March 29, 2024

ధృతి – 2

రచన: -మణి గోవిందరాజుల

“నాన్నా కాలేజీకి వెళ్ళొస్తాను” చెప్తూ గుమ్మం దాటబోతున్న కూతురి మీద గయ్యిమని లేచింది పూర్ణ. “చచ్చిందాకా చాకిరీ నాతో చేయించుకుని కాలేజికి వెళ్ళేప్పుడు తల్లికి చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు.పెంపకం సరిగ్గా లేకపోతే ఇలానే ఏడుస్తుంది… అసలు గారాబం చేసి చెడగొడుతున్న తండ్రిననాలి”
“ఇదిగో! పెంపకం సరిగా లేదని మా అమ్మనను పడతాను. అంతే కానీ, మా నాన్న నంటే ఊర్కునేది లేదు” తనూ అంతే గయ్యిమని లేచింది ధృతి.
“తల్లీ కూతుళ్ళిద్దరూ కయ్యాలాడుకుంటున్నారు.. ఒచ్చి గొడవ తగ్గిద్దామన్న ధ్యాస అన్నా లేదు చూడు మీ నాన్నకి”
“మళ్లీ” తర్జని పెట్టి బెదిరించబోయి నాలుక బయట పెట్టి వెక్కిరించింది ధృతి.
ఒక క్షణం అయ్యాక ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఫక్కుమని నవ్వుకున్నారు
“మా మంచి అమ్మ.” తల్లి దగ్గరకొచ్చి హగ్ చెసుకుని “ఈజ్ దిస్ ఓకే?” అడిగింది. కూతురు కౌగిలిలో అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ, ధృతి నుదుటిని ముద్దాడి “జాగ్రత్తగా వెళ్ళిరా” ప్రేమగా సాగనంపింది.
అప్పటివరకు ఈ సీనంతా సోఫాలో ముడుచుకుని, గడ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చుని చూస్తున్న ఆర్తి, కార్తి “అయిందా? అమ్మా! అక్క కాలేజీకి వెళ్తున్నది. అమెరికా కాదు” వెక్కిరించారు. ఇకనైనా మాకు టిఫిన్ పెడతావా ? అమ్మా! ఆకలే! అమ్మమ్మా! ఆకలే “పాట అందుకున్నారు.
“ఇదిగో వస్తున్నానర్రా… మీ కిష్టమని పాయసం చేసాను. పదండి… పదండి” ఇద్దర్నీ దగ్గరికి తీసుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్తున్న తల్లిని, తమ్ముణ్ణి , చెల్లెల్ని అపురూపంగా చూసుకుంటూ, బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి, అక్కడే కూర్చున్న తండ్రికి బై చెప్పింది ధృతి. అప్పటివరకూ ఆ సీనంతా చూస్తూ నవ్వు కుంటున్న దినేష్, ధృతి కి టాటా చెప్పి పేపర్ అందుకున్నాడు.
లోపలికి తీసుకెళ్లి పిల్లలకి, వాళ్ళకిష్టమైన పాయసం ఇచ్చి కబుర్లు చెపుతూ వంట చేయసాగింది పూర్ణ. వీళ్ళిద్దరూ ధృతి అంత ఫాస్ట్ కాదు. చాల నెమ్మది. సంతానం లో ఒకళ్ళు అలా, ఒకళ్ళు ఇలా ఉంటారేమొ…వాళ్ళను చూస్తూ అనుకుంది.
**************************************
అప్పటికి కాలేజీ మొదలయ్యి మూడునెలలు గడిచాయి… ఇంకొద్ది నెలలలో తన చదువు అయిపోతుంది కదా అని,విశ్వ దిగులు పడసాగాడు. ఇక కాలేజీ వదిలేస్తే మరి ఇలా రోజూ ధృతిని చూసే అవకాశం వుండదు కదా? ఇదేంటి తాను ధృతిని ప్రేమిస్తున్నాడా? దీన్నే ప్రేమంటారా? మనసులో అనుకోసాగాడు.
ధృతికి విశ్వ చూపుల్లోని ఆరాధన అర్థమవుతున్నా, పెరిగిన వాతావరణం, అలవరుచుకున్న సంస్కృతీ సాంప్రదాయాలు, ధృతిని ముందుకు పోనివ్వడం లేదు. అందరితో ఉన్నట్లే విశ్వతో కూడా సరదాగా మాట్లాడ్డం వరకే పరిమితం చేసుకుంది. కాలేజీ అంతా మంచితనంతో విశ్వ ఎలా పేరు సంపాదించుకున్నాడో, ధృతి కూడా తన అల్లరితో, హాస్య చతురతతో అందర్నీ ఆకట్టుకుంది. ఎంత చనువుగా ఉన్నా ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేది. అందువల్ల ఎవరూ కూడా వెకిలి వేషాలు వెయ్యటానికి అవకాశం ఉండేది కాదు.
***********************************
కాలేజీ ఆనివర్సరీ దగ్గరకొస్తున్నది. ఆరోజు నోటీస్ కూడా వచ్చింది ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొనదలచిన వాళ్ళు రిజిష్టర్ చేసుకోవలసినదని. ఇది ఆఖరు సంవత్సరం కాబట్టి, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కామన్ హాల్లో కూర్చుని రకరకాల ప్రోగ్రామ్స్ కి ప్లాన్స్ వేసుకుంటున్నారు, విశ్వ అండ్ గ్రూప్.
ఆ కాలేజీ లో విశ్వా వాళ్ళదే ఫస్ట్ బ్యాచ్. మంచికాలేజీలో సీట్ వచ్చినా, విశ్వ ఈ కాలేజీకే మొగ్గు చూపాడు. ఎందుకంటే కాలేజీ సెలెక్షన్స్ అప్పుడు యాజమాన్యం చాలా పరిమితంగా, మార్కులతో సంబంధం లేకుండా, వాల్యూస్ కి విలువ ఇచ్చే వాళ్ళనే ఎంచుకుని తీసుకున్నారు. అక్కడ అల్లరి, చిల్లర వేషాలకు అవకాశం లేదు. అందువల్ల ఆ బ్యాచ్ అంతా కూడా పద్దతిగా ఉంటారు. అదీగాక తమదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి తమకు ఒక ప్రత్యేకత ఉంటుందని విశ్వ ఆలోచించాడు. యాజమాన్యం ఒక మంచి సదుద్దేశ్యంతో మొదలు పెట్టిన ఆ కాలేజీ త్వరలోనే మంచిపేరు సంపాదించుకుంది. ఆ కాలేజీలోఇప్పటివరకు ఎలెక్షన్స్ లేవు. విశ్వనే అందరినీ కూడగట్టుకుని వివరాలు సేకరించి కాలేజీకి ఏది మంచి, ఏమి కావాలి అనేది యాజమాన్య దృష్టికి తీసుకెళ్లేవాడు. అందువల్ల విశ్వ అంటే అందరికీ ఒక హీరో వర్షిప్. అతనేది చెప్తే అదే మంచి అన్న అభిప్రాయం ఏర్పడింది విద్యార్థుల్లో. చెప్పాలంటే లాభపేక్ష లేని కళాశాల యాజమాన్యం వీళ్ళడిగే లోపే ఏమి కావాలి అన్నది కనుక్కుని వెంటనే ఏర్పరిచేవారు.
అప్పుడే లోపలికి వస్తున్న ధృతి ని చూసి ఆడపిల్లలంతా “ధృతీ! మనం కూడా అన్ని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చెయ్యాలి. ఈ మగవాళ్ళను ఓడించాలి” అన్నారు. అందరూ చాలా ఎక్జైటింగ్ గా ఉన్నారు.
అది విన్న విశ్వ “ఆహా! అదేమి కుదరదు. ఆడామగా అన్న తేడా లేకుండా అందరమూ కలిసి పార్టిసిపేట్ చేద్దాము. ఎంజాయ్ చేద్దాము” అన్నాడు. మగపిల్లలంతా దానికి కోరస్గా టేబుళ్ళ మీద కుర్చీల మీద కొడుతూ తమ సమ్మతిని తెలియచేసారు.
“ఓకే! బాబా! ఓకే… అలాగే అందరం కలిసే ప్రోగ్రామ్స్ చేసుకుందాము” ఒప్పుకున్నది ధృతి. అందరూ కలిసి ప్లాన్ చేయడం మొదలు పెట్టారు. ఏ రోజు ఏమి ఆడాలో, ఏమేమి స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవాలో.
ఇంతలో ధృతి “మనం ఈ సారి అందరం మన చిన్నతనం లో మనం మిస్సయ్యి, మన పేరెంట్స్ చెప్పే ఆటలు ఆడదామా” అన్నది ఉత్సాహంగా.
“అవేమి ఆటలు?” అందరూ అడిగారు. ఆల్మోస్ట్ అందరూ పట్టణ వాతావరణం లో పెరిగినవారే. అందుకే పల్లెటూరి ఆటలు తెలియవు. మహా అయితే గల్లీ క్రికెట్ ఆడేవాళ్లేమో అంతే.
“మా నాన్న చెప్తుంటారు ఆ ఆటలగురించి. మీరు కూడా మీ ఇళ్ళల్లో అడిగితే చెప్తారు. ఈ లోపు నేను కూడా అన్నీ కలెక్ట్ చేసి ఉంచుతాను” ఉత్సాహంగా అన్నది ధృతి. అందరూ కూడా ఎక్జైటింగ్ గా తలలూపారు.
“ఒక పదిహేను రోజులు ప్రాక్టీస్ కి, ఆ తర్వాత రెండు రోజులు నువు చెప్పిన ఆటలు, ఆ తర్వాత అయిదు రోజులు స్పోర్ట్స్, ఆ తర్వాత ఒక రోజు రెస్ట్. ఆ తర్వాత ఆనివర్సరీ డే. ఇదీ ప్రోగ్రాం. ధృతీ రేపు మీరందరూ కలిసి ఆలోచించుకుని ఏమేమి ఆటలు ఆడదామని అనుకుంటున్నారో రాసివ్వండి. . అందులో ఆ రెండు రోజులకి సరిపడా డిసైడ్ చేసుకుందాము. స్పోర్ట్స్ లో క్రికెట్, బాడ్మింటన్, కబాడి, బాస్కెట్ బాల్ ఉంటాయి. రేపు అన్ని బాచెస్ కి సర్క్యులర్ పంపి అందరికీ ఆమోదయోగ్యమైతే అవే కండక్ట్ చేసుకుందాము. ఆ సర్క్యులర్ లోనే కల్చరల్ ప్రోగ్రామ్స్ కి కూడా పేర్లిమ్మంటే సరిపోతుంది” టకటకా ప్రోగ్రాం చెప్పేసాడు విశ్వ.

********************

“అమ్మా! ఈ నెల ఇరవై నాలుగు నుండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతాయి.ఇరవై మూడు వరకు ప్రాక్టీస్… ఆ తర్వాత ఆనివర్సరీ డే ఈ నెల ముప్పైన ఉంటుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవీ ఉంటాయి. మీరు ఆ రోజు రావాలి” అన్నం వడ్డించుకుంటూ చెప్పింది ధృతి.
“నువున్నావా డ్యాన్స్ ప్రోగ్రాం లో?”
“ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఉందామనే అనుకుంటున్నాను. కాని ఏ డ్యాన్స్ చేసినా, మొదటి సంవత్సరం కదా, ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నాను. కాని ఏది చెయ్యాలో అర్థం కావడం లేదు. నువు ఏదన్నా ఐడియా ఇవ్వమ్మా” తల్లినడిగింది ధృతి.
మా చిన్నతనం లో స్కూల్ ఆనివర్సరీలో ఎక్కువగా మానవజాతి మనుగడకేనో, మధురానగరిలో చల్లలమ్మబోదు నో, మా తెలుగుతల్లికి మల్లెపూదండనో, చేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పాత చింతకాయ పచ్చడి లా ఉంటాయి” అన్నది పూర్ణ.
“పాత చింతకాయ కాదుకానీ మరీ చిన్నపిల్లల డ్యాన్స్ ల్లా ఉంటాయేమో”
“నువు ‘హిమగిరి తనయే హేమలతే’ బాగా చేస్తావు కదా? ఆ డ్యాన్స్ చెయ్యి. చాలా బాగుంటుంది” సలహా ఇచ్చింది పూర్ణ.
“ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ తప్పిందమ్మా”
“ఏమీ పర్లేదు. మళ్ళీ రెండు రోజులు చేసావంటే సరిపోతుంది. చక్కగా పద్ధతిగా కూడా ఉంటుంది”.
“ఓకే… ఓకే… రేపు క్లాస్ లో ఆలోచిస్తాములే… ఇంకా… నాన్నా! మీ చిన్నప్పుడు ఆడిన ఆటలు కూడా మా ప్రోగ్రామ్స్ లో ఆడ్ చేస్తున్నాము తెలుసా?” ఎక్జైటింగ్ గా చెప్పింది ధృతి.
“నాన్న చిన్నప్పటి ఆటలా? అవేంటి? ఆర్తి కార్తి ఇద్దరూ ఒక్కసారే అడిగారు.
ఇహ దినేష్ ఒక్కసారిగా తన చిన్నతనంలోకి వెళ్ళిపోయాడు. మధ్య మధ్య పూర్ణ కూడా తన చిన్నతనం లో ఆడిన ఆటలు చెప్పసాగింది. పిల్లలు కుతూహలంగా వినసాగారు.
“ఒకసారేమయిందో తెలుసా? కర్రా బిళ్ళా ఆడుతుంటే ఆ బిళ్ళ వచ్చి నా కంటి దగ్గర కొట్టుకుని ఒకటే రక్తం కారడం మొదలయింది. పిలగాళ్ళంతా కంగారు పడిపోయారు. మా నాన్న వచ్చి ఏమంటారో అని”
“అమ్మో!! అప్పుడు నీ వయసెంత నాన్నా?” అడిగింది కార్తి భయంతో తండ్రిని చుట్టుకుంటూ.
“అప్పుడెప్పుడో కదరా?! అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నాను. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి కట్టు కట్టించుకుని వచ్చారు. ఆ నెప్పి పూర్తిగా తగ్గడానికి పదిరోజులు పట్టింది”
“యు ఆర్ సో మిష్చివస్ నాన్నా!” చెప్పాడు కార్తి. నవ్వేసాడు దినేష్.
“మరి మీ నాన్న వాళ్ళను ఏమీ అనలేదా?” కుతూహలంగా అడిగింది ఆర్తి. దాని బుర్ర నిండా సందేహాలే ఉంటాయి.
“ఇక అనేంత సమయం ఎక్కడిది? హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేసరికి నొప్పి తగ్గిపోయిందిగా”
కబుర్లు చెప్తూ భోజనాలు ఎప్పుడు పూర్తి చేసారో తెలియలేదు అందరి చేతులూ ఎండిపోయాయి. లేచి చేతులు కడుక్కుని, పడుకోవటానికి వెళ్ళిపోయారు పిల్లలు.

**************************

“అమ్మా! మా కాలేజీలో ఆనివర్సరీ డేట్ ఫైనలైజ్ అవుతుంది రేపు. ఈ సంవత్సరంతో నా చదువు కూడా అయిపోతుంది. దిగులుగా ఉన్నది కాలేజీ వదిలెయ్యాలంటే” సోఫాలో కూర్చున్న తల్లి పక్కకొచ్చి కూర్చుంటూ అన్నాడు విశ్వ.
“అవును మరి ఆ కాలేజీ ప్రారంభం నుండీ ఉన్నావాయె. తప్పదుగా? ఇంతకూ ఆనివర్సరీకి ప్రోగ్రామ్స్ ఏమిటి?” అడిగింది వసంత.
“ఇంకా డిసైడ్ చేయలేదమ్మా… ఈ సంవత్సరం మామూలుగా ఉండే రెగ్యులర్ స్పోర్ట్స్ కాకుండా మీ చిన్నతనంలో మీరు ఆడుకున్న, మేము ఆడుకోలేని, ఆటలు ఆడదామని మా ఫ్రెండ్స్ కొందరు సజెస్ట్ చేసారు. మీరేమి ఆడుకున్నారో చెప్పండి అమ్మా, నాన్నా?” కుతూహలంగా అడిగాడు విశ్వ తల్లినీ, తండ్రిని.
బాల్యాన్ని గుర్తుచేసుకోవడమంత ఆనందం మరి ఎందులోనూ ఉండదు. ఇద్దరూ తమ తమ బాల్య జీవితాన్ని పోటీ పడి చెప్పసాగారు. వాళ్ళ వదనాలు బాల్యపు మధురానుభూతులతో దీప్తివంతమైనాయి.
తల్లీ తండ్రి చెప్తున్న వాటిల్లో కొన్ని రాసుకున్నాడు విశ్వ. “ఇక ఆనివర్సరీకి కల్చరల్ ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసుకోవాలి. ఇదే లాస్ట్ కాబట్టి నేను తప్పని సరిగా పార్టిసిపేట్ చేద్దామని ఉంది. కాని ఏది అన్నది ఆలోచించుకోవాలి”
“అరేయ్! ప్రతి ఏడూ చెప్తున్నాను. ఈ సంవత్సరమన్నా వేయరా వరూధినీ ప్రవరాఖ్య నాటకము” హుషారుగా ఐడియా ఇచ్చాడు రాజారావు.
వరూధిని వేషంలో ధృతి కదలాడింది కళ్ల ముందు.చిరునవ్వు పెదవులమీద నాట్యమాడింది. “పో! నాన్నా…ఆడపిల్లలు ఎవరు ఒప్పుకుంటారు ఆ నాటకాన్ని వేయటానికి?”
“ఆడపిల్లతో కాదురా అబ్బాయిలే వెయ్యాలి. భలే మజా వస్తుందిలే ఆ నాటకంతో. మా రోజుల్లో ఆ నాటకం ప్రతి ఏడూ ఉండేది” తన్మయంగా గుర్తు చేసుకున్నాడు రాజారావు.
“చూద్దాములే నాన్నా… ఇంకా ఏవన్నా మా ఫ్రెండ్స్ ఎవరన్నా సజెస్ట్ చేస్తారేమో చూడాలి. అన్నీ కలుపుకుని నిర్ణయించుకుంటాము. ఆ తర్వాత రిహార్సల్స్ మొదలు పెట్టాలి” టీవీ రిమోట్ తిప్పుతూ అన్నాడు విశ్వ. ఎలాగైనా సరే ధృతి తో వరూధిని వేషం వెయ్యటానికి ఒప్పించాలి. మనసులో ధృఢంగా అనుకున్నాక ఆ రాత్రి నిద్ర పట్టింది విశ్వకి.
మర్నాడు కాలేజీకి వెళ్ళాక తాము అనుకున్నవి అందరూ కలిసి చర్చించుకున్నారు. ఉత్సాహం ఉన్న పిల్లలందరూ కామన్ రూం లో చేరారు.
“నేను, కౌండిన్య కలిసి అలవైకుంఠపురం మూవీలోని ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ చేస్తాము” సెకండియర్ చదువుతున్న వైష్ట్నవి ఉత్సాహంగా చెప్పింది.
“నేను, కిరణ్ కలిసి ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’’ చేస్తాము”
“మేము గ్రూప్ డ్యాంస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము”
“మేము కూడా అల వైకుంఠపురం లోదే ఇంకో పాట ‘రాములో రాములా’ చేస్తాము” అందరూ వరసగ చెప్పసాగారు. .
“ధృతీ! నువేమి డిసైడ్ చేసుకున్నావు? ఏదన్నా గ్రూప్ డ్యాన్స్ చేద్దామా?” అడిగారు రాగిణీ, వర్షా.
“విశ్వా! నువు కూడా ఏమి చెప్పలేదు” గుర్తు చేసారు ఫ్రెండ్స్.
“నేనేమీ అనుకోలేదు ఇంకా. చిన్న స్కిట్ లాంటిదో, లేదా డ్యాన్స్ అయితే “హిమగిరి తనయే” అనుకుంటున్నాను.… విశ్వా! వాట్ అబౌట్ యు?” అడిగింది.
“నేను కూడా ఇంకా ఏమీ అనుకోలేదు”
“మరింకేమి? మీ ఇద్దరూ కలిసి ఏమన్నా ప్లాన్ చేసుకోండి” ఎంకరేజ్ చేసారు మిగతా పిల్లలు.
తర్జన భర్జన పడ్డారు కాసేపు. వరూధినీ ప్రవరాఖ్య గురించి, విశ్వ మొహమాటపడి అడగలేకపోయాడు. చివరకు అందరివీ కొత్త పాటలే కాబట్టి తాము కొద్దిగా పాత కొత్తల కలయికతో చేద్దామని నిర్ణయించుకున్నారు. ఫైనల్గా మంచిమనసులు సినిమాలోని ‘మావ మావా పాట’ లగాన్ లోని రాధ కైసేన జలే పాట కలిపి చేద్దామని డిసైడ్ అయ్యారు.
ఇంతలో ఎవరో అన్నీ తెలుగు పాటలే కదా? హిందీ పాటలు ట్రై చేయొచ్చు కదా మీరు అన్నారు. మళ్లీ ఫైనల్గా రెండుపాటలు సెలెక్ట్ చేసుకున్నారు. ‘యు ఆర్ మై సోనియా’ ఇంకోటి ‘కహోనా ప్యార్ హై’
రోజూ ప్రాక్టీసులు, రిహార్సల్స్ తో పరుగులు పెట్టింది సమయం. రోజులో ఎక్కువసేపు ధృతి తో కలిసి ఉండడం విశ్వకి చాలా ఆనందాన్ని ఇస్తున్నది. చూస్తుండగానే ఆటల పోటిల రోజులు దగ్గరకొచ్చాయి.
గ్రామీణ ఆటలపోటీల రెండురోజులు ఆడపిల్లలకు సాంప్రదాయ దుస్తులైన లంగా ఓణీ, జడకుప్పెలు. మగపిల్లలు కుర్తా పైజామ అని డ్రెస్ కోడ్ చెప్పేసారు. ఆడామగా తేడా లేదు ముందే రిజిస్టర్ చేసుకునే పని లేదు. ఎవరికి అనిపిస్తే వారు ఆడొచ్చు
రాజారాం మోహన రాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఆ రోజు కళకళ లాడిపోతున్నది. అందరూ సాంప్రదాయ దుస్తుల్లో తెలుగు తనం ఉట్టిపడుతూ ఉన్నారు. ఆడపిల్లలు లంగా ఓణీల్లో జడకుప్పెలతో చూడముచ్చటగా ఉన్నారు. సీతాకోకచిలుకల వనంలా ఉన్నది కాలేజ్. ఎలాగూ గ్రామీణ ఆటలని కాలేజీ క్యాంపస్ అంతా గ్రామీణ వాతావరణం క్రియేట్ చేసారు.
ఇంకా ధృతి రాలేదని ఎదురు చూస్తున్నాడు విశ్వ. కుర్తా పైజామాలో చాలా బాగున్నాడు విశ్వ. అప్పుడే మెరుపు మెరిసినట్లుగా, కాలేజీలో అడుగు పెట్టింది ధృతి కుటుంబంతో. విశ్వ కళ్ళు మెరిశాయి.
“నమస్తే అంకుల్ రండి” వాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీట్ చేసాడు.
“నాన్నా! విశ్వ ఇతను”
“అక్కా! ఇతన్నేనా ఫస్ట్ డే ఏడ్పించింది?” అక్కను వంచి చెవి దగ్గర గుస గుసగా అడిగారు ఆర్తి కార్తి.
“ష్!!” వేలు నోటి మీద పెట్టుకుని హెచ్చరించి కన్ను గీటింది. అర్థమయ్యి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ముసి ముసిగా నవ్వుకున్నారు పిల్లలిద్దరూ. .
ధృతిని చూట్టానికి రెండు కళ్ళూ చాలటం లేదు విశ్వకు. ధృతిది చక్కని శరీర సౌష్టవం.ఎటువంటి డ్రెస్ అయినా ధృతి వంటి మీద ఆనందంగా వొదిగి పోతుంది. సాంప్రదాయదుస్తుల్లో ఉన్న ధృతిని, చూడటానికి కూడా అల్లరి పిల్లలు సాహసం చేయలేరు. అంత పవిత్రంగా కనపడుతున్నది.
. బారాటి జడ చివరన కుప్పెలు సంతోషంతో ఒకదానికొకటి తాకుతూ నవ్వుల సవ్వడి చేస్తున్నాయి. నుదుటిన ఎర్రని బొట్టు ఉదయ సూర్యుడిలా మెరిసిపోతున్నది. కాటుక కళ్ళు మెరుపులు విరజిమ్ముతున్నాయి. కొటేరు నాసిక ఎర్రరాయి ముక్కుపుడకతో వెలుగుతున్నది. ముదురాకు పచ్చ లంగా మీద ముదురు ఎరుపు ఓణీ, ముదురాకు పచ్చ జాకీటుకు . మోచేతులవరకు ఉన్న చేతులు, చేతులకు ఎరుపు ఆకుపచ్చ కలిపి వేసిన మట్టిగాజులు, వాటికి అటు ఇటూ వేసిన గోట్లు. అందంగా ఉన్నాయి. విశ్వ కళ్ళు పొద్దు తిరుగుడు పువ్వులా ధృతి ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాయి.
. కాలేజీకి ఉన్న ఆంఫి థియేటర్ చాలా పెద్దది. ఒకేసారి వెయ్యి మంది కూర్చొని ప్రోగ్రామ్స్ ని వీక్షించవచ్చు. విద్యార్థులంతా కలిసి అక్కడ కూడా గ్రామీణ వాతావరణం క్రియేట్ చేసారు. ఒకవేపు కచ్చడం బండి, ఒకవేపు చిన్నదూడలు మేత మేస్తున్నట్లుగా, కింద నేలంతా ముగ్గులతో ఒక చిన్న పాటి గ్రామానికి వెళ్ళినట్లుగా ఉన్నది. చుట్టూరా ఉన్న పచ్చని చెట్లకు రంగు రంగుల పూలు విరగబూసి ఆ ప్రదేశానికి శోభనిస్తున్నాయి.
ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు ఆఖరి సంవత్సరం కాబట్టి కాలేజి ఫౌండర్ శేఖరం గారు వచ్చారు. ఆయన వయసు అరవై దగ్గరగా ఉండొచ్చు. చూడగానే గౌరవం కలిగించే ఆకృతి. జండా ఊపి ఆటలు ప్రారంభించిన శేఖరం గారు కొద్ది సేపు కూర్చుని వెళదామని అనుకున్నవారల్లా, మధ్యలో లేచి తాము కూడా ఆడతామని రావడమే కాకుండా మర్నాడు కూడా ప్రత్యేకంగా వారి స్నేహితులను కూడా తీసుకు రావడం, ఆ ఆటలు ఎంతలా అందరినీ ఆకర్శించిందీ, బాల్యపు తలపులను, తలుపులను ఎలా తెరిచిందీ అనే దానికి ఉదాహరణ.
అన్ని ఆటలనూ స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసారు. లెక్చరర్స్ అయితే మళ్లీ తమ బాల్యంలోకి వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా స్టూడెంట్స్ తో వాళ్ళు కూడా ఆడారు.లెక్చరర్స్ ఆడుతున్నప్పుడు స్టూడెంట్స్ ఉత్సాహానికి అంతే లేదు. అరుపులు కేకలతో బాగా ఎంకరేజ్ చేసారు.
గిల్లీదండా, బిళ్ళంగోడు, నాలుగు డబ్బాలాట, నాలుగు రాళ్ళాట, నాలుగు స్థంభాలాట, ఒప్పులకుప్పా, తొక్కుడు బిళ్ళలాట, గోళీలాట, కుందుళ్ళు, అంటించుకునే ఆట, పత్తాలాట, ఆఖరికి టైర్స్ తోసే ఆట కూడా ఆడారు. ఇంకా ఆ సమయానికి ఎవరికి ఏవి గుర్తొస్తే అవి అన్నీ ఆడారు. నిమిషాల మీద గడిచాయి రెండురోజులు.
“ధృతీ! అభినందనలు… చాలా మంచి ఆలోచన చేసి మమ్మల్ని మళ్ళీ మా బాల్యంలోకి తీసుకెళ్ళావు” ప్రతి వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ధృతిని అభినందించారు.
శేఖరంగారు అడిగినమీదట ధృతి వెళ్ళి ఆయనను కలుసుకుని వినయంగా నమస్కరించింది. చూడగానే ధృతి ఎంతో నచ్చింది శేఖరంగారికి. ఆయన కళ్ళల్లో కొడుకు మెదిలాడు. చక్కగా మాట్లాడి ఆప్యాయంగా వివరాలన్నీ కనుక్కున్నారు. మాట్లాడుతున్నకొద్దీ మరీ నచ్చుతున్నది ధృతి.
“చాలా మంచి ఐడియాతో మా అందరి మనసులూ మా ఊళ్ళకు వేళ్ళేట్లు చేసావు అద్భుతమైన అనుభూతిని ఇచ్చావు. అభినందనలమ్మా” నవ్వుతూ చెప్పారు.
“చాలా సంతోషమండీ మీ అందరికీ నచ్చినందుకు” సంతోషంగా జవాబు ఇచ్చింది ధృతి.
“నీ లాంటి చురుకైన, తెలివైన పిల్లలు మా కాలేజీకే ప్రతిష్ట తెస్తారు. ఆల్ ద బెస్ట్ అమ్మా!” దీవించి ఆయన వెళ్ళిపోయారు. ధృతి చాలా సంతోషపడింది

***************సశేషం****************

12 thoughts on “ధృతి – 2

  1. ఒక్క సారిగా…45 యేళ్ళ వెనక్కు తీసికెళ్ళావు… కాలేజీ జీవితం గుర్తుకు వచ్చింది….కథ….కథనం… అమోఘం..
    వర్ణన.. అనితరసాధ్యం…..
    Congratulations….
    We are proud of you Manikumari…
    God bless you…..

  2. Nice narration mami.remebred sports and games played during collegedays.hero and heroine characters nicely designed and narrated ….waiting for next episode

  3. చాలా బాగుంది అండి… .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *