాతాల ఏటవాలు తలాలపై వందలు వందలుగా కోనిఫర్ చెట్లు.. భూమిపై నిట్టనిలువుగా మొలిచిన శూలాల్లా.
తామ్ర చంద్రుణ్ణి ఆనుకుని చూస్తున్నాను.. చుట్టూ.
చెట్ల ఆకులు చిరుస్వనంతో గాలితో గుసగుసగిస్తూ,
లోయల్లోనుండి పొగమంచు మేఘాలై తేలివస్తున్నాయి.
సెలయేళ్ళు గాలితో రమిస్తూ ఒక రసైక్యతతో పరవశిస్తూ నిశ్శబ్దిస్తున్నాయి.
వెన్నెల జీవధాతువుగా, వెన్నెల జీవౌషదంగా, వెన్నెల ఒక మాతృస్పర్శలా, వెన్నెల మనిషి ఆత్మను సంతృప్తించగల దివ్య చైతన్యంగా దీప్తిస్తున్న వేళ,
చంద్రుడన్నాడు “ ఏం జరుగుతోందిక్కడ “ అని నవ్వుతూ.
“ అవాక్కుగా నేను.
“ సృష్టి నిర్మాణ కార్యమిది.. ప్రకృతి సమతుల్య పునః సంధాన క్రియలో మగ్నమై ఉన్నాన్నేను. మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తూ పోతూంటే.. ప్రతి రాత్రీ నేను దీన్ని పునర్నిర్మిస్తున్నాను. విధ్వంస పునర్నిర్మాణాలు ద్వంద్వాలు. తెలుసా.. ”
కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత..” అటు ఆ అడవిని చూడు.. ఆ పర్వతాలను చూడు.. ఆ నక్షత్రాలను కప్పుకుని నిద్రిస్తున్న ఆకాశాన్ని చూడు.. ఏమిటవి.” అన్నాడు ఎక్కడినుండో దిక్కులే మాట్లాడుతున్నట్టు.
“ అవి దాతలు.. డోనర్స్.. అవి నీకు ప్రతి నిత్యం ప్రాణదానం చేస్తాయి.. రా.. నా వెంట “ అన్నాడు చంద్రుడు.
వెంట వెళ్తున్నాను శరీరం వెంట ఆత్మలా.
అక్కడొక చెట్టు కింద.. ఎవరో ఒక మనిషి పడుకునే ఉన్నాడో.. పడిపోయే ఉన్నాడో తెలియదు.. ఉన్నాడు అపస్మారక స్థితిలో.
“ మనిషి ”
“ కాదు ”
“ మరి ”
“ అది మనిషి రూపంలో ఉన్న ఒక ఆత్మ ”
“నువ్వెవరు ”
“ ఆత్మను ”
“ కాదు ”
“ మరి ”
“ ఆత్మ రూపాంతరం చెందిన జీవమున్న మనిషివి ”
“ మరి ఆత్మకీ నాకూ ఉన్న తేడా ఏమిటి ? ”
“ చేతన ”
“ చేతననా.? అదేమిటి ”
“ నిన్ను నడిపించేదీ, నీలో నివసించేదీ, నీతో సకల కార్యాలనూ నిర్వర్తింపజేసేదీ ”
నేను నిరామయంగా.. నిర్వికారంగా.. నిశ్చేష్టున్నై చంద్రునివైపు చూస్తూ.. మౌనంగా,
“ ఇప్పుడిక్కడ సృష్టి నిత్య నిర్మాణ సృజనాత్మక కార్యం జరుగుతోంది.. అదే జ్ఞానం.. తెలుసుకో..మేలుకో ”
“ జ్ఞానమా. ? ”
“ ఔను.. వెన్నెలను తెలుసుకోవడం.. నదులనూ, పర్వతాలనూ , అడవులనూ, మట్టినీ , మంచునూ తెలుసుకోవడమే జ్ఞానం ”
నాలో నిద్ర ఎప్పుడో పారిపోయింది. కళ్ళు పూర్తిగా తెరుచుకుంటున్నాయి.
“ మిత్రమా.. యిప్పుడు నీ ముందు పరుచుకుని విస్తరించి ఉన్నదంతా సృష్టి. సృష్టి ఎప్పుడూ రహస్యమే .. రహస్యమెప్పుడూ చెప్పబడదు. తెలుసుకోబడ్తుంది.. రా నా వెంట . , ‘ అన్నాడు.
నడుస్తున్నాను.
జ్ఞానం.. జ్ఞాన వినిమయం.. జ్ఞాన రహస్యం.. జ్ఞాన రహస్య విచ్ఛేదనం.. గ్రహింపు.. స్వీకరణ.
ఏదో అదృశ్య కాంతి తుంపరలు తుంపరలుగా పైన కురుస్తున్నట్టు,
కొత్తగా ఏవో విద్యుత్ కెరటాలు శరీరం బయటినుండి లోపలికి.. ఆత్మలోకి ప్రవేశిస్తున్న మహా రసానుభూతి.
చూస్తూ చూస్తూండగానే.. అప్పటిదాకా నేలపై పడిఉన్న మానవాకారం అంతర్థానమైపోయింది.. గాలికి ఓ పూవు కొట్టుకుపోయినట్టు.
తామ్ర చంద్రుడు .. కొండ అంచుపైనుండి లోయలోకి జారి.. జారి.. అక్కడినుండి.. ఎగబ్రాకి.. హిమాలయ పర్వత శిఖర శ్రేణిపై ప్రత్యక్షమై .. ఎర్రగా.. పచ్చగా.. రౌద్ర చంద్రుడు.
చుట్టూ ఎక్కడ చూచినా .. చిక్కని వెన్నెల.. కాంతి.. జ్ఞాన కాంతి –

( 2016, 24 జూన్ నుండి 26 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం , హిమాలయ పర్వత శ్రేణుల్లోని సముద్ర మట్టానినికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న రాణీకేత్ గిరిపట్టణం దగ్గరి మథోడ్ గ్రామంలో జరిగిన ‘ రిడొమేనియా ‘ కథా రచయితల జాతీయ సమావేశాల్లో పాల్గొని ఒక పూర్ణిమ రాత్రి హిమాలయ మహాద్భుత సౌందర్యాన్ని ఒక జీవితకాల రసానుభవంగా మిగుల్చుకుని వచ్చిన తర్వాత .., )

2 thoughts on “ఒక నిద్ర .. ఒక మెలకువ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

June 2021
M T W T F S S
« May   Jul »
 123456
78910111213
14151617181920
21222324252627
282930