April 20, 2024

అమ్మమ్మ – 27

రచన: గిరిజ పీసపాటి

మర్నాడు ఉదయాన్నే తన అటుకుల గొలుసును కూడా జండగంటలు తాకట్టు పెట్టిన చోటే తాకట్టు పెట్టి, డబ్బు తెచ్చింది నాగ.
సాయంత్రం వసంతను తీసుకుని ముందుగా లేబ్ కి వెళ్ళి, డబ్బు కట్టి, రిపోర్ట్స్ తీసుకుని, వాటితో డాక్టర్ గారిని కలిసింది. ఆయన రిపోర్ట్స్ చూసి “నేను ఊహించిందే నిజమయ్యింది. ప్రస్తుతం వసంత పరిస్థితి సీరియస్ గా ఉన్న మాట నిజమే కానీ, ఇది జలోదరం కాదమ్మా!”
“వసంతకు షుగర్ వ్యాధి వచ్చింది. ఈ పరిస్థితుల్లో డా.చిట్టిపంతులు గారు తప్ప ఇంకెవ్వరూ వసంతను బతికించలేరు. వెంటనే వసంతను ఆయనకు చూపించండి” అంటూ అడ్రస్ చెప్పి, రికమండేషన్ లెటర్ రాసిచ్చారు.
అక్కడి నుండి సరాసరి వసంతను తీసుకుని డాక్టర్ చిట్టిపంతులు గారిని కలిసింది. ఆయన రిపోర్ట్స్ చూసి, వసంతను పరీక్షించి
“నేను చెప్పిన విధంగా డైట్ తీసుకుంటూ, మూడు పూటల ఇన్సులిన్ ఇంజక్షన్ ఇస్తూ, షుగర్ టెస్ట్ చేస్తూ ఉండు. వారం రోజుల తరువాత మళ్ళీ రండి” అని నాగకు చెప్పారు.
“మూడు పూటలా ఇంజక్షన్ ఇవ్వాలంటే మేమున్న చోట నర్స్ లు ఎవరూ లేరు డాక్టర్ గారూ. టాబ్లెట్స్ ఇస్తే…” అంటూ ఆపేసింది నాగ.
“చదువుకున్నదానివేగా? ఆ మాత్రం ఇంజక్షన్ చెయ్యలేవూ? టాబ్లెట్స్ కి తగ్గదు. ఇంజక్షన్ ఎలా చెయ్యాలో, షుగర్ ఎలా టెస్ట్ చెయ్యాలో నేను చెప్తాను. నేర్చుకో. ఇక మీదట ‘నాకు రాదు, నేను చెయ్యలేను’ అనే మాటలు నా దగ్గర మాట్లాడకు” అన్నారాయన సీరియస్ గా.
ఆయన అలా కసురుకుంటారని ఏ మాత్రమూ ఊహించని నాగ బిత్తరపోయి గబగబా తలాడించింది ‘సరే’ అన్నట్లుగా.
“అంతే కాదు. రోజూ మూడు పూటలా వసంతకు తినడానికి ఏం పెట్టావో, ఎంత క్వాంటిటీ పెట్టావో, ఎంత డోస్ ఇన్సులిన్ ఇచ్చావో, యూరిన్ షుగర్ ఎంత ఉందో ఒక చార్ట్ తయారు చేసి, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుని రా” అన్నారు
నర్స్ ని పిలిచి “ఎవరైనా పేషెంట్ కి ఇంజక్షన్ చేసేటప్పుడు ఈవిడకు ఎలా చెయ్యాలో చూపించు. అలాగే యూరిన్ షుగర్ ఎలా టెస్ట్ చెయ్యాలో చెప్పు” అని పురమాయించాగా, ఆ అమ్మాయి నాగకు నేర్పించింది.
వసంతను ఇంటి వద్ద దిగబెట్టి, వెంటనే కెజిహెచ్ ఏరియాలో ఉన్న సర్జికల్ షాప్ కి వెళ్ళి టెస్ట్ ట్యూబ్, స్పిరిట్ లేంప్, సొల్యూషన్ వంటి యూరిన్ టెస్ట్ కి అవసరమైన వస్తువులు కొని, మెడికల్ షాపులో ఇన్సులిన్ వెయిల్, సిరంజ్ మొదలైనవి కూడా కొనుక్కుని ఇంటికి వచ్చింది.
రాగానే వసంతకు భోజనం పెట్టి, ఇన్సులిన్ ఇంజక్షన్ చేసింది. మర్నాడు ఉదయం ఫాస్టింగ్ యూరిన్ షుగర్ టెస్ట్ చేసి, టిఫిన్ పెట్టి, ఇంజక్షన్ చేసింది. ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నీ చార్ట్ లో నోట్ చెయ్యసాగింది.
డాక్టర్ గారు చెప్పిన విధంగా చేసేసరికి వారం రోజులకల్లా 4+ ఉన్న షుగర్ 2+ కి వచ్చింది.
వివరాలన్నీ ఎప్పటికప్పుడు అమ్మమ్మకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తూనే ఉంది. మనవరాలికి ఇంత చిన్న వయసులోనే షుగర్ వ్యాధి రావడంతో అమ్మమ్మ కూడా చాలా వ్యధకు లోనైంది.
“ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్‌ కావడంతో చాలా పనులు ఒప్పుకున్నాను నాగేంద్రుడూ. పనులు పూర్తి కాగానే వస్తాను. నువ్వు అధైర్య పడకు” అంటూ నాగకు ఉత్తరం రాసింది.
వారం రోజులు గడిచాక మళ్ళీ వసంతను తీసుకుని డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళింది. వివరాలు నోట్ చేసిన చార్ట్ ను ఆయనకు ఇచ్చింది. దాన్నాయన పరీక్షగా చూసి “వెరీ గుడ్” అంటూ నాగను మెచ్చుకున్నారు.
వెంటనే బ్లడ్ షుగర్ కూడా టెస్ట్ చేయించి, ఆ రిపోర్ట్ కూడా చూసి తల పంకిస్తూ వసంతతో “మొత్తానికి గట్టి పిండానివే. యమధర్మరాజుని ఎదిరించావు. నీకు నూకలు చెల్లిపోయాయనుకున్నాను” అని నాగ వంక తిరిగి “ఇలాగే కంటిన్యూ చెయ్యు. మరో వారం రోజుల తరువాత మళ్ళీ రండి” అని పంపించారు.
మరో వారానికి యూరిన్ షుగర్ నార్మల్ కి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరకు వెళితే ఆయన మళ్ళీ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసి “ఇది కూడా నార్మల్ చూపిస్తోంది. ఇలాగే జీవితాంతం పాటించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా పిల్ల ప్రాణాలకు ముప్పు తప్పదు” అంటూ హెచ్చరించారు.
వసంత పిలక (జుత్తంతా ఊడిపోయి సన్నగా, పొట్టిగా పిలక అయిపోయిందని చెప్పాను కదా) పట్టుకుని ఊపుతూ “ఇలా అయితే నిన్నెవడు పెళ్ళి చేసుకుంటాడు? నాలాంటి తాత తప్ప. నీ భవిష్యత్తు ఇక నీ చేతిలోనే ఉంది. నేను చెప్పినవేవీ పొరపాటున కూడా తినకు” అని మరోమారు జాగ్రత్తలు చెప్పి “ఇక మీద వసంతను నెలకోసారి తీసుకొచ్చి చూపించు చాలు” అన్నారు నాగతో.
ఆయన మాటతీరే అంతనీ, కోపం వస్తే ఎంతగా కసురుకుంటారో పేషెంట్ తను చెప్పిన విధంగా పాటిస్తే అంతగానూ అభిమానిస్తారని అర్ధమైంది నాగకు. చనిపోవలసిన తన కూతురిని బతికించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆనాటి నుండి ఇంట్లో పండుగ నాడు కూడా స్వీట్స్ చెయ్యడం మానేసింది. ఒక పిల్ల తినకూడని పదార్థం దాని ఎదురుగా మిగిలిన ఇద్దరు పిల్లలూ తింటే అది బాధ పడుతుందని. అదే విషయం గిరిజకి, నానికి కూడా చెప్పగా వాళ్ళు కూడా “అక్క తినకూడనివి ఇకనుండి మేమూ తినమమ్మా” అని చెప్పారు.
చెప్పినట్లే వీలు చూసుకుని వచ్చింది అమ్మమ్మ. పిల్ల ప్రమాదం నుండి బయటపడినందుకు సంతోషించి, తను ఇవ్వగలిగినంత డబ్బు నాగ చేతిలో పెట్టి, వారం రోజులు ఉండి తిరిగి హైదరాబాదు వెళ్ళింది.
ఇన్సులిన్ ఖరీదు ఎక్కువ (అప్పట్లో ఒక వెయిల్ ఖరీదు 16 రూపాయలు) కావడంతో మెల్లిగా పిల్లల బంగారం బొట్టు బిళ్ళలతో సహా మొత్తం బంగారం అంతా తాకట్టుకు వెళ్ళిపోయి, విడిపించుకోలేక అమ్మేయాల్సి వచ్చింది.
తరువాత ఇత్తడి, రాగి సామాను అమ్మి ట్రీట్మెంట్ ఇప్పించింది. రానురాను ఇన్సులిన్ కొనడానికి డబ్బు లేకుండా పోయింది. అమ్మడానికి ఇంకేమీ మిగుల లేదు మెడలో పుస్తెల తాడు తప్ప.
అది కూడా అమ్మేద్దామంటే అప్పటికే మామగారు ‘బంగారమంతా పాడుచేసింది” అని చాలాసార్లు వీళ్ళకీ, వాళ్ళకీ చెప్పి తిట్టడం వింది. ఇక పుస్తెల తాడు కూడా అమ్మితే ఆయన ఊరుకోరు. అందుకే సాహసించలేకపోయింది.
స్పిరిట్, సొల్యూషన్ కొనే స్థొమత లేకపోవడంతో యూరిన్ టెస్ట్ చేసే పరికరాలు కూడా మూలన పడ్డాయి.
ఇంతలో ఎవరో చెప్పగా కృష్ణమాచారి గారి వద్ద హోమియోపతి (తక్కువ ఖరీదు అని) ఇప్పించసాగింది.
అనారోగ్యం కారణంగా వసంత కూడా గిరిజతో పాటే టెన్త్ పరీక్షలు రాసింది. ఇద్దరూ పాసయ్యారు. టెన్త్ పాసయిన కొద్ది రోజులకే వసంత ఎడమ చేతి వేలి మీద చిన్న చెమట పొక్కు అంత కురుపు లేచింది. రెండు రోజులకే చెయ్యి మొత్తం తెల్లగా, చీము పోయినట్లు అయిపోయింది.
రాత్రి అయింది. వసంత నిద్ర కూడా పోకుండా చెయ్యి నొప్పికి విలవిలలాడుతోంది. దాంతో భయపడిపోయి “ఏం చేద్దామండీ. పిల్లకి టెంపరేచర్ 104° దాటి ఉంది. తిండి తినడం లేదు. చెయ్యు నొప్పని ఏడుస్తోంది” అంది భర్తతో బేలగా.
ఆయన మరీ భయస్తుడు కావడంతో కన్నీళ్ళు పెట్టుకుని “ఇన్నాళ్ళూ నువ్వే దాని ట్రీట్‌మెంట్‌ విషయం చూసుకున్నావు. ఇప్పుడు కూడా నువ్వే ఏదో ఒకటి చెయ్యు” అన్నాడు.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *