April 23, 2024

నాన్న చెప్పిన మాట!

రచన: రమా శాండిల్య

“ఒరేయ్ భీమా!” పెద్ద గావుకేక వంటింట్లోంచి వినిపించేసరికి పెరట్లో పశువుల కొట్టంలో పనిచేసుకుంటున్న భీముడు “అమ్మా…వత్తన్నా,” అంటూ పరుగున ఒక్క ఉదుటున వచ్చాడు.
“భీమా, వీధిలో లారీలేవో వచ్చినట్లున్నాయి చూడు, దొరగారు ధాన్యం పంపిస్తానన్నారు, కొట్టుగదిలో వేయించాలి… ఆ బస్తాలన్నీ చూసి సింగడ్ని కూడా పిలుచుకో…. ఇద్దరూ కలిసి సాయం పట్టి కొట్టుగదిలో పడేయండి. తెల్లారితే పిల్లలందరూ వస్తారు, అన్ని ఊళ్లనుంచీ.” అంటూ, భీముడికి పని పురమాయించి, మళ్లీ తన పనిలో తాను మునిగిపోయింది లక్ష్మీదేవి.
భీముడు, కొడుకు సింగడి సహాయంతో కొట్టుగదిలో బస్తాలన్నీ వేయించేసాడు. పనులన్నీ పూర్తి చేసుకొనే సరికి, బయటకెళ్లిన రామయ్య చిన్న ట్రాక్టర్ మీద కూరగాయలు, ఊర్లో దొరకని సామాన్లన్నీ తీసుకొచ్చారు. వస్తూనే భీముడితో, సామానంతా లోపల పెట్టించి… “భీమా! ఇప్పటికే ఆలస్యమైపోయింది, ఇప్పుడు ఇంటికెళ్లిపో, రేపు తొందరగా వచ్చేయ్యాలి కదా, అన్నాడు.
“పొద్దున్నే పిల్లలందరూ వచ్చేస్తారు. రేపటినుండి, పదిరోజులు మీ ఆవిడను, పిల్లల్ని ఇక్కడే వచ్చి ఉండమను. ఏ వేళ ఏమవసరమవుతుందో, అందరం ఒకచోటే ఉందాము.” అన్నాడు.
“సరేనండయ్యా…” అంటూ రామయ్యకు నమస్కరించి, ఇంటికి వెళ్ళిపోయాడు భీముడు.
*****
రామయ్య, ఒక దొరగారి దగ్గర, వారి ఆస్తి వ్యవహారాలన్ని చూస్తూ, వారి పొలంలో వ్యవసాయమంతా చేయిస్తుంటాడు. లక్ష్మీదేవి, పేరుకు తగినట్లు చాలా చక్కటి, మంచి వ్యక్తిత్వం ఉన్నావిడ. వారికి నలుగురు మగపిల్లలు. అందరికి పెళ్లిళ్లయిపోయాయి. అందరూ పిల్లాపాపలతో సుఖంగా ఉన్నారు. కొడుకులూ, కోడళ్లు అందరూ చక్కటి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కానీ లక్ష్మీదేవికి ఒకటే దిగులు. పెద్దకొడుకు గుజరాత్ లోనూ, రెండవ కొడుకు చెన్నై లోనూ, మూడవ కొడుకు చండీగఢ్ లోనూ, నాలుగవ కొడుకు బెంగుళూరు లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఎవరి భాష వారిది, ఎవరి పద్ధతి వారిది అయిపోయి ఒకరి పిల్లల భాష వేరొకరికి తెలియకుండా పోతోందనేదే ఆమె బాధ…
రామయ్య, లక్ష్మీదేవి ఇరువురికీ ఒకటే చింత… పిల్లలు కలవకుండానే పెద్దయి పోతున్నారు మనవలంతా…
అందుకే ఆఖరబ్బాయి పెళ్లయ్యాక… పిల్లలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘ప్రతి సంక్రాంతి పండుగకూ, తప్పని సరిగా తమ దగ్గరకి రావాలి,’ అని. ఆ మాట ప్రకారం, ప్రతి సంక్రాంతికి, కొడుకులందరూ కోడళ్లతో, మనవలతో వచ్చి కలిసి గడుపుతారు సొంత ఊరిలో.
*****
రెండు రోజుల ముందునుంచే సంక్రాంతి పండుగ కోసం పిల్లలొస్తున్నారని, లక్ష్మీదేవి ఇరుగు పొరుగులందరి సహాయం తీసుకుని, అరిసెలు, పాకుండలు, కొబ్బరి బూరెలు, మినపసున్ని… వంటి తీపి పదార్ధాలన్నీ. జంతికలు, చెక్కలు లాంటి కారం వంటలనూ చేసి, క్రొత్త అటుకులు కొట్టించి పెట్టింది. అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు లాంటివన్నీ తయారు చేయించి పెట్టింది. పిల్లలొస్తే మామూలు వంటలతో సరిపోతుందని ఆమె ఆలోచన.
*****
తెల్లారింది, హడావిడి మొదలయింది. ఒక్కొక్కరుగా కొడుకులు వారి వారి కుటుంబాలతో రావడం మొదలైంది. గలగలలాడుతూ కబుర్లు, పిల్లల అరుపులు, ఏడుపులు అంతా సందడే సందడి. ఆనందంగా ఉంది అక్కడి వాతావరణమంతా!
వంటవాళ్ళు రావడం, దొడ్లో గాడిపొయ్యి వెలిగించడం, రకరకాల వంటలు వండడం మొదలైంది. ఘుమఘుమలాడుతూ అప్పుడు వెలిగించిన ఆ గాడిపొయ్యి, పిల్లలందరూ వెళ్లే వరకూ అలా వెలుగుతూనే ఉంది.
ఆడపిల్లలందరూ కలిసి మూడు రోజులు బొమ్మలు పెట్టుకొంటున్నారు. గొబ్బిళ్ళ పేరంటాలతో, పట్టుపరికిణీలతో, ముగ్గుల సందళ్ళతో, కొమ్మదాసర్లు, గంగిరెద్దులూ, హరిదాసులు… అంతులేని సందడి. ఇవే కాక, ఊర్లో… ప్రభల జాతరకోసం, ఎక్కడెక్కడినుంచో వచ్చిన, చుట్టాలందరితో సంక్రాంతి పండుగ మూడు రోజులు మూడు నిమిషాలుగా గడిచిపోయింది. పండుగనే కాదు కుటుంబ సభ్యులు నలుగురూ కలిస్తే, అదే పెద్ద పండుగ కదా!
*****
ఆ సందడి చూస్తుంటే, మళ్లీ పిల్లలందరూ వెళ్లి పోతారనే దిగులెక్కువైంది లక్ష్మీదేవికి. రామయ్య పెద్ద కోడలు స్వాతిని పిలిచి, “దగ్గరగా కూర్చోమ్మా. మళ్లీ సంవత్సరానికొస్తారు మీరందరూ… చెల్లాయిలందరినీ కూడా ఒక్కసారి పిలు, కొన్ని విషయాలు చెప్పాలి, మీ అందరికీ…’అన్నాడు.
స్వాతి, “అలాగే మావయ్యా, ఇప్పుడే వారందరినీ పిలుస్తాను.” అని, పెరట్లో బాదం చెట్టుక్రింద ‘చప్టా’ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న, తోడికోడళ్లను, “మావయ్య పిలుస్తున్నారు రండంటూ పిలిచింది.” బిలబిలలాడుతూ, అందరూ మావగారి దగ్గరకొచ్చి కూర్చున్నారు.
అందరినీ చూసి ప్రేమగా “అమ్మా… మళ్లీ సంవత్సరానికొస్తారు, మీరందరూ. అప్పటి వరకూ నేను, మీ అత్తయ్య చంద్రుడి కోసం చకోరాల్లా ఎదురుచూస్తాము. ఈ సంక్రాంతికి మిమ్మల్నందరినీ రమ్మనడంలో నా ఉద్దేశ్యం, దేశం నలుమూలలా ఎవరికి ఎవరమో అన్నట్లు ఉన్నా అందరూ ఒకరికొకరు తెలియాలి, తెలుగు భాష, సంస్కృతి తెలుసుకోకుండానే పెరుగుతున్నారు నా మనవలంతా. అందుకే నాకు చాలా బాధగా ఉంటున్నది. ఎంత దగ్గరి బంధుత్వమో, తెలియకుండానే పెరుగుతున్నారు. అలా కాకుండా పిల్లలకు మన ఊరు, మన భాష, మన సంస్కృతి తెలియాలని నా ఉద్దేశ్యం. అందుకే ఎంత కష్టమైనా, మీ అందరిని సంవత్సరానికి ఒకసారైనా రమ్మని బలవంతం చేస్తున్నాను. మీరు కూడా నా మాట కాదనలేక వస్తూనే ఉన్నారు,” అన్నాడు.
దానికి రెండవ కోడలు రజని, “మావయ్యగారూ, మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ మాకు కూడా ఉద్యోగంలోనూ, ఇంట్లోనూ బాధ్యతలు పెరిగాయి. సంవత్సరానికి ఒకసారి పది, పదిహేను రోజులు ఇక్కడే సరిపోతోంది. పుట్టింటికి గాని, ఒక విహార యాత్రకు గాని వెళ్ళడానికి కుదరటం లేదు. ఇక నుంచి సంవత్సరం విడిచి సంవత్సరం రావాలని నేను, మీ అబ్బాయి మీకు చెప్పాలనుకుంటున్నాము. మీరే ఆ ప్రసక్తి తీసుకొచ్చారు,” అన్నది.
దానికి ఆఖరి కోడలు స్వప్న, “అవునక్కయ్యా… నేనూ, మా వారు కూడా అదే అనుకుంటున్నాము” అన్నది. కోడళ్లందరూ అవునంటే అవునని తమ అభిప్రాయం కూడా అదేనని బలపరిచారు
రామయ్య, లక్ష్మీదేవి వారికెలా నచ్చచెప్పాలో తెలియక దిగులుగా కూర్చున్నారు. రామయ్య సాలోచనగా కొడుకులతో కూడా మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు.

*****

మర్నాడు భోజనాలయ్యాక, రామయ్య మగపిల్లల్ని దగ్గరగా కూర్చో పెట్టుకుని, ఆయన ఆస్తి వివరాలు, ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో చెబుతూ, భీముడి కుటుంబానికి కూడా, దొడ్డి వైపు ఉన్న ఇల్లూ, అరెకరం పొలం రాసిచ్చినట్లు చెప్పాడు.
కొడుకులు, “ఇప్పుడెందుకు నాన్నా, ఈ విషయాలన్నీ?” అంటున్నా, వినకుండా మొత్తం ఆస్తి వివరాలన్నీ వివరంగా చెప్పి… లక్ష్మీదేవిని పిలిచి, “అవునూ, నీకెప్పుడూ ఏమీ ఇస్తానని గానీ, ఇచ్చినవి గానీ గుర్తులేదు. ఇప్పుడు కూడా ఇవ్వడానికేముంది, నీది కానిది నా దగ్గర? అందుకే ఏమీ ఇవ్వలేదు. నలుగురు కొడుకులూ నీకు ఆస్తి అనుకున్నాను. వారి మీద నీకు సర్వ హక్కులూ ఎప్పుడూ ఉంటాయి. ఒకవేళ కోడళ్లు కానీ, ఏమైనా అనుకుంటారనిపిస్తే… నీ స్వేచ్ఛకు అడ్డం లేకుండా, ఇప్పుడుంటున్న ఈ ఇల్లు నా తదనంతరం నీదే. నీకు తినడానికీ, పై ఖర్చుకూ ఎటువంటి లోటు రాకుండా కొంత పొలము, బేంక్ లో కొంచెం డబ్బు ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకో…” అని చెప్పాడు.
లక్ష్మీదేవి ఆ మాటలకు “ఇప్పుడా మాటలేమిటి, అంత అర్జెంటుగా ఈ ఆస్తుల పంపకాలేమిటి? అయినా మీరున్నంత వరకూ, నాకు డబ్బుతో పనిలేదు. మీకంటే ముందే నేను చనిపోవాలని ఆ దేముడ్ని రోజూ ప్రార్థిస్తున్నాను…” అన్నది.
రామయ్యే, మళ్లీ… ‘ఉత్తరాయణం ఎప్పుడూ?’ అని అడిగేసరికి, లక్ష్మీదేవి, ‘సంక్రాంతి పండుగ రోజునుండి ఉత్తరాయణమే.’ అని సమాధానం చెప్పింది. అంతటితో ఆ సంభాషణ ముగించి, కోడళ్లను తీసుకుని, గాడి పొయ్యి దగ్గర వంటచేస్తున్న వంటవాళ్ళ దగ్గరకు వెళ్ళింది.
ఆ రాత్రి అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. మళ్లీ సంక్రాంతి వరకూ, అందరం ఒక్కసారి కూడా కలవలేమనుకుంటూ నిద్రకుపక్రమించారు. అందరూ.
‘అందరూ ఒకటే రోజు వచ్చారు, ఒకటే రోజు వెళితే మాకేమి తోచదు…’ అని లక్ష్మీదేవి గొడవ చేస్తే… రెండేసి రోజుల తేడాతో, ఒక్కొక్క కొడుకు తిరిగి వెళ్లేట్లు, ఏర్పాటుచేసుకున్నారు కొడుకులు.
మర్నాడు చిన్నకొడుకు ప్రయాణం. రాత్రి భోజనాలయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకోవడం అందరికీ అలవాటు. తెల్లారగానే ప్రయాణాలు మొదలవుతాయని కొంచెం దిగులుగా ఉన్నారు లక్ష్మీదేవి, రామయ్య.
*****
పడుకోడానికని లేస్తున్న లక్ష్మీదేవి ఉన్నట్టుండి ముందుకు తూలి పడింది. ఆమెను లేపడానికి ముందుకు వంగిన రామయ్య ఆమె మీదకు ఒరిగి పోయాడు. మాట్లాడుతున్న పిల్లలు కంగారుగా తల్లితండ్రులను తట్టి లేపసాగారు. పెద్దకొడుకు శ్రీధర్ గాబరాగా తమ్ముళ్ల వైపు చూస్తూ డాక్టరుని పిలవండీ…” అనీ భార్య వైపు చూస్తూ ‘మంచినీళ్లు తెమ్మని సైగచేశాడు.’ స్వాతి పరిగెత్తుకుంటూ నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆ నీళ్లను తల్లిదండ్రులకు త్రాగించడానికి ప్రయత్నించసాగాడు శ్రీధర్. కానీ గుటక పడలేదు ఇరువురికి కూడా… చిన్నకొడుకు ఊర్లో ఉన్న ఆయుర్వేదం డాక్టర్ ని తీసుకు వచ్చాడు. ఆయన వారి నాడి చూసి పెదవి విరిచాడు.
అందరూ అప్పటివరకూ తమతో మాట్లాడిన తల్లిదండ్రులిరువురూ, ఒకేసారి చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏర్పాట్లేమి చెయ్యాలో, చుట్టాలకేమని కబురు పంపాలో అర్థం కాలేదు. ఇరుగు పొరుగు వారు వచ్చి, వాళ్లకు తోచిన సలహాలిస్తుంటే వాటిని బొమ్మల్లా అనుసరించసాగారు. భీముడు, సింగడు చెరో కోడలి పుట్టిళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను తీసుకువచ్చారు. దూరంగా ఉన్నవారందరికి ఫోన్ కాల్ చేసి, కబురు తెలియచేసారు. భీముడికి తగిన ఏర్పాట్లు చెయ్యమని చెప్పారు. ఇంటి పురోహితుడికి కబురు పంపించి, ఆఖరి కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లను చేయసాగారు. పుట్టింటివారి సహాయంతో పనులన్నీ చేయసాగారు కోడళ్లు. పండుగ కోసమనివచ్చి తల్లిదండ్రులిద్దరినీ ఒకేసారి పోగొట్టుకోవడం ఆ సంతానానికే కాక, ఊరు ఊరందరికీ కళ్ళనీళ్లు పెట్టించింది.
తల్లిదండ్రులిరువురినీ సాగనంపి, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక, శ్రీధర్ మిగిలిన వారందరినీ కూర్చోబెట్టి సమావేశపరచాడు.
“ఒరేయ్ తమ్ముళ్ళూ, నేనిక వీఆరెస్ తీసుకుందామని అనుకుంటున్నానురా…
“అయ్యయ్యో అదేమిటి అన్నయ్యా? అంత మంచి జాబ్ ని వదిలేస్తావా? నీకింకా ఐదేళ్ళు సర్వీస్ మిగిలుంది కదా? అయినా మానేసి ఏం చేద్దామని?”
“ఆ ఒత్తిడి భరించలేక పోతున్నానురా. ఇప్పుడే రిటైర్మెంట్ తీసేసుకుంటే, కొన్నాళ్ళపాటు ఇక్కడ ప్రశాంతంగా కాలం గడపాలని ఉందిరా… నాన్నగారు వెళ్ళిపోయారు. మన వ్యవసాయం నా చేతుల్లోకి తీసుకుంటాను. ఇక్కడి గాలి, ఇక్కడి నీళ్ళు ఇచ్చే ఆరోగ్యం పట్నంలో లేదురా… ఇక పిల్లల చదువులంటావా? అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఫైనల్ ఇయర్ లోనే ఉన్నారు కదా… వాళ్ళను హాస్టల్స్ లో ఉంచుతాము. క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగాలు వచ్చేసి, ఎలాగూ వెళ్ళిపోతారు. అందుకే ఇక్కడే మనింట్లో, నేను, మీ వదినా ఉండబోతున్నాము…”
“అది కాదన్నయ్యా, అంత సంపాదన వదిలిపెట్టి… పైగా వ్యవసాయం నీకేం చేతనౌతుంది?” వారించాడు పెద్ద తమ్ముడు.
“ఉద్యోగమైనా మొదటి రోజు కష్టమే కదరా? ఇక్కడ నాన్నగారి స్నేహితులున్నారు నన్ను గైడ్ చేయటానికి. మన భీముడున్నాడు చేదోడు వాదోడుగా ఉండటానికి… అలవాటు చేసుకుంటాము. ఈ ప్రకృతి ఒడిలో సేద దీరాలని ఉందిరా… మీరెప్పటిలాగే, మీకు వీలైన పండుగలకు, ముఖ్యంగా సంక్రాంతికి తప్పనిసరిగా వస్తూ ఉండాలి. మేము మీకు అన్నావదినలం కాము, ఇప్పటినుండీ అమ్మానాన్నలము. నాన్నగారు చెప్పినట్టు మనం పండుగలకైనా కలుస్తూ ఉండాలి…” అని చెప్పాడు శ్రీధర్.
తమ్ముళ్ళు అందరూ ఆనందంగా తలలూపారు.
భీముడిని పిలిచి, “నీవిప్పటినుండీ నాకు పెద్ద తమ్ముడివి. నాకు నీవు, నీకు నేను తోడుగా ఉండి పనులు చేసుకుందాము…” అన్నాడు.
అప్పటినుండీ సంక్రాంతి పండుగను ప్రతీ సంవత్సరమూ అన్నదమ్ములంతా, తమ నాన్నగారి మాట ప్రకారం, తమ కుటుంబాలతో అక్కడే ఆనందంగా జరుపుకోసాగారు.

సమాప్తము

2 thoughts on “నాన్న చెప్పిన మాట!

  1. మనసుకి హతతుకునేలా రాశారు …

  2. touching …ఇంతకంటే చెప్పడానికి మాటలు లేవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *