March 29, 2024

కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?

రచన: కంభంపాటి రవీంద్ర

“ఇదిగో ..బయటికెళ్తున్నా .. తలుపేసుకో”
“ఎక్కడికేమిటి ?”
“బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికీ అని అడగొద్దని ఎన్ని సార్లు చెప్పాలి ?”
“అడిగినన్ని సార్లూ చెప్పాలి”
“అంటే ..ఓసారి చెబితే బుర్రకెక్కదన్నమాట”
“బుర్రకెక్కేలా చెబితే ఎందుకెక్కదూ ?”
“అయితే, నేను బుర్రకెక్కేలా చెప్పనన్నమాట ! !”
“మన బలహీనతలనెరడగం కూడా ఓ రకమైన బలం”
“ బలహీనతేమిటీ ?”
“ఇప్పుడే చెప్పేరు కదా !”
“నేను నా బలహీనత చెప్పేనా ??”
“అంటే .. ఇందాక మీరు చెప్పింది .. మీ బలహీనత కాదు .. బలం అనుకుంటున్నారా ?”
“ఏం చేస్తాం ..ఇల్లంతా నీ రాజ్యం మరి!.. ఎంత ఏనుగైనా .. నీళ్లలో దిగిన తర్వాత మొసలి తో పోరాడలేదు..అలాగే నేను ఇంట్లో ఉంటే నీతో గెలవలేను”
“మిమ్మల్ని మీరు ఏనుగుతో పోల్చుకునేంత దారుణం గా ఏమీ లేర్లెండి .. ఆ పొట్ట ఓ నాలుగించీలు తగ్గితే చాలు .. ఇంకెవరూ మిమ్మల్నెవరూ ఏనుగనరు”
“అంటే నేను ఏనుగంత లావుగా ఉంటానా ?.. నన్నందరూ ఏనుగుని పిలుస్తారా ?..ఎవరు వాళ్ళు ?”
“ఏమో .. మిమ్మల్ని మీరు ఏనుగుతో పోల్చుకుంటే , నలుగురూ మిమ్మల్ని ఏనుగంటున్నారేమో .. అందరూ అదే అనుకుంటే, నేను వేరేగా ఎందుకనుకోవాలని .. మిమ్మల్ని మీరు ఏనుగులా ఊహించేసుకున్నారేమో అనుకున్నా !”
“అనుకుంటావనుకుంటావు .. నన్ను నేను ఏనుగుతో పోల్చేననే మాట గుర్తుంది గానీ .. నిన్ను మొసలి తో పోల్చేననే విషయం మటుకు గుర్తు లేదు కదూ !”
“నేను అలా ఉండను అని నాకు తెలిసినప్పుడు , మళ్ళీ మీరేదో అన్నారని ఎందుకు పట్టించుకోవడం ? అయ్యో ..పాపం ..మీరు కళ్ళజోడు మార్చుకునే రోజొచ్చింది అనుకున్నానంతే”
“అంటే .. నువ్వు నన్ను ఏనుగుతో పోలిస్తే .. నేను బాధపడకుండా .. “ఆం .. నేను ఏనుగులా ఉండడమేంటీ ?” అని దులిపేసుకుపోవాలన్నమాట !”
“మరదే .. నేనెక్కడ పోల్చేను ? మిమ్మల్ని మీరు పోల్చుకున్నారు .. అయినా నాకు తెలీక అడుగుతున్నాను .. మీ గురించి మీకు అంత తక్కువ అభిప్రాయం ఎందుకండీ ?”
“నా గురించి నాకేం తక్కువ అభిప్రాయం లేదు .. నీకు నా మీదున్న అభిప్రాయం నామీద రుద్దకు”
“మీ మీద రుద్దడానికి నా అభిప్రాయవేమైనా సబ్బా ?.. అంతేలెండి .. నేనన్నా .. నా అభిప్రాయమన్నా భలే చులకన మీకు!”
“మధ్యలో ఈ సబ్బు ఎక్కణ్ణుంచొచ్చిందీ ?”
“ఏ సబ్బు ?”
“అదే .. నీ అభిప్రాయం సబ్బులా ఉంటుంది అనేదో అన్నావు కదా”
“నా అభిప్రాయం సబ్బులా ఉంటుందని నేనేం అనలేదు .. మీరే అన్నారు”
“నేనెప్పుడన్నానూ ? నీ అభిప్రాయం రుద్దకు అన్నాను .. సబ్బుతో పోల్చింది నువ్వు”
“రుద్దకు అంటే సబ్బుతో పోల్చక .. తువ్వాలుతో పోలుస్తానా ఏమిటి ?”
“రుద్దడం అంటే సబ్బే అవ్వాలా ఏమిటి ?”
“మీకు మా కుంటబ్బులు గుర్తున్నాడా ?”
“ఎందుకు గుర్తు లేడూ ?”
“ఎందుకు గుర్తు లేడో నాకేం తెలుసు ?.. గుర్తున్నాడా లేదా ?”
“గుర్తున్నాడు .. మీ పాలేరు”
“మరి వాడు ఉదయాన్నే మా గేదెని పాంచాలరేవు గట్టు దగ్గిర కాలవలో దింపి, దాన్ని గడ్డితో బాగా రుద్దుతాడు”
“అంటే నేను గేదెనా ?”
“నేనలా అన్లేదు .. రుద్దడం అంటే సబ్బేనా అన్నారు కాబట్టి …గడ్డితో కూడా రుద్దచ్చు అని చెప్పేను”
“అంతేలే .. నాది మరీ గేదె బతుకైపోయింది !”
“అంటే నా వంట గడ్డిలా ఉంటుందనేగా మీ ఉద్దేశం !”
“అంటే నేను గేదెనంటావు?”
“నేననలేదు .. మిమ్మల్ని మీరే అనుకుంటున్నారు .. ఇందాక ఏనుగనుకున్నారు .. ఇప్పుడు గేదె అనుకున్నారు .. అయినా మిమ్మల్ని కాదు .. ఆ సామర్లకోటాయన్ని అనాలి”
“ఎవరా సామర్లకోటాయన ? మధ్యలో ఆయనెందుకు వచ్చేడు ?”
“ఆయనేమీ మధ్యలో రాలేదు .. మన సంబంధం కలిపింది ఆ సామర్లకోట పంతులు గారే .. మా నాన్న సబ్బు కొనడం కోసం కిరాణా కొట్టుకెళితే , అక్కడ కనిపించిన ఆ పంతులు గారు .. ఏనుగో ..గేదో తేల్చుకోలేని మీ సంబంధం తెచ్చేడు”
“అంతేలే .. నాది మరీ గేదె బతుకైపోయింది !”
“అంటే నా వంట గడ్డిలా ఉంటుందనేగా మీ ఉద్దేశం !”
“అంటే నేను గేదెనంటావు?”
“నేననలేదు .. మిమ్మల్ని మీరే అనుకుంటున్నారు .. ఇందాక ఏనుగనుకున్నారు .. ఇప్పుడు గేదె అనుకున్నారు .. అయినా మిమ్మల్ని కాదు .. ఆ సామర్లకోటాయన్ని అనాలి”
“ఎవరా సామర్లకోటాయన ? మధ్యలో ఆయనెందుకు వచ్చేడు ?”
“ఆయనేమీ మధ్యలో రాలేదు .. మన సంబంధం కలిపింది ఆ సామర్లకోట పంతులు గారే .. మా నాన్న సబ్బు కొనడం కోసం కిరాణా కొట్టుకెళితే , అక్కడ కనిపించిన ఆ పంతులు గారు .. ఏనుగో ..గేదో తేల్చుకోలేని మీ సంబంధం తెచ్చేడు”
“అంటే ..నేను ఏనుగు.. కాకపొతే గేదె అని నీ ఉద్దేశం !”
“నా ఉద్దేశం కాదు .. మిమ్మల్ని గురించి మీ ఉద్దేశం .. అయినా ఇన్ని మాటలెందుకు బాబూ .. ఎలాగూ బయటికి వెళ్తున్నానన్నారు కదా .. వచ్చేటప్పుడు ఓ స్నానాల సబ్బు తెండి .. అది చెబుదామనే .. ఇందాక ఎక్కడికి అని అడిగేను”
“ఏడ్చినట్టుంది .. నేను సబ్బు తేవడానికే కిరాణా కొట్టుకెళ్తూంటే .. “ఎక్కడికండీ” అంటూ మొదలెట్టి నన్ను నేను ఏనుగో గేదో తేల్చుకోనీకుండా చేసేసేవు !”
“ముందే చెప్పేనుగా .. మీకు అవతలి వాళ్ళ బుర్రకెక్కేలా చెప్పడం రాదండి .. “ఇదిగో నేను సబ్బు తేవడానికి బయిటికి వెళ్తున్నాను ” అని చెప్పకుండా ..ఏదో రాచకార్యానికి వెళ్తున్నట్టు “ఇదిగో నేను బయిటికి వెళ్తున్నాను” అన్నారు .. అక్కడొచ్చిందిదంతా !”
“అవతలి వాళ్ళ బుర్రకెక్కడానికి నేనేమైనా పేనా ఏమిటీ ?”
“మహాప్రభో .. మీరు ఏనుగో ..గేదో ..పేనో .. తర్వాత తేలుద్దాం .. ముందెళ్ళి సబ్బు పట్రండి ..”

4 thoughts on “కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?

  1. సాహిత్య ‘మాలిక’ మాలిక్ లకు నమస్కారములు
    మీ బ్లాగ్ లోని అంశాలని నేను మా స్నేహితులతో పంచుకోవచ్చునా ?

  2. కళ్ళనించి నీళ్లు కారుతూ, బుగ్గలు నొప్పెడుతూ నవ్వి నవ్వి ఇంకా నవ్వలేను.

Leave a Reply to వ.వేం.కో. రామారావు. Cancel reply

Your email address will not be published. Required fields are marked *