March 28, 2024

పేదోడి ప్రశ్న

రచన: జెట్టబోయిన శ్రీకాంత్

ఆకలి అంటే ఏమిటో
నూకలి గింజనడుగుతా..!
ఈ ఆకలి ఎందుకవుతదో, మాడుతున్న కడుపునడుగుతా..!

గూడు అంటే ఏమిటో
గుడిసెలున్న అవ్వనడుగుతా…!
తోడు అంటే ఏమిటో
నా మనసులోని మనిషినడుగుతా…!

కష్టము అంటే ఏమిటో
నా ఒంటిమీది చెమటనడుగుతా…!
దురదృష్టము అంటే ఏమిటో
నా కంటిలోని నీటినడుగుతా…!

కోపము అంటే ఏమిటో
నాకు జీతమిచ్చే దొరని అడుగుతా…!
శాపము అంటే ఏమిటో
నా నుదిటనున్న రాతనడుగుతా…!

కరువు అంటే ఏమిటో
ఎండిపోయిన చెరువునడుగుతా…!
పరువు అంటే ఏమిటో
ఊగులాడే ఉరితాడునడుగుతా…!

పేదోడు అంటే ఎవ్వడో
ఆ తాటాకుల తడకను అడుగుతా..!
ఉన్నోడు అంటే ఎవ్వడో
ఆ గంధపు చెక్కల గడపను అడుగుతా…!

~~~~~~~~~~~~~~~~

1 thought on “పేదోడి ప్రశ్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *