April 19, 2024

అవలక్షణం

రచన: ఎ. బి. వి. నాగేశ్వర రావు

పరదేశీ పెత్తనం మన గడ్డ పైనా ! ఏమి దుర్దశ మనది !!
పాడాలి చరమగీతమని పరితపించిరి… ఆనాడు.
తల్లి భారతిని తాకట్టు పెట్టినా తప్పేంటి తమ్ముడు ?
అన్నదే ఉన్నట్టి ధోరణి, స్వతంత్ర భారతిన… ఈనాడు.

జాతీయ భావము, దేశాభిమానము, సమిష్టి వ్యాపకము,
మన జాతి వేదముగ చాటుకొంటిరి మరి… ఆనాడు.
తరతమ భావము, సంకుచితము, ప్రాంతీయ వాదము –
వచ్చిచేరాయి, పెచ్చుమీరాయి, తీరులు మారాయి… ఈనాడు.

సంపదనే దోచి, శ్రమ శక్తిని పిండి, పేదరికం పంచే-
తెల్లవారి ఏలుబడిలో ఎన్నాళ్ళని వ్యథ చెందిరి…ఆనాడు.
‘ఉన్న’ వారికే వశించే హక్కులు, వాక్కులు, వనరులు;
‘లేని’ వారికి రోజూ ‘రోజా’లు, భీతి భయాలు… ఈనాడు.

సంఘటిత శక్తిన జాతి శృంఖలాలు సమూలముగ విరుగగొట్టి,
స్వేచ్ఛావాయువుల పురోగమింతుమని కలలు కనిరి… ఆనాడు.
వ్యక్తివాదము తిష్టవేయగ, నైతికత నశించి, తమస్సే తోడుగ-
పెడదారిన దిగజారుతున్నది భరత స్వతంత్రం… ఈనాడు.

సమర వీరుల త్యాగ నిరతులు, ఆశయాలు, ఆకాంక్షలను-
స్వేచ్ఛాభారతి చేస్తున్నది స్వేచ్ఛగా… అవహేళనం !
బ్రతకడమే… బీదాబిక్కికి దినదిన గండం, దుస్సాహసంగా –
స్వేచ్ఛే అయ్యింది మరి, భూమి భారతికి అవలక్షణం !!
<<>>

‘రోజా’లు = పస్తులు.

2 thoughts on “అవలక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *