February 5, 2023

అల్ విదా!

రచన : సోమ సుధేష్ణ

“నా మనసుకు నచ్చి, కోరికల కోటాలో కొట్టుకు పోయేవాడు కాకుండా అరవింద్ బావలాగ మంచి వాడైతే తప్ప నేను పెళ్ళి చేసుకోను. ” అని ఖచ్చితంగా చెప్పింది మాలిక.
అలాగేలే అని దీవించారు విమల, బలరాం తమ గారాల కూతురును. అది విని మౌనిక చెల్లిని ప్రేమగా అక్కున చేర్చుకుని దీవించింది. మౌనిక కంటే మాలిక నాలుగేళ్ళు చిన్నది. అందరికి ఇద్దరు పేరెంట్సు ఉంటె` మాలికకు ముగ్గురున్నారు. మౌనిక మూడో పేరెంటు. చెల్లి అంటే ప్రాణం. చెల్లిని ఎవరేనా ఒక్క మాట అన్నారంటే వాళ్ళతో యుద్ధమే చేస్తుంది. చిన్నప్పటి నుండి చెల్లిని ఓవర్ ప్రోటేక్టివ్ చేస్తుంది.
మౌనిక పెళ్ళి అనుకోకుండా జరిగింది. ఒకరోజు విమల అక్క శ్యామల అంటే మౌనిక పెద్దమ్మ, ఒక చక్కటి సంబంధం, అబ్బాయి సూపర్ అనుకో, మౌనికకు ఫర్ఫెక్ట్ గా సరిపోతాడు అని చెప్పింది.
మౌనికకు ఇంకో సంవత్సరంలో డిగ్రీ పూర్తి అవగానే పెళ్లి చేద్దామని అలోచించారు విమల బలరాం. కానీ అబ్బాయి అరవింద్ ఉద్యోగం చేస్తున్నాడు. చాల మంచివాడని, పోకళ్ళు పోయే రకం కాదని, అతని కుటుంబం కట్నం కానుకలు అంటూ పేచీ పెట్టె రకం కాదని శ్యామల మరిమరీ చెప్పింది. అంతేకాదు ఆలస్యం చేస్తే రెప్ప వేసి తెరిచేలోగా అమ్మాయి ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు అబ్బాయిని ఎగరేసుకు పోతారని మరిదికి, చెల్లెలికి ఊదరగోట్టంలో ఊదినట్టుగా పదే పదే చెవిలో ఊదడంతో అవకాశాన్ని అర్థం చేసుకుని మౌనికకు పెళ్ళి చేయ్యాలని నిశ్చయించారు. అప్పటికప్పుడు కుదిరిన పెళ్లి కావడంతో ఎక్కువ ఆడంబరాలు లేకుండ తమ స్థితికి తగ్గట్టుగా మోతాదులో పెళ్ళి చేసారు. మౌనిక కాలేజి పూర్తి చేయడానికి కూడా అరవింద్ ఒప్పు కున్నాడు. అదీ ఒక ప్లస్ పాయింటే కదా అని మౌనికతో బాటు తల్లి తండ్రి కూడా మురిసి పోయారు. ‘వన్ డన్ అండ్ వన్ మోర్ టు గో’ బలరాం మాటలకు తృప్తిగా నవ్వింది విమల. మాలిక పెళ్లి ఇలా హడావుడిగా కాకుండా అన్ని చక్కగా ప్లాను వేసుకుని సంబరంగా చెయ్యాలనుకుని మరింత మురిసిపోయింది విమల.

**********

తర్వాత నాలుగేళ్లకు మాలిక బి. ఇడి. పూర్తి చేసింది. వెంటనే హైస్కూల్లో ఉద్యోగం దొరికింది. ఇంటికి దగ్గరలోనే ఉన్న స్కూల్ కాబట్టి అందరికి తృప్తిగానే ఉంది. కూతురికి పెళ్లి చేసి ఒకింటి దాన్ని చేయాలని విమలకు ఉబలాటంగా ఉంది. ఆ మాటే విమల, బలరాం తమకు తెలిసిన బందు మిత్రుల చెవిని వేసారు. నవ్వుతూ ఇట్టే కలిసి పోయే తత్త్వం మాలికది. మాలిక మనసు అర్థం చేసుకుని, మంచి ఉద్యోగం చేసే వాడైతే ఏ కొరతా లేకుండా బిడ్డ సుఖ పడ్తుందని తల్లి, దండ్రి కోరిక. ఏ తల్లిదండ్రుల కుండదా కోరిక!
తెల్లగా, సన్నగా పొడుగాటి జడతో అణువణువునా యౌవ్వనం తొంగి చూస్తున్నమాలికను చూసి చాలా మంది స్నేహితులకు ఈర్ష్య ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ పలకరించే వారు. కాలేజే రోజుల్లో కూడా అప్పుడే విచ్చుకున్న గులాబీ పువ్వులా ఉన్న మాలికను చూసి అబ్బాయిల కళ్ళూ, మనసు కూడా నిలకడ లేకుండా సైకిల్ చక్రాల్లా మాలిక చుట్టూ తిరిగేవి. మాలికకు ఆ చూపులు అలవాటే. ఆ చూపుల తాకిడికి తడబడకుండా ముందుకు దాటి పోవడం కూడా అలవాటే.
హేమ మాలికకు క్లోజ్ ఫ్రెండ్. ఎలిమెంటరీ స్కూల్ నుండి ఇద్దరూ స్నేహితులు. బి. ఇడి. లో కూడా ఇద్దరూ క్లాసుమేట్సే అయితే బి. ఇడి. చేయడం పూర్తయాక మాలిక హైస్కూల్ టీచరుగా ఉద్యోగంలో చేరింది. హేమ ఎం. ఇడి. లో చేరింది. జీవితంలో వారి దారులు వేరైనా స్నేహితం గట్టి పడిందే కానీ పలుచ బడలేదు. ఇద్దరు తరుచుగా కలుసు కొని, ఏ సినిమాకో లేక షాపింగుకో వెల్తూనే ఉన్నారు.
ఆ రోజు మాలిక తన క్లాస్ మేట్ చందన ఎంగేజ్ మెంట్ పార్టికి హేమతో కలిసి వెళ్ళడానికి హేమ ఇంటికి వచ్చింది. ముందు గదిలో ఎవరితోనో మాట్లాడుతున్న హేమ అన్న, రోహన్ ను చూసింది.
“హలోఅన్నా!”
“హలో మాలికా, బావున్నావా? లోపలి రా. హేమ అలంకారం ఇంకా అయినట్టు లేదు. ”
మాలిక గొంతు వినగానే తయారవుతున్న హేమ గబగబా ముందు గదిలోకి వచ్చి నవ్వుతూ మాలిక వేపు చూస్తూ,
“హి ఈజ్ మై కజిన్ విక్రం” అతని వేపు చూసి “మీట్ మై ఫ్రెండు మాలిక. ” వాళ్ళిద్దరికీ పరిచయం చేసింది.
కళ్ళార్పకుండా చూస్తున్న ఆ కొత్త శాల్తీ లేచి షేక్ హేండ్ కోసం చెయ్యి ముందుకు చాచాడు.
“హలో”
“హలో మాల. ” నవ్వుతూ అన్నాడు విక్రం.
“మాలిక” తన పేరు సరిచేసింది.
“ప్లెజర్ టు మీట్ యూ మాలవిక. ” ఏ పేరైనా పేరుకే అందం ఇస్తోంది ఈమె రూపం అని లోలోనే అను
కున్నాడు విక్రం. అందునా పార్టికి కి వెళ్లబోయే ఆడవాళ్ళ అందం చెప్ప నలవి కాదు. అలంకారాలతో అందం ద్విగుణీ కృతమవుతుంది.
“మాలిక” మరోసారి తన పేరును సరిదిద్దింది.
“బొట్టు పెట్టుకొని, హేండ్ బేగ్ తీసుకోవాలి, ఒక్క ఐదు నిమిషాలే. . . లోపలికి రా” అంటూ లోపలి వెళ్తున్న హేమతో వెనకాలే మాలిక లోపలికి వెళ్ళింది.
ఇద్దరూ ఊబర్ లో కూర్చున్నాక దారిలో, “ఇతనేనా అమెరికా నుండి వచ్చాడని చెప్పావు!”
“యస్ ఇతనే. పది రోజులయింది. పెళ్ళి కూతురి వేటలో ఉన్నాడు. అతని పేరెంట్సు అమ్మాయిల లిస్టు తయారు చేసి, అందులోంచి కొందరిని ఫిల్టర్ చేసి, నచ్చిన కొందరిని ఎన్నిక చేసి పెట్టారు. విక్రం వాళ్ళని చూసి అందులోంచి ఒకమ్మాయిని ఎన్నుకుని ఒ. కే. అంటే పెళ్ళి తంతు జరుగుతుంది గాబోలు. ఫైనల్ సెలెక్షనుకు వచ్చినట్టున్నారు. ఇదంతా ఫాస్ట్ ఫార్వార్డ్ లో జరిగి పోవాలి. ఈ పరదేశికి ఎక్కువ టైం లేదట. ”
“రెండు సంవత్సరాలకే అమెరికన్ అయిపోయినట్టున్నాడు. పదేళ్లు అక్కడే ఉంటె ఇంకెంత మారతాడో!” “అమెరికా వెళ్ళిన కొత్తలోనే ఇలా ఉంటారు లేవోయ్. కొన్నాళ్ళు పోతే మాములై పోతాడు. మా ఆంటీ కుటుంబానికి సోషల్ స్టేటస్ చాలా ముఖ్యం. వాళ్ళ స్నేహ బృందంలో వాళ్ళు చాలా మంది మన దేశంలో పుట్టి, మన దేశంలోనే జీవిస్తున్నా పరదేశంలో పుట్టి పెరిగినట్టు ప్రవరిస్తారు. ఆ ఆడంబరాల జీవితం జీర్ణించుకు పోయిన వాళ్ళను మార్చడం బ్రహ్మ తరం కాదు. ” ఇద్దరు నవ్వుకున్నారు. అంతలో చందన ఇల్లు వచ్చేసింది. రెట్టించిన కుతూహలంతో ఇద్దరూ హాలులోకి నడిచారు.
మామూలుగా ఉండే చందన చాలా అందంగా బొమ్మలా ఉంది. ఎంగేజ్ మెంటు అన్నారు కానీ అంతా పెళ్లి లాగే ఆడంబరంగా చేస్తున్నారు. ఎంగేజ్ మెంటుకే ఇంత హంగామా ఇక పెళ్ళి చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపోవేమో! పెళ్లి కొడుకు చాయ కాస్త తక్కువున్నా హేండ్స్ మ్ గా ఉన్నాడు. చికాగోలో డాక్టరట. పెళ్లి కొడుకు పక్కనే ఉన్న స్నేహితులు ముగ్గురు అమెరికా నుండి వచ్చారట. మిగతా వారంతా ఇక్కడి వాళ్ళే కాలేజి స్నేహితులు, బంధువులు ఉన్నారు.
నవీన చందన పిన్ని కూతురు చదన కంటే రెండేళ్ళు జూనియర్. తను పెళ్లి కొడుకు స్నేహితులకు
ఫలహారాలు, పానీయాలు అందుతున్నాయో లేదో అని చూస్తోంది. మాలిక, హేమ తమ స్నేహితుల
మధ్యకు వెళ్లి కబుర్లలో పడ్డారు. కిలకిల నవ్వులతో, ఓర చూపుల నెరజాణలు అబ్బాయిలను చూస్తున్నారు. అబ్బాయిలు మాత్రం ఏం తీసి పోలేదు ఏపని చేసినా క్రాపు సరి చేసుకుంటూ అమ్మాయిల వైపు పోజుల గాలం వేస్తూనే ఉన్నారు. ఆ చేష్టలు, ఆ చూపులు వయస్సుకే అందాన్నిస్తున్నాయో లేక ఆ వయస్సు వాళ్ళ పరి భాషకే అందమిస్తున్నాయో తెలీదు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక యువకుడు అమెరికా అబ్బాయిలతో చేయి కలిపి అటు తిరిగి పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. అతని నవ్వు, స్టైలు చూస్తూంటే ముగ్ధ మోహనంగా ఉన్నాడు. అమ్మాయిలందరి దృష్టి ఒకేసారి అతని వేపు తిరిగింది. “ఎవరీ హేండ్సమ్ గై!” లీనత చిన్నగా అంది. అమ్మాయిలందరూ ఒకరి నొకరు చూసుకున్నారు. ‘అతనెవరా!’ అనే క్వెశ్చన్ మార్కుతో పాటు అతనెవరో తెలుసుకోవాలనే అత్రుత కూడా కనిపిస్తోంది అందరి మొహాల్లోను కనిపిస్తోంది. . అంతలో నవీన వచ్చి విప్పారిన కళ్ళతో ఉన్న లీనత చెవిలో ఏదో విస్ఫరించి పోయింది. రెండు నిమిషాల్లో ఆ మాట అందరి చెవుల్లోకి వెళ్ళింది. వెంటనే వాళ్ళ మొహాల్లో మార్పుతో బాటు ‘ఓ. . నో. . ’ అనే మాటలు గున్ గునాయించాయి. ఇంతకీ లీనత ద్వారా వచ్చిన సమాచారం ఆ బాహుబలి అసలు పేరు ప్రఫుల్, అక్కడి అమ్మాయిలకు ఎవరికీ దక్కడు, చిక్కడు. ‘ఏ అమ్మాయికి దొరికాడో!’ హటాత్తుగా అమ్మాయిల మనస్సుల్లో నిరాశ, నిస్పృహ ఆవరించుకుంది. అతని సంగతలా వదిలేస్తే ఆరోజు ఫంక్షన్ ఆనందంగా ముగిసింది. అమ్మాయిల మనసులో చిన్న థాట్ – ‘ఆ బాహుబలి చేపట్టిన అమ్మాయి ఎవరై ఉంటారా!’ అనే రొద కదులుతూనే ఉంది. హేమ, చందన ఎడతెగని హాసాలు, అలంకారాల గురించి కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు.
*****
అ రోజు విద్యార్థుల పేపర్లు కరెక్టు చేస్తున్న మాలిక మోగుతున్న సెల్ ఫోన్ తీసింది.
“హలో హేమ!”
“హలో మాలిక! ఒక ముఖ్య విషయం, విక్రం నీతో మాట్లాడతాడట నీ ఫోన్ నంబరు అడిగాడు, ఇవ్వనా?”
“నాతోనా! ఏమ్మాట్లాడతాడట హేమా! సంగతేమిటో నువ్వే కనుక్కో వచ్చుగా!”
“నువ్వు చాలా నచ్చావట. నీకు మనసిచ్చేసి నట్టున్నాడు. ” గలగలా నవ్వు. . .
“ఆ నవ్వాపు ముందు. అయినా నాగురించి ఏం తెలుసని మనసిచ్చేసాడు!” చిరు కోపంతో అంది.
“నువ్వు చాలా నచ్చావట. నీ గురించి అడిగాడు. నువ్వు ఒప్పుకుంటే అతనికి నీ ఫోన్ నంబరు ఇస్తాను.
లేకపోతే ఎదో ఒక సాకు చెప్తాను. ఛాయిస్ నీది. ”
“నా గురించి ఏం చెప్పావే! అతని గురించి నాకైతే ఏమి తెలీదు. నీ ఆంటీ కొడుకని, అమెరికాలో ఉంటాడని తప్ప ఎప్పుడు అతని గురించి మనం మాట్లాడుకోలేదు. అయినా కళ్ళకు నచ్చగానే సరిపోతుందా! అదీ కొన్ని క్షణాలు చూసాడు. మనిషి స్వభావం తెలీకుండా. . . అయినా అమ్మాయి సెలెక్షను ఫైనల్ స్టేజిలో ఉందన్నావుగా!”
“ఫైనల్ సెలెక్షన్ అయినట్టు లేదు. ఫైనల్ సెలెక్షన్ అయిపోయినా లవ్వు అన్నింటిని ఓవర్ టేక్ చేస్తుందనే విషయం అందరికి తెలిసిందేగా! నీ గురించి మామూలు విషయాలే చెప్పాను. అంటే నీ చదువు, ఉద్యోగం మన స్నేహం గురించి క్లుప్తంగా చెప్పాను. విక్రం గురించి చెప్తాను విను – ఐ. టి. చేసాడు. ఇక్కడ ఒక ఏడాది పాటు ఉద్యోగం చేసి, నాలుగేళ్ల క్రితం చికాగోలోని ఒక కంపెనీ ఉద్యోగంలో లాండు అయ్యాడు. అక్క వినుత పెళ్ళయి అమెరికాలో సెటిల్ అయింది. విక్రం పేరెంట్సు అదే అంటీ, అంకుల్ వరంగల్ లో ఉంటారని నీకు తెలుసుగా. ఒక్క కొడుకు కదా విక్రమ్ను గారాబంగానే పెంచారు. హమ్మయ్య! ఒక నవల రాసేయ వచ్చు కదా!” నవ్వింది.
“యూ ఆర్ ఇంపాజిబుల్ కామ్రేడ్! సరే నా సెల్ నంబరివ్వు. చూద్దాం ఏం మాట్లాడతాడో!” కుతూహలంగా అంది.
ఒక గంటలోనే మాలిక సెల్ రింగయింది. టక్కున ఫోను అందుకుంది.
“హలో మాలిక! నేను ఫోన్ చేసి మీకు ఇబ్బంది కల్గించడం లేదుకదా! ఎలా ఉన్నారు? ఈ టైములో మాట్లాడితే ఫర్వాలేదా?”
“ఫర్వాలేదు. ”
“గుడ్! హేమ ద్వారా మీరు నా గురించి వినే ఉంటారు. దాగుడు మూతలు ఆడకుండా మీతో సూటిగా మాట్లాడతాను. హేమ ఇంట్లో మిమ్మల్ని మొదటి సారి చూసాను. అరగంట తర్వాత మీరు నవ్వుతూ బై చెప్పి వెళ్తున్నపుడు మీతో బాటు నా మనసు కూడా మీ వెంట తీసుకెళ్ళి పోయారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సంతోషంగా చెప్తున్నాను. ఒక్క మీ అందమే కాదు మీరు చాల మంచి వారని హేమ ద్వారా విన్నా నేనిక టైం వెస్ట్ చేయదలచు కోలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం ఒకసారి కలుద్దాం. అప్పుడు అన్నీ మాట్లాడు కోవచ్చు ఏమంటారు!”
మంచి మాటకారే, సందేహం లేదు.
“మన మధ్య ఎక్కువ పరిచయం లేదు. హేమ ద్వారా మీరు వినడం వేరు, స్వయంగా ఒకరినొకరు అర్థం
చేసుకోవడం వేరు. ”
“అందుకేగా మనం కలవాలంటున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడే నేను రడి. ”
“మీరు మా ఇంటికి రండి. మా పేరెంట్సుతో కూడా కలవొచ్చు. ” మాలిక నవ్వుతూ అంది.
“నాకు మీ పెరెంట్సును కలవడానికి ఏ అభ్యంతరం లేదు. ముందు మనిద్దరం కలుద్దాం. మనిద్దరికీ క్లిక్ అయితే అప్పుడు మీ పేరెంట్సును కలుస్తాను. రేపు లంచ్ కు బాదుషా రెస్టారెంటులో లంచ్ కు కలుద్దాం. నేను వనోక్లాక్ కు వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాను. మీకు ఒకే కదా?”
“సరే. ” ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. మాలిక మాటలు విని పేరెంట్సు అభ్యంతరం చెప్పలేదు.
మరునాడు మాలికను పికప్ చేయడానికి ఒక అరగంట ముందే వచ్చాడు విక్రం. బాదుషా రెస్టారెంటు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. ఓ పక్కగా ఆల్రడీ రిజర్వ్డ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నాక కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. తర్వాత విక్రం మాటల్లోకి దిగాడు. వీళ్ళకు దగ్గరలో ఎవరూ లేక పోవడంతో మాలిక కాస్త రిలీఫ్ గా ఫీలయింది.
“ఇ లవ్ యూ అండ్ వాంట్ టు మేరీ యూ మాలికా. మీరు మీ అభిప్రాయం నిర్భయంగా చెప్పండి. నా ఇష్టానికి నా పేరెంట్సు ఎప్పుడూ అభ్యంతరం చెప్పరు. మీకు ఈ ప్రపోజల్ ఇష్టమేనా?” సిగ్గుతో ఎర్రబడిన మాలిక మొహాన్ని తదేకంగా చూస్తూ,
“మీ నిర్ణయం “యస్” అని గెస్ చేస్తున్నాను. ” అన్నాడు.
మాలిక ధైర్యం తెచ్చుకుని, సిగ్గు తెరలోంచి బయటికి వచ్చి, నేప్కిన్ వేపు చూస్తూ,
“మేము డబ్బున్న వాళ్ళం కాము. మధ్య తరగతి జీవితంలో పరువు, మర్యాదలే మా ఆస్తులు, బందువులు కూడా. ” విక్రం వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని తెలుసు గాబట్టి ముందుగా ఆ మాట చెప్పడం మంచిది అనిపించి మొహమాటం ఉన్నా స్పష్టంగా చెప్పింది.
“నేను డబ్బున్న అమ్మాయి కోసం చూడటం లేదు. నన్ను అర్థం చేసుకొని సంతోషంగా జీవించడానికి తోడుగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నాను. నాకు నచ్చిన అమ్మాయికి నేను నచ్చితే జీవితం సుఖంగా గడుస్తుందని నా ఉద్దేశ్యం. ” అతని మాటలు మాలిక మానస వీణను మీటి అమృత రాగాలు పలికించాయి.
హాబీలు, సినిమాల గురించి కాసేపు మాట్లాడుకున్నాక మాలిక రిలాక్స్ అయ్యింది. మెనూ చూడటం, అర్డరివ్వటం, లంచ్ తినడం అన్నీమాలికకు ఏదో మూవీ రీల్స్ కదిలి పోతున్నట్టుగా, అందమైన తోటలో విహరిస్తున్నట్టుగా ఉంది. అతని జీవితాశయాలు విని మాలిక మనసు పొంగి కలల ఒడిలో ఒరిగి పోయింది.
“నీ మనసులో ఏముందో చెప్పనే లేదు. ” మాలిక వేపు చూసాడు.
“నా పేరెంట్సుతో డిస్కస్ చేయాలి. ”
“ష్యూర్, మీ మాట కోసం ఎదురు చూస్తుంటాను. నా సెలవులు అయిపోక ముందే చెప్తారు కదూ!”
ఇంటికి వెళ్ళగానే మాలిక అక్కకు ఫోనులో జరిగిందంతా చెప్పింది. విక్రం గురించి విన్న మౌనిక, అరవింద్ రెక్కలు కట్టుకుని వచ్చి వాలారు. ఇంటిల్లి పాది కూర్చుని అన్ని రంగుల చర్చలు జరిగాక శుభం అన్నారు. తల్లి, తండ్రి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోయారు. ముఖ్యంగా అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అబ్బాయి అమెరికాలో ఎద్యోగం చేస్తున్నాడు, మంచి కుటుంబం. బలరాం శుభ ఘడియ చూసి విక్రం పెరెంట్సుకు ఫోను చేసాడు.
“మీ అమ్మాయి ఫోటో చూసాము. ముఖ్యంగా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. ఎక్కువ టైములేదు గాబట్టి ఎంగేజ్ మెంటు లాంటివి లేకుండా ఏకంగా పెళ్ళే పెట్టేసుకోండి. మేము రెండురోజుల్లో హైదరాబాదు వస్తున్నాము. అప్పుడు కలుద్దాం. మాక్కావల్సింది ఒకటే – పెళ్ళి బాగా చేయండి అంతే చాలు. మాకు ఒక్కగా నొక్క కొడుకు. ” విక్రం తండ్రి తన మనసులో మాట చెప్పాడు. అదృష్టం వచ్చి వడిలో వాలింది దాన్ని సుతారంగా మోయాలనుకున్నారు మాలిక పేరెంట్సు.
పురోహితుడితో మాట్లాడి పది రోజుల్లో ఉన్న ఒక ముహూర్తం నిర్ణయించారు. విమలకు అంత త్వరగా పెళ్ళి ముహూర్తం పెట్టుకోవడం ఇష్టం లేదు. చిన్న కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఎప్పటి నుండో అనుకుంది. వారం రోజుల్లో పెళ్ళి పెట్టుకుంటే పత్రికలు, ఆహ్వానాలు, అలంకారాలు దేనికి కూడా టైము సరిపోదు. పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతాయి- విమల గుండెల్లో ధడ మొదలయ్యింది. ఈ రోజుల్లో అన్నీ చిటికేస్తె అమరుతాయి అంటే అర్డర్లివ్వడమే అయినా దానికి టైము ఉందా అనుకుంది.
“ఇంత మంచి సంబంధం వస్తే పెళ్లి పనులకు టైము లేదని దిగులు పడకు. ఇప్పుడు ముక్తసరిగా కానివ్వు. ఇక పొతే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళను రమ్మని అప్పుడు పెద్ద పార్టి పెట్టుకుందువులే. ” అక్క మాటలతో విమల మనసు కాస్త కుదుట పడింది. హడావుడికి అంతే లేదు. పెళ్ళి మాట వినగానే అయస్కాంతానికి ఇనుము ముక్కలు అతుక్కున్నట్టు మేమున్నాము అంటూ చిన్న, పెద్ద స్నేహితులు, బంధువులు అందరూ ముందుకు వచ్చారు. విమల పేరెంట్సు, బలరాం పేరెంట్సు రెండురోజుల్లో వస్తామన్నారు. మాలిక అందరికి ఫేవరేట్- ఇక రాకుండ ఎలా ఉంటారు! ఇంటిల్లి పాది ఎవరికి వారు పీకల వరకు మునిగే ఆలోచనలు, బయట పనులు కొందరు, ఇట్లో చేయాల్సిన పనులతో కొందరు, చేయాల్సిన పనుల లిస్టులతో మరి కొందరు ఇలా అందరూ ప్రోగ్రాం చేసిన మనుషుల్లాగ వాళ్ళల్లో వాళ్ళే పనులు పుర మాయించుకున్నారు.
ఒక రోజు విక్రం ఫోను చేసి డిన్నర్ కు వెళ్దామని అనగానే మాలిక ఫోనులోనే తలూపింది. అతను రాగానే అందంగా పుత్తడి బొమ్మలా వచ్చి కార్లో కూర్చుంది.
“స్టార్ కృష్ణాకు వెళదామా అక్కడ బిరియాని చాలా బావుంటుంది. ”
హోటలు పేరు వినగానే థ్రిల్లింగ్ గా ఫీలయిన మాలిక సరే అన్నట్టుగా తలాడించింది, గాలిలో తేలి పోతున్నట్టుగా ఉంది. ‘తనకు బిరియాని అంటే ఇష్టమని అతనికేలా తెలుసు! అతనికి కూడా ఇష్టం లాగుంది. ’ ఇలాగే ఇద్దరి ఇష్టాలన్ని ఒకటైతే . . . మరులు గొలిపే మనసు కితకిత లాడింది.
హోటలు లోపలకు ఎంటరవగానే “నా స్వీట్ చూసిం తర్వాత డిన్నరు తిందాం. ”
“మీకు ఇల్లు ఉందన్నారు మరి హోటలు స్వీట్ లో ఎందుకుంటున్నారు?”
“పెంట్ హౌజ్ ఉంది. డాడ్ తరుచుగా హైదరాబాదు వస్తూంటారు. వచ్చిప్పుడు పెంట్ హౌజ్ లోనే ఉంటారు. అక్కడికి డాడ్ కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నాకోసం నా ఫ్రెండ్సు వస్తే డాడ్ ను చూసి కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. ఫ్రీగా ఉండలేరు. ఫ్రెండ్సుతో క్లబ్బుకు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చనుకో కానీ ఇక్కడయితే రిలాక్స్డుగా ఉంటుందని మా పేరెంట్సు నా కోసం ఈ స్వీట్ బుక్ చేసారు. ”
రూము తలుపు తీసి లోపలికి రా అన్నట్టు చేయి చూపించాడు. విక్రం వేపు చూస్తూ లోపలికి నడిచింది.
మాలిక అడుగు తడబడింది. రూం చాలా పెద్దగా ఉంది. లోపల కూర్చోవడానికి ఒక పెద్ద సోఫా, ఒక నాలుగు కుర్చీలు ఉన్నాయి.
“ఆ పక్కనే ఉన్న రూము తలుపు మూసి ఉంది. ” మాలిక చేయి పట్టుకుని తీస్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. నీటుగా అలంకరించి ఉంది, మరి హోటలు కదా.
“బావుంది. ” చిన్నగా అంది.
“మన పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉంటాం. అప్పుడు నా ఫ్రెండ్సు ఎవరూ రారులే. ”
హమీ ఇస్తున్నట్టుగా అన్నాడు.
బిడియ పడ్తున్న మాలికను కూర్చో అన్నట్టు సోఫా చూపించాడు. ఎరుపు రంగుకు దిగిన మొహంతో కూర్చుంది. అర్థంకాని ఈ సిగ్గు, బిడియం ఇప్పుడే రావాలా అనుకుంది. విక్రం మాలిక పక్కనే కూర్చుంటూ,
“మీల్స్ రూమ్ కే తెప్పించుకుందాం! ఫ్రీగా మాట్లాడుకుంటు తినొచ్చు, సరేనా!” మాలిక జవాబు ఇవ్వక ముందే టేబుల్ పై ఉన్న మెనూను ఒకటి మాలికకు ఇచ్చి మరొకటి తాను తీసుకుని చూస్తున్నాడు.
“నీకే డిష్ ఇష్టమో చెప్పు. ”
“ మీకేది ఇష్టమో అదే తెప్పించండి. ”
“నా కన్నీ ఇష్టమే. ఈ రోజు నువ్వు చెప్పు. నువ్వు సిగ్గు పడుతూంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా!” పువ్వులా ఉన్న మాలిక మొగ్గలా ముడుచుకు పోయింది. ఆమె బుజంపై చేయి వేసాడు. మత్తు ఒకవైపు చెప్పలేని భయం మరో వైపు. సిగ్గు పడ్తున్న ఆమెను చూస్తూ ఆర్డరు చేయబోయే ఒక్కొక్క డిష్ పేరు చెప్పాడు. మాలిక తలాడించింది. ఫోనులో డిషేస్ ఆర్డరు చేసాడు. వాటితో పాటు శాంపెయిన్ అర్దరు చేసాడు.
అమెరికాలోని తన జీవితం గురించి చెప్తున్నాడు. మాలిక సంభ్రమంగా వింటోంది.
డోర్ బెల్ ఆ వెంటనే “రూమ్ సర్వీస్” వినిపించగానే విక్రం వెళ్లి తలుపు తీసాడు. వెయిటర్ ఫుడ్ తెచ్చి అక్కడే ఉన్న టేబుల్ మీద అన్ని సర్ది పెట్టి వెళ్లి పోయాడు.
విక్రం నైపుణ్యంగా శాంపెయిన్ బాటిల్ తెరిచి మాలికకు ఒక గ్లాసులో పోసి ఇచ్చాడు.
“నేనెప్పుడూ తీసుకోలేదు. ” సంకోచంగా అంది.
“ఫ్రెంచ్ వాళ్ళు తాయారు చేసే ఈ శాంపెయిన్ కు అన్ని దేశాల్లో కంటే మన ఇండియాలోనే పెద్ద మార్కెట్ ఉందని, యంగ్ ఉమెన్ ఎక్కువ ఇష్ట పడతారని పేపర్లో పెద్ద ఆర్టికల్ వ్రాసారు. అంత హైపు ఉంటె మరి నువ్వు రుచి కూడా చూడ లేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఫర్వాలేదు తీసుకో, ఇందులో ఆల్కహాల్ చాల తక్కువ, ఇది పళ్ళ రసం లాగే ఉంటుంది. మనిద్దరం కలిసి ఉన్నఈ ఘడియ స్పెషల్ అందుకే తెప్పించాను. మనిద్దరి హెప్పీ ఫ్యూచర్ కోసం. . చీర్స్. . . ” తన గ్లాసును మీలిక గ్లాసుకు తకించాడు. గ్లాసులు ఖంగు మన్నాయి.
మాలిక సంకోచంతో ఒక సిప్ తీసుకుంది. తియ్యగా డ్రింకు నోటిలో గెంతింది. ఆతను మరో సిప్ అంటూ బలవంతంగా మాలిక నోటి కందిచ్చాడు. అలాగే మరో సిప్ తీసుకుంది. నాలుక పై ఏదో రాగం ఝుమ్మంటు గొంతులోకి దిగింది.
“ఇక చాలు. ” అంది.
“మొదటి సారి కదా! ఐ కెన్ అండర్ స్టాండ్. నీకు మాడరన్ లైఫ్ కాస్త అలవాటయితే అన్నిఇష్ట పడతావు. ”
నవ్వుతూ మాలిక వేపు ప్రేమగా చూస్తూ అన్నాడు. ఇద్దరూ వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నారు.
విక్రం అన్ని డిషెస్ పై మూత తీసి “ఆమ్. . . భలే ఘుమ ఘుమలు కదూ!” అంటూ బిరియాని ఒక ప్లేటులో పెట్టి కూర్మా వేసి మాలిక ముందు పెట్టాడు. మరో ప్లేటులో తను వడ్డించుకుని ‘తిను’ అన్నట్టుగా మాలిక వైపు చూసాడు. ఆ కమ్మటి వాసనలకు మాలిక కడుపులో జటరాగ్ని ఉవ్వెత్తున్న లేచింది. నెమ్మదిగా కలుపుకుని తింది. ఎంతో ఆకలి అనిపించినా మాలిక ఎక్కువ తినలేక పోయింది. ఇద్దరూ చేతులు కడుక్కుని సోఫాలో కూచున్నారు.
అంతలో తలుపు తీసుకుని ఒక యువకుడు గదిలోకి అడుగు వేసి ఒక్క క్షణం వీల్లిద్దరి వేపు చూసి
నవ్వుతూ లోపలికి వచ్చి తలుపు మూసాడు. వీల్లిద్దరిని చూసికూడా వెనకాడకుండా నిరాటంకంగా
వచ్చినతన్నిమాలిక ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళతో చూసింది. అతను. . . అతను. . . ప్రఫుల్!
“మీట్ మై ఫియాన్సి మాలిక. ” అంటూ విక్రం అతని భుజంపై చేయి వేసి మాలిక దగ్గరగా తీసుకు వచ్చి,
“మాలికా! మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రఫుల్. ”
“వెరీ నైస్ టు మీట్ యూ మాలికగారు. ”
“నమస్తే. ” కంగారుగా చెతులు జోడించింది.
“నా వస్తువలు కొన్ని తీసుకుందామని వచ్చాను. సారీ టు డిస్టర్బ్ యు. ”
“కేర్ ఫర్ ఎ డ్రింక్?” విక్రం టేబుల్ పై ఉన్న గ్లాసు చేతిలోని తీసుకుంటూ ప్రఫుల్ ను అడిగాడు.
“నో, థాంక్స్. నిశాంత్ క్రింద కారులో ఉన్నాడు. ఐ కేం టు పికప్ ఫ్యూ థింగ్స్. ” అతని వెనకే విక్రం బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఇద్దరూ ఎదో మాట్లాడుకున్నారు.
“టేక్ యువర్ టైం. ” అంటూ విక్రం వచ్చి మాలిక పక్కన కుర్చున్నాడు. మరో ఐదు నిమిషాల్లో అతను,
“ఎన్ జాయ్ ది ఈవెనింగ్. ” అంటూ వెళ్లి పోయాడు అతను.
మాలికకు తల దిమ్ముగా ఉంది. తల నొప్పి మొదలయ్యింది.
“పెళ్లి షాపింగు అవుతోందా? నాకు లేడీస్ బట్టలు, నగలు ఎట్సెట్రా సెలెక్షన్ పెద్దగా తెలీదు. ”
“ఇంకా లేదు. నేను ఇంటికి వెళ్తాను. తల కాస్త దిమ్ముగా ఉంది, శామ్పెయిన్ అనుకుంటా. ” మాలిక లేచి తన హేండ్ బేగ్ తీసుకుంది.
విక్రం టైము చూసుకుని, “సరే, మళ్ళి ఎప్పుడు కలుద్దాం?” విక్రం దగ్గరగా వచ్చి మాలిక భుజంపై చేయి వేసి మాలిక బుగ్గపై ముద్దిచ్చి ‘ఛలో’ అన్నట్టుగా చూసాడు.
మాలిక ఇంటిముందు కారు ఆపగానే మాలిక గబుక్కున కారు దిగి తలుపు మూసే ముందు ‘బై’ అంది.
“బై డియర్. నేను రేపు ఫోను చేస్తాను. ” మాలిక ఇంట్లోకి వెళ్ళగానే కారు ముందుకు కదిలింది.
మాలిక తిన్నగా తన రూములో కెల్లి బట్టలు మార్చుకొని నైటీతో హాలులోకి వచ్చింది. విమల కళ్ళు పెద్దవి చేసి మాలిక వేపు చూస్తోంది.
మాలిక వెళ్లి జగ్ లోంచి ఒక గ్లాసుతో నీళ్ళు పోసుకుని ఒక సిప్ తెసుకుని తల్లి పక్కన కూచుని తల్లి భుజంపై తల ఆనించి కళ్ళు మూసుకుంది.
“ఏంటి తల్లీ అలా ఉన్నావు! సాయంత్రం ఎలా గడిచింది. ”
“బానే ఉండింది. కాని ఎందుకో దిగులుగా ఉంది. ”
“ఇంటికి రాగానే అక్క ఫోన్ చేయమంది. ” వెంటనే మాలిక లేచి ఫోను చేయడం చూసి విమల గదిలోకి వెళ్లి పోయింది.
“హలో అక్కా. ”
“నువ్వు ఓకేనా? ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. థాంక్ గాడ్ మనకు ముందుగానే తెలిసింది. ”
“ఏమయ్యింది?” అయోమయంగా అడిగింది మాలిక.
“విక్రం ఫ్రెండ్ ప్రఫుల్ తెలుసా?”
“తెలుసు. చందన ఎంగేజ్ మెంటు పార్టిలో చూసాను. ఇవ్వాళ విక్రం దగ్గర చూసాను. ”
“అతను గే అని తెలుసా?”
“తెలుసు. పార్టి తర్వాత తెలిసింది. అంత హేండ్ సం గై, నమ్మలేక పోతున్నాను!”
“ప్రఫుల్ ఒకమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుకు పుట్టాక ఆ అమ్మాయికి విడాకులిచ్చాడు. తర్వాత విక్రం అండ్ ప్రపుల్ ఇద్దరూ లివింగ్ టుగెదర్. కాని అందరికి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తారట. స్నేహితానికే మచ్చ తెస్తున్నారు. అరవింద్ ఫ్రెండు రాం చరణ్ చెప్పాడట. ప్రిన్స్ చార్ల్స్ అనుకుంటున్నా డేమో! వారసుడు పుట్టాక తన దారి తాను చూసుకున్నాడు. నువ్వు విక్రంను పెళ్లి చేసుకోకు మాలిక. నేను రేపు పొద్దున్నే కాన్సిల్ చేయమని నాన్నకు చెప్తాను. అరవిందు కూడా అదే అంటున్నాడు. నీ మనసు కష్ట పడొచ్చు కాని ఇప్పుడే దూరం జరగడం మంచిది. దీని గురించి ఆలోచించడానికి ఏమి లేదు. నీ జీవితం ఆ గోతిలో పడడానికి వీల్లేదు. ”
“అక్కా! విక్రం గురించి ఇది నిజమేనా!!”
“రాంచరణ్ ఆఫీసులో చాలా మందికి వీళ్లిద్దరి గురించి తెలుసట. ఇంతకంటే నీ మనసు ఇంక పాడు చేసుకోకు. సారీ మాలా, నాక్కూడా విక్రం నచ్చాడు. అమ్మాయిలకు పెళ్లి విషయంలో పోటీ పెరిగింది. ” చెల్లెలి మనసు తేలిక చేయడానికి అంది.
హోటల్లో విక్రం అలా ప్రఫుల్ భుజాలపై చేయి వేసి దగ్గరకు లాక్కోవడం చూసినప్పటి నుండి మాలిక మనసులో చెప్ప లేని భావాలేవో కలవర పెడ్తున్నాయి. కాని విక్రం ఎంతో ప్రేమగా మాలికతో మట్లాడటం చూసి ఆ క్షణం ఆలోచనను పక్కకు నెట్టేసింది. మాలిక మనసులో విక్రం పట్ల నిరసన, కోపం. ‘జీవితాలతో
మనుషులు ఇంత బాగా నటించగలరా! ఛీ. . ఛీ. . ఏం మనుషులు!!’
రాత్రంతా మగత మగతగా కూర్పులు తీసింది తప్ప నిద్ర రాలేదు. కళ్ళు తెరిచి చూసి ఆలస్యంగా లేచానని తెలుసుకుంది. ‘ఫర్వాలేదు జీవితంలో ముందుగానే లేచాను’ అనుకుంది.
వంటింట్లో టీ తాగుతుండగా విక్రం ఫోను చేసాడు. మాలిక ఫోను ఎత్తలేదు. విమల చూసింది కాని ఎమీ అనలేదు. రింగవడం ఆగగానే తేలిక పడ్డ మనసుతో విక్రం కు టెక్స్ట్ కొట్టింది.
“అల్ విదా”

—-సమాప్తం—-

1 thought on “అల్ విదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *