April 20, 2024

విశ్వపుత్రిక వీక్షణం – రుబాయీలు

రచన: డా.పి.విజయలక్ష్మిపండిట్

1.

మనుషుల మనసులను చదవలేమని తెలుసుకో
కవిత్వాన్ని నిర్వచించడం కూడా అంతేనని తెలుసుకో,
నా గుండెలో కొట్లాడుతున్నాయి ఆలోచనా విహంగాలు
నీవు వాటిని పట్టి బంధించి పసికట్టలేవని తెలుసుకో.

2.

నీ పుట్టుక పెంపకం పరిసరాల పదనిసలే నీ కవిత్వం
నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్సించే దర్పణం నీ కవిత్వం,
నీ కవిత్వం నీతో కూడా నడిచే నీ అక్షరసహచరి కాదా
నీ జీవిత అనుభవాల అక్షర రూపమే కదా నీ కవిత్వం.

3.

కవుల మానససరోవరంలో మునకలేస్తాయి అక్షరాలు
ఊహల గాలానికి చిక్కని చిలిపి చేపలు ఆ అక్షరాలు,
కవులు వ్యక్తీకరణ మత్రంతో పడతారు కవితా పదాలను
కవులు అల్లిన కవితామాలికలలో ముత్యాలు అక్షరాలు.

4.

కవుల కవితలు కాల గమన చరిత్ర అక్షర సిరులు
కావ్యాలు పురాణగాధలు మనిషికి మార్గదర్శ సిరులు
కాలాన్ని అక్షరాలలో బంధించే మాంత్రికులు కవులు
కవితాహలికులు పండించాలి ఆపురూప అక్షరసిరులు.

5.

కవి మనసు విశ్వమంత సువిశాలం ఆలోచించ
ప్రాంత కులమత భాష గోడలు కట్టద్దు ఆలోచించు,
విశ్వమానవ సౌభాతృుత్వం లేని ఆ కవి కవేనా
ఈర్ష్యా ద్వేషాలకతీతులు విశ్వకవులు ఆలోచించు.

*******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *