June 25, 2024

మరమనిషి

రచన: ప్రభావతి పూసపాటి

“ఉన్నపళంగా బయలుదేరి రా ప్రమీలా! మీ అన్నయ్య అన్నంత పని చేసేలా వున్నారు” ఫోన్ లో దాదాపుగా అరుస్తున్నట్టు అంది లలిత.
“రేపు శనివారం సెలవుకదా వస్తానులే” కొంచెం నిదానంగానే జవాబిచ్చాను.
“లేదు ప్రమీల మీ అన్నయ్య ఈసారి చాలా దృఢ నిశ్చయంతో వున్నారు, బహుశా అన్ని మాట్లాడి వచ్చినట్టు వున్నారు, ఈసారి మాత్రం నేను ఎంత చెప్పిన వినిపించుకునే స్థితిలో లేరు “లలిత ప్రాధేయ పడుతోందో తెలియపరుస్తోందో తేల్చుకొనేలోపు ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ప్రతిసారిలాగే తాను కంగారుపడి వెళ్లడం, వెళ్ళేలోపే వదిన అన్నయ్యని సమాధాన పరచటం, తాను స్థిమితపడి ఇంటికి రావటం కొన్ని నెలలుగా ఒక తంతులా అయిపోయింది.
“ఎక్కడ నుంచి అమ్మాయ్ ఫోన్? లలిత నుంచి వచ్చిందా” మ్లానమైన మొహంతో వున్న నన్ను పలకరించారు అత్తయ్యగారు. ఆవిడ పిలుపుతో తేరుకున్న నేను”అవునండి అమ్మ విషయంలో మళ్ళీ ఇద్దరు ఘర్షణ పడినట్టు వున్నారు. నన్ను ఉన్నపళంగా రమ్మనమని ఫోన్ చేసింది” అని చెప్పాను.
“దానిదేముంది అమ్మాయి! రేపు ఎల్లుండి సెలవులు కదా. నేను పిల్లలు అన్నీ చేసుకొంటాము. నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అంటూ పూజ నిమిత్తం పూలు తెచ్చుకునేందుకు పెరటిలోకి వెళ్లారు. తొందరగానే వచ్చేస్తానని శ్రీవారికి పిల్లలకి చెప్పి కారులో బయలుదేరాను..
లలిత నేను చిన్నపటినుంచి మంచి స్నేహితులం. మావి కుండమార్పిడి పెళ్లిళ్లు అనే చెప్పాలి. నన్ను ఇష్టపడి లలిత వాళ్ళ పెద్దమ్మగారు తమ అబ్బాయికి నన్ను అడిగి చేసుకొన్నారు. లలిత మంచితనం చూసి మా నాన్నగారు లలితని కోడలుగా చేసుకొన్నారు. మేము వదిన మరదళ్ళ కన్నా మంచి స్నేహితులగానే వున్నాము. అందువలన సాధారణంగా ఆడపడుచుల మధ్య వచ్చే చిన్న చిన్న మాటపట్టింఫులు, మనస్పర్థలు మా మధ్య ఎన్నడూ తలెత్తలేదు. లలిత టెలిఫోన్ విభాగం లో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొంది. అన్నయ్య బ్యాంకు లో పని చేస్తున్నాడు. ఇటీవలే పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసాడు. నాన్న కాలం చెయ్యటం వలన అమ్మని ఊరి నుంచి తీసుకు రావలసి వచ్చింది. హాయిగా జీవితం గడుపుదామనుకొనే సమయానికి అమ్మ రాక కొంత మానసిక అలజడి కలిగిస్తోంది.
సహజంగా అత్తా కోడలా మధ్య వుండే అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు ఆ ఇంట లేవు. అమ్మ కూడాచదువుకుంది. వూళ్ళోఉన్నన్నాళ్ళు పుస్తకాలతో కాలక్షేపం చేస్తూవుండేది. మేమే బలవంతం చేసి టీవీని అమ్మ నాన్నలకని కొని పెట్టాము. మొదట్లో TV పెద్దగా చూసేందుకు ఇష్టం చూపించేది కాదు, కానీ నేనే కొన్ని చానెల్స్ లో సీరియల్స్ వస్తాయి అని అలవాటు చేశాను. అది కొన్నాళ్ళకి వ్యసనం ల అయిపోయినట్టు వుంది
నాన్న వుద్యోగం చేసి రిటైర్మెంట్ తరువాత ఎప్పుడైనా వూరు వెళ్ళినప్పుడల్లా “మీ అమ్మ TV మనిషి అయి పోయింది. పొద్దస్తమానూ TV తోనే కాలం గడుపుతోంది. ఇరుగుపొరుగుతో మాటలాడటం మానివేసింది. నాలుగు మెతుకులు అక్కడ వండి పడేసి రోజంతా TV ధ్యాస. ఒక మంచి చేదు ఆలోచన గాని ఏదైనా ఉపయోగపడేపని చేద్దామని కానీ లేదు. TV రొద తో మనశాంతి లేకుండా పోతోంది అని వాపోయేవారు. నేను అన్నయ్య “పోనిలే నాన్న ఎటువంటి బాదరా బందీ లేవుకదా, తనకాలేక్షేపం ఎదో తాను చేసుకుంటోంది కదా వదిలేయండి “అని సర్ది చెప్పేవాళ్ళము. నేను సెలవులకి వెళ్లినప్పుడు మొదటి సారి గా TV సీరియల్స్ ప్రభావం అమ్మ మీద బాగా పడుతోందని గ్రహించాను, అమ్మ అసలు మనమలతో మాట్లాడటం కానీ, వాళ్ళు వచ్చారని సంతోషం చూపించటం కానీ చెయ్యలేదు సరికదా మేమంతా తన టీవీ సీరియల్స్ కి అడ్డు గా ఉన్నట్టు మాటల్లో చెప్పకనే చెప్పింది. అప్పుడే అమ్మతనం లో మార్పు కనపడింది అది తనలోవస్తున్నపెను మార్పుకి అంకురం అని అప్పుడు గ్రహించలేదు. అమ్మలాంటివాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట కనపడుతూనే వున్నారు. మా అత్తగారు కూడా TV చూస్తారుగాని అదే లోకమనేలా వుండరు. బహుశా అందుకేనేమో నాకు అత్తగారికి మధ్య అది పెద్ద విషయం అవ్వలేదు కానీ అమ్మ తీరు వేరు ఇప్పుడు TV తోనే అనటం కన్నా దాని కోసమే బ్రతుకుతోందేమో అన్న భావం మమ్మలిని కలవర పడేలా చేస్తోంది
ఆలోచనల్లో ఉండగానే ఇల్లు వచ్చేసింది. నా కోసమే ఎదురు చూస్తున్నట్టు అన్నయ్య వదిన ముందు హాల్లోనే కూర్చుని వున్నారు. అన్నయ్యనన్ను చూస్తూనే ఎదురు వచ్చి అభిమానంగా దగ్గరకి తీసుకొని “వదిన మాటల తో చాలా కంగారు పడి వచినట్టువున్నావు అంటూ లలిత కాఫీ తీసుకొని రా అని చాల ప్రశాంతంగ పలకరించాడు.. TV లో బ్రేక్ కాబోలు గదిలోనుండి బయటికి వచ్చి అమ్మ నన్ను చూసికూడా తనకోసం కాదులే అన్నట్టు మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయిందినాకు అలంటి వ్యవహారం కొత్త కాకపోయినా ఎందుకో ఆలా అమ్మని చూస్తే మనసులో బాధ మెలిపెట్టినట్టు అనిపించింది.. . కాఫీ ల పని అయిపోయాక పెద్ద ఉపోద్ఘాతం లేకుండా” నీకు తెలిసిన విషయమే ప్రమీల అమ్మని ఇక్కడే దగ్గరలో వున్న సాయి సేవ సదనం లో చేర్పిస్తున్నాను, ఇది నేనుసడన్ గా తీసుకొన్న నిర్ణయం కాదు.
ఎన్నాళ్ళ నుంచో అమ్మని గమనించి, అమ్మ మంచి కోరి తీసుకొన్న నిర్ణయం. నువ్వు కూడా చూస్తూనే వున్నావుగా అమ్మ లో చాలా మార్పు వచ్చింది. మనిషి జీవితం లో జరిగే వాటికీ స్పందించటం మరిచిపోయింది. మనిషి ఒక మర మనిషి లా మారిపోయింది. ఎంత సేపు TV లో లీనమయి ఉండటం వలన సహజంగా కలగవలసిన అనుభూతుల స్థానంలో సీరియల్స్ లో వాళ్లు చిత్రీకరిస్తున్నపాత్రల స్వభావాలని వంటపట్టించుకొంటోంది.
అన్నయ్య చెపుతున్నది నిజమే ఏయే సీరియల్ చూసినా ఎక్కువగా పగ ప్రతీకారాలు చూపిస్తున్నారు. కథాపరంగా అవి అవసరం అయ్యివుండ వచ్చు… కానీ విషం అన్నం లో కలిపి చంపేయటం, కత్తితో నరికివేయటం ఇలాంటివి చాలా సర్వ సాధారణంగా జరిగే విషయాలే అన్నట్టు చూపిస్తున్నారు, అది పసి
మనసులమీద, సమాజం మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో సీరియల్స్ తీసే వాళ్ళు అంత గమనిస్తునట్టు అనిపించదు.
“అది కాదు అన్నయ్య అమ్మని కొంత కాలం నేను తీసుకొని వెళతాను.” మాటకి అడ్డు చెపుతూ నా అభిప్రాయం చెప్పదలుచుకొన్నాను.
అమ్మకి ప్రాబ్లెమ్ ఇక్కడ ఇంట్లో కాదమ్మా. అది ఎక్కడవున్నా ఆవిడని వదలదు. ఎందుకంటే అది మనసుకి బుద్ధికి ఆలోచనలకి పట్టేసిన జాడ్యం…. ” పోనిలే అన్నయ్య, అమ్మ పెద్దది అయిపోయింది కదా. ఆవిడని ఈ వయసులో కష్ట పెట్టడం ఎందుకు… సర్ది చెపుదామని మాట్లాడబోయాను..
“నా బాధ కూడా అదేనమ్మా, .. అమ్మకి అరవైఐదు ఏళ్ళు వస్తున్నాయి అమ్మ పెద్దది అవుతోంది. వయసుతో పాటు పెద్దరికం కూడా రావాలి కదా.
మన చిన్నతనంలో గుర్తు ఉందా మన పెద్దవాళ్ళు తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఇంట్లో ఉంటే ఎంత ధైర్యంగ ఉండేది, వాళ్ళ రోజు దినచర్య ఎంత ప్రభావ వంతంగా ఉండేది… మనం కూడా ఎన్ని మంచి అలవాట్లు వాళ్ళని చూసి నేర్చుకున్నాము, ఏదైనా సమస్య వస్తే వాళ్ళఅనుభవం ఉపయోగపడి ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి పెద్దరికం నిలుపుకొనే వారు. వాళ్ళని చూస్తే వయసు భారం తో వచ్చిన మార్పు వలన మనసులోవారిపట్ల జాలి ఉండేది,, గౌరవం కలిగేది. ఇప్పుడు అమ్మ లాంటి వాళ్ళు పిల్లలికి ఆదర్శంగా నిలబడకపోవటం పోయి వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ కాలక్షేపం అని అనుకోని ఈ యంత్రాల బారినపడి జీవిత మాధుర్యాన్ని చేజేతులా కోల్పోతున్నారు, చెట్టు ముందా విత్తు ముందా అన్న రీతిన వాళ్ళ మార్పుకి కారణం ఈతరమా, మాతరమా అది కాదు ప్రశ్న… ఇంట్లో ని పెద్దవాళ్ళు ఇలా తమకి ఏమి పట్టనట్టు, తమ భాద్యత అయిపోయింది కాబట్టి తమ శేషజీ వితం ఇలా యంత్రాలపాలై గడపాలని అనుకోవటం తప్పు. దానివలన ఇంట్లో సహజంగా ఉండవలసిన వాతావరణం ఉండదు, వాళ్ళవాళ్ళ గదుల్లో ఎవరికీ వారేవుంటూ ఈ సాంకేతిక పరికరాల కోరల్లో బలి అయిపోతున్నారు.
కానీ అన్నయ్య సాయి సేవ సదనం ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు కదా అక్కడ అనాధ పిల్లలు, అభాగ్యులు వున్నారని విన్నాను… అక్కడికి అమ్మని….
అవును ప్రమీల కరెక్టుగా చెప్పావు అది ఒక మంచి NGO వాళ్ళు చాలా చక్కగా దానిని నిర్వహిస్తున్నారు. నేనుకూడా తీరికి సమయాల్లో వాళ్ళకి మేథ్స్, ఇంగ్లీష్ కంప్యూటర్స్ నేర్పుతున్నాను. వాళ్ళకి ఒక మంచి అనుభవం వున్న పెద్ద అండ కావాలి. అలాంటి మనిషి కోసం వాళ్ళు వెదుకు తున్నారు. అమ్మ అంత మంచి వ్యక్తి వాళ్ళకి ఎంతో అవసరం. మనల్ని పెంచటంలోనూ, తీర్చిదిద్దటం లోను అమ్మది ఎంత ప్రముఖమైన పాత్రో మనకి తెలుసు. ఇప్పుడు అక్కడ వున్న మనలాంటి పిల్లలకి
సరిఅయిన నడవడిక నేర్పే మంచి మనసున్న, అనుభవంవున్న మనిషి చాలా అవసరం. అమ్మ వయసు పెద్దదే అయినా దేమునిదయవలన ఆరోగ్యంగా వుంది. అల్లాంటి అమ్మని ఇలా మరమనిషిలా చూడటం చాలా కష్టంగా వుంది. ఇప్పుడు మనకి తన అవసరం అంతగా లేదని ఆలా గదిలో బంధింపడి ఆ TV ప్రోగ్రామ్స్ చూస్తూ అదే లోకమన్నట్టు బ్రతుకుతూ ఒక మరమనిషి ల బ్రతుకుతోంది. నేను తీసుకొన్న నిర్ణయం మొదటిలో కొంచెం బాధగా అనిపించినా, అక్కడ మనుషుల్లో వుంటూ మరచిపోయిన అనుబంధాల్ని, మానవత్వాన్ని మరల చిగురింప చేసుకొని మారిన మనిషిలా మళ్ళీ మన అమ్మని చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాను.
మన సమాజం లో ఇలా ఉపయోగపడే పెద్దలు చాలా మంది వున్నారు.. అందరికి సాధ్య పడకపోవచ్చు కానీ వీలైనంతవరకు అమ్మలాంటి వ్యక్తులని తిరిగి సమాజానికి ఉపయోగపడే లా చేయగలిగితే మరుగునపడిపోతున్న సామాజిక విలువలని మళ్ళీపునరుద్ధరించటం, మనుషుల మధ్య అనుబంధాల్ని మెరుగుపరచడం సాధ్య పడుతుంది అన్నది నా నమ్మకం. నా నిర్ణయం వలన బంధువుల్లో ఎల్లాంటి అపవాదు వస్తుందో అని లలిత కంగారు పడుతోంది. ఏదైనా మార్పు వస్తున్నప్పుడు అలజడులో సహజం… అమ్మ కూడా అంత తేలిక గా అంగీకరించలేదు. కానీ అక్కడికి వెళ్ళాక అంతమంది మానవత్వం నిండి వున్న మనుషుల్లో వుంటూ తను కూడా మారి పరిపూర్ణమైన జీవితానందాన్ని పొందుతుందని నా ఆశ. నా నిర్ణయం కూడా సబబు అయినదని, మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది అది నువ్వు చూద్దువుగాని. దీనికి కొంత సమయం పడుతుంది. మీరెవరు కంగారు పడవద్దు. అంటూ సేవ సమితి వారికి అమ్మని తీసుకు వస్తున్నట్టుఫోన్ చేసి తెలపడానికి లోనికి వెళ్ళాడు.
తేలిక పడిన మనసులతో అమ్మని చూద్దామని నేను వదిన గది వరకు వెళ్ళాము. నిస్తేజంగా యాంత్రికంగా టీవీ ని చూస్తోంది, మర మనిషి ల అయిపోయిన అమ్మ మారిన మనిషిలా అవుతుందన్న నమ్మకం తో వదిన దగ్గర సెలవు తీసుకొని భారమైన మనసుతో వెనుతిరిగాను.

4 thoughts on “మరమనిషి

  1. Prabhavathi garu : I read the story. Well written. The line of story is very contemporary and valid. And ofcourse, ‘kathanam’ is crisp and fast. You took us to your point nicely.
    Congratulations, once again
    Stay blessed and keep penning (typing) the stories

  2. సభ్యసమాజంలో వచ్చే మార్పుకి అద్దం పట్టడమే కాకుండా దానికి బలి అవుతున్న మానవ సంబంధ బాంధవ్యాలకి ఒక పరిష్కారం సూచించారు రచయిత.కధ ,కధనం రెండూ బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *