June 24, 2024

దేవీ భాగవతం – 1

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి

శుభమస్తు ఓం గణేశాయనమః అవిఘ్నమస్తు
దేవీ స్తుతి

శ్లో.1 నమో దేవ్యై మహాదేవ్యై శివాయైు సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయైు నియతాః ప్రణతాః స్మతామ్‌
శ్రీమద్దేవీ భాగవతము నందు వేదములు స్వయంగా భగవతీ దేవిని ఈ విధముగా స్తుతించినవి.

శ్లో.2 నమో దేవి మహా మాయే విశ్వోత్పత్తి కరే రామ్‌।
నిర్గుణే సర్వభూతేశి మాతః శంకర కామదే ॥
త్వం భూమిః సర్వభూతానాం ప్రాణః ప్రణవతాం తథా ।
ధీః శ్రీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా ధృతిః స్మృతిః ॥
త్వముద్గీ ధేజుర్థమాత్రాసి గాయత్రీ వ్యాహృతి స్తధా ।
జయాచ విజయా ధాత్రీ లజ్జా కీర్తిః స్పృహాదయా ॥
(దేవీ భా.` 1/55/53-55)

శ్లో.3. ఆరాధ్యా పరమా శక్తిః సర్వైరపి సురాసురైః
నాతః పరతరం కించి దధికం భువనత్రయే
సత్యం సత్యం పునః సత్యం వేద శాస్త్రార్ధ నిర్ణయః
పూజనీయా పరా శక్తిర్నిర్గుణా సుగుణా థధా!
(శ్రీ సూతముని వివరణ) (దేవీ భా.` 1/9/86-87)

స్వయంగా శ్రీదేవియే వటపత్ర శాయిగా బాల రూపంతో ఉన్న విష్ణుభగవానునితో అంటుంది.
శ్లో.4. ‘‘సర్వం ఖల్విదమ్‌ వాహం నాన్యదస్తి సనాతనమ్‌’’
(దేవీ భా.` 1/15/52)

దేవ్యధర్వ శీర్షము, దేవీగీత, భావనోపననిషత్తు, త్రిపుర తాపినీ ఉపనిషత్తు, భువనేశ్వరీ ఉపనిషత్తులలో దేవి స్వయంగా తనను పరబ్రహ్మగా తెలియజేసింది.

శ్లో.5. ‘‘సా బ్రవీ దహమ్‌ బ్రహ్మ స్వరూపిణీ!
మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్‌’’ (దేవ్యధర్వ శీర్షం 3`4)
‘‘స్వాత్మైవ లలితా!’’ (భావనోపనిషత్తు)
‘‘తురీయయా మాయయాన్త్యయా నిర్దిష్ట పరమం బ్రహ్మేతి’’
(త్రిపురతాపినీ 5`1)
‘‘బ్రహ్మరంధ్రి బ్రహ్మరూపిణీ మాప్నోతి’’
(భువనేశ్వరీ ఉపనిషత్తు)
‘‘త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా శృణ్వంతు
నిర్జరాః సర్వేవ్యాహరం త్యావచోమమ!
యస్యశ్రవణమాత్రేణ మద్రూపత్వం ప్రపద్యత్‌!
అహమేవాస పూర్వం తు నాన్యత్‌ కించిన్నగాధిప।
తదాత్మరూపం చిత్సం విత్‌ పరబ్రహ్మైక నామకం॥

శ్లో.6. సదేకత్వం న భేదోజుస్తి సర్వదైవ మమాస్యచ।
యోజుసౌ సాహమహం యోజుసౌ
భేదోజుస్తి మతి విభ్రమాత్‌॥
అవయోరం తరం సూక్ష్మం యో వేద మతిమాన్‌ హిసః।
విముక్తః సతు సంసారాన్ముచ్యతే నాత్రసంశయః ॥
(దే. భా. 3/6/2`3)

ఈశ్వరునికి ఏ స్వరూపమున్నదో, శక్తికి కూడా అదే స్వరూపము ఉన్నదని తెలుసుకోవాలి.

శ్లో.7. తచ్ఛక్తిః భూతః సర్వేషు భిన్నో
బ్రహ్మాది మూర్తిభిః కరా భోక్తా చ
సంహర్తా సకలః సజగన్మయః
బ్రహ్మ నారదునితో అంటాడు
శ్లో.8. ఏకరూపౌ చిదాత్మానౌ నిర్గుణే నిర్మలా వుభే।
యాశక్తిః పరమాత్మ సౌయోజుసౌసా పరమామతా।
అంతరం నేతయోః కోజుపి సూక్ష్మం వేద చ నారద ॥
దేవీ భాగవతంలో జగన్మాత తన అవతార కారణాన్ని తెలుపుతూ అంటుంది.

శ్లో.9. సాధూనాం రక్షణం కార్యం హంతవ్యా
యేజుప్యసాధవః వేదసంరక్షణం కార్యమవతారై రనేకశః।
యుగే యుగే తానే వాహ మవతారాన్‌ భిభర్మిచ. ॥

నిర్మలమైన జ్ఞానులు, వివేకవంతులు అయినవారు దేవి నిర్గుణ భావమును స్వీకరించి ఉపాసించెదరు

శ్లో.10. సుగుణా నిర్గుణా చేతి ద్విధా ప్రోక్తా మనీషిభిః
సగుణా రాగిభిః సేవ్యా నిర్గుణాతు విరాగిభిః
శ్లో.11. దేవీ హ్యేకాగ్ర ఆసీత్‌! సేవ జగదండమ సృజత్‌।
తస్యా ఏవ బ్రహ్మా అజీ జనత్‌।
ప్రాణి స్థావర జంగమం మనుష్య మజీ జనత్‌! సైషా పరాశక్తిః
(బహ్వృచోపనిషత్తు)

ఋగ్వేదము నందు కూడా జగన్మాత అంటుంది.
‘అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వ దేవైః।
అహం మిత్రా వరుణోభా బి భర్త్యః మింద్రాగ్నే అహమశ్వినో భా॥
(మం.10 అ.10 సూ125/1)

పైన పేర్కొనబడిన వాక్యములను అన్నింటినీ పర్వాలోచనము చేయుటవలన దేవీ భాగవతమందు పరబ్రహ్మ పరమాత్మయే దేవీ నామముతో వ్యవహరింపబడినదని తేటతెల్ల మగుచున్నది.
బ్రహ్మతత్త్వము అత్యంత సూక్ష్మము, గుహ్యాతి గుహ్యతమము, నిగూఢము అయినందువల్లనే వివిధ శాస్త్రములందు పెక్కు రీతులుగా బోధింపబడినది. కావున దేవి పేరుతో పరబ్రహ్మ పరమాత్మను ఉపాసించుటవలన కూడా పరమాత్మ ప్రాప్తి లభించును.
ఓం జగదంబికాjైునమః
దేవీ భాగవతమందలి కథలు ప్రారంభం
మూడవ స్కంధము (14 నుండి 24 వ అధ్యాయం వరకు)
ఇది మంత్ర జప మహిమ

పూర్వము ధృవసంధి యను రాజు కోసలదేశ రాజ్యమును పాలించుచుండెను. అతడు సూర్యవంశస్థుడు. అతడికి యిరువురు భార్యలు ` మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు. వేటకు వెళ్ళిని ధృవసంధి సింహముచే మృత్యువాత పడగా మనోరమ తండ్రియు, లీలావతి తండ్రియు మనవలలో ఎవరికి పట్టాభిషేకము చేయాలా అని తెగ వాదులాడుకొనిరి. శత్రుజిత్తు తాతగారైన యుధాజిత్తు సుదర్శనుని తాతగారైన వీరసేనుని హత్యగావించెను.
తన తండ్రిని చంపిన యుధాజిత్తు తన కుమారుని కూడా చంపుటకు యత్నములు సేయుచుండగా చూచి మనోరమ కుమారుని కాపాడుకొనుటకు నమ్మకమైఐ మంత్రి విదల్లుని ఆశ్రయించగా అతడు రహస్యముగా వారిని దాసీ సహాయమున రాజ్యమును దాటించి చిత్రకూటమున ఉన్న భరద్వాజ ముని ఆశ్రమమునకు చేర్చెను. ఒక ప్రత్యేక కుటీరమున భరద్వాజ ముని వారికి ఆశ్రయము కల్పించెను.
ఒక ముని కుమారుడు మంత్రియగు విదల్లుని ‘‘క్లీబ’’ శబ్దముతో గట్టిగా పిలువగా సుదర్శనుడు వినెను. ‘‘క్లీబ’’ శబ్దములోని మొదటి అక్షరమైన ‘‘క్లీ’’ మాత్రమే సుదర్శనునికి గట్టిగా వినబడిరది. అప్పటినుండి అతడు ఏ పనిచేస్తున్నా ఆ ‘‘క్లీ’’ అనే వర్ణమును అనుస్వారము (సున్నా) లేకుండానే అలా మాటిమాటికీ గుర్తు తెచ్చుకుని వల్లిస్తూ ఉండేవాడు.
జగదంబిక యొక్క మంత్రరాజము యొక్క ‘‘క్లీం’’ అనే కామబీజము అనుకోకుండా సుదర్శనునికి లభించింది. అయితే సున్నా లేకుండానే అతడు ‘‘క్లీ’’ అనే వర్ణమును ఛందస్సు, ఋషి, న్యాసము, ధ్యానము, విధివిధానములు తెలియకుండానే అతడు భక్తిగా ‘‘క్లీ’’ అను వర్ణమును పదేపదే ఉచ్ఛరించుచుండెను. లేచినా, ఆడుతున్నా, నిద్రలోను కూడా వల్లించే వాడు.
పదకొండు సంవత్సరముల వయస్సులో భరద్వాజముని అతనికి ఉపనయన సంస్కారము చేయించెను. వేదాధ్యయనము గావించెను. కామబీజ మంత్రప్రభావముచేత సకల విద్యలు నేర్చెను.
అతని శ్రద్ధా భక్తికి జపమునకు ముగ్ధురాలైన జగదంబిక అతనిని అనుగ్రహించెను.
ఎర్రని వస్త్రమును ధరించి, ఎర్రని హేమ కాంతితో మెరయుచూ గరుడవాహనమెక్కి ఆదిశక్తిగా ప్రత్యక్షమైంది. చల్లని తల్లిని దర్శించిన సుదర్శనుడు మిక్కిలి పరవశుడయ్యెను.
ఆ తల్లి అనేక ఆయుధములను ప్రసాదించినది. ఆ తరువాత కాశీరాజు కుమార్తె శశికళతో అతనికి వివాహమైంది. వివాహ విషయమున ఎందరో రాజులు శత్రువులైరి. యుధజిత్తుకూడా తన మనవడిని తీసుకుని సుదర్శనునిపై యుద్ధమునకు వచ్చాడు. కానీ యుద్ధములో స్వయముగా పరమేశ్వరి, ఆ జగజ్జనని సుదర్శనుని కొరకై యుద్ధములో ప్రకటితమై శత్రువులతో స్వయంగా పోరు సలిపింది. ఇది అందరికీ ఎంతో ఆశ్చర్యము కలిగించింది. యుధాజిత్తు, శత్రుజిత్తు యుద్ధంలో ఓడిరి. కోసల రాజ్యమునకు సుదర్శనుడు పట్టాభిషిక్తుడై తల్లిని ప్రేమతో చూసుకుంటూ ఎంతోకాలం పరిపాలించాడు.
నిరంతరము అమ్మవారి బీజ మంత్రములను జపించుటచే యతనిని విజయం వరించినది. అమ్మ అనుగ్రహం అతనికి సంపూర్ణంగా లభించింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేకదా.
మొదటి స్కంధము రెండవ కథ
సుద్యుమ్నుడను రాజు స్త్రీగా మారుట,
దేవీ భాగవత శ్రవణమున
మరల పురుషునిగా మారుట

ఈ కథ అగస్త్య, లోపాముద్రలకు శివకుమారుడైన కుమారస్వామి దేవీ భాగవత మహాత్మ్యమును వివరించే సందర్భంలోనిది.
దేవీ భాగవత పురాణమును స్వయముగా దేవియొక్క వాఙ్మయం మూర్తి యని చెప్పుదురు. దీని శ్రవణముచే ప్రపంచమున లభ్యము కానిదంటూ ఉండదు.
వివశ్వంతుడను మనువు పుత్రుడు శ్రాద్ధదేవుడు. వివశ్వంతుని భార్య శ్రద్ధ. వారికి సంతానము లేకపోవుటచే మహర్షి వశిష్ఠుని సహాయమున యజ్ఞము చేయదలచెను. శ్రద్ధ యజ్ఞము చేయు హోతతో ‘హేమహర్షి, నా గర్భము నుండి ఒక కన్య ఉద్భవించునట్లు ఆశీర్వదించమని వేడుకొంది. అట్లే అని హోత ‘కన్య జన్మించుగాక’ యని సంకల్పము చేసి హవనము కొనసాగించెను.
ఈ విపరీత భావమునకు ఫలముగా ‘ఇల’ అను పేరు గల కన్య ఉదయించెను. రాజగు వివశ్వంతుడు విచారించెను. వశిష్ఠుడు యోగధ్యాన ముద్రుడై సంగతి గ్రహించెను. ‘ఇల’ అను స్త్రీని పురుషునిగా చేయమని శ్రీహరిని శరణువేడెను. ముని యొక్క తపస్సు, శ్రీహరి అనుగ్రహమువలన ‘‘ఇల’’ అందరూ చూచుచుండగనే పురుష రూపమునకు మారిపోయెను. గురువు వశిష్ఠుడు సంస్కార మొనర్చి, సుద్యుమ్నుడను నామమిడెను.
అ మనుపుత్రుడు సుద్యుమ్నుడు గొప్ప విద్వాంసుడయ్యెను.
ఒకసారి అతడు వేటకొరకు అరణ్యములో ప్రవేశించెను. అచట ఒక వనము లోనికి ప్రవేశించగానే సుద్యుమ్నుడు, అతని పరివారము, గుర్రములు స్త్రీలుగా మారిపోయినవి. ఆశ్చర్యముతో వారందరూ అటూనిటూ తిరుగుచుండగా బుధుడు (చంద్రుని కుమారుడు) ఆ స్త్రీని చూచి మోహించెను. అలా వారు కొన్ని దినములు ఆ ఆశ్రమమునందే కలిసి జీవించిరి. సరస సల్లాపములతో కాలము గడిచెను. వారికి ఒక పుత్రుడు జన్మించెను. పేరు పురూరవుడు.
కొంతకాలమయ్యాక ఆమెకు పూర్వ స్మృతి గల్గెను. వెంటనే ఆ స్త్రీ మిగుల దుఃఖించెను. గురుదేవులైన వశిష్ఠుని చేరి నమస్కరించి తన వృత్తాంతమును తెల్పి దానికి కారణమడిగినది. మరల పురుషునిగా మారుటకు తన ఇష్టమును తెల్పినది. వశిష్ఠుడు ధ్యానములో దానికి కారణము గ్రహించెను. ఒకసారి శివపార్వతులు వనవిహారము చేయుచు సరస సల్లాపములలో మునిగి ఉండగా కొందరు మునులు అచ్చటకు శివదర్శనమునకై వచ్చుట జరిగినది. పార్వతి వారలందరిని చూసి లజ్జితులరాలౌట పరమశివుడు గ్రహించెను. అప్పటినుండి ఆ వనములోకి ఎవరు ప్రవేశించినను వారు స్త్రీ రూపమును పొందెదరని శివుడు శాపమిచ్చెను. పార్వతి సంతోషించెను.
ఈ విషయము తెలియని సుద్యుమ్నుడు పరివారము ఆ వనములో ప్రవేశించి స్త్రీలుగా మారిపోవుట తటస్థించినది. ఇదీ కారణమని వశిష్ఠుడు తెల్పగా సుద్యుమ్నుడు వశిష్ఠుని తనకు పురుషరూపమివ్వగల అవకాశమిమ్మని ప్రార్ధించెను. వెంటనే వశిష్ఠుడు కైలాసమునకు చేరుకొని శివుని ఓ పార్వతీపతీ! చంద్రశేఖరా! సుఖప్రదా! భక్తి ముక్తి ప్రదాత! నీలకంఠా! శివా! శరణాగత వత్సల! వృషాధిపా! నమో నమః
రుద్ర! త్రిపురాంతక! శివ! దేవాధిదేవా! గిరిజాపతీ! యజ్ఞ స్వరూప! త్రిలోచనా! గంగాధరా! శంకరా! నమో నమః అని స్తుతించెను.
వశిష్ఠుని భక్తికి ఆనందతరంగితుడై శంకరుడు ప్రత్యక్షమయి కావలసిన వరము కోరుకొమ్మనగా మునివర్యుడు దేవా! అని శివుని పాదములకు ప్రణమిల్లి, దేవా! యని తన మనసునందలి విషయమును తెలుపగా శంకరుడట్లే యని ‘‘ఆ సుద్యుమ్నుడు ఒక నెల పురుషునిగా ఒక నెల స్త్రీగా నుండగలడని’’ వరమిచ్చెను.
సంతోషించిన వశిష్ఠుడు పార్వతికడకు పోయి ఆ జగజ్జననిని యిట్లు స్తుతించెను. దేవీ! భగవతీ! సర్వ సురార్చిత మహాదేవీ! భక్తానుగ్రహకారిణీ! అనంత గుణాలయే! శరణాగత వత్సలే! జయదుర్గే! దుఃఖహంత్రీ! మహా మాయే! జగదంబికే! సృష్ఠి స్థితి లయకారిణీ! దుష్టదైత్య సంహారీ! నీకు నమస్సులనెను.
సాక్షాత్తు నారాయణి యగు పార్వతి మునివర్యుని భక్తి వచనములకు మిక్కిలి సంతోషించి, ‘‘ద్విజవరా! నీవు సుద్యుమ్నుని ఇంటికి వెళ్ళి, తొమ్మిది దినములు అతనికి భక్తితో దేవీ భాగవతమును వినిపింపుము. నాకు అత్యంత ప్రియమైనది. అది వినుట తోడనే అతడు శాశ్వతముగా పురుషునిగా మారిపోవును. జయము’’ అని అదృశ్యమయ్యెను.
ఆ విషయము వశిష్ఠుడు తెలుపగా సుద్యుమ్నుడు భక్తితో ‘ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు నవరాత్రి విధానమును పాటించి జగదంబికను పూజించెను. అమృతమయమగు దేవీభాగవతమును గురువుద్వారా వినుచుండెను.
తొమ్మిది దినములు గడిచినంతనే కథ సమాప్తమగుటతోడనే సుద్యుమ్నుడు పురుష రూపమును పొందెను.
వశిష్ఠుడు సుద్యుమ్నునకు రాజ్యపట్టాభిషేకమొనర్చెను. సుఖముగా రాజ్య పరిపాలన చేసి భూమండలమును పాలించి ఆయన వివిధ యజ్ఞములను చేయుచు మిక్కిలి దక్షిణలిచ్చుచూ, దేవిని పూజించెను. పిదప కుమారులకు రాజ్యమిచ్చి తాను పార్వతీ ధామమునకు చేరెను. అమృతమయమగు ఈ ప్రసంగము ప్రేమతో చదివినను, వినినను, ప్రపంచమందు ఆ దేవి అనుగ్రహమువలన సకలాభీష్టములు సిద్ధించును. చివరను ఆ తల్లి ధామమునకు చేరెదరు అని సూతుడు నుడివెను.

సశేషం..

2 thoughts on “దేవీ భాగవతం – 1

  1. చాలా చాలా బావుంది స్వరాజ్యాలక్ష్మిగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *